గంగాభాగీరథి సువాసినీ సమానులైన మహారాజశ్రీ వచనంగారికి,
మీ కవిత ఈవేళే వొచ్చింది. ఈశ్వరానుగ్రహం వల్ల ఏలాగునో ఆసాంతం చదివినాను. మీది అందమైన కవితో కాదో తెలియని స్థితి. అది తేల్చుకోవటానికి చక్షువులు సరిపోవు. శ్రవణాలు సరిపోవు. దివ్యస్వరూపమో కాదో తెలియని స్థితి. చదివిన తరువాత ఉభయకుశలోపరి అని వ్రాయటానికి సంకోచించే పరిస్థితి ఎదురైనది. మీ ఉభయం బాగుందనే తలుస్తాను. నా ఉభయం భయంగా మారినది. కొద్దిసేపు నా కలమూ, ఎప్పుడూ నా నవారు మంచం పక్కనే పడి వుండే ఇన్లాండు కవరు ఎక్కడ వున్నదో తెలియకుండా పోయిందని చెప్పడానికి సంకోచంగా వున్నది. ఇహ ఈ క్రిందిదంతా పద్యంలో వ్రాస్తే మీ అర్భకానికర్థమవుతుందో లేదోనని మీకర్థమయ్యే వచనంలో వ్రాయటం. చదువుకోండి. ఉపాసన చేస్తూ చదువుకోండి. ఆరోగ్యం బాగుంటుంది. ఈశ్వరేచ్ఛ ఉండబట్టి కాదూ! అంతా ఈశ్వరులు చూసుకుంటారనే ధైర్యం.
కుశలాలు అల్లాగట్టిపెడితే, మీ వచనం చదివినాక మీకెందుకోగాని పాఠకులలో చాల విశ్వాసమున్నదనిపించింది. మీకు వారి చప్పట్లలో విశ్వాసమున్నదనిపించింది. యుగాలవరకు కాదు కాని – అప్పుడే మరచిపోయినారు నన్ను. నా పద్యకవిత్వం అచ్చు కావడమూ లేదు. మెచ్చుకోవడమూ లేదు. అదొక దిగులని కాదు. కాని నన్ను నేను మరచిపోవాలంటే సాధ్యం కాకుండా వున్నది. జ్ఞాపకాలు తవ్వుకోవటం ఆంధ్రులకు వెన్నతో పెట్టిన విద్య. తవ్వుకోటమంటే ద్వేషం రేకెత్తించటమే. అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగులేదు, ఇప్పుడు బాగుంది, అప్పుడు బాగులేదు అని తన్నుకోటమే. యదార్థ కవిత్వాన్నుంచి, అంతకన్న తక్కువ యదార్థమైన చీకటిలోకో, వ్యర్థ కల్పనలలోకో పోతే దిగులు పడాల్సిన విషయమో కాదో నాకైతే తెలియదు. మీకేవన్నా తెలుసేమో నాకు తెలియదు. యదార్థమైన భావాన్వేషణలో ఏ సమూహాల్లోకి చేరుకున్నా చాలా సంతోషించాల్సిన విషయమే.
పోతే, భావాలు వరదలు. అందుకు సందేహం లేదు. మేమూ ఉద్రేకోత్సాహాలతో వ్రాసే వాళ్ళం కానీ మా కాలంలో ఆనకట్టలు ఉండేవి. గురువుల రూపంలో. తప్పు పడితే తాట వలిచెయ్యటమే. అందుకని భాష విషయం లోనూ, భావం విషయం లోనూ చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళం. పైగా ఎంత నామోషీ, ఎవరన్నా నీది బాగులేదన్నారంటే! తల తీసి కోట గుమ్మానికి వేళ్ళాడదీసుకోటమే! మనవల్ల కాపోతే కోట కాపలాదారుణ్ణి ఆ పని పూర్తి చెయ్యమని చెప్పటమే! అలాగుండేవి మా రోజులు. అలా చెయ్యకపోతే ఈశ్వరులు ఊరకుంటారూ? ధైర్యం సడలించరూ? మనోధైర్యం సడలించి మమ్మల్నీ కందకం లోకి తోయరూ?
మీ వ్రాత చదివినాక అర్థమైన విషయమేమంటే ఇప్పుడు గణాలు లేవు కాని, గణాచారు లున్నారు. యతులు లేవు కానీ యయాతులు వున్నారు. ప్రాసలు లేవు కానీ ప్రాకారాలు వున్నాయి. ఎవరికి ఆ కోటగోడలు దూకగల శక్తి ఉన్నదో తెలిసే పరిస్థితీ లేదు. కందకాలు కందకాలు కందకాలు. అడుగడుగునా కందకాలు. వ్రాతకు, భాషకు, భావానికి సరైన అర్థం కనపడక, ఏదో అర్థం వున్నట్టు కనిపిస్తో, అదేదో తెలీకపోవడం చేతనే, అట్లా కొట్లాటలో గడపాల్సి వస్తున్నది. సాక్షాత్ రాసిన కవిగారికే అర్థం తెలీకపోవడం చాత. ఒహవేళ ఆయన ఇదని చెప్పినా ఎవడూ నమ్మక పోవటం చాత. మా పరిస్థితి అలాక్కాదు. ఎక్కడో ఒక కాంతిరేఖ మెరిసినట్టు ఒక పండితుడొచ్చి ఒక మంచి మాట చెప్పి మమ్మల్ని మా రచన్ను, భాషను, బాగులేకుంటే భావాన్ని బాగుచేసేవాడు. మేమూ అందుకు సిద్ధంగా ఉండేవాళ్ళం. అంచాత, అట్లా నిలబడుకొని వున్నాం నిన్న మొన్నటిదాకా. ఈశ్వరులు మిమ్మల్ని ఆ దిశగా ఆలోచించమన్నారు.
అయినా ఈ పాడు పాఠకులనుంచి నేను ఎందుకు తప్పుకోకూడదు? సమయం మనది కానప్పుడు కాపలా కుక్క మొరిగినా నిద్దరోతూనే ఉంటామని కాదూ అనుకోటం? అన్నేళ్ళు బతికిన నాకు ఈరోజు విలవ ఎవరిచ్చారనీ? వారి కోసం నేనింత ఇదైపోయేదేవిటీ? పోనీ అట్లా అనుకుందామన్నా కొనవూపిరిగా కొంతమంది బతికించి చంపుతున్నారయ్యె. ఈ మహావీరుల కోసమేనా నేను ఈ సారస్వతాన్ని కనిపెట్టుకుని ఉండాల్సింది? అర్థమైనా కాకున్నా, ఈ యువతీ యువకులు ఆహా అని పొగిడేవాడే తప్ప, ప్రయత్నించే వారే లేరు. నా వెనక నుంచున్న వాడు లేడు. ఇదంతా దుర్మార్గమని కాదు. లోకం తీరు ఇంతే. ఈనాటి పాఠకుల తీరు ఇంతే. వారేదో నేను ఏడుస్తున్నానంటే సరిగ్గా తెలుసుకోక, అసలు సంగతి విచారిద్దామనే యోచనన్నా లేకుండా, ఇట్లా ముహం దాటేసే యువతీ యువకుల కోసమేనా నేను కాచుకుని ఉండవలసింది?
ధైర్యంగా నా ముందుకు వచ్చి నిలబడ్డ ఒక్క యువకుణ్ణీ చూడలేదు. ఒక్క యువతినీ చూడలేదు. ఇంత అర్భనాకారీల కోసమా నేను నా కాలంలో అంత శ్రమ పడ్డదీ, అంత భాష నేర్చుకున్నదీ, అంతలా వ్రాసిందీ, అంతలా తప్పులు దిద్దుకొన్నదీ. అంత సంపద వదిలి వెళితే చేతిలో వున్న దీపాన్ని ఆర్పుకొని మిణుగురు పురుగుల్ని కొలుస్తున్నారని బాధపడనా? పోనీ ఏదో వెలుగులో గుడ్డివాళ్ళై పోకుండా బతుకుతున్నారని సంతోషపడనా? సాధన అంటే ఎవరికీ పనికిరాకుండా పోయింది. అవును నేనెవరికీ అఖ్ఖరలేదు. నాకంతకన్నా ఎవరూ అఖ్ఖరలేదు. ఎవరైనా నానుంచి ఏదన్నా నేర్చుకోవాలని సూనృతమైన కోరిక కలవారు తప్ప నన్నింకొకరు పలకరించడం నేను కోరుకోను, కోరను.
మేము వ్రాసింది ఎవరికోసం? సమాజం కోసం. మాకు తిండి పెట్టిన పోషకుల కోసం. మమ్మల్ని ఆదరించిన రాజుల కోసం. అంతకు మించి భాషామతల్లి కోసం. భగవంతుడి కోసం. ఏడుపో, కరుణో, రౌద్రమో, రసమో ఏదో ఒకటి అల్లాగున అంత ఇదిగానూ ఉండేవి. సామన్యులకు అర్థమైనా కాకున్నా పండితులకు, తాత్పర్యాలతో విడమరచి చెప్పేవారికి అక్షరాల బరువూ అట్లానే ఉండేది. గంభీరమైన నడక. గంభీరంగా ఉంటే ఎంతందంగా ఉంటుందీ? నా కోసం కాదు, నా వ్రాత గురించి ఏదో తెలుసుకోగలమనే వారందరి కోసం కాదూ మేము వ్రాసింది? అదో తపస్సుగా కాదూ చేసిందీ? అది కష్టతరమైన మార్గం. ఈనాడు ఏవిటీ అంతా సులభం, ఆశరభం, అశ్శరభం. నాది కాదని లేచిపోయే సంగతి కాదు. బంధం మనసులో వుండాలి కానీ, బైట చేతల్లో కనపట్టం ఎంతసేపూ? అది చేయించేది సాధన. కనపడిందీ, కనపడండీ అంతా అనుభవించలేకపోతున్నారు మీ మాయలో పడి. అతీతమైన అనుభవం ఎప్పటికి వచ్చేను మీకందరకూ?
ఇంద్రియాలకు వశ్యులైపోయి, ఇందిర ఇండిగోలో దూరిందిరా, కన్నుగొట్టరా కర్కోట కామసుందరా అనుకుంటూ నోటికొచ్చిన పిచ్చిమాటలు వ్రాయటమేనా కవిత్వం? చేతిలో వున్న సాధనాలు వుపయోగించక, భాషను వుపయోగించక, దృష్టిని పక్కదారి పట్టించటం ఏం భావ్యం? పరస్పరం అవసరమైనన్నాళ్ళు మా వ్రాత, పాఠక, పండిత బంధం నిలబడుకొని వున్నది. అదొక మానసికమైన సంబంధం. ఈ మీ కవితా స్వరూపం శారీర ఆకర్షణను దాటి ముందుకు పోలేక పోతున్నది. సంకుచితంగా, ఇరుకుగా కాక, విశాలంగా పద్యాన్ని ప్రేమించి, భట్టీయం వేయించి ప్రేమించగల స్థితికి రావటం ఈ అగ్నికుండంలో సాధ్యమేనా? వచనమే నిజమని గోల పెట్టినా అబద్ధాల అక్షరాలు కాలిపోతాయ్. కాలపురుషుడి ఎలిబీ వున్నది నాకు. అది అర్థమైతే చాలును.
అత్తారింటికి వెళ్ళి అల్లుడుగారు మర్యాద కోసం అగచాట్లు పడ్డట్టు ఇదివరకు నా ఇల్లే అయి, ఇప్పుడు అత్తారిల్లుగా మారిపోయిన తెలుగువాడింటికి వెళ్ళి మాయ ఆశలు పెట్టుకోవటమేవిటీ, చోద్యం కాకపోతే. అయినా మీ ఇంటోంచి బైటపడాలని కోరే వాళ్ళకి మార్గం ఉండనే వుంది. దాంటోనే ఏడుపనుభవించేవాళ్ళని తప్పించడమెందుకు? బురదలోంచి పందిని బైటికి పెరుకుతాడా ఏ కరుణామయుడైనా? ఏదీ కాదు అనే మాట చివరి సత్యమే. దాని అర్థం ఇదేదీ కాదు అని. ఈ జన్మకింతే అని అట్లా తుంచుకోడమెందుకు ? ఈ జన్మ పరంపర, మీ కవితా పరంపర అంతా ఒకటే బాట. తుంపర బాట. మైళ్ళ కొద్దీ తుంపరలు. వానలుగా మారిపోతున్నాయి. తుదిలేని యాత్రగా మారుతుందేమోనని చూడాలన్న ఆశ పెరిగిపోతోంది. కానీ చాలా దూరం. ఈ యాత్ర అంతా ఆయనలోనే. ఆ తుదిలోనే. ఏవిటా కష్ట జీవితం? పద్యోపాసన పొందలేననా? అదికాక తక్కినవన్నీ వున్నాయే మీకు ? ఆ పద్యం చాలా కష్టం, దూరం అనుకోడం వల్లనే ఈ బాధ. దూరమే, కష్టమే కానీ చాలా సులభం, చాలా సమీపం. అది తెలుసుకోవటమే ఈశ్వరానుగ్రహం.జరగనీండి కాలాన్ని. వృధా అనేది లేదు. నిన్న మాది. ఈరోజు మీది. రేపు మీకు నిన్న కాకుండా పోతుందా. జారిపోయేదేమీ లేదు. తొందరేమీ లేదు. ఏం గింజుకునీ ప్రయోజనం లేదు. ఉద్ధరించగలది ఒక్కటే. పద్యం. అదే వినాలి. దానికి అన్నీ వినపడతై. అన్నీ తెలుసు. తొందరపడకండి.
అరుంధతీ నక్షత్రాన్ని పగటి పూట చూపించమనటంలో అర్థమూ, అది కనపట్టమూ జరుగుతుందేమో కానీ వశిష్ట వాక్యం, శిష్ట వాక్యం మీ వాక్యంలో కనపట్టం దుర్లభంగా వున్నది. ఈశ్వరుడిలో నమ్మకం వుంచండి. పద్యంలో నమ్మకముంచండి. చదవండి. బాగా చదవండి. అర్థం చేసికోండి. అర్థం కోసం తాపత్రయం పడండి. చప్పట్ల కొసం తాపత్రయం పడుతున్నారుగా. ఈ తాపత్రయమూ అంతేననుకోండి. ఈశ్వరులు అనుగ్రహిస్తారు. మనసు చాంచల్యమే. చిత్త చాంచల్యం ఫరవాలా, కానీ మీ వచనానిది చిత్తకార్తె చాంచల్యమైతే ఎట్లాగని ఈశ్వరులని ప్రశ్నించాను. ఆయన నవ్వి ఊరకున్నారు. ఏదో ఒకటి చేస్తారనే నమ్మకం. మనసుకి ఆలోచించడానికి ఏమీలేక మందంగా ఊరకుందా అదీ బాధే. గాలిలేని ఎండాకాలపు రాత్రిలా. పద్యంపై మనసు వేళ్ళతో సహా ఎదగాలి. వటవృక్షమైపోవాలి. ఎప్పటికి జరుగుతుందో. జరుగుతుందని ఈశ్వరుడిపై ఆశ. దిగులుగా వ్రాస్తే సంతోషం పెరుగుతుందా ఏవిటీ ? ఎంత వొదిలించుకున్నా ఏవో కొత్తవి, మనం పాతవి అనుకున్నవీ భగ్నమవుతూనే వుంటాయి. అవి భగ్నమై పోయేప్పుడు, భగ్గుమనేప్పుడు మిగిలిన కాంతే పద్య పురోగమనానికి తోవ చూపిస్తాయ్. ఇంత బాధా ఆ చివరి బాధను అంతం చేయడానికేనని సంపూర్ణ విశ్వాసం.
ఇల్లాగున ఎంత చెప్పినా ఏడుపు కిందనే జమచేస్తారు మీ సమూహంలోని నోరు నొక్కే దౌర్భాగ్యులు. ఆశ పెట్టవలసిన, తాయిలాలు ఇవ్వవలసిన అవసరం నాకంతకన్నా కనపట్టం లేదు. ఏనాటికైనా మీకు పద్యం వ్రాయటం రాదేమోనన్న అనుమానాలు, సంకోచాలు లేకుండా మిమ్మల్ని మీరు అర్పించుకోండి. ఎవరికో, దేనికో బయటిదానిక్కాదు. మీ హృదయంలో వెలిగే ఆ కవితామ తల్లికి, మీ స్వంత ఆత్మకీ మీ అర్పణ. మీరు వ్రాసింది మీకే తెలుసు. అది పంజారంలో చేర్చుకున్న వాళ్ళకు, చేసిన వాళ్ళకు తెలుసు. మనలను మనమే మోసం చేసుకునే స్థితి నుంచి ఎప్పుడు బయటపడతామో తెలియకుండా వున్నది. కన్నాలు వేసినవాడికి ధనాలు దొరికే అవకాశమెంతో ఇదీ అంతే. ఈ మా పద్యం గుప్తధనంగా మిగిలిపోకుండా ఉంటే చాలును.
ఈనాటి తెలుగువాడికి పద్యకవిత్వం అక్కరలా. వాడికి అందం తెలీదు. తెలిసిన అనాకారితనమంతా అందం అనుకుంటాడు. దాన్నే వాడికొచ్చిన అనాకారి ముక్కల్లో వచనగాడిదలా నిలబెడతాడు. అది చాలా అశాంతికి కారణం. ప్రజాదరణ దొరికిందా వాడు శుద్ధ గాడిదైపోయినట్టే. ప్రజాదరణ దొరకలేదా, ఎడతెగని దు:ఖం. ఎటువైపు ఎట్లా చూచినా అశాంతే. ధనమూ కీర్తీ ఎట్లా మతిని చెరుస్తాయో అట్లానే భాష భావం లేని కవిత్వం కూడా! అందువలన వాడికీ వ్యధ తప్పదు. పాఠకుడికి మనోవ్యధ తప్పదు. దీనికంతా ఒకటే మార్గం. ఒకటే బయటపడేపడే మార్గం. అదే ఈశ్వరోపాసన, కవితోపాసన, పద్యోపాసన.
ఆ ఉపాసన సంగతి అల్లాగున పక్కన పెడితే, దిక్కులేనివాళ్ళు, కవిత్వం వల్ల గాయపడ్డ ఆర్తులు ఈ కాలంలో మొద్దుల్లా నిలబడుకొని ఉన్న పాఠకులు కోరుకోరెందుకని ప్రళయం అని ఎప్పుడన్నా అనిపించటం కద్దు. సారస్వతం డొల్లు డొల్లుగా అవటానికి కారణం ఎవరికి ఎరుకో వారికే ఎరుక. ఎవరికి దొరికింది వారు, ఎవరికి తోచింది వారు ఎడమ కాలితో, ఎడమ మీసంతో బిజీ బిజీగా వ్రాసిపారేస్తూ ఉండే కాలంలో ప్రళయం వచ్చినా పట్టించుకునేదెవరు కానీ, అది రావాలి. అంత ఘనంగానూ రావాలి. బతుకెట్లా అని ఆలోచించేవాడు కవితెట్లా, దాన్ని బాగుచేయడమెట్లా అని కూడా ఆలోచించాలె. ఈ లోకంలోకి వొచ్చినప్పుడు ఆ ఆలోచనే లేదు. కానీ వీరి కవిత్వం చదివాక బ్రతుకు అంటే అర్థమేమిటో, దాన్ని దౌర్భాగ్యంగా ఎట్లా చేసికొనవచ్చునో తెలిసివచ్చింది. పాఠకుడు అంత మాత్రంతో తృప్తి పడితే బాగుండునూ?
ఏ యుగం అందం అందం ఆ యుగానిదైనట్టు, ఏ కవిత్వం అందం ఆ యుగానిదేనని సరిపెట్టుకోటానికి లేకుండా ఉన్నది. వీళ్ళకు నీతి నేర్పించేదెట్లానో ఆ ఈశ్వరునికే తెలుసనుకుంటా. ఈ బాధలెప్పుడూ తప్పవులే ననుకొని పఠనమే ఒక పెద్దరోగం అనుకుని సంతోషపడదామంటే ఆ సంతోషం స్థానంలో బాధొచ్చి పడ్డది. ఈ ప్రపంచకంలో బాధల్ని తీసెయ్యగల శక్తి ఎవడికీ లేదు. బాధే అని గుంజుకుంటున్న కొద్దీ ఇంకా బాధ. సుఖాలకేమి? చదువు సుఖాలకేమి? భాషా సుఖాలకేమి? మా రోజుల్లో మా పద్యాల్లో ప్రతి పంక్తి అంతో ఇంతో ఎంతో కొంత చదివిన ప్రతి జీవిని సుఖింపచేసేందుకే ఉన్న కాలం. కానీ ఈవేళ్టి పాఠకులు బాధ వేపే మొహం తిప్పి కూర్చుంటున్నారు. రెండో వేపుకి తిప్పటం చాతకాకా! ఇష్టం లేకా! మొర్రో మొర్రోమని ఏడవటమే, అది కాకపోతే గ్యాపకాలు తవ్వుకొని బతకటవే! ఎట్లా వీటి నుంచి దూరంగా జరిగేదన్న ఆలోచనా, అవసరం ఎవరికీ ఉన్నట్టు కనపట్టమూ లేదు. భాష అచ్చంగా అక్షరాల నుంచి బలి కోరుతుంది, భావం మటుకు, ఆ భావాన్ని ఎవరు అభిలషిస్తారో వాళ్ళనే బలి తీసుకుంటుంది. ఈశ్వరేచ్ఛ కామోసు!
అందం, కళ, నిజం ఇవన్నీ చాలా విస్తీర్ణమైనవి. వచనంగారూ, మీరు వాటిని వాడినా అవి పాఠకుడి బుద్ధికి మించిన రకంగా ఉన్నవేమో! అందువల్ల ఒకడు చెప్పేది ఇంకొకడు ఖండిస్తూ ఉంటాడు. ఏదో ఒక కోణం నుంచి చూడబట్టి కాదూ ఈ తిప్పలన్నీ. వ్రాసినవాడి కోణమేమిటో వ్రాసినవాడికి తెలియకపోవడం చాత. చదివినవాడి కోణమేమిటో చదివినవాడికి తెలియపోవడం చాత. వ్రాసినవాడికి చదివేవాడి కోణం తెలియకపోవడం చాత. ఇలా వ్రాసేవాడికీ, చదివేవాడికీ ఎంత దూరమో! అల్లాగున ఉండబట్టి కాదూ ఈ సాహితీ ప్రయాణాలు ఇల్లాగున సాగుతున్నవి? ఎంతెంత దూరం అయిపూ అజా లేని దూరం అని గీతాలు వ్రాసుకోవాలి గావాల్ను. వ్రాసినవాడిలో విశ్వాసం చదివేవాడిలో ఉంటేగా! వాడొక గాడిదని వీడనుకోవడం. వీడొక గాడిదని వాడనుకోవడం. వేసవి కాలంలో హోమగుండం దగ్గర కూర్చునేవాడికి కలిగే శోషణ పరిస్థితి. ఎట్లా గడుపుతున్నారో ఏవిటో? అంతా ఈశ్వరేచ్ఛ అని ఊరకోవటం కాదూ మరి!
భౌతిక కవిత్వమనీ, భౌ భౌ కవిత్వమనీ గట్టి పనిలా ఓటి చేసిపెట్టి నిరుత్సాహంగా తిరుగుతూ ఉండడం వల్ల ఎవరికీ ఉత్సాహం లేకుండా పోతున్నది. ఏ రోజున ఏ అక్షరాన్ని ఎట్లా వుపయోగించుకోవాలో ఆ ఈశ్వరుడికి వదిలెయ్యటమే. సరిచూసుకుందామని, సరిదిద్దుకుందామనీ కాస్త వొద్దిగ్గా కూర్చునూ ఇదివరకటి వోపికలెవరికున్నాయి కనక? దున్న ఈనటం వల్ల వుపయోగాలున్నవేమో కానీ, కవిత్వం చదవటం వల్ల ఉపయోగం లేకుండా పోతున్నదని మొన్న ఈశ్వరోపాసన చేస్తున్నప్పుడు అనిపించింది. అయినా ఒకరు వ్రాసింది ఒకరు అనుభవించాలంటే శక్తి కావొద్దూ, బలం ఉండొద్దూ? ఇదేమన్నా అతివేగంగా చదివి అర్థం చేసుకునే వ్యవహారమా! అతివేగం రతివేగం పనికిరాదని పెద్దల మాట మరి! ఉన్న అంత శక్తీ వేగానికి వినియోగిస్తే అసలు పని ఎక్కడవుతుందీ? ఎప్పుడు ఆస్వాదనలోకి వస్తుందీ ? కవులని అనుభవించాలి అని ఒకాయన ఎవరో ఈ మధ్య అన్నారు. అనుభవం శారీరకమైనట్టు మాటాడకండి అన్నా నేను. ఆయన ఆశ్చర్యపడిపోయాడు. డబ్బూ ఆస్తీ లేని వాడి హృదయమెట్లాగైతే మెత్తగా జాలిగా ఉంటుందో మంచి రచన చదివినప్పుడు అల్లాగే మారిపోవాలని ఒక నైతిక సూత్రం. నీతీ నిప్పూ ఎవరు పట్టుకోగలరు కనక, ఇలాగనుకోవటం?
భావాన్ని పట్టుకొని దాంటోంచి సంతోషాన్ని పిండుకోవాలనే ప్రయత్నమన్నా జరగొద్దూ. కొద్దిమంది మొదలుపెట్టినారే అనుకుందాం, అది నిస్పృహగా మారి దీన ప్రయత్నంగా మిగిలిపోవటం మనం చూడట్లేదు? ఎందుకొచ్చిన వ్యధ. రాత్రికి రాత్రి ప్రసిద్ధులైపోదామని కాదూ వాక్స్వరూపాన్ని వదలి, భైరవ స్వరూపాన్ని ఆవహించుకొంటున్నారు. అలా చెయ్యని వాళ్ళు సంతోషంగా లేరూ? సత్యస్వరూపం ఎట్లాంటిదో దూరం నుంచైనా ఏమీ తెలియదు కదా మనకి! ఆ ఈశ్వరుడి నిఘంటువులో అవకాశం అన్న మాట లేదని నమ్మకం. ఆయనే అన్నీ చేయిస్తాడు. మనం నిమిత్తమాత్రులం కాదూ అనిపించటమూ సహజమే! అయితేనేం, తమోగుణంతో చచ్చిబతికే పిండాలమైన మనకు వేదన, విరహం ఉండొద్దూ?
ఎవరికోసమూ వ్రాయట్లా, ఆ పని చేస్తున్నది నాకోసమే అని అహం తెచ్చుకున్నప్పుడు స్పష్టంగా బోధపడుతుంది. వ్రాత బాగుంటుంది. వ్రాసేవాడు ఎట్లా తాను ఇరుక్కున్న మూలల్ని, తాను అలవరచుకున్న దుర్గుణ శైలిని వొదలడానికి ఇష్టపడరో పాఠకులకు సోదాహరణంగా కనపడుతూనే వున్నది. తీర్థయాత్రలు చేస్తారు కానీ, అసలెందుకు అని అడగనివాడిలా ఊరకే చదివి ఓహోహా అని ఒకటికి రెండుసార్లనుకొని ఊరకోవటమైపోతున్నది. మీ వచనాన్ని దొంగిలించటం ఎంత సుళువో మీకేమాత్రమన్నా తెలుసూ? పద్యాన్ని దొంగిలించమనండి. చూస్తాం! పద్యం వచ్చిన వాడికి వచనం చాలా సుళువు. వచనం వచ్చినవాడిని పద్యం వ్రాయమనండి చూద్దాం. ఎవరిదాకో ఎందుకు మీరు వ్రాయండి ఒహటి తిరుగు టపాలో. చూడాలని ఆశగా వున్నది. ఎంత ఈశ్వరానుగ్రహం కావాల్నో తెలిసివస్తుంది. దేనివల్ల గొప్ప దొంగలు తయారవుతారో అది అంత గొప్పదన్న మాట నిజమో కాదో మీరే చెప్పాలి. అంతే మరి! నేర్చుకోవాలని వున్నా, నేర్పేవాడు లేడు. నేర్చుకుందామన్న వాడికి నేర్పు లేదు. కవిత్వాన్నీ, దాని మాయ విలవల్నీ, కవుల్నీ, వారి పాఠకుల అబద్ధాలనీ, బాధల్నీ, ఇరుకునీ ఎపుడైతే అంగీకరించామో ఇహ మరణమే!
ఈ వచనపాపానికి విరుగుడు పద్యానుగ్రహం ఒకటే! పద్యానికి దూరంగా ఉండిపోయినానే అనే వేదన ఎప్పుడైతే సెగలా కాల్చేస్తుందో అప్పుడే ముక్తి. పఠనాముక్తి, పాఠకముక్తి. ఈ వ్రాతనూ తిట్టనీండి. ఎట్లాగూ తిడతారు, తిట్టడానికి ఏం దొరికినా. దొరకటం కావాలి వాళ్ళకు. అంతే! అంతేగా! ఇది కూడా ఈశ్వరేచ్ఛేమో! అర్థమవని వాళ్ళ బ్రతుకు అంతేనని అర్థం కామోసు. ఆ పట్టుకునే బలం వచ్చేదాకానో, ఆ మరణం అందేదాకానో, అలా అందాకా ఆ ఈశ్వరోపాసన చేస్తూ కూర్చోటమే. ఈ కాలంలో అది చెయ్యటమెట్లాగోనన్నది మరచిపోయినారు, అది వేరే సంగతి. దాంతో అశాంతి ద్విగుణీకృతం. మీ తిరుగుజవాబు కోసం ఎదురు చూసే వోపిక తగ్గిపోయింది కానీ పంపితే మటుకు కరక్కాయ కషాయం చేసుకొని గొంతులో ఒక్క గుక్క పోసికొని తీరిగ్గా చదువుతానని ప్రమాణం చేస్తూ. మీ పాఠకుల ఆరోగ్యమూ, వారి కుటుంబాలు బాగుండాలని ప్రార్థిస్తూ ఉంటానని స్వస్తి వాక్యం.
ఈశ్వరాశీర్వాదాలతో
పద్యం