నాకు నచ్చిన పద్యం: పండువెన్నెల పిండివంటలు!

కార్తీకం అంటేనే వెన్నెలనెల. ఇక కార్తీకపౌర్ణమి నాటి ‘ఆ జాబిల్లి వెలుంగు వెల్లికల’ గురించి వేరే చెప్పేదేముంది. ఆ రోజు వెన్నెట్లో వనభోజనాలు ఒక మధురమైన అనుభూతి. అలాంటిది ఆ వెన్నెలే భోజనమైతే! మానవుని ఊహకి అంతేముంది. చకోరమనే పక్షి వెన్నెలని మాత్రమే తాగుతుందనీ, ఆ పక్షికి అదే ఆహారమనీ ఒక చిత్రమైన కల్పన చేశాడు. ఎవరు ఎప్పుడు చేశారో తెలియదు కానీ, అది కవుల కవిత్వానికి గొప్ప ముడిసరుకయ్యింది. వెన్నెలను వర్ణించే ప్రతిచోటా చకోరాల ప్రస్తావన తప్పనిసరి. ఇలాంటి కవుల కల్పనలకి ‘కవి సమయా’లని ముద్దు పేరు. ఆదికవి వాల్మీకితో మొదలుపెట్టి, ఇంచుమించుగా సంస్కృత కవులందరూ వెన్నెల గురించీ వెన్నెలపులుగుల గురించీ రకరకాల కల్పనలు చేసినవారే. మన తెలుగు కవులకి అదే ఒరవడి అయ్యింది. సంస్కృతం నుండి స్ఫూర్తి పొందినా తమ ప్రత్యేకతని ఎప్పటికప్పుడు చాటుకొంటూనే వచ్చారు తెలుగు కవులు. ఉదాహరణకి, వేసవి పండువెన్నెలని వర్ణిస్తూ, అది చకోర పక్షి కూనలకి భూమి అనే పెనం మీద ప్రకృతి వేస్తున్న చాపట్టుగా, అభివర్ణిస్తాడు శ్రీకృష్ణదేవరాయలు. ఎంతైనా తెలుగువాళ్ళు భోజనప్రియులు కదా! దీనికంటే మరో నాలుగడుగులు ముందుకు వేశాడు పొన్నగంటి తెలగనార్యుడు!

సీ. అనుకువెన్నెల దాల్చి తునిచి సేవెలు చేసి
               వెన్నెలపాలను జున్నొనర్చి
     గట్టివెన్నెల పిండిగొట్టి వెన్నెలవెన్న
               గలయ వెన్నప్పాలుగా నమర్చి
     గడితంపు వెన్నెల గండ్రికల్ సిగరిగా
               దియ్యవెన్నెలలోన దెచ్చిపెట్టి
     యెడల వెన్నెల చక్కెరిడి జోర్కు వెన్నెల
               బూనిక నాళీలుగాను గూర్చి

తే. పండువెన్నెల యను వెండిపళ్ళెరముల
     జెలగి యిల్లాండ్రు వడ్డింప జెలులు దాము
     వేడుకలు మీఱ బువ్వంపు గూడు గుడిచి
     పొదలు తమితోడ వెన్నెలపులుగు లమరె

ఇది అతను రచించిన యయాతి చరిత్రము అనే కావ్యం లోని పద్యం. గొప్ప చమత్కారమైన ఊహని, దేశి తెలుగు సొగసులతో అందంగా చిత్రించే పసందైన పద్యం. ‘అచ్చతెనుంగు బద్దె మొకటైనను గబ్బములోన నుండినన్ హెచ్చని యాడుచుండు‘ కాలంలో కావ్యమంతా అచ్చతెలుగులో రచించిన మొట్టమొదటి కవి తెలగన. సంస్కృతం తెలుగులో ఎంతగా కలిసిపోయిందంటే, అచ్చతెలుగులో పద్యం చెప్పడం చిత్రకవిత్వంగా మారిపోయింది. ఈ కవిగారు కూడా, అందరూ అబ్బురపడి తనను మెచ్చుకొంటారనే, కావ్యమంతా అచ్చతెలుగులో రచించాడు. ఈ పద్యంలో, భాషతో పాటు అచ్చతెనుగు పిండివంటలని కూడా మనకి రుచి చూపించాడు. ఏ కావ్యాన్ని చూసినా చకోరాలు వెన్నెలని త్రాగుతున్నట్లు చేసిన వర్ణనలే. మహా అయితే వెన్నెల తీగలని తమ ముక్కులతో కరుచుకొన్నట్టు, తునిమినట్లు అక్కడక్కడా కొన్ని వర్ణనలున్నాయి. ఈ వర్ణనలన్నీ చదివున్న ఈ కవికి కాస్తంత చిరాకు, చకోరాలపై కూసింత జాలీ కలిగింది కాబోలు! వెన్నెలని ఎంతసేపని త్రాగుతాయి, వాటికి మాత్రం మొహం మొత్తదూ! అవి కూడా మనలా రకరకాల వంటలని రుచి చూడకపోతే ఎలా? చక్కెర ఎంత తీయనిదైనా, ఎప్పుడూ దాని పాకాన్ని త్రాగుతూ కూర్చుంటామా? రకరకాల తీపి పదార్థాలు చేసుకొని తింటే కానీ తృప్తి ఉండదు కదా! అలా ఆలోచన వచ్చిందో లేదో, ఇలా చకోరాలకి వెన్నెలతో కమ్మని విందుభోజనం ఏర్పాటు చేశాడు తెలగన్న. వెన్నెల రకరకాల చోట్ల, రకరకాల సమయాల్లో, రకరకాలుగా కురుస్తుంది. అలాంటి వెన్నెలతో అతను వండిన వంటలేమిటో రుచి చూద్దాం పదండి.

అనుకు అంటే పలుచని అని అర్థం. ఒక దగ్గర వెన్నెల పలుచగా కాస్తోంది. అలాంటి వెన్నెలను తీసుకొని, దాన్ని సన్న సన్నని ముక్కలుగా తునిమి సేవెలు తయారుచేశాయి చకోరాలు. సేవెలు అంటే సేమ్యా. పలుచని వెన్నెలతో వెన్నెలసేమ్యా తయార్! ఆ తర్వాత, వెన్నెలనే పాలను తీసుకొని జున్ను తయారుచేశాయి. కొంత వెన్నెలేమో గట్టిగా ఉందట! దాన్ని పిండికొట్టి, పాలవెన్నెలతోనే తయారుచేసిన వెన్నెల వెన్నతో కలిపి వెన్నప్పాలు చేశాయిట! వెన్నప్పాలు అంటే వెన్న కలిపి చేసే అప్పాలు. గడితంపు అంటే దట్టమైన. గండ్రికలు అంటే తునకలు. కాస్త దట్టంగా కాస్తున్న వెన్నెల తునకలని తెచ్చి, తీయని వెన్నెలలో కలిపి సిగరి తయారు చేశాయి. సిగరి అంటే మెంతి మజ్జిగలాంటిది. ఇక్కడ ‘తియ్యవెన్నెల’ అన్నాడు కాబట్టి, యిది తియ్యని లస్సీ అయి ఉండవచ్చును. కాస్త దళసరిగా ఉన్న వెన్నెలని తునిమి తెచ్చి, లస్సీ పైని వెన్నగా (మలాయి) వేశాయనుకోవచ్చు. కొంత వెన్నెల విడివిడిగా పొడిలాగా కురుస్తోంది. అదే ‘ఎడల వెన్నెల.’ ఆ వెన్నెల పంచదారలా ఉంది. అలాంటి వెన్నెలచక్కెర వేసి, ‘జోర్కు’ వెన్నెలని ‘నాళీ’లుగా తయారు చేశాయట. జోర్కు, నాళీ, అన్న పదాలు నాకు నిఘంటువులో ఎక్కడా కనిపించలేదు! నాళీలు అంటే బహుశా కేరళ వాళ్ళు తయారు చేసే ‘పుట్టు’ లాంటి వంటకం అయి ఉండవచ్చు. అవి గొట్టాల ఆకారంలో ఉంటాయి, చక్కెరతో కలిపి తింటారు. ఇలా ఎన్నో పిండివంటలని చేసి, పండు వెన్నెల అనే వెండి పళ్ళాలలో పేర్చి తమ ఇల్లాళ్ళు వడ్డిస్తూ ఉంటే స్నేహితులతో కలిసి సంబరంతో విందుభోజనం చేస్తున్నాయట ఆ వెన్నెలపులుగులు. ‘బువ్వంపు కూడు'” అంటే ఇంగ్లీషులో feast అన్న పదానికి అచ్చమైన తెలుగుపదం.

ఇదీ పొన్నగంటి మనకి వండి వడ్డించిన వెన్నెల భోజనం! తన సహజమైన మగబుద్ధితో, చకోరాల ఇల్లాళ్ళతోనే వంట వండించి, వడ్డన కూడా చేయించాడు! కథ మాట ఎలా ఉన్నా, ఇలాంటి అద్భుతమైన కల్పనలను చదివి ఆనందించడానికీ, మనకి తెలియని, మనం మరిచిపోయిన అనేక వేల అచ్చతెలుగు పదాలనీ పలుకుబళ్ళనీ తెలుసుకోడానికీ, ఈ యయాతిచరిత్రము చాలా గొప్ప సాధనం. ఈ పద్యం చదివినప్పుడు, వెన్నెల గురించిన భాసుని చాటువొకటి గుర్తుకువస్తుంది:

కపాలే మార్జారః పయ ఇతి కరాన్ లేఢి శశినః
తరుచ్చాయాప్రోతాన్ బిసమితి కరీ సంకలయతి
రతాంతే తల్పస్థాన్ హరతి వనితాప్యంశుకమితి
ప్రభామత్తశ్చంద్రో జగదిదమహో విప్లవయతి

దీనికి నా అనువాదం:

గిన్నె ప్రతిఫలించు వెన్నెల పాలని
               నాకుచుండెను పిల్లి! నాగ మొకటి
చెట్టునీడలయందు చిక్కిన నెలతీగ
               బిసమటంచును తాను బిట్టు లాగె!
ప్రక్కపై పర్విన పలుచని జలతారు
               వెండివెన్నెల జిగి, వేడ్కమీర
మరుకేళి దనిసిన మానిని యొక్కతె
               తొలగిన పయ్యెదంచులికి తీసె

వెలుగునీడలందు విశ్వమ్ము తమకిల్ల
భ్రాంతిమతులు కాగ ప్రాణులెల్ల
వరలు సుధలు గురిసి ప్రతిరేయి జాబిల్లి
మరులు గొలిపె జగతి మత్తు జల్లి

అనాదిగా వెండి వెన్నెల జిలుగులు కవుల మనసులని మురిపిస్తూనే ఉన్నాయి. మధురమైన కవిత్వాన్ని కురిపిస్తూనే ఉన్నాయి. అయినా, ఆ వెన్నెల మహిమలు వింటే సరిపోదు, స్వయంగా అనుభవించి ఎరుగ వలసిందే!