ఇది చాలు నాకు

తెలవారుౙాము
పక్షుల కేరింతలు
చీకటి తలుపులు తట్టే వెలుగుల వేలుపు
సుప్రభాతం పాడే నీ కాలి అందెలు
నీ కళ్ళలో మేలుకునే నా కళ్ళు
ఇది చాలు నాకు


చన్నీళ్ళలో కొన్ని వేన్నీళ్ళు
ఉతికిన తుండు సువాసన
స్నానాల గదిలో జలపాతం
నా స్నానంతో తడిసే నువ్వు
ఇది చాలు నాకు


కురిసే వర్షం
వేడుక చూసేందుకు కిటికీ
ఒక్కటే కుర్చీ
అందులో నువ్వు నేను
ఇది చాలు నాకు


చెరువుగట్టు
స్నానాలాడే పిచుకలు
రెక్కలారేస్తే ఎగిరిపడే చుక్కలు
ముఖం తుడుచుకోడానికి నీ చెంగు
ఇది చాలు నాకు


వెన్నెల కురిసే రేయి
దిక్కులు లేని అడవి
నీతో కాలిబాట నడక
ఇది చాలు నాకు


మానులు వణికే మార్గశిరం
రక్తం గడ్డకట్టిపోయే చలి
వేడి కోరుకునే దేహం
ఒకే దుప్పటిలో నీతో
పంచుకునే వెచ్చదనం
ఇది చాలు నాకు


జాబిలి పళ్ళెం
చుక్కల అన్నం
చేతులు కడుక్కోడానికి సంద్రం
తుడుచుకోడానికి మేఘం
నిద్రకి నీ తోడు
కలతో మేల్కున్నప్పుడు
నామీదకు ఒరిగివున్న నువ్వు
ఇది చాలు నాకు


తోటలో ఒక పర్ణశాల
నేలజీరాడే చెట్లకొమ్మలు
సన్నగా గాలి తెమ్మెరలు
సెలయేటి గలగల
సౌకర్యంగా ఊయల
ఒక చక్కటి పుస్తకం
పుట గుర్తుపెట్టేందుకు
నీ సిగ నుండి రాలిన
ఒకటి రెండు పువ్వులు
ఇది చాలు నాకు


మెత్తటి అన్నం
ఉప్పుతో ఉడికించిన ఆకుకూర
కూరగాయలతో చేసిన రసం
కాసిని ఎండు పళ్ళముక్కలు
వడ్డించేందుకు నువ్వు
కలిసి తినేందుకు మనం
ఇది చాలు నాకు


వెదురు పొదలు
మూలికల పరిమళం
పేముకుర్చీ
ప్రపంచ జ్ఞానం
నిండు నిశ్శబ్దం
నువ్వాలపించే గీతం
ఇది చాలు నాకు


మితంగా ఒక నవ్వు
సున్నితంగా ఒక మాట
కుతూహలంతో ఒక చూపు
మనసు తాకే మెచ్చుకోలు
మంచికవితకి రాలిపడే
నీ ఒక్క కన్నీటి బొట్టు
ఉంటే చాలు, ఏం కావాలి నాకు?


(మూలం: “ఇదు పోదుం ఎనక్కు” సంపుటి: పెయ్యెన పెయ్యుం మళై (కురవమనగా కురిసే వర్షం), 1998.)