ఆదర్శాలకు పోతే…

ఆదర్శాలకు పోతే ఇంట్లో అన్నముడకొద్దూ?

అబ్బా..ఈ వెధవ డైలాగొకటి. అసలు ఇది ఎవరు కనిపెట్టారే బామ్మ? నేనెక్కడా పుస్తకాల్లో చదివినట్టు లేదు? పోనీ మరోనోట విన్నానా అంటే అదీలేదు.

సామెతలు స్వంత అనుభవాల్లోంచి పుడతాయిరా చిన్నాడా. ఐనా.. ఎవరో చెప్తేనో, పుస్తకాల్లో చదివినంత మాత్రానో అది సామెతయిపోదు. ఒక గొప్ప సత్యం లోకుల నోళ్ళలో నానీ నానీ సామెతగా మారుతుంది. ఇదీ ఆ వరస లోదే అనుకో.

ఏడ్చినట్టుంది. ఎప్పుడో తాతల కాలం నాటి సంగతులను పట్టుకొని ఇప్పటికీ వర్తిస్తాయనుకోవడం పొరపాటే బామ్మ. మీ చిన్నప్పుడెప్పుడో బ్రిటిషు వాళ్ళు అజమాయిషీ చేసారు, మళ్ళీ వాళ్ళు వస్తారా ఏంటి?

అవునవును. గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించిందట. నా జీవితంలో మూడవ వంతు కూడా లేదు నీ వయసు, నాకే నీతులు చెప్పేవాడివయిపోయేవురా. మీకేం తెలుసు మా చిన్నప్పటి కష్టాలు. మా నాన్న గారు, స్వరాజ్యం, స్వరాజ్యం అంటూ ఉన్న ఉద్యోగం వదిలేసి, ఆస్తంతా ఉద్యమంలో తగలెడ్తే, ఒక్క పూట తిండి గగనమై మేమంతా ఆకలితో మలమలలాడేం. ఇంట్లో అన్నం ఉడకడం గగనమయ్యేది. మా అమ్మ అష్ట కష్టాలు పడి పెంచింది. నలుగురాడపిల్లల పెళ్ళిళ్ళు చేసి, ముగ్గురు మగాళ్ళకు చదువులు చెప్పించి కాస్త ప్రయోజకులను చేసారు గాబట్టే ఇదిగో ఇలా ఉన్నారు మీరంతా. మా అమ్మ కూడా ఉద్యమం అంటూ జైల్లో కూర్చొని ఉంటే, తిండికి దిక్కు లేక మేము చచ్చి, మీరు లోకాన్ని కూడ చూసేవారు కాదు.

ఆపూ, ఆపూ…ఊ అంటే చాలు ఫ్లాష్‌బ్యాకులోకి వెళ్తావు. ఈ వెధవ సినిమాలు టీవీలూ చూడొద్దే అంటే ఒక పట్టాన వినరు కదా. అత్తా కోడళ్ళిద్దరు కలిసి మరీ చూస్తారు. ఇక నేను ఫోన్‌ పెట్టేస్తానే బామ్మా. అసలే నిమిషానికి అరవైసెంట్లు చార్జి చేస్తున్నారు. నేను మళ్ళీ నాన్న గారితో మాట్లాడుతాను.

ఇదిగో.. ఇప్పుడు ఫోన్‌ పెట్టేసావంటే నేను నీతో మళ్ళీ చచ్చినా మాట్లాడను. ఈరోజు ఏదో ఒకటి నిర్ణయం జరగాల్సిందే.

అదేంటే బామ్మా? నాన్న గారు లేకుండా నేనేం చెప్పను? ఐనా రాత్రి ఒకటిన్నర అవుతోంది టైం. తెల్లారితే తొమ్మిదింటికి నాకు మీటింగు. రేపు శనివారం తీరిగ్గా మాట్లాడుకొందాం. సరేనా?

సరే. ఒక్క మాట చెప్తాను ఆలోచించుకో. పెద్దాడిని చూడు, చక్కగా మేము చెప్పిన పిల్లను, చెప్పిన రీతిలో పెళ్ళి చేసుకొని ఎంత సుఖంగా ఉన్నాడో? అసలు నీకు ఇదేం పిదప బుద్ధిరా? నీకు తోడు మీ నాన్నొకడు. ఒరేయ్‌ మన ఆచారాలు, సంప్రదాయాలు ఊరికినే ఆడంబరాలకోసం పుట్టలేదు. వాటన్నిటి వెనక కూడా మీ మట్టిబుర్రలకు అర్థం కాని ఉద్దేశ్యాలెన్నో ఉన్నాయి. పెద్దల మాట చద్ది మూట అని ఊరికే అనలేదు. బాగా ఆలోచించుకో. పెట్టేస్తున్నాను.

సరే.సరే. బై బై.

000 000 000 000 000 000

విషయమేంటంటే దొరవారు ఇరవయ్యేడవ పడిలో పడ్డాక పెళ్ళి చేసుకోవాలన్న సంకల్పం కలిగింది. బాగా కష్టపడి ఆలోచించి చాంతాడంటి లిస్టులో నుండి ముత్యాల్లాంటి ముగ్గురమ్మాయిలను సెలెక్టు చేసుకోవడం కూడా ఐపోయింది. కాని వచ్చిన చిక్కల్లా, మా ఇంట్లో ఒక పెళ్ళి జరగాలంటే, నాకు పిల్ల నచ్చడంతో జరిగేంత సులువు కాదు. మొదట మా బామ్మకు నచ్చాలి. మా బామ్మకు నచ్చడం అంటే, పిల్ల వంశంలో మూడు తరాల చరిత్రలో ఎక్కడా ఒక మచ్చ ఉండకూడదు. వేలు విడిచిన, కాలు కడిగిన చుట్టరికాలేవైనా కలిస్తే మరీ మంచిది. తరువాత మా అమ్మకు నచ్చాలి. అమ్మకు నచ్చడం అంటే, ఫలాన పిల్ల మా ఇంటి కోడలు అంటే, అహా అలాగా అని ఆవిడ మిత్రగణం అబ్బురపోవాలి. ఆవిడ దొడ్డిగోడ మీద కబుర్లకు కంపెనీ ఇచ్చే అ(న)సూయమ్మగారు సర్టిఫై చెయ్యాలి. తరువాత నాన్న గారికి నచ్చాలి. ఇదొక్కటే అన్నిటికన్నా సులువైంది. పిల్ల తరపు వాళ్ళకు ఎక్కువ ఆడంబరాలు ఉండకూడదు. కాస్త మర్యాదస్తులై ఉండాలి. నాకున్న రిక్వైరుమెంట్సులో ఇదీ ఒకటి కాబట్టి నాకు ఓకే ఐతే మా నాన్న గారికి కూడా ఓకే నే. ఇక మా అన్నయ్యకు, చెల్లెలికీ ఈ విషయంలో పెద్ద పట్టింపే లేదు. కాని మా అన్నయ్య అభిప్రాయం మీద నాకెంతో గురి. కాబట్టి వాడికీ సంబంధం నచ్చి ఉండాలి. ఇవన్నీ తలచుకొంటే ఏనాటికైనా నాకు పిల్ల దొరికేనా అని నాకే అనుమానం వస్తుంది. కానీ, పెళ్ళి అవడం ఇంత సులువైతే, పెళ్ళి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అన్న సామెత ఎందుకు పుడుతుంది. ఇవన్నీ కుదిరి ఒకవేళ అమ్మాయి కుదిరినా మళ్ళీ సందర్భాన్ని బట్టి ప్రతివారికి వీటో పవరు ఉంటుంది. ఉదాహరణకు, ఆ పిల్ల వాళ్ళ ఇంట్లో నాన్‌వెజ్‌ తింటారనో, లేకపోతే, ఆ అమ్మాయి నాన్న గారో, అన్నగారో అప్పుడప్పుడు మందు పుచ్చుకుంటారనో తెలిస్తే మా బామ్మ వీటో వాడేస్తుండి. ఆడాళ్ళ నెట్‌వర్క్‌ ఎంతైనా స్ట్రాంగ్‌లెండి. మంచి విషయాలు తెలిసినా తెలియకపోయినా ఇలాంటి విషయాలు మాత్రం మనోవేగంతో తెలిసిపోతుంటాయి. ఇక నాన్న గారి విషయం వేరు. అమ్మాయి నాన్న గారు అప్పుడప్పుడూ లంచాలు తీసుకొనేరకం అనో, సత్ప్రవర్తన లేదనో తెలుస్తే నాన్న గారు వీటో వాడేస్తారు. ఈ పిల్ల సెలెక్షను పుణ్యమా అని మా ఇల్లు రెండు వైరి వర్గాలు గా చీలిపోయింది. అమ్మా, బామ్మా ఒకవైపు, నాన్నా, నేను, అన్నయ్య ఒక వైపు. నా పెళ్ళి విషయంలో ఆడాళ్ళ పార్టీకి ఒకమ్మాయి నచ్చింది. బాగా కట్నం ఇచ్చే స్తోమత కలిగినవారు. కాని, కట్నం పేరెత్తితే నాన్న గారు ఉగ్రుడైపోతారు. కాబట్టి ఇద్దరూ, మాకూ కట్నాలు అఖ్ఖర్లేదు పెళ్ళి గ్రాండుగా చేస్తే చాలు, ఆ అమ్మాయిని చేసుకుందాం అని ప్రతిపాదించారు. నాన్నగారికేమో, మా చిన్నప్పటి క్యాంపులో పొరుగువారు, మా ఫామిలీ ఫ్రెండ్సు ఐన కుటుంబరావు గారి అమ్మాయిని చేసుకోవాలని ఉంది. గౌతమి నాకు చిన్నప్పటి నుండీ తెలిసిన అమ్మాయవడం వల్ల నాకు ఆ పిల్ల ఓకేనే. కొన్ని భిన్నాభిప్రాయాలు, కొంచెం తర్జన భర్జనలు అయ్యాక, కుటుంబరావుగారి సంబంధానికి ఓకే చెప్పేసాం. మరి ఇంకా సమస్య ఏమిటి?

సమస్యల్లా నేనే.

రెండేళ్ళ క్రితం మా అన్నయ్య పెళ్ళి జరిగిన తీరు చూసిన తరువాత నేను పెళ్ళి ఎలా చేసుకోవాలో ఒక నిర్దిష్టమైన అభిప్రాయానికొచ్చాను. అవును మరి, నా పెళ్ళి విషయంలో కూడా నాకు వీటో పవరు లేకపోతే ఎలా? మా నాన్న గారు కూడా విన్నవెంటనే తప్పకుండా అలానే చేద్దాం అన్నారు. ఇంతకుముందు సెలవిచ్చినట్లు, మా నాన్న గారికి కట్నాలు పుచ్చుకోవడం అంటే వొళ్ళు మంట. మా అన్నయ్య పెళ్ళికి ఒక్క రూపాయి కూడ కట్నం పుచ్చుకోకుండా చేసారు. కాని, ఇలాంటి విషయాల్లో ఆడాళ్ళెంతైనా ఘనులు కదా. మా వదిన వాళ్ళు కూడ అంత కలిగినివారు కారు కానీ, ఎలాగూ కట్నం ఇచ్చేది లేదు కదా అని కట్నం మూడు లక్షల బదులుగా, వదినకు ఇరవై తులాల బంగారు, మా ఇంట్లో ఆడాళ్ళకి లక్షణంగా పట్టుబట్టలు మగవాళ్ళకి సూట్లు పెట్టి, చాలా గ్రాండుగా పెళ్ళి చేసారు. పెళ్ళి తంతులో ఇవన్నీ చూసిన నాన్న గారికి చాలా కోపం వచ్చింది. అసలు కట్నం తీసుకుంటే ఇంత తంతు జరిగిఉండేదికాదేమో. అసలు మా నాన్నగారు ఇలాంటి లాంఛనాలు, ఆడాళ్ళ ముచ్చట్లు మనకెందుకులే అని పట్టించుకోకపోయేసరికి అలా జరిగింది. పెళ్ళి గొడవంతా సద్దుమణిగాక విషయం తెలుసుకొన్న అన్నయ్య, నన్ను చెడా మడా తిట్టాడు. ఇవన్నీ జరుగుతుంటే నాకు చెప్పకుండా ఎందుకున్నావు? ఇప్పుడు మనం ఆ పెళ్ళి ఖర్చులు సగం వాళ్ళకు ఇచ్చేద్దాం అని. ఇంకేమైనా ఉందా? ఇలాంటివి ఏవైనా చేసావంటే, ఆడాళ్ళిద్దరూ వదిన్ని అనుమానిస్తారు. నువ్వే ఎలాగో వదినకి చెప్పి ఆ డబ్బు వాళ్ళకు పంపించు అన్నాను. కాని మా వదిన ససేమిరా కాదంది. మొత్తానికి నాన్న, అన్నయ్యలిద్దరూ జరిగింది తలచుకొని ఇప్పటికీ చిరాకు పడితే, బామ్మ, అమ్మలిద్దరు ఇప్పటికీ ఘనంగా జరిగిన పెళ్ళి తలచుకొని మురిసిపోయి కానీ కట్నం అడగలేదని గొప్ప చెప్పుకుంటారు.

ఇదంతా చూసాక, నేనప్పుడే ఒక నిర్ణయానికొచ్చాను. పెళ్ళంటూ చేసుకొంటే, చాలా సింపుల్‌గా గుళ్ళో చేసుకొంటానని. వరకట్నమే కాదు, చిన్నపాటి లాంఛనాలు కూడ ఉండడానికి వీల్లేదని. ఇదేముక్క గౌతమితో చెప్తే ఎందుకలా తూ తూ మంత్రం పెళ్ళి? గ్రాండుగా చెయ్యడానికి మావాళ్ళకేం అభ్యంతరం లేదు అని వాదించింది. ఇద్దరు మనుషులు పెళ్ళి చేసుకొవాలనుకొంటే, అంత డబ్బు అనవసరపు ఆడంబరాల మీద తగలేయడం తప్పు కాదా? అన్నాను. మన సంతోషాన్ని పదిమందితో పంచుకోవడానికే ఈ ఆడంబరాలు. మనకు తెలిసిన పది మంది కలిసి మనసారా దీవిస్తే సంసారం చల్లగా సాగుతుందని ఆశించే ఈ తతంగమంతా అని జవాబిచ్చింది. అదే నీ ఉద్దేశ్యమైతే, ఏదైనా ఓల్డేజ్‌ హోంకు అవే డబ్బులిస్తే కొన్ని వందలమంది సంతోషిస్తారు అంతకంటే మనః పూర్వకంగా దీవిస్తారు అని చెప్పాను. మొత్తానికి చాలా వాదనలు, చర్చలు జరిగిన తరువాత గుళ్ళో సింపుల్‌గా పెళ్ళి చేసుకొవడానికి, తర్వాత ఒక రోజు తెలిసిన వాళ్ళందరినీ పిలిచి డిన్నర్‌ఇవ్వడానికి ఒప్పించాను. అలాగే ఖర్చులిద్దరూ సమానంగా పెట్టాలని, ఒప్పించాను. మా నాన్నగారు మొదట సాధ్యాసాధ్యాల గురించి అనుమానపడ్డా, కాస్త దీర్ఘంగా ఆలోచించి ఒప్పుకున్నారు. వచ్చిన చిక్కల్లా మా ఎగస్పార్టీని, గౌతమి వాళ్ళింటివారిని ఒప్పించడమే.

మా బామ్మని ఒప్పించడం నా వల్ల ఎలాగూ కాదని నాకు తెలుసు మొదలు సామరస్యంగా నా ఉద్దేశ్యమేంటో చెప్పాలని చూసాను. ఒక పట్టాన వింటేగా? గుళ్ళో పెళ్ళి చేసుకోవాల్సిన ఖర్మ నీకేంట్రా? నువ్వేమన్నా పారిపోయి చేసుకుంటున్నావా ఏంటి? ఐనా, పెద్దాడికి ఘనంగా చేయించి చిన్నాడ్ని చిన్నచూపు చూసారు అని లోకులంతా మమ్మల్ని ఆడిపోసుకుంటారు వద్దు వద్దు అని ఏవో వంకర టింకర కారణాలు వందా పదిహేను చెప్పింది. తనే మొండి అయితే, తన మనవణ్ణి నేను. నేనెలా ఊరుకుంటాను? మెల్లిగా వీళ్ళను ఒప్పించే బాధ్యత నాన్న గారిమీద వేసా. ఇక గౌతమి వాళ్ళింట్లో మరో పెద్దకథ. ఇదేమైనా రెండో పెళ్ళా? చడీ చప్పుడు లేకుండా చేసుకోవడానికి? అయినా తోడి కోడలు నోట సూటిపోటి మాటలు పడాల్సి వస్తుంది. ఎందుకొచ్చిన గొడవ అని కాసేపు గౌతమిని భయపెట్టారు. కాస్త మర్యాదగా నాతో మాట్లాడి చూసారు. చెప్పాగా నేను ససేమిరా వినదలచుకోలేదు.

ఇన్నిచిక్కులు చూసాక, మా అన్నయ్యకు కూడా విసుగువచ్చింది. ఏం సాధిద్దామని ఇదంతా? డబ్బులు పోతున్నాయని వారికీ బాధలేదు. గ్రాండ్‌గా పెళ్ళి జరిపితే వీరికీ బాధలేదు. ఎందుకు వీళ్ళందరిని కష్టపడి ఒప్పించడం. అదీ పోగా పారిపోయి పెళ్ళి చేసుకున్నట్టు గుళ్ళో తూ తూ మంత్రం పెళ్ళి ఎందుకు? మనకు తోచిందేదో మనం చెప్పి చూసాం. వినట్లేదంటే వాళ్ళ ఇష్టం, హాయిగా వాళ్ళు కోరుకుంటున్నట్లు పెళ్ళి చేసుకోవచ్చుకదా అన్నాడు. నాకు చిరాకొచ్చింది. అమ్మ తాను పెట్టదు, అడుక్కుతిననివ్వదు అన్నట్లు ఈ అన్నయ్యొకడు. నా తరపున వకాల్తా పుచ్చుకోకుంటె ఫరవాలేదు కానీ నా ఉద్దేశ్యాన్ని నీరుగారిస్తే ఎలా? వాడితో గట్టిగా వాదించాను. ఆమాత్రం దానికి కట్నం తీసుకోవట్లేదని ఎందుకు గొప్పలు పడిపోవడం. అమ్మాయి వాళ్ళు కట్నం కూడా సంతోషంగా ఇస్తే తీసుకొంటావా? కుటుంబరావు గారి గురించి నీకు తెలుసుగా. సరే, ఆయన బ్యాంకు మేనేజరే కావచ్చు. ఒక నాలుగు లక్షలు ఖర్చుపెట్టడానికి వెనుకాడకపోవచ్చు. కాని అదైనా ఎందుకు చేయడం? జీవితమంతా తెగ కష్టపడి మహా అంటే ఆయనొక పదిలక్షలు కూడబెట్టారే అనుకో. దాంట్లో మూడవవంతు పెళ్ళి పేరుతో నెలరోజుల్లో ఖర్చు పెట్టాలా? అసలు వరకట్నం దురాచారం అంటారు కాని, పెళ్ళి పేరు మీద అంత డబ్బు తగలెయ్యడం ఎంతవరకు సబబు? అది దురాచారం కాదా? అసలు అంత ఘనంగా చేసి ఏం సాధిస్తారు? అమ్మలక్కలకు గొప్పచెప్పుకోవడానికే ఐతే ఇదొక్కటే మార్గమా? లేక ఘనంగా పెళ్ళి చేస్తే ఎక్కువ సుఖంగా ఉంటారా? మనము ఇంత చదువు చదివిందీ, ఒక సాంప్రదాయంలో తప్పొప్పుల్ని వెదికి సరిదిద్దడానికా లేక మూర్ఖంగా వాటిని అనుసరించడానికా? నీకు వాళ్ళతో మాట్లాడే ఓపికలేకపోతే మాట్లాడొద్దు, కాని వాళ్ళకు ఊతమివ్వకు అని అరచినంత పనిచేసా.

వారం రోజులు ఆగి, తూఫాను సద్దుమణిగాక మళ్ళీ ఫోన్‌ చేస్తే మా బామ్మ కాస్త పరుషంగా మాట్లాడినా ఒప్పుకుంది. మా రోజుల్లో ఐదురోజులపెళ్ళిని, ఈ కాలం ఒక్కరోజుకు చేసారు. ఆ ఒక్క రోజు మురిపాన్నీ మీరు కాస్త ఒక్క గంటకు కుదిస్తున్నారు. నేనేం మాట్లాడగలను అని అంది. పెద్దవాళ్ళు తిట్టితే దున్నపోతు మీద వానలా దులుపుకొని, చేసేది మంచిపనే కదా వాళ్ళకర్థం కాకపోతే కాలేదనుకోవచ్చు. అలా తిట్టకుండా మనసులో పెట్టుకుంటే ఎక్కడలేని బాధ వేస్తుంది. ఇక లాభం లేదు. చిన్నప్పటి నుండి బామ్మ నాకు చెప్పిన నీతులు అన్ని వల్లె వేసి, నా ఉద్దేశ్యాన్ని వివరించా. ఇదంత గొప్ప ఆదర్శమూ కాదు, అన్నమూ ఉడకకుండాపోదు అని చెప్తే కాస్త తిట్టి పోసింది. కాని చివరికి ఒప్పుకుంది. అదీ రిసెప్షను అంతా మీ ఇష్టప్రకారమే అని నేను గట్టిగా చెప్పాక. గౌతమే కష్టపడి వివరించిందో, లేక ఆడపెళ్ళివారముకదా అని మొహమాటపడి మేము చెప్పినట్టు విన్నారో తెలీదు కానీ, మొత్తానికి అందరూ ఒప్పుకున్నారు.

నాన్న గారు మొదటినుండి నా ప్లానుకు సుముఖంగా ఉండడం వల్లనో, మరి మిగిలిన వారికి నేను చెప్పిన విషయం బోధపడ్డం వల్లనో మొత్తానికి మా పెళ్ళి గుళ్ళో అనుకున్న ప్రకారం చాలా సింపుల్‌గా కొంతమంది శ్రేయోభిలాషుల సమక్షంలో జరిగిపోయింది. మరునాడు మావాళ్ళు గ్రాండ్‌గా రిసెప్షను ఇచ్చారు వాళ్ళు కోరుకున్న రీతిలో. అన్నీ ఉండీ, ఇలా చడీ చప్పుడూ లేకుండా ఈ డొక్కు పెళ్ళి చేసుకోవటమేం విడ్డూరమో అని చెవులు కొరుక్కొనేవాళ్ళు వాళ్ళ పని చేసుకున్నారు. పెళ్ళిగోల సద్దు మణిగిన తరువాత బామ్మను బాగా ఆటపట్టించాను. “బామ్మా ఏమైందే నీ పాత డైలాగు? ఆదర్శాలకు పోతే యేమీ జరగదు. బ్రిటిషు వాళ్ళ కాలం నాటి విషయాన్ని ఇప్పటికైనా తుడిపేయ్‌” అంటూ.

ఇంకో రెండు వారాల్లో తిరిగి అమెరికా వచ్చేద్దామని నిర్ణయించుకొని, గౌతమి వీసా తీసుకెళ్ళడానికి గౌతమీ, నేను మద్రాసు కాన్సులేటుకు వెళ్ళాం. బిక్కమొగం వేసుకొని బయటకు వచ్చిన గౌతమిని చూసి, వీసా రిజెక్ట్‌ అవడానికి ఎక్కడా ఆస్కారం లేదే? మరి ఇలా మొహం పెట్టిందేమిటా అని ఆలోచిస్తుంటే గౌతమి ఏడుస్తూ చెప్పింది. H-4 వీసా వాళ్ళందరివీ పెళ్ళిఫోటోలు చూస్తున్నారటా. మావి చూసి, This does not look like a marriage to me. Where are people in these pictures? Where is the picture where you pour rice over his head? aren’t you a hindu? అని అడిగి, మరికాస్త గాట్టి సాక్ష్యం చూపెడితే గాని వీసా ఇచ్చేది లేదు అని తేల్చి చెప్పిందట. నాకు ఒక్క క్షణం మింగుడు పడలేదు.

అవును మరి..ఆదర్శాలకుపోతే వీసా రిజెక్ట్‌ అవుతుందని నాకెవ్వరూ చెప్పలేదు కదా!