ఫణి డొక్కా
తేదీ: జూలై 27, 2003
సమయం : మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆరు గంటల వరకు
నిర్వహణ : తెలుగు అసోసియేషన్ఆఫ్మెట్రో అట్లాంటా (తామా) వారు
పృఛ్ఛక వర్గం
1) ఆశువు శ్రీ. పెమ్మరాజు వేణు గోపాల రావు గారు
2) దత్తపది డాక్టర్ బి. కె. మోహన్‌గారు
3) వర్ణన శ్రీ యెల్లంరాజు శ్యాం సుందర్‌గారు
4) న్యస్తాక్షరి శ్రీ. భాగవతుల గోపి గారు
5) సమస్య డాక్టర్ పూడిపెద్ది శేషు శర్మ గారు
6) కావ్యపఠనం శ్రీ. చెన్నుభొట్ల వెంకట్‌గారు
7) నిషిద్ధాక్షరి శ్రీ. వేణు దశిగి గారు
8) అప్రస్తుత ప్రసంగం ఫణి డొక్కా
సుమారు పదకొండు సంవత్సరాల తరువాత అట్లాంటా లో మేడసాని మోహన్గారి అవధానం ఈరోజున మళ్ళీ జరిగింది. ప్రార్థనా పద్యాలు, పృఛ్ఛకుల పరిచయాల అనంతరం మొదటి అంశం నిషిద్ధాక్షరి ఇలా సాగింది..
1) నిషిద్ధాక్షరి శ్రీ. వేణు దశిగి గారు
అడిగిన అంశం : అమ్మను గూర్చి / అమ్మ ప్రేమ మీద పద్యం
నిషిద్ధాక్షరం ర హ జ క మ మ హ జ య య త
మొదటి పాదం : శ్రీ మ యా త్మ యై సా ర్ద్ర యై శ్రే ష్ట మా న్య
నిషిద్ధాక్షరం వ గ స స వ య ప య మ వ మ త చ
రెండవ పాదం : భా వ నా కా ర గా భ వ భ ద్ర య గు ట
మిగిలిన రెండు పాదాలు తరవాతి రౌండు లో పూర్తి పర్తి చేసారు, నిషిద్ధం లేదు…
మూడవ పాదం : తల్లి వాత్సల్య గుణ కల్పవల్లియగుచు
నాల్గవ పాదం : అఖిల సృష్టికారాధ్యయై అలరునెపుడు
పూర్తి పద్యం :
శ్రీమయాత్మయై సార్ద్రయై శ్రేష్ట మాన్య
భావనాకారగా భవభద్రయగుట
తల్లి వాత్సల్య గుణ కల్పవల్లియగుచు
అఖిల సృష్టికారాధ్యయై అలరునెపుడు
2) న్యస్తాక్షరి శ్రీ. భాగవతుల గోపి గారు
అడిగిన అంశం : సత్యభామ అలుక మత్త కోకిల లో..
మొదటి పాదం రెండవ అక్షరం ఖ్య
రెండవ పాదం పదునాల్గవ అక్షరం చి
మూడవ పాదం పదమూడవ అక్షరం పా
నాల్గవ పాదం మూడవ అక్షరం త
తరళము, మత్తకోకిల సంస్కృతం నుంచి తెలుగులోకి వచ్చిన సోదర వృత్తాలని చెప్పిన పిమ్మట, దాని నడకను గూర్చి వర్ణిస్తూ చంద్ర శేఖరాష్టకాన్ని ఉదహరించి, అటుపై ఎంతో చక్కగా పద్యం పూరించారు అవధాని గారు.
చెప్పిన పద్యం :
సఖ్యతన్విడి సత్యభామ ప్రసన్న భావ విదూరయై
ప్రాఖ్యమూర్తిని కృష్ణ దేవుని పాయ జూచిన వైనమున్
ముఖ్యమంచు దలంప వచ్చునె భూరి పావనుడైన చిత్
సౌఖ్య తత్పరు పంకజాక్షుని సన్నుతించుట ఒప్పగున్
3) దత్తపది డాక్టర్ బి. కె. మోహన్‌గారు
ఇచ్చిన పదాలు క్షేత్రం, గాత్రం, సూత్రం, క్షాత్రం
అడిగిన అంశం కురుక్షేత్ర యుద్ధం
చెప్పిన పద్యం :
క్షేత్రము ధర్మ బంధుర విశిష్టము శ్రీహరి గీతికా వచో
గాత్రము తోడ, యర్జునుని కమ్రబలోన్నతి పెంపుజేయ తత్
సూత్రము ధర్మ దిగ్విజయ శోభనమై కురు సంగరంబులో
క్షాత్రము సార్థకంబుగ ప్రశస్తత పాండవులందిరెంతయున్
4) సమస్య డాక్టర్ పూడిపెద్ది శేషు శర్మ గారు
ఇచ్చిన సమస్య : కారుల కాన రావు ఎటుగాంచిన యీ పురి వాడ వాడలన్
చెప్పిన పద్యం :
భూరి మహత్క్రియా సుగుణ భూషణులై చరియించువారలే
యీరమణీయ భూమి వశియించుచునుండిరి నిత్య ధీమయ
ప్రారభమాణ వర్తనులు భాసిలు చుండుట జేతనే అహం
కారుల కాన రావు ఎటుగాంచిన యీ పురి వాడ వాడలన్
5) వర్ణన శ్రీ యెల్లంరాజు శ్యాం సుందర్‌గారు
అంశం : కుమార సంభవ సంకల్ప దీక్షలోనున్న పార్వతీ పరమేశ్వరుల చెంతకు విఘ్నేశ్వరుడు వచ్చిన విశేషాన్ని ఉత్పలమాల లో వర్ణించమని..
చెప్పిన పద్యం :
హస్తిముఖుండు విఘ్నముల నాపదలన్తొలగించువాడు వి
ధ్వస్తము సేయునే శివుని భావన? తద్గతులాలకించి సు
ప్రస్తుత లీల సోదరుని రాజిత జన్మకు తల్లిదండ్రులన్
ప్రస్తుతి చేసియుండును శుభంకరుడై, శుభద ప్రసన్నుడై
6) కావ్యపఠనం శ్రీ చెన్నుభొట్ల వెంకట్
అడిగిన పద్యాలు మొదటిది మనుచరిత్రలోనిది
ప్రాంచద్భూషణ బాహుమూల గతితో పాలిండ్లు పొంగార పై
యంచుల్మోవగ కౌగిలించి యధరంబాసింప హా శ్రీహరీ
యంచున్బ్రాహ్మణుడోరమోమిడి తదీయాంసద్వయంబంటిపొ
మ్మంచున్ద్రోచె కలంచునే సతుల మాయల్ధీర చిత్తంబులన్!
ప్రవరునికి అంతటి నిగ్రహమెక్కడినించి వచ్చింది అని ప్రశ్న.
అవధానిగారి పాండితీ పటిమకు యీ అంశం ఒక మచ్చుతునక. ప్రవరునికి హిమాలయ సందర్శనాకాంక్ష కలగడం, సిద్ధుని రాక, మంత్ర లేపనానుగ్రహణ, హిమాలయ సౌందర్య వర్ణన, వరూధిని రాక, ప్రవరుని అకుంఠిత యోగ సాధన, భక్తి, నియమవ్రత దీక్ష ఇత్యాది అంశాలపై అనేక పద్యాలనుదహరిస్తూ వ్యాఖ్యానించారు అవధానిగారు. ప్రవరుడు వామనుని నిత్యమూ ఆరాధిస్తాడని తెలుపుతూ, వామనావతారం లో వున్న విష్ణువుని ఆరాధించడం వలన కలిగే సత్ఫలితాలను గురించి భాగవతంలో పోతన గారు వివరించిన విశేషాలు కూడా చక్కగా చెప్పారు అవధాని గారు.
రెండవ పద్యం :
నవయుగ కవితా చక్రవర్తి శ్రీ గుర్రం జాషువా గారు రచించిన “గబ్బిలం” అనే కావ్యంలోని పద్యాన్ని పఠించి, ఆ పద్యంపై వ్యాఖ్య చెయ్యమని అడిగారు.
ప్రతిమల పెండ్లిసేయుటకు వందలు వేలు వ్యయించు గాని దుః
ఖిత మతులైన పేదల ఫకీరుల శూన్యములైన పాత్రలన్
మెతుకు విదల్పదీ భరతమేదిని ముప్పదిమూడుకోట్ల దే
వత లెగవడ్డ దేశమున భాగ్య విహీనుల క్షుత్తులారునే !
ఎంతో చక్కటి వ్యాఖ్య చేసారు అవధానిగారు. భారత దేశ సంస్కృతీ సాంప్రదాయాలు ఉత్కృష్టమైనవే, అయితే వాటిలోని కొన్ని అంశాలను తప్పుగా అర్థం చేసుకోవటం వలన అస్పృశ్యత వంటి దురాచారాలు వచ్చాయి, అస్పృశ్యత తప్పు అనే అంశంపై, కనువిప్పు కలిగించే ఒక మహాకావ్యమే గబ్బిలం. తంజావూరుకు దగ్గరలోని ఒక ప్రదేశంలో నీతిమంతుడైన ఒక నిరుపేద హరిజనుడు తన గోడును కైలాసములోనున్న ఈశ్వరునికి చేరవేయమని గబ్బిలముతో మొరపెట్టుకొనే ఘట్టాలనీ, ఆంధ్ర దేశ వర్ణనలనీ మనసుకు హత్తుకునేలా, పూర్తి పద్యాలతో సహా వివరించారు అవధానిగారు. శంకరాచార్యులవారికి పరమశివుడు దళితుని రూపంలో వచ్చి జ్ఞానబోధ చేయటాన్ని కూడా సందర్భోచితంగా వివరించారు. అవధానం మొత్తానికి ఈ అంశం మకుటాయమానమని చెప్పుకోవచ్చును.
7) ఆశువు: శ్రీ పెమ్మరాజు వేణుగోపాలరావు గారు
మొదటి అంశం: బ్రహ్మ, సరస్వతి లోకాలన్నీ చూస్తూ, అట్లాంటా వెంకటేశ్వరుని గుడికి వచ్చి, పైనున్న విగ్రహాలన్నీ చూస్తారు. అప్పుడు సరస్వతి బ్రహ్మగారితో “చూసారా, అందరి విగ్రహాలూ ఉన్నాయిక్కడ, మనవి తప్ప” అంటుంది. అప్పుడు నవ్వుతూ బ్రహ్మగారు ఏమి చెబుతారో, ఆ సమాధానాన్ని పద్యరూపంలో చెప్పమని ప్రశ్న.
చెప్పిన పద్యం :
శ్రీమద్వేంకట శైల వల్లభుడు వాసింగాంచునెచ్చోట, నే
నామూర్తిన్ప్రభవించు నాకిచట దివ్యారూఢి వున్నట్టులే
భామా యెంచు, వచించు తాను విని శుంభత్వాక్ప్రలాపాత్ముడై,
ఆమోదించును భారతీజనని సౌహా ర్ద్ర స్ఫుర న్మూ ర్తియై
రెండవ అంశం : భాగవతంలో కపిలుడు దేవహూతికి పిండోత్పత్తి క్రమాన్ని, జీవుడు పొందే వివిధ అవస్థలని వర్ణిస్తాడు. జీవుడు మాతృగర్భంలో వేదనను అనుభవిస్తూ, తనని ఉద్ధరించమని భగవంతుణ్ణి వేడుకునేరీతిగా పద్యం చెప్పమని ప్రశ్న.
చెప్పిన పద్యం :
పిండోత్పత్తి విధిన్విషాద గతులన్పెంపారగా చేతువా?
చండాఖండల లోకమండల లసత్సౌందర్య క్రీడా కృతిిన్
ఖండింపన్తగనయ్య నేనిపుడు నీ కారుణ్య సంపత్తి బ్ర
హ్మాండవ్యాప్తము నన్ను కావుము విషాదాంభోధి దాటించుమా !
ఆశుపద్యాలు ఒక కవితా ప్రవాహం లా వచ్చాయి. ఎంతో వేగంగా ఆశు పద్యం చెప్పటం వలన, పృఛ్ఛకులెవ్వరమూ ఆ పద్యాలు రాసుకోలేకపోయాము. తరువాత నేను వీడియోలో మూడు నాలుగు సార్లు చూసి రాసుకున్నాను.
చివరగా అప్రస్తుతం నుంచి కొన్ని ప్రశ్నలు, జవాబులు:
1) అవధానిగారూ..మా ప్రెసిడెంటుగారు పరిచయ ప్రసంగం చేస్తూ మీరు రైతుబిడ్డ అని
చెప్పారుకదా, “రైతుబిడ్డలో ఎన్టీ.ఆర్కదండీ “
సమాధానం: మీ వుద్దేశ్యంలో ఆయనొక్కరే రైతుబిడ్డ అనుకుంటున్నట్లుగా వుంది. వేరే వారెవరూ రైతు బిడ్డకాకూడదా? మన మందరమూ వ్యవసాయం చేస్తూనే వున్నాము. నేను సాహితీ వ్యవసాయం చేస్తున్నాను. ప్రస్తుతం మీవ్యవసాయం అప్రస్తుతం.
2) అందమందు కోతి అరవపిల్ల అన్నాడు కదా శ్రీనాథుడు, మరి తెలుగు పిల్ల మాటేవిటని?
సమాధానం: ఆయన స్వీయానుభవాన్ని చెప్పాడు, ఆయనకు తారస పడ్డ వారి గురించి. మీకట్టి అనుభవం లేదు కదా..
3) అవధాని గారూ…మీరు నాన్స్టాప్ఫ్లైటు లో వచ్చారు కదా, మరి ఎల్లా దిగారండీ?
సమాధానం : నాన్స్టాప్విమానంలో వచ్చాను కాబట్టే అవధానం కూడా నాన్‌స్టాప్‌గా చేయడం జరుగుతోంది. మీ అప్రస్తుతం కూడా నాన్స్టాప్గానే సాగుతోంది..!
4) అవధానం చేస్తే ఎన్ని కాలరీలు కరుగుతాయో చెప్పండి?
సమాధానం: అవధానం చేస్తే ఉన్న శక్తి పోదు, కొత్త శక్తి వస్తుంది.
5) పెళ్ళి ఉప్మాకి అంతరుచి ఎల్లా వస్తుందండీ?
సమాధానం : అది మీ అభి రుచిని బట్టి వుంటుందిలెండి..
6) వెంకటేశ్వరుడు కటి వరద హస్తాలతోనే కనిపిస్తాడు, అభయ హస్తం వుండదు ఎందుచేత?
సమాధానం : మీకు అభయ హస్తం కావాలంటే అప్పలాయగూడు వెళ్ళండి.
ఇలా ఆద్యంతం ఆహ్లాదంగా జరిగింది ఆనాటి అవధానం.
చివరి మాట :
యీ రెండు అవధానాలూ హాయిగా చదువుకోండి. నచ్చితే మీ కలెక్షన్లలో దాచుకోండి. వీటిల్లో ఎక్కడైనా తప్పులు దొర్లివుంటే, అవి నావి, అవధానులవి కావు. గరికిపాటి వారి అవధానం కొంచెం సరసోక్తులతో సాగింది, మేడసాని వారి అవధానం కొంత గంభీరంగా నడిచింది. ఇంతకు మించి ఆ అవధానాలను నేను పోల్చ దలుచుకోలేదు. వారిద్దరి పద్య నిర్మాణ చాతుర్యాన్నీ, శైలినీ, రసస్ఫూర్తినీ పోల్చేంత సరుకు నా దగ్గర లేదు. మీకు కూడా ఓ చిన్న మనవి. ఎవరి అవధానం గొప్పది, ఎవరి ప్రతిభ ఎంత అనే వివాదాలకు పోకుండా, యీ చక్కటి అవధానాలని ఆస్వాదించి మీ లైబ్రరీలలో, మనసుల్లో భద్రపరుచుకుంటారని ఆశిస్తున్నాను.
యీ రెండు ప్రతులలో దొర్లిన కొన్ని తప్పులు సూచించిన కె.వి.యస్.రామారావు గారికీ, దిద్ది పెట్టిన అన్నయ్య (రామభద్ర డొక్కా) కీ పత్రికాముఖంగా కృతజ్ఞతలు.
నమస్తే, మీ ఫణి డొక్కా s_dokka@hotmail.com