శ్రీ శ్రీ గురించి మూడు మాటలు…

1910 లో అత్యంత దేదీప్యమానంగా ఒక తోకచుక్క పొడిచింది.

అదే సంవత్సరం, తెలుగు కవిత్వాకాశంలో వేగుచుక్క పొడిచింది. ఇరవయ్యవ శతాబ్దంలో ఆధునిక తెలుగుకవిత్వానికి చుక్కానైయ్యింది.

ఆ చుక్కాని శ్రీశ్రీ. పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు.

2010 శ్రీశ్రీ శతజయంతి సంవత్సరం. ఈ సంచిక శ్రీశ్రీ సంస్మరణ సంచికగా వెలువడుతున్నది. ఇవాళ శ్రీశ్రీ సాహిత్యం గురించి కొత్తగా చెప్పటానికి ఇంకా ఏమైనా మిగిలివున్నదా అన్నది నిజమైన ప్రశ్న. అందుకు సమాధానం ఉద్దండులైన సాహితీ విమర్శకులకి వదిలిపెట్టి పాత విషయాలే మరోసారి మననం చేసుకుందాం – వీలైనంతవరకూ శ్రీశ్రీ చెప్పిన మాటల్లోనే.


శ్రీరంగం శ్రీనివాసరావు
జూన్ 1981. మేడిసన్, వి.
(వెల్చేరు ఇంట్లో తీసిన ఫోటో)

1930ల్లో ‘ఛందస్సుల సర్ప పరిష్వంగం’ లోంచి బయటపడి, ‘ఛందోబందో బస్తులన్నీ ఛట్‌ఫట్ మని తెంచి, కడుపు దహించుకుపోయే పడుపుగత్తె రాక్షసరతి, ఉరితీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం, సమ్మె కట్టిన కూలీల భార్యల బిడ్డల హాహాకారం’, మొదటిసారిగా కవితా వస్తువులుగా చూపించి, ‘కదిలేదీ, కదిలించేదీ, పెనునిద్దర వదిలించేదీ, పరిపూర్ణపు బతుకిచ్చేదీ, కావాలోయి నవకవనానికి’, అని ఎలుగెత్తి అభ్యుదయ కవిత్వపు నిజలక్షణాలన్నీ నిర్వచించాడు శ్రీ శ్రీ.

నిజం చెప్పాలంటే, శ్రీశ్రీ గణబద్ధ ఛందస్సులకి స్వస్తి చెప్పి, అతిప్రాచీనమయిన మాత్రాబద్ధ ఛందస్సులకి నూతన యవ్వనం ప్రసాదించాడు. పద్యాన్ని ఎలుగెత్తి పాడటానికి కావలసిన రెండు ముఖ్య లక్షణాలు – rhyme & rhythm – యమకం, తాళం – తన కవితల్లో గుప్పించాడు. సామాజికస్పృహతో కవితావస్తువులు ఎంచుకోవడం కొత్తదనం. అంటే కవిత్వాన్ని పాతపరిధులని దాటించి, కొత్త పరిధుల్లోకి దూకించడం ( paradigm shift) సాధారణ కవులకి సాధ్యమయ్యే పని కాదు. ఆనాటినుంచి ఈనాటి వరకూ తెలుగులో చెప్పుకోదగ్గ నవ్యకవిత్వం అంతా శ్రీశ్రీ వేసిన బాటలో, కొత్త పరిధిలో నడిచింది. అందుకే శ్రీశ్రీ మహాకవి.

1983 లో శ్రీశ్రీ మరణించాడు.

ఎప్పుడో, నవ్యసాహిత్యపరిషత్తు వేదిక మీద ‘కవితా కవితా’ అని గొంతెత్తి పాడినపుడు, అధ్యక్షస్థానం నుంచి లేచి, ఆనందబాష్పాలతో విశ్వనాధ సత్యనారాయణగారు శ్రీశ్రీని ఆప్యాయతతో కౌగలించుకున్నారని విన్నాం. పసిపిల్లవాడి అమాయకత్వం, నవయువకుడి జీవనోత్సాహం, ఒక మహావృద్ధుడి జ్ఞానసంపద, అన్నీ ఒక మనిషిలో కలిసిపోయిన వాడుగా 71 సంవత్సరాల వయస్సులో, 1981 లో శ్రీశ్రీ అమెరికా వచ్చినప్పుడు కలిశాం.

ప్రపంచస్థాయికి ఎదిగి, తెలుగునేల మీద నిలకడగా నిటారుగా నిలబడ్డవాడు శ్రీశ్రీ. అందుకే కాబోలు ఆయన కవిత్వం అనువాదం కాకపోయినా తెలుగు రాని వాళ్ళని కూడా ఆకట్టుకుంది. భాషల అవధులు దాటిన శక్తి తన మాటల మంత్రాలకి వుందని శ్రీశ్రీ రుజువుచేశాడు 1981 లో. ‘కవితా ఓ కవితా’, ‘మరోప్రపంచం’, మళ్ళీ గొంతెత్తి చదివినప్పుడు ముగ్ధులయి మూగవోయిన అమెరికన్లని చూశాం. అప్పుడు శ్రీశ్రీ మావాడు, మా తెలుగువాడు – అని గర్వించాం. అమెరికన్ విశ్వవిద్యాలయాల్లోనూ, పత్రికా విలేఖరులతోనూ, రేడియో గోష్టి లోనూ (మేడిసన్‌ లో యన్‌.పి. ఆర్‌ గోష్టి కాపీ దొరకకపోడం మన దురదృష్టం), ‘పీడితదేశాల ప్రజల ప్రతినిధి నా గొంతుక,’ అని సగర్వంగా చెప్పుకున్నాడు. ఆనాడు, ఆఫ్రికన్‌ యువకవులు ఆనందభాష్పాలతో శ్రీశ్రీని కౌగలించుకోవడం మరువరాని సంఘటన.

‘1930 దాకా తెలుగు సాహిత్యం నన్ను నడిపించింది. ఆ తర్వాతనుంచి నేను దాన్ని నడిపిస్తున్నాను. దిస్ సెంచరీ ఈజ్ మైన్‌’, అనీ సాధికారంగా చెప్పగలిగిన తెలుగుకవి శ్రీశ్రీ ఒక్కడే. ఆధునిక చిత్రకళ చరిత్ర చూస్తే, అది పికాసో జీవిత చరిత్రగా కనిపించక మానదు. చిత్రకళలో వచ్చిన నవ్యోద్యమాలన్నింటిలోనూ ఉన్నాడు పికాసో. అలాగే ఆధునిక తెలుగు సాహిత్య చరిత్ర అతిశయోక్తులు, అబద్ధాలు లేకుండా రాస్తే, అది శ్రీశ్రీ స్వీయచరిత్ర అవుతుంది. తెలుగులో వచ్చిన నవ్యసాహిత్య ఉద్యమాలన్నింటిలోనూ శ్రీశ్రీ కొట్టవచ్చినట్లు కనిపిస్తాడు.

తెలుగు సాహిత్యంలో ఆయన చేపట్టని ప్రక్రియ లేదు. మాత్రా ఛందస్సుల్లో వచ్చిన మహాప్రస్థాన గీతాలు – ‘మరో ప్రపంచం’, ‘జగన్నాధ రధ చక్రాల్‌’ మొదలైనవి మనందరికీ తెలిసినవే. ‘చరమరాత్రి’ సంకలనంలో శ్రీశ్రీ కథలు ఆణిముత్యాలు. ఈ కథల్లో ‘నిరంకుశమయిన స్వేచ్ఛ, అధివాస్తవిక స్పర్శ’ ఉన్నాయనడం అతిశయోక్తి కాదు. సమాజ స్థితిమీద, భారతదేశ వ్యవస్థ మీద ఎన్నో వ్యాసాలు రాశాడు. అవి కత్తి చురకల్లాంటి వ్యాసాలు. ఆయన వచనంలో అనవసర శబ్దాలకి తావులేదు, ‘ అద్దంలా స్పష్టంగా అర్థం స్ఫురిస్తుంది.’

రచనకి సాంఘిక ప్రయోజనం ఉన్నదని, రచనని సంఘం వాడుకుంటుందని విశ్వసించాడు శ్రీశ్రీ. తనకుతానుగా నిర్దేశించి చెప్పిన సాహిత్యం తన నిబద్ధతకి తార్కాణం. 1930 నుంచి 1940 వరకూ, శ్రీశ్రీ దారిద్ర్యంతో నానా అవస్థలు పడ్డాడు. ఆ దశాబ్దంలోనే మహాప్రస్థాన గీతాలు చాలామటుకు రాశాడు. 1951 ప్రాంతంలో విప్లవసాహిత్యానికి నాందీ వాక్యం పలికాడు, తన ఖడ్గ సృష్టి ఖండికలో – “రెండు రెళ్ళు నాలుగన్నందుకు / గుండాలు గండ్రాళ్ళు విసిరే సీమలో / క్షేమం అవిభాజ్యం అంటే / జైళ్ళు నోరు తెరిచే భూమిలో …అహింస ఒక ఆశయమే కాని / ఆయుధం ఎప్పుడూ కాదు / ఆశయం సాధించాలంటే / ఆయుధం అవసరమే మరి” – అని చెప్పినవాడు, 1938 లో చరిత్ర పాఠం చెప్పాడు.

“బలవంతులు దుర్బల జాతిని బానిసలను గావించిరి / నరహంతలు ధరాధిపతులై చరిత్రమున ప్రసిద్ధికెక్కిరి / నైలు నదీ నాగరికతలో సామాన్యుని జీవనమెట్టిది? / తాజమహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు?” – అని, ఆ గీతంలోనే చరిత్రకి నూతన నిర్వచనం చెప్పాడు. అంతే కాదు, “జమీందారు రోల్సు కారు / మహారాజు మనీపర్సు / మరఫిరంగి విషవాయువు” – మాయ కాదని మిథ్యావాదులని మందలించాడు. “పాలికాపు నుదుటి చెమట / కూలివాని గుండె చెరువు / బిచ్చగాని కడుపు కరువు” – ఇవన్నీకఠోర సత్యాలని మెట్టవేదాంతులకి చురకలు పెట్టాడు. సాహిత్యపరుడు సమాజవ్యవస్థలో మార్పుకు చేయవలసిన కృషి గురించి శ్రీశ్రీకి ఏ విధమైన సందేహమూ లేదు.

“75శాతం నిరక్షరాస్యులమీద 25శాతం అక్షరాస్యులూ, 90శాతం దరిద్రుల మీద 10శాతం ధనవంతులూ పరిపాలన సాగిస్తున్న వ్యవస్థ మనది. ఇదే ప్రజాస్వామ్యం అనుకోవడమంత సిగ్గుచేటు ఇంకోటి ఉండదు. ఈ వ్యవస్థను మార్చాలని ఉద్ఘోషించడం కన్నా ఇంకో ఉత్కృష్టధర్మం ఏ సాహిత్యపరుడికైనా ఎలా ఉంటుందో నేను ఊహించలేను”, అని ఘంటాపదంగా చెప్పి, కవిగా తన నిబద్ధతను సందేహించి ప్రశ్నించిన చవకబారు విమర్శలకు నిష్కర్షగా సమాధానం ఇచ్చాడు. దేవుడి మీద ఏమాత్రమూ నమ్మకం లేని తాను, దేవుళ్ళ మీద తాను రాసిన సినిమా పాటల గురించి వేసిన ప్రశ్నలకి ఇచ్చిన సమాధానం: శివుడి మీద, శ్రీరాముడి మీద, షణ్ముఖుడి మీద, శ్రీ వేంకటేశ్వరస్వామి మీద, గురువాయూరప్ప మీద, ఇంకా ఆడ దేవుళ్ళను కూడా కలుపుకుంటే ఎందరెందరో దేవతలమీద నేనెన్నో పాటలు రాశాను. మాటలు కూడా పరశ్శతంగా రాశాను. ఇవేవీ కవిత్వం కాదన్నదే ఆ ప్రశ్నలకు జవాబు.”

శ్రీశ్రీ ప్రకృతిలో విదూషకత్వానికి చిహ్నాలయిన సిరిసిరిమువ్వ, రుక్కుటేశ్వర శతకాలలో నవ్వించి, కవ్వించే అందమైన కందాలెన్నో ఉన్నాయి. పైన చెప్పిన జవాబు బహుశా వీటికి కూడా వర్తిస్తుందేమో, అవి ఎంత అందంగా మలిచినా కందాలయినా.

‘శ్రీశ్రీ పై చాలామంది పాశ్చాత్యుల ప్రభావం వున్నది, ముఖ్యంగా ఫ్రెంచ్‌ సింబాలిస్టుల ప్రభావం. అతన్ని తెలుగులో మహాకవి అంటారేమిటి?’ అని అసూయాపరులు, గిట్టని వాళ్ళూ చేసే ఒక ఆరోపణ. నిజమే! శ్రీశ్రీ పై పాల్ ఎల్యుయార్, స్విన్‌బర్న్, అడ్గార్ ఎలాన్ పో, రాంబో, వెర్లైన్, మల్లర్మ, బోదలేర్‌, అపోలనేర్, లూయీ అరాగో …వగైరాల ప్రభావం ఉన్నది. శ్రీశ్రీ వీరందరి కవితల్నీ అనువదించడం, అనుసరించడం చేశాడు. అనువదించినా, అనుసరించినా శైలీ, గొంతూ తనవే. నిజం చెప్పాలంటే శ్రీశ్రీ మహాకవిగా పరిణతి చెందడానికి పాశ్చాత్య ఆధునిక రచయితల ప్రభావం ఎంతో దోహదం చేసింది. షేక్స్పియర్‌, మిల్టన్‌, ఎలియట్లపై ఏవిధమైన ప్రభావమూ లేదనగలమా? అంత మాత్రం చేత పాశ్చాత్య విమర్శకులు వాళ్ళని మహాకవులుగా పరిగణించడం మానుకున్నారా? ఎవరో అన్నారు, ఏదో పీఠికలో – శ్రీశ్రీ పై విశ్వనాథ, దేవులపల్లి గార్ల ప్రభావం కూడా ఉన్నది, అని. అదేమో తెలియదు కాని, విశ్వనాథకి భాషపై ఎంత అధికారం ఉన్నదో అంతే అధికారం శ్రీశ్రీకి నిస్సందేహంగా కూడా ఉన్నది. అలాగే కృష్ణశాస్త్రి ఛందోలాలిత్యం శ్రీశ్రీలో కూడా కనపడక మానదు. అది దోషం అని అనుకోను.

“కవి సంఘానికి మార్గదర్శకుడు కావాలి. అందుకనే వడివడిగా ప్రజలందర్నీ ముందుకు నడిపించే విప్లవపంథా; అభ్యుదయ రీతి” అని ఎప్పుడో 1946 లో అభ్యుదయ పత్రికలో రాశాడు శ్రీశ్రీ. అంచేత, ఆయనకి విప్లవాద కవిత్వ ధోరణి సమయానుకూలంగా, ఎవరినో సంతోషపెట్టడం కోసం వచ్చిన ధోరణి అనే వాదం చవకబారు వాదం మాత్రమే.

సినిమాల గురించి శ్రీశ్రీ ఇలా అన్నాడు; “సినిమా అనేది ఒక బ్రహ్మాండమైన ఆయుధం; దానిని వినియోగించగల బ్రహ్మాండమైన కళాస్రష్ట మనలో ఇంకా బయల్దేరలేదు. అసలు ఉత్తమ చిత్రాలు నిర్మిస్తే మన ప్రజలు చూడరని చెప్పడం కూడా మన ప్రొడ్యూసర్లకి పరిపాటి అయ్యింది. ఇది ఎంత అసందర్భంగా వున్నదో చెబుతావినండి. ప్రతీవాడూ తిండి కోసం హోటలుకి వెళ్ళాలి. అతడికి ప్రతీసారీ ఆహారం (మంచిది) లభించకపోవచ్చు. అయినా రోజూ హోటలుకి వెళ్ళక తప్పదు. ఆహారం లాగానే ఈనాడు మానవునికి సినిమా కూడా ఒక అవసరం. అందువల్ల ఏ చిత్రం వచ్చినా ప్రేక్షకుడు చూస్తున్నాడు. కంపుకొట్టే వేరుశనగనూనెతో చేసే వంటకాలను కానీ ప్రజలు ముట్టరని, వాటికి వారు అలవాటు పడ్డారని యజమాని చెబితే ఎంత అసందర్భంగా ఉంటుందో, ఉత్తమ చిత్రాలను నిర్మిస్తే చూడరని చెప్పడం కూడా అలాగే వున్నది. ఏమైనా ఏ ప్రజలకు తగిన ప్రభుత్వం ఆ ప్రజలకు లభించినట్లుగానే, ఆయా ప్రజల అభిరుచులను బట్టి ఆయా సినిమాల స్థాయి కూడా ఉంటుంది”.

ఒకందుకు, బ్రిటీషు వాడంటే నాకు చాలా గౌరవం. వాడు వలసకెళ్ళి – ఇండియాకైతేనేం, అమెరికాకైతేనేం, ఆస్ట్రేలియాకయితేనేం – షేక్స్పియర్‌ని, మిల్టన్‌నీ వాడివెంట తీసుకుపోయాడు, వాడి సారస్వత ప్రతినిధులుగా. అందుకు, వాడంటే నాకు గౌరవం. ఆధునిక తెలుగు సాహిత్యం అనే బంగారు నాణేనికి ఒక వైపు విశ్వనాథ సత్యనారాయణ, మరోవైపు శ్రీరంగం శ్రీనివాసరావు. అయితే, 20వ శతాబ్దపు ఆధునిక తెలుగు కవిత్వానికి శ్రీశ్రీ ముఖ్య ప్రతినిధి. ప్రవాసాంధ్రులుగా మనం, ‘శ్రీశ్రీ మా ఆధునిక కవిత్వానికి ప్రతినిధి’ అని నిబ్బరంగా గర్వంగా చెప్పుకోగలిగిననాడు, మన వెంట మన సారస్వత ప్రతినిధిగా తీసుకొచ్చుకున్ననాడు మనని కూడా మనం మనసారా గౌరవించుకోవచ్చు.


చివరి మాటగా శ్రీశ్రీ సాహిత్యం అందుబాటులో ఉంది గనుక, శ్రీశ్రీ పై వచ్చిన విమర్శా సాహిత్యం అంతా ఒకచోట కూర్చి ప్రచురించవలసిన అవసరం ఉన్నదని నా అభిప్రాయం.