ఐదు కవితలు: మబ్బుల్లో బొమ్మలు

రెక్కలు విప్పుకొన్న దూది కొండల్లో
చెట్లూ, ఏనుగులూ, కొండశిలవలూ ఇంక యేవో
అగపడినట్టే పడి మాయమవుతుంటాయి
వాటి కిందగా ఒంటరిగానో గుంపులుగానో
దేన్నీ పట్టించుకోకుండా
రెక్కలాడిస్తూ పోతున్న పిట్టలూ-

ఆకాశానికి రంగురంగుల నిప్పంటుకుంటుంది
మబ్బులు కాస్త రంగు పుంజుకుని
సాయంత్రపు షికారుకు బయల్దేరతాయి

ఎంత కొత్తగా రంగులద్దుకున్నా
బొమ్మ బాగా కుదర్లేదని
ఇంకో పడమటి పొద్దుని
చెరిపేస్తుంది రాత్రి
చీకటి తెరలు దించేస్తూ!

ఆరుబయట వెల్లికింతలా పడుకుని
మిలమిల మెరిసే చుక్కలని
చూపుడు వేలి గీతలతో కలిపితే
బొమ్మలే బొమ్మలు కలల్లోకి జారుతూ-
నడిరాత్రి ఆకాశంలో పెళ్ళవుతుంది
మెరుపుల దండలూ, వురుముల మేళాలూ-
మంచాలు హడావిడిగా వరండాల్లో ఇరుక్కుంటాయి

ఇప్పుడు నీడకోసమో, వానకోసమో వెతికే కళ్ళకు
మబ్బుల్లో బొమ్మలు కనపడవు
వెలుతురు కోసమే వేచేవాళ్ళకు
చుక్కల్ల మిణుగురులు అక్కరలేదు.

(13/03/1997)

రచయిత చంద్ర కన్నెగంటి గురించి: జననం గుంటూరు జిల్లా సౌపాడులో. నివాసం గ్రేప్‌వైన్‌, టెక్సస్‌లో. సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేస్తున్నారు. కథలు, కవితలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. కథనంలో శిల్పంలో వీరు చూపించే విభిన్నత అపూర్వం.  ...