శ్రీనాథుని ఆంధ్రీకరణ సూత్రం: అర్థపరిశీలన

ఆంధ్ర మహాకవులు సంస్కృతం నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి సంస్కృతంలోకి కావ్యబంధాన్ని పరివర్తించేటప్పుడు యథోచితంగా తమతమ ప్రతిభావ్యుత్పత్త్యభ్యాసాలకు అనురూపమైన సంవిధానంతో నిర్వహించటమే గాని, విమర్శకుల పరిశీలన నిమిత్తం ఆ పరివృత్తికై తాము అనుసరించిన విధివిధానంలోని ఒక్కొక్క శిక్షాప్రణీతాన్ని గురించి పేరుపేరున పేర్కొన్నట్లు కనబడదు. భాషాంతరీకరణంలో వారు అనుసరించిన శాస్త్రీయమార్గాలేమిటి? గంభీరార్థనిబంధాలను ప్రసన్నపదబంధాలుగా రూపొందించేందుకు వారు చేసిన ప్రాతిపదిక కృషిస్వరూపం ఏమిటి? అందుకు మార్గదర్శకసూత్రాలు ఏమున్నాయి? మూలంలో తమకు అంగీకర్తవ్యం ఏదో, అనంగీకర్తవ్యం ఏదో వారు నిర్ణయించినప్పటి సహృదయలీలకు ప్రమాణాలేమిటి? అని మూలకారుని హృదయావిష్కరణయత్నంలో తాత్పర్యబోధార్థమై వారు ఆచరించిన అనుష్ఠానక్రమాన్ని బోధ్యబోధకతర్కపరిష్కారంతో వివరించినవారు లేరు.

తెలుగులో ఆ ప్రకారం తన అనువాదసరణిని సవిస్తరంగా పేర్కొన్న ఒకే ఒక్క మహాకవి శ్రీనాథుడని ప్రసిద్ధి. శృంగార నైషధం కావ్యపరిసమాపనవేళలో (8-202) ఆయన చెప్పిన మాటలివి:

“…మామల్లదేవీ నందనుండును, శ్రీహీర రోహణాచలరత్నప్రరోహంబును, చింతామణి మంత్రచింతనఫలంబును, గన్యాకుబ్జరాజాస్థానరంగ మంగళాభరణంబును, గౌడవిజయ కావ్యకర్తయు, గవిచక్రవర్తియు, ఖండన గ్రంథకారుండును, వైతండిక కమలషండవేదండంబును నగు భట్టహర్షమహాకవీశ్వరుండు గవికులాదృష్టాధ్వపాంథుం డొనర్చిన నైషధశృంగారకావ్యప్రబంధవిశేషంబు నశేషమనీషిహృదయంగమంబుగా – శబ్దం బనుసరించియు, నభిప్రాయంబు గుఱించియు, భావం బుపలక్షించియు, రసంబుఁ బోషించియు, నలంకారంబు భూషించియు, నౌచిత్యం బాదరించియు, ననౌచిత్యంబుఁ బరిహరించియు – మాతృకానుసారంబునం జెప్పఁబడిన యీ భాషానైషధకావ్యంబు…”

దురదృష్టవశాత్తు, ఈ నిర్దేశికకు వేదము వేంకటరాయశాస్త్రుల వారు అమోఘమైన తమ సర్వంకషా వ్యాఖ్యలో అర్థాలను వ్రాయలేదు. అందువల్ల, విమర్శకులు చర్చింపవలసిన ఆవశ్యకత ఏర్పడింది.

తొలినాటి విమర్శకాభిప్రాయాలు

‘ఈ వచనంలో చెప్పబడినది శ్రీనాథుని అనువాదవిధానం,’ అని అభ్యూహించి, ఆ విశేషాలను సర్వాంగీణపరిశీలనతో ముమ్మొదట వ్యాఖ్యానించినవారు శ్రీ కందుకూరి వీరేశలింగం గారు. 1887 నాటి తమ తెలుగు కవుల చరిత్రలో (మొదటి సంపుటం) వారు పైని చూపిన శ్రీనాథుని వచనాన్ని పేర్కొని, ‘శబ్దం బనుసరించి’ అన్న దళానికి గాను సంస్కృతాంధ్రాల నుంచి మూడు ఉదాహరణలను ఇచ్చారు. సువర్ణదణ్డైకసితాతపత్త్రిత, జ్వలత్ప్రతాపావలికీర్తిమణ్డలః – అన్న నైషధీయ చరితం (1-2) లోని శ్లోకానికి తెలుగులో, తపనీయదండైకధవళాతపత్రితోద్దండతేజఃకీర్తిమండలుండు (1-46) అని ఉన్న అనుసరణను పేర్కొని,

“ఇందు ‘సువర్ణ’ యనుటకు ‘తపనీయ’ యనియు, ‘సిత’ యనుటకు ‘ధవళ’ యనియు సంస్కృతపదములకు సంస్కృత పర్యాయపదములు వేసి గణయతిప్రాసముల కనుకూలముగా దీర్ఘసమాసమును జేయుట తప్పఁ దెనిఁగించిన దేదియు లేదు. కడపట ‘కీర్తిమండలః’ అనుదానిని ‘కీర్తిమండలుం’ డని తెనుఁగు విభక్తితోఁ గూర్చుటమాత్రమే యిం దున్న తెలుఁగు.”

అని వివరించారు. మూలంలోని గమికర్మీకృతనైకనీవృతః (2-40) అన్న సమాసానికి (గమి=గమనమునకు – కర్మీకృత (కర్మ కాకయుండి) కర్మగా చేయఁబడినది అయిన – నైక=పెక్కు – దేశములు గలవాఁడను – అని వేదము వారి వ్యాఖ్య) ‘అనేకదేశములను తిరిగినవాఁడనై’ అనే అర్థాన్నిచ్చే సమాంతరవాక్యాన్ని వ్రాయక, గమికర్మీకృతనైకనీవృతుఁడనై (2-21) అని అక్షరాక్షరం తెలుగు చేయటాన్ని విమర్శించారు.

“మార్పేమియుఁ జేయక తుదను విభక్తిప్రత్యయమైన డువర్ణమును మాత్రము చేర్చి తెనుఁ గనిపించెను.”

అని వ్రాశారు. మన్దాక్షమన్దాక్షరముద్ర ముక్త్వా(3-61) అని ఉన్నదానికి తెలుగులో, రమణి మందాక్షమందాక్షరంబు గాఁగ (2-64) అని (రమణి=సుందరి యైన దమయంతి … మందాక్ష=సిగ్గుచేత – మంద=సందిగ్ధార్థము లయిన – అక్షరంబు గాఁగన్=పదములు గలదిగా – అని వేదము వారి వ్యాఖ్య) యథాతథంగా చేయబడిన అనుసరణను ప్రస్తావించి,

“ఇందును మూలములోని పదములలో మార్పేమియు లేక తెలుఁ గగుటకు కడను బువర్ణము చేర్పఁబడెను.”

అని వివరించారు. ఇటువంటి శబ్దానుసరణల వల్లనే, ‘నీ డు-ము-వు లను నువ్వు తీసుకొని, మా నైషధాన్ని మాకివ్వు!’ అని వెక్కిరించినట్లుగా జనశ్రుతి ఏర్పడివుంటుందని అన్నారు.

‘శబ్దం బనుసరించి’ అంటే, మూలంలోని శబ్దసంపుటిని ఉన్నదున్నట్లుగా తీసుకోవటం – అన్న అర్థాన్ని వీరేశలింగం గారు తొలిసారిగా చెప్పారన్నమాట.

‘అనౌచిత్యంబుఁ బరిహరించి’ అన్న దళానికి అనుప్రయుక్తమైన అర్థాన్ని ఊహించినవారు కూడా వీరేశలింగం గారే. అనౌచిత్యాన్ని పరిహరించానని చెప్పుకొన్నప్పటికీ కవి అశ్లీలములు, అనౌచిత్యములు అయినవాటిని శ్రీనాథుడు వ్రాయక మానలేదని చెబుతూ వారు శృంగార నైషధంలోని ‘అవ్వలి దిక్కు మో మయి ప్రియంబున’ అని 6-113లో ఉన్న ఒక పద్యాన్ని ఉదాహరించారు. బహుశః ఆ రోజులలో అటువంటివి అనౌచిత్యాలుగా పరిగణింపబడలేదేమో! అని కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘అనౌచిత్యంబును పరిహరించి’ అంటే, మూలంలోని అశ్లీలములు, అనౌచిత్యప్రాయములు, ప్రకరణోచితం కానివి అయిన భాగాలను అనువాదంలో విడిచిపెట్టడం – అన్న అర్థాన్ని వీరేశలింగం గారు తొలిసారిగా చెప్పారన్నమాట.

‘భావం బుపలక్షించి’ అన్న దళాన్ని ఆ పేరిట ప్రస్తావింపకపోయినా, శ్రీనాథుడు మూలంలోని భావాన్ని మనోహరంగా తెలుగుచేసిన ఒక పద్యాన్ని వీరేశలింగం గారు ఉదాహరించారు. నైషధాంధ్రీకరణం సర్వజనశ్లాఘాపాత్రంగా ఉన్నదని, అంతటి గుణవిశేషాన్ని కలిగి ఉండటం వల్లనే శృంగార నైషధానికి పంచకావ్యాలలో ఒకటిగా ప్రశస్తి ఏర్పడమే గాక, వాటిలో అగ్రగణ్యంగా భావింపబడుతున్నదని మనసారా మెచ్చుకొన్నారు. వీరేశలింగం గారు ప్రవేశపెట్టిన ఈ అర్థాన్వయం అచిరకాలంలోనే సాహితీవేత్తల ఆమోదాన్ని పొందింది. సాహిత్యవిమర్శగ్రంథాలలోనూ, వ్యాఖ్యలలోనూ, వ్యాసాలలోనూ అవిరళమైన ప్రాచుర్యానికి నోచుకొన్నది.

1913లో గురజాడ శ్రీరామమూర్తి గారి కవిజీవితములు పరివర్ధితపాఠం అచ్చయింది. అందులో శృంగార నైషధ గ్రంథంలోని శయ్యాదికాన్ని చర్చించే సందర్భంలో వారు శ్రీనాథుని అనువాదాన్ని గురించి ఈ మాటలను వ్రాశారు:

“ఇది సంస్కృతమునకు సరియైన తెనుఁ గని చెప్పఁదగి యున్నను నక్కడక్కడ నుభయభాషలకును జాతీయభేదము లైనచో మాత్రము కొన్ని మార్పులు కాన్పించు. ఆ మార్పులు చేయక చెప్పుటయే సులభము. అయినను అట్లు చెప్పిన నాంధ్రభాషలో నది రసహీన మౌ నని యెంచి శ్రీనాథుఁ డట్టిపట్లను మిక్కిలి మెలకువతోఁ దెనిఁగించుచు వచ్చెను. అవి సంస్కృతమాతృకను దగ్గర నుంచుకొని పరిశీలించినంగాని స్పష్టములు కావు. అటుగావున వాని నిప్పుడు వివరింపక సమముగాఁ దెనిఁగించిన యొక శ్లోకమును పద్యమును నిట వివరించెదను :-

శ్లో. అధిగమ్య జగత్యధీశ్వరా, దథ ముక్తిం పురుషోత్తమా త్తతః
       వచసామపి గోచరో న య స్స, త మానంద మవిందత ద్విజః. (నైషధము ౨. సర్గము)

గీ. అట్లు పురుషోత్తముం డైనయతనివలన, ముక్తిఁ గాంచిన యాద్విజముఖ్యుఁ డెలమి
       డెందమునను వాక్కున కందరాని, యధికతర మైన యానంద మనుభవించె.”

గురజాడ శ్రీరామమూర్తి గారు స్పష్టంగా చెప్పకపోయినా, వారి వ్యాఖ్య వీరేశలింగం గారి అన్వయానికి ప్రతిబింబమని తెలుస్తూనే ఉన్నది. సంస్కృతమునకు సరియైన తెనుఁగు అన్నది ‘శబ్దం బనుసరించి’ అన్న దళాన్ని అనుసరిస్తున్నది. ‘అనౌచిత్యంబుఁ బరిహరించి’ అన్న వాడుకకు పర్యాయానువర్తనగా వారు విస్తృతార్థంలో జాతీయభేదము అన్న సరికొత్త పదబంధాన్ని ప్రయోగించారు. అనౌచిత్యపరిహరణతోపాటు భావోపలక్షణం, అభిప్రాయఘటనం మొదలైనవన్నీ ఇందులో అంతర్భవించాయి. సర్వవిధాల మూలవిధేయమైన అనువాదమే ఆచరణీయమైనా, జాతీయభేదం వల్ల కొన్ని మార్పులను చేయక తప్పదని నమ్మినవారు. ‘మార్పులు చేయక చెప్పుటయే సులభము,’ అని అందువల్లనే అన్నారు. ‘రసంబుఁ బోషించి,’ ‘మాతృకానుసారంబున,’ అన్న భావాలకు వ్యాఖ్యగా – ఆంధ్రభాషలో నది రసహీన మౌ నని యెంచి శ్రీనాథుఁ డట్టిపట్లను మిక్కిలి మెలకువతోఁ దెనిఁగించుచు వచ్చెను. అవి సంస్కృతమాతృకను దగ్గర నుంచుకొని పరిశీలించినంగాని స్పష్టములు కావు, అని వ్రాశారు.

1913లో వేదము వేంకటరాయశాస్త్రి గారి శృంగార నైషధ సర్వంకషా వ్యాఖ్య వెలువడింది. అప్పటికే బహుధా ప్రసిద్ధమై ఉన్న ఈ అర్థపరంపర వారికి పూర్ణసంతృప్తిని కలిగింపలేదని ఊహింపవలసి ఉన్నది. అయితే, యథాయోగ్యమైన అర్థనిర్ణయం వారికి ఆ రోజులలో తోపలేదని సైతం భావింపవలసి ఉంటుంది. భిన్నాభిప్రాయులైతే ఏ సంగతీ నిష్కృష్టంగా చెప్పేవారే. అందుచేత ఈ భాగాన్ని విడిచివేశారు. పీఠికలో ‘శృంగార నైషధ విమర్శలేశము’ అన్న ఉపశీర్షిక క్రింద పైని (8-202) లోనిదిగా పేర్కొన్న వచనాన్ని ఉదాహరించి, మహాకవి అనువాదపద్ధతిని వివరించారు. అందులో 1) కల్పనలో ఇమిడిక కోసం పునరుక్తులను వదలివేయటం, 2) పూర్వోత్తరాలలో ప్రత్యేకప్రయోజనం లేని శబ్దసంపుటిని తెనిగింపకపోవటం, 3) రసభావాల స్వారస్యాన్ని మరింత చమత్కారంగా అనువదించటం, 4) రసధ్వని విషయమై జాగరూకతను వహించటం, 5) అలంకార రామణీయకాన్ని అతోధికంగా పెంపొందించటం, 6) తరచు మూలానుగుణంగానో, మూలాతిరిక్తంగానో, మూలాని కంటె మనోహరంగానో అనువదించటం వంటి అంశాల వివరణలతో శ్రీనాథుని ప్రతిభను వేయినోళ్ళతో ప్రశంసించారు. ఔచిత్యపరిపాటినే గాని అనౌచిత్యపరిహరణాన్ని గురించి ప్రస్తావింపలేదు. సంస్కృతమూలాన్ని ఉన్నది ఉన్నట్లుగా గణయతిప్రాసాదులకైన చిన్నచిన్న మార్పులతో తెలుగులో అవతరింపజేయటాన్ని ఉదాహరించి, ‘శబ్దానుసారముం బరమావధిం బొందించినాఁడు’ అని మెచ్చుకొన్నారు. పీఠికలో ఇంత విస్తృతంగా వ్రాసిన తర్వాత మళ్ళీ వ్యాఖ్యానం ఎందుకనుకొన్నారో, అన్వయవిషయకమైన సంతృప్తి కలుగలేదో కాని, అష్టమాశ్వాసంలో దీనికి అర్థాలను వ్రాయలేదు. పీఠికలోనూ ఒక్కొక్క దళాన్నీ వేర్వేరుగా వివరింపలేదు.

శ్రీనాథ వాఙ్మయాభిమానులైన అనంతరీయ విమర్శకులందరూ ఈ అన్వయక్రమాన్ని అంగీకరించారనే చెప్పవచ్చును. చాగంటి శేషయ్యగారు ఆంధ్ర కవితరంగిణిలో (ఐదవ భాగం) దీనినే పునరుక్తం చేశారు. వీరేశలింగం గారు చూపినవాటికి మరికొన్ని ఉదాహరణలను చేర్చి అభిధేయార్థాలను విపులీకరించారు. ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సాహిత్యచరిత్రను బోధిస్తుండిన రోజులలో ఈ అనువాదపు సూత్రీకరణ కళాశాలలలో సువ్యాప్తమైంది. అధ్యాపకులు దీనినే అనుసరించారు. 1971లో ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి గారు ప్రచురించిన తమ బృహత్పరిశోధనగ్రంథం శ్రీనాథుడులో దీనికి పటిష్ఠమైన తర్కసంగతితోడి సోదాహరణాన్వయం ఉన్నది. 1972లో నేను కళాశాలలో బి.ఎ విద్యార్థిగా ఉండినప్పుడు శ్రీనాథవాఙ్మయాన్ని అధికరించి విశేషకృషి చేసిన మా ఆచార్యులు మాకు ఆ ప్రకారంగానే పాఠం చెప్పేవారు. లక్ష్మీకాంతం గారి ఆంధ్ర సాహిత్య చరిత్ర వారి మరణానంతరం చాలా ఆలస్యంగా 1974లో అచ్చయింది. అందులో ఈ అర్థసంవాదం కనబడుతుంది.

“ఆంధ్రీకరణ పద్ధతులు”

స్థూలదృష్టికి శ్రీనాథుని సూత్రీకరణంలో మొత్తం ఏడు ప్రధానమైన దళాలున్నాయి. అవి 1) శబ్దాన్ని అనుసరించటం, 2) అభిప్రాయాన్ని కూర్చటం, 3) భావాన్ని ఉపలక్షించటం, 4) రసాన్ని పోషించటం, 5) అలంకారాన్ని భూషించటం, 6) ఔచిత్యాన్ని ఆదరించటం, 7) అనౌచిత్యాన్ని పరిహరించటం. ‘మాతృకానుసారంబున’ అన్న ప్రతిజ్ఞ వీటన్నింటికి ఏకాన్వయంగా అనువర్తిస్తుంది.

డా. కొర్లపాటి శ్రీరామమూర్తి గారు 1992లో అచ్చయిన తమ తెలుగు సాహిత్య చరిత్ర (ద్వితీయభాగం) లో వీటి సత్త్వనియతిని మరొక్కసారి వివరించారు. శబ్దం బనుసరించి – అంటే మూలశబ్దానుసరణమని; సంస్కృతంలోని పరిభాషాపదాలను, ప్రౌఢపదబంధాలను, రీతిసుభగాలైన సమాసకుసుమావళులను యథాతతంగా తెలుగు పద్యగద్యాలలో ప్రయోగించటమని – విశదీకరించారు. అభిప్రాయంబు గుఱించి – అంటే అభిప్రాయఘటనమని; దాని అర్థం శ్రీహర్షుడు సంస్కృతంలో తన వ్యుత్పత్తిని ప్రదర్శించిన స్థలాలలోనూ, శ్లేషలను ఘటించిన చోట్లలోనూ, సుదీర్ఘవర్ణనాకీర్ణంగా విస్తరించిన సన్నివేశాలలోనూ కథాప్రతిపాదితమైన అభిప్రాయాన్ని శ్రీనాథుడు తెలుగుచేయటం, అని వీరి వివరణ. భావం బుపలక్షించి – అంటే భావోపలక్షణమని; మూలంలో తరచుగా ప్రయుక్తమైన కేవలవ్యుత్పత్తిప్రదర్శనను వదిలిపెట్టి, అనువాదానికి లొంగని శ్లేషలను విడిచివేసి, వర్ణనీయాంశాల అతివేలతను వీలైనంత తగ్గించి, రసోపస్కారకమైన ముఖ్యాభిప్రాయాన్ని మాత్రమే ఆంధ్రీకరణలో కూర్చటమని నిరూపించారు. రసంబుఁ బోషించి – అంటే రసపోషణమని; ఆలంబనవిభావములైన నాయికానాయకుల, ఉద్దీపనవిభావములైన యౌవనభూషణచేష్టాదుల, తటస్థోద్దీపనవిభావములైన మలయానిలచంద్రాదుల, సాత్త్వికభావములైన స్తంభాదుల, స్థాయిభావములైన రత్యాదుల వర్ణనం – అన్నారు. అలంకారంబు భూషించి – అంటే అలంకారభూషణమని; మూలంలోని అలంకారాలను ఒకప్పుడు యథాయథంగా సంతరించటం, మరొకప్పుడు అన్యధాకరించటం, సరిక్రొత్త అలంకారాలను కైసేయటం, అమూలకాలంకారాలను ప్రకల్పించటం, అని వివరించారు. ఔచిత్యం బాదరించి – అంటే ఔచిత్యసమాదరణమని; రససిద్ధమైన కావ్యానికి స్థిరమైన జీవితాన్ని ప్రసాదించేది ఔచిత్యం కనుక, క్షేమేంద్రుని ఔచిత్యవిచారచర్చలో చెప్పబడిన విధంగా అనువాదంలో ఔచిత్యభేదాలన్నింటిని పాటించటం – అని చెబుతూ, ఆ ఔచిత్యభేదాలను ప్రస్తావించారు. అనౌచిత్యంబుఁ బరిహరించి – అంటే అనౌచిత్యపరిహారమని; మూలంలో అనుచితములైనవాటిని, ప్రకరణోచితం కానివాటిని అనువాదంలో విడిచివేయటం, అన్నారు. ఈ ప్రతిపాదనలు అన్నింటికీ ఆయా ప్రకరణాలలో ఉదాహరణలను ప్రదర్శించారు. ఇవన్నీ సాహిత్యవిద్యార్థులకు సుపరిచితాలే.

ఈ అర్థవల్లిని ఇదే విధంగా పర్యాయానువర్తనలతో ప్రపంచించినవారు ఇంకా పెక్కుమంది ఉన్నారు. శతశః ఉదాహృతులను కలిగిన అనేక గ్రంథాలున్నాయి. వాటిలో 1977లో వెలువడిన డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ గారి శ్రీనాథుని సాహిత్యప్రస్థానము అన్న పరిశోధనగ్రంథం ప్రశస్తమైనది.

మొత్తంమీద ఈ అన్వయక్రమంతో విభేదించినవారు లేరనే చెప్పాలి.

శ్రీనాథుని నిర్వచనంలో ‘మాతృకానుసారంబున’ అంటే, మాతృకలో ఉన్న చందాన – అని అర్థం. దీనిని శ్రీరామమూర్తి గారు విశదీకరింపలేదు. ఆ విషయాన్ని గురించి తర్వాత చర్చిద్దాము.