అక్టోబర్ 2, 2014.
తెల్లారి లేచి పత్రిక విప్పి చూద్దును కదా! పాతిపెట్టేసిన ప్లూటో ప్రాణం పుంజుకుని పైకి లేవడానికి ప్రయత్నిస్తోంది. అదీ వార్త! మొన్న కాక మొన్న, అనగా 2006లో ప్లూటోని, నీ గ్రహచారం బాగోలేదు, నువ్వు గ్రహానివి కావు, ఫో! అని కసిరికొట్టి పొమ్మన్నారు అంతర్జాతీయ ఖగోళశాస్త్ర సమితి (IAU) వారు. పిల్లల పుస్తకాలలోంచి ప్లూటోని పీకి పారేసేరు. ఇంక ప్లూటో గురించి ఎవరు చదువుతారులే అని నేను ఆరేళ్ళ క్రితం రాసిన ఈ దిగువ వ్యాసాన్ని చుట్ట చుట్టి, కట్ట కట్టి అటక మీద పారేసేను (తెలుగులో చెప్పాలంటే కంప్రెస్ చేసి ఆర్కయివ్స్‌లో పడేసేను.)
పట్టుమని పదేళ్ళు తిరగకుండా, నువ్వు పీలగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, నువ్వు గ్రహానివి కాదనడానికి వారెవరు? అని హార్వర్డ్ స్మిత్‌సోనియన్ సెంటర్ తిరిగి ప్లూటోని, గ్రహాల జాబితాలో వేస్తాం, రా! అని పిలుస్తున్నారుట. ఇది వార్త కాదూ మరి? కట్ట కట్టిన చుట్టని విప్పి, దుమ్ము దులిపేను.
ఈ గొడవ అంతా ఎలా మొదలయిందంటే…
ప్లూటో అంటే పడి చస్తాను. సూర్యుడి చుట్టూ తిరిగే రకరకాల శాల్తీల పేర్లలో నాకు ప్లూటో అన్న పేరు ఎంతో ఇష్టం. ప్లూటో పేరు వినగానే సపోటాపండు గుర్తుకొస్తుంది నాకు. కార్టూను సినిమాలలో వచ్చే కుక్క ప్లూటో అన్నా నాకు ఇష్టమే.
ప్లూటో గ్రహచారం బాగు లేదు. దాని జాతకంలో ఏలినాటి శని ఉందో, కుజదోషం ఉందో, భూదోషం ఉందో తెలియదు కాని కష్టాలు పడ్డాది. రాజపూజ్యాలు రెండు, అవమానాలు ఆరు. ప్లూటో కష్టాలు నేను ఆర్చేవాడినీ కాదు, తీర్చే వాడినీ కాదు. ప్రపంచం అంతా కట్టకట్టుకుని ఎదురు తిరిగితే ఏటికి ఎదురీదకలనా?
ఎవ్వరి కంటా పడకుండా, ఎక్కడో వినువీధులలో తన మానాన తను తిరుగాడుతూ ఉంటే ఉచ్చు వేసి పట్టుకున్నారు. పట్టుకుని కనకపు సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టం కట్టేరు. పెట్టి, కట్టి, ఇప్పుడు కుక్కని కొట్టినట్లు కొట్టి సింహాసనం నుండి దింపి, ‘కార్టూను బొమ్మలలో కుక్క బతుకులాంటి బతుకు చాలు,’ అన్నారు. ఆకాశం నుండి, శంభుని శిరస్సు నుండి, శీతాద్రిశుశ్లోకంబైన హిమాద్రి నుండి పవనాంధోలోకముం జేరె అన్నట్లు ఉంది నా ప్లూటో పతనం!
అయ్యా, ప్లూటో పతనానికి కారణం ఇప్పటిది కాదు; పుట్టినప్పుడే దానికి అలా రాసి పెట్టి ఉంది. సా. శ. 1781లో శని గ్రహానికి అవతల మరో గ్రహం ఉందని హెర్‌షెల్ (William Herschel) కనుక్కున్నప్పుడు వార్తాపత్రికలలో అదొక పతాక శీర్షిక అయిపోయింది. అంతవరకు ఖగోళశాస్త్రవేత్తలకి తెలిసిన గ్రహాలు ఆరు మాత్రమే: బుధ, శుక్ర, భూ, కుజ, గురు, శని గ్రహాలు.
జాతకాలు రాసే జ్యోతిష శాస్త్రజ్ఞులు తొమ్మిది గ్రహాలు లెక్క పెడతారు. అవేమో బుధుడు, శుక్రుడు, కుజుడు, గురుడు, శని మాత్రమే కాకుండా సూర్యుడు, చంద్రుడు, రాహువు, కేతువు కూడ గ్రహాలే. ఈ లెక్కలో భూమి గ్రహం కాదు. ఏ అస్తిత్వం లేని రాహు కేతువులు గ్రహాలు. వీరి లెక్కలో సూర్యుడు (రవి) కూడా ఒక గ్రహమే! మన ఉపగ్రహమైన చంద్రుడూ ఒక గ్రహమే. మనం ఇక్కడ విచారించేది ఖగోళశాస్త్రం దృష్టితో కనుక ఇటుపైన జ్యోతిష శాస్త్ర ప్రస్తావన తీసుకురావలసిన అవసరం లేదు.
హెర్‌షెల్ కొత్తగా కనుక్కున్న గ్రహానికి యూరెనస్ (యురేనస్ కాదు, దీర్ఘం యు మీద, ర మీద కాదు అని కార్ల్ సేగన్ (సగాన్ కాదు) పదే పదే చెప్పేవాడు) అని పేరు పెట్టేరు. దీనికి మనవాళ్ళు వరుణుడు అని పేరు పెట్టేరు. ఈ వరుణుడి గ్రహపాటు బాగులేక కాబోలు ఈయనకి జాతక చక్రంలో చోటు దొరకలేదు.
యూరెనస్ ఉనికి మనకి తెలియని రోజులలో, భూమి మీద ఉన్న మనకి మన ఆకాశంలో కదలాడుతూ కనబడే నభోమూర్తులు ఎనిమిది. అవి పైన చెప్పిన ఆరు గ్రహాలతో పాటు సూర్యుడు (రవి), చంద్రుడు, వెరసి మొత్తం ఎనిమిది.
ఇంగ్లీషు లోను, తెలుగు లోను కూడా మన వారాల పేర్లు ఈ గ్రహాల పేర్లని అనుసరించే ఉంటాయి. రవివారం (సన్-డే, Sun-day), సోమవారం (మూన్-డే, Moon-day), బుధవారం, గురు వారం, శనివారం (శాటర్-డే, Satur-day), అన్న పేర్లలో ఈ పోలిక కొట్టొచ్చినట్లు కనబడుతుంది.
తెలుగులో కుజవారం లేదు. ఇంగ్లీషులో టూజ్‌డే (Tuesday) అన్నది కుజుడి పేరే. రోమనుల దేవగణాలలో మార్స్ (Mars) లేదా కుజుడికి ఉన్న స్థానమే జెర్మనీ వారి దేవగణాలలో టివ్ (Tiw) ఆక్రమిస్తాడు కనుక టివ్‌స్‌డే (Tiw’s day) లేదా టూస్‌డే (Tuesday) అన్న పేరు కుజుడి పేరే. మరి మన మంగళవారం ఏ గ్రహం నుండి ఎలా వచ్చిందో నాకు తెలియదు. తెలుగులోని శుక్రవారం ఇంగ్లీషులో ఉన్న ఫ్రైడేకి (Friday) సరిసమానం. శుక్ర గ్రహం అన్నా వీనస్ (Venus) గ్రహం అన్నా ఒకటే. (కాని, శుక్రుడు అన్నా వీనస్ అన్నా ఒకే దేవత కాదు!) పాశ్చాత్య దేశాలలో వీనస్ (Venus) ప్రేమకి చిహ్నం. నార్వే వంటి దేశాలలో ప్రేమ దేవుడి పేరు ఫ్రిగ్గా (Frigga); ఇందులోంచే ఫ్రైడే (Friday) వచ్చింది.
ఈ గొడవంతా ఎందుకు కాని, పూర్వం, ఖగోళశాస్త్రం పరిధిలో గ్రహాలు ఎన్ని? అని ఎవ్వరిని అడిగినా ఆరు అని ఠకీమని సమాధానం వచ్చేది. ఎందుకంటే హెర్‌షెల్ కాలం వరకు సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఆరే ఆరు గ్రహాలు కంటికి కనిపించేవి. మన దృష్టికి ఆననంత దూరంలో మరో గ్రహం ఉందని చెప్పేసరికి అదొక నమ్మశక్యం కాని నిజం అయి కూర్చుంది.
ఆరుకి ఏమీ ప్రత్యేకత, పవిత్రత లేదని తెలిసిన తరువాత ఏడుకి మాత్రం ఎందుకు? అందుకని యూరెనస్ అవతల మరో గ్రహం ఉండొచ్చేమో అని అనుమానం వచ్చింది. ఆకాశంలో దుర్భిణితో వెతుకుతూ ఉంటే, సా. శ. 1801 జనవరి ఒకటో తేదీన, మరొక నభోమూర్తి కనిపించింది – కుజ గ్రహానికి, గురు గ్రహానికి మధ్య ఉన్న జాగాలో! దానికి సీరీస్ (Ceres) అని పేరు పెట్టేరు. మరి కొద్ది సంవత్సరాలలో సీరీస్ పేరు పాఠ్య పుస్తకాలలో నమోదు అయిపోయింది. అంతే కాదు. మరో రెండేళ్ళల్లో ఒక కొత్త రసాయన మూలకం ఉనికి కనుక్కున్నప్పుడు, తర్జనభర్జనలు లేకుండా ఆ మూలకానికి, సీరీస్ గౌరవార్థం సీరియం (Cerium) అని పేరు పెట్టేసేరు. రాజయోగం అంటే అలా ఉంటుంది.
సీరీస్‌ని కనుక్కున్న తరువాత సంవత్సరంలో మరొక ‘గ్రహం’ కనబడింది. ఈ తొమ్మిదో గ్రహానికి పాలస్ (Pallas) అని పేరు పెట్టేరు. సా. శ. 1803 లో మరొక కొత్త రసాయన మూలకం కనుగొన్నప్పుడు దానికి – ఇంకా ఆలోచన ఎందుకు – పేలస్ గౌరవార్థం పెలేడియం (Palladium) అని పేరు పెట్టేసేరు.
ఈ పాలస్ వెలిసిన వేళా విశేషం ఏమిటో కాని, ‘మారకం’తో పుట్టినట్లుంది. పైపెచ్చు దీని ‘గ్రహచార దోషం’ వల్ల సీరీస్‌కి కూడా మారకం తీసుకొచ్చింది. ఇదెలాగో చెబుతాను.
ఇంతవరకు గ్రహాలు, వాటి లక్షణాలు ఒక బాణీ ప్రకారం ఉంటూ వచ్చేయి కాని ఈ సీరీస్, పాలస్ వరస కొంచెం భిన్నంగా కనిపించింది. ఉదాహరణకి, గ్రహాలని దుర్భిణిలో చూసినప్పుడు గుండ్రంగా చిన్ని పళ్ళెం ఆకారంలో కనిపిస్తాయి (చంద్రుడు మన కంటికి కనిపించినట్టు). కాని ఈ సీరీస్, పాలస్ మినుకు మినుకు మంటూ నక్షత్రాల వలె చుక్కలుగా కనిపించేయి కాని, గ్రహాల మాదిరి పళ్ళేలలా కాదు. పోనీ ఇవి ఎంతో దూరంలో ఉండబట్టిన్నీ, మన దుర్భిణిలు మరీ శక్తిమంతం కానట్టివీను అవటం వల్ల చిన్నగా కనిపిస్తున్నాయనుకోటానికి వీలు లేదు. ఈ రెండూ కూడా భూమికి అతి సమీపంలో, కుజుడికీ గురుడుకీ మధ్య ఉన్నాయి. అంతే కాదు. ఇంతవరకు మన జాబితాలో ఉన్న గ్రహాల మధ్య దూరాలతో పోల్చి చూస్తే ఈ రెండు దరిదాపు ఒకే కక్ష్యలో ఉన్నంత దగ్గరగా ఉన్నాయి. ఈ వికారాలన్నిటిని చూసి పెద్దలు ఇవి గ్రహాలు కావు అని తీర్మానించేరు. (అప్పటికే అచ్చయిపోయిన పుస్తకాలు మళ్ళా అచ్చు కొట్టవలసి వచ్చిందేమో!) వీటికి ఇంగ్లీషులో ఆస్టరాయిడ్స్ (asteroids) అని పేరు పెట్టి, గ్రహాల జాబితాలోంచి తీసేసేరు. వాటి పేరు మీద ఉన్న రసాయన మూలకాల పేర్లు మాత్రం మారలేదు. బెజవాడ పేరు విజయవాడ అయినా బెజవాడ గోపాలరెడ్డి పేరు మారనట్లుగా అనుకొండి.
ఇక్కడ ఆస్టర్ (aster) అంటే గ్రీకు భాషలో నక్షత్రం, ఓయిడ్ (oid) అంటే లాంటిది అని అర్థం. కనుక ఆస్టరాయిడ్ అంటే నక్షత్రం లాంటిది అని అర్థం. కాని ఈ రెండు నక్షత్రాల లాంటివి కానే కావు; రాళ్ళ లాంటివి అంటే సరిపోయేది. కాని ఆస్టరాయిడ్ అన్న పేరు అతుక్కుపోయింది. కొంతమంది నాలాంటి చాదస్తులు అప్పుడూ ఉండేవారన్న మాట, వీటికి గ్రహశకలాలు (planetoids) అని పేరు పెట్టేరు. నేనంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఈ కొత్త పేరు పెట్టి పిలుస్తున్నారు; ఇష్టం లేని వాళ్ళు తప్పు అయినా పాత పేరు పెట్టే పిలుస్తున్నారు. ఈ భాషాభిమానులూ, వీరాభిమానులూ, పరమ ఛాందసులూ ఉన్నారు చూశారూ, వాళ్ళు మేకపోతు మెడ కింద ఉన్న చన్నులు పట్టుకుని అలా చప్పరిస్తూనే ఉంటారు.
సా. శ. 1851 నాటికి మహాసాగరం లాంటి ఆకాశపు లోతుల్లోకి దుర్భిణి అనే గేలాన్ని వేసి వెతకగా, వెతకగా దరిదాపు ఇరవై పిల్లచేపల లాంటి గ్రహశకలాలు, పెద్ద సొర చేప లాంటి మరొక గ్రహం కనబడ్డాయి. ఈ సొర చేప పేరే నెప్టూన్ (Neptune). దుర్భిణి సహాయంతో ఆకాశం గాలిస్తే యూరెనస్ కక్ష్యకి అవతల నెప్టూన్ కనిపించింది. రోమను పురాణాలలో నెప్టూన్ సముద్రాలకి అధిపతి. అందుకని మనవాళ్ళు సగరుడు అని పేరు పెట్టేరు. ఈ నెప్టూన్ గౌరవార్థం మరొక రసాయన మూలకానికి నెప్టూనియం (Neptunium) అని పేరు పెట్టేరు. కావలిస్తే ఈ మూలకానికి మనం తెలుగులో సగరము (తగరముతో ప్రాస కుదిరింది కదా!) అని పేరు పెట్టుకోవచ్చు!
హమ్మయ్య. బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు, గురుడు, శని, యూరెనస్, నెప్టూన్ – మొత్తం ఎనిమిది గ్రహాలు అని అంతా ఊపిరి పీల్చుకుని, పిల్లల పాఠ్య పుస్తకాలలో ఈ ఎనిమిది గ్రహాల పేర్లూ వారాల పేర్లతో పాటూ, నెలల పేర్లతో పాటూ అచ్చు కొట్టించి పిల్లలచేత వల్లె వేయించేవారు. ఈ గ్రహాలు ఏ వరుస క్రమంలో ఉన్నాయో పిల్లలు గుర్తు పెట్టుకోవటానికి బాగుంటుందని ‘మార్తా విజిట్స్ ఎవిరీ మన్‌డే అండ్ జస్ట్ స్టేస్ అంటిల్ నూన్’ (Martha Visits Every Monday and Just Stays Until Noon) అనే ఇంగ్లీషు వాక్యాన్ని తయారు చేసి, దీనిని స్ఫోరకంగా (mnemonic) వాడుకోమన్నారు. అంటే, ఈ వాక్యంలో వచ్చే ప్రతి మాట మొదటి అక్షరం వరుసక్రమంలో ఉన్న గ్రహాల పేర్లకి గుర్తుగా వాడుకోమని అర్థం. ఇలాంటి స్పోరక వాక్యం తెలుగులో కూడ ఒకటుంటే బాగుంటుంది కానీ…
పుస్తకాల విక్రేతల గ్రహచారం బాగానే ఉంది కాని రోజుకో జాబితా బట్టీయం వెయ్యవలసి వచ్చేసరికి పిల్లల జాతకాలు బాగులేవేమో అని అనిపిస్తుంది. పిల్లల గ్రహపాటు ఇలా ఉండగా, ఫిబ్రవరి 18, 1930 నాడు ఆకాశపు లోతుల నుండి మరో గ్రహం ఊడి పిల్లల పుస్తకాల్లో పడింది. (బొమ్మ చూడండి.) గ్రహశకలాలలా కాకుండా ఈ కొత్త గ్రహం నెప్టూన్‌కి అవతల, ఇంకా చాలా దూరంలో, మినుకు మినుకు అంటూ దుర్భిణిలో కనబడింది. మిగిలిన ఎనిమిది గ్రహాలు సూర్యుడి చుట్టూ దరిదాపు వృత్తాకార కక్ష్యలో తిరుగుతూ ఉంటే ఈ కొత్త గ్రహం దీర్ఘవృత్తాకారంలో తిరుగుతోందని నిర్ధారణ చేసేరు. పైపెచ్చు ఈ కొత్త గ్రహం పరిభ్రమించే తలం, మిగిలిన గ్రహాలు అన్నీ పరిభ్రమిస్తూన్న తలంలో కాకుండా వాటన్నికి ఏటవాలుగా మరొక తలంలో ఉంది.
సౌర కుటుంబం (నాసా వెబ్‌సైట్ నుంచి.) (వివరం కోసం బొమ్మపై నొక్కండి.)
‘చుక్కలా కనిపిస్తూన్న ఇది గ్రహం కాదు, ఇది కూడా గ్రహశకలమే’ అన్నారు, కొందరు. కాని అప్పటికే గ్రహశకలం అన్న పేరు కుజ-గురు గ్రహాల మధ్య ఉండేవాటికే కేటాయించటం అయిపోయింది. కనుక దీనికి కొత్త పేరు పెట్టాలి, లేదా గ్రహశకలం అన్న పాత మాట నిర్వచనం మార్చాలి. ‘అది తోక చుక్కేమో’ అన్నారు కొందరు. ‘తోకచుక్కలో చుక్క అలుక్కుపోయినట్లు ఉంటుంది. ఈ చుక్క ఖణిగా ఉంది. పైపెచ్చు దీనికి తోక లేదు. కనుక తోక చుక్క అనటానికి వీలు లేదు’ అన్నారు మరికొందరు. ఇలా తుని తగవులా ఎటూ తేలకుండా ఉండిపోయింది దీని పరిస్థితి. ఏదో తేలే వరకు, అందాకా, దీనిని గ్రహం అనే నిర్ణయించి, ప్లూటో (Pluto) అని పిలవటం మొదలు పెట్టేరు. దీని గౌరవార్థం ఒక రసాయన మూలకానికి ప్లుటోనియం (Plutonium) అని పేరు కూడ పెట్టేసేరు. దూరదృష్టి కల తెలుగు వాళ్ళు దీనికి ఏ పేరూ పెట్టలేదు. సీరీస్‌కీ పేలస్‌కీ పట్టిన గతి దీనికి కూడా పట్టలేదని పిల్లలు సంతోషించేరు. మళ్ళా పాత పుస్తకాలు పారేసి కొత్త పుస్తకాలు అచ్చు కొట్టేరు. గ్రహాల పేర్లు జ్ఞాపకం పెట్టుకోటానికి వీలుగా, మై వెరీ ఎక్సలెంట్ మదర్ జస్ట్ సెర్వ్‌డ్ అజ్ నైన్ పీజాస్ (My Very Excellent Mother Just Served Us Nine Pizzas) అని కొత్త స్ఫోరక వాక్యం తయారు చేసేరు. కార్టూన్ బొమ్మలలో ఒక కుక్కకి కూడా ప్లూటో అని పేరు పెట్టుకున్నారు.
ఆధునిక విజ్ఞానశాస్త్రం అంటే – ఒక విధంగా – పేర్లు పెట్టటం; భావాలకి పేర్లు పెట్టటం. ఒకదానిని ఒక పేరు పెట్టి పిలుస్తున్నామంటే ఆ పేరు వెనక ఖచ్చితమైన భావం ఒకటి ఉంటుంది. కనుక మనం ‘గ్రహం’ అన్న పేరు వాడినప్పుడల్లా నాకు, మీకు, ప్రపంచం అంతటికీ ఒకే ఒక భావం స్పురించాలి; లేకపోతే నేను అనేది ఒకటి మీకు అర్థం అయేది మరొకటి. గ్రహం అన్న మాటనే తీసుకుందాం. తెలుగులో గ్రహం అనగానే నాకు రెండు అర్థాలు స్పురిస్తాయి. ఒకటి, సూర్యుడి చుట్టూ తిరిగే బుధ, శుక్రాదుల వంటి నభోగోళం. రెండవది భూత, ప్రేతాదుల వంటి అదృశ్య శాల్తీ. ఈ రెండవ అర్థం నా చిన్నతనంలో విన్నంతగా ఈ రోజుల్లో వినటం లేదు.
సూర్యుడి చుట్టూ తిరిగేవన్నీ గ్రహాలు కాదు. సీరీస్, పేలస్ వంటి గ్రహశకలాలకి గ్రహాల స్థాయి, అంతస్తు ఇవ్వలేము. అవి సూర్యుడి చుట్టూ తిరిగే నభోమూర్తులైనా అవి గ్రహాలు కావని తీర్మానించేరు. అవి కేవలం పెద్ద రాళ్ళు అన్నారు. గ్రహం అన్న మాటకి నిర్వచనం చెప్పటానికి బదులు గ్రహాలు ఏమిటో ఒక జాబితా చెప్పవచ్చు. అప్పుడు — బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు, గురుడు, శని, యూరెనస్, నెప్టూన్, ప్లూటో. ఈ తొమ్మిది గ్రహములనబడును — అని వ్యాకరణంలో సూత్రంలా చెప్పెయ్యవచ్చు.
ఈ రకం నిర్వచనాలతో ఒక చిక్కు ఉంది. ‘అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ – ఈ అయిదు దేశాలే అణుబాంబులు పేల్చవచ్చు, అణ్వస్త్రాలని తమతమ ఆయుధాగారాలలో నిల్వ చేసుకోవచ్చు.’ అని తీర్మానించి ఇవే అగ్ర దేశాలు, మిగిలినవి అన్నీ బడుగు దేశాలు అంటే మనం ఊరుకుంటున్నామా? నిర్వచనానికి అర్థం ఉండాలి, దాని వెనక తర్కం ఉండాలి.
ఉదాహరణకి ప్లూటో వంటి నభోమూర్తి మరొకటి ఉంటే దానిని కూడా గ్రహాల జాబితాలో చేర్చుకోమని అడగమా?
ఎక్కడో ఆకాశంలో ఉన్న గ్రహాల వరకు ఎందుకు? గుట్ట అని ఎప్పుడనాలి? కొండ అని ఎప్పుడనాలి? పర్వతం అని ఎప్పుడనాలి? సెలయేరు, ఏరు, నది – వీటి నిర్వచనాలు ఏమిటి? ఆస్ట్రేలియా దేశమా? ఖండమా? ఇవన్నీ నిర్వచనాలు లేకుండా సంప్రదాయానుసారంగా వాడుకునే మాటలే. కాని సంప్రదాయం అని చెప్పి అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఉరుకోలేము కదా. ఉడుకు నెత్తురు ఉన్న తెలుగువాళ్ళు అస్సలు ఊరుకోలేరు.
కనుక అందరూ ఏది ఒప్పుకుంటే అదే గ్రహం. కాని అందరూ ఏదీ ఒప్పుకోరు కదా!