తడి

కొత్తపాళీ బ్లాగులో ఇచ్చిన ఇతివృత్తానికి కథ రాయండి అనే సవాలుకి జవాబుగా వచ్చిన కథ ఇది.


మూడు రోజుల్నించి ఒకటే ముసురు. మబ్బులు కమ్మి, కొద్ది కొద్దిగా అలా కురుస్తూనే వుంది. ఇంజనీరింగు చదివి నా మొదటి వుద్యోగం కోసం ఈ నగరం వచ్చి మూడేళ్ళు పైనే అయ్యింది.ఎండయినా, వానయినా ఈ ముంబయి నగరానికి విరామం వుండదు, అలా, ఆగకుండా పరుగులు తీస్తూనేవుంటుంది. గడచిన రెండు మూడు రోజుల కంటే, ఈ ఉదయం మబ్బులు దట్టంగా కమ్ముకున్నాయి, చినుకులూ కొంచెం ఎక్కువగానే కురుస్తున్నాయి. ఆఫీసుకు వెళ్ళకపోతే బావుండునేమో అనుకున్నాను, కాని, ట్రైనింగు వుండడం వల్ల వెళ్ళడం అనివార్యం అయ్యింది. చర్చిగేటు స్టేషనులో లోకలు దిగి, బయటకి వచ్చి, పార్కు పక్కన 138 నంబరు బస్సు పట్టుకుని కఫ్ పరేడు (కొత్త పేరు కెప్టెన్ ప్రకాష్ మార్గ్) వరకూ వెళ్ళడం నా దినచర్యలో భాగం. పార్కు ప్రహరీ చుట్టూ వున్న అనేకానేక దుకాణాల్లో “గుప్తా ఏజెన్సీ” ఒకటి. ఎవరో, రాజస్థానీ సేటు నడిపే ఈ కొట్లో సమస్త దిన, వార, మాస పత్రికలూ దొరుకుతాయి. మొదట్లో, బస్సు కోసం ఎదురుచూస్తూ, కాలహరణం కోసం తెలుగు పేపరు కొనడం అలవాటయిన నాకు, క్రమంగా అది నిత్యకృత్యం అయ్యింది.

ఈ రోజు, గొడుగు విప్పుకుని, వచ్చే పోయే బళ్ళ వాళ్ళు నా బట్టల మీద నీళ్ళు జల్లకుండా జాగ్రత్త పడుతూ, గుప్తా ఏజెన్సీ దగ్గరకి నడిచేను. నీటి జల్లుకి తడిసిపోకుండా పేపర్లూ, పత్రికలూ అన్నింటి మీదా ప్లాస్టిక్ పేపరు కప్పి బరువులుంచేరు. కొట్టులో పని చేసే తెలుగు కుర్రాడు, నన్ను చూసి పలకరింపుగా నవ్వి, నేను రోజూ కొనే తెలుగు దిన పత్రికని నాకందించేడు. “ఏరా, బాగున్నావా?” అని ఆ కుర్రాణ్ణి పలకరించేను. దానికి వాడు “మంచిగనే వున్న, సారూ” అని చెప్పి వేరెవరికో పత్రికలందించడానికి పక్కకు తప్పుకుని, తిరిగి వచ్చేడు. ఒకసారి చేతి గడియారం కేసి చూసుకుని, “ఇంకేమిటిరా?” అన్నాను. వాడు నా వంక తేరిపార చూసి ” నీ లెక్కన గానీకి నేనేం జెయ్యాల సారూ” అని అడిగేడు. ఆ మాట కి ఎందుకో, నా గుండె చివుక్కుమంది. జవాబు చెప్పలేదు. నా బస్సు రాగానే ఎక్కేసేను.

ఈ కుర్రవాడితో, నా పరిచయం, ఓ మూడు నెలల క్రితం తమాషాగా జరిగింది. ఆరోజు, పేపరు కొని, పెద్ద నోటిచ్చి, చిల్లర తీసుకోడం మరచి వెళిపోతున్న నన్ను, ఈ కుర్రవాడు “చిల్లర మర్చిపోయిండ్రు, సార్” అని కేక పేట్టేడు. అంతకు మునుపెప్పుడూ ఆ పిల్లవాణ్ణి గమనించని నేను, చేతిలో తెలుగు పేపరుందని గుర్తు లేక “నాకు తెలుగొచ్చని నీకెలా తెలుసు?” అని అడిగి నవ్వుకున్నాను. ఆ రోజు నుంచీ, వాణ్ణి బస్సు స్టాపు దగ్గర పలకరించడమూ, వీలయితే ఓ రెండు కబుర్లాడడమూ రివాజయ్యింది.

ఉజ్జాయింపుగా తొమ్మిదేళ్ళుండే వాడి పేరు హరి. మూడు నెలల క్రితం ఇంట్లోంచి పారిపోయి ముంబయి చేరుకున్నాడు. వాళ్ళది రంగారెడ్డి జిల్లా – తాండూరు. తండ్రి క్వారీలో కూలీ. వీడి చిన్నప్పుడే తల్లి పోయింది. హరికి చదువు మీద ఆసక్తి మెండు. తండ్రి ఆదాయం తాగుడుకే సరిపోకపోవడంతో, సవతి తల్లి సంపాదనే కుటుంబానికి ఆధారం అయ్యింది. దాంతో, సవతి తల్లి హరిని బడి మానిపించి, పనిలోకి వెళ్ళమని పోరు పెట్టింది. తండ్రి కూడా వంత పాడాడు. అప్పుడప్పుడూ, బడి మాని పన్లోకి వెళ్ళినాకూడా, సవతి తల్లి రాసి రంపాన పెట్టడం మాత్రం మానలేదు. ఫీజులు కట్టి, పుస్తకాలు కొనిచ్చి, హరి క్రమం తప్పకుండా బళ్ళోకి రావడానికి, అయ్యవార్లూ సాయపడకపోవడంతో – వాడి చదువు మీది మమకారం, ఎవరూ సాకారం చెయ్యలేకపోయారు. పట్నం చేరుకుంటే, డబ్బుగల పెద్దలెవరైనా ఆశ్రయమిచ్చి, చదివిస్తారన్న నమ్మకంతో, ఎవరికీ చెప్పకుండా, చేతిలో చిల్లి గవ్వ లేకుండా, ఒంటి మీది బట్టలతో, ఓ రోజు ముంబయి రైలెక్కేసేడు.

వచ్చిన చోటు ముంబయ్యా, మజాకా! రైలు దిగి, నకనక లాడుతున్న కడుపుతో, తిరుగుతున్న హరిని ఈ సేటు చేరదీసేడు. కొట్టులోనే హరి కాపురం. పొద్దున ఏ ఏడింటికో పనిలో దిగితే, రాత్రి తొమ్మిదింటి వరకూ, పేపర్లూ, పత్రికలూ, వుద్యోగాల దరఖాస్తులూ, ఇత్యాదులు అందివ్వడమూ; ఆ తరువాత సేటు తాళం వేసుకెళ్ళిపోతే, చూరు కింద, చిన్న కటకటాల వంటి దాని వెనక పడక. నీటి పనులకి పక్కనున్న పార్కూ. మొత్తం మీద, పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది వాడి బతుకు. నేను, ఆప్యాయంగా ఒకటి, రెండు మాటలు మాట్లాడేసరికి, తన గోడు నా దగ్గర వెళ్ళబోసుకునే వాడు. “టిక్కెట్టు కొనిచ్చి, మీఊరు పంపిస్తానురా” అని నేను ఎప్పుడైనా అంటే, ససేమిరా ఒప్పుకునేవాడు కాదు. కానీ, “నన్ను బళ్ళో ఏపించు, సారూ, పొద్దుగూకినాక, దుకాణలో వచ్చి పని చేస్కుంట” అని నాతో ఎన్నో సార్లనేవాడు. వాడు తనని చదివింపమన్నప్పుడల్లా, నాకు ముల్లు గుచ్చుకున్నట్టుండేది. “అందరికీ అందుబాటులో విద్య” అని వట్టి మాటల డప్పులు కొట్టే ప్రభుత్వం మీదా, ఇలాంటి వీధి పిల్లలని, అనాధలనీ తయారు చేసే ఈ వ్యవస్థ మీద పట్టరాని కోపం వచ్చేది.

ఉండబట్టలేక, వీడి చదువు విషయం, నేను ఒకసారి, గుప్తా సేటు దగ్గర యధాలాపంగా ప్రస్తావించేను. దానికి అతడు నుదురు చిట్లించి, “వీడిని పన్లో పెట్టుకోవడమే నాకు పెద్ద తలనొప్పి. పోలీసులతోనూ, లేబరు ఆఫీసర్లతోనూ గొడవ . అంతగా మీరు మనసు పడితే, మీ దేశం వాడే కడా, నాకు ఒక పదివేలిచ్చి, మీరే తీసుకెళ్ళి చదివించుకోండి, జై రాం జీ కీ.” అని హిందీ, మరాఠీ కలిపిన ముంబయి భాషలో నిష్కర్షగా, తెగేసి చెప్పేడు. నాకు నోట మాట రాలేదు. నేల మీద పోయేది నెత్తి మీద రాసుకుంటున్నానా అనిపించింది.

తెరచిన కళ్ళతో, బస్సులో కూర్చుని, దీర్ఘాలోచనలో మునిగిన నా మీద, ఎవరిదో మూసిన గొడుగు కాడ మీదనుంచి రెండు నీటి చుక్కలు పడేసరికి – మళ్ళీ ఈ లోకంలోకి వచ్చేను. బయటకు చూస్తే, ప్రెసిడెంటు హోటలు స్టాపు వచ్చేసింది. నేను, గబగబా దిగి గొడుగు విప్పుకుని, ఆకాశ హర్మ్యం లాంటి మా ఆఫీసు భవనం కేసి నడిచేను. ప్రపంచంలోకెల్లా, అత్యంత ఖరీదైన ప్రాంతం ఈ కఫ్ పరేడు అని చెప్తూ వుంటారు. చుట్టు పక్కల అన్నీ ఆకాశాన్ని తాకుతున్నట్టుండే భవనాలే. కఫ్ పరేడులో ప్రతీ భవనపు యజమానీ, ఒక్క అంతస్తు చొప్పున తక్కువ నిర్మించి, మిగిలిన ఆ డబ్బుతో ముంబయి నగరం లో వున్న హరిలాంటి పిల్లలందరికీ, చదువూ, ఆశ్రయమూ కల్పించవచ్చు కదా అనిపించింది. వర్షం ఇంకా పడుతూనేవుంది. మూడు రోజులుగా చూడని సూర్యుణ్ణి, ఒక్క సారి చూస్తే బావుండుననిపించింది. రోడ్డు మీది రణగొణ ధ్వని చికాకు పెడుతోంది.

ఆఫీసులోనూ, ఎందుకో ఈ రోజు పని మీద దృష్టి లగ్నం కావట్లేదు. మనసంతా, ఏవో ఆలోచనలు, బుర్రలో ఎవరో చెయ్యి పెట్టి కెలికినట్టుగావుంది. మా ప్రాజెక్టు మేనేజరు ఖోర్షెద్ – ఒక పార్సీ వనిత. “ఒంట్లో ఏమైనా నలతగా వుందా” అని మధ్యలోఒకసారి, దగ్గరకొచ్చి, పరామర్శించింది కూడానూ, నిస్తారంగా నవ్వి, లేదని కృతజ్ఞతాపూర్వకంగా చెప్పేను. కాసేపయ్యాక లేచి, ఒకసారి ఫ్లోరంతా కలియతిరిగి, బాల్కనీలో కొచ్చి నిలబడ్డాను. నలభై అయిదవ అంతస్తునుంచి, కింద ఆందరూ చీమల్లా కనిపిస్తున్నారు. నేను, చాలా ఎత్తులో వున్నాననిపించింది. జల్లు ఇంకా కొడుతొంది. ఎదురుగా అరేబియా సముద్రం, దూరంగా నారిమన్ పాయింటూ ముసురు వల్ల అస్పష్టంగా కనిపిస్తున్నాయి. లోలోపల, ఏదో తెలియని అలజడి. లంచ్ బ్రేక్ తరువాత ట్రైనింగు సెషన్ వుంది. లంచ్ చెయ్యాలనిపించలేదు. మనసు కుదుట పడుతుందేమోనని, రిక్రియేషన్ రూము కి వెళ్ళి కళ్ళు మూసుకుని కూచున్నాను. ఎంత ఒద్దన్నా, ఆగని మనసు, మూలాల్లోకి పరుగు తీసింది.


మా అయ్యకీ, అమ్మకీ నేను, మా చెల్లి. అయ్య వ్యవసాయ కూలీ. మాకు సొంతంగా పొలం వుండేది కాదు. నేను పుట్టి, బాల్యం గడిపినదంతా – పొదలకూరులో. చెల్లిని కన్నప్పుడు, అమ్మకి వాతం కమ్మి పెద్ద సుస్తీ చేసింది. నెల్లూరు తీసుకెళ్ళి, పెద్దాసుపత్రిలో నయం చెయ్యించడానికి, మా నాయనకి బోలెడు ఖర్చయ్యింది. దాంతో, వున్న గుడిసే, స్థలం, తాకట్టు పెట్టి, విడిపించుకోలేక ఆశ వదులుకున్నాడు. కానుపు తరువాత అమ్మ నీరసించిపోయింది.

నాకు ఇంకా జ్ఞాపకం. అప్పటికి నేను అయిదో తరగతి చదువుతున్నాను. ఆ రోజు, మా నాయన “ఒరే, అబ్బయ్యా, ఈ పొద్దు నుంచీ, నువ్వు బల్లోకి పోబన్లేదుగానీ, నాతో పొలం పోదువులే పా” అన్నాడు. అమ్మా, నేనూ ఎంత చెప్పినా, నాయన మాట వినలేదు. ఏమైనా అంటే, “చెల్లిని కూడా సాకాలి, అమ్మకి సుస్తీ చేసి, పని ఏమీ చెయ్యటంలేదు” అని – మా అయ్య వాదన. బడిలో అయ్యవార్లు కూడా నచ్చచెప్పడానికి ప్రయత్నించి విరమించుకున్నారు. కొన్ని నెలలు గడిచిపోయాయి. మధ్య మధ్యలో, పొలం పని లేనప్పుడు, బడికెళ్ళి మాతరగతిలో కూచునేవాణ్ణి. కానీ, కొన్ని పాఠాలు వినకపోవడంవల్లా, అభ్యాసపు లేమి వల్లా, అయ్యవారు చెప్పేది బుర్రకెక్కేది కాదు. దానికి తోడు, బడికి వేసుకు వెళ్ళే చొక్కా చిరిగిపోతే, మా అయ్య ఇంకోటి కుట్టించలేదు. తెల్ల చొక్కా లేకపోతే బడికి రానిచ్చేవారుకాదు. క్రమంగా, నేను చదువుకి దూరం అవుతున్నానని తెలుసుకోగలిగాను. నా నోటి దగ్గరి కూడు మా అయ్య లాగేసుకున్నాడని, బాగా చదువుకుని మా అయ్యకి చూపించాలని నాకు గట్టి కోరిక వుండేది. పట్నంలో చదివి, మా బడిలో అయ్యవారిలాగ పేంటూ, చొక్కా వేసుకుని, సైకిలు మీద పోవాలని ఒకటే అనిపించేది. బడికి పంపమని మా అమ్మ ఎంత పోరు పెట్టినా, మా అయ్య మనసు కరగలేదు. ఎప్పుడూ “పని నేర్చుకోరా అబ్బయ్యా, మీసమొచ్చేపాలికి మేస్త్రీవి అవుతావురా” అని నన్ను ఊరుకోబెట్టడానికి ప్రయత్నించేవాడు. నన్ను బడికిపోనీలేదని, ఎప్పుడైనా ఏడిస్తే అమ్మ కూడా కళ్ళనీళ్ళు పెట్టుకునేది.

ఆ ఏడు గట్టిగా కురిసిన వానలకి, మా బడి ఆవరణలో మోడువారిన ఓ పెద్ద చెట్టు కూలి దారికి అడ్డంగా పడిపోయింది. దాన్ని అడ్డు తీసేసి, వంటచెరకుగా కొట్టడానికి బడివాళ్ళు మా అయ్యకి కబురు పెట్టేరు. కూలిడబ్బులు మిగులుతాయని, మా నాయన వేరే కూలీలెవరినీ సాయం తీసుకోలేదు. మా నాయన ముక్కలు కొడితే, నేను చిన్న చిన్న మోపులు కట్టేవాణ్ణి. రెండు రోజులకి దారి చానామటుకు బాగయ్యింది. మూడో రోజొక పొద్దు, పిల్లకాయలంతా ఉతికిన బట్టలేసుకుని, బడి కొచ్చారు. బడి గుమ్మానికి రంగు కాగితాలు కట్టేరు. ఒక అబ్బాయిని కదిపితే తెలిసింది – జిల్లా విద్యా శాఖాధికారి (డీ ఈ ఓ) గారి తనిఖీ వుందని. ఇంతలో ఒక జీపు వచ్చి బడి ముందు ఆగింది.

జీపు వెనక సీట్లోంచి ఒక బంట్రోతు, ఒక చిన్న అధికారీ, ముందు సీట్లోంచి డ్రైవరూ దిగేక – ముందు సీటు కుడివైపు నుంచి ఒక పెద్దయ్యగారు దిగేరు. వారే, డీ ఈ ఓ గారని నేను తేలికగానే పోలిక పట్టేను. వారు బండి దిగిన వెంటనే, వెంటనే, హెడ్మాస్టరు గారు ఆయనకి నమస్కరించి, మిగతా వారితోబాటు బడిలోపలికి తీసుకునివెళ్ళేరు.డీ ఈ ఓ గారు దిగేటప్పుడు, ఆయన చెటుల్లో బొత్తి లోంచి, ఒక కాగితం జారిపడిపోయింది. అది వారెవ్వరూ చూసుకోలేదు, లోపలికి వెళ్ళిపోయేరు. నేను పరిగెత్తుకెళ్ళి వాళ్ళకిద్దామనుకున్నాను. ఇంతలోపే ఆ కాగితం మా అయ్య దగ్గరికి ఎగిరొచ్చి, ఆగక అక్కడినుంచీ, మోపులు కడుతున్న నాదగ్గరకొచ్చింది. ఆ కాగితాన్ని చూడగానే, పట్టుకోవాలనిపించింది. చూడబోతే, పాల లాంటి తెల్ల కాగితం. ముట్టుకుంటే, మురికైపోతుందేమోనని, చేతులు లాగూకి, తుండు గుడ్డకీ తుడుచుకుని, ఆ కాగితాన్ని భద్రంగా రెండు చేతులతోనూ పట్టుకున్నాను. బడికేసి, చూసేను కానీ, ఎవరూ కానరాలేదు. ఎవరూ, వెనక్కి రాకపోతే, ఈ తెల్ల కాగితం నాదేననిపించి, నాకు పట్టరాని సంబరం వేసింది. ఆ తెల్ల కాగితం పట్టుకుని మైమరచిపోతున్న నన్ను, మా అయ్య అదిలించే సరికి, మళ్ళీ ఈ లోకం లోకి వచ్చేను.

ఏమైనా, సరే, ఆ కాగితాన్ని వదులుకోవాలనిపించలేదు. మా అయ్య దగ్గరినుంచి కనుమరుగవ్వాలని ” అయ్యా, ఆకలవుతున్నాది” అని చెప్పేను. దానికి, మా అయ్య ” ఇంటికి పోయి, బువ్వ తిని బిరీన వచ్చేయి. ఈ పొద్దు పని ముగించాలి” అని చెప్పేడు. చాలు, ఈ అవకాశం అనుకుని, ఆ కాగితాన్ని రెండు చేతులతోనూ పట్టుకుని, ఇంటికి పరుగు తీసేను. గుడిసె బయట, రాయి దగ్గరి పొయ్యి ఊదుతూ అవస్థ పడుతున్న అమ్మ, నన్నొక్కడినీ చూసి ఆశ్చర్యపోయింది. ఉయ్యాల్లో, బజ్జున్న చెల్లికి ముద్దు పెట్టి, లోపల చూరు మీదనుంచి వేలాడుతున్న, నా సంచీ ని అందుకున్నాను. ఈ లోగా అమ్మ ” బువ్వ తిందువు రా” అని పిలిచింది. జరిగినదంతా అమ్మకి చెప్పేను. అమ్మ ఏవీ మాటాడలేదు. “బిడ్డ బడికి పోవట్లేదే” అని లోలోపలే బాధ పడుతోందని నాకు తెలుసు.

బువ్వ తిని, ఆ కాగితం మీద ఏదైనా రాసుకోవాలని అనుకున్నాను. కానీ, ఏమి రాయాలో తోచలేదు. ఎక్కాలు రాద్దామని మొదలు పెట్టేను, అన్నీ గుర్తుకు రాలేదు. కానీ కాగితం ఒకవేపంతా నిండిపోయింది. రెండో వేపు, కంఠస్థం వచ్చిన “భారతదేశము – ఎల్లలు” రాసి , నచ్చక చెరిపేసేను. “అయ్యా, నన్ను చదివించు” అని మా అయ్యకి పరాకు చెబుతున్నట్టుగా రాసి , చూపించాలనుకున్నాను, కానీ, అయ్యకి చదవడం రాదని గుర్తుకొచ్చి నిరుత్సాహ పడ్డాను. ఈ మాటే, అమ్మతో అంటే, అమ్మ నవ్వి, “పాన్లే, ఆ ఒచ్చిన పెద్దయ్యకే రాసియ్యి, ఆయనేమన్నా మీ అయ్యకి చెప్తాడేమో “‘ అంది. సరే అని చెప్పి-, ఎల్లలు రాసి చెరిపిన రెండో వేపు –

“పెద్దయ్య సారూ,
నన్ను బడికి పోనీమని మా నాయనకి చెప్పండి. బడినుంచి వచ్చినాక, నాయనకి తోడుగా పని చేస్తాను. మీరు గట్టిగా చెప్తే మీ మాట ఇంటాడు. నా పేరు రాంబాబు, తరగతి -5”

అని రాసేను. వంకర టింకరగా రాసిన ఈ మాటలకే ఠావు కాగితమూ పూర్తిగా ఒక వేపు నిండి పోయింది. అమ్మకి చదివి వినిపించేను. కానీ, దాన్నిఎలా ఇవ్వాలో, తెలియలేదు. బడిలోపలికి వెళదామనుకుంటే కనీసం తెల్ల చొక్కా అయినా లేదు. ఎలాగోలా చూద్దామనుకుని, నలిగిన ఆ కాగితాన్ని, మడతబెట్టి జాగ్రత్తగా లాగూ జేబులో పెట్టుకుని, అయ్యకి అన్నం తీసుకుని బడికేసి బయలు దేరేను.

నేను అక్కడికి చేరేసరికి, అయ్య మొత్తం పనంతా దాదాపుగా పూర్తిచేసి, మోపులు కూడా బండ్లోకి ఎక్కించేసేడు. అయ్య బువ్వ తింటూండగా, ఎలా చెయ్యాలో దిక్కు తోచక, మడచిన ఆ కాగితాన్ని, జీపులో పెద్దయ్యగారు కూర్చున్న సీటు మీద వుంచి, బరువుగా ఒక కట్టె పేడుని వుంచేను. కాసేపాగితే, వాళ్ళు తిరిగొచ్చేస్తారు కదా అనుకుంటుంటే, అయ్య నన్ను పొలం మీదికి బయలుదేరదీసేడు. ఎదురు చెప్పలేక, తల వేలాడేసుకుని, అయ్య వెనకాలే పొయాను. బడిలోకి దూసుకెళ్ళి, ఆ వచ్చిన పెద్దయ్యగారి చేతిలో ఈ కాగితం పెట్టనందుకు, ఈ సారి నా మీద నాకే కోపం వచ్చింది.

చలికాలం కావడం వల్ల తొందరగా పొద్దు గుంకింది. ఇంటికి చేరి, దీపం బుడ్లు ముగ్గుపొడి తో తుడుస్తూ వుంటే, మా తరగతి పిల్లవాడొకడు, రొప్పుతూ లోపలికొచ్చి – “ఒరేయ్, హెడ్మాస్టరుగారూ, డీ ఈ ఓ గారూ, జీపులో మీ ఇంటికొస్తున్నారు. మీ నాయనతో మాట్లాడతారంట” అన్నాడు. వీడి అరుపుకి, అయ్య అక్కడికి వచ్చి -“మనకాడ ఏం పనిరా అబ్బయ్యా?” అని అడిగేడు. ఏమీ అర్థం కాక తెల్లబోయిచూస్తున్న నాకే, నేను రాసిన ఆ కాగితం చప్పున మతికి వచ్చింది. ఆ సంగతి అమ్మ ఇంకా అయ్యకి చెప్పి వుండదని నమ్మిన నేను, అయ్యతో తెలీదన్నట్టు అడ్డంగా తలాడించేను. తనకి తెలిసిపోతే, పెద్ద సార్లని, మీదికి ఉసిగొల్పేనని అయ్య నా మీద విరుచుకపడతాడేమోనని నా గుండె జారింది. ఈ లోగా, జీపు ఇంటికి దగ్గరగా వచ్చి నిలిచింది. మా అయ్య పరుగున బండి దగ్గరకు వెళ్ళి, చెయ్యి కట్టుకు నిలబడ్డాడు. చుట్టుపక్కల వుండే జనమంతా గుమిగూడేరు.

అప్పుడు, బండి దిగిన డీ ఈ ఓ గారు, ” ఇతడేనా, రాంబాబు తండ్రి – పెంచలయ్య?” అని హెడ్మాస్టరుగారిని అడిగేరు. ఆయన అవునన్నాక, మా అయ్యతో “చూడు, పెంచలయ్యా, రాంబాబుని, రేపట్నుంచీ, బడికి పంపించు. పనికి వద్దు” అన్నారు. మా అయ్య, నోరు తెరిచి మాట్లాడేలోగా ఆయన కాస్త స్వరం పెంచి – “వాణ్ణి, చదివించే పూచీ నాది, వాడు చదివి నీ ఇంట్లో దీపం వెలిగిస్తాడు” అన్నారు. మా అయ్య గొంతులో తడారిపోవడం చూసిన ఆయన, కాస్త మెత్తగా “ఇక నీ సంగతంటావా, చిన్న మెరకేదైనా కౌలుకి తీసుకో, కాగితాలవీ కూర్చుకుని, నెల్లూరు వస్తే, అధికారులతో మాట్లాడి నీకు అప్పు మంజూరు చేయించడానికి సాయం చేస్తాను” అన్నారు. చెల్లి నెత్తుకుని, గుడ్లప్పగించి చూస్తున్న అమ్మతో, అనునయంగా “పిల్లవాణ్ణి, రోజూ బడికి పంపే బాధ్యత నీది” అని, హెడ్మాస్టరు గారికి “దయచేసి మీరు గమనిస్తూ వుండండి” అని చెప్పి – జీపెక్కి, దుమ్ము రేపుకుంటూ అందరూ తిరిగి వెళ్ళిపోయేరు.

అరోజు రాత్రి, మా అమ్మ, అయ్య మీద పెద్ద పోరు జరిపి, చివరకు గెలిచింది. అయ్యకి నోరెత్తే సందు లేకపోయింది. అమ్మ ఎంతో సంబరంగా పొద్దున్న నన్ను బడికి పంపడానికి తయారు చేసింది. కానీ, తెల్ల చొక్కా లేదే అని నేను, ఊగిసలాడుతూవుంటే, “రాంబాబూ, బడికీ” అని మా తరగతి పిల్లలు అరుచుకుంటూ వచ్చి ఇంటిముందు పొగయ్యేరు. “తెల్ల చొక్కా లేకపోయినా కూడా, నిన్ను అయ్యవారు రమ్మన్నారు” అని నన్ను లాక్కెళ్ళేరు.

ఆ ఏడాది పొదలకూరులోనే అయిదు పూర్తి చేసేక, డీ ఈ ఓ పాండురంగం గారు, నా వెనకే వుండి నన్ను తాడికొండ ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ఆరో తరగతిలో చేర్పించేరు. ఉపకార వేతనమూ ఏర్పాటు చేసి ఇప్పించేరు. వారి పిల్లలిద్దరూ, నాకంటే పెద్దవాళ్ళు. వాళ్ళ అబ్బాయికి, మరి సరిపోని శుభ్రమైన బట్టలు, స్టీలు సామాన్లవాడికి ఇచ్చెయ్యకుండా వారి భార్య పార్వతమ్మగారు నాకోసం అట్టే పెట్టేవారు. వారు నెల్లూరు నుంచీ బదిలీ అయ్యేవరకూ, నేను ఎప్పుడు సెలవులకి ఇంటికి వెళ్ళినా, ఒక పూటైనా వారింటి భోజనం రుచి చూపించి, నా బాగోగులు విచారించే వారు. తరువాత, తరువాత నాకు తెలిసింది, గురుకులం లో అయ్యవార్లని కూడా నా గురించి తరచూ వాకబు చేసేవారని. పాండురంగంగారు, పై వూరికి వెళ్ళిపోయినా, నేను హైస్కూలు పూర్తి చేసేవరకూ, నెలకొక జాబైనా రాసేవారు. స్కాలరుషిప్పు ఎలా పొందాలీ, ఏ ఏ ధ్రువీకరణ పత్రాలు కావాలీ – ఇలాంటి విషయాలలో నాకు మార్గదర్శిగా వుండడమే కాక, బాగా చదువుకోవడానికి నాకు అంతులేని ప్రోత్సాహాన్ని సదా అందించేవారు. వారి ఉత్తరాల్లో, నడవడి గురించీ, విలువల గురించీ- బడిలో నా పెరిగే తరగతికి అనుకూలంగా నాకు సూత్రాలు చెప్పేవారు. పాండురంగం గారి ఉత్తరాలన్నీ, ఈ నాటికీ నా దగ్గర భద్రంగా వున్నాయంటే, వారన్నా, వారి మాటన్నా నాకు ఎంత గౌరవమో తెలుస్తుంది.

తాడికొండలో హైస్కూలు పూర్తయిన తరువాత, ఇంటర్మీడియట్ కూడా గుంటూరులో వారి సలహా మేరకే చేరేను. నా ఇంటర్మీడియట్ చదువుకి వారు కొంత ఆర్ధిక సహాయం కూడా అందించేరు. గుంటూరులో నా చదువు పూర్తయ్యేసరికి, మా అయ్య కొద్దిగా నిలదొక్కుకుని, మా స్థలాన్ని విడిపించుకోగలిగాడు. చెల్లిని కూడా, అప్పటికి బళ్ళో వేసేడు. పాండురంగం గారికున్న మంచి పేరు వల్లా, వారిమాట చలవ వల్లా నేను సహాయం కోరగా నిరాకరించిన వారు తక్కువ. నా పోషణా భారం మా అయ్య మీద పడిందీ చాలా తక్కువే. నా అంతట నేను స్వయం సమృద్ధిగా బ్రతకడానికి, అవసరమైన తర్ఫీదు వారి ద్వారానే నాకు చిక్కింది. ఇంజినీరింగు చదవాలని కృషి చేస్తునప్పుడు, బుద్ధి వికసిస్తుందని పొరుగు రాష్ట్రంలో చేరమని వారే సూచించేరు.

నాగపూరు లో బి టెక్కు చదివి, నేను ఇక్కడ, ఉద్యోగం లో చేరేటప్పటికి, వారు పదవీ విరమణ చేసి, హైదరాబాదు లో స్థిర పడ్డారు. నేను, మొదటి జీతం అందుకుని, వారి పేర వెయ్యి రూపాయలు మని ఆర్డరు చేస్తే, తిరుగు టపా మీద “అమ్మనీ, నాన్ననీ సాదరంగా చూసుకో. చెల్లిని బాగా చదివించు. బాధ్యత విస్మరించకు” అని రాసి, పైకాన్ని సున్నితంగా తిప్పి పంపేసేరు. నేను, ప్రతీ నెలా ఏదో ఒక మొత్తం వారికి పంపించి, వారి ఋణాన్ని కొంతైనా తీర్చుకుందామనుకున్న నా ఆశ నెరవేరలేదు. ఇప్పటికీ, నేను ఫోను చేస్తే, “ఒరేయి, అబ్బాయీ” అని ఎంతో ప్రేమగా పాండురంగం గారూ, పార్వతమ్మ గారూ పలకరిస్తారు. చెల్లి, ఈ ఏడాది, పది రాస్తే అమ్మనీ, అయ్యనీ కూడా నెల్లూరుకి మార్చి -అక్కడ దాని పై చదువు కొనసాగించాలని నా కోరిక.

ఈ మధ్య ఒక ఆరు నెలల క్రితం, పెళ్ళిళ్ళు అయి, అమెరికాలో స్థిరపడ్డ పిల్లల దగ్గర కొంత కాలం గడపడానికి బయలుదేరుతూ, ముంబయి వస్తున్నట్టుగా పాండురంగంగారు నాకు తెలియజేసినప్పుడు, నేనెంతో ఉద్వేగానికి లోనయ్యాను. వారికంటే ముందే, నేను విమానాశ్రయం చేరుకుని, వారికోసం ఎదురు చూస్తూ వుండగా, షటిలు బస్సు దిగుతూ పాండురంగంగారూ, పార్వతమ్మగారూ కనిపించేరు. సామాన్లవీ అందుకుని, తోపుడు బండితో లోనికి ప్రవేశించేము. చేతులు కట్టుకుని, నేల చూపులు చూస్తూ, మౌనంగా నిలబడ్డ నన్ను పార్వతమ్మగారు ఆప్యాయంగా పలకరించి ” ఒరే అబ్బాయీ, అమ్మా, నాన్నా జాగ్రత్త. చెల్లిని బాగా చదివించు. నువ్వు వేళ పట్టున భోంచెయ్యి” అని చెప్పేరు. నేను మాట్లాడకుండా తలాడించేను. అప్పుడు పాండురంగం గారు “అదేంట్రా, అదోలా వున్నావూ?” అని నా భుజం నొక్కి ప్రశ్నించేరు. అంతవరకూ, తొక్కిపెట్టిన భావాలకి అడ్డుకట్ట వెయ్యలేక, నా కళ్ళు నీటి చలమలయ్యేయి. గొంతు రుద్ధమై, మాట సరిగా పెగలక, కిందికి వంగి వారి కాళ్ళు పట్టుకుని “పెద్దయ్యగారూ, మీ ఋణం ఎలా తీర్చుకోను?” అని అడిగేను. ఆయన నన్ను లేవనెత్తి, “ఒరే, అవసరమున్నా, లేకున్నా నాఋణం నువ్వు నాకే తీర్చేటట్టయితే మనమిద్దరమే సమాజం అయిపోతాము. అందులో మూడో మనిషి ప్రస్తావన ఏదీ? అది స్వార్థం కాదూ? అప్పుడు వసుధ ఏక కుటుంబం ఎలా అవుతుందిరా, చెప్పు” అన్నారు. నిరుత్తరుడినై నేను వింటూ వుండగా మళ్ళీ ఆయనే “అందుకే, నువ్వు పంపిన డబ్బు తిరిగి పంపేసేను. నువ్వే ఓ పది మందిని బాగు చేసి, నీ ఋణభారాన్ని వాళ్ళ మీద వెయ్యి” అన్నారు. వింటున్న నా తల మీద దీవిస్తున్నట్టుగా ఒకసారి చెయ్యి వేసి, సామాన్లతో నిండిన తోపుడుబండి తోసుకుంటూ ఇద్దరూ లోపలికి వెళ్ళిపోయేరు.

ఆ రోజు, వారిద్దరినీ సాగనంపి, విమానాశ్రయం నుంచి తిరిగి వస్తున్నప్పుడు నా మనసెందుకో స్థిమిత పడ్డట్లనిపించింది. పెద్దయ్యగారి మాటలమీద ఆలోచించినకొద్దీ, నాకు తేలికగా అనిపించసాగింది. నా ఋణభారం తీర్చుకోవడానికి, ఓ పది మందిని బాగు చెయ్యాలంటే, ముందు డబ్బు సంపాదించాలి. ఆ తరువాత ఒక నిధి గానీ, ట్రస్టు గానీ ఏర్పాటు చేసి, ఈ ఆశయం నెరవేర్చాలి. అంటే, ముందు నా వాళ్ళ గురించి, అటు పైన నా ఉద్యోగమూ, సంపాదనల గురించి కనీసం ఓ పదేళ్ళు ఏకాగ్ర దృష్టితో కృషి చెయ్యాలని తీర్మానించుకున్నాను.


ఈ రోజెందుకు మనసులో ఈ అలజడో నాకు అంతు చిక్కడం లేదు. నాలో నేనే రెండుగా విడిపోయి, ఒకరు అవుననీ, ఇంకొకరు కాదనీ, కలహించుకున్నట్టనిపిస్తోంది. “ఈ హరి గాడి గురించేనా, నా చింతంతా? వాడి సమస్యకీ, నా బాల్యానికీ సారూప్యమున్నందుకా? ఇంకా కెరీరు ప్రారంభంలో వున్న నాకు, అమ్మా, నాన్నా, చెల్లీల బాధ్యత తలమీద వుంది. ఈ వీధి పిల్లల బాధ్యతంతా నాదెలా అవుతుంది? ప్రభుత్వమూ, ఈ బడా షరాబులూ ఏం చేస్తున్నారు? అయినా, హరీ, గిరీ అని ఇప్పటి నుంచే పూసుకు తిరిగితే నా జీవితాశయం, మహోన్నత లక్ష్యం నెరవేరేనా? నిధికి డబ్బు ఎలా సమకూరేను? ట్రస్టు ఎలా ఏర్పాటు చెయ్యగలను? కొంత కాలమాగి, డబ్బు పోగు చేసి, నిధి ఏర్పాటు చేస్తే, హరి లాంటి ఎంతో మంది పిల్లలు లాభం పొందగలరు. నాకూ ప్రస్తుతం, కాస్త వెసులుబాటుగా వుంటుంది.” అని సమాధానపడ్డాను.

కానీ, కాలయాపన చేస్తూ, డబ్బు మీది వ్యామోహంతో, పరిధి గీసి, హద్దులు నిర్ణయించుకుని నన్ను నేను మోసగించుకుంటున్నానేమోనని శంక పీడిస్తోంది. పాండురంగం గారి మాటలని, భవిష్యత్తులో పది మందికి ఉపయోగపడే నిధి, ఏర్పాటు చెయ్యాలన్న మహోన్నత లక్ష్యం పేరుతో, వక్రభాష్యం చెప్పుకుని ఎదురుగా వున్న సమస్యని కప్పదాటు చేస్తున్నానా అనిపించింది. తల్లి తండ్రుల నీడలో, కేరింతలతో, చదువుకుంటూ గడవ వలసిన బాల్యం, రెక్కల కష్టం చెయ్యడం అమానుషం కాదూ. నా జీవితంలో పాండురంగం గారి పాత్ర ని, హరి బాల్యంలో పోషించడానికి నాకు వచ్చిన అవకాశాన్ని, వితండ వాదనతో తోసిరాజంటున్నానా? సమాధానం తెలియలేదు.

బయట చెవులు చిల్లులు పడేటట్లున్న ఉరుముల మోత కి, పరస్పర విరుద్ధమైన ఆలోచనలని విదిలించుకుని, కిటికీ లోంచి చూసేను. వాన జోరు ఇంతకు ముందు కంటే ఎక్కువ అయ్యింది. లేచి, మొహం కడుక్కుని, ట్రైనింగు రూము కేసి నడిచేను. కొలిక్కి రాని, ఆలోచనలతో తలంతా దిమ్ముగా వుంది.

ట్రైనరు, అమెరికా లోని మా ప్రిన్సిపల్ కంపెనీ నుంచి వచ్చేడు. అతడి పేరు రిచర్డ్ బ్లాంటన్. తన పరిచయంలో, తనని “రిక్కీ” అని పిలవమని కోరేడు. చూడడానికి, ఒడ్డూ, పొడూగూ – పాండురంగం గారి లాగే వున్నాడు. వయసుకే ఓ పదేళ్ళు చిన్న అయి వుండొచ్చు. మధ్య మధ్యలో కధలూ, పొడుపు కధలూ, చలోక్తులూ జోడించి, వినేవారి దృష్టి మరలకుండా కాసుకోవడంలో నేర్పరి. సెషను మొదటి భాగంలో, నేను అన్యమస్కంగా వుండటం గమనించినట్టున్నాడు. టీ బ్రేకు తరువాత, నన్ను ముందు వరుస లో కూచోమని ఆహ్వానించేడు. నేను కాదనలేకపోయాను. విరామం తరువాత, టీము ఎలా నిర్మించాలి, భాగస్వాముల పని విలువ ఎలా పెంచాలి, వారి లోటుపాట్లని అంగీకరించడం ఎలా, నాయకుడిగా ఎలా ఎదగాలి, అని ఇంకా ఏవేవో చెబుతూ, గబుక్కున ఒక కధ లోకి జారుకున్నాడు.

“ఒక విహారి సముద్ర తీరంలో, పోటులో ఒడ్డుకి కొట్టుకొచ్చి దిగబడి పోయిన స్టారు చేపలని, ఒక్కొక్కటిగా ఏరి, తిరిగి నీళ్ళలోకి విసురుతున్నాడు. ఇది చూసిన మరో వ్యక్తి, ‘ఎంతో పొడవైన తీరం నిండా ఈ చేపలు వున్నాయి కదా’ అని అడగ్గా, ‘అయ్యా, నీళ్ళలోకి నే తిరిగి విసిరినవైనా, కనీసం బతుకుతున్నాయిగదా! వీలయితే, మీరూ ఒక చెయ్యి వెయ్యండి’ అన్నాడట విహారి.”

ఎవరో నా చెంప చెళ్ళుమన్నట్టనిపించింది. బుర్రలోని గజిబిజి ఆలోచనలు, నెమ్మదిగా ఒక త్రాటి మీదకి రావడం మొదలు పెట్టినై. నా సమస్యకి పరిష్కారం దొరికింది. ఇప్పటికి హరి మాత్రమే తారసపడ్డాడు. వీడికి దారి చూపించకుండా, పదేళ్ళు ఆగమనడం సబబు కాదు. రేప్పొద్దున ఇంకో గిరి కనబడితే, స్తోమత లేకపోతే ఆలోచింపవచ్చు. ముంబయి మహా నగరం లోని వీధి పిల్లలందరినీ నేను గాడి లో పెట్టలేను. కానీ, ఈ పరిస్థితి కి వ్యవస్థనో, ప్రభుత్వాన్నో నిందిస్తూ, నిర్లిప్తంగా ఏమీ పట్టనట్టు ఉండిపోవడం ఆత్మ వంచనే. నా జీవితంలో పాండురంగం గారి పాత్ర నాకొక అద్భుతం (మిరకల్). కానీ, వారు దాన్ని తన సహజ ధర్మంగా భావించేరే! తెర వెనుక నుంచి నే పిలిచిన ఒక్క పిలుపుకే, వారు అంతగా స్పందించి, నా బతుకు గీతని సరిదిద్దేరు. మరి హరి విషయం లో పదే, పదే వాడిచ్చిన పిలుపందుకోగలిగీ, అందుకోక తర్కించడం తగునా? పెద్దయ్య గారు హరి నే ఉద్దేశించి “మూడో మనిషి” అని వుంటారు. ఆలోచనలలో స్పష్టత లభించింది.

ఈ రోజే గుప్తా సేటు తో, మాట్లాడి, నా ఋణభారానికి హరిని ఒక బోయీని చెయ్యాలని, నిర్ణయానికి చేరిన నాకు మనసు హాయిగా, తేలికగా వుంది. సెషను పూర్తయ్యాక రిక్కీ కి కృతజ్ఞతలు చెప్పి, ఆటోగ్రాఫ్ తీసుకుని, కిందకి బయలుదేరేను. లిఫ్టు లాబీలోంచి బయటకి వచ్చి, గొడుగు తెరుద్దామని చూడబోతే, ఆశ్చర్యం. మూడు రోజులుగా పట్టిన ముసురూ, వానా పూర్తిగా వెలిసేయి. కురిసి, కురిసి అలసిపోయినట్టు, మబ్బులన్నీ విడిపోయి, ఆకాశం నిర్మలంగా వుంది. నేను నా బస్సు స్టాపు కేసి నడక సాగించేను. ఇన్నాళ్ళ వాన నీటిలో మునిగిన నేల ఇంకా పొడిబారి పోలేదు.