నా టేస్టులేనితనం

బీతోవెన్ మీద ఈనాడులో ఒక వ్యాసం చదవగానే, నేను నింపుకోగలిగే ఒక పెద్ద ఖాళీ ఏదో ఇన్నాళ్ళూ తెలియక అలాగే ఉంచేశానేమో అనిపించింది. మరిప్పుడేం చేయాలి?

నేనప్పుడు పటాన్‌చెరులో ఉన్నాను, నాలుగు వేల రెండు వందల గ్రోస్ జీతపు పనిలో. ఒకరోజు, రెండింటికి మార్నింగ్ షిఫ్ట్ అయిపోతూనే కోఠి బస్సెక్కాను.

“అదేంది? బీ… తోవనా?” క్యాసెట్ల షాపతనికి నా ప్రశ్న అర్థం కాలేదు. రెండో, మూడో ఎంక్వయిరీ కూడా అయ్యాక, ‘సుప్రీమ్’ అతను అనుకుంటా చెప్పాడు: “అట్లాంటివి ఇక్కడ దొరకవ్, బంజారాహిల్స్‌లో ట్రై చెయ్.”

బంజారాహిల్సా? వోయమ్మా! అక్కడందరూ సంపన్నులు ఉంటారంటారు. నాలాంటివాడు వెళ్ళొచ్చా?

ఆ కొనసాగింపు ప్రయాణానికి తగిన దిటవు సరిపోక, కొనుగోలును మళ్ళొకరోజుకు వాయిదావేసి…

అక్కడకు ఎలా వెళ్ళాలి? వెళ్ళినా అసలు ఎలా అడగాలి? నేను ఏ పనిని కూడా అలా చేసేయలేను. దాని గురించి కొంత ఆలోచించాలి; మథనపడాలి; గింజుకోవాలి; అప్పటికి గానీ సంసిద్ధుణ్ణి కాలేను. సమస్యేమిటంటే, ‘మనలాంటివాళ్ళు’ అనుకునే దగ్గర మన ఉనికి గురించిన చింత పెద్దగా ఉండదు. అదే ‘వాళ్ళు వేరే’ అనుకున్నప్పుడు, మన పట్ల మనం మరింత స్పృహతో ఉంటాం. కాబట్టి, ఆ గుంపులో మనం తగ్గిపోకుండా ఉండేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తాం. అందులో భాగమే ఆ మానసికపు కసరత్తంతా!

మళ్ళీ మార్నింగ్ షిఫ్ట్ కలిసొచ్చిన ఒకరోజు, ఉన్నంతలో బాగా తయారై, సికింద్రాబాద్ వెళ్ళి, అంతకుముందే బంజారాహిల్స్ ఎలా వెళ్ళాలో తెలుసుకుని వున్నాను కాబట్టి, అక్కడకు చేరుకుని, తీరా బస్సు దిగితే — రోడ్లమీద బంగారం తాపడం చేసి ఉంటుందనుకున్నానే! మామూలు డాంబారే!

కొంచెం తిరగ్గానే, ‘ఎమ్’ పేరుతో అనుకుంటాను, ఒక పెద్ద షాప్ కనబడింది. బహుశా, ఎమ్ అంటే మ్యూజిక్ అయివుండాలి! షాపు లోకి చేరాను. అడిగాను. అటువైపు ర్యాకులో చూసుకొమ్మన్నట్టున్నాడు. వెతగ్గానే, రెండు దొరికాయి. ఏంటివి? క్యాసెట్లలా లేవే! అప్పుడే సీడీ అనేమాట కొత్తగా వినబడుతోంది. అయితే, ఇవి అవి అయివుంటాయి! మరి వీటిని ఏం చేయాలి? దొరకడమే కష్టమని అప్పటికే అర్థమైంది కదా! వదులుకోలేక, కొనేశాను.

చూడండి తమాషా! నిజానికి, నా దగ్గర అప్పుడు టేప్ రికార్డర్ కూడా లేదు. ఈ సీడీ వినాలంటే, దానికి సీడీ ప్లేయర్ ఏదో కావాలంట! మళ్ళీ దాన్ని కొనడానికి, ఈసారి మానసికంగా కన్నా ఆర్థికంగా నన్ను నేను సంసిద్ధ పరుచుకొని — దీనికి కొన్ని నెలలు పట్టింది కాకపోతే — మళ్ళీ అలా షిఫ్ట్ కలిసొచ్చినరోజు కోఠి వెళ్ళాను. సీడీ ప్లేయర్ అడిగితే షాపతను ఏమన్నాడంటే, “దేఖో భయ్యా, ఈ సీడీ ప్లేయర్ ఐతే ఒక్క సీడీకే నడుస్తది; ఇది చూడు, కొత్తగా డీవీడీ ప్లేయర్ వచ్చింది; ఇస్‌మే సీడీ భీ చలేగా, ఔర్ డీవీడీ భీ.”

ధర కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే!

పదిహేను వందల టేప్ రికార్డర్ కొనడానికే అంతకుముందు వాయిదా వేసినవాడిని, సీడీ ప్లేయర్ కూడా కాదు, మొత్తం నగదు చెల్లించి ఏకంగా ఆ డీవీడీ ప్లేయరే కొనేశాను.


ఆ కనెక్షనేదో ఇచ్చేసి, బటన్ నొక్కగానే అది నోరు తెరుచుకుంటే అబ్బురంగా చూసేసి, దానికదే మళ్ళీ మూసేసుకుంటే మరింత చిత్రపడిపోయి…

ఎక్కడి బీతోవెన్నూ? ఎక్కడి నేను?

ఖండాంతరాలు దాటి నాకోసం ఎలా వచ్చిందీ సంగీతం? ఎలాంటి సైన్సిది? స్విచ్ నొక్కగానే నాకోసం ఎలా గళం విప్పబోతోంది!

సింఫనీ నంబర్ 9! మూన్‌లైట్ సొనాటా!!

ఇక, నేను వినబోయేది, ఈ భూమ్మీద ఏ కొందరో అదృష్టవంతులు విన్నది! ఇక, నా లోపలి మలినాల బరువుల్ని తొలగించుకుని తేలిక కాబోతున్నాను! భూమినీ ఆకాశాన్నీ నేనిక ఎత్తు పెరగడం ద్వారా కలపబోతున్నాను. నా సకలావయవాల్నీ కేవలం ఈ గొప్ప శబ్దం కోసమే ఇన్నేళ్ళు వేచివుంచాను!

రెడీ.

1… 2… 3.

కళ్ళు మూసుకో!


ఒకట్రెండు సార్లు, సౌండు తగ్గించుకుని నీలి దేహాలు చూడ్డానికి తప్ప, ఆ డీవీడీ ప్లేయర్ ఇంకెందుకూ పనికిరాలేదు, ఆ తర్వాత! పైగా నా దగ్గర ప్లేయర్ ఉందన్న చెడ్డ పేరొకటి!

బీతోవెన్నూ, బీతోవెన్నూ, ఎంత పనిచేశావ్! నిన్ను అందుకోకుండా నన్ను ఇలా ఎందుకుంచేశావ్!