మా ఆవిడ – మంగళసూత్రం

బద్ధకంగా నిద్రలేచి మొహం కడుక్కొని కుర్చీలో కూచుని టైము చూశాను. పావు తక్కువ ఆరు అవవస్తోంది. వాకింగుకి వెళ్ళే టైము అయింది.

“ఏమండీ” అంది మా ఆవిడ మృదువుగా, ఉదయమే మొదటి కాఫీ కప్పు ఇస్తూ.

మృదువుగా మాట్లాడం అంటే నాకు అర్ధం కాదు. మెల్లగా, నెమ్మదిగా, తక్కువ శ్రుతిలో మాట్లాడడాన్ని మృదువుగా మాట్లాడడం అని అర్ధం చెప్పుకుంటాను. ప్రస్తుతం ప్రభావతి అలాగే మాట్లాడింది. ఇలా మాట్లాడడం ఆవిడ నైజం కాదు. ఆవిడ అలా మాట్లాడినప్పుడల్లా నేను ఇబ్బంది పడ్డ సందార్భాలే గుర్తుకు వస్తాయి. అందుకనే నేను గంభీరంగా అన్నాను.

“ఏమిటండీ” అని.

“నిన్న రాత్రి మంగళసూత్రం మళ్ళీ పెరిగింది. పొద్దున్నే పసుపుతాడు వేసుకున్నాను.”

నా గుండెల్లో రాయి పడింది.

“ఇదివరలో మూడు మాట్లు సూత్రం పెరిగింది. ఇది నాలుగోమాటు. ఈ మాటైనా, మాటు పెట్టకుండా కొత్తది చేయించండి!” మా ఆవిడ కొనసాగించింది మృదువుగానే.

పెరిగినప్పుడల్లా మా ఇంట్లో చిన్న సైజు యుద్ధం జరిగేది. కొత్తది చేయించమని ఆవిడ, అతికిస్తే సరిపోతుందని నేను వాదించుకునే వాళ్ళం. ఇప్పటిదాకా నేనే గెలిచాను.

“నా దగ్గర డబ్బు లేనప్పుడే అది ఎందుకు పెరుగుతుంది? నా మీద అది కక్ష సాధిస్తోందా?” అన్నాను నవ్వుతూనే.

“మీ దగ్గర డబ్బు ఎప్పుడుంది కనుక?” మాటల్లో శ్రుతి పెరిగింది.

నిజమే, నలభైనాలుగు ఏళ్ళకు పైగా ఉద్యోగం చేసినా స్వంత ఇల్లు లేదు. బేంక్ బేలన్స్, డిపాజిట్స్ కలిపి కూడా రెండు, మూడు మాట్లు హాస్పిటలుకి వెళ్ళి రాగలిగినంత మాత్రమే ఉంది. సంపాదించినది ఖర్చు పెట్టడమే మా ఇద్దరికీ అలవాటు. ఆదా చేయాలనే సద్బుద్ధి మా ఇద్దరికీ ఎప్పుడూ కలగలేదు. నేను మాట్లాడలేదు.

“ఈ మంగళ సూత్రం ఎప్పుడు చేయించామో గుర్తుందా?” మాటల్లో శ్రుతి మధ్యమ స్థాయికి చేరుకుంది.

“మన పెళ్ళికి చేయించాము కదా!” అని అన్నాను మృదువుగా.

“మన పెళ్ళయి ఎన్ని ఏళ్ళు అయింది?” శ్రుతి మారలేదు.

“నలభై నాలుగు ఏళ్ళు అయింది కదా!” మృదువుగానే అన్నాను.

“ఎన్ని తులాలతో చేయించారో గుర్తు ఉందా?” శ్రుతి మధ్యమ స్థాయి దాటేసింది.

“నాలుగు తులాలని అనుకుంటున్నాను.” నా గొంతులో కూడా శ్రుతి పెరిగింది. (ఈ పక్కింట్లో టివిలో ప్రవచనాలు ఆగిపోయాయి. ఆ పక్కింట్లో గ్రైండర్ ఆగిపోయింది.)

“మీ మొహం, తులాలు కాదు కాసులు. మూడు కాసుల కన్నా రెండు మూడు చిన్నాలు తక్కువే.”

“చిన్నం అంటే ఎంత?”

“నాకూ తెలియదు. అప్పుడు మావాళ్ళు అలాగే అన్నారు.”

“మీ వాళ్ళు అన్నదే సత్యమా?” శ్రుతి ఇంకా పెరిగింది.

“ఊళ్ళో వాళ్ళు కూడా అలాగే అన్నారు మరి. అబద్ధం చెప్పాల్సిన అవసరం వాళ్ళకేముంది? మార్చి ఇంకోటి చేయించుకుందామని అంటే మీరు ఒప్పుకోలేదు ఇప్పటి దాకా!”

“పిచ్చిదానా, మంగళ సూత్రము మార్చరాదు. సూత్రం పెరిగింది అంటారు కానీ తెగింది అనకూడదు. పసుపు తాడు మాత్రమే ఉత్తమం. అవి ధరించే అనసూయ, సావిత్రి లాంటి వాళ్ళు పరమ పతివ్రత లయ్యారు.” శ్రుతి మార్చి మృదువుగానే అనునయించాను అనుకున్నాను.

“నేను పతివ్రతను అయినా, వాళ్ళ కోవలోకి వెళ్ళను కానీ ఈ సూత్రం ఎప్పుడు మార్పిస్తారో చెప్పండి?” ఖరాఖండిగా వినిపించింది స్వరం.

“మార్చను. పెళ్ళినాడు వేసుకున్న మంగళ సూత్రం తన కడదాకా కానీ భర్త గతించిన తరువాత కానీ మాత్రమే తీయవలెను అని వేదాల్లో వ్రాశారు. అది పతివ్రతా లక్షణం!” కఠినంగానే అన్నాను శ్రుతి పెంచి. (పక్కింటి వాళ్ళు మా ఇళ్ళ మధ్య గోడ దగ్గరకి వచ్చిన చప్పుళ్ళు వినిపించాయి.)

“మీరు వేదాల్లో చదివారా?” నిలదీసింది మా ఆవిడ.

“విజ్ఞులు సెలవిస్తే నేను విన్నాను!” నేనూ తగ్గలేదు.

“తమరి ముఖారవిందం. ఈ మంగళ సూత్రంలో ఇప్పుడు ఎంత బంగారం ఉంటుందో చెప్పగలరా?” (గోడ దగ్గర నవ్వులు వినిపించాయి.)

“మూడు కాసులు ఉంటుంది గదా రెండు చిన్నాలు తక్కువగా.” జవాబిచ్చాను.

“ఇదివరలో మూడు మాట్లు పెరిగింది. పెరిగినప్పుడల్లా ఒక సెంటిమీటరు తగ్గింది. మూడు మాట్లు మెరుగు పెట్టించాం. మెరుగు పెట్టించినప్పుడు పావు తులం తగ్గుతుందిట. వెరసి ఇప్పుడు ఒక తులం మీద రెండు,
మూడు గ్రాములు ఉంటుందేమో.”

“అదేమిటి? కాసులనుంచి తులాలకి వచ్చావు.”

“ఈ కాలంలో తులాలలోనే లెఖ్ఖిస్తున్నారు.”

అన్నట్టు బంగారం లెఖ్ఖలు అనగానే గుర్తుకు వచ్చింది. మా ఆవిడకు నగలు ఒక చేతివేళ్ళతో లెఖ్ఖించదగ్గవి మాత్రమే ఉన్నాయిట. రెండు వేళ్ళు మిగిలిపోతున్నాయి అని కూడా బహువిధాల పలుమార్లు విచారించింది. కనీసం ఒక చేతి వేళ్ళనైనా సంతృప్తి పరచమని అనేక మార్లు అభ్యర్ధించింది. ధనాభావ పరిస్థితుల వల్ల బంగారంతో మా ఆవిడ బంధం పెంపొందించ లేకపోయాను. నగలు లెఖ్ఖించడంలో కూడా మా మధ్య విభేదాలు తారస్థాయిలో ఉన్నాయి. మా పెళ్ళిలో వాళ్ళ వాళ్ళు నాకు పెట్టిన ఉంగరం, నా చిటికిన వేలికే సరిపోవడం వల్ల నేను ఉపయోగించలేకపోయాను. కొంతకాలం తరువాత ఆ ఉంగరానికి, నా చెవి పోగులు జేర్చి తన మధ్యవేలికి అమర్చుకుంది. ఇది లెఖ్ఖలోకి రాదుట. అది నా అకౌంట్ లోకే వెళ్ళుతుందట. ముత్యాలహారంలో బంగారం లెఖ్ఖించ స్థాయిలో ఉండదు కాబట్టి అది బంగారు నగల లెఖ్ఖలోకి రాదుట. ఈ కారణం వల్లే చెవి దుద్దులు, ముక్కు పుడక లెఖ్ఖించ రాదుట. గాజులు ఆడవాళ్ళ హక్కు అలాగే మంగళ సూత్రం, నల్లపూసలు పెళ్ళైన ఆడవాళ్ళ హక్కు కాబట్టి అవి లెఖ్ఖించ కూడదుట. మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఏదైనా నగ చేయించుకుంటే మా ఇంట్లో విబేధాలు విజృంభిస్తాయి. రెండు మూడు రోజులు ఎడతెగని చర్చలు ఉచ్ఛస్థాయిలో సాగుతాయి. ఆ రెండు రోజులు మా ఇంటి పక్కవాళ్ళు టివి కట్టేస్తారు కూడాను. నా ఆలోచనలలో నేనుండగా మా ఆవిడ తన మనసులో మాట బయట పెట్టింది.

“ఇంకో మూడు తులాలు కలిపితే గట్టి సూత్రం మంచిగా చేయించుకోవచ్చు!” ఉత్సాహంగా అంది.

“నీ గొలుసు ఉంది కదా మూడున్నర కాసులుది. అది, ఇది కలిపితే బంగారం కొనఖ్ఖర్లేదు. మార్చి చేసినందుకు మజూరి ఒక పదిహేను, ఇరవై వేలల్లో వచ్చేస్తుందంటే చేయించుకో.” సౌమ్యంగానే అన్నాను.

“ఆ గొలుసు మా అమ్మది. అది మన అమ్మాయికే చెందుతుంది నా తదనంతరం. అది మార్చడానికి ఒప్పుకోను. ఏం? మూడు తులాల బంగారం కొనలేరా?” కోపంగానే అంది.

నాకూ కోపం వచ్చింది.

“ఇంకా ఎంత కాలం నీ మెడలో ఉంటుందో తెలియని ఆ మంగళసూత్రానికి ఇప్పుడు ఒక లక్ష రూపాయలు పెట్టే ఉద్దేశం నాకు లేదు. నువ్వెంత అడిగినా లాభం లేదు.” నా గొంతు నాకే కర్కశంగా వినిపించింది.

ఈ మాట అంటూనే నేనూ తలుపు తీసుకొని వీధిలోకి వచ్చాను. పక్కింటి వాళ్ళు హడావడిగా తమ ఇళ్ళలోకి వెళ్ళడం గమనించాను. సాధారణంగా ఇద్దరూ కలిసి వాకింగుకి వెళతాము. ఈ వేళ కోపంగా నేను ఒక్కడినే వెళ్ళాను.

చల్లటి గాలి మొహానికి తగులుతోంది. అయినా కోపం ఇంకా చల్లారలేదు. ప్రసన్నాంజనేయ స్వామి గుడి వీధి దాటి నాలుగు అడుగులు వేశాను. దాటుతూ స్వామి వారికి ఓ నమస్కారబాణం కూడా వేశాను, ఎందుకైనా మంచిదని. కొంచెం దూరంలో ఒక శునకరాజు రోడ్డు మధ్య అడ్డంగా పడుక్కొని విశ్రమిస్తున్నాడు. చిన్నప్పటినుంచి కూడా నాకు కుక్కలంటే భయం. భయంతో కూడిన భక్తి కూడా. కుక్క భౌ భౌ అంటే నేను దేవుడికి దండం పెట్టుకుంటాను, నన్ను కరవకుండా చేయమని. వారికి నిద్రాభంగం కలిగించరాదనే సదుద్దేశంతో రోడ్డు పక్కగా వెళ్ళడానికి ప్రయత్నం చేశాను. అయిదారు అడుగుల దూరంలో ఉండగానే గ్రామసింహం గారు లేచారు. భౌ భౌ అంటూ నన్ను పలకరించారు. నాకు వారి భాష తెలియకపోవడం వల్ల కంగారు పడ్డాను. అది శ్రుతి పెంచింది. నేను ఆగిపోయాను. నన్ను చూసి అది సరదాగానో, కోపంగానో తన భాషలో భౌ భౌ అంటూ వాదం మొదలు పెట్టింది అని అర్ధం అయింది. దానికి నన్ను చూసి కోపం వచ్చిందో లేక అసహ్యం వేసిందో అర్ధం కాలేదు, కానీ నేను అంటే దానికి ఇష్టం లేదు అని అర్ధం అయింది. దానితో నేను సంభాషణ మొదలు పెట్టాను.

“స్నూపీ” అని పిలిచాను. “కూల్ కూల్” అని కూడా అన్నాను.

అది పట్టించుకోలేదు, మళ్ళీ భౌ భౌ అంది ఇంకొంచెం ఘట్టిగా. నేను వివరణ ఇచ్చుకున్నాను.

“నేను మీ వీధికి రెండు వీధుల అవతల ఉంటాను. రోజూ ఈ దోవనే వెళుతుంటాను కదా. ప్లీజ్ దోవ వదులు.”

ఆ వేళ ఆ సారమేయమునకు తన రోజు వచ్చిందని గ్రహించలేకపోయాను. అది ఇంకొంచెం ఘట్టిగా భౌ భౌ అంటూ ఉత్సాహంగా రెండు అడుగులు ముందుకు వేసింది. అప్రయత్నంగా నేను రెండు అడుగులు వెనక్కి వేశాను.

“నో నో, నేను ఫ్రెండునే!” అని సంజాయిషీ ఇచ్చుకున్నాను. అది వినలేదు. వడి వడిగా ఇంకో నాలుగు అడుగులు ముందుకు వేసింది, భౌ భౌ రాగాలాపన చేస్తూనే. ఇంతలో దాని మిత్రులు ఒకటి రెండు వచ్చి అవి కూడా వాటి భాషలో, దొరకునా ఇటువంటి కండ! అని రాగాలాపనలో జతకలుపుతూ నా కాలు వాసన చూశాయి.

కింకర్తవ్యం అని కంగారు పడ్డాను. అంతా మిధ్య, పలాయనమే సత్యం అని జ్ఞానోదయం అయింది. వెనక్కి తిరిగి నా కండ వాటికి అందకుండా పిక్కబలం చూపించాను.

దీన్నే భౌ భౌ వాదం అంటారట, మా శర్మ చెప్పాడు. మనం చెప్పేది ఎదుటివాడికి అర్ధం కాదు, అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించడు. వాడు చెప్పేది మనకి డిటో. మా ఇంట్లో కూడా ఇదే జరిగింది కదా అనుకున్నాను. ఒక గంట సేపు వాకింగు చేసి ఇంటికి తిరిగి వచ్చాను.

తిరిగి వచ్చేటప్పటికి మా ఆవిడ టెలిఫోనులో ఎవరితోనో మాట్లాడుతోంది. నేను బట్టలు మార్చుకొని వచ్చేటప్పటికి ప్రభావతి ఫోన్ పెట్టేసింది. ఒక పదిహేను నిముషాలు నిశ్శబ్దంగానే గడిచింది. ఒక్కొక్కప్పుడు నిశ్శబ్దం భరించడం కూడా కష్టమే. తొందర పడ్డానేమోనని అనిపించింది. ఒక లక్ష పెట్టి చేయిస్తే ప్రభావతి కోరిక తీరుతుందేమో ననిపించింది కూడాను. ఈ భావం ఒక నిముషం కన్నా నిలువలేదు. ఉన్న నాలుగూ లాకర్లోనే ఉన్నాయి. రెండు జతల గాజులు కూడా. మంగళసూత్రం, నల్లపూసలు, రెండు జతల గాజులు మాత్రమే ఒంటి మీద ఉంటాయి. లాకర్లోని గొలుసు మార్చి చేయించుకుంటే నష్టం ఏమిటి? ఆలోచన తెగటం లేదు. వాతావరణం తేలిక పరచాలని,

“ఈ వేళ టిఫిన్ ఏం చేస్తున్నావు?” అని అడిగాను.

“అల్పాహారమా? ఉగ్రాణిని సేయ సంకల్పించితిని!” అని కోపంగానే అంది.

నాకు నవ్వు వచ్చినా ఆపుకున్నాను. ఈ ఉగ్రాణి ప్రయోగం పెళ్ళైన కొత్తలో మొదలు పెట్టింది.

జన్మతః తెలుగుకి నాకు పరమ వైరం. తెలుగు భాషకి వ్యాకరణానికి ఉన్న అవినాభావ సంబంధం నాకు ఎల్లప్పుడూ మా మాష్టారు నా వీపు మీదే బోధ పరిచేవారు. మా మాష్టారు ఎన్ని మృదంగ కచేరీలు చేసినా నాకు బోధపడలేదు. అది వ్యాకరణానికి నా వీపుకి ఉన్న అవినాభావ సంబంధం అని సరిపెట్టుకున్నాను. దురదృష్టవశాత్తు నేను తెలుగు విద్వాన్, ఉ.భా.ప్ర పరీక్షలకు చదువుచున్న ప్రభావతిని పెళ్ళి చేసుకోవలసివచ్చింది. పెళ్ళి చేసుకొని జోర్హాట్ తీసుకొచ్చిన తరువాత ప్రభావతికి తెలుగు ట్యూషన్ చెప్పించి ఆ పరీక్షలు పాస్ చేయించలేని దౌర్భాగ్యుడిని కూడా. అలా అని ఆవిడ వివిధ సందర్భాలలో తేట తెల్లం చేసింది. అదియునుం గాక, పెళ్ళైన కొత్తలో ఆమె తన భాషా ప్రావీణ్యతను ప్రదర్శించేది. ఆ ప్రదర్సన నాకు మట్టుకే పరిమితం. ఇతరులతో మాములుగానే మాట్లాడేది.

పెళ్ళైన కతిపయ దినములకు, ఒకానొక దినమున (అదేమిటో మా ఆవిడ భాషాప్రయోగం అప్పుడప్పుడు నాకూ అలవాటు అయింది)

“శ్రీదేవీ, నా ప్రియ భార్యామణీ, ఈ వేళ ఉదయం అల్పాహారము నేమి చేయుచున్నదానవు?” అని అడిగితిని.

“ఉగ్రాణిని సేయ సంకల్పించితిని” అని యామె ప్రత్యుత్తరమిచ్చెను. “చేయుచున్న కాదు సేయుచున్న యని యనవలెను” అని కూడా ప్రబోధించింది.

“ఉగ్రాణి అనగా నేమి?” అని అడగబోయి, నవ్వుతుందని అడగడం మానేశాను. ఉగ్రాణి అంటే ఏమై ఉంటుందా అని ఆరు బయట కుర్చీ వేసుకొని ఆలోచించాను. ఉగ్రవాద సంబంధితమేమోనని భయపడ్డాను. కాదు అని సమాధానపడ్డాను. అనుమానం తీరక మా శర్మ దగ్గరికి వెళ్ళి అడిగాను. శర్మ తెలుగువాడే. సాహిత్య పిపాసి నని చెప్పుకుంటాడు. అంటే నాకు తెలియదు. బహుశా సాహిత్యం చదివి పీపాల కొద్దీ కక్కే వాడు అనుకుంటాను. కనిపించినప్పుడల్లా “ఆ పుస్తకం చదివావా? ఈ పుస్తకం చూశావా?” అని అడిగి, వాటి గురించి ఒక అరగంట బుర్ర తినేసేవాడు. వాడు కూడా కొద్దిసేపు ఆలోచించాడు. బహుశా ఏ ఇటాలియన్ లేక ఫ్రెంచ్ వంటకమో అయుంటుంది. ఫెమినాలో చదివి ఉంటుంది అని అభిప్రాయ పడ్డాడు.

“అబ్బే మా ఆవిడ ఫెమినా చదవదు!” అని నొక్కి వక్కాణించాను.

“అయితే తప్పకుండా బెంగాలీయో, మరాఠి వంటకమో అయ్యుంటుంది!” అని బల్ల గుద్ది ఉద్ఘాటించాడు.

“లేడీస్ క్లబ్ రాజకీయాలలో మీ ఆవిడ బెంగాలీ-మరాఠి వాళ్ళ వైపు ఉంటుందని అభిజ్ఞవర్గాల భోగట్టా. వాళ్ళెవరి దగ్గరో నేర్చుకొని ఉంటుంది,” అని కూడా విశదీకరించాడు. నాకు నమ్మకం కలగలేదు. ఇంటికి వెళితే అదే తెలుస్తుంది కదా అని వచ్చి ఉత్కంఠగా ఎదురు చూశాను.

ఒక అరగంట తరువాత ప్లేటులో ఇంత అటుకుల ఉప్మా తెచ్చి నా చేతిలో పెట్టింది.

“ఉగ్రాణి అంటే అటుకుల ఉప్మానా?” అని ఆశ్చర్యపడ్డాను.

“అవును తాలింపు వేసిన అటుకుల ఉప్మాను ఉగ్రాణి అందురు” అని వివరించింది ప్రభావతి. ఇటువంటి చమత్కార ప్రయోగాలు చాలానే చేసేది.

“మీ ముఖారవిందమున కిష్కింధా వాసులు ఉత్సాహముతో ఉరకలు వేయుచున్నారు.”

“మీ వదనచంద్రమున రామ భక్తులు పరవశంతో నృత్యమాచరించు చున్నారు.”

“మీ ముఖపద్మమున తుమ్మల వనమున సూర్యాస్తమయ శోభ విరాజిల్లుతోంది.”

ఈ మాటలు ఆవిడ అన్నప్పుడు నన్ను పొగడుతోందనే అనుకున్నాను. కానీ మా శర్మ టీకా తాత్పర్యం చెప్పినప్పుడే అసలు విషయం, మొదటి రెంటికీ నాది కోతి ముఖమని, చివరిదానికి నా ముఖం తుమ్మల్లో పొద్దు గూకినట్టు ఉంటుందని అని అర్ధమయింది. నిందాస్తుతి అంటే ఏమిటో విడమర్చి చెప్పాడు శర్మ. ఇటువంటివి కూడా ఆ కోవలోకే వస్తాయి అని బొజ్జ నిమురుకొని మరీ చెప్పాడు.

పిల్లలు పుట్టి, పెరుగుతున్నప్పుడు భాషాప్రయోగాలు తగ్గిపోయాయి. కోపం వచ్చినప్పుడు ఏకాంతంలో మాత్రమే నిందా స్తుతి చేసేది. నేను పట్టించుకోవడం మానేశాను. చాలాకాలంగా అది కూడా ఆగిపోయింది. ఇప్పుడు ఉన్నట్టుండి మళ్ళీ మొదలు పెట్టింది. సంయమనంతో సంధి చేసుకోవడానికి ప్రయత్నాలు చేశాను.

“ఈ మాటు కూడా సూత్రం అతికించి, అవసరమైతే రెండు మూడు గ్రాములు బంగారం తగిలించి పొడుగు తగ్గకుండా చేయించుకు వస్తాను. ఒకటి రెండు నెలల్లో శంకరం దగ్గరనుంచి రావాల్సిన లక్ష తిరిగి వస్తుంది. దానితో కొత్తది చేయిస్తాను,” అని చెప్పి సమాధాన పరచటానికి ప్రయత్నించాను.

ఒక అరగంట వాద, ప్రతివాదాల తరువాత మా ఆవిడ తెల్ల జండా ఎగరవేసింది. ఉగ్రాణిని ఆరగించి, కొత్తపేటలోని బంగారం దుకాణానికి వెళ్ళి, సాయంకాలానికి మంగళసూత్రం తీసుకు వచ్చాను.

రెండు నెలలయినా శంకరం లక్ష ఇవ్వలేదు. కాగల కార్యం గంధర్వులే తీరుస్తారట. నా విషయంలో అదే నిజమయింది.

మా ఆవిడ చేతి వేళ్ళ లెఖ్ఖ తగ్గకూడదనే సదుద్దేశంతో, ఈ మధ్యన బజారుకి వెళ్ళినప్పుడు కానీ, మా కాలనీలో వ్యాహ్యాళికి వెళ్ళినప్పుడు కానీ మా ఆవిడకు ఓ సలహా ఇవ్వడం మొదలు పెట్టాను.

“పమిట మెడ చుట్టూ, భుజాలు కప్పుకొని నడువు!” అని.

ఈ మాటలు నేను పురుషాహంకారం చేత అనలేదు. గత కొద్దికాలంగా హైదరాబాదులో గొలుసు దొంగలు చెలరేగిపోతున్నారు. ఇలా వచ్చి అలా స్త్రీల మెడలోని గొలుసులు తెంపుకు పోతున్నారు. పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నామన్నారు. గస్తీ ముమ్మరం చేశామన్నారు. పది టీములు గొలుసు దొంగల పని పట్టేందుకు పనిచేస్తున్నాయని చెప్పారు. అయినా గొలుసు దొంగతనాలు తగ్గలేదు. అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలని వారు సలహా ఇచ్చారు.

మాములుగానే మా ఆవిడ నా మనోగత భావాన్ని గ్రహించకుండా అపార్ధం చేసుకుంది.

“మీ మొహం, అరవై ఆరేళ్ళ ఈ వయసులో నన్ను ఎవరు చూస్తారండి?” అని తీసి పారేసింది.

నా మనోగత భావాన్ని ఆవిడకి విపులంగా విశదీకరించాను. మా ఆవిడ పెళ్ళున నవ్వింది. భళ్ళున నవ్వింది. పడిపడి నవ్వింది. నవ్వి నవ్వి అంది.

“ఏ దొంగాడో తెంపుకు పోతే తప్ప నాకు కొత్త మంగళ సూత్రం వచ్చే మార్గం లేదా భగవాన్?” అని కనిపించని దేవుడిని అడిగింది.

ఒక్కొక్కప్పుడు దురదృష్టం ఎడా పెడా తన్నుతుంది. నా దురదృష్టం మా ఆవిడకు వరమయింది. సరిగ్గా మా ఆవిడ పై వాక్యం అన్నప్పుడు ఆకాశమార్గాన తధాస్తు దేవతలు విహరిస్తున్నారేమో. మా ఆవిడ కొలిచిన భగవాన్ గారి ప్రోద్బలంతో తధాస్తు దేవతలు తధాస్తు అని ఉంటారు. ఈ విషయం పది రోజుల తరువాత అనుభవంలోకి వచ్చింది.

ఆ దురదృష్ట ఉదయం సమయాన, వాకింగ్ అనే కార్యక్రమంలో నేను మా ఆవిడ పక్కనే నడుస్తున్నాను. మోటారు సైకిల్ మీద వచ్చిన ఇద్దరు కుర్రాళ్ళు మా ఆవిడ మెడలో మంగళ సూత్రం, నల్లపూసల గొలుసు పెరిగించుకు పోయారు.

“అయ్యో, అయ్యో!” అని మేమిద్దరం ముక్త కంఠంతో ఒకే శ్రుతిలో అరిచాము.

చుట్టుపక్కల ఉన్న ఇద్దరు పురజనులు “అయ్యయ్యో, అయ్యయ్యో” అని వంత పాడారు.

మోటారు సైకిల్ నంబరు చూడనందుకు చివాట్లు పెట్టారు.

ఇంతలో కింద పడ్డ నల్లపూసల గొలుసులో ఒకముక్క కనిపించింది. గుడ్డిలో మెల్ల అని వాళ్ళు సంతోషపడి మమ్మల్ని కూడా ఆనందించమన్నారు. పోయిన మంగళ సూత్రానికి, నల్లపూసల గొలుసు కోసం పోలీసు రిపోర్ట్ ఇవ్వమని సలహా పాడేసి వెళ్ళిపోయారు.

పోలీస్ రిపోర్ట్ ఇద్దామని నేను అనుకున్నాను కానీ మా ఆవిడ నా అభిప్రాయాన్ని నిర్ద్వందంగా తిరస్కరించింది.

“తులం మంగళసూత్రం, అరతులం నల్లపూసల గొలుసు పోయిందని చెప్పుకోవడానికి సిగ్గు ఉండఖ్ఖర్లేదా, తెలిసి నలుగురూ నవ్వరా?” అని అడిగింది.

నేను సమాధానం చెప్పలేకపోయాను. ఇంటికి వచ్చేశాము. మూడు రోజులు గడిచిపోయాయి. నాలుగోరోజు ఉదయం కాఫీ సేవిస్తుంటే మా ఆవిడ అంది: “పెళ్ళాం పసుపు తాడుతో తిరుగుతూంటే సిగ్గు లేదు ఈ మనిషికి!”

నేను మాట్లాడలేదు. పేపరు తీసి, మోడిగారి అమెరికా పర్యటనలో ఒబామాగారితో కుదిరిన ఒప్పందాల గురించి మరింత శ్రద్ధగా చదవడం మొదలుపెట్టాను.

“బెల్లం కొట్టిన రాయిలా ఎలా కూర్చున్నారో మాట్లాడకుండా?”

“భారత్, అమెరికాలు కలసి నడవాలని ఒబామాగారు ఉద్భోదించారు.”

“మొన్న అమ్మాయి టెలిఫోన్ చేసింది. కొత్త మోడల్సట, ఐదు తులాల్లో సూత్రం, రెండున్నర తులాల్లో నల్లపూసలు వచ్చేస్తాయట, వాట్సప్పులో ఫోటోలు పంపింది, మీక్కూడా, చూడలేదా?”

“సాంస్కృతిక, సాంకేతిక రంగాలలో సహాయం అందించటానికి అమెరికా సిద్ధంగా ఉందని ఒబామాగారు పునరుద్ఘాటించారు”

“కావాలంటే ఒక ఏభై వేలు ట్రాన్సఫర్ చేస్తానన్నాడు అబ్బాయి.”

“మోడిగారు హర్షం వ్యక్తం చేశారు.”

పేపరు తీసి పాడేసింది ప్రభావతి.

“మీకు చీమ కుట్టినట్లైనా లేదా?”

“ఎందుకు అంత ఆవేశపడతావు? ఐదు +రెండున్నర = ఏడున్నర తులాలు, వాటికి తరుగు, మజూరి ఇత్యాదులు కలిపి కనీసం రెండున్నర లకారాలు అవుతాయి. ఇంకో రెండు నెలలు ఆగు. ఎఫ్.డీ.లు మెచ్యూర్ అవుతాయి. కొంటాను.”

“కుదరదు. ఇప్పుడు వెళ్ళి ఆ ఎఫ్.డీ.లు తీసెయ్యండి. సాయంకాలం వెళ్ళి తెచ్చుకుందాం రెడీమేడ్ దొరుకుతాయి.”

“వడ్డీ తక్కువ వస్తుందే…”

“ఈ లోపు బంగారం ధర పెరుగుతుంది.”

“అయినా ఐదు తులాలిది ఎందుకే? మూడు తులాలిది నీకు అచ్చి వచ్చింది కదా. నలభై ఏళ్ళ పైగా నీ మెడలో నిలకడగా ఉంది గదా,” ఆఖరి అస్త్రం ప్రయోగించాను.

“మీ మొహం, నాలుగు మాట్లు పెరిగింది. అన్నట్టు ఐదేళ్ళ క్రితం పెరిగినప్పుడు మీకు గుండె నొప్పి వచ్చింది. పది రోజుల తరువాత మూడు స్టెంట్లతో తిరిగి వచ్చారు హాస్పిటలు నుంచి. నా మెడలో గట్టి ఐదు తులాల మంగళ సూత్రం ఉంటే మన ఇంటి ముందు యముని మహిషపు లోహ గంటలు వినిపించవు.”

“నీ మొహం, నాకోసం యముడు ఎందుకు వస్తాడు? వస్తే గిస్తే యమ కింకరులలో చివరి రేంకు వాడు వస్తాడు.”

“మళ్ళీ మీ మొహమే, నా మంగళ సూత్ర మహిమ వల్ల, నా పాతివ్రత్య ప్రభావం వల్ల, యముడే రావాలి. పతివ్రతా మణుల మంగళ సూత్రం తెంపడానికి అత్యున్నత అధికారి వస్తాడు. అది యమలోకపు ప్రోటోకాల్. గట్టి మంగళసూత్రం వల్ల నా పాతివ్రత్య మహిమ ఇంకా ప్రకాశిస్తుంది ”

నాకు నోట మాట రాలేదు. మా ఆవిడ వాక్చాతుర్యంతో నా మెదడు మొద్దుబారింది. నాకు జలుబు చేసినా మా ఇంటి పరిసరాలలో గంటలు వినిపిస్తాయేమో నన్న అనుమానం పొడచూపింది. “పతి ప్రాణంబులు తప్ప…” అని పాడుకుంటూ యమధర్మరాజు మా ఇంట్లోకి వచ్చేస్తాడేమో నని భయం వేసింది. ఈ మాటు వాద ప్రతివాదాలలో మా ఆవిడే గెలిచింది. మనసును సమాధాన పరుచుకొని, నేను బేంకుకి వెళ్ళి ఎఫ్.డీ బంధాన్ని తెంచుకుని, మా ఆవిడ మెడలో మంగళసూత్రాన్ని మరోమారు వేశాను.

మా ఆవిడ మెడలో మంగళసూత్రాన్ని దొంగలకు కనిపించకుండా చేసే వ్రతాలు ఏమైనా ఉన్నాయా అని వెతుకుతున్నాను.

రచయిత బులుసు సుబ్రహ్మణ్యం గురించి: హాస్యరచయితగా బ్లాగ్లోకంలో ప్రసిద్ధులు. ఇటీవలే వారి రచనల సంకలనం "బులుసు సుబ్రహ్మణ్యం కథలు" ప్రచురించారు.  ...