(కె.వి. గిరిధరరావు గారు శాన్ డియేగో లో ఉంటారు. ఇండియాలో పత్రికలలో కవితలు, కథలు ప్రచురించారు. )
“ప్లీజ్ మరోసారి జాగ్రత్తగా వెదికించండి. ఆ ఆర్నమెంట్స్ సెంటిమెంట్స్‌తో ముడిపడ్డవి. ప్లీజ్..” మాటలు తడబడుతున్నై. కాళ్ళు చల్లబడుతున్నై. మనసంతా చికాకు.
ఎందుకిలా జరిగింది? మాకే ఎందుకిలా జరిగింది?
“మేమంతా జాగ్రత్తగానే వెదికాం. రూమంతా ఒకటికి రెండుసార్లు పరిశీలించాం. మీరే బయట ఎక్కడైనా మరచిపోయారేమో గుర్తుతెచ్చుకోండి” అంది హోటల్ మేనేజర్.
నా నోట్లోంచి మాటలు బయటకు రావటం లేదు. ఇంకొంచెం గట్టిగా మాట్లాడాలని ప్రయత్నిస్తే కళ్ళవెంట నీళ్ళొచ్చేలా వున్నై. ఇది మన వూరు కదు. మన దేశం అంతకన్నా కాదు. ఇలాంటి చోట ఇలా జరగడమేమిటి?
“హోటల్‌నుండి చెకౌటయిన తర్వాత, నగలను వంటి మీంచి తీసే అవసరం మాకు రాలేదు. హోటల్ గదిలోనే మరిచిపోయాం. దయచేసి మరోసారి వెదికించండి మాడమ్” అంటున్నారు కిశోర్.
“రూంను క్లీన్ చేసిన మెయిడ్‌ను మరోసారి విచారించండి మాడమ్” అభ్యర్థిస్తున్నారు వాసు.
నా భర్త గోపాల్ పరిస్థితి కూడా నాలానే వున్నట్లుంది. తనేం మాట్లాడకుండా మౌనంగా చూస్తున్నారు.
కిశోర్, వాసు లు గోపాల్‌కు ఇండియాలోనే పరిచయం. సుమతి, అనిత లు నన్ను సముదాయించడానికి ప్రయత్నిస్తున్నారు.
సుమతి కిశోర్ భార్య. వాసు అర్థాంగి అనిత.
“రూంను క్లీన్ చేసిన మెయిడ్ డ్యూటీలో లేదిప్పుడు. మీ ఫోన్ నంబరిస్తే, మరోసారి విచారించి విషయం మీకు తెలియజేస్తాం” అంది మేనేజరమ్మ.
ఆమెకు ఫోన్ నంబరిచ్చి, మరోసారి బ్రతిమాలుకొని హోటల్‌లోంచి బయటకొచ్చాం. ఇక ఫ్లాగ్‌స్టాఫ్‌లో వుండి కూడా చేసేదేం లేదు కాబట్టి, ముందు ప్లాన్ చేసుకున్నట్టుగానే వ్యాన్‌లో ఇళ్ళకు బయల్దేరాం.
మంగళసూత్రం విలువ డాలర్లలో తక్కువనిపించినా, సెంటిమెంట్‌కి, సంప్రదాయానికి విలువ కట్టగలమా? కట్నంలో భాగంగా అత్తమామల కోరిక మీద, అమ్మా వాళ్ళు నాకు చేయించిన డైమండ్‌రింగ్ విలువ డాలర్లలోనూ ఎక్కువే. పెళ్ళయినప్పటి నుండి నిన్నటి వరకు, ఆ రింగ్‌ను ఒక్కనిమిషం పాటు కూడా వేలి నుండి తీయలేదు. ఘటన అంటే ఇదే కాబోలు మొదటిసారి వేలి నుంచి తీసాను, మరి కనిపించకుండా మాయమైంది.
పోయిన నగల విలువ డాలర్లలో రెండు వేల పైనే వుండొచ్చు. కానీ పెళ్ళయిన నాలుగు నెలల్లోనే మంగళసూత్రం కనపడకుండాపోతే ఏం జరుగుతుందో ఏమో?!
ముందుముందు జరగబోయే కీడు గురించిన హెచ్చరిక కాదు కదా ఇది!
దేవుడా! మాకెందుకిలా చేసేవయ్యా?
“ఊరుకో కవితా, వాళ్ళు మళ్ళీ వెదుకుతామన్నారు గా. ఐనా బాధ పడ్డంత మాత్రాన పోయిన నగలు దొరుకుతాయా? ముందే జాగ్రత్తగా వుండాల్సింది” అన్నారు గోపాల్. అది వూరడింపో, మందలింపో నా కర్థం కాలేదు.
నేనూ, గోపాల్ రెండు నెలల క్రితమే అమెరికా వచ్చాం. క్రిస్‌మస్ హాలిడేస్‌లో నాలుగురోజుల పాటు ఇంట్లోంచి బయటపడి చుట్టుప్రక్కల తిరిగొద్దామని కిశోర్ గారు ఫోన్ చేస్తే గోపాల్ సరే నన్నారు. వాసు వాళ్ళు కూడా ట్రిప్‌లో జాయినయ్యారు. వర్మ వాళ్ళు కూడా రావలసింది చివరి క్షణంలో డ్రాపయ్యారు. లాస్ వేగస్ చూసుకుని, నిన్న మధ్యాన్నం “ఫ్లాగ్‌స్టాఫ్ ” వచ్చి హోటల్లో బాగ్స్ పడేసి, మొహం కాళ్ళు కడుక్కుని, మాతోబాటుగా తెచ్చుకున్న చపాతీలు, పులిహోర తిని గ్రాండ్ కాన్యన్ చూడ్డానికి బయల్దేరాం.
సాయంత్రం వరకూ అటూ ఇటూ తిరిగి రాత్రికి హోటల్‌కు చేరుకున్నాం. చలి ఎక్కువగా వుండడంతో థర్మల్స్ తొడుక్కునే సరికి, మంగళసూత్రం ఒరుసుకుంటుంటే తీసి దిండు కింద దాచేను. దాంతో పాటే డైమండ్ రింగ్‌ను కూడా. నాకిప్పటికీ అంతు చిక్కనిది ఎన్నడూ లేంది ఇప్పుడు డైమండ్ రింగ్‌ను వేలినుండి ఎందుకు తీసాననే విషయం.
ఉదయాన్నే హడావిడిగా రెడీ అయి, హోటల్ నుండి చెకౌటై బయటకు వెళ్ళేప్పుడు దిండు కింద దాచిన నగల గురించి మర్చిపోయానని మధ్యాన్నం లంచ్ చేసేప్పుడు గుర్తొచ్చింది.
వెంటనే హోటల్‌కి ఫోన్ చేసి మా వస్తువులు దొరికాయేమో కనుక్కున్నాం. లేదన్నారు.
ఐనా పట్టువదలకుండా ముఖాముఖి కనుక్కుందామని హోటల్ దగ్గరకి మళ్ళీ వెళ్ళినా వుపయోగం లేకుండా పోయింది.
మనసంతా బాధ.
బంగారాన్ని పోగొట్టుకున్న బాధా? విలువైన డైమండ్ రింగ్‌ను చేజార్చుకున్న బాధా? లేక విలువ కట్టలేని మంగళసూత్రాన్ని పోగొట్టుకున్న బాధా? మా వారు నా అజాగ్రత్తను, మతిమరుపును జీవితాంతం దెప్పుతారన్న బాధా?
ఏ బాధ ఇది??
ఓ సాయిరాం! అనుగ్రహించు తండ్రీ.
ఏడుకొండల వాడా వెంకటరమణా! నేనీసారి ఇండియా వచ్చినప్పుడు తిరుపతి కొండకు వస్తాను స్వామీ.
దయచేసి నా నగలు నాకు అనుగ్రహించు.
జీసస్ … కరుణించు ప్రభూ!
అమ్మా దుర్గమ్మా, సంతోషి మాతా!
గుర్తొచ్చిన దేవుళ్ళను, దేవతలను ప్రార్థిస్తున్నాను.
మాతో పాటుగా వచ్చిన ఫ్రెండ్స్ చాటుగా మామీద జోకులేసుకుని నవ్వుకుంటారన్న బాధ ఒక్కోసారి నగలు పోయాయన్నబాధను డామినేట్ చేస్తోంది. వాళ్ళు నవ్వుకున్నది గాక వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్‌కు ఈ సంఘటన చెప్పి ఆ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్‌కు చెప్పి వాళ్ళు వాళ్ళ … ప్చ్ ఎందుకు జరిగిందిలా?
మా అత్తవారింట్లో ఈ విషయం తెలిస్తే ఇంకేమైనా వుందా?! అసలే వాళ్ళకు పట్టింపులు జాస్తి. మా అమ్మ వాళ్ళకు తెలిస్తే వాళ్ళూ ఫీలవ్వొచ్చు .. “ఏమిటిలా జరిగింద”ని.
ఎన్నో ఆలోచనలు మనసులో సుడులు తిరుగుతున్నై.
ఇప్పుడసలు సెలవులే రాకుంటే, మేమీ టూరుకే రాకుంటే ఎంత బాగుండేది? బయల్దేరబోయే ముందు తీవ్రంగా జ్వరం వచ్చి వుంటే ఈ వూరు వచ్చి వుండే వాళ్ళం కాదు, మా నగలూ పోయేవి కావు. ఈ బాధ నుండి, టెన్షన్ నుండి తప్పించుకునే వాళ్ళం.
ఏ ప్రాబ్లం లేకుండా బయల్దేరినా, మేం ప్రయాణిస్తున్న వ్యాన్‌కు యాక్సిడెంటై, మాకెవరికీ దెబ్బలు తగలకుండా, వ్యాన్‌కు డామేజి జరిగి మా ప్రోగ్రాం కాన్సిలై … ఛ, ఛ! ఎందుకొస్తున్నాయ్ ఈ పాడు ఆలోచనలు? భగవాన్ నా మనసులోకి ఏ ఆలోచనా రాకుండా చెయ్ తండ్రీ.
సుమతి, అనితలు ఓదారుస్తున్నారు నన్ను. నగలు తప్పక దొరుకుతాయని ధైర్యం చెబుతున్నారు.
ఇలా రాకపోతే, అలా చేయకపోతే, ఇలా పోకపోతే, ఇంకోలా జరిగి వుంటే అసలేం జరక్కపోతే … పొంతన లేని ఊహల సమీకరణాలు.
అవునూ, ఎవరు కొట్టేసి వుంటారు నా నగలు?
మేం హోటల్ రూంను ఖాళీ చేసేక, పక్క బట్టలు సర్దేవాళ్ళు నగలు కాజేసి వుండాలి. ఈ పాటికి అమ్మేసి కూడా వుండొచ్చు ఇండియాలో అమెరికా వాళ్ళ నిజాయితీ గురించి కథలు కథలుగా చెబుతారు కదా! ఇక్కడి వాళ్ళు దొంగతనం చేయరని, దొంగసొమ్ము నాశించరని ఉదాహరణలతో చెప్పగా విన్నాను కదా! మరి అదే నిజమైతే నా నగలింకా దొరకవేం?
నా పిచ్చిగానీ, ఎవరికైనా డబ్బు గానీ, బంగారం గానీ, వజ్రాలు గానీ దొరికితే తిరిగి ఇస్తారా? ఆంధ్రలోనైనా,అమెరికాలోనైనా మనిషి మనిషే! డబ్బు డబ్బే! ఊరికే వచ్చే సొమ్ము ఎవరికి చేదు?
ఒకవేళ నేను నగలు మర్చిపోవడం గమనించి, నాకు లెసన్ నేర్పడానికి గోపాల్ గానీ వాటిని తీసి దాయలేదు కదా!
అవునూ .. అంత విలువైన నగలు పోయి నేనేడుస్తుంటే గోపాల్ అంత ఉదాసీనంగా ఎలా వుండగలుగుతున్నాడు? ఆయన ముఖంలో అంతగా విషాదఛాయలు కూడా లేవు. తనేం ఆలోచిస్తున్నారు … విషయాన్ని ఎప్పుడు బయటపెట్టాలనా?
హమ్మయ్య .. సగం టెన్షన్ తగ్గింది. నా నగలు పోకపోవడానికీ ఛాన్స్ ఉంది. ఒక్కసారి గోపాల్‌ను ప్రక్కకు పిలిచి “నాకంతా తెలుసు డాళింగ్. ఇక డ్రామా ఆపేసి బయటకు తీయండి నగలు” అని అడిగితే సరి. అంతగా తను ముచ్చటపడితే రెండు క్లాసులు తీసుకోమనొచ్చు.
మనసులో అలజడి కొంచెం కొంచెం తగ్గుతోంది.
గోపాల్‌ను ప్రక్కకు పిలిచి అడిగితే! అమ్మో … మేమిద్దరం అలా ప్రక్కకు వెళ్ళి మాట్లాడుకుంటూంటే మాతో పాటుగా వచ్చిన మా ఫ్రెండ్సేమనుకుంటారు? మేమలా ప్రవర్తించడం సభ్యత కాదు. నేనూ మా ఆయనా కలిసి వాళ్ళననుమా నిస్తున్నామనుకుంటారు… అవునూ వాళ్ళలో ఒకరు ఆ నగల్ని ఎందుకు దొంగిలించి వుండకూడదు??
దాదాపు రెండు వేల డాలర్లు.
తక్కువ మొత్తమేం కాదు.
అంత పెద్దపెద్ద చదువులు చదివి, కష్టపడి ఈ స్థాయికి వచ్చిన వాళ్ళు దొంగతనం చేస్తారా?
ఎందుకు చెయ్యకూడదు? ఒక్క బలహీన క్షణం చాలు.
కష్టపడి సంపాదించిన డాలరుకు ఎంత విలువో దొంగిలించిన డాలరుకూ అంతే విలువ! ఎలాగోలా సంపాదించడమే ప్రధానమైనప్పుడు … వీళ్ళలో ఒకరు నా నగలు కాజేయదానికి బోలెడంత ఛాన్స్ వుంది. పేరుకు మూడు రూముల్లో ఉన్నా అందరం అన్ని రూముల్లోను తిరిగాం, ముఖ్యంగా పొద్దున చెకౌట్‌కి ముందు. నిజానికి మా రూంకి చివరగా వెళ్ళింది సుమతి! అంతే కాదు, ఒకవేళ ఏ విధంగానో వాళ్ళ దగ్గర్నుంచి నా నగలు బయటపడ్డా పొరపాటున వాళ్ళ బట్టలతోనో, సామానుతోనో బ్యాగ్‌లోకి నగలు వచ్చాయని తప్పించుకోవచ్చు. “భలే భలే” అని ఆశ్చర్యపడవచ్చు. “మీసొమ్ము గట్టిది కాబట్టే మన దగ్గరే వుంద”ని ఆనందాన్ని ప్రకటించవచ్చు.
కనుక వీళ్ళే తీసి వుంటే రిస్క్ చాలా తక్కువ ఈ పనిలో.
ఒకవేళ డబ్బు కోసం కాకపోయినా మావారికీ, వాళ్ళకూ పాతగొడవలేమైనా వుండి ఆట పట్టించడానికైనా తీసి వుండొచ్చు. అందులో కిశోర్‌కి ప్రాక్టికల్ జోకులు వెయ్యటం అలవాటు కూడా.
అలా ఐతే ఇంతసేపా దొంగాట?
నాలో నగలు పోయాయన్న బాధ స్థానే దొంగ ఎవరో కనిపెట్టాలన్న ఉత్సుకత పెరుగుతోంది.
ఎవరు దొంగ?
రూంను క్లీన్ చేసిన మెయిడా?
మా ఆయన గోపాలా?
కిశోర్, సుమతి, వాసు, అనిత???
ఖచ్చితంగా వీళ్ళలోనే వుండాలి.
ఎవరు?
వ్యాన్ స్పీడ్‌గా వెళుతోంది. అందరూ మౌనంగా ఉన్నారు. నేను “పోలీసు కళ్ళ”తో ఒక్కొక్కర్నీ పరిశీలిస్తున్నాను. ఈయన గారేమో నిర్లిప్తంగా రోడ్డు వైపు చూస్తున్నారు. తనే తీసుంటే ఎంత బావుణ్ణు!
మిగిలిన వాళ్ళ మొహాల్లో ఇప్పుడు ఇంతకు ముందు కనపడని చాలా భావాలు కన్పిస్తున్నాయి నాకు.
ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాను.
***********
ఉలిక్కిపడి లేచేసరికి వ్యాను మా అపార్ట్‌మెంట్స్ పార్కింగ్ లాట్‌లో ఆగి వుంది. అందరం దిగాం. మా సామాను వ్యానులోంచి దింపుకున్నాం.
మరోసారి మిగిలిన వాళ్ళందరూ “బెస్టాఫ్‌లక్” చెప్పి బయల్దేరబోయారు. వాళ్ళు మాకు రెండు గంటల దూరంలో ఉంటారు.
కొంచెం “టీ” త్రాగి వెళ్ళమని బలవంతంగా వాళ్ళను ఇంట్లోకి ఆహ్వానించాను.
వాళ్ళు మా ఇంట్లోకి వస్తే ఏదో ఒక సాకుతో వాళ్ళను రాత్రికి ఇక్కడే వుండేలా చేసి ఏ అర్థరాత్రో వాళ్ళ బ్యాగులు వెదకొచ్చని నా ప్లాను. పారుతుందో లేదో!
అపార్ట్‌మెంట్ తాళం తీసుకుని ఇంట్లోకి వెళ్ళేసరికి టెలిఫోన్ ఆన్సరింగ్ మెషీన్ బీప్ విన్పిస్తోంది.
గోపాల్ వెళ్ళి హ్యాండ్‌సెట్ తీసుకుని మెసేజెస్ వింటున్నాడు. వింటూ ఒక్కసారిగా “హుర్రే” అని అరిచేడు అపార్ట్‌మెంట్ పైకప్పు దద్దరిల్లేలా.
“మన నగలు దొరికాయట! హోటల్ వాళ్ళు కాల్ చేసారు ..” అని చెబుతున్నారు గోపాల్.
నా టెన్షనంతా ఒక్కసారిగా మాయమైంది. గోడకానుకుని, అలాగే జారిపోయి కూర్చున్నాను. ఇప్పుడు అందరి మొహాల్లో ఆనందం తప్ప మరే భావమూ కనిపించడం లేదు నాకు.
కిశోర్, వాసులు పార్టీ అడుగుతున్నారు.
సుమతి, అనితలు పార్టీ బయట ఎక్కడైనా రెస్టారెంట్‌లో ఐతే బాగుంటుందంటున్నారు.
అయ్యో! వీళ్ళ గురించి నేనెంత చెడుగా ఆలోచించాను!
వీళ్ళను దొంగలనుకున్నాను. రెండు వేల డాలర్లకు స్నేహాన్ని కలుషితం చేసే సంస్కారహీనులనుకున్నాను.
క్షమించండి ఫ్రెండ్స్, క్షమించండి. మీరూహించలేని అభియోగాలను మీపై మోపినందుకు మన్నించండి.
భగవంతుడా! ఇక ముందు ఎవరినీ తొందరపడి అనుమానించని మానసిక దార్య్ఢాన్ని ప్రసాదించు.
హు… చివరికి గోపాల్‌ని కూడా అనుమానించాను. నేనంతలా బాధ పడుతుంటే నగల్ని తనే దాచి, తమాషా చూస్తాడని ఆలోచన కూడా వచ్చి వుండకూడదు నాకు.
హోటల్ వాళ్ళూ మీరు చాలా గ్రేట్!
నేను మావారిని “మెసేజ్” ను స్పీకర్‌లో రెప్లే చెయ్యమన్నాను. ఐతే ఆ ఆనందంలో రెప్లే నొక్కబోయి ఇరేజ్ నొక్కేసారు.
ఎలాగైతేనేం నా నగలు నాకు దొరికేయి.
ఇండియాలో గాని ఇలాంటి సంఘటన జరిగితే, హోటల్ వాళ్ళు మనింటికి ఫోన్ చేసి “మీ నగలు దొరికాయ”ని చెప్పడానికి ఛాన్సెంత వుంటుంది?
సమాధానం నాకు తెలుసు!
ఏమండోయ్! నేను, గోపాల్‌ను. కవిత భర్తను.
నేను కావాలనే మెసేజ్‌ను ఇరేజ్ చేసాను. హోటల్ నుంచి వచ్చిన మెసేజ్ “మెయిడ్‌ను విచారించినా నగలు దొరకలేద”ని.
అవును మరి!
అవి నా దగ్గరే భద్రంగా వుంటే ఎవరికో ఎలా దొరుకుతాయి?
పెళ్ళప్పుడు కవిత అమ్మానాన్నలు నిజంగా లక్ష రూపాయల విలువైన డైమండ్‌రింగ్‌ను కట్నంలో భాగంగా మాకు ముట్టజెప్పారో లేదోనన్న సందేహం నన్నెప్పటి నుంచో పీడిస్తోంది. నిన్న తను నగలు దిండు క్రింద దాస్తూండగా నాకో మెరుపు లాంటి ఆలోచన వచ్చింది జ్యూవలరీ షాప్‌లో రింగ్‌కు విలువ కట్టించాలని.
ఇప్పుడు నా కోరిక నెరవేరబోతోంది రేపు నేనొక్కణ్ణే ఫ్లాగ్‌స్టాఫ్‌కి వెళ్తున్నట్లు వెళ్ళి జ్యువలరీ షాప్‌లో చూపిస్తాను. తర్వాత ఊరంతా చక్కర్లు గొట్టి, ఓ సినిమా ఏదన్నా చూసి, నగలు పుచ్చుకుని తాపీగా ఇల్లు చేరతాను.
నా బుర్ర పదునైందా, మజాకానా!