బర్త్‌డే

ప్రతి రోజు లానే సూర్యుడు అందరూ అనుకునే విధంగానే తూరుపు దిక్కు లోంచి లేచి, అపార్మ్టెంటు అద్దాల్లోంచి,”ఈ ఇంట్లో వాళ్ళు లేచారా?” అనుకుంటూ తొంగి చూసే వేళప్పుడు

“హాపీ బర్త్‌ డే … మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్‌ ఆఫ్‌  ద  డే…” అని ఓ రంగు రంగుల గ్రీటింగు కార్డు నందించాడు మధు, అప్పుడే నిద్ర లేస్తూన్న శైలజకు.

పొద ప్రక్కన అలికిడికి ఉలిక్కి పడ్డ కుందేలులా భర్త వైపోసారి చూసి నిర్లిప్తంగా గ్రీటింగ్‌  కార్డునందుకుని, బెడ్‌ నానుకుని వున్న ఎండ్‌ టేబుల్‌ పై పెట్టింది. అదే ఎండ్‌  టేబుల్‌ మీద మౌనంగా పడివున్న ఎర్ర స్టిక్కీ ప్యాడు నందుకుని, పెన్సిల్‌ తో గబ గబ వ్రాస్తున్న శైలజ వంక గుడ్లప్పగించి చూస్తున్న మధు, గభాల్న మంచం అంచు వైపు జరిగేడు.

సరదాగా నదిలో, వన్నెల నావలో ఆ మధ్యే ఒకటైన జంట షికార్లు కొట్టే సమయంలో, వున్నట్టుండి ఉధృతంగా వరద వస్తే, పడవను బేలెన్స్‌ చేసి ప్రాణాలు నిలుపుకోడానికి చేరో అంచుకూ చేరినట్లు, ఆ మంచం ఒక కొసన శైలజ మరో అంచున మధు.

వ్రాయడం అయ్యేక స్టిక్కీ ని మధు వైపు తోసింది శైలజ.

మంచానికి ఇరువైపులా ఎండ్‌ టేబుళ్ళూ, వాటి మీద ప్రస్ఫుటంగా కనిపిస్తూన్న స్టిక్కీ  ప్యాడులూ, గోడ మీద అక్కడక్కడా  అంటించబడివున్న రంగు రంగుల స్టిక్కీలు, ఓ మూల కప్పు వైపు కళ్ళు పెట్టి చూస్తూన్న లైటు, గోడ వారగా చిన్న డ్రెస్సింగ్‌ టేబిల్‌, ఒకటీ రెండూ ఫోటోలు. స్టిక్కీలను తీసేస్తే, సగటు క్రొత్త దంపతుల పడక గదిలా వుంది.

స్టిక్కీ పైని “థాంక్స్‌ ” అన్న పదాన్ని చూసేప్పటికి మధు కి పూర్తిగా తెలివొచ్చింది. తనకు చదవడమే కాకుండా వ్రాయడం  కూడా వచ్చని తెలిసొచ్చింది. తన వైపు ఎండ్‌  టేబిల్‌  మీది పచ్చ రంగు స్టిక్కీ ప్యాడుందని గుర్తొచ్చింది.

స్టిక్కీ మీద “వెల్కమ్‌ ” అని వ్రాసి, శైలజ వైపుకి విసిరేడు.

దాని వైపు చిరాగ్గా ఓ చూపు విసిరి, చుట్టూ గోడల పైన వ్రేళ్ళాడుతున్న రంగు రంగుల స్టిక్కీల వైపు చూసింది. తర్వాత మధుబాబు వైపు చూసింది.

“అయిందేదో అయిపోయిందన్నానుకదా? ఇంకా దేనికా అలక? నీ పుట్టిన రోజు నాడైనా కాస్త శాంతించవచ్చుగా?” అన్నాడు మధు ప్రాధేయ పూర్వకంగా.

సమాధానంగా స్టిక్కీ ప్యాడునందుకుంది శైలజ.

మాటలొచ్చిన మగువ మగని మీద అలిగి, ఇద్దరే కాపురముంటున్న అపార్మ్టెంటులో  ప్రక్కనున్న భర్తతో మాట్లాడకుండా అంతలా ఎందుకు పోట్లాడుతూందో, స్టిక్కీలను సంభాషణా మాధ్యమంగా ఎందుకు ఎంచుకున్నదో తెలియాలంటే…ఓ నాలుగు రోజులు  వెనక్కి వెళ్ళాలి…

******
…వెనక్కి వెళ్ళేక …

ఆ రాత్రి భోజనం ముగిసేక … అదే పనిగా ఛానెళ్ళు మార్చుకుంటూ టీవీ చూసే సమయంలో “శైలూ ఈ శుక్రవారమేకదా నీ బర్త్‌ డే?” అడిగేడు మధు, కిచెన్‌ లో గిన్నెలు సర్దుకుంటున్న భార్యను.

“ఏమిటో వినిపించలేదు…” పెద్దగానే అంది శైలజ

“ఈ శుక్రవారమేకదా నీ బర్త్‌ డే అని అడుగుతున్నా” అన్నాడు టీవీ వాల్యూమ్‌ బాగా తగ్గించి.

“అబ్బో మీకు భలే గుర్తుందే!” అంది శైలజ.

“మరి మనమంటే ఏమనుకున్నావ్‌ ?” అని, “ఇంతకీ గిఫ్టేమి తెమ్మంటావ్‌ , పార్టీ ఎక్కడ ఇమ్మంటావ్‌ ?” అడిగేడు.

“నేనేం చిన్న పిల్లనా ఏమిటి? బర్త్‌ డే పార్టీలు చేసుకోడానికి, గిఫ్ట్‌ లు తీసుకోడానికి” అంది శైలజ.

“మనింట్లోకి చిన్న పిల్లలొచ్చేదాకా … మనకు మనమే చిన్న పిల్లలం. చెప్పు ఏమివ్వను గిఫ్ట్‌  గా?”  అడిగేడు మధు.

“నాకేమీ గిఫ్ట్‌ లొద్దు గానీ, ఆ రోజైనా ఆఫీసునుంచి ఎర్లీగా వచ్చి నన్నో సారి టెంపుల్‌  కి తీసుకెళ్ళండి చాలు” అంది శైలజ. ఫోను మ్రోగడంతో ఆ రోజుకు ఆ సంభాషణ అక్కడితో ముగిసింది.

మర్నాడు ఆఫీసుకు బయల్దేరుతూ, “ఇంతకీ నీకు గిఫ్టేమి కావాలో చెప్పేవు కాదు?” మళ్ళీ అడిగేడు మధు.

“అబ్బ రాత్రే కదా చెప్పాను … గిఫ్టేమి వద్దని” అంది శైలజ, రవ్వంత విసుగ్గా.

“అది కాదోయ్‌ …” అని వాచీ వంక చూసుకుని, “మీటింగుకు టైమవుతోంది. రాత్రికి  మాట్లాడదాం ఈ విషయం” అన్నాడు.

ఆ రాత్రి డిన్నరయ్యేక, మళ్ళీ అదే టాపిక్‌ వచ్చింది. ఇంతకు ముందులా శైలజకు ఏ గిఫ్ట్‌  కావాలో తెలుసుకోకుండా, విషయాన్ని ఆపకూడదనుకున్నాడు మధుబాబు.

“బాబూ … నిన్నటినుంచీ చెబుతున్నాను కదా నాకే గిఫ్ట్‌  వద్దని. ఎందుకిలా పద్దాకా విసిగిస్తావు?” అంది శైలజ  చిరాకు ధ్వనించే స్వరంతో. ఆపిన వాక్యాన్ని మళ్ళీ అందుకోకపోతే ఎలా వుండేదో కానీ, ఆ వెంటనే “అయినా గిఫ్ట్‌ లనేవి  అడిగితే తెచ్చిచ్చేవి కావు. అడక్కుండానే  ప్రేమతో ఇవ్వాల్సినవి” అంది కొంచెం ఆవేశం మేళవించి.

గిఫ్టేమి కావాలని ఇంత ప్రేమగా అడుగుతూంటే, భార్య అంతలా ఎందుకు చిరాకు పడుతోందో అర్ధం కాలేదు. “ప్రేమ ఉండ బట్టే కదా… ఇంతలా అడుగుతోంది. నీకు నచ్చిన గిఫ్టిస్తే  బాగుంటుందని అడుగుతున్నాను. ఈ మాత్రం దానికి  ఎందుకు అంతలా చిరాకు పడతావు” అన్నాడు మధు. అలా అన్నవాడు శైలజ సమాధానం  కోసం ఓ క్షణమాగినా బాగుండేదేమో అలా ఆగకుండా … “తీరా నాకు నచ్చింది నేను తెస్తే, అది నీకు నచ్చక పోతే నాకెలా  వుంటుంది? అదీగాక మళ్ళీ షాపుకు  పరుగెత్తి దాన్ని రిటర్న్‌ చేసి మరో షాపుకెళ్ళి మరోటి తీసుకోవడం … అంత  ఓపిక నాకు లేదు” అన్నాడు.

యుద్ధం మొదలైంది.

“అలా కౌచ్‌ లో ముడుచుక్కూర్చుని టీవీ చూడ్డానికైతే ఎంతైనా ఓపిక వుంటుంది. షాపుకెళ్ళి కావల్సినవి చూసి తెచ్చుకోడానికి  ఓపిక వుండదు”

“అవును … ఉప్పు కొనడానికి గంట సేపు షాపులో రీసెర్చ్‌ చేసే ఓపిక నాకు లేదు”

“అంటే ఉప్పు కొనడానికి నేను గంట సేపు చేశానా?”

“ఉప్పు కోసం కాకపోతే … కంది పప్పు కోసమూ … పేకెట్లో  దొరికే పంచదార కోసమూ …నువ్వెన్ని సార్లు ఎన్ని గంటలు రీసెర్చ్‌  చేయలేదు? ”

మాటకు మాట పెరిగింది. పెరిగిన మాటలు ప్రస్తుతాన్నుంచీ, పూర్వానికెళ్ళాయి. పెళ్ళైన కొత్తల్లో ఓ సారి మూడు రోజులు  బజార్లంతా వెదికి కొన్న చీర గురించి, అప్పుడు అరిగిన షూస్‌ గురించి గుర్తుచేశాడు.

పెళ్ళైన  కొత్తల్లో పొంగిపొర్లినట్లు కనిపించిన ప్రేమ కేవలం నటననీ, అమెరికా వచ్చేక కరిగి ఆవిరై  పోయిన ప్రేమ అసలు వాస్తవమనీ… మగవాళ్ళు ఎప్పుడూ అంతేననీ … తనెంత మోసపోయిందో ఇప్పుడిప్పుడే తెలుస్తోందనీ … ఎప్పటెప్పటి విషయాలనో ఉదాహరణలతో సహా మధు ముందు రాసులుగా పోసింది శైలు.

తర్వాత మాటలు పెదాల మాటున ఖైదు చేయబడ్డాయి. స్టిక్కీలు రంగంలోకి దిగాయి. పనులు విభజింప బడ్డాయి.

మధు కాఫీ మధు నే కలుపుకోవాలి. వంట ఇద్దరూ వంతుల ప్రకారం చేయాలి. భోజనం మాత్రం కలిసి చేయాలి. ఎలావున్నా కిమ్మనకుండా తినాలి. ఇంకా విడి విడిగా చేసుకోగలిగిన పనులు ఎవరికి వాళ్ళు చేసుకోవాలి. కలిసి చేసే పనులేమైనా వుంటే తాత్కాలికంగా వాయిదా పడతాయి. అత్యవసర  సమయాల్లో  మాత్రం స్టిక్కీలను వుపయోగించాలి. అయితే ఈ చివరి నిబంధనను శైలజ అస్సలు పట్టించుకోదు. ఇద్దరి మధ్యా  రాజీ  కుదిరే వరకూ స్టిక్కీలతోనే కాలక్షేపం. సూక్ష్మంగా అవీ నిబంధనలు.

******************************************
ఇహ ప్రస్తుతానికొస్తే, మధు ఆఫీసుకు బయల్దేరేక గ్రీటింగ్‌ కార్డును కవరులోంచి  తీసి చూసింది శైలజ.

కార్డు బాగుందనుకుంది.

మాట్లాడమని బ్రతిమాలిన భర్త గుర్తొచ్చేడు.

ఇతను ఎందుకిలా మారిపోయేడు? పెద్దలు కుదిర్చిన పెళ్ళే అయినా, బాగా ఇష్ట పడే కదా చేసుకుంది! నిశ్చితార్ధం అయిపోయేక, రోజు కో గ్రీటింగు చొప్పున పంపి, ప్రతి రోజూ ఫోను చేసి గంటలు గంటలు మాట్లాడిన రోజులు గుర్తొచ్చాయి. ఇప్పుడు ఎప్పుడైనా ఇంట్లో విసుగ్గా అనిపించి, అయిదు నిమిషాలు మాట్లాడదామని  ఆఫీసుకు ఫోను చేస్తే, విసుక్కునే ఇతనికి అతనికి ఎంత తేడా అనుకుంది. ఒక్క మాట్లాడ్డంలోనేనా? అప్పట్లో తనకు వెనిల్లా  ఫ్లేవర్‌ ఐస్‌ క్రీం ఇష్టమంటే, తనకూ అదే ఇష్ట మన్నట్టు తినేవాడు. తను గులాబి రంగు చొక్కా కొనిస్తే … అపురూపంగా వేసుకునేవాడు. ఇప్పుడలాంటి కలర్‌  టీ షర్ట్‌  సెలెక్ట్‌ చేస్తే ‘గర్లీ’ కలర్‌  అంటాడు. మరప్పుడేమయిందో! ఇప్పుడేమౌతోందో?

శైలజ ఆలోచనలకు భంగం కలిగిస్తూ ఫోను మ్రోగింది.  బర్త్‌ డే విషెస్‌  చెప్పడానికి సుజాత ఫోను చేసింది. వాళ్ళు  కూడా  అదే అపార్మ్టెంట్‌  కాంప్లెక్స్‌ లో వుంటున్నారు.

విషెస్‌  చెప్పేక “మీ ఆయన గిఫ్టేమిచ్చాడు?” అడిగింది సుజాత.

“సర్లే అంత భాగ్యం కూడానా?” అంది శైలజ, నిట్టూర్పును కూడా మాటల్లో ఇమిడ్చి.

“ఏమిటంత నిరుత్సాహం?” సుజాత కుతూహలం.

“ఏమీలేదులే… గిఫ్టేమి  కావాలంటే,  నేనే ఏమీ వద్దన్నా ” అంది శైలజ, సుజాతతో కూడా.

“వద్దన్నావా … అయినా గిఫ్టేమి కావాలన్నప్పుడు… ఏ ప్లాటినం రింగో, డైమండ్‌  నెక్లేసో అడగాలి గానీ… ఏమీ వద్దంటారా ఎవరైనా? మీ మధు గారే చాలానయం. బద్రి కైతే నా బర్త్‌ డే నే గుర్తుండదు” అంది నవ్వుతూ. సుజాత భర్త బద్రి.

“గిఫ్టేమి కావాలి… గిఫ్టేమి కావాలి అని నాలుగు రోజులు వరసగా అడిగేసరికి చిరాకేసింది. గిఫ్టనేది అడిగి పుచ్చుకునేది కాదని చెప్పాను”

“నీక్కావలసిందే నీకు గిఫ్ట్‌ గా ఇస్తే బాగుంటుందనుకుని వుంటాడు. ఆ మాత్రం దానికి నువ్వు అలగాలా? అదేమరి … నీకు చెప్పా పెట్టకుండా ఏ చెత్త గిఫ్టో పట్టుకొచ్చి ఇస్తే అప్పుడేమనేదానివో?”

“పెళ్ళై ఇన్నేళ్ళౌతోంది… నాకేం కావాలో, ఏం నచ్చుతాయో తెలీక పోతే ఎలా? ఆయన గారికి ఇష్టమైన కూరలు నచ్చిన విధంగా వండి వార్చడం లేదూ? అలాగే నాకేం నచ్చుతుందో ఆలోచించి, నాకు గిఫ్ట్‌ గా ఇస్తే నేనెంత సంతోష  పడతానో ఆ మాత్రం ఆలోచించలేడూ ? ” అంది శైలజ కాస్తంత ఆవేశంగా.

“అడక్కుండా ఇచ్చినా, అడిగి ఇచ్చినా గిఫ్ట్‌  గిఫ్టే కదా అనుకునిఉంటాడు! అడగనిదే అమ్మయినా పెట్టదని మనకొక సామెత కూడా వుంది కదా! నిన్ను అడిగి, నువ్వు కావాలనుకుంటున్న రవ్వల నక్లెస్‌  ఎంత బాగుంటుందో ఎంత విలువ చేస్తుందో, నిన్ను అడక్కుండా తెచ్చిచ్చే అదే రవ్వల నెక్లెస్‌ అంతే విలువ చేస్తుంది. కాకపోతే రెండో పద్దతిలో, తీరా తెచ్చేక నీకది నచ్చకపోతే అతడి మనస్సు చిపుక్కుమనదూ! ” అంది సుజాత.

“అడిగితే ఇచ్చేది అడగకుండా ఇచ్చేది ఒక్కటే అంటావా?”

“ఎలా ఇచ్చినా డైమండ్‌  నెక్లెస్‌  డైమండ్‌  నెక్లెస్సే కదా! అదిసరే గానీ సాయంత్రం  వీలైతే మీ ఇంటి వైపు వస్తాం. బయటకు వెళ్ళే ప్రోగ్రాములేమైనా వున్నాయా?” అడిగింది  సుజాత.

“ఈయన పెందరాళే వస్తే గుడికి వెళ్ళొద్దామనుకుంటున్నా” అంది సుజాత చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తూ.

“సరే ఈవెనింగ్‌  ఫోను చేసి వస్తాము. మధు మళ్ళీ ఫోను చేసి గిఫ్ట్‌ గురించి అడిగితే, డైమండ్‌  నెక్లేస్‌  అడుగు.  బెస్టాఫ్‌ లక్‌ వుంటాను, బై”

“థాంక్స్‌  సుజాతా, గుర్తు పెట్టుకుని కాల్‌ చేసావ్‌ . బై మరి. సాయంత్రం తప్పకుండా  రండి”అని ఫోను పెట్టేసింది, శైలజ.

సుజాత చెప్పినట్లు… గిఫ్టేమి కావాలని మధు అడగడంలో తప్పేమీ లేదేమోననిపించింది.

అలా అనిపించగానే భర్తకు ఫోను చేసింది. కాల్‌  ఆన్సరింగ్‌  మెషీనుకు వెళ్ళింది. మెసేజ్‌  వదలకుండానే ఫోను పెట్టేసింది.

రాత్రికి మరోసారి బతిమిలాడించుకుని, మాట్లాడొచ్చులే అనుకుంది.

*******************************************
సాయంత్రం వర్కు నుంచి ఇంటి కొచ్చే సరికి, చీరలో ముస్తాబై జడలో మల్లెపూలు తురిమి ఎక్కడికో బయల్దేరడానికి   రెడీగా వున్నట్లు కనిపించిన శైలజను చూసి, మధుబాబు కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి.

షూస్‌  విప్పుకోబోతూంటే, గులాబి రంగు స్టిక్కీ ఒకటి కళ్ళ ముందు కొచ్చింది.

పెదవులు తడి చేసుకుంటూ, కొంటెగా నవ్వుతూ దగ్గర కొస్తున్న మధుబాబును చూసి, రెండడుగులు వెనక్కివేసి గబ గబ మరో  స్టిక్కీ మీద “కిస్సు కాదు కీస్‌..కారు తాళాలు” అని వ్రాసి విసురుగా మధు  మొహం  మీదకు విసిరేసింది. పొంగే పాల మీద నీళ్ళు చిలకరించినట్లయింది మధు పరిస్థితి.

“నేనే గుడికి తీసుకెళతాను” అని స్టిక్కీ మీద వ్రాసి ఇచ్చేడు.

“థాంక్స్‌ ”  వ్రాసిచ్చింది శైలజ.

మధు గబ గబా రెడీ అయ్యాక, ఇద్దరూ గుడికి బయల్దేరారు తగినంత స్టిక్కీల  స్టాకుతో.

దారిలో ఇద్దరూ  ఏమీ మాట్లాడుకోలేదు. రోజూ కంటే చాలా జాగ్రత్తగా, చాలా చాలా స్లోగా డ్రయివ్‌  చేస్తున్న మధుని ఆశ్చర్యంగా చూసింది శైలజ.

పావు గంట ప్రయాణాన్ని అరగంట చేసిన భర్తపై చూపుల్లోనే కోపాన్ని చల్లింది.

పూజ అయిపోయాక, పూజారితో ఆ గుడి పుట్టు పూర్వోత్తరాల గురించి అంటే ఆ గుడిని ఎప్పుడు కట్టారు, ఎవరు కట్టించారు… పూజారులు ఇండియా నుంచి ఏ వీసాల పై వస్తారు లాంటి విషయాలను వివరంగా  తెలుసుకుంటున్న భర్తను ఆశ్చర్యంగా చూసింది శైలజ.

ఇంకెవరో భక్తులు హారతి కోసం వెయిట్‌ చేస్తూంటే… పూజారి గారు అటు వైపు వెళ్ళారు.

శైలజ మధులు ఇంటి దారి పట్టారు.

*******************************************
శైలజ అపార్మ్టెంట్‌  తలుపు తెరిచి, లోపలికి అడుగు పెట్టగానే ఒక్కసారిగా లివింగ్‌ రూములో లైట్లు వెలిగాయి. ఆశ్చర్యంతో  చుట్టూ పరికించే లోపే “సర్‌ప్రైజ్‌, హేపీ బర్త్‌  డే …” అనే అరుపులతో  బాటు, కెమెరా ఫ్లాషులు  గలగలా వెలిగాయి. బెలూనులతో, రంగు రంగుల కాగితాలతో అలంకరించబడ్డ తమ లివింగ్‌ రూము, డైనింగ్‌ టేబుల్‌   మీది కేకూ  పట్టు చీరల్లో ముస్తాబైన ముసిముసి నవ్వుల స్నేహితుల్ని చూసి ఆనందం కళ్ళలోంచి వుబుకుతూ మెరుస్తూండగా భర్త వైపు చూసింది మధుబాబు కొంటె కళ్ళలోంచీ తొంగి చూస్తూన్న చిరునవ్వులో శైలజ చూపులు కలిసి అక్కడ మెరుపులై మెరిసి, చుట్టూ మాటలై కురిసి, అందరి నవ్వులై విరిశాయి.

“హమ్మయ్యా … మొత్తానికి శైలజను సర్ప్రైజ్‌ చెయ్యగలిగాము” అంది సుజాత.

“మరి ప్లానింగు అల్లాంటిది” అన్నాడు బద్రి మధుబాబు వైపు మెచ్చుకోలుగా చూస్తూ.

“శైలజా … మాట్లాడితే రాలే ముత్యాలను ఏరుకోవడానికి, మీ ఆయన పక్కనే వున్నాడు”

గోడలకు అలంకరించిన రంగు రంగుల బెలూనులు, కాగితాల మధ్య అక్కడక్కడా, తొంగి చూస్తున్న స్టిక్కీల వైపోసారి చూసి “అందరికీ థాంక్స్‌ … ” అంది ఆపైన మాటలు దొరక్క.

“మీ ఆయనకు చెప్పు థాంక్స్‌ … ఇదంతా అతని ఐడియానే” అంది లత.

తర్వాత వెలిగించిన కొవ్వొత్తులను వూది ఆర్పేసేక, కేక్‌ కట్‌  చేయడమూ మధు  శైలజలు ఒకరికొకరు సిగ్గు పడుతూ తినిపించుకోడాలు అయ్యేక

“ఇక ఇవ్వు మధూ మీ ఆవిడకు  గిఫ్ట్‌ !!” అంది సుజాత.

పాంటు జేబులోంచి ఒక చిన్న పేకెట్టు తీసి “మెనీ మెనీ హ్యపీ రిటర్న్స్‌  ఆఫ్‌  ద డే” అంటూ శైలజ కందించాడు.

“థాంక్స్‌ ” అని అందుకుంది శైలజ.

గిఫ్టేమిటో చూడాలన్న కుతూహలం గెస్టుల్లో కనిపించి, పేకెట్‌  ఓపెన్‌  చేసింది శైలజ.

మెరుస్తున్న బంగారు గాజుల్ని చూసి “మధు గారు, మీ ఆవిడకు అవి తొడిగితే మేము చక్కగా ఫోటోలు, వీడియోలు తీసిపెడతాం” అన్నారు మిగిలిన వాళ్ళు.

మధు తొడిగిన గాజులపై, శైలజ నవ్వులు ముత్యాలై మెరిసాయి.

గెస్టులందరూ వెళ్ళి పోయేక, పడక ఎక్కబోతూ “గిఫ్ట్‌ నచ్చిందా?” అడిగేడు మధు.

“నచ్చాయి గానీ, ఇవి బాగా ఓల్డ్‌  మోడల్‌  అనుకుంటా. ఈ డిజైను కాకుండా కొంచెం నొక్కులు వచ్చినట్లు వుంటే బాగుండేవి” అంది గాజుల వంక పరీక్షగా చూస్తూ.

“షాపు వాడు ఇవే లేటెస్టు మోడలని చెప్పాడే ! సుజాత కూడా బాగున్నాయంది” అన్నాడు మధు మొహంలో కొంచెం కొంచెం  రంగులు మారుతూండగా.

“ఏమో మరి… నాకైతే అంతగా నచ్చలేదు. ఇక్కడ షాపులు వీకెండ్‌  తెరిసే  వుంటాయిగా!” అంది శైలజ, వస్తూన్న నవ్వును మునిపంట అదిమిపెడుతూ.

దిగాలుగా మంచం మీద వాలబోతూన్న మధుబాబు చూపుల్లో ఆ చిరునవ్వులు చిక్కి, గదంతా వెన్నెలై అల్లుకున్నయ్‌.