అమ్మాయీ సీతాకోక చిలుకా

(సుచేతా మిశ్ర ఒరియా కవయిత్రి. పురి బ్లెస్డ్‌ శేక్రమెన్ట్‌ స్కూల్లో ఉపాధ్యాయిని. 4 కవితా సంపుటాలు వచ్చాయి. ఇంగ్లీషు, హిందీ, అస్సామీస్‌ భాషల్లో ఈమె కవితల అనువాదాలు ప్రచురించబడ్డాయి. అనేక గౌరవ పురస్కారాలు అందుకున్నారు. శ్రీ ఖేత్రశ్రీ అవార్డు (93), బసంత ముడులి కబితా అవార్డు (95), భుబనేశ్వర్‌ బుక్‌ ఫేర్‌ అవార్డు (97).)

అదేమిటే అమ్మాయీ
నీ గుప్పిట్లో?
తల్లి ప్రశ్న
ఆమె కళ్ళల్లో తెలుసుకోవాలన్న కోరిక

అమ్మాయి కళ్ళల్లో, పెదవుల మీద,
శరీరంలో ఒక అల్లరి చిరునవ్వు

ఇదిగో, చూడమ్మా
ఒక చిన్ని సీతాకోక చిలుక
తెలుపు నీలం రంగుది
నా గుప్పిట్లో!

అమ్మాయి తన గుప్పెట తెరుస్తుంది
సీతాకోకచిలుక గుప్పిట్లో లేదు!

ఇంతకు ముందు ఉందమ్మా అన్నది అమ్మాయి
తోటలో నుంచి తెచ్చాను

తల్లి గుండెల్లోంచి వచ్చింది
ఒక నిట్టూర్పు
బహుశా నిరాశ వల్లనో
కలిగిన పరాజయం జ్ఞాపకంతో
కలిగిన భయంకర దుఃఖం వల్లనో

చూశాను తల్లీ ఒకప్పుడు
నేను కూడా ఆ సీతాకోక చిలుకని
దాని కలలతోనే గడిచింది
సుకుమారమైన కౌమార్యం
భయం భయంగా యవ్వనం

సాహసం లేకపోయింది నాలో
చేయిచాపటానికి!
గుప్పెట బిగించటానికి!!

నువ్వైనా నేర్చుకో
లేకుంటే మాటిమాటికీ
ఇలాగే ఎగిరిపోతుంది

తల్లినే తదేకంగా చూస్తూ ..
కళ్ళలో ఆశ్చర్యం నింపుకుని …