జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 1

అపి సాగర పర్యంతా విచేతవ్యా వసుంధరా।
దేశోహ్యరత్ని మాత్రోపి నాస్తి దైవజ్ఞ వర్జితః॥

పదిహేడవ శతాబ్దంలో నీలకంఠ దీక్షితులు తన ‘కలి విడంబనం’ లో చెప్పిన శ్లోకమిది. సముద్రపర్యంతమూ ఉన్న ఈ భూమిని మొత్తం శోధించినా, ఈ దేశంలో జ్యోతిష్కుడు లేని భూమి ఒక గుప్పెడు కూడా లేదు అని దాని భావం. ఆ మాట ఈనాడు కూడా అక్షర సత్యం.

జ్యోతిషం నేడు సర్వ వ్యాప్తమైపోయింది. ప్రజాదరణ విపరీతంగా ఉండడంచేత ప్రతీ పత్రికా దినఫలాలో వారఫలాలో ప్రచురించక తప్పనిసరి అయింది. ఇంకా జ్యోతిష్కులతో ప్రశ్న జవాబుల శీర్షిక ఒకటి ఉంటే మరీ మంచిది. ఇంటర్నెట్ వచ్చాకా జ్యోతిషానికి సంబంధించిన సైట్లు ఇబ్బడిముబ్బడిగా వెలిసాయి. శాస్త్రవిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందిన ఈ రోజుల్లోకూడా ఏమిటీ నమ్మకాలు అని పెదవి విరిచేవారు కొందరైతే జ్యోతిషం కూడా సైన్సే అనేవాళ్ళు మరికొందరు. ఏది ఏమైనా జ్యోతిషానికి ఉన్న ఆకర్షణశక్తి అసాధారణమైనది అని ఎవరైనా అంగీకరించక తప్పదు.

అయితే ఇంతకీ అసలు జ్యోతిషం నిజంగానే భవిష్యత్తు చెప్పగలదా? చెప్పగలిగితే ఎలా సాధ్యం? జ్యోతిషం నిజమైతే ఇంతవరకు మనకు తెలిసిన సైన్సు మొత్తం తలకిందులైపోదా? కొంచం ఆలోచనాపరు లెవరికైనా ఇలాంటి ప్రశ్నలు కలగడం సహజం. చాలా రాజకీయ, మత విషయాల్లాగే జ్యోతిషం విషయంలోకూడా ఏదో ఒక పక్షం వహించడమేగానీ నాది మధ్యేవాదం అంటే కష్టం. నీకు జాతకాల మీద నమ్మకం ఉందా లేదా అని ఎవరైనా సూటిగా ప్రశ్నిస్తే ఉంది అనో లేదు అనో చెప్పగలవాళ్ళు ధన్యులు – నా దృష్టిలో. సాధారణంగా నమ్మకం ఉన్నవాళ్ళకి జ్యోతిషం తెలియదు. వాళ్ళు ఎవరో గురువునో జ్యోతిష్కుణ్ణో నమ్ముతారు, అంతే. అయితే తమను తాము జ్యోతిష్కులుగా పరిగణించుకునేవాళ్ళు నమ్ముతారా అనే ప్రశ్నే ఉండదు.

నమ్మకం లేనివాళ్ళు సాధారణంగా హేతువాదులు అయిఉంటారు. మతవిషయాల్ని నమ్మేవాళ్ళుకూడా కొంతమంది జ్యోతిషాన్ని నమ్మకపోవచ్చు. వాళ్ళకు గొప్ప జ్యోతిష్కులెవరూ తారసపడి ఉండకపోవచ్చు. ఏది ఏమైనా వాళ్ళ సంఖ్య స్వల్పమనే చెప్పుకోవచ్చు. హేతువాదుల విషయానికి వస్తే వాళ్ళలో చాలామంది జ్యోతిషాన్ని ఎరిగినవారు కారు. వాళ్ళ అజ్ఞానం జ్యోతిష్కులకి కొంతవరకూ ఒక అస్త్రంలాగా ఉపయోగపడుతుంది. భౌతికశాస్త్ర పితామహుడు న్యూటన్ జ్యోతిషాన్ని (ఇంకా రసవాదమూ మొదలైన చాలా విషయాల్ని) నమ్మేవాడు. ఎవరో ఆయనదగ్గర జ్యోతిషాన్ని విమర్శిస్తే ’సర్, నేను జ్యోతిషాన్ని చదివాను, మీరు చదివారా?’ అని అడిగాడుట. ఇదే ప్రశ్నని జ్యోతిష్కులు దర్పంగా హేతువాదులకి సంధిస్తూ ఉంటారు. 1975లో 186 మంది సైంటిస్టులు (అందులో 18మంది నోబెల్ గ్రహీతలు) జ్యోతిషం అశాస్త్రీయమైనది అని ప్రకటించారు. దానికి ఒక జ్యోతిష్కుడి సమాధానం ఏమిటో తెలుసునా? ’అవునుట. నిర్ణయించారుట. అయితే వాళ్ళెవరూ జ్యోతిషం తెలిసినవాళ్ళు కారుట. వాళ్ళు నోబెల్ బహుమతి పుచ్చుకున్నది జ్యోతిషంలో కాదు. పూర్వం ఒక క్షురకుడు గెడ్డం పెంచుతున్న సాధువుని చూసి వీడు దుష్టుడు అని నిర్ణయించాడుట.’

అయితే అంత ఆత్మవిశ్వాసంతోనూ సమాధానం చెప్పిన ఆ జ్యోతిష్కుడికి తెలియని విషయం ఏమిటంటే మొదట త్రికరణ శుధ్ధిగా జ్యోతిషాన్ని నమ్మి అధ్యయనం చేసి, తరవాత అది అంతా తప్పు అని గ్రహించిన శాస్త్రజ్ఞులు ఉన్నారు. ఇటీవల జ్యోతిషం మీద పరిశోధనలు చేసిన జాఫ్రీ డీన్ ఆకోవలోనివాడే. ఇదే మాటని ఆ జ్యోతిష్కుడికి చెప్పాను అనుకోండి, నా ఊహ ప్రకారం ఆయన ఏమంటాడంటే, జాఫ్రీ డీన్ కి గానీ, లేదా అదే పద్ధతిలో జ్యోతిషం తెలుసుకుని పరిశోధిస్తున్న వాళ్ళెవరికైనా గానీ నిజంగా జ్యోతిషం తెలియదనీ, లేదా వాళ్ళకి తెలిసిన జ్యోతిషమో లేదా ఎంచుకున్న పరిశోధనాంశమో తప్పు అనీ అంటాడు. మరి ఇందులో నిజానిజాలేమిటో సామాన్యులకెలా తెలుస్తాయి? అందుకే ఏదో ఒక పక్షం వహించినవాళ్ళు ధన్యులు అన్నాను. అంటే నేను దురదృష్టవశాత్తూ ఏ పక్షమూ వహించలేక పోతున్నాను అని అర్ధం.

అదెల్లా కుదుర్తుంది అంటారేమో? మరి నా అనుభవాలు అల్లాంటివి. గోడమీది పిల్లి అనండి, రెంటికీ చెడ్డ రేవడనండి. నిజం తెలుసుకోవడానికి నేను పడ్డ బాధ మాత్రం వర్ణనాతీతం. ఎవళ్ళైనా వచ్చేసి, అబ్బాయీ ఇదే నిజం నాయనా అని చెప్పేస్తే నాక్కూడా ఎంతో బాగుణ్ణు (నేనడిగే ప్రశ్నలకి కూడా సమాధానాలు చెప్పాలండోయ్). అది అంత తేలిగ్గా జరిగే అవకాశం లేదు కాబట్టే నా ప్రశ్నలూ, అనుమానాలూ, అనుభవాలూ, నమ్మకాలూ, నేను పరిశీలించిన విషయాలూ మీముందు పెడుతున్నా. ఏదో ఒక పక్షంవైపు మిమ్మల్ని లాగేద్దామన్నది నా ఉద్దేశ్యం కాదు. రెండు పక్షాలవాళ్ళకీ కొన్ని నచ్చేవీ, కొన్ని నచ్చనివీ ఇందులో కనిపిస్తాయి. అంతేగాక జ్యోతిషానికి సంబంధించిన కొన్ని లోతైన విషయాలు పరిచయమౌతాయి.

ఒక విచిత్ర వ్యక్తి

అప్పటికింకా నా వయసు పదహారే. అప్పటికే ఒక ఏడాదినుంచీ జ్యోతిషంతో ప్రేమలో పడి కొట్టుకుంటున్నా. ఒక ప్రముఖ జ్యోతిష్కుడి దగ్గర సహాయకుడిగా చేరాను. ఆయనే ఈ విచిత్ర వ్యక్తి. లోకజ్ఞానం ఏమాత్రం లేని బిడియస్తుడైన అమాయకపు కుర్రవాడిగా ఆయన దగ్గర చేరాను. ఒక రెండు నెలలు ఏమైనా శాస్త్రం నేర్చుకుందామని ఓపికగా ప్రయత్నించాను. ఏమాట కామాటే చెప్పాలి. ఆయన నన్ను చాలా ప్రేమగా చూశాడు. నాకు కాస్త ’లౌక్యం’ నేర్పి ప్రయోజకుణ్ణి చేద్దాము అనుకున్నాడు. తొలిప్రేమలో పడ్డ ప్రేమికుడిలాగా నాకేమో జ్యోతిషం తప్ప మరే ధ్యాసా లేదాయె. ఆయన కిటుకులు నాకెల్లా వంటబడతాయి?

ఆయనకు గొప్ప నాడీ శాస్త్రజ్ఞుడని పేరు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు – అంటే రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, ప్రభుత్వ, పోలీసు అధికారులు, సినిమావాళ్ళు – ఆయన దగ్గరకి వస్తుండేవాళ్ళు. ఆయన చాలాగొప్ప మాటకారి. ఆంగికమూ, వాచికమూ చూస్తే జనాలు హడ్డిలిపోయేలా ఉండేది. సాక్షాత్తూ తానే దైవ స్వరూపమా అన్నట్టుగా ఉండేదా తీరు. మాటల్లో కాఠిన్యం, లెక్కలేనితనం, ఆత్మవిశ్వాసం, ఒక సాధికారత ధ్వనించేది. నావంటి భయస్తులు మరీ భయభ్రాంతులై పోయేట్టు ఉండేది. ఒక జాతకుడొచ్చాడంటే నీ పుట్టుపూర్వోత్తరాలు నాకు తెలుసు అనేవిధంగా మాట్లాడేవాడు. ఒక్కోసారి ’ఇలా చెయ్, లేకపోతే పతనమైపోతావ్, మృత్యుముఖంలోకి పోతావ్’ అనేవాడు. ధారాళంగా, మంచినీళ్ళ ప్రవాహంలాగా శ్లోకాలేవో చదివేవాడు.

అయితే క్రమంగా నేను కొన్ని విషయాల్ని గ్రహించాను. కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయన చెప్పే విషయాలు నిజమే అయినా, ఆయన చెప్పే విషయాలకీ జ్యోతిషానికీ పెద్దగా సంబంధం లేదని అనిపించసాగింది. ఆయన దగ్గర నాపని ఏమిటంటే జనాలు వచ్చినప్పుడు వాళ్ళ వివరాలు తీసుకుని జాతకచక్రమూ, దశలూ వగైరా గుణించి నా దగ్గర పెట్టుకోవడం. ఆయా వ్యక్తులకి జాతకం చెప్పే వంతు వచ్చినప్పుడు ఆయన చేతికి వాళ్ళ జాతకం ఇవ్వడం. ఒకసారి పొరపాటున నా లెక్క తప్పింది. జాతకం తప్పుగా గుణించి ఇచ్చాను. ఎవరూ గ్రహించలేదు. అయినా ఫలితాలుమాత్రం ఎప్పటిలాగానే దిమ్మతిరిగేట్టు చెప్పాడు. అంతా అయ్యాకా నా తప్పు గ్రహించాను, ఎవరికీ చెప్పలేదు కానీ చాలా ఆశ్చర్యం వేసింది. తరవాత మళ్ళీ అలాగే కొన్నిసార్లు కావాలనే తప్పుగా వేసి ఇచ్చాను. ఏమీ తేడా రాలేదు. మనసంతా గందరగోళం.

మరో ఆసక్తికరమైన విషయం. జ్యోతిషం లాగే సంస్కృత భాష అన్నాకూడా నాకు చాలా ఆసక్తి. అందులోకూడా అప్పటికే కొంత జ్ఞానం సంపాదించాను. సరళమైన శ్లోకాలూ, వచనమూ అర్ధమౌతాయి. దురదృష్టవశాత్తూ మా గురువుగారికి సంస్కృత జ్ఞానం పూజ్యం. మరి ధారాళంగా శ్లోకాలు ఎల్లా చదివేవాడంటారా? ఆయన దగ్గర చేరిన కొద్దిరోజుల్లోనే కనిపెట్టాను ఆయన వల్లించేది సంస్కృతం కాదని. ఎవరైనా అడిగితే ఆయనే చెప్పేవాడు, ఇది సంస్కృతంకాదు, అంతకన్నా పూర్వమైన ఒకానొక దేవభాష అని. నాడీ గ్రంథాలు, జీవుల జాతకాలు ఆ భాషలోనే వ్రాసి ఉన్నాయిట. అవి అన్నీ ఆయన తన బుర్రలోనే నిక్షిప్తం చేసుకున్నాడుట. అయితే అసలు విషయం క్రమంగా నాకు బోధ పడింది. దేవభాషాలేదు, మరోటీ లేదు. అది కేవలం జిబ్బరిష్. సంస్కృతంలాగా ధ్వనించేట్టు శ్లోకాల నడకలాగా సాగదీస్తూ ఏదో జిబ్బరిష్ అనేవాడు. అలా కల్పించి మాట్లాడడం కొద్దిగా సాధన చేస్తే ఎవరైనా అలవర్చుకోవచ్చు. ఉదాహరణకు:

ఆస్తం పేయం తదిం చ ద్వం విద్వానేవశ్చ మతి స్తథా,
జ్యోతిర్విషయం హస్త లిఖితం నైవ తస్య కలేరిమా ||

దీనికి ఎన్ని విధాలైన అర్థాలైనా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది నిజంగా సంస్కృతం కాదు కాబట్టి. నేరెళ్ళ వేణుమాధవ్ గారు మిమిక్రీ చేస్తూ తమిళం మాట్లాడేవాడు. అందులో ఒక్క ముక్క తమిళం ఉండదు. అలాగే ఇదీను. కానీ మరి అలా శ్లోకాల మీద శ్లోకాలు చదివి సాధికారంగా అర్థాలు చెపుతూ ఉంటే దిమ్మ తిరిగిపోదూ? జనాలు మూర్ఛపోయేవారు. ఇవే శ్లోకాల్లో ఆంగ్ల పదాలు చొప్పించేవాడు. గుండె జబ్బుకి సంబంధించిన పదాన్ని ఇటువంటి శ్లోకంలో చొప్పించి అదిగో ఋషులు ఎప్పుడో రాసిపెట్టారు జబ్బుకి ఇంగ్లీషు పేరుతో సహా అంటే జనాలు కింద పడిపోరూ? అయితే సాధ్యమైనంత వరకు తన మాటలు, ఇటువంటి శ్లోకాలూ ఎప్పుడూ రికార్డు కాకుండా జాగ్రత్త పడేవాడు. అది నేను గమనించాను. అలా రికార్డు చెయ్యడం నిషేధం అని చెప్పేవాడు. అలాగే ఎప్పుడైనా శిష్యులకి సంస్కృతంలో ఉండే ఉపాసనా పద్ధతుల్లాంటివి పుస్తకంచూసి చెప్పాలంటే, నేను పక్కన ఉండగా చెప్పేవాడుకాదు. తప్పులు దొర్లేవి, అందుకు. తెలివిగా తనకేదో పని ఉన్నట్టు లోపలికి వెళ్ళిపోతూ, పుస్తకం నాకిచ్చి నన్ను డిక్టేట్ చెయ్యమనేవాడు.

ఎప్పుడైనా కొంతమంది నాడీగ్రంథం చదవమని వచ్చేవారు. నాడీగ్రంథమంటే – పూర్వకాలంలో ఋషులు చాలామంది జీవుల జాతకాలూ, పూర్వజన్మల వివరాలూ అన్నీ తాళపత్రాల్లో రాసిపెట్టారనీ, ఆ గ్రంథాల్లో మొత్తం మనకు సంబంధించిన సూక్ష్మ వివరాలతో సహా అన్నీ బయట పడతాయనీ ఒక సాంప్రదాయం. ఆయన దగ్గర ఒక పెద్ద పెట్టెలో తాళపత్ర గ్రంథాలు ఉండేవి. ఎదురుగుండా ఒక తాళపత్ర గ్రంథం పెట్టుకుని వచ్చినవాళ్ళ జాతకం చూసి ఏదో లెక్కవేసి ఒక్కో పత్రం తిప్పుతూ ఇందాకా చెప్పిన శ్లోకాల్లాంటివి చదువుతూ వాటికి తన ఇష్టం వచ్చిన అర్ధాలు చెప్పేవాడు. ఉదాహరణకి ఒక పోలీసాయనకి నువ్వు పూర్వజన్మలో తాటిచెట్టు ఎక్కి కల్లు తీసేవాడివి అనీ, ఏదో పుణ్యం చేసి ఈ జన్మలో ఇల్లా పుట్టావు అనీ, ఈ జన్మలో అద్వానీ పార్టీలో చేరి పైకొస్తావనీ చెప్పాడు. (నాకు తెలిసి ఆ పోలీసాయన ఇంతవరకు అద్వానీ పార్టీలో చేరలేదు). ఒకసారి తాళపత్రం పక్కనపెట్టి ఆయన లోపలకు వెళ్ళగా, నేను అందులోకి తొంగిచూశాను. ఆ తాళపత్రంలో ఉన్నది నమకం, చమకం. నాడీ గ్రంథం కాదు.

ఇలాంటి అనుభవాలు అన్నీ చాలా నిరాశనీ, గందరగోళాన్నీ కలిగించాయి. ఎంతో ఆశతో జ్యోతిషం నేర్చుకుందాము అని వెడితే, ఏమీ దొరికేట్టు లేదు. ఆ నిరాశతోనే వెళ్ళడం మానేశాను. ఎవరో ఆత్మీయుల దగ్గర తప్ప ఈ విషయాలు ఏమీ చెప్పలేదు. కానీ జ్యోతిషం మీద ఆసక్తి మాత్రం చచ్చిపోలేదు. జ్యోతిషానికి సంబంధించిన కొన్ని పునాదులవంటి మూలసూత్రాలు తెలిస్తే, ఆశ చావక పోవడంలో ఆశ్చర్యం అనిపించదు. మంచి చెడ్డలు రాశులు పోసినట్టు ఉండనట్టే జ్యోతిష సూత్రాలు అన్నీ విస్పష్టంగా నలుపు, తెలుపు రంగుల్లో గీసినట్టు ఉండవు. అవి చాలా అలోచింప జేస్తాయి. చాలా ఆకర్షణీయమైన సిద్ధాంతాలుగా ఉంటాయి. వాటిని గురించి స్థూలంగా తరువాతి అంశంలో వివరిస్తాను.

ఏది ఏమైనా ఈ విచిత్ర వ్యక్తి అనుభవం చాలా పాఠాలు నేర్పింది. అనేక ప్రశ్నల్ని కూడా మిగిల్చింది. ఆయన కేవలమూ మోసగాడే అయితే కొన్నిసార్లు ఆశ్చర్యం కలిగించే విధంగా ఫలితాలు ఎలా చెప్పాడు? తనకు అస్సలు పరిచయం లేని వ్యక్తులకు కూడా ఆయన జాతకాలు చెప్పగా కొన్ని ఫలితాలు నిజమవ్వడం, వాళ్ళు సంతృప్తి చెందడం నేనెరుగుదును. ఏమీ విషయం లేని అటువంటి వ్యక్తి వెంట బెల్లం చుట్టూ ఈగలు చేరినట్టు మనుషులు ఎందుకు పడుతున్నారు? ఆయన ఎంతకాలం అల్లా నెట్టుకురాగలడు? ఎవరికో ఒకరికి విషయం తెలియకుండా ఉంటుందా? తెలిస్తే ఇంత కాలం వచ్చిన పేరుప్రతిష్టలు దెబ్బతినిపోవా? ఆయనకా భయం లేదా? ఇలా చేయడంలో ఆయన ఉద్దేశ్యం ఏమిటి? కేవలం డబ్బు సంపాదనేనా? మరి ఆయన ఉచితంగానే జాతకాలు చెప్తాడనికదా పేరు? అనేక సంవత్సరాలు ఈ ప్రశ్నలు వేధించినా, మెల్లమెల్లగా కలిగిన లోకజ్ఞానమూ, చక్కటి సైన్సు పుస్తకాలు చాలామటుకు సమాధానాల్ని ఇచ్చాయి. అవి ముందు ముందు వివరిస్తాను.

జ్యోతిషం పునాదులు

విచిత్రవ్యక్తి అనుభవాన్ని గురించి విన్నవాళ్ళు జ్యోతిష్కులంతా మోసగాళ్ళు అనే అభిప్రాయానికి రావడం తేలిక. కానీ అందరూ మోసగాళ్ళే అనడం అంత సులభమైన విషయం కాదు. జ్యోతిషంలో ఏ పట్టూ లేకపోతే ఇంతకాలం బహుళ ప్రాచుర్యంలో నిలబడ గలగడం, అనేకమంది అధ్యయనం చేసి జ్యోతిష్కులుగా సఫలమవ్వడం సాధ్యంకాదు. మరి నిజంగానే జ్యోతిషంలో ఖచ్చితంగా భవిష్యత్తు చెప్పగల ’సత్తా’ ఉందా? ఒక సైన్సుగా అది పరిశీలనకి నిలబడగలదా? ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోవాలంటే మొదట జ్యోతిషం అసలు ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి.

గ్రహాలూ – రాశిచక్రం – నక్షత్రాలు – భావాలు

జ్యోతిశ్శాస్త్రంలో ప్రాథమికమైన అవగాహన ఏమిటంటే గ్రహగతులు మానవజీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఇందులో సూర్యుడు, చంద్రుడు కూడా గ్రహాలుగానే పరిగణించబడతాయి. భూమిని కేంద్రంగా, దాని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నట్టుగా ఊహించుకుని భూమికి సాపేక్షంగా ఆయా గ్రహాల స్థితినీ గమనాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. అదేమిటి, ఈరోజుల్లో చిన్నపిల్లలికి కూడా భూమి కేంద్రం కాదనీ, సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతోందనీ తెలుసుగా అంటారేమో? జ్యోతిషం గురించి అస్సలు తెలియనివాళ్ళే జ్యోతిషం తప్పు అనడానికి ఈ విషయాన్ని లేవనెత్తుతారు.

జ్యోతిషం భూమిచుట్టూ సూర్యుడూ, గ్రహాలూ తిరుగుతున్నాయి అని చెప్పదు. భూమి మీద నుంచి చూస్తే గ్రహాలు ఎక్కెడెక్కడున్నాయో నాకు కావాలి అంటుంది. మరి భూమినుంచి చూసినప్పుడు గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో గణించాలంటే భూమిచుట్టూ సూర్యుడూ, గ్రహాలూ తిరుగుతున్నట్టుగానే ఊహించుకోవాలి. అంతేతప్ప నిజంగా గ్రహాలు భూమిచుట్టూ తిరుగుతున్నాయా లేక సూర్యుడిచుట్టూ తిరుగుతున్నాయా అనేది జ్యోతిషానికి అనవసరం. అయితే ఇక్కడో చిక్కుంది. గ్రహగతులు కట్టడానికి ఖగోళసూత్రాలు ఉపయోగిస్తారు. ఖగోళశాస్త్రం సూర్యుడే కేంద్రమని చెప్తుంది. పాతకాలంలోలాగా భూమికేంద్రంగా చేసుకుని ఖగోళసూత్రాలు నిర్మించుకుంటే లెక్కలు తప్పుతాయి. అందుచేత ఆధునిక జ్యోతిషం నిర్మొహమాటంగా ఆధునిక ఖగోళశాస్త్రం ప్రకారం లెక్కగట్టిన గ్రహస్థితుల మీదే ఆధారపడుతుంది. వీటినే భూకేంద్రంగాగల గ్రహ స్థితులు (జియోసెంట్రిక్ ప్లానెటరీ పొసిషన్స్ ) అంటారు.

ఇక సూర్యుడు, చంద్రుడు, రాహు, కేతువులు గ్రహాలు కావు కదా అని మరొక విమర్శ. గ్రాహయతీతి గ్రహ: – అంటే ప్రభావం చూపేది గ్రహము అని. జ్యోతిషంప్రకారం సూర్య చంద్రాదులకు మనమీద ప్రభావం ఉన్నది కాబట్టి వాటినికూడా జ్యోతిషం గ్రహాలుగానే వ్యవహరిస్తుంది. ఇక రాశి చక్రమంటే ఏమిటో చూద్దాం.

భూమధ్యరేఖను ఆకాశం మీదకి పొడిగించండి. గ్రహాలన్నీ ఈ రేఖకి కొంచం అటూ ఇటూలో తిరుగుతూ కనిపిస్తాయి. ఆ కొంచం ఒక ౮ డిగ్రీలు పైకీ ఒక ౮ కిందకీ ఉంటుంది. ఈ పదహారు డిగ్రీలు కలిపి ఈ రేఖని ఒక పటకా (బెల్టు) లాగా ఊహించుకోవాలి. అది సూర్య చంద్రాదులతో సహా, ఆకాశంలో గ్రహాలన్నీ తిరిగే మార్గం (బాట లాంటిది). అదే రాశి చక్రం.

ఈ రాశిచక్రాన్ని పన్నెండు భాగాలు చేసి వాటిని రాశులు అని పిలిచారు. మేషము, వృషభము మొదలైనవి. సూర్యుడు ఒక్కొక్క రాశిలోనూ ఒక నెల రోజులు ఉంటాడు. ఇదే రాశి చక్రాన్ని ౨౭ భాగాలు చేసి ఆ భాగాల్ని నక్షత్రాలు అన్నారు.

ఇక భావాలు అంటే ఏమిటో వివరిస్తాను. ఈ రాశిచక్రమూ, సూర్య చంద్రులూ, ఇతరగ్రహాలూ రోజూ ఉదయిస్తూ ఉంటాయి, అస్తమిస్తూ ఉంటాయి. ప్రతీ క్షణమూ రాశిచక్రంలో ఏదో ఒక బిందువు తూర్పున ఉదయిస్తూనే ఉంటుంది. అదే క్షణంలో పడమటి దిక్కున సరిగ్గా దానికి ఎదురుగా (౧౮౦ డిగ్రీలు ఎదురుగా) ఉండే బిందువు అస్తమిస్తూ ఉంటుంది. అదే క్షణంలో నడినెత్తిన మరొక బిందువు ఉంటుంది. అలాగే దానికి ఎదురుగా మన కాళ్ళకింద పాతాళంలో (భూమికి అడుగున) మరొక బిందువు ఉంటుంది. ఈ బిందువులు జ్యోతిషంలో చాలా ముఖ్యమైనవి.

ఇప్పుడు తూర్పున ఉదయించే బిందువుకీ నడినెత్తిన ఉన్న బిందువుకీ మధ్య ఉన్న ఆకాశపు భాగాన్ని మూడు సమాన భాగాలు చెయ్యండి. అలాగే మిగతా మూడు బిందువులకీ మధ్యనున్న భాగాల్ని మూడేసి సమాన భాగాలు చేస్తే మొత్తం పన్నెండు భాగాలు అవుతాయి. వీటినే భావములు లేక ఇళ్ళు అంటారు.

తూర్పున ఉదయించే బిందువు ఉన్న భాగాన్ని లగ్నము అంటారు. అక్కడినుంచి పడమటివైపుకి వరసగా వెనక్కి లెక్క పెట్టుకుంటూ పోవాలి. లగ్నం పైన పన్నెండో ఇల్లు (లేక భావము), ఆపైన పదకొండు, ఆపైన నడినెత్తి మీదకి వచ్చేస్తాము. నడినెత్తిమీద ఉన్న భావాన్ని దశమము (లేక పదో ఇల్లు) అంటారు. అక్కడినుంచి పడమటికి దిగుతుంటే తొమ్మిది, ఎనిమిది ఇళ్ళు వచ్చేస్తాయి. సరిగ్గా పడమటన అస్తమిస్తున్న బిందువు కలిగిన ఇల్లు ఏడవ ఇల్లు (లేక సప్తమ భావం). ఇంకా కిందకి దిగిపోతే ఆరో ఇల్లు, ఐదో ఇల్లు, నాలుగో ఇల్లు వస్తాయి. నాలుగో ఇల్లు అట్టడుగు స్థానం. దానితరవాత మూడు, రెండు వచ్చి మళ్ళా తూర్పున లగ్నం (లేక ఒకటోఇల్లు) లోకి వచ్చేస్తాము.

ఇవండీ మొత్తం జ్యోతిషానికి కావలసిన ముడిసరుకు.

జ్యోతిషం – సంకేతాల శాస్త్రం

ఈ పైన చెప్పిన ముడిసరుకులోవన్నీ సంకేతాలుగా అర్ధం చేసుకోవాలి. ఒక్కో సంకేతానికీ ఒక్కో స్వభావం ఉంటుంది. అది ఈ ప్రపంచకంలో అనేక విషయాల్ని సూచిస్తుంది. ఆ సూచించే విషయాల్ని కారకత్వాలు అంటారు. జ్యోతిషంలో ప్రధానభాగం ఈ సంకేతాల్ని బాగా అవగాహన చేసుకోవడమే. ఒక ఉదాహరణ: సూర్యుడంటే రాజు, లేదా ఇంట్లో తండ్రి. చంద్రుడు తల్లి. గురుడు గురువుగారు. శుక్రుడు భార్య. ఇలాగ. ఈ కారకత్వాలు అనంతం. సూర్యుడు అధికారాన్ని సూచిస్తే, చంద్రుడు ఇల్లూ, ఇంట్లో జీవితాన్ని సూచిస్తాడు. బుధుడు చదువూ, తెలివీ, రాతకోతలూ వగైరా. శుక్రుడు సుఖాలు, కళలు. గురుడు మత విషయాలు, మంచితనము, పెద్దరికమూ, గుళ్ళూ గోపురాలు మొదలైనవి. శని శ్రమని, దురదృష్టాన్నీ, అనారోగ్యాన్నీ, దారిద్ర్యమూ, కష్టాలూ మొదలైనవాటిని సూచిస్తాడు. ఇక కుజుడు శతృవులూ, గొడవలూ, యుద్ధాలూ, దురుసుతనమూ మొదలైనవాటికి అధిపతి.

ఇహ రాశులు. రాశుల్లో మళ్ళీ చర, స్థిర, ద్విస్వభావ రాశులనీ, అగ్ని, భూ, వాయు, జల తత్త్వపు రాశులనీ వర్గీకరణలు ఉన్నాయి. ఈ వర్గీకరణలు ఆయా రాశి స్వభావాలని నిర్ణయిస్తాయి. ఒక్కో రాశీ సమాజంలోనూ, ప్రకృతిలోనూ ఒక్కో తరహా పరిస్థితిని సూచిస్తుంది. మేషం ప్రభుత్వ వ్యవహారాలూ, అధికారులతో వ్యవహారాలూ మొదలైనవి సూచిస్తే, వృషభం ఇల్లూ, పొలాలు, తోటలు మొదలైనవి సమకూర్చుకోవడం, విలాసాలు, కళాత్మకమైన వ్యవహారాలూ సూచిస్తుంది. ఇలా అన్ని రాశుల స్వభావాలూ తెలుసుకోవాలి.

ఒక్కో రాశి లక్షణానికీ ఒక్కో గ్రహం లక్షణానికీ దగ్గరి సంబంధం ఉంటుంది. అలాంటి సజాతి గ్రహాన్ని ఆ రాశికి అధిపతి అంటారు. అలాగే కొన్ని గ్రహాలు కొన్ని రాశుల్లో బాగా రాణిస్తాయిట. వాటిని ఆయా రాశుల్లో ఉచ్ఛ అంటారు. కొన్ని గ్రహాలకీ రాశులకీ విరుధ్ధ స్వభావాలు ఉంటాయి. అవి శతృరాశులు లేదా నీచరాశులు అవుతాయి.

భావాలు మన జీవితంలోని వివిధ భాగాల్ని సూచిస్తాయి. లగ్నము దేహాన్నీ, ఆరోగ్యాన్నీ, పెంపకాన్నీ, స్వభావాన్నీ సూచిస్తే, రెండో ఇల్లు ఆస్తిపాస్తులు, డబ్బు సంపాదించడం, కూడబెట్టడాన్ని సూచిస్తుంది. పదో ఇల్లు ఉద్యోగాన్ని, సమాజంలో స్థానమూ, పేరు ప్రతిష్ఠల్ని సూచిస్తే, ఏడో ఇల్లు పెళ్ళినీ, ఇల్లాలినీ, వ్యాపారంలో భాగస్వాముల్నీ సూచిస్తుంది.

ఇప్పుడు జ్యోతిష్కుడు చెయ్యాల్సింది ఏమిటంటే ఈ సంకేతాల్ని బాగా జీర్ణించుకుని ఏ గ్రహం ఏ రాశిలో, ఏ భావంలో ఉందో చూసి ఆయా సంకేతాల్ని సమన్వయించి ఫలితాలు చెప్పాలి. ఉదాహరణ: ఒక జాతకుడికి చక్రం వేశాము. అందులో జాతకుడు పుట్టిన సమయంలో గ్రహాలు ఏ ఏ రాశుల్లో ఉన్నాయి, ఏ ఏ భావాల్లో ఉన్నాయో తెలుస్తుంది. పదో ఇల్లు మేషం. ఇంకనేం. గవర్నమెంటు ఉద్యోగం ఖాయం. అందులో గురుడున్నాడండీ. అబ్బో, చాలా పైకి వస్తాడు. పేరు, పలుకుబడీ సంపాదిస్తాడు. గొప్ప గౌరవం. అయ్యో, ఆ గురువుని శని చూస్తున్నాడండీ. (ఒక గ్రహాన్ని మరొక గ్రహం చూడ్డం అంటే ఆయా గ్రహాల మధ్య ఎన్ని రాశుల దూరం ఉందో దాన్నిబట్టి వాటిమధ్య ఏర్పడే సంబంధం.) పైకి వస్తాడు కానీండి, ఎప్పుడూ కష్టాలే. ముఖ్యంగా కింద పనిచేసేవాళ్ళవల్ల చాలా ఇబ్బందులండీ. అదీ, జాతకం చెప్పడం అంటే.

జ్యోతిషం పని చేస్తుందా?

జ్యోతిషం ఎలా పని చేస్తుందో (లేదా జ్యోతిష్కులు ఎలా పని చేయిస్తారో) తెలుసుకున్నాం. జ్యోతిషంలో ఎవరైనా ఆశించేది ఖచ్చితంగా భవిష్యత్తు చెప్పగలగడం. 2 + 2 = 4 అన్నంత ఖచ్చితంగా జ్యోతిషం ద్వారా మనకి భవిష్యత్తు తెలిసి ఉంటే అసలీ ప్రపంచం ఇల్లా ఉండేది కాదు. ఒక్కసారి ఆలోచించి చూడండి. జ్యోతిషం ద్వారా ఖచ్చితంగా భవిష్యత్తు తెలిస్తే చరిత్రలో అనేక తప్పిదాలు జరిగి ఉండేవి కావేమో? యుద్ధాలు, ప్రమాదాలు నివారించబడేవేమో? వార్తల చివర్లో వాతావరణాన్ని సూచించినట్టుగానే జ్యోతిషంతో సహాయంతో భవిష్యత్తుని సూచించేవారేమో?

చాలామంది జ్యోతిష్కులు భవిష్యత్తు నిజంగానే తెలుస్తుందని అంటారు. అయితే అలా భవిష్యత్తు చెప్పకూడదనో, పార్వతీ దేవి శాపం ఉంది కాబట్టి భవిష్యత్తుని ఖచ్చితంగా తెలుసుకోలేమనో కొందరు అంటారు. చాలా ప్రసిద్ధమైన అస్ట్రలాజికల్ మాగజైన్ మొదటిపేజీలో ఇల్లా రాసి ఉంటుంది.

ఫలాని గ్రహచారేణ సూచయంతి మనీషిణ:
కోవక్తా తారతమ్యస్య తమేకం వేధసం వినా ||

గ్రహచారాన్ని బట్టి ఫలితాలు ఈ విధంగా ఉండవచ్చు అని పండితులు సూచిస్తారు. కానీ ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది అని ఎవరు చెప్పగలరు, ఆ బ్రహ్మదేముడు తప్ప అని ఆ శ్లోకానికి భావం. దీనిని చాలామంది మితవాద (మోడరేట్) జ్యోతిష్కుల అభిప్రాయంగా స్వీకరించవచ్చు. అంటే జ్యోతిషం ద్వారా సూచనగా భవిష్యత్తు తెలిసే అవకాశం ఉండవచ్చు, కానీ ఖచ్చితంగా ఫలితాలు చెప్పలేము అని.

కానీ జ్యోతిష్కుల్లో ఎక్కువమంది అతివాదులు (కొంచం ఆత్మ విశ్వాసం ఎక్కువగలవాళ్ళు) ఉంటారు. నా దృష్టిలో వీళ్ళ సంఖ్యే మితవాదులకన్నా అధికం. వీళ్ళప్రకారం భవిష్యత్తు ఖచ్చితంగా తెలుస్తుంది. తప్పంతా జ్యోతిషాన్ని నమ్మని లేదా పట్టించుకోని ప్రజలదీ, ప్రభుత్వాలదీ, సైంటిస్టులదే తప్ప జ్యోతిష్కులది కాదు. వీళ్ళ ప్రకారం జ్యోతిష్కులు అనేక ప్రమాదాల్ని ముందుగానే చెప్పారు. గాంధీగారు హత్య చెయ్యబడతారనీ, రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లరు ఆత్మహత్య చేసుకుంటాడనీ, ఇందిరా గాంధీ హత్య చెయ్యబడుతుందనీ, డయానా ప్రమాదంలో మరణిస్తుందనీ, సెప్టెంబరు ౧౧ దాడి జరుగుతుందనీ, ఫలానావాడు ప్రధానమంత్రో దేశాధ్యక్షుడో అవుతాడనీ, ఫలానా ప్రభుత్వం ఫలానా తేదీన పడిపోతుందని ముందే చెప్పామనీ ఇలా ఈ జాబితాకి అంతు ఉండదు.

అతివాదులైనా మితవాదులైనా, జ్యోతిష్కులందరి ఏకాభిప్రాయం ఏమిటంటే, జ్యోతిషం పనిచేస్తుంది అని. నిజంగానే పని చేస్తుందా అని సందేహించేవాళ్ళకి వాళ్ళు పైన చెప్పిన ఉదాహరణల్లాంటివి కోకొల్లలుగా చెప్పడమేగాక, ఆఖరిగా ఒక బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తారు. అదేమిటంటే ‘మా అనుభవం ప్రకారం జ్యోతిషం పని చేస్తుంది, కావాలంటే నువ్వే నాదగ్గరో లేక ఫలానా ఆయనదగ్గరో భవిష్యత్తు చెప్పించుకుని పరిశీలించుకో ‘ అని. సందేహవాదులు చాలామంది ప్రతిభావంతులైన జ్యోతిష్కులవద్దకు వెళ్ళి కొంతమటుకు సమాధాన పడడమో లేక జ్యోతిషం తప్పని నిర్ధారించుకోవడమో చేస్తారు. అయితే అది ఒక వ్యక్తిగత అనుభవంగానే మిగిలిపోతుంది తప్ప సార్వజనీనమైన సత్యమైపోదు. సార్వజనీనమైన సత్యంకోసం పరితపించేవాళ్ళ కోసం సైన్సు రంగప్రవేశం చేయాల్సివస్తుంది.

జ్యోతిషం మీద సైన్సు చేసిన కొన్ని పరిశోధనల్ని గురించి ముచ్చటించుకునే ముందు రెండు దృక్కోణాల్లో జ్యోతిషాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. మొదటిది, జ్యోతిషం అంతర్గత వైరుధ్యాల పుట్ట. ఆ వైరుధ్యాల గురించి తెలుసుకుంటే జ్యోతిషం నిజంగా పనిచెయ్యడం అసాధ్యం అనిపిస్తుంది. రెండు, చాలా మందియొక్క వ్యక్తిగతానుభవం దృష్ట్యా జ్యోతిషం కనీసం పాక్షికంగానైనా పని చేస్తుంది, లేదా పని చేస్తున్నట్టు కనిపిస్తుంది. అది ఎలా సాధ్యమో ఆలోచించాలి.
(ఇంకా ఉంది)

ఈ వ్యాసము రాయడంలోనే కాక జ్యోతిషాన్ని అధ్యయనం చెయ్యడానికి అర్ధం చేసుకోడానికి నాకు ఉపయోగపడిన కొన్ని పుస్తకాలు:

  • జ్యోతిష ప్రకాశము (3 భాగాలు): శ్రీ సీహెచ్ ఎస్ ఎన్‌ రాజు
  • A To Z Horoscope Maker & Delineator : Llewellyn George
  • Astrology for All, How to Judge a Nativity, Art of Synthesis, Esoteric Astrology, Progressed Horoscope: all by Alan Leo
  • Manual of Astrology: Sepharial
  • Astrology for Beginners, How to Judge a Horoscope, A Catechism of Astrology, 300 Important Combinations, Notable Horoscopes: all by B.V.Raman
  • Brihat Jataka of Varaha mihira
  • Spiritual Astrology: Ekkirala Krishnamacharya