(“నాసీ” గా జగమెరిగిన శంకగిరి నారాయణ స్వామి గారు కథకుడిగా తనకో ప్రత్యేక స్థానాన్ని తయారుచేసుకుంటున్నారు. అమెరికా జీవిత కథనంలో లోతుపాతులు చూపిస్తున్నారు.)
కళాకారుడికి కావల్సింది
సుబ్బారావు కీమధ్య కళాపోషణ ఎక్కువైంది.
స్థానిక తెలుగుసమితిలో సాంస్కృతిక కార్యదర్శిత్వపు శాలువా కప్పుకొని ఆ సంవత్సరం ఉగాది ఉత్సవాన్ని ఉర్రూత లూపించేశాడు ఆ ఉత్సాహంలో. ఒక లైట్ మ్యూజిక్ బాండు, ఒక హాస్య నాటిక (స్త్రీ పాత్ర లేనిది), ఒక కూచిపూడి ప్రదర్శన .. ఇవన్నీ ఆ ఉత్సవ వేదిక మీద సుబ్బారావు కళారాధన తత్పరతకి అద్దం పట్టాయి.
అమెరికా తెలుగువారు రెండేళ్ళ కోసారి తాము జరుపుకునే మహా జాతరకి మహా మహా తారల్ని, కళామతల్లి ముద్దుబిడ్డల్ని ఆంధ్రదేశం నించి టెంపరవర్రీగా దిగుమతి చేసుకుని తమకున్న కళాభక్తిని ఋజువు చేసుకుంటూ రావటం తమ రెరిగినదే. (ఇక్కడ తమలాంటి తెలివైన పాఠకుడు లీగల్ పాయింట్ తియ్యొచ్చు, అమెరికా తెలుగువారు రెండు గ్రూపులై, ఈ రెండు గ్రూపులూ ఆల్టర్నేట్ సంవత్సరాల్లో రెండేళ్ళకోసారి జాతర్లు జరిపించటం వల్ల ఈ జాతర ప్రతి సంవత్సరమూ జరుగుతోందీ అని. నాకు ఆపాదించబడిన శక్తి వల్ల ఈ పాయింటుని కొట్టి వెయ్యడమైనది. ఋజువులు కావల్సిన వారు “నిరంకుశాః కవయః” అన్న ముక్క మననం చేసుకోవలెను). సుబ్బారావుకి ఎట్లాగైనా ఆ తారల్ని తమ స్థానిక తెలుగు కళావేదిక మీద ప్రకాశింప చెయ్యాలన్నది ఇప్పుడు జీవితాదర్శం అయి కూర్చుంది. పాపం చాలా ప్రయత్నించాడు కానీ ఆ తారల వేలంపాటలో తూగలేక పోయాడు. తీరా వేలం ముగిసే సరికి సుబ్బారావు వంతుకి మిగిలిందల్లా ఒక జానపద కళాకారుల బృందం.
తమ వూరికెవరూ తారలు రావట్లేదూ అని సుబ్బారావు వాళ్ళ సమితి ప్రెసిడెంటు పెదివి విరిచాడు. జానపద కళాకారులా అన్చెప్పి సెక్రట్రీ కొట్టిపారేశాడు. సుబ్బారావుకి రోషం పొడుచుకొచ్చింది. వీళ్ళు మాత్రం కళాకారులు కారూ? వీళ్ళది మాత్రం కళ కాదూ? వీళ్ళేం హైద్రాబాదులో కూర్చుని, హాయిగా గవర్మెంటు ఉద్యోగం చేసుకుంటూ సాయంత్రం పూట ఉబుసుపోక జానపద గేయాలు నేర్చుకున్న గుంపు కాదు. అసలు సిసలైన పదహారణాల తెలుగు జానపదులు. కళ వీళ్ళకి హాబీ కాదు, అది వాళ్ళ రక్తంలోనే ఉంది. అసలింకా మాట్లాడితే వీళ్ళే నిజమైన కళాకారులు అని నొక్కి వక్కాణించాడు. దాంతో విమర్శించడానికి తెరుచుకున్న కమిటీ సభ్యుల నోళ్ళు మూత బడ్డై.
చూస్తూ చూస్తూ ప్రోగ్రామ్ పెట్టుకున్న రోజు రానే వచ్చింది. సుబ్బారావు వానేసుకెళ్ళి ఏర్ పోర్ట్‌లో కళాకారుల బృందాన్ని రిసీవ్ చేసుకున్నాడు. వాళ్ళ అమెరికా ట్రిప్పులో అదే చివరి మజిలీ. అక్కణ్ణించి ఇక మాతృభూమికి తిరుగు ప్రయాణమే. అందరూ పెట్టే బేడాతో దిగారు.
ఇంటికొచ్చి భోజనాలు చేసి కొంచెం బడలిక తీరాక ఆ బృందం సుబ్బారావుని ఒక చిన్న కోరిక కోరింది ఆ వూళ్ళో వున్న వింతలూ విశేషాలూ చూపించమని. తప్పేదేముంది, అందర్నీ వేనెక్కించుకుని ఊళ్ళోకి తీసుకెళ్ళాడు. కొన్ని మ్యూజియములూ బిల్డింగులూ అవీ చూశాక చివరిగా పబ్లిక్ పార్కుకి తీసుకెళ్ళాడు.
కొన్ని వందల ఎకరాలు మహా వృక్షాలతోనూ, ఇంద్ర ధనుసుని తలపించే పూల మొక్కల మడులతోనూ, పట్టు తివాచీల్లాంటి పచ్చిక బయళ్ళతోనూ నవ నవలాడి పోతోంది ఆ పార్కు. సుబ్బారావు ఆ బృందంతో మీరందరూ అరగంటసేపు హాయిగా తిరిగి రండి, నేనిక్కడే వుంటా నన్చెప్పి ఫౌంటెన్ గట్టుమీద సెటిలయ్యాడు. వాళ్ళు పార్కులో కెళ్ళారు.
అరగంట గడిచేప్పటికి అందరూ తిరిగొచ్చేశారు, తప్పెట వాయించే గట్టయ్య తప్ప. ఏడీ గట్టయ్య, ఎక్కడ మాయమైపోయాడు అని వాళ్ళు తర్జన భర్జనలు పడుతుండగానే ఇంకో పది నిమిషాలు గడిచిపోయాయి. ఇక సుబ్బారావుకి టెన్షన్ పెరిగిపోతోంది. ఏడీ మనిషి .. ఎక్కడన్నా దారి తెలీక తప్పి పోయాడా .. ఓ పక్కన ప్రోగ్రాంకి టైమవుతోంది .. ఛ ఛ తను కూడా వెళ్ళి ఉండాల్సింది .. ఎలాగిప్పుడు అని అతను ఖంగారు పడుతుంటే, ఎవరో అన్నారు, అదిగో వచ్చేస్తన్నాడు గట్టయ్య అని.
సుబ్బారావు అటు చూశాడు. వరసగా ఉన్న గులాబి పొదల వెనకనించి వస్తున్నాడు గట్టయ్య. అతని భుజమ్మీద గుడ్డలో కట్టిన పెద్ద మూట ఉంది. మూట పెద్దగానే ఉంది కానీ మరీ బరువున్నట్టులేదు, సునాయాసంగానే నడుస్తున్నాడు. ఆ మూటేవిటో అర్థం కాలేదు సుబ్బారావుకి. చూస్తుండగానే గట్టయ్య వచ్చి వాళ్ళని చేరుకున్నాడు.
అందర్నీ చూసి, “ఓహో, మీరంతా వచ్చేసినారే! . నేనే ఎనకాల బడ్డా నన్న మాట. సరే పదండి,” అన్నాడు.
సుబ్బారావుకి ఆ మూటేవిటో అడగాలని ఉంది, కానీ సభ్యత కాదని ఊరుకున్నాడు. అందరూ వేనెక్కారు. గట్టయ్య తన మూటని పెన్నిధిలాగా వొళ్ళోనే పెట్టుక్కూచున్నాడు. సుబ్బారావు వేన్ స్టార్ట్ చేశాడు, కానీ ఆ మూటేవిటో తెలుసుకుంటే తప్ప మనసు నిలిచేట్టు లేదు. ఇహ ఉండ బట్టలేక అడిగేశాడు గట్టయ్యని.
“మూటా! ఏం లేదు బావూ, మనూర్లో చూశా, రెండేళ్ళుగా వానలు సరింగా పళ్ళా. పొలాలే నీళ్ళు దొరక్క ఎండిపోతా వున్నై. ఇహ బంజర్ల సంగజ్జెప్పే దేవుంది? ఈ దేశంలో ఇన్ని వూళ్ళలో సూత్తన్నానా, తస్సదియ్య ఇక్కడ బయళ్ళు సూత్తే కళ్ళు సల్లగా ఉంది. ఇక ఇక్కణ్ణించి మనూరెల్లి పోతాంగా, అందికని, పసరాలకి పెట్టుకుందారని కసింత పచ్చగడ్డి కోసుకొచ్చుకున్నా బావూ. పిచ్చి ముండలు ఇంత పచ్చనాకు తిని ఎన్నాళ్ళయిందో. ఒక్క పూటన్నా కడుపునిండా తింటై నోర్లేని జీవాలు.”
ఇది విని కళారాధకుడు సుబ్బారావు వేన్ గేరు మార్చటం మర్చి పోయి అలాగే చూస్తుండి పోయాడు. అతని కళ్ళ ముందు తారలు నాట్యం చేస్తున్నై.
కూపస్థ మండూకం
యూనివర్సిటీలో పచ్చడి, ఐ మీన్ పీ హెచ్ డీ చేసే రోజుల్లో సుబ్బారావుకి బ్రిజ్మోహన్ మిశ్రా అనే సీనియర్తో పరిచయమైంది. అప్పుడప్పుడూ సుబ్బారావు బ్రిజ్ ఆఫీసులో చేరి కష్టమూ సుఖమూ చెప్పుకుంటూ ఉండేవాడు. ఒకసారి ఇలాగే ఏదో మాటల్లో ఉండగా బ్రిజ్ అకస్మాత్తుగా, “ఇవ్వాళ్ళ విశేషమేవిటో తెలుసా?” అన్నాడు.
సుబ్బారావు అయోమయంగా చూస్తూ, “తెలీదే, ఏవిటివ్వాళ్ళ?” అనడిగాడు.
“ఇవ్వాళ్ళ హోలికా పూర్ణిమ, అంటే హోలీ పండుగ!”
“వ్హాట్ ఫెస్టివల్” అంటూ వచ్చాడు బ్రిజ్ ఆఫీస్ మేటు జాన్ మోర్.
“అమెరికా పక్షివి నీకేం తెలుస్తుందిలే మిగతా ప్రపంచం గురించి. మీ అమెరికన్ లంతా ఇంతే, కూపస్థ మండూకాలు. మీ బావిలో కూర్చోని అదే ప్రపంచం అనుకుంటూ ఉంటారు,” అని ఓ విసురు విసిరాడు బ్రిజ్ మోహన్.
జాన్ దానికి నవ్వి, “నాకు తెలీదని ఒప్పుకుంటా. పోనీ తెలిసేట్టు నువ్వు చెప్పరాదా?” అన్నాడు.
ఇక బ్రిజ్ చెప్పుకొచ్చాడు హోలీ పండుగ వెనకాల ఉన్న కథ, దాని మహత్యమేవిటీ, ఎంత ఆర్భాటంగా ఆనందంగా భారతీయులు ఈ పండుగ జరుపుకుంటారూ అన్నీనూ. చెప్పొద్దూ, బ్రిజ్ మంచి వక్త. అందులోనూ కథల్ని రసవత్తరంగా చెప్పటంలో దిట్ట. ఆ కథ పూర్తయ్యే సరికి సుబ్బారావు దృష్టిలో బ్రిజ్ మోహన్ చాలా ఎత్తుకి ఎదిగి పోయాడు.
అప్పణ్ణించీ వీలైనప్పుడల్లా సుబ్బారావు బ్రిజ్ మోహన్ దగ్గర చేరి అవీ ఇవీ అడిగి తెలుసుకుంటూ ఉండేవాడు. అదే ఆఫీస్ కాబట్టి జాన్ కూడా చేరేవాడు ఆ కబుర్లల్లో. ఇరవై ఐదేళ్ళు మాతృదేశంలో ఉండి కూడా వంట పట్టించుకోని భారతీయ సంస్కృతిని గురించి సుబ్బారావు ఈ పరాయిదేశంలో బ్రిజ్మోహన్ శిష్యరికంలో ఐదారు నెలల్లోనే చాలా నేర్చుకున్నాడు.
ఆ సంవత్సరం దీపావళి పండుగ సందర్భంగా చాలా ఆర్భాటం చేశారు యూనివర్సిటీలో భారతీయ విద్యార్థి బృందం. అందులో బ్రిజ్మోహన్ తో కలిసి సుబ్బారావు కూడా ఉత్సాహంగా పాల్గొన్నాడు. బ్రిజ్ ప్రోద్బలంతో జాన్ కూడా వచ్చాడు ఆ ఫంక్షన్ కి. ఊరికే రావటమే కాదు, బ్రిజ్ దగ్గర్నించి ఒక కుర్తా పైజమా అరువుతీసుకుని వేసుకుని మరీ వచ్చాడు. బియ్యంగింజలు కలిపిన కుంకుమ నీళ్ళతో నుదుట తిలకం పెట్టించుకుని లక్ష్మీ పూజలో కూడా పాల్గొన్నాడు. కారం కారం అని వొగుర్చుకుంటూనే భోజన పదార్ధాలన్నీ ఒకటికి రెండుసార్లు వడ్డించుకుని తిన్నాడు.
ఇన్నాళ్ళూ ఇండియా అంటే ఏవిటో, భారతీయ సంస్కృతి అంటే ఏవిటో బొత్తిగా తెలీని ఈ అమెరికన్ అజ్ఞానిని ఇంతగా మార్చేసిన బ్రిజ్మోహన్ ని చూసి, అతడు తన స్నేహితుడైనందుకు సుబ్బారావు చాలా గర్వించాడు.
కొన్నాళ్ళు పోయాక ఒకరోజు సుబ్బారావు ఎప్పట్లాగే బ్రిజ్ ఆఫీసుకి వెళ్ళాడు బాతాఖానీ వేసేందుకు. జాన్ కూడా ఉన్నాడు అక్కడే. కొంతసేపు కబుర్లు చెప్పుకున్నాక, వెళ్ళటానికి లేస్తూ జాన్ అన్నాడు, “ఆ మర్చేపోయా. థాంక్స్‌గివింగ్ వస్తోంది గదా. ఈసారి మీరిద్దరూ నాతో రావాలి థాంక్స్ గివింగ్ డిన్నర్‌కి. మా పేరెంట్స్ ఇంటికి వెళ్దాం. ఆ రాత్రికి అక్కడే ఉండి శుక్రవారం తీరిగ్గా తిరిగి రావచ్చు. మీరు కూడా వస్తే నాకెంతో సంతోషంగా ఉంటుంది.”
సుబ్బారావు వెంటనే ఒప్పుకున్నాడు గానీ బ్రిజ్ మాట్లాడలేదు. జాన్ వెళ్ళిపోయాడు. అప్పుడు బ్రిజ్ సుబ్బారావుతో నిష్ఠూరంగా అన్నాడు, “అదేంటి గురూ, అట్లా ఒప్పేసుకున్నావ్? ఒకపూట భోజనం కోసం మొహం వాచినట్టు వాడితోపాటు మనం అంతదూరం వెళ్ళాలా? అదీ కాక మరుసట్రోజు బ్లాక్ ఫ్రైడే! పొద్దున్నే మాల్ కి వెళ్ళకపోతే సేల్ లో ఉన్న ఐటమ్సన్నీ ఖాళీ! అంతగా వాడితో పూసుకోవాలంటే నువ్వెళ్ళు. నేన్రాను!”
కొన్నేళ్ళుగా అమెరికాలో ఉండీ థాంక్స్ గివింగ్ మరుసట్రోజు బ్లాక్ ఫ్రైడే సేల్స్ గురించి తెలుసుకున్నాడు తప్ప, అమెరికన్ జీవితంలో థాంక్స్ గివింగ్ కి ఉన్న ప్రాముఖ్యతని, దాని భావాన్ని కనీసం అర్థం చేసుకోడానికి ప్రయత్నం కూడా చెయ్యని తన స్నేహితుడికేసి బిత్తరపోయి చూస్తుండిపోయాడు సుబ్బారావు.
అంతే. కొన్ని కప్పలు బావిలోనే ఉన్నా దొరికిన అవకాశాలు వదులుకోకుండా అన్నీ తెలుసుకుంటాయ్. మరికొన్ని బావి విడిచి వచ్చినా, ఆ వదిలిన బావినే తమచుట్టూ కట్టేసుకుని దాంట్లోనే ఉండిపోతాయ్.