కథాశిల్పం

(టెక్సాస్‌ సాహిత్య సదస్సు కోసం రాయబడ్డది ఈ వ్యాసం. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్‌ ఇవ్వబడ్డ శ్రీ వల్లంపాటి వెంకట సుబ్బయ్య “కథాశిల్పం” పుస్తకం ఈ వ్యాసానికి మూల ప్రేరణ.)

పాటలు బాగా పాడే వాళ్ళకి సంగీతం రానవసరం లేదు. ఉదాహరణకి, ప్రముఖ సినీ గాయకులైన ఎస్‌. పి.బాలసుబ్రమణ్యం, మాధవపెద్ది సత్యం అసలు శాస్త్రీయ సంగీతం నేర్చుకోనే లేదు. ఇలాంటి వెసులుబాటు కథల విషయంలో లేదు. కథలు బాగా రాయాలనుకొనే రచయితలకు కథాశిల్పం గురించి తప్పకుండా తెలియాలి.

కథ అనేది కల్పనా సాహిత్యం (Fiction). తెలుగులో “కథ” అన్నది మనం పాశ్యాశ్చ్య సాహిత్యం నుంచి ఎరువు తెచ్చుకున్న సాహిత్య ప్రక్రియ. మన పురాణాల్లోనూ, ఇతిహాసాల్లోనూ కథలు చెప్పటమన్న సాంప్రదాయం ఉన్నా, కథ అని ఈనాడు మనం చదువున్నది మనకి పాశ్యాశ్చ్య సాహిత్యం నుంచి వచ్చిందే. తెలుగులో “కథ” గురించి తెలుసుకొనే ముందు, పాశ్యాశ్చ్య కథా సాహిత్యంలో మంచి కథకులుగా గుర్తింపబడ్డ ఓ. హెన్రీ, మపాసా, చెకోవ్‌, హెచ్‌. ఎ. బేట్స్‌, రడ్‌యార్డ్‌ కిప్లింగ్‌ రాసిన కథలు చదవటం వల్ల ” Short Story” అంటే ఏమిటో కొంత అర్ధమవుతుంది.

అలాగే తెలుగులో మొదటి తరం రచయితలుగా ప్రముఖులైన రావి శాస్త్రి, కొడవటిగంటి కుటుంబరావు, కాళీపట్నం రామారావు, మధురాంతకం రాజారాం, బుచ్చిబాబు, శ్రీపాద, చాసో, గోపీచంద్‌, పాలగుమ్మి పద్మరాజు మొదలైన వారి కథలను చదివితే, కధా శిల్పం అన్నది అవగాహనకు వస్తుంది.

“కథ ఎలా చెప్పాలి? ఎవరు చెప్పాలి? పాత్రలను ఎలా మలచాలి? ఎటువంటి నేపథ్యంలో చెప్పాలి? ఎటువంటి కంఠస్వరం ఉపయోగించాలి? ఎల్లాంటి దృష్టికోణంలో చెప్పాలి?” అన్న ప్రశ్నలకి సమాధానమే కథా శిల్పం అంటే! కథా శిల్పం అర్ధం చేసుకోటానికి తేలిక పద్ధతి ఒకటి ఉంది. అది ప్రముఖులు రాసిన కథల్ని మంచి విమర్శకులు చేసే విశ్లేషణ ద్వారా అర్థం చేసుకోటం.

కథలోని కేంద్రబిందువు కథాంశం. కథాంశానికీ, రచయితకూ మధ్య ఉన్న సంబంధం ఉద్దేశ్యం. కథా, కథాంశమూ, ఉద్దేశ్యమూ వస్తువుకు సంబంధించిన అంశాలైతే – కథా సంవిధానం, పాత్రలు, నేపథ్యం, దృష్టికోణం, కంఠస్వరం శిల్పానికి సంబంధించిన అంశాలు.

కథ సంవిధానం

అంటే కథ యొక్క పథకం. కథలోని సంఘటనల మధ్య ఉన్న సంబంధాన్ని – సంవిధానం తెలియజేస్తుంది. ఒక కథలో మహా దుర్మార్గుడైన ఒక విలన్‌ ఉన్నాడనుకొందాం. వాడు చనిపోవటం కథాంశం. వాడు ప్రజల్ని పీడించటం, చనిపోవటం కథ. కానీ, ఈ రెండు సంఘటన మధ్య ఉండవలసిన కార్యకారణ సంబంధం కథా సంవిధానము. ఈ విలన్‌ ఒక బస్సు ప్రమాదంలో చనిపోయాడనుకొందాం! అప్పుడు కథా సంవిధానికి అర్ధం లేకుండా పోతుంది.

పాత్రలు

కథను నడిపించేవారూ, కథా వస్తువును భరించే వారూ, కథాంశాన్ని సూచించే వారూ పాత్రలు. కథలో పాత్ర పోషణ రచయిత “చెప్పటం” పాఠకుడు “తెలుసుకోటం” అన్న సూత్రం మీద జరగదు. కథా రచయిత సంఘటనను “ప్రదర్శిస్తాడు”. పాఠకుడు పాత్రను తన ఊహా శక్తితో అర్ధం చేసుకుంటాడు. పాత్రను గురించి అన్ని విషయాలూ తానే చెప్పే రచయిత చాలా తక్కువ రకం కళాకారుడు మాత్రమే. కథాంశాన్ని పాఠకుల ఊహాశక్తికి వదలి పెట్టని కథ కూడా చాలా తక్కువ రకం కథే! పాత్రపోషణకు, కథా రచయిత పరోక్ష సూచన మీద ఎంత ఎక్కువగా ఆధారపడితే, కథ విలువ అంతగా పెరుగుతుంది. చెకోవ్‌ ఇలా అంటాడు ” పాత్ర మనసు రచయిత వర్ణించకూడదు. అతని మనసులో ఏముందో అతని చర్యల ద్వారా బయటకు తీసుకు రావాలి”.

నేపథ్యం

. కథ జరగడానికి కారణం ఉన్నట్టే, స్థలం (Place), కాలం (Time) కూడా ఉంటాయి. స్థల, కాలాల చిత్రణే కథాసాహిత్యంలో నేపథ్య చిత్రణ. కొన్ని కథలు ఎక్కడైనా, ఎప్పుడైనా జరగవచ్చు. అంటే వాటికి స్థల, కాలాలు ఉండవు. కానీ చాలా కథలు ఎదో ఒకచోట, ఏదో ఒకకాలంలో జరుగుతాయి. ఇంకోలా చెప్పాలంటే, కొన్ని కథలు కొన్ని నేపథ్యాలలో మాత్రమే జరుగుతాయి. కథ నేపథ్యాన్ని మారిస్తే అసజంగానూ, అసంభవంగానూ అనిపిస్తాయి. ఉదాహరణకు సింగమనేని నారాయణ రాసిన “విముక్తి” అన్న కథ, వెనకబడ్డ రాయలసీమ ప్రాంతంలో మాత్రమే జరుగుతుంది. అలాగే, నదులూ, బల్లకట్టులూ లేని రాయలసీమలో “బల్లకట్టు పాపయ్య” అన్న మా.గోఖలే కథ అసంభవంగా ఉంటుంది. “అమరావతి కథలు” అన్న పేరుతో సత్యం శంకరమంచి రాసిన చాలా కథలు అమరావతిలో తప్ప మరెక్కడా జరగటానికి వీల్లేదు.

దృష్టికోణం

. ఒకే కథను చాలామంది చెప్పవచ్చు. ఏ దృష్టితో కథను చెప్పాలి అంటే “కథను ఎలా చెప్పాలి? ఎవరు చెప్పాలి?” అన్నది తెలిపేదే దృష్టికోణం. కథ చెప్పే దృష్టికోణాల్ని ఇలా కొన్ని రకాలుగా విభజింపవచ్చు. సర్వసాక్షి దృష్టికోణం (దీన్నే రచయిత దృష్టికోణం అనికూడా అంటారు), ప్రథమ పురుష దృష్టికోణం, ఉత్తమ పురుష దృష్టికోణం, నాటకీయ దృష్టికోణం. సర్వసాక్షి దృష్టికోణంలో, సాధారణంగా రచయితకు అన్ని పాత్రల గురించీ తెలిసి ఉంటుంది. ఉత్తమ పురుష దృష్టికోణంలో, రచయిత కథ తానే చెప్పడు. అంటే రచయితే కథకుడు కాదు. కథను చెప్పటానికి రచయిత ఒక కథకుణ్ణి ఎంచుకుంటాడు. అతడు సాధారణంగా కథలోని ముఖ్య పాత్రగా ఉంటాడు. ఉత్తమ పురుష కథనంలో కథ చెబుతున్న వ్యక్తి ప్రధాన పాత్రగా ఉండక్కరలేదు. ఉదాహరణకు, కాళీపట్నం రామారావు రాసిని “వీరుడూ – మహా వీరుడూ” కథలో, కథ చెప్పిన వ్యక్తి ప్రధాన పాత్ర కాదు. నాటకీయ దృష్టికోణంలో రచయిత రచయితగా కనిపించడు. “నేను నా కథలో కనిపించకూడదు” అని గట్టిగా ప్రయత్నించినవాడు ప్లేబేర్‌ అన్న ఆంగ్ల కథకుడు.

కంఠస్వరం

. కథకుడు కథను గంభీరంగా చెప్పాలా, వ్యంగ్యంగా చెప్పాలా, హాస్యంగా చెప్పాలా, నర్మ గర్భంగా చెప్పాలా, కోపంతో – ద్వేషంతో చెప్పాలా అని నిర్ణయించుకోవాలి. అప్పుడప్పుడు వీటిని తగుపాళ్ళలో మిళితం చేసుకుంటూ కూడా కథ చెప్పచ్చు. ఉదాహరణకు, పెద్దిభొట్ల సుబ్బరామయ్య రాసిన అనేక కథల్లో కంఠస్వరం విషాద గంభీరంగా ఉంటుంది.రావిశాస్త్రిది పాఠకుణ్ణి రెచ్చగొట్టే వ్యంగ్యం. కొడవటిగంటి కుటుంబరావు కంఠస్వరంలో ప్రధానమైన అంశం వాదన. అణుచుకొన్న కోపం అల్లం రాజయ్య రాసిన చాలా కథల్లోని కంఠస్వరం. అణచుకోని కోపం చలంది.ఇలా ఎన్నో కంఠస్వరాలు.తెలుగు కథల్ని బాగా చదివి, సద్విమర్శ చేసిన వాళ్ళు, మంచి కధకు కావలసిన లక్షణాలు ఇలా ఉండాలని చెప్పారు. అవి వరుసగా – క్లుప్తత, అనుభూతి ఐక్యత, సంఘర్షణ, నిర్మాణ సౌష్ఠవం.

టూకీగా, ఇవేమిటో చూద్దాం!

క్లుప్తత

. “కథలో ప్రతి పదమూ దాదాపు నిర్దిష్టంగా ఉండాలి. అజాగ్రత్తగా, అశ్రద్ధగా ఉండటానికి కథలో (నవలకన్న) చాలా తక్కువ చోటు ఉంటుంది. చెత్తకు కూడా కథలో చోటు తక్కువే” అంటాడు సుప్రసిద్ధ అమెరికన్‌ రచయిత, నొబెల్‌ బహుమతి గ్రహీత విలియం ఫాక్నర్‌. క్లుప్తత తనంత తానుగా రాదు. రచయిత దాన్ని కష్టపడి సాధించవలసిందే.కథలో క్లుప్తత లేకపోడానికి మూడు కారణాలు చెబుతారు. 1. సందర్భ శుద్ధి లేకుండా వర్ణనల్ని చొప్పించడం. 2. రచయితకు, పాఠకుని సమర్ధత మీదా, ఆలోచనా శక్తి మీదా గౌరవం లేకపోవడం. 3. అనవసరమైన సంభాషణలూ, సంఘటనలూ కథలో చోటు చేసుకోడం. ” ఎక్కువగా మాట్లాడే రచయిత అతి ఉత్సాహవంతుడైన ప్రేక్షకుని వంటివాడు. ఇతరుల మధ్య కూర్చొని వాగుతూ, తాను నాటకాన్ని చూడడు. ఇతరుల్ని చూడనివ్వడు” అంటాడు చెకోవ్‌.

అనుభూతి ఐక్యత “Unity of Impression”

మొదటి వాక్యం నుంచి చివరి వాక్యం వరకూ కథా, కథాంశం అన్న తీగ మీదనే నడవాలి. “పులి తరుముకొస్తున్న వాడు తాను ఎక్కదలుచుకొన్న చెట్టు దగ్గరకి ఎలా పరిగెడతాడో, అలా కథకుడు సూటిగా తన కథాంశం వద్దకు పరిగెట్టాలి” అంటాడు H. G. Wells. అనుభూతి ఐక్యత సాధించడానికి ప్రధానంగా రెండు మార్గాలు. 1. ఒకే సంఘటనకు పరిమితంగా పాత్రను చిత్రించడం. అంటే కథలో ఒకే పాత్ర, ఒకే సంఘటన ఉండాలని కాదు. కథాంశం ఒకే సంఘటనలో వెలగాలి. 2. రచయిత ఎన్నుకున్న ప్రధాన సంఘటన, పాత్రలో గుణాత్మకమైన మార్పుకు కారణభూత మయ్యేదిగా ఉండాలి.

సంఘర్షణ

. సంఘర్షణ అనేక రకాలుగా ఉండొచ్చు. ఇద్దరు వ్యక్తుల మధ్యా, ఒకే వ్యక్తిలోని రెండు అంశాల మధ్యా, రెండు భావాల మధ్యా, రెండు వర్గాల మధ్యా, రెండు సిద్ధాంతాల మధ్యా, రెండు జీవిత దృక్పధాల మధ్యా – ఇలా ఎన్నిటి మధ్యనైనా ఉండొచ్చు.ఎలాంటి సంఘర్షణనూ చిత్రించని కథలు కాలక్షేపం కథలు లేదా వ్యాపార కథలు.

కథలో సంఘర్షణ చిత్రిస్తున్నపుడు – పరిష్కారం గురించి కూడా ఆలోచించాలి. ముగింపు మాత్రమే పరిష్కారం కాదు. ఉదాహరణకు, కాళీపట్నం రామారావు రాసిన వివాదాస్పదమైన “యజ్ఞం” కథలో, ముఖ్య పాత్ర సీతారావుడు తన కొడుకు బానిస బతుకు బతకటం ఇష్టంలేక వాణ్ణి ముక్కలుముక్కలుగా నరికేస్తాడు. కథకు ఇది ముగింపు. కథలో చెప్పబడ్ద పరిస్థితుల్లో, తన కొడుకు బానిసత్వాన్ని అంతం చేయడానికి తన వంశాన్నే అంతం చేసాడు. బానిసత్వం కన్నా చావే మేలని నమ్మిన ఒక తండ్రి, “దయ” తో కొడుకుని చంపేశాడు అనుకోవచ్చు. ఈ ముగింపుని ఒక ప్రతీకగా అర్ధంచేసుకోవాలి. ఈ కథలోని సమస్యకు దాని ముగింపు పరిష్కారం కాదు. అంటే, తమ పిల్లల్ని నరికెయ్యటం ఒక్కటే మార్గం అన్న పరిష్కారాన్ని ఈ కథ ప్రతిపాదిస్తున్నదని భావించకూడదు.

నిర్మాణ సౌష్టవం

అంటే Plot అనుకోవచ్చు. కథకు కావలసిన ఎత్తుగడ, నడక, ముగింపు – ఈ మూడూ ఎంత నేర్పుగా “అల్లటం” జరిగిందో అన్న దానిపైన మంచి కథ ఆధారపడి ఉంటుంది. ఈ అల్లిక పూర్తిగా లేని కథ నీరసంగానూ, మరీ ఎక్కవైతే కృత్రిమంగాను తయారయ్యే ప్రమాదం ఉంది.

కథలోని ఆది, మధ్యం, అంతం గురించి చెకొవ్‌ చమత్కారంగా ఇలా అంటాడు. “కథ రాయడం పూర్తి చేసాక ప్రారంభాన్ని, ముగింపునూ తీసేయ్యాలి.” కథకు ఆదీ, అంతం ఉండాల్సిన అవసరం లేదనటానికీ, రాసిన తరవాత తీసెయ్యాలనటానికీ చాలా తేడా ఉంది. రాసిన తరవాత తీసెయ్యాలంటే కథలో వాటిని అదృశ్యంగా ఉంచాలనీ, వాటిని పాఠకుల ఊహాశక్తికి వదిలిపెట్టాలనీ అర్ధం.

ఇంత ఉపోద్ఘాతం లేకుండా చెప్పాలంటే, చదివించే గుణం ఉండీ, పాఠకుని మనస్సులో చెరగని ముద్ర వేసిన కథ – మంచి శిల్పం ఉన్న కథే!

ఈ వ్యాస రచనకు ఉపయోగపడిన పుస్తకాలు, సంకలనాలు:

1. కథాశిల్పం – వల్లంపాటి వెంకట సుబ్బయ్య, విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌, జనవరి, 1995.
2. కాళీపట్నం రామారావు రచనలు – ప్రోగ్రెసివ్‌ పబ్లికేషన్స్‌, జులై, 1999
3. కొడవటిగంటి కుటుంబరావు సాహిత్యం – సంపుటాలు 1 నుంచి 5, విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌, జనవరి, 1982.
4. శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి కథలు – సంపుటాలు 1 నుంచి 3, విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌, ఆగష్టు, 1992.
5. కథా సాగర్‌ – కళాసాగర్‌ కల్చరల్‌ ట్రస్ట్, చెన్నై, నవెంబర్‌ 1997.