మహాకవి దాశరథిగారిని నేను 1963లో తొలిసారి హైదరాబాదులో, కాచిగూడలోని వారి నివాసంలో కలుసుకున్నాను. అప్పుడు నా వయస్సు పద్దెనిమిదేళ్ళు. అప్పుడప్పుడే పద్యాలు రాస్తున్నాను. మా నాన్నగారు తిరునగరి మనోహర స్వామిగారు వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. సంస్కతాంధ్ర భాషా విశారదులు. వారివద్దనే అమరం కొంత భాగం, సంస్కృతంలో పంచకావ్యాలు అభ్యసించాను. కవిత్రయ భారతం, పోతన భాగవతం, ప్రబంధాలూ వారివద్దనే నేర్చుకున్నాను. ఛందస్సు, వ్యాకరణం వారే నేర్పించారు. ఈ పరిజ్ఞానంతో తెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేస్తున్న దశలో నేను భావకవుల ప్రభావంతో పద్యాలు రాయడం ప్రారంభించాను.
నా కవిత్వం దాశరథిగారికి చూపించి వారి అభిప్రాయాలను, సూచనలను తెలుసుకోవాలని భావించాను. ఆ కాలంలో దాశరథిగారు ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో ఉద్యోగిస్తూండేవారు. వారి ఇంట్లోకి వెళ్ళగానే లాల్చీ లుంగీతో ఉన్న ఓ వామనమూర్తి, ‘రండి కూర్చోండి’ అంటూ ఆహ్వానించారు. నా వెంట మా ఊరినుండి వచ్చిన పెద్దమనిషి స్వర్గీయ కళ్ళెం వీరారెడ్డిగారున్నారు.
నేను నూనూగు మీసాల యువకుణ్ణి. దాశరథిగారికి పాదాభివందనం చేశాను, వారు ఆశీర్వదించారు. నేను పద్యాలు రాస్తున్నట్లు చెప్పాను. నా చేతిలోని నోట్ పుస్తకాన్ని తెరచి వారి ముందుంచాను. రెండు పేజీలు చదివారు. నాకు కొన్ని సూచనలు చేశారు. ‘రాస్తూ వుండు, ప్రాచీన, ఆధునిక కవులను బాగా చదువు’ అన్నారు. అలా ప్రారంభమైన మా పరిచయం ఇంతింతై తానింతై తరువాత కాలంలో విస్తృతమైంది. నేను ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేశాను. అప్పటి హైదరాబాదు జిల్లాలోని దేవరయామిజాల ఉన్నత పాఠశాలలో తెలుగు పండితునిగా ఉద్యోగంలో చేరాను. నిరంతరాధ్యయనంతో, నిత్య కవితా సృజనతో నా రచనా వ్యాసంగాన్ని వృద్ధి చేసుకున్నాను. ఆ రోజులలో ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, కృష్ణాపత్రిక, ఆంధ్రపత్రిక, ప్రజాహిత, భారతి, స్రవంతి, చుక్కానివంటి దిన, వార పత్రికలలో నా కవితలు, నా వ్యాసాలు ప్రచురింపబడినై, దాశరథిగారు నా కవితలను చదివి తమ వైమర్శికాభిప్రాయాలు తెలిపేవారు, అభినందించేవారు. ‘సకలాంధ్ర కవికోటి జాబితా వ్యాసాలు ప్రచురింపబడి, దాశరథిగారి కవితలు ప్రచురింపబడిన సంచికలలోన లోపల / నా నామమునకు స్థానంబు గలదు -అన్న జాషువా మహాకవి మాట నాకు వర్తించింది. నేను కవిగా ఎదుగుతున్న తీరును చూచి దాశరథిగారు సంతోషించేవారు. హైదర్ గూడలోని మాతృశ్రీ అపార్ట్మెంట్లో వారిని నెలలో పదిహేను రోజులైనా కలుసుకుంటుండేవాడిని. నేను నల్లగొండజిల్లా ఆలేరులో స్థిరనివాసం ఏర్పరచుకున్నా హైదరాబాదుకు ముఖ్యంగా దాశరథిగారిని కలుసుకోవడంకోసమే ఎక్కువగా వెళ్ళుతూ వుండేవాణ్ణి.
దాశరథిగారిది నవనీత హృదయం. వారు నాపట్ల చూపిన వాత్సల్యం మాటలకందనిది. నాపట్లనే కాదు కవులు, సాహితీవేత్తల పట్ల వారు చూపిన ప్రేమాభిమానాలు ఎంత గొప్పవో! సాహిత్య సభలలో, కవి సమ్మేళనాలలో ప్రముఖ కవులతోపాటు నేను పాల్గొన్న సందర్భంలో వారికి నన్ను చూపిస్తూ ‘ఈయన తిరునగరి, మంచి కవిత్వం రాస్తున్నాడు. మంచి వక్త’ అంటూ పరిచయం చేసేవారు. 1974లో ఒంగోలులో ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘం సభలు ఎ.బి.ఎం. కళాశాలలో జరిగినై. నేను ఆరుద్రగారి అధ్యక్షతన జరిగిన సభలో ప్రసంగించాను. వేదికపై దాశరథి, సినీనటులు రాజబాబు, కొండవీటి వేంకటకవి, పోలూరి ఆంజనేయప్రసాద్, నాగభైరవ కోటేశ్వరరావు, అనిసెట్టి సుబ్బారావు గారలున్నారు. నా ప్రసంగాన్ని ఆరుద్రగారు ప్రశంసించగానే, ‘ఆధునిక కవిత్వంపై చక్కని అవగాహన ఉన్న యువకవి తిరునగరి’ అని దాశరథిగారు తమ ప్రసంగంలో అభినందించారు. సారు సద్గుణలవంబులు కొండలు సేసి మెచ్చుకునే విశాల హృదయలు మహాకవి దాశరథి.
సుప్రసిద్ధ సాహిత్య మాసపత్రిక ‘భారతి’లో ‘వాన వెలిసిన ఉదయం” అనే నా కవిత ప్రచురింపబడింది. అప్పుడు దాశరథిగారు మద్రాసులో ఉండేవారు. ఆ కవితను చదివి ‘వాన వెలిసిన ఉదయం శాపం తీరి అంగన నాశ్లేషించిన యక్షుని తన్మయత్వంలా ఉంది’ అన్న భావన అద్భుతంగా ఉంది. అభివాదయే అని లేఖ రాశారు. యాదగిరిగుట్టలో రాగి సహదేవ్, చెన్నోజు అప్పలాచారి రచించిన ‘నాలుగు దిక్కులు ఒక్కటైతే’ అనే గ్రంథావిష్కరణ సభ దాశరథి, సినీనటులు జె.వి.సోమయాజులు, ఎల్లోరా, ఆచార్య తిరుమల ప్రభృతులు పాల్గొన్న సభలో దాశరథి ప్రసంగిస్తూ ‘నా గీతావళి ఎంత దూరము ప్రయాణించునో” అన్న పద్యం చదువుతున్నారు. రెండో పాదం ధారణకు రాలేదు. వేదికపై ఉన్న నావైపు చూశారు. అక్కడినుండి ఆ పద్యాన్ని అందించాను. వెంటనేవారు నా పద్యాలు – నేను మరచిపోయినా మావాడికన్నీ కంఠస్థాలు’ అన్నారు. అంతటి విశాలహృదయం దాశరథిగారిది.
దాశరథిగారితో చాలా సాహిత్య సభలలో పాల్గొన్నాను. వారి అధ్యక్షతన జరిగిన కవి సమ్మేళనాలలో పాల్గొనడం నా అదృష్టం.
తెలంగాణ రచయితల సంఘం స్థాపన – ఆంధ్ర మహాసభల విశేషాలు – నిజాంకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ పోరాటం నాటి అనుభవాలు వారు తీరికగా ఉన్నప్పుడు ప్రస్తావిస్తే వివరించేవారు. ప్రాచీన సాహిత్యంలో వారెంత నిష్ణాతులో ఆధునిక సాహిత్యాన్నీ అంత క్షుణ్ణంగా చదివారు. అనేక సందేహాలను వారినడిగి తెలుసుకునేవాణ్ణి.
‘తన యెడ యెల్ల మెత్తన కృతి ప్రతి పద్యములంతకంటే మెత్తన తన శిష్యులన్న యెడదన్ గల ప్రేముడి చెప్పలేని మెత్తన…’ అంటూ చెళ్ళపిళ్లవారిని గురించి విశ్వనాథవారు చెప్పిన సద్యం దాశరథివారికి అక్షరాల వర్తిస్తుంది.
1946 సెప్టెంబర్లో నిజాం పాలనకు వ్యతిరేకంగా మానుకోట తాలూకాలోని ఓ గ్రామంలో జరిగిన సభలో గళమెత్తి పద్యాలు చదివిన దాశరథిగారు 1987 దాకా అంటే అస్తమించేదాకా పద్యాలు, పాటలు పాడి కవిగా తన సామాజిక బాధ్యతను నిర్వహించారు. తిమిరంతో సమరం చేయడమే కర్తవ్యంగా భావించారు. ఆ దిశగా కవులను, సాహితీవేత్తలను నడిపించారు. నా జీవితంపైన, కవిత్వంపైన దాశరథిగారి ప్రభావం దండిగా ఉంది. ‘తిమిరంతో సమరం’ కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు వచ్చిన సందర్భంగా అప్పటి ప్రముఖ పత్రిక ‘కృష్ణాపత్రిక’లో ‘దాశరథీ! కవితా పయోనిధీ!’ శీర్షికతో పద్యాలు రాశాను.
కమ్మని నీ ముఖమ్ముపయి కారుణికత్వము నీదు పద్యప–
ద్యమ్మున ప్రేమభావము, హృదంతరమందు విశాలదృష్టి, వి–
శ్వమ్మొక స్వర్గమౌటకయివ్రాసిన వీ కృతులెల్ల దివ్య వే==
దమ్ములు తెల్గు బిడ్డలకు దాశరథీ! కవితా పయోనిధీ!
అని ఓ పద్యంలో వారి సమున్నత వ్యక్తిత్వాన్ని గురించి వివరించాను. వారిని ‘కవితా పయోనిధీ’ అంటూ తొలిసారిగా నేను సంబోధించానని ఆనందపడ్డారు. ఈ విషయాన్ని డా॥ ఆచార్య ఫణీంద్రవంటి కవులకు చెప్పారట.
మల్లంపల్లి సోమశేఖరశర్మగారి మాటలలో ‘మూర్తీభవించిన తెలుగుతనమే దాశరథి”.
కోటి తెలుగుల బంగారు కొండ క్రింద
పరచుకొన్నట్టి సరసులోపల వసించి
ప్రొద్దు ప్రొద్దున అందాల పూలు పూయు
నా తెలంగాణ తల్లి; కంజాతవల్లి
అన్న పద్యం నాకు చాలా ఇష్టం.
చింతలతోపులో మరియు చిన్కులకున్ తడిముద్దయైన బా
లింత యొడిన్ శయించు పసిరెక్కల మొగ్గను వోని బిడ్డకున్
బొంతలు లేవు కప్పుటకు బొంది హిమంబయి పోవునేమొ, సా
గింతును రుద్రవీణ పయి నించుక వెచ్చని అగ్ని గీతముల్
అన్న పద్యమూ మరీ ఇష్టం. దాశరథిగారితో ఉన్న ఆయా సందర్భాలలో పై రెండు పద్యాలనూ, మరికొన్ని పద్యాలనూ చదివేవాణ్ణి. వారు తృప్తిగా నిండుగా నవ్వేవారు.
వారు ఇరవై రోజులకు అస్తమిస్తారనగా నాకు ఓ లేఖ రాశారు. కొత్తగా ఏదైనా రాశారా? అన్న మాటకు బదులిస్తూ- ‘I will be writing till my last breath’ అని రాశారు. తుదిశ్వాస విడిచేదాకా ఎత్తిన కలం దించకుండా కవిత్వం రచించిన మహాకవి దాశరథిగారితో పాతిక సంవత్సరాల అనుబంధం కలిగి ఉండడం నా పూర్వజన్మ సుకృతఫలం. 1963లో ఓ బాలకవిగా వారిని దర్శించుకున్నాను. 1982 నాటికి వారి నోటనే ‘ప్రియ మిత్రులు, విఖ్యాత కవీశ్వరులు’ అన్న ప్రశంసకు నోచుకొన్నాను. “తిరునగరి కవితలు తేజస్వంతములు, ఓజస్వంతములు” అని నా కవిత్వంపై వారి అభిప్రాయంగా ఒకచోట రాసినారు.
‘నా కలమునకు బలమిచ్చి నడిపినట్టి మహాకవి దాశరథిగారు. నన్ను ఆత్మీయ సోదరునిగా భావించారు. నావలెనే ఎందరినో ఆత్మీయులుగా తలంచి అలింగనం చేసుకున్నారు.
‘నేడు తెలంగాణలో కవులెందరో యున్నారు. కాని పీడిత ప్రజల సమస్యలకు ప్రాధాన్యత యిచ్చి గొంతెత్తి చెప్పగలిగిన కవివాణి దాశరథియే. 1949లో దాశరథిగారిని గూర్చి దేవులపల్లి రామానుజరావుగారన్న మాట –
‘శ్రీ దాశరథి విప్పారిన తెలంగాణ కోటి గొంతుల ధ్వని’.
1956లో దాశరథిగారిని గూర్చి డా॥ బెజవాడ గోపాలరెడ్డి గారి వాక్కు.
“దాశరథిని ప్రేమించని సాహిత్యకులు తెలంగాణలో లేరు. దాశరథిచే స్వీకరింపబడని కావ్యవస్తువు తెలంగాణాలో లేదు. దాశరథి గీతాలు వినని రసికులు తెలంగాణమందుండరు. దాశరథియే తెలంగాణము – తెలంగాణమే దాశరథి.’
1950లో దాశరథిగారినిగూర్చి పండిత చిలుకూరి శ్రీరాములు పలికిన మాట – ‘అంతటి మహాకవి వాత్సల్యాన్ని పొందిన నేను ధన్యుణ్ణి. దాశరథియే నా కవితా జీవితానికి వెలుగుబాట వేసిన మహాకవి దాశరథి నాకు సాక్షాత్తు.’
దాశరథిగారి పద్యంతో ఈ వ్యాసానికి స్వస్తి-
ఏనాడెవ్వడు కత్తితో గెలువలేదీ విశ్వమున్ ప్రేమపా
శానన్ కట్టుము నాలుగుంబది ప్రపంచాలని మహాత్ముండిదే.
జ్ఞానోద్బోధము సేసె; నెవ్వడు వినెన్? సాహిత్య సామ్రాజ్యమం
చైనన్ కొంతగ శాంతి పాదుకొననిమ్మా! నీకు పుణ్యంబగున్
మహాకవి దాశరథి సాహిత్య సమాలోచన