ఒకనాటి యువ కథ: గోల

మంచిగంధం సబ్బుతో చక్కగా రుద్దుకుని కాగుడు నీళ్ళతో వెచ్చగా స్నానం చేసి ఘుమఘుమలాడుతూ చిన్న గదిలోకొచ్చి తడిబట్ట నేలకు జార్చేసింది కమల.

సరిగ్గా అప్పుడే ఆమె మీదకు టార్చిలైట్ ఫోకస్ వచ్చిపడింది రాంబాణంలా.

అల్మైరాలో తలుపు రెక్క చాటున వెలుగుతున్న గుడ్డిదీపం నవ్వింది.

వెంకట్రావు ఇక ఆగేట్టు లేడు.

పెళ్ళికూతురు చప్పున గొంతుక కూర్చుని ఒకచేత్తో నేలమీద చీరను మీద కప్పుకుంటూ వెళ్ళిపొమ్మన్నట్లు ఎడం చేయి వూపింది.

టార్చిలైట్ వెలుతురు వీప్మీదకు తిరిగింది. కూర్చున్న కమల కళ్ళు అమ్మవారి నేత్రాల్లా తిరిగాయి, కించిత్ రౌద్రంగా. నేలమీద దొర్లుతున్న మరచెంబు మూత విసిరేసింది.

ఎర్రగా కాలుతున్న సిగరెట్టు రాలిపడింది.

‘అమ్మో!’ అంటూ పెళ్ళికొడుకు చిన్నగదిలోంచి వసారాలోకి పెద్ద గెంతు గెంతాడు.

కమల తలుపు గెడ పెట్టి ‘అమ్మయ్య’ అనుకుని బట్టలు వేసుకోవడం మొదలెట్టింది.

తలుపు మీద గాజుల చేతులు దబదబమని మోత్తున్నాయి. కమల గులాబీరంగు జరీచీర కుచ్చెళ్ళు సర్దుకుంటూ తలుపు తీసింది నెమ్మదిగా –

“అదేవిటే నీ మొహం యీడ్చా, అదేవి సరసమే?” అని తల్లి లక్ష్మీకాంతమ్మ బుగ్గలు నొక్కుకుంటూ ఆదుర్దాగా విసుక్కుంది.

“నాకిలాంటి అసహ్యపు పనులు నచ్చవు,” అంది తాపీగా కమల, పైట లాగి అంచుల్ని సరిచేసుకుంటూ.

పెళ్ళికొడుక్కి నుదురు మీద టించర్ అయొడిన్ దూదిలో ముంచి అద్ది బాసికంలా చిన్న కట్టు కట్టారు. ‘చిన్న గంటు పడిందంతే, కాస్తుంటే కన్నే పోను,’ అన్నారంతా! ‘దెబ్బెలా తగిలిందిరా అన్నయ్యా?’ అని ఆడబడుచు కాంతి అడుగుతుంటే, “పెంకు రాలిపడింది మొగమ్మీద,” అన్నాడు వెంకట్రావు.

“ఇదిగో, ఈ సమ్మర్‌లో పెంకులు మార్పించేస్తాను,” అన్నాడు పెళ్ళికూతురి తండ్రి వీరభద్రం.

“ఈ వూర్నిండా కోతులు, ఇళ్ళెక్కి పెంకులు తిరగతోడేస్తున్నాయ్. కొబ్బరికాయల్నీ పుచ్చెల్నీ వేటినీ బతకనివ్వడంలేదు. అరటిచెట్ల మీదపడి ఆకుల్ని పోగులు పెట్టేస్తున్నాయ్. ఒక్క అరటికాయ దక్కడంలేదు. ఏమన్నా అంటే ఆంజనేయస్వామి, రామభక్త హనుమాన్ అంటూ వాట్ని వెనకేసుకొస్తారు వెర్రి మూక. పెంకుల ధర బయట చాలా వుంది. అందుకని తోటలో గొయ్యి తీసి పెంకుల్ని మనవే చేయించి ఆవం పెట్టి కాల్పిస్తే మన అవసరానికి గడిచిపోను. మిగిలినవి పంచాయితీ వారికి అమ్మితే కర్చులు కలిసొస్తాయనుకున్నా. తీరా తీశాక, టెర్రిబుల్ రెయిన్సొచ్చి పచ్చి పెంకులన్నీ నాని ముద్దలూ ముక్కలూ అయిపోయాయి. గ్రామాల్లో పన్లు మునపట్లా జరగడంలేదు. ఈ ఇందిరాగాంధీ వచ్చి దేశాన్ని సర్వనాశనం చేస్తోంది. చేసేసిందప్పుడే – అలగావాళ్ళు మనమాట వింటున్నారటండీ…” వీరభద్రంగారి లెక్చరు అలా పెంకుల్మీంచి దేశ రాజకీయాల మీదకి వెళ్ళిపోతోంది.

ఇంతలో పెళ్ళికూతురి తల్లి వచ్చి, ‘ఇదిగో యావండోయ్!’ అని పక్కకు పిల్చి – “బంగాళాదుంపలు ఎర్రగా వేయిస్తే పెళ్ళికొడుక్కి యిష్టంట, మరి మీ యిష్టం!” అంది చేతులు తిప్పుతూ.

“మహాప్రభో నావల్ల కాదు. దోసావకాయ జాడీడు మిగిలింది. రాత్రి మిగిలిన పెరుగు కుండల్తో వుంది. నీళ్ళు కలిపి మెంతి మజ్జిగ పోపు చెయ్! ఇప్పటికే యిల్లు గుల్లయింది. ఇహ నావల్ల కాదు. ఈ బ్రాహ్మడ్ని యీ అంగోస్త్రంతో వదిలెయ్యండి మహాప్రభో!” అని గావుకేకలు పెట్టాడు.

“ఈ మనిషితో ఏం మాట్లాడనమ్మా! వో ముద్దూ ముచ్చటా లేదు. ఎడ్డెవంటే తెడ్డెం. ఇదిగో వినండి. పెళ్ళికొడుకు ఇహ ఆగేట్టు లేడు. ఈ మనుగుడుపుల్లోనే ఆ కాస్త ముచ్చటా జరిపించేస్తే సరి. అదో కొరకరాని కొయ్య. మీరూ అంతే!” అని ఆవిడగారు రెండు అరటిపువ్వుల్ని ఆయన చేతికందిచ్చి –

“ఇవి వొలవండి. వంటావిడ తొందరపడ్తోంది. అన్నయ్యగారికి అరటిపువ్వు కూరంటే ప్రాణంట, అరటిదూట పెరుగుపచ్చడంటే వియ్యపురాలికి మోజుట. కాస్సేపుండి అలా చిన్నతోటలోకి వెళ్ళి రెండు పనసకాయలు తీయించండి. అక్కడ మనుగుడుపుల్లో పనసపొట్టు మీరే కొట్టి వంట కివ్వాలట,” అని తన మట్టెలూ కడియాలూ చప్పుడు చేసుకుంటూ లక్ష్మీకాంతమ్మ నేలమీద పిల్లలు విడిచేసిన బట్టలు పోగుచేసుకుంటూ పెళ్ళిపందిరిలోకి వెళ్ళిపోయింది.

“దీన్తల్లి సిగదరగ. ఈ పనసతొనల కత్తి కనబడి చావదు.” కొడవలి తీసుకుని తోటలోకి పరిగెత్తాడు పెళ్ళికూతురు తండ్రి వీరభద్రం.


వీధిలో పెళ్ళిపందిరి రాటల్ను పుచ్చుకుని రంగురంగుల పరికిణీలు, బుల్లి బుల్లి వోణీలు, పట్టుగౌనులూ వేసుకున్న చిట్టితల్లులంతా నాలుగు స్తంభాలాట ఆడుకుంటున్నారు. ఆ యింట్లో వున్న ఒకే ఒక వాలుకుర్చీలో పడుకుని పెళ్ళికొడుకు వెంకట్రావు ట్రాన్సిస్టరు ట్యూన్ చేస్తున్నాడు. అది బంయ్, బంయ్‌మంటూ బరబరలూ గరగరలూ మధ్య మధ్యన ఏవో శబ్దాలు చేస్తూ మిమిక్రీ ఆర్టిస్టులా నవ్విస్తోంది.

ఆ వసారాలో కొత్తగా అల్లిన తాటాకు చాపల మీద కూర్చున్న వియ్యపురాలు స్టీలు గ్లాసులో కాఫీని వూదుకుంటూ భర్త వెంకటేశ్వర్లని చేత్తో పొడుస్తూ – “వాడ్ని కాస్త కనిపెట్టి ఉండండి. మనవాడు మన పరువు దక్కించేలా లేడు. ఆ పిల్ల కంటికి నదరుగా కన్పిస్తుంటే వీడిక ఆగేట్టు లేడు. స్కూటరయినా యిస్తేగాని పిల్లాడు కార్యానికి ఒప్పుకోడం లేదని మీరు తెగేసి చెప్పండి, ఊర్నే మెమ్మే అని నీళ్ళు నవుల్తూ కూర్చోక,” అంది.

“నువ్వు చెప్పు వాడికి. వాడ్నే అడగమను. అది బాగుంటుంది,” అని నసిగాడు వెంకటేశ్వర్లు.

“వాడు ఆ కమల యే గదిలో వుంటే ఆ గదిలో దూరుతున్నాడు. వాడ్ని లోకువకట్టి వాళ్ళు మనుగుడుపుల్లోనే ఆ అవపోసన కాస్తా అయిపోయిందనిపిచ్చేట్లున్నారు. నేనెంత నెత్తీ నోరూ బాదుకుంటే ఏం లాభం? మీరు బెల్లం కొట్టిన రాయిలా కదల్లేరు, మాట్లాడతారు. ఇహ యీ తగూలన్నీ నా నెత్తి మీదకు నెట్టేస్తున్నారు. మీరూ మీరూ బాగుండాల. మధ్యన వియ్యపురాలి పీనుగ గయ్యాళిది అనిపించుకోవాలి నేను,” అని ఆవిడ కొత్త తాటాకు విసినికర్రను విసవిసలాడించింది.

ఈ మధ్యలో గులాబీ రంగు జరీచీరలో వయ్యారిభామలా అలంకరించుకొని పెళ్ళిపందిట్లోకి వచ్చింది కమల. ‘ఇంద తీసుకోండి అత్తయ్యా’ అని వో వెండిగిన్నెలో కొబ్బరినీళ్ళూ, మరో వెండిపళ్ళెంలో పందార చల్లినవి లేత కొబ్బరి ముక్కలూ వేసి పట్టుకొచ్చింది.

“నాకెందుకమ్మా యివన్నీ. మీ ఆయనకిచ్చి వాడ్ని మంచి చేసుకో. కోపం మీదున్నాడు. స్కూటరిస్తేగాని లేవట్ట కుర్చీలోంచి… మీ నాన్నతో చెప్తావో… మీ అమ్మతో చెప్తావో… నీ యిష్టం.” అని ఆవిడ విశ్వామిత్రుడు బిడ్డ శకుంతలను ఎత్తుకొచ్చిన మేనకను తోసేసినట్లు చేయి అడ్డంగా పెట్టింది.

కమల ఆ వెండిపళ్ళాన్నీ, వెండి గిన్నెనూ మావగారికి అందియ్యగానే ‘మా తల్లే’ అని రెండూ అందుకుని సంతోషించాడు, వో పక్కన కట్టుకున్న యిల్లాలు గుడ్లురుముతున్నప్పటికీ.

కమల అలా విసవిసా నడుచుకుంటూ జెండాలా పట్టుకున్న పవిటతో వెంకట్రావు మొహాన్ని రాసుకుంటూ వెళ్ళింది. ఆ చెంగుకు రాసిన సంపెంగ సెంటు పరిమళం, ఆ అమ్మాయి వంటి మీంచి వస్తున్న లావెండరు సువాసనలూ వెంకట్రావు మనఃఫలకం మీద వలపు తీగల్ని అల్లి శృంగార పుష్పాన్ని శతసహస్రంగా వికసింపజేశాయి.

గుర్రంబండి దగ్గర కొస్తుందనుకున్నాడు. మరచెంబు మూత దెబ్బను కూడా అతను లక్ష్యపెట్టడం లేదు. ఆ ఉదయం అతను ఆ చిన్నగదిలో మూల కూర్చొని తన హాండ్‌బాగ్‌లో నీళ్ళు కలిపి దాచుకున్న వోల్డు టావరిన్ నిప్పును సేవిస్తూ సిగరెట్టు పీలుస్తున్నాడు. ఆ యింట్లో ఆ గది వల్మీకంలా అతనికి తోచింది. ఆ వుత్సాహంలో అతనొక పొరపాటు పని చేశాడు. ఆ టార్చిలైటు వెయ్యకుండా వూరుకుని దగ్గర కెళితే ఆ లావెండరు వాసనల్నీ, మంచిగంధం ఘుమఘుమల్నీ తనవి చేసుకునేవాడు. ఛీ! ఛీ! బజారు రవుడీ చేసే పని తను చేసి లోకువయ్యాడు. పల్లెటూళ్ళో చిన్న చిన్న రొమాన్సులకి చాలా వీలుంటుంది, తొందరపడకపోతే. కమల ఎవరో అనుకుని విసిరి తరువాత తనే అని తెలిసి ఫీలయి వుంటుంది. ఛ ఛ కమల అలాంటిది కాదు. ఇంకా నయం, తను వోల్డ్ టావరిన్ మీదున్నాడని తెలీదు. పల్లెటూరి మొహం! చూసిన మేరకు ఫిగరు చాలా వెర్రెత్తించేస్తోంది. ఈ ముసలాళ్ళొకరూ! మనుగుడుపులూ కాకరకాయలూ అంటూ. పెళ్ళయి కాపురాల్చేసి కనేసిన వాళ్ళకు యంగ్ కపుల్స్ బాధలేం తెలుస్తాయ్! అక్కడికీ రాత్రి పెళ్ళిపీటల మీద – జీలకర్ర నెత్తిన పెట్టి తలంబ్రాలు పోసుకున్నాక – పక్కకు వచ్చి పిల్ల కూచున్నప్పుడు (పెట్రోమాక్స్ వాడు గాలి కొట్టడానికి దీపాన్ని అరుగు మీద పెట్టినప్పుడు) ఆ క్రీనీడలో పసుపు బట్టల పడుచుపిల్లను వాటేసుకుని ముద్దు పెట్టుకుంటే, తెల్లబోయినట్టు పురోహితుడికేసి చూస్తూ ఎడంచేత్తో తొడ మీద గట్టిగా గిల్లింది. యింటికెళ్ళాక గోళ్ళు తీయించేయాలి దీనికి. తలంబ్రాలు పోస్తున్నప్పుడు కావాలని జాకెట్లోకి వంపేస్తే పళ్ళెంతో నెత్తిమీద మొట్టింది. పిల్ల టిట్ ఫర్ టాట్‌లా వుంది. చెండ్లాటలో కూడా పూలచెండుతో పమిట మీదకు విసిర్తే తీసి మొగం మీద కొట్టింది – కళ్ళజోడు ఎగిరి పక్కన కూచున్న పడచు పేరంటాలి జుట్టులో చిక్కుకుపోయింది. తప్పు తప్పు ‘ఫౌల్ ఫౌల్’ అని మా చెల్లెలు అరిస్తే ‘షటప్’ అంది. దీన్ని మచ్చిక చేసుకోవాలంటే స్లో టాక్టిక్స్ లాగించాలి. మనకవేం తెలిసిచావ్వు. ఇద్దర్నీ వో గంట సేపు ఫ్రీగా వొదల్రేమిటో చుట్టమ్స్ అండ్ ఫేమ్లీస్. ‘ఆయురారోగ్య అయిశ్వర్యాభి వృద్ధిరస్తు’ అని యిన్ని అక్షింతలు వేసి కాళ్ళకు దండాలు పెట్టించుకుంటారు కాని ప్రేమపాఠాలు చెప్పుకోనివ్వరే!…

ఇలా ఆలోచిస్తుండగా చెవిలో ఎవరో ‘స్కూటరడుగు – స్కూటరడుగు – స్కూటరడుగు’ అని ముమ్మార్లు మంత్రోచ్ఛారణ చేసినట్లయింది. ఎవరా అని చూస్తే కన్నతల్లి.

ఇంతలో, “మా అమ్మాయి పాలకొల్లు దాకా పెళ్ళికొడుకుని వెనక కూచోపెట్టుకుని సైకిల్ తొక్కేస్తుంది. అంతేకాదు యీ కాలవను ఇవతల్నుంచి అవతలకు బారీత యీదేస్తుంది, ఛాలెంజ్!” అంటున్నాడు మావగారు, అరిటికాయ వూచను సన్నగా బిళ్ళలుగా తరుగుతూ. “గునపం తిరగేసి పాతి పాతిక కొబ్బరికాయలని వొలిచేస్తుంది మా కమల. దానికి కొబ్బరిచెట్టు ఎక్కటం వచ్చు. ఇంగ్లీషు క్షుణ్ణం. ఫార్మింగ్ వచ్చు. ఆప్షనల్ మేథమేటిక్స్‌లో హండ్రడ్‌కి హండ్రడ్!” అని అరుస్తున్నాడు దిక్కులెగిరిపోయేలా. ఇలాంటి వీరభద్రం మావగార్నా స్కూటరడగడం!

“అన్నయ్యా, మీ ముద్దుల అల్లుడికి స్కూటర్ కావాలిట. యివ్వకపోతే అన్నానికి లేవట్ట,” అంది వియ్యపురాలు.

“లేవడా? లేవకపోతే వండిన వంటంతా వూళ్ళో హరిజన్లని పిలిచి నాలుగు బంతులు లేవదీయిస్తాను. నా దగ్గిర యిలాంటి వెర్రివేషాలు కుదరవ్. యిప్పుడు స్కూటరంటాడు. మరి కాస్సేపు పోయాక వీడియో కొంటే కానీ తొంగోనంటాడు. నేనేం వెర్రి వెధవననుకొంటున్నారా? నావల్ల కాదు మహాప్రభో… నన్ను ఫకీర్ వెధవను చెయ్యకుండా నా మర్యాద దక్కించి మీ మర్యాద దక్కించుకోండి.”

వియ్యపురాలి మొహం కందగడ్డలా అయింది. వెంకటేశ్వర్లు నెమ్మదిగా వియ్యంకుడి హోదా వదిలేసి, “బావా, మా అమ్మ నీకు వేలిడిచిన అప్ప. నువ్వూ నేనూ తల్లివేపు వరసవాళ్ళం. పిల్లవాడు అడగడం ఓ ముచ్చట. అది యిప్పుడు గాక యింకెప్పుడు అడుగుతాడు. సరే యిస్తానంటే పోలా? తరవాత వీలు చూసుకుని ఆ ముచ్చట తీర్చవచ్చు. అదో సరదా,” అని నసిగాడు.

వీరభద్రం ఇంకా రెచ్చిపోయాడు. “సరదా కాదు గాడిద గుడ్డేం కాదూ! ఇప్పుడు ‘వూ’ అంటే రేపు అదిస్తే కాని పిల్లని కాపురానికి తీసికెళ్ళం అంటారు. ఒకటిస్తే మరోటి. కాలికేస్తే మెడకి, మెడకేస్తే కాలికి. తీరా ఇచ్చాక విమానం కొనిస్తేనే కాని అమ్మాయిని పుట్టింటికి పంపం అంటారు. ఆడిస్తే ఆడమన్నట్లు ఆడడానికి నేనేం చవటనుగాను. ఈ వూరి పంచాయితీని పన్నెండేళ్ళు గడగడలాడించాను. పౌరుషంగా మీసమున్న మగాడిలా బతికాను! ఎవడికీ తలొంచలేదు. నా పిల్లలు గజ-గజ నేనెల్లా చెప్తే అల్లా వింటారు. స్టాండప్ అంటే నిల్చుంటారు…”

ఆ ధోరణిని అడ్డుకుంటూ, “సర్లే బావా, మన పిల్లల సుఖం కోసం మనం ఏవైనా చేస్తాం. అవునా?” అన్నాడు వెంకటేశ్వర్లు.

“నేను చెయ్యను. నో స్కూటర్! నో నాన్సెన్స్!” అని తెగేసి చెప్పాడు వీరభద్రం.

అప్పుడు వియ్యపురాలు తను లేచి, “ఇక లేవండి. చాలా గొప్ప సంబంధం తెచ్చారు కజ్జాకోరు సంబంధం. నిన్నటికి నిన్న మా అత్తగారు రాత్రికి తినదు రొట్టెలు చేయించండీ అంటే మీ బోడి అత్తగారు తినకపోయినా పెళ్ళవుతుంది, తింటే తినమనండి లేకపోతే లేదు అన్నారు. పెళ్ళికొడుకు స్నేహితులకు సిగరెట్లు పేకదస్తాలు కావాలంటే ముండలు కూడా కావాలా కనుక్కోమన్నాడు యీ పెద్దమనిషి. కాఫీలు చాల్లేదంటే డబ్బులివ్వండి కాలవగట్టు హోటల్నించి తెప్పిస్తానన్నాడు. ఓ మంచీ లేదు ముచ్చటా లేదు. పేచీకోరు సంబంధం. పిల్లను పంపించెయ్యమనండి మన్తో. పిల్లను తీసికెళ్ళిపోదాం. లేరా నాన్నా లే. ఇంటికెళ్ళిపోదాం,” అని రూలింగు ఇచ్చేసింది.

“నువ్వూరుకో, నువ్వూరుకో,” అంటూ వెంకటేశ్వర్లు కోడిపుంజులా రెచ్చిపోతున్న పెళ్ళాన్ని బతిమాలాడితే, ఆవిడ గుడ్లెర్రజేసి, “ఇది నా కొడుకు, నా వ్యవహారం. మీరు నోరు మూసుకోండి!” అని గర్జించింది.

అప్పుడు వీరభద్రం, ‘అమ్మాయ్, కమలా!’ అని వో గావుకేక పెట్టాడు. కమల, ‘హా, నాన్నా!’ అంటూ వచ్చింది.

“నువ్వు బావను చెయ్యిపట్టుకుని భోజనానికి తీస్కెళ్ళమ్మా,” అన్నాడు.

‘లేచావా’ అని అనకుండా కమల అటువంటి చూపుతో వెంకట్రావు చేయి పుచ్చుకుని లాగింది వయ్యారంగా. ఏదో ట్రాన్స్‌లో వున్న పెళ్ళికొడుకు ఇంద్రధనుస్సు లోంచి నడిచి మబ్బుల్లో వాకింగ్ చేస్తున్నట్టు లేచి దీపం వెనుక నీడలా వెళ్ళాడు.

“వీడి అమాయకత్వం కూలా!” నెత్తి మీద చేతులు పెట్టుకుని నిలబడిపోయింది పెళ్ళికొడుకు తల్లి. అప్పుడే అక్కడకు వచ్చిన పెళ్ళికూతురి తల్లి –

“వొదినా, అన్నీ జరుగుతాయి. ఎందుకు లేనిపోని గొడవలు. అన్నాలు చల్లారుతున్నాయి. పిల్లలు ఆకళ్ళని గొడవ చేస్తున్నారు. రండి. మీరాయన కేకల్ను పట్టించుకోవద్దు. అన్నగారూ, మామీద దయ వుంచండి. శుభ్రంగా పెళ్ళి చేసుకుని పెళ్ళివారు అభోజనంగా వెళ్ళిపోయారు అన్న మాట మాత్రం మిగల్చకండి. ఏది ఎలా జరగాలో అంతా అలా జరుగుతుంది. దీనికి ఆ పిల్లాడికి రాసిపెట్టి వుంది. భగవంతుని దయ!” అని చేతులెత్తి ఏడుకొండలవాడికి దండం పెట్టింది.

ఆ రాత్రికి కార్యం ముహూర్తం పెట్టారు. కోడలి కొంగున కట్టే కాసు కొనితేవటానికి వేంకటేశ్వర్లు పాలకొల్లు పరిగెట్టాడు. వియ్యపురాలికి పెళ్ళికూతురి తల్లి బెనారెస్ పట్టుచీర కొనిచ్చింది.

వీరభద్రం తోటలోంచి ఒక దొంగ అరటిచెట్టు కనబడకుండా దాచుకున్న ముగ్గనున్న అరటి పళ్ళగెలను సావిడి మధ్యలో వేలాడకట్టాడు.

ఆ గెల చుట్టూ పిల్లలే! గోల! ఒకటే గోల!

(యువ, డిసెంబర్ 1984.)