వెడలెను కోదండపాణి

ధగద్ధగాయమానమైన కిరీటం ధరించి మొహంలో వర్ఛస్సు తాండవమాడుతూంటే రావణుడు సభలో గర్వంగా చర్చిస్తున్నాడు తాను బ్రహ్మ ఇచ్చిన కోరికతో దాదాపు అమరుడైన సంగతి. తపస్సులో పది తలలూ అగ్నిలో ఆహుతి చేసి రావణుడు కోరుకున్న వరం – యక్ష, కిన్నర, కింపురుష, నాగ, గంధర్వ, దేవతలనుంచి మరణం ఉండకూడదు అని. సందేహంగా అడిగాడో మంత్రి రావణుణ్ణి:

“ఇంతమంది చేత మరణం లేకుండా వరం అడిగిన మహారాజు మానవుల గురించి అడగడం మర్చిపోయేరా? ఎందుకు వాళ్ళని వదిలేసినట్టో?”

“మానవులు నాకు తృణప్రాయులు. అందుకే వాళ్ళని వదిలేశాను!”

“మరి ఆ మానవుల్లోంచే మనకి అపాయం వస్తే?”

“అదంత తలలు బద్దలు కొట్టుకునేంత విషయమా? ఇప్పటునుంచే మానవుడన్నవాడెవడు బాగా బలం పుంజుకోకుండా చేస్తే చాలదూ?” సమాధానం సేనాని ప్రహస్తుడు చెప్పేడు.

“మరి దానికి అనేక యుద్ధాలూ, జన నష్టాలూ…”

“జన నష్టాలు ఎలాగా జరుగుతూనే ఉంటాయి. యుద్ధం లేకపోతే వ్యాధులో, ప్రకృతి వైపరీత్యాలో వచ్చి జనం ఎప్పుడు చస్తూనే ఉంటారు కదా?”

“సరే. మనం ఇప్పుడు చేయవల్సిన కార్యం?”

“భూమండలం మీద ఉండే ఒక్కో రాజునూ ఓడించుకుంటూ పోవడమే. వేగుల్ని పంపించి ఎక్కడెక్కడ రాజులు బలం పుంజుకుంటున్నారో విచారించి ఎప్పటికప్పుడు వాళ్ళని అణిచేయడమే!”

“అలాగైతే మొదటి దండయాత్ర ఎక్కడ మొదలు పెడదాం?”

“ఇక్ష్వాకు రాజధాని అయోధ్య”


రాజ్యాలన్నీ జయించి విజయగర్వంతో తిరిగివచ్చిన రావణాసురుడు ముందున్న ప్రణాళికలు ఆలోచిస్తున్నాడు. ఎప్పటికప్పుడు వేగుల ద్వారా వినడం బట్టి బలం పుంజుకున్న ఏ రాజైనా సరే తలొంచి దేహీ అనకపోతే ప్రాణం తీయడమే. దిక్పాలకులని జయించిన తర్వాత పోనీ వరసకి అన్న అవుతాడు కదా అని కుబేరుణ్ణి చూసీ చూడకుండా వదిలేస్తే ఆయనే ఓ దూతని పంపించేడు తనకి సుభాషితాలు చెప్పించడానికి. ఎంత ధైర్యం? ఆ దూతని భక్షించి దండయాత్ర కెళ్ళేసరికి అంతటి ధనవంతుడూ తోకముడిచి పారిపోయేడు లంక లోంచి; పిరికిపంద. ఇప్పుడు సునాయాసంగా పుష్పకం, లంకానగరం చేతిలోకి వచ్చేయి. శత్రుశేషం మిగిలి ఉన్నంత వరకూ ఇలా చూస్తూ ఉండవల్సిందే. ఏ తరానికా తరాన్ని నాశనం చేయకపోతే ఏమో ఏ పుట్టలో ఏ పాము పుడుతుందో? గాలిలో, భూమ్మీద, ఇంట్లో, బయట, ప్రాణం ఉన్నదానితో గానీ లేనిదానితో గానీ చావు రాకూడదని కోరుకున్న హిరణ్యకశిపుణ్ణి ఆ పెద్దాయన ఎలా చంపేడో జగమెరిగిన సత్యం. ఎల్లకాలం అప్రపమత్తంగా ఉండవల్సిందే. అయినా ఇన్ని తరాల్లోనూ మానవమాత్రుడెవరూ తనముందు కత్తి ఎత్తలేకపోయేడు. వీళ్ళా నన్ను చంపేది? నవ్వొచ్చింది రావణుడికి. తాను కోరుకున్న కోరిక అద్భుతమైంది. బ్రహ్మ అమరత్వం ఇవ్వనంటే నేను సాధించుకోలే ననుకున్నట్టున్నాడు. అప్రయత్నంగా రావణుడి చేయి మీసం మీదకి పోయింది.

ఈ లోపుల ద్వారం దగ్గిర్నుంచి వినిపించిందో సేవకుడి కంఠం, “విభీషణులవారు మాట్లాడడానికి వచ్చారు. ఏమి శెలవు?”

“పంపించు.”

లోపలికొచ్చిన విభీషణుడు ఏమీ ఉపోద్ఘాతం లేకుండా చెప్పేడు. “అన్నా, ఇన్ని రోజులూ పుంజుకుంటున్న తర తరాల మానవులని చంపేం. మన రాజ్యం అప్రతిహతంగా సాగుతోంది. నయానో భయానో యక్ష, కిన్నర, కింపురుష, దేవతల్నీ జయించడం కూడా అయింది. ఇంక యుద్ధాలు మానడం మంచిదని నాకనిపిస్తోంది. మనకి లంకలో దుశ్శకునాలు కనిపిస్తున్నాయి; చచ్చిన రాజుల ఉసురు ఊరికే పోదు కదా? ఇప్పుడు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది…”

ఏదో చెప్పబోతున్న విభీషణుణ్ణి అడ్డుకుని అన్నాడు రావణుడు. “నేను బ్రహ్మని కోరిన అసలు వరం మృత్యువు రాకూడదనే. విరించి అలా వరం తీర్చడం కుదరదన్నప్పుడు ఈ మానవులని వదిలేసి మిగతా వాళ్ళచేతుల్లో చావకూడదని కోరుకున్నాను. ఈ గడ్డిపరకలన్నింటినీ ఎప్పటికప్పుడు ఏరి పారేస్తూంటే నాకు మృత్యువనేదే లేదు. వీళ్ళని ఏరిపారేయడం కోసం ఆ మధ్య కైలాసం పైకెత్తి శివుణ్ణి మెప్పించాను కదా? ఆయనిచ్చిన చంద్రహాసంతో…”

విభీషణుడు నమ్మలేనట్టు చూసేడు రావణుడి కేసి. నోరు పెగుల్చుకుని అన్నాడు “అన్నా, నువ్వు నిజంగానే అమరుడవని నమ్ముతున్నావా?”

“ఎందుకా సందేహం?”

“నువ్వు కైలాసం పైకెత్తినప్పుడు నందీశ్వరుడిచ్చిన శాపం మర్చిపోయాయావా?”

రాజభవనం కదిలిపోయేలాగ నవ్వేడు రావణుడు తన పేరుని సార్ధకం చేస్తూ. “యముణ్ణి జయించిన నేను – ఇంద్రుణ్ణి జయించిన మేఘనాదుడూ, కుంభకర్ణుడూ, నువ్వూ నాకు అండగా ఉండగా – కోతి మూకల మూలంగా చస్తానా? ఎవడో ఒక ఎద్దు మొహంగాడు ఏదో అంటే దాన్ని పట్టుకుని నాకు పిరికిమందు పోయకు విభీషణా!”

శివ శివా! చెవులు మూసుకున్నాడు విభీషణుడు. “నేను చెప్దామనుకున్న విషయం విను. ఎప్పుడో ఇక్ష్వాకు వంశంతో మొదలుపెట్టి ఇప్పటిదాకా ప్రతీ తరం రాజునీ అణుస్తూనే ఉన్నాం. ఇప్పుడు అక్కడే ఉన్న అయోధ్య రాజు అణరణ్యుడనేవాడు బలం పుంజుకుంటున్నాడని వార్తలొస్తున్నాయి. ఇది చెప్పడం నీ ఆంతరంగికుల్లో ఒకనిగా నా బాధ్యత. యుద్ధం వద్దు అని చెప్పడానికి వచ్చాను ఎందుకంటే నువ్వు ఎంతమందిని ఎన్నిసార్లు అణిచినా మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేరు కానీ ఈ పరిస్థితిలో నేను చెప్పేది నీకు నచ్చేటట్టు కనిపించదు, శెలవు.”

రావణుడి సమాధానం కోసం చూడకుండా బయటకి నడిచేడు విభీషణుడు చిన్న బోయిన మొహంతో.


పదిరోజుల్లో అయోధ్య మీద విరుచుకు పడింది రాక్షససేన. పిరికివాడిగా పారిపోకుండా ధనుస్సు చేతబట్టుకుని బాణాలు సంధించేడు అనరణ్యుడు. పదితలల రావణుడి ముందా ప్రతాపం? రావణుడు వేసిన అస్త్రాలలో తలకి ఎనిమిదివందల బాణాలు తగిలి నేలకొరిగిపోయేడు మహారాజు. కొస ప్రాణంతో ఉన్న రాజుని చూడ్డానికొచ్చేడు రావణుడు ఠీవిగా నడుచుకుంటూ. కళ్ళెత్తి రావణుడికేసి చూసేడు అనరణ్యుడు. మొదట కనబడిన దృశ్యంలో రావణుడు నవ్వే విషపు నవ్వు క్రమక్రమంగా ఏడుపులోకి మారుతోంది. ఏడుస్తూన్న రావణుడు నేలమీద పడి పొర్లుతున్నాడు. పక్కనే ఓ ఆజానుబాహువు కిందపడిన రావణుడి కేసి జాలిగా చూస్తున్నాడు. పరికించి చూస్తే మొహం బ్రహ్మ వర్ఛస్సుతో సూర్యుణ్ణి తలపిస్తున్న ఆ ఆజానుబాహువు, సూర్యవంశపు రాజే! తర్వాతి దృశ్యంలో విగతజీవుడైన రావణుడు యుద్ధభూమిలో పడిఉన్నప్పుడు దేవతలు పుష్పవర్షం కురిపిస్తున్నారు ఆ ఆజానుబాహుడి మీద. ఏదో అర్ధమైనట్టూ, అనరణ్యుడు చెప్పేడు పైకి,

ఉత్పత్స్యతే కులే హ్యస్మిన్న్ ఇక్ష్వాకూణాం మహాత్మనాం
రాజా పరమతేజస్వీ యస్తే ప్రాణాన్ హరిష్యతి

“నీ ప్రాణాన్ని తీయడానికి త్వరలో ఓ మహాతేజస్వి నా కులంలో పుట్టబో….” ఈ మాటలు నోట్లోంచి వస్తూండగానే అనరణ్యుడి ప్రాణం అనంతవాయువుల్లో కల్సిపోయింది. ఎవరో ఛెళ్ళున చెంప మీద కొట్టినట్టూ రావణుడు కంగారు పడ్డాడు. వంధిమాగదులు చదివే స్తోత్రాలు కళ్ళు కప్పేసినా లంకకి రాగానే విభీషణుణ్ణి పిలిపించేడు మాట్లాడ్డానికి. అనరణ్యుడు ప్రాణం పోయే ముందు అన్న మాట చెప్పగానే విభీషణుడన్నాడు,

“అన్నా నందీశ్వరుడి శాపం మహత్తరమైంది. సందేహం లేదు. ఇప్పుడీ అనరణ్యుడు అన్న మాట చూస్తే ఈ మనుషులు ఎప్పటికప్పుడు బలం పుంజుకుంటున్నారనీ, మనుషుల్లోంచే నీ ప్రాణాంతకుడు పుట్టబోతున్నాడనేది తెలుస్తూనే ఉంది. ఇంతమంది ఉసురు మనకి అనవసరం. కాస్త ఆలోచించి చూడు. అనరణ్యుడు బలం పుంజుకుంటున్నాడని తెలుస్తోంది కానీ మనమీద యుద్ధానికి కాలు దువ్వలేదే?”

“విభీషణా, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండకపోతే ఎలా?”

“దేనికీ అంత అప్రమత్తంగా ఉండడం?”

“రాబోయే చావుకి!”

“అది తప్పించగలవా?”

“మనుషులందర్నీ నా చెప్పుచేతల్లో పెట్టుకోగల్గితే, తప్పకుండా తప్పించుకోగలను.”

“ఎంతకాలం తప్పించుకోగలవు? ఎవరూ చంపలేకపోతే వ్యాధి రూపం లోనో, మరోవిధంగానో యముడు కాచుకుని కూర్చునుంటాడు కదా?”

“యముడా?” నవ్వేడు రావణుడు, “ఆయనకంత ధైర్యం ఉందా? నా చేతిలో ఓడిపోయేక నా కేసి చూడగలడా?”

“సరే, నీ ఇష్టం.” విభీషణుడికి ఒక్కసారి ఏదో స్ఫురించినట్లయింది.

“అన్నా, పుట్టిన ప్రతీ జీవి గిట్టక తప్పదనేది బ్రహ్మ వాక్కు. లేకపోతే ఆయన నువ్వడిగినప్పుడు అమరత్వం ఇచ్చి ఉండేవాడు కదా? నేను ఎంతచెప్పినా ఒకటే. నీ మీదకి దండయాత్రకి రాని మనుషుల మీద దాడి చేయడం అనవసరం. మానవమాత్రులు బలం పుంజుకుంటున్నారంటే వాళ్ళనో కంట కనిపెట్టడం మంచిదే కానీ ఇలా వార్త రాగానే ఏదో అత్యవసరం అన్నట్టు వాళ్ళని చంపేసి రావడం ఎంతవరకూ సమంజసం? ఇది కూడా దాదాపు ఇష్టం లేని స్త్రీని బలాత్కరించడం వంటిదే. ఓ వేదవతి శాపం, రంభ ఇచ్చిన శాపం, కామధేనువు బిడ్డడైన నందీశ్వరుడి శాపం, ఇప్పుడు అనరణ్యుడు చెప్పిన వాక్కూ అవన్నీ ఒక్కసారిగా కలబడి మీద పడితే అప్పుడు చేసేదేమీ ఉండదు కదా? నువ్వు జగత్సంహారకుడైన శివుణ్ణి మెప్పించిన పులస్త్య బ్రహ్మ వంశ సంజాతుడివి. ఇంతటి నీచానికి దిగజారవల్సిన అవసరం లేదు. కొద్దిగా ఆలోచించి చూడు.”

“నువ్వెన్ని చెప్పు విభీషణా, నేను ఈ మనుషులని అదుపులో ఉంచవల్సిందే.”

విభీషణుడు చెప్పేది మొదట్లో కాస్త విన్నట్టు అనిపించినా చావు గుర్తొచ్చేసరికి రావణుడు లేచిపోయేడు. విభీషణుడు నిట్టూర్చేడు.


కుటీరం బయట చెట్టునీడలో కళ్ళు మూసుకుని కూర్చున్నాడు విశ్వామిత్రుడు. కొద్దిరోజుల క్రితం తాను చేయబోయిన యాగం గుర్తొచ్చింది. యాగం మొదలయేలోపుల అగ్ని ఆరిపోయేది. సమిధలు మాయమై వాటి స్థానే ఎముకలు కనిపించేవి. ఈ పనులన్నీ మారీచ సుబాహులవే. వీళ్ళకి తోడు ఆ తల్లి తాటకి ఒకత్తె. ఈ కుర్ర కుంకల్ని చంపడం పెద్ద పని కాదు కానీ ఇన్ని వేల ఏళ్ళు తపస్సు చేసి తన శతృవు చేత బ్రహ్మర్షి అనిపించుకున్న తనకి యాగం చేసే సమయంలో కోపం రాకూడదు. అయినా ఈ రాక్షసులకి ఇంతబలం రావడానిక్కారణం వీళ్ళ పైనున్న దశకంఠుడిది. వాడి అండ చూసుకునే కదూ పేట్రేగిపోతున్నారు. ఏదో ఒకనాడు తనకి కోపం తెప్పించి ఎలాగోలా యుద్ధానికి రప్పించడానికి పది తలలతో విశ్వప్రయత్నం చేస్తున్నాడు. వీడి చావు ఎవరి చేతుల్లో ఉందో? ఈ యాగం ప్రస్తుతానికి ఆపి ఏదో ఒకటి ఆలోచించాలి…

బిగ్గరగా ఏడుస్తున్న ఓ స్త్రీ కంఠం వినిపించి కళ్ళు తెరిచి చూసేడు మహర్షి. నడుము వంగిపోయి చింపిరి జుట్టుతో నేలమీద పడి పొర్లుతూ ఏడుస్తోందో స్త్రీ.