[ఈ కథ హిందీ మూలం “జీవన్ కా తాప్” అన్న పేరుతో “అభివ్యక్తి” వెబ్ పత్రికలో ప్రచురితమైంది — సంపాదకులు]
ఎముకలు కొరికేసేంత చలి. దానికి తోడు చాలా రోజులనుంచి సూర్యభగవాను డేమైపోయాడో తెలియడం లేదు. ఎండ పొడ చూసే చాలా రోజులవుతోంది. రోజూ లాగే ఈ పూట కూడ బిషన్ సింగ్ కనురెప్పలు బరువుగా తెరచుకున్నాయి. రాత్రంతా అస్సలు నిద్ర లేదాయనకి. ఒక సారి కళ్ళు తెరచుకుంటే ఇక మళ్ళీ నిద్రపోలేడాయన. వేసవి కాలమైతే మెలకువ రాగానే వ్యాహ్యాళికి బయల్దేరేవాడు. కాని ఈ తీవ్రమైన చలిలో పక్క మీద నుంచి ఎవరికి లేవాలనిపిస్తుంది? ఆయన వణికిపోతూ, కొంకర్లు పోతూన్న తన ముసలి శరీరాన్ని రగ్గుతో నాలుగువైపుల నుంచి సరిగ్గా కప్పుకుని, వీపుని గోడకానించుకున్నాడు. ఆయన చేతికందేంత దూరంలో, ఇంకో పక్క మీద ఆయన భార్య సుఖవంతి ముసుగు పెట్టుకుని నిద్రపోతోంది.
పాపం రాత్రంతా దగ్గుతూనే ఉందామె. ఇంటి పనులని పనిమనిషి చేత చేయించుకోమని ఎన్నో సార్లు భార్యతో అన్నాడు బిషన్‌సింగ్. ‘పనామె రోజుకి రెండు సార్లు వస్తుంది. ఆమేమీ ఊరికే పనిచేయడం లేదు కదా, జీతం తీసుకుంటోంది కదా! కాని సుఖవంతికి ఇవేవి పట్టవు. ఎప్పుడూ చలిగాలిలోనే ఉంటుంది. నీళ్ళు పడుతుంది, గిన్నెలు సర్దుతుంది, తడిగుడ్డతో ఇల్లు తుడుస్తుంది, లేదంటే బట్టలు ఉతుకుతూ కూర్చుంటుంది. ఇదివరకులా కాదు కదా, వయసైపోయింది. ముసలితనం మీద పడుతోంది. తొందరగా జలుబు చేసేస్తోంది. కాని ఈవిడ మాట వినదు…’ అంటూ భార్య గురించి తనలో తానే మాట్లాడుకున్నాడు బిషన్ సింగ్.
రాత్రి మెలకువ వచ్చినప్పుడల్లా ఆయన భార్య వీపు మీద విక్స్ రాస్తూనే ఉన్నాడు. ఆవిడ కేదయినా అయితే ఆయన తట్టుకోలేడు. పెరట్లో పిట్టల కిచకిచలతో తెల్లారిందని తెలుస్తోంది. రగ్గులో కూర్చుని ఆయన సమయం ఎంతైయుండచ్చో అంచనా వేసాడు. ‘ఆరు గంటలై ఉంటుంది’ అనుకున్నాడు. కిటికీలోంచి గాని, లేదా వాకిలి తలుపు తీసిగాని బయటకి చూడాలని ఆయనకి అనిపించింది. కానీ ఆ ఆలోచనే ఆయన ముసలి శరీరాన్ని వణికించింది. తను కప్పుకున్న రగ్గు జారిపోయినట్లనిపించి, దాన్ని సరిజేసుకున్నాడు.
‘ఈ పిట్టలకి చలెయ్యదా? ఇంత తీవ్రమైన చలిలోను అవంత ఆనందంగా ఎలా కూయగలుగుతున్నాయో?’ అని అనుకున్నాడు. అదే సమయంలో సుఖవంతి వళ్ళు విరుచుకుంది. దాంతో ఆమె కప్పుకున్న రగ్గు ఓ పక్కకి జారిపోయింది. ఆమె వీపు భాగంపై అచ్ఛాదన పోయింది. ఆమెని లేపి రగ్గుని సరిగా కప్పుకుని పడుకోమని చెబుదా మనుకున్నాడు. కాని ఓ క్షణం పాటు ఆలోచించి మానుకున్నాడు. ఆమె నిద్ర చెడిపోతుంది. ఆయనే స్వయంగా లేచి వెళ్ళి ఆవిడకి నిద్రాభంగం కలగకుండా రగ్గుని సరిచేసాడు. ఆమె లేస్తే, ఇక తిరిగి పడుకోదు. అసలు ఆవిడ వంట్లో కులాసాగా ఉంటే ఇంత సేపు పడుకోదు. మాములుగా ఐతే పక్షుల కిలకిలలతోనేనిద్ర లేస్తుందామె. ‘తనంతట తను ఈ రోజు డాక్టరు దగ్గరికి వెడితే సరే, లేదంటే నేనే తీసుకువెడతాను’ అని అనుకున్నాడు బిషన్ సింగ్.
చిన్న చిన్న జలుబులు, దగ్గులను ఆవిడ రోగాలుగా భావించదు. ఎలా వచ్చాయో అలాగే పోతాయనుకుంటుంది. వాటికోసం డాక్టరుకి డబ్బులు ధారపోయడం దండగని ఆవిడ అభిప్రాయం. ఆయన తిరిగి వచ్చి తన స్థలంలో గోడకి వీపు ఆన్చి, రగ్గు కప్పుకుని కూర్చున్నాడు.
ఒంటరి వ్యక్తులను జ్ఞాపకాలు వదలవు. ఒంటరి వృద్ధులకైతే ఈ జ్ఞాపకాలే ఆసరా! వాటితోనే వారు తమ జీవితపు చరమాంకాన్ని గడిపేస్తారు. బిషన్ సింగ్ కూడా తన జ్ఞాపకాల కడలిలో మునిగి తేలుతూంటాడు. ఆయన జీవితంలో కొన్ని దుర్దినాలైతే, కొన్ని సంతోషకరమైన రోజులు.
సుఖవంతితో పెళ్ళయినప్పటికి ఆయన ఇంటి పరిస్థితి పెద్ద గొప్పగా లేదు. రెండు పూటలా భోజనానికి మాత్రం లోటు ఉండేది కాదు. ఆయనకి ఆస్తిపాస్తులేవీ లేవు. తన గ్రామంలోనే వంశపారంపర్యంగా చేస్తున్న చిన్నా చితకా వడ్రంగం పనులు చేసుకుంటూ పొట్ట పోసుకునేవాడు. కానీ సుఖవంతి ఆయన జీవితంలోకి అడుగు పెట్టగానే ఆయన దశ తిరిగింది. ఆయన స్నేహితులు కొంతమంది కలసి పట్నంలో ఓ కొత్త కార్ఖాన తెరిచారు. బిషన్ సింగ్‌కి అందులో ఉద్యోగం దొరికింది. పొద్దున్నే సైకిల్‌పై పట్నం వెళ్ళడం, పొద్దు గుంకాక తిరిగి గ్రామానికి రావడం! నెలా నెలా స్ధిరమైన ఆదాయం లభించడంతో వాళ్ళ పరిస్ధితి మెరుగైంది. గుడిసె స్థానంలో పక్కా ఇల్లు కట్టుకున్నారు. ఇంట్లోకి కావల్సిన ఒక్కో వస్తువు మెల్లిగా అమరింది. తర్వాత కొంత కాలానికి తన ఊర్లోనే ఓ చిన్న స్థలాన్ని కొనుక్కున్నాడాయన. నాలుగు కొట్లని కూడా అమర్చుకుని, మూడింటిని అద్దెకిచ్చి ఒకటి తనుంచుకున్నాడు. ఇద్దరుండే కుటుంబానికి ఆ వచ్చే ఆదాయం సరిపోయేది. సుఖవంతి రాగానే బిషన్ సింగ్ పట్టిందల్లా బంగారమవుతోందని గ్రామస్తులు చెప్పుకునేవారు.
సుఖవంతి నిద్రలో మళ్ళీ వళ్ళు విరుచుకుంది. ఈ సారి ఆమె ముఖంపై నుంచి రగ్గు జారిపోయింది. బిషన్ సింగ్ ఆమె ముఖాన్నే చూస్తుండిపోయాడు. దేవుడు వాళ్ళకి అన్ని సుఖాలను ఇచ్చాడు, ఒక్క సంతానాన్ని తప్ప! ఎన్నో పరీక్షలు చేయించుక్నునారు. కానీ ఫలితం లేకపోయింది. గ్రామస్తులు బిషన్ సింగ్‌ని మరో వివాహం చేసుకోమని పోరేవాళ్ళు. కాళ్ళు చేతులు కదలలేని ముసలితనంలో పిల్లల ఆసరా తప్పనిసరని బిషన్ సింగ్‌ని ఒప్పించే ప్రయత్నం చేసేవాళ్ళు. కాని బిషన్ సింగ్ వాళ్ళ మాటల్ని లెక్కజేయలేదు. తన భార్య సుఖంగా ఉంటే అంతే చాలని అనుకున్నాడు.
మళ్ళీ ఒక సారి వళ్ళు విరుచుకోగానే ఈ సారి సుఖవంతికి మెలకువ వచ్చేసింది. పరుపుమీద కూర్చుని తనకేసే చూస్తున్న భర్తని చూడగానే, లేచి కూర్చుందామె.
“ఏమైందండి? అలా ఉన్నారు. వంట్లో బాలేదా?”
“నా సంగతి సరే, నీకెలా ఉందో చెప్పు. రాత్రంతా నువ్వు నిద్రే పోలేదు. చాలా సేపు దగ్గావు. ఈ రోజు డాక్టరు దగ్గరికి వెళ్ళాల్సిందే.”
“నాకేమీ కాలేదు” అంటూ పాత పాటనే మళ్ళీ పాడిందామె. “మాములు దగ్గే. వాతావరణం వల్ల! వాతావరణం కాస్త మారితే అదే సర్దుకుంటుంది. కానీ మీకే ఒంట్లో బావున్నట్లు లేదు. తెగ వణుకుతున్నారు.”
“చలివల్ల! అంతే! ఈ సారి చలి రికార్డులు బద్దలు కొట్టేస్తోంది…” అంటూ రగ్గుని సరిగా కప్పుకున్నాడు బిషన్ సింగ్.
“కూర్చోడం ఎందుకు? కాసేపు పడుకోండి. టీ పెట్టి తీసుకొస్తాను.”
“అబ్బా, పడుకుని, పడుకుని విసుగేస్తోంది. కాస్త ఎండొస్తే బాగుండు. బయట కూర్చుంటాను. ఎండ పొడ చూసి ఎన్నాళ్ళైందో. ఈ రోజైనా వస్తుందో రాదో.”
“వద్దు. మంచం మీదే ఉండండి. బయట చాలా చలిగా ఉంది. ఎండొస్తే మీ పక్క పెరట్లో వేస్తాలెండి…” అంటూ మోకాళ్ళపై చేతులుంచి, ‘వాహెగురు, వాహెగురు’ అని స్మరిస్తూ వంటింట్లోకి నడిచింది సుఖవంతి.
కాసేపయ్యాక ఓ గ్లాసులో వేడి వేడి టీ తెచ్చి భర్తకిచ్చింది. ఆ టీ రెండు గుక్కలు తాగగానే ఆయన ప్రాణం లేచొచ్చింది.
“ఈపూట నీళ్ళలోకి వెడితే ఊర్కోను. జాగ్రత్త! పనిమనిషి వస్తుందిగా, ఆమె చేస్తుంది అన్ని పనులు. నువ్వు కూడ టీ తెచ్చుకుని నా పక్కన కూర్చో” అంటూ భార్యని ఆదేశించాడు బిషన్ సింగ్.
సుఖవంతి ముందుగా తన పక్కని సర్ది, రగ్గు మడత పెట్టి, మంచాన్ని పెరట్లో పెట్టింది. ఆ తర్వాత టీ గ్లాసు తెచ్చుకుని వచ్చి భర్త పక్కన కూర్చుంది.
“ఇలా రగ్గులోకి వచ్చి, నాకు దగ్గరగా జరిగి కూర్చో. కాస్త వెచ్చగా ఉంటుంది” అంటూ రగ్గుని తెరిచాడు బిషన్ సింగ్. ఆమె భర్తకి మరింత దగ్గరగా జరిగి, ముడుచుకుని కూర్చుంది. ఆయన శరీరం వేడిగా అనిపించింది.
“అరే, మీకు జ్వరం వచ్చినట్లుంది” అంటూ ఆయన నుదుటిపై చెయ్యి వేసి చూసింది. “చెప్పనే లేదు. రాత్రి జ్వరం మాత్ర ఇచ్చేదాన్ని కదా. ఈ పూట మంచం దిగకండి.”
“ఊరికే కంగారు పడకు. నాకేమీ కాలేదు” అని చెబుతూ మరో గుక్క టీ తాగాడు బిషన్ సింగ్. అలా ఒకరికొకరు దగ్గరగా కూర్చుని ఆ స్పర్శలోని వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ చాలా సేపు మౌనంగా ఉండిపోయారిద్దరూ. టీ తాగుతున్న చప్పుడు తప్ప వారి మధ్య మాటలు లేవు.
కాసేపయ్యాక సుఖవంతి ఆలోచనల్లోంచి బయటపడింది. గట్టిగా నిట్టూర్చి ఉదాసీనమైన గొంతుతో, “మనమేం పాపం చేసామో, మనకి పిల్లలు పుట్టలేదు. నాకొక బిడ్డనిచ్చుంటే ఆ పై వాడికి ఏం పోయేదో? వారసులుంటే ఈ ముసలితనంలో వాళ్ళతో హాయిగా గడిపేవాళ్ళం కదా….” అంటూ వాపోయింది.
“వారసులా, వాళ్ళతో సుఖమా?” అంటూ చిన్నగా నవ్వాడు బిషన్ సింగ్.
ఆమె తల తిప్పి ఆయనకేసి చూసింది. ఆ నవ్యు వెనక ఉన్న బాధని గుర్తించడానికి ప్రయత్నించింది. బిషన్ సింగ్ తన రెండు చేతుల మధ్య టీ గ్లాసుని ఉంచుకున్నాడు. టీ గ్లాసునుంచి బయటకొస్తున్న ఆవిరినే చూస్తూండిపోయాడు.
“సంతానం వల్ల సుఖమేముంది సుఖవంతీ? పిల్లలున్న వాళ్ళు ఏడుస్తునే ఉన్నారు. మన చరణ్‌నే చూడు. ముగ్గురు కొడుకులుండి కూడ నరకం అనుభవిస్తున్నాడు. కొడుకులు ఆస్తిలో వాటాలు పంచుకుని విడిపోయారు. ముసలి తల్లిదండ్రులను పట్టించుకునే వారే లేరు” అని చెప్పి మళ్ళీ టీ గ్లాసుకేసి చూడసాగాడు.
కాసేపయ్యాక, మళ్ళీ ఆయనే మాట్లాడుతూ,..”పరంజీత్ తెలుసుగా, అదే శిందర్ వాళ్ళ నాన్న! పిల్లలుండి కూడ అనాధలా బ్రతుకుతున్నాడు. ఓ రొట్టి ముక్క కూడ దొరకడం లేదు. పిల్లలు లేనంత కాలం నాకు వారసులు లేరని గోల పెడతారు. పిల్లలు ఇలా తయారైతే పిల్లలు లేకపోయినా బావుండేదని అంటారు. వాడి కొడుకులు ఆస్తంతా వాళ్ళ పేరున రాయించుకుని వీడిని పట్టించుకోడం లేదు. ఇప్పుడు అంటూంటాడు – ఆస్తి నా చేతిలో ఉన్నా బాగుండేది. కనీసం నా సేవలకి ఓ పేద మనిషిని పెట్టుకునేవాడినని……..” అన్నాడు.
ఆమె భర్తకి మరింత దగ్గరగా జరిగి, “కానీ అందరు పిల్లలు అలా ఉండరు కదండీ అంది. ఆమె స్వరం నూతిలోంచి వచ్చినట్లుగా బలహీనంగా వినబడింది. టీ గ్లాసులెపుడో ఖాళీ ఆయ్యాయి. సుఖవంతి తన గ్లాసు, భర్త గ్లాసు తీసి మంచం కింద పెట్టింది. చెదిరిన రగ్గుని సరిచేసుకుని ఇద్దరు మళ్ళీ దగ్గరగా జరిగి కూర్చున్నారు.
“జిందర్ మనల్ని మోసం చేసాడు. లేకపోతే….” అంటూ తన మాటలని మధ్యలోనే ఆపేసింది సుఖవంతి.
“వాడి మాటెత్తకు. వాడు నా అన్న కొడుకైనా నా సొంత కొడుకులా భావించాను. అన్న పేదరికం కారణంగా పిల్లలని సరిగా చూసుకోలేక పోతుంటే, కనీసం జిందర్‌నైనా చదివించి ప్రయోజకుడిని చేయాలనుకున్నాను. కానీ….” అంటూ బిషన్ సింగ్ ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయాడు.
“మనింటికి వచ్చినప్పుడు వాడికి పది-పదకొండేళ్ళు ఉంటాయేమో. మనకి తెలిసి వాడికి మనమేదీ తక్కువ చేయలేదు. మనకి ఉన్నంతలో మంచి భోజనం పెట్టాం, చక్కటి బట్టలు కుట్టించాం. వాడికి ఏం దురాశ కలిగిందో, ఆ పాడు పని చేసాడు…” సుఖవంతి మాటలలో వేదన వ్యక్తమైంది.
“అంతా వాడిదే కదా, వాడు కాక మనకింకెవరు ఉన్నారు? వాడు నీ నగలపై చెయ్యేసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. కాని అది నా తప్పే అని ఊరుకున్నాను” అంటూ భార్య కుడి చేతిని తన రెండు చేతుల్లోకి తీసుకుని నిమురుతూ, “ఎప్పుడైతే వాడు కొట్లని తన పేరు మీద రాసేయ్యమని అడిగినప్పుడు వాడి దుర్బుద్ధి గ్రహించాను. కాని అది వాడి సొంత ఆలోచన కాదు…” అని అన్నాడు.
“పోన్లెండి. వాడంతట వాడే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు…” అంటూ గట్టిగా నిట్టూర్చింది సుఖవంతి.
“సుఖవంతీ, మనిషి దగ్గర ఏదైతే లేదో దాని గురించి జీవితాంతం ఏడుస్తాడు. ఉన్న వాటికి విలువివ్వడు. మన దగ్గర లేని దాని గురించి మనం ఎందుకు బాధ పడడం? ఉన్నవాటిని ఎందుకు ఆస్వాదించం?” అంటూ భార్యని మరింత దగ్గరికి లాక్కున్నాడు. అలా భర్త హృదయాన్ని హత్తుకుని చాలా సేపు ఉండిపోయిందావిడ. ఆ స్పర్శ తాలూకు వెచ్చదనం ఇద్దరినీ ఏకం చేసింది.
‘ఈ వెచ్చదనం ఉంటే చాలు జీవితంలో ఇంకేమీ అక్కర్లేదు’ అనుకున్నాడు బిషన్ సింగ్. ‘ ఈ వేడి, ఈ వెచ్చదనం కలిగింది ఈయన జ్వరం వల్లా, లేక ఈయన ప్రేమవల్లా’ అని ఆలోచిస్తోంది సుఖవంతి. ‘ఏది ఏమైనా, మా ఇద్దరి మధ్య ఈ వెచ్చదనం ఎప్పటికీ ఉండాల్సిందే’ అని అనుకుందామె.
ఇంతలో ఓ నీరెండ తునక కిటికీలోంచి జారి, గదిలోకి ప్రవేశించింది. గచ్చుమీద ఆ సూర్యకిరణం చిన్న కుందేలు పిల్లలా అటూ ఇటూ కదలసాగింది. తమ ఏకాంతాన్ని ఎవరో మూడో వ్యక్తి పరికించాడా అన్నట్లుగా ఒక్కసారిగా ఉలిక్కిపడి భర్త నుంచి పక్కకి జరిగిందామె. మరుక్షణంలో ఆ సూర్యకిరణాన్ని చూసి ఇద్దరూ హాయిగా నవ్వుకున్నారు.