తత్వం…

నిద్రిస్తున్న రహదారిని లేపి
కృతజ్ఞతలు చెప్పాలని ఉంది

నిద్రాభంగమైన
ఆ ప్రశాంతతను గమనించాలని ఉంది

దిక్కులన్నీ చిక్కు ముడులు కావని
విడమరచి చెప్పాలని ఉంది

జీవితానికి రహదారి
ప్రయాణానికి గతుకుల దారి
ఒకటి కాదని ఒప్పించాలని ఉంది

ఎవరు ఎక్కడనుండి వచ్చినా
చివరకు చేరేది నీలోనే అని
నమ్మించి ఓదార్చాలని ఉంది

చెమ్మ కనిపించనివ్వని
చీకటి తత్వానికి
ఆధ్యాత్మిక తత్వం జోడించాలని ఉంది

మళ్ళీ మంచి నిద్రలోకి పోయేదాకా
జోల పాడాలని ఉంది!