ప్రాచీనావీతి

నాలుగో రోజు

హఠాత్తుగా లేచి కూర్చున్నాను. గుండె దడగా ఉంది. ఛాతిలోకి రెండు చేతులూ పోనిచ్చి మెల్లగా హృదయాన్ని బైటికి తీశాను. కిటికీలోంచి లోపలికి పడుతున్న కొద్దిపాటి వెలుగులో ఎర్రగా మెరుస్తోందది. అక్కడక్కడా నల్లటి మచ్చలు. జాగ్రత్తగా దాన్నొక చేతిలోకి ఒంపుకుని, మరో చేత్తో ఆ‌ నలుపుని తుడుస్తున్నాను. పోలేదవి. పడుకున్న దుప్పటితో తుడవడానికి ప్రయత్నించాను. ఊహూ, తుడిస్తే పోయేటట్టే లేవా మచ్చలు. నిస్సహాయంగా దాన్నలాగే ఒడిలో పెట్టుకుని కూర్చున్నాను. చెంపలనుండి జారుతున్న ఉప్పటి నీటితో తడుస్తోందిప్పుడది.

ఓ బోర్డు మీద తప్పు రాస్తే చెరిపేసుకోవచ్చు, ఓ కాగితం మీదైతే చింపేసుకోవచ్చు. కానీ ఓ మనసు మీద తప్పు రాసుకుంటే?

హఠాత్తుగా లేచి కూర్చున్నాను. గుండె దడగానే ఉందింకా. ఇది మెలకువే అయ్యుండాలి. ఏమో, ఖచ్చితంగా చెప్పలేను. ఆ ప్రశ్న మళ్లీ వచ్చి ఎదురుగా కూర్చుంది. గత నాలుగు రోజులుగా వేధిస్తూనే ఉందది – ‘నాన్న చివరిగా నాతో ఏమన్నారు?’ ఇంకోసారి గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాను. లేదు. కళ్లు గట్టిగా మూసుకున్నాను. లాభం లేదు. ఈసారి ఆయన్నే ఎదురుగా పెట్టుకుని ధ్యానం చేశాను. మెల్లగా… లీలగా… మబ్బులు వీడిపోతున్నట్టు, ఆ వాక్యాలు తేలుతూ ముందుకొస్తున్నాయి. ఆ ముందు రోజు ఆయన వెళ్లిన సభ గురించీ, అక్కడెవరు మాట్లాడారో, ఏం మాట్లాడారో, తనకేం నచ్చిందో, నచ్చలేదో… అన్నీ గుర్తుకొస్తున్నాయి.

నిజానికిది సంతోషించాల్సిన‌ విషయమే కానీ నాకెందుకో సంతృప్తిగా లేదింకా. నాకు గుర్తుకు రావలసింది ఆ వాక్యాలు కాదు, ఆ గొంతు. ఆ గొంతులోని అసహనం, ఆ నీరసం, అక్కడి వ్యంగ్యం, దాన్లోని ఆరోపణ, ఆశ్చర్యం… అన్నీ, అవన్నీ కావాలి నాకు. లేదు, అది నాకు దక్కేట్టు లేదు. నేనో దురదృష్టవంతుడిని. అవే నాన్న నాతో మాట్లాడే చివరి మాటలౌతాయని తెలిస్తే ఇంకొంత శ్రద్ధ పెట్టి వినేవాడిని. వాటినలాగే పట్టుకుని కూర్చునేవాడిని.

కన్నీళ్ళింకా అలానే ఉన్నాయి. మసక చీకటీ అలానే ఉంది. నేను పడుకున్న చాప ముళ్లపొదలా పొడుస్తోంది. పక్క మంచం మీదో పిల్లాడు. నా కన్నీళ్ళ శబ్దాలకి పాపం వాడూ లేచి కూర్చున్నాడు. వాడి సన్నటి చెయ్యి నా చేతుల్లోకి తీసుకుని కళ్ళకి అడ్డంగా పెట్టుకుని కూర్చున్నాను.

అలా ఎంతసేపున్నానో తెలీదు.

***

మొదటి రోజు

నాన్న ఇంకా జీవితంలో ఏదో సాధించి ఉంటే బావుండేది. గొప్ప పేరో, డబ్బో సంపాదించుకునుంటే బావుండేది. చేయగలిగీ ఎందుకసలు చేయలేకపోయారు?

తడిబట్టలతో, చేతిలో బొగ్గుల కుండతో, ఆ బండిలో ఓ మూల నీలుక్కుని, శూన్యాలను ప్రశ్నిస్తున్నానిలా. ఉన్నట్టుండి ఎదురు అడ్డరోడ్డులోంచి ఓ ఎర్రటి స్కూటీ దూసుకుంటూ బైటికొచ్చింది. ఆ వెనకున్న అమ్మాయి మా బండివైపే చేతులు చూపిస్తోంది, ముందున్నావిడ బలంగా ముందుకొంగి నడుపుతోంది. వాళ్లిద్దరి లక్ష్యం మేమేనా? ఆశ్చర్యంగా చూస్తున్నాన్నేను. ఒక్క నిమిషంలో మా బండిని చేరుకున్నారు వాళ్ళు. స్మశానంలోకి వెళ్ళబోతూ, తలుపులు తెరవడం కోసం ఓ నిమిషం బయట ఆగింది మా బండి. అంతే, స్కూటీని అమాంతం పక్కన పడేసి, మా వ్యానులోకి దూకినంత పనిచేశారు ఆ తల్లీ కూతుళ్లు. ఇద్దరి మొహాలూ తడిసిపోయున్నాయి.

“మాష్టారి చివరి చూపు కూడా దక్కదేమో అని బయపడ్డా,” అంది ఆయాసపడుతూ ఆ తల్లి. “మహానుభావుడు, కాళ్ళకి దణ్ణం పెట్టవే!” అంది కూతురితో. పూలతో నిండిన నాన్న దేహం ముందు అలానే ఏడుస్తూ నిలబడ్డారా ఇద్దరూ. కాలం స్థంభించిందప్పుడు. వాళ్ళెవరో నాకు తెలియదు. తమ్ముడి వైపు చూశాను. వాడికీ తెలియదు. కానీ కన్నీళ్ళకో నియమం ఉంది. ఒక కంటినుంచి ఎదుటి కంటికి పారాలనేది. ఎవరూ, ఏమిటనే ప్రశ్నలు వేయకుండా. వాళ్లనలా చూస్తూ మా మొహాల మీద మరో ధార మొదలైంది, అప్రయత్నంగా.

మా బండి కొంచెం కదిలింది ముందుకి. ‘దిగాలమ్మా’ అన్నట్టు చూశాం మేము వాళ్ళ వైపు. అసహాయంగా చూస్తూ దిగేశారిద్దరూ.

“మాకు పాఠాలు చెప్పారు సారు. ఎంతో ఋణపడ్డాం ఆయనకి,” అంటోందా తల్లి మరొకరితో, కింద.

అవసరమైనవన్నీ వదిలేసి, చివరికి మనుషుల్ని సాధించుకున్నాడా ఈయన? ఆశ్చర్యంగా అడుగుతోంది నా మనసు. కాదని చెప్పలేని పరిస్థితి నాది. దానికి సమాధానం ఇస్తుంటే నా ఛాతి ఉప్పొంగుతోందెందుకో.

***

మూడో రోజు

నా ఏడుపు ఆగేట్టు లేదు.
ఓసారి ఇంటి బయట ఆ పాత బైక్‌ని చూసి ఏడ్చాను.
మరోసారి లోపల దుమ్ము పట్టిన కంప్యూటర్ డెస్క్‌ని ‌చూసి ఏడ్చాను.
గోడ కొక్కానికి ఇంకా అలాగే వేలాడుతున్న ఆ లాల్చీని చూసి ఏడ్చాను.
ఆయనవి, ఆయనవే అయిన ఆ పుస్తకాల దొంతరలని చూసి ఏడ్చాను.
నాతో ఓ మాటైనా చెప్పకుండా వెళ్లినందుకు కోపంతో ఏడ్చాను.
నా ఏడుపుకి విరామమిద్దామని దీక్ష తీసుకు కూర్చుంటాను. ఏదో ఓ జ్ఞాపకం ఎదురు పడో, ఓ వాక్యం చెవిన పడో, దాన్ని చెడగొడుతుంది.

ఏడుపంటే కన్నీళ్ళే కాదు. రకరకాల రూపాలు దానివి.

“మనవాళ్లు ఈ పదమూడు రోజుల ప్రాసెస్ పెట్టింది బాధలని మర్చిపోవడానికేరా,” అన్నారెవరో. అయ్యుండచ్చు కానీ బాధకి ఓపికెక్కువ. ఒంటరి రాత్రుళ్ల కోసమో, జనాలెవరూ లేని ఉదయాల కోసమో వేచి చూస్తూ ఉంటుంది. దాడి చేయడానికెంత; ఓ క్షణం చాలు దానికి.

“తొందరగా కానియ్యాలి, ఇంకా చాలా కార్యక్రమం ఉంది,” పురోహితుడి అరుపు.
“అయిపా వచ్చిందిలే, గడ్డం చేసేత్తే, స్నానానికే ఇంగ,” ఇటునుండి సురేషు.
నా తలమీది జుట్టు, మెల్లగా మొహం మీదనుండి జారుతూ కింద పడుతుంటే, కళ్లు మూసుకుని యోగముద్రలో కూర్చోనున్నాను.

నాన్న నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదనిపిస్తుంది. ఆయనకి నచ్చని అంశాలేవో ఉన్నాయి నాలో. వాటి లెక్క తేల్చకుండా ఆయన వెళ్లడమే నాకు నచ్చట్లేదు. కనీసం ఒక్కసారైనా చెబితే బాగుండేది, దగ్గర కూర్చోబెట్టుకుని.

“నేను ఇబ్బందుల్లో ఉన్నానని మెసేజ్ పెడితే, మర్నాడే మా ఊరికొచ్చి మరీ నన్ను ఓదార్చారు,” అన్నాడు ముందు రోజు పరామర్శకొచ్చిన ఒక లెక్చరర్.

“నాకు బాగుండేది కాదసలు అప్పట్లో. నన్ను ఇంట్లో పెట్టుకుని, దగ్గరుండి డాక్టర్లకు చూపేవారు,” బక్కగా ఉన్న మరొకతను.

“హీ ఈజ్ సచ్ ఎన్ ఎక్స్‌పర్ట్ ఇన్ హిస్ ఫీల్డ్,” అన్నారో పెద్ద ఆఫీసర్.

ఎవరు వీళ్ళంతా? ఇంత ఆలస్యంగా చెబుతున్నారెందుకివన్నీ? నాన్న జీవితంలో సగం అధ్యాయాలు తెరిచినట్టే లేదు నేను.

స్నానాలయ్యాయి, తిలోదకాలయ్యాయి, వాసోదకాలు కూడా అయ్యాయి. పిండాలు చేయడానికి కూర్చున్నాను కానీ సరిగా రావట్లేదు చేయడం. గుండ్రంగా, పగుళ్ళు లేకుండా, విడిపోకుండా రావడానికి కష్టపడుతున్నాను. చేతుల్లో బలం లేదని గొణుక్కున్నారు పురోహితులు. నాకైతే బలం లేనిది చేతుల్లో కాదనిపిస్తోంది.

***

అయిదో రోజు

“ప్రేత దహనజనిత తాపోపశమనార్థం…” అంటున్నారు పురోహితులు.
నా ముందున్న ఎర్రటి ముంతలోకి నీళ్లు చిలకరిస్తున్నాను.
“బాబుగారూ, ఆ ముంతలోనుండి అస్థికలు తీసి దొప్పల్లో పెట్టుకోండి,” అన్నారు.
చేతులు ఒణుకుతున్నాయి. ఒక పన్ను, ఒక వేలు, ఓ వెన్నెముక భాగం… నాన్నే ఈ ముంతలో.

ఓ మనిషి శరీరానికి చితిపెట్టి, బూడిదగా మార్చే ధైర్యం నాకారోజు ఎలా వచ్చిందో ఇంకా అర్థం కావట్లేదు. మళ్లీ తిరిగెళ్లి, అక్కడే ఆయన ఆనవాళ్లని వెతికి, అస్థిసంచయనం చేసిందీ నేనే అంటే ఇప్పుడు నమ్మలేని పరిస్థితి.

అస్థికలని కృష్ణలో నిమజ్జనం చేస్తున్నప్పుడు నేను మౌనంగా ఉన్నాను. మనిషిని భస్మంగా మార్చడమే‌ కాకుండా, ఆ భస్మాన్నీ ఆనవాలు లేకుండా మాయం చేస్తున్నానే!

ఎందుకివన్నీ నా చేతి మీదే జరుగుతున్నాయి?
ఇంటికి తిరిగెళ్లి ఇప్పుడేం చెప్పను అమ్మకి?
నీ సహచరుడిని ఇలా నీళ్ళపాలు చేశాననా?
అంతటి నిశ్చలత్వాన్ని తిరిగి ఎప్పటికీ నీకు ఇవ్వలేననే నిజాన్నా?
నీ పక్కన ఐదున్నరడుగుల ఖాళీని ఇవాళ్టితో శాశ్వతం చేశాననా?
ఏం చెప్పను?

ఆ రోజే నాకు మరో భయం పట్టుకుంది. ఆ నీళ్ళలోనే నాన్నతో నాకున్న సంబంధం కూడా కరిగిపోతుందేమోనని. ఆయన మొహం ఇంకెప్పుడూ నా కళ్ళ ముందుకి రాదేమోనని. వెంటనే ఓ పుస్తకంలో మా జ్ఞాపకాలన్నీ హడావిడిగా రాయడం మొదలుపెట్టాను. ఆయన నాతో అన్న మాటలూ, ఆ సైకిల్ నేర్పించిన వీధులూ, కాలేజ్‌కి తిప్పిన రోజులూ, కంప్యూటర్ని చూపెట్టిన క్షణాలూ… అవన్నీ ఆతృతగా పోగేసుకోవడం మొదలుపెట్టాను. వాటిల్లోంచి మళ్లీ ఆ రూపాన్ని సృష్టించాలని నా తపన.

ద్రోహం! ఆ వాక్యాలన్నీ పోగేస్తే చివరికో రూపమేదో వచ్చింది కానీ అది నాన్నలా లేదు. కోపంతో అక్షరాలపై దాడికి దిగాన్నేను. ‘రక్తమాంసాలున్న మనిషిని నలుపు తెలుపు రంగుల్లో బంధించాలనుకోవడం నీ అవివేకం’ అని ఎదురు తిరిగాయవి.

చనువిస్తే టక్కున ఎగిరిపోయి, ఎప్పటికీ గుర్తురాని జ్ఞాపకాలని మరింకెలా పట్టుకోవడం?

***

ఆరో రోజు

దట్టంగా మంచు కమ్ముకుని ఉంది. చిన్న తుంపర కూడా మొదలైంది. ఎత్తుగా ఉన్న పంపుల కింద తలపెట్టి నుంచునున్నాం మేమిద్దరం. రోజూ ఇది మామూలే కానీ ఇవాళ, చుక్క ఇంకా మీద పడకముందే ఒణుగ్గా ఉంది.

నాన్నని నేనంత ప్రేమించలేదేమో అని నా అనుమానం. ఆయన నన్ను కూడా!

“మృత్తికే హనమే పాపం…” ముంతల్లో తెచ్చుకున్న ఎర్రటి మట్టిని రెండు చేతుల్లోకీ తీసుకున్నాం. పైన ముసురులో కూరుకుపోయిన సూర్యుడివైపు చేతులెత్తి చూపించాం. “అంగాదంగాత్, లోమ్నో లోమ్నో జాతం…” ఋగ్వేదమంత్రాన్ని ఆదేశిస్తూ పోతున్నారు పురోహితులు. తలనుండి పాదాలదాకా ఆ మృత్తికని పూర్తిగా రాసుకున్నాం. లేచి పైన పంపు తిప్పితే, షాక్ కొట్టినట్టు ఒంటిపైకి పారుతున్న ఎర్రటి చన్నీళ్ళు.

“మా వాడు మంచి పొజిషన్లో ఉన్నాడండీ!” అని చెప్పేవారట నా గురించి అందరికీ. “మా వాళ్ళు చిన్నప్పుడే నన్ను ఆయన చేతిలో పెట్టేశారు. సొంత కొడుకులా చూసుకున్నారు నన్ను,” అన్నాడొకతను నిన్న. ముఖంలో బాధనీ, గర్వాన్ని కలిపి పెట్టుకుని.

అసలు సొంత కొడుకులా చూసుకోవడమంటే ఏమిటి? ప్రేమించడమే కదా. అందుకేనా నా కంట్లో నీళ్ళలా ఊరుతూనే ఉన్నాయి, ఎవరు కదిలించినా, కదిలించకపోయినా? కన్నీళ్ళే కదా ప్రేమంటే!?

నేను జీవితంలో గెలిచినా, ఓడినా, బాధపడినా, సంతోషపడినా, నాన్నా ఇలాగే ప్రేమించుంటారు. కన్నీళ్ళతో కాకపోతే ఆయన శైలిలో.

ఈ‌ నాన్నలెందుకో జీవితాంతం అర్థం కాకుండా బతుకుతారు.

***

ఎనిమిదో రోజు

ఎక్కువగా నిద్ర పోతున్నాను ఈ రెండ్రోజులూ. పితృకార్యాలతో అలసిపోయాడనుకున్నారు అందరూ. పోయుండచ్చు, కానీ నా సమస్య అది కాదు. ఆయన ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా పోయినందుకు సంతోషించాలో, ఎవరికీ ఏమీ చెప్పకుండా పోయినందుకు కోప్పడాలో, అమ్మని ఒంటరి చేసినందుకు బాధపడాలో, కొడుగ్గా ధైర్యంగా ఉండాలనే లోకుల ఉవాచకు కట్టుబడాలో… తేల్చుకోలేక నిద్రే శరణ్యంగా మార్చుకున్నానని చాలామందికి తెలియదు.

అప్పుడప్పుడూ అలా పైకి శూన్యంలోకి చూసి అడుగుతున్నాను, ‘అయ్యా! నువ్వు నాకో దిశానిర్దేశాన్నివ్వు. అందులోనే నీ ఓదార్పునీ, నీ జ్ఞాపకాలనీ మోసుకు తిరుగుతాను. నువ్వెక్కువ మాట్లాడవని తెలుసు కానీ‌ ఏదో ఒక్క సంజ్ఞ, చెవిలో ఒక్క మాట, నిద్రలో ఒక్క కల. చాలు.’

“ఏంటో ఏం చెప్పకుండా పోయారు,” అని నేనంటే, “ఆయన జీవితమే గొప్ప సందేశం కదయ్యా, ఇంకా ఏం చెప్పాలి?” అన్నాడొకాయన, అది కూడా తెలియదా అన్నట్టు.

“దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః
వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే,” అని గుర్తు చేసి పోయిందొకామె.

ఇంట్లో అటుపోయీ ఇటుపోయీ, నా చూపులు అప్రయత్నంగా నాన్న ఫొటో వైపుకే తిరుగుతున్నాయి. ఆ వెంటనే చేతులు అప్రయత్నంగా గుండె మీదకి వెళుతున్నాయి.

అప్పుడే నాన్న దేవుళ్లలో చేరిపోయారా?

***

పదకొండో రోజు

చాలా హడావిడిగా ఉంది ఇల్లంతా. మూలమూలలా జనాలూ, కుర్చీలూ, ఆగకుండా జరిగిపోతున్న కార్యక్రమాలూ… ఆలోచించలేనంత హడావిడి. ఉన్నట్టుండి ఓ పెద్ద కారొచ్చి ఆగింది గుమ్మంలో. ఓ పెద్దాయన దిగారు, చేతికర్ర పట్టుకుని. ‘పెద్ద ధర్మకర్త’ అన్నారెవరో. అమ్మకీ తెలియదు.

“మీ నాయన నాతో గొడవ పడ్డాడో రోజు,” అన్నాడాయన నాతో పరామర్శలో భాగంగా. “అయ్యో ఏదో తెలియక అనుంటారు లేండి,” అన్నారెవరో పక్కన అనునయిస్తూ. “అంతా తెలిసే అన్నాడు. మీదే తప్పన్నాడు నా మొహం మీదే,” అన్నాడాయన. మౌనంగా ఉన్నాం మేము. “బాగా నిక్కచ్చి మనిషి. నేనే ఒప్పుకున్నాలే, చివరికి,” అన్నాడు చటుక్కున పైకి లేస్తూ. అంతే. అందుకే వచ్చినట్టు.‌‌ నాలుగే నాలుగు నిమిషాలు. వెళ్లిపోయాడు.

రోజుకో పాఠం నాకు. కావాలనుకున్నా, వద్దనుకున్నా.

దానాలివ్వాలి రేపు. దశ దానాలు, షోడశ దానాలు. ప్రత్యేక గోదానం చేయాలి, నాన్నని వైతరిణి దాటించాలి. వంద విషయాలు, జాగ్రత్తలు. అన్నీ అమ్మే చూసుకుంది.‌ ఇల్లంతా అమ్మే.‌ అసలేమీ జరగనట్టే అందరూ అన్నీ అడుగుతున్నారామెని. కూర్చుని బాధపడే సమయమే దొరకలేదామెకు. ఇంటి గురించి నాన్న అప్పుడూ పట్టించుకోలేదు, ఇప్పుడూ పట్టించుకోవట్లేదు.

అమ్మ ఉందనే ధైర్యం ఉంది మా అందరికీ. మరి అమ్మకి?

***

పన్నెండో రోజు

ఇన్ని చేశాననీ, ఇంత చేశాననీ, ఏ కొంతైనా ఆయన మాకు చెప్పనందుకు, ఎవరికీ చెప్పుకోనందుకు, ఆ కొద్ది సంతోషాన్నీ జీవితంలో ఇంత వెనక్కి నెట్టినందుకు కోపంగా ఉంది. ముఖ్యంగా ఆ నిర్లక్ష్యానికి.

ఇవాళే ‘సపిండీకరణం’, నాన్నని‌ జాగ్రత్తగా పితృదేవతల వద్దకి చేర్చవలసి ఉంది.

ఒకవేళ ఆయనేమైనా చెప్పినా నేను మాత్రం ఏం చేసేవాడిని, “పక్కవాళ్ళ విషయాలు మనకెందుకు, ఇంటి విషయాలు చూసుకోండి చాలు,” అని నాలా సామాన్యుడిలా మార్చే ప్రయత్నం చేసేవాడిని. నాతో పెద్దగా చెప్పకపోవడమే మంచిదయ్యింది.

చిన్నప్పుడు భారవి కథ చెప్పేవారు నాన్న. భారవి ఎంతటి మహాకవి అయినా, లోకులు ఎంత మెచ్చుకున్నా, అతని నాన్న ఎప్పుడూ మెచ్చుకోడు. ఓ రాత్రి కోపంతో ఊగిపోయి ఆయనని చంపడానికి గదిలోకి వెళ్లబోతుంటే, సన్నగా చెబుతూ ఉంటాడు తండ్రి తల్లితో – భారవి గొప్పతనం గురించి.

ఓసారి కాదు, చాలాసార్లు చెప్పారా కథ. ‘నేనలాగ’ అని ఎవరైనా అంతకన్నా బాగా ఎలా చెప్పుకోగలరు?

ఈ రోజు పిండాలు బాగా వస్తున్నాయి. గుండ్రంగా, గట్టిగా, సమానంగా. వాటినలా చేతిలో ఆడిస్తూ మురిసిపోతున్నాను.

“సవ్యం!” అరుపు.

“బాబుగారూ! ప్రాచీనావీతిలోనే ఉన్నారు, సవ్యం చేస్కోండి త్వరగా,” అన్నారు పురోహితులు.
తలెత్తి అయోమయంగా చూశాను.

“కానివ్వాలి, అటునుంచి ఇటు మార్చుకోవాలి త్వరగా…ఆలస్యమౌతోంది…” అసహనంగా మారిందా స్వరం.

***

పదమూడో రోజు

అది కేవలం సంస్మరణ సభ జరిగిన సాయంత్రంలా అనిపించలేదు నాకు.

వక్తలొక్కక్కరూ ఒక్కొక్క పరమాత్మలా వచ్చి, మోకాళ్ల మీద కూర్చునున్న నాకు జ్ఞానబోధ చేసిపోయారనిపించింది.

‘ఆయనో సామాన్యుడు, ఏమంత గొప్పవాడు?’ అని నాలో ఏదో మూల మిగిలున్న అనుమానాన్ని వేళ్ళతో పెకలించిపోయారనిపించింది.

ముందు పన్నెండు రోజులపాటు జరిగిన అశ్రుధారకంటే, రెట్టింపుగా వర్షింపజేయాలన్న‌ కంకణం కట్టుకున్నారనిపించింది.

ఎవరెవరో ఆ సభలో.‌ “ఆయనకి నేను ఆత్మీయుడిని,” అని ఒకరంటే, “నేను స్వయానా తమ్ముడినే,” అని మరొకరు. “నాకు వారితో నలభై ఏళ్ల పరిచయం,” అని ఒకరంటే, “వాడు నాకు చిన్నప్పటినుంచీ తెలుసు,” అని మరొకరు.

ఒకరు ఆయన పేరుతో పాట కట్టి పాడారు. మరొకరు కవిత్వం చెప్పారు. వేరొకరు ఉద్వేగంతో మాట్లాడనే లేకపోయారు. “అందుకే నేనసలు మైకు దగ్గరికే రాలేదు,” అన్నాడు ఇంకొకాయన.

ఒకాయన కర్మయోగి అన్నాడు. ఒకామె దార్శనికుడంది. అసలు ఆయనెక్కడికీ పోనే పోలేదు పొమ్మంది మరొకామె. నేను నోరు తెరుచుకునే ఉన్నానవన్నీ వింటూ. నిజాలే ఇలా ఉంటే, వాళ్ళు పొగడ్తలకి దిగితే!?

ఒకాయన అంతా చెప్పి, చివరికి “వారిక్కడ లేరు కాబట్టే ఇంత ధైర్యంగా ఆ గొప్పతనం గురించి మాట్లాడగలుగుతున్నాం, అదే వారుంటే ఇలాంటివస్సలు ఒప్పుకోరు,” అని దిగిపోయాడు. నేనది పట్టుకున్నాను. ఆయన ఉండి ఉంటే, ఆ గొప్పతనాన్ని తెలిసే అవకాశమే రానిచ్చేవారు కాదన్నమాట. కీర్తినీ, సుఖాన్నీ, ధనాన్నీ కోరుకోని మనిషి ఏం మనిషాయన? బహుశా ఓ వ్యక్తికంటే, ఓ కుటుంబంకంటే ఎక్కువైనదేదో ఉంది ఆయనకి.‌

ఆ ప్రపంచాగ్నికోసమేనా ఆయన తపన? అదేనా‌ ఆయన చివరి కోరిక?

ఎందుకో ఇక పైకి శూన్యాల్లోకి చూడవలసిన అవసరం లేదనిపిస్తోంది నాకు. దిశానిర్దేశానికై కలలు కనాల్సిన అవసరం అసలు రాదనిపిస్తోంది.

ఎవరూ హడావిడి పెట్టలేదు కానీ మెల్లగా నేనే సవ్యం చేసుకుంటున్నాను. ప్రాచీనావీతిలోనే ఉండిపోయాను ఇన్నేళ్ళుగా.


పాణిని జన్నాభట్ల

రచయిత పాణిని జన్నాభట్ల గురించి:

\’తనలో నన్ను\’ , \’చెయ్యాల్సిన పని\’ కథా సంపుటులు, \’మనుషులు చేసిన దేవుళ్ళు\’ నవల.

 ...