సంస్కృతప్రపంచమున వాల్మీకి రామాయణ మాదికావ్యమై విలసిల్లఁగా తెనుఁగున భారతమును నాదికావ్యముగా తీర్చిదిద్దఁదలచిన నన్నయ, దానిని కవివృషభులు “మహాకావ్య”మని ప్రశంసించినట్లు పేర్కొనెను. సంస్కృతభారతమునందును ఇట్టి సందర్భమును పరికించిన నది స్పష్టపడును:
యో విద్యాచ్చతురో వేదాన్ సాంగోపనిషదో ద్విజః ।
న చాఖ్యానమిదం విద్యాన్నైవ స స్యాద్విచక్షణః ॥అర్థశాస్త్రమిదం ప్రోక్తం ధర్మశాస్త్రమిదం మహత్ ।
(మహాభారతం 1.2.382-383)
[వేదవేదాంగములను, ఉపనిషత్తులను చదివినప్పటికీ, ఈ కథను తెలియని ద్విజుడు పండితుడు కాజాలడు. ఇది అర్థశాస్త్రమని, గొప్పదైన ధర్మశాస్త్రమని చెప్పబడింది.]
వ్యాసభారతమునకులేని మహాకావ్యత్వకీర్తి నన్నయ భారతమునకు దక్కినది. సంస్కృతభారత మితిహాసముగానే కీర్తిఁబడసినది కదా.
ఇతిహాసమున కవి కథ నున్నదున్నట్లు చెప్పును — కావ్యమున నట్లు గాక కథావస్తువును రసనిర్భరముగా తీర్చిదిద్దవలసియుండును.
ధ్వన్యాలోకకారు లీ విషయము నిట్లు నిర్దేశించిరి —
కవినా కావ్యముపనిబధ్నతా సర్వాత్మనా రసపరతన్త్రేణ భవితవ్యమ్ । తత్రేతివృత్తే యది రసాననుగుణాం స్థితిం పశ్యేత్తదేమాం స్థితిం భఙ్క్త్వాపి స్వతన్త్రతయా రసానుగుణం కథాన్తరముత్పాదయేత్ । న హి కవేరితివృత్తమాత్ర నిర్వహణేన కిఞ్చిత్ ప్రయోజనమ్, ఇతిహాసాదేవ తత్సిద్ధేః ।
[కావ్యాన్ని రచించే కవి అన్ని విధాలా రసానికి లోబడియే ఉండాలి. ఇతివృత్తంలో రసానికి అనుగుణంగా లేని స్థితి కనబడ్డప్పుడు ఆ స్థితిని భంగం చేసి అయినా సరే రసానుగుణంగా వేరే కథను సృజించాలి. కవి కేవలం ఇతివృత్తాన్ని నిర్వహిస్తే, అందువల్ల ఏ ప్రయోజనం కలగదు. ఇతిహాసంవల్లనే ఆ ప్రయోజనం సిద్ధిస్తుంది కదా.]
కావున కవి రసపోషణకై కథావస్తువునందలి యనౌచిత్యాదుల పరిహరించక తప్పదు.
శకుంతలోపాఖ్యానమునందు శకుంతలా దుష్యంతుల పరస్పర నిందారోపణలు కొన్ని సహృదయోద్వేజకములై ఔచిత్యమును కోల్పోయినవి — చూడుడు.
దుష్యన్త ఉవాచ
న పుత్రమభిజానామి త్వయి జాతం శకున్తలే! ।
అసత్యవచనా నార్యః కస్తే శ్రద్ధాస్యతే వచః ॥ 1.74.73 ॥మేనకా నిరనుక్రోశా బంధకీ జననీ తవ ।
యయా హిమవతః పృష్ఠ నిర్మాల్య మివచోజ్ఝితా ॥ 1.74.73 ॥స చాపి నిరనుక్రోశః క్షత్రయోనిః పితా తవ ।
విశ్వామిత్రో బ్రాహ్మణత్వే లుబ్ధః కామవశంగతః ॥ 1.74.7 ॥
… … … … … …అతికాయశ్చ తే పుత్రో బాలోతిఽబలవానయమ్ ।
కథమల్పేన కాలేన శాలస్తంభ ఇవోద్గతః ॥ 1.74.79 ॥సునికృష్టా చ తే యోనిః పుంశ్చలీవ ప్రభాషసే ।
యదృచ్ఛయా కామరాగాజ్జాతా మేనకతో హ్యసి ॥ 1.74.80 ॥సర్వమేతత్ పరోక్షం మే యత్త్వం వదసి తాపసి! |
నాహం త్వామభిజానామి యథేష్టం గమ్యతాం త్వయా ॥ 1.74.81 ॥
[శకుంతలా! నీకు పుట్టిన కొడుకును నేనెఱుగను. స్త్రీలు అబద్ధాలాడుతారు. వారి మాటలను ఎవరు విశ్వసిస్తారు? నీ తల్లి మేనక వేశ్య కరుణ లేనిది; నిన్ను హిమాలయసానువులలో వదిలివెళ్ళింది. నీ తండ్రి విశ్వామిత్రుడూ దయలేనివాడే; క్షత్రియుడై బ్రాహ్మణుడవ్వాలన్ని ఆశపడ్డాడు; కామానికి వశుడయ్యాడు… ఈ నీ కుమారుడు అతికాయుడు; బాలుడే కానీ బలవంతుడు; కొద్దికాలంలోనే మద్దిచెట్టు బోదెలాగా ఎలా పెరిగాడు? నీది నీచజన్మ; కులటలాగా మాట్లాడుతున్నావు; మేనక అసంకల్పితంగా కామాసక్తికి లోనై నిన్ను కన్నది. ఓ తాపసీ! నువ్వన్నందంతా నేను చూడని సంగతే. నువ్వెవరో నాకు తెలియదు. నీకు నచ్చిన చోటికి పో!]
దుష్యంతుని ఈ పలుకులు శకుంతల యాభిజాత్యమునేకాక శీలమునుగూడ శంకించునవిగా నున్నవి. దుష్యంతుడు తెలిసి తెలిసి ఇట్లు పలుకుట మిక్కిలి అనుచితము. కావున నన్నయ ఈ యనౌచిత్యమును పరిహరించుచు రెండు పద్యములు మాత్ర మీ సందర్భమున రచించెను.
ఏ నెట? నీ వెట? సుతుఁ డెట?
యే నెన్నఁడు దొల్లి చూచి యెఱుఁగను నిన్నున్;
మానిను లసత్యవచనలు
నానిట్టు లసత్యభాషణం బుచితంబే.పొడవునఁ బ్రాయంబునఁ గడుఁ
గడిది బలంబునను జూడఁగా నసదృశు నీ
కొడుకని యీతని నెంతయు
నెడమడుగుగఁ జూపఁదెత్తె యిందఱు నగగన్.
(ఆది. 4/100,101)
దుష్యంతుడు శకుంతలను మందలించిన తీరు సంస్కృతమున నెంతో పరుషమై యుండగా నన్నయ యనువాదమున వ్యంగ్యమర్యాదచే నది మిక్కిలి మృదువై శ్రుతిసుభగమై యొప్పుచున్నది. ఏ నెట? నీ వెట? సుతుఁ డెట? అను పద్య పాదముందలి ఏను–నీవు–సుతుడు — అను పదములు కేవలస్వార్థమున అనుపపద్యమానములై అర్థాంతరసంక్రమితములగుచున్నవి. “మహాభోగోచితుడను, నైకవిధరాజకార్య వ్యాపృతుడనై క్షణమైనను తీరికలేకయున్న నాకును, కణ్వపరిరక్షితవై మృగసాహచర్యమున అరణ్యమున పెరిగి విలాసచేష్టానభిజ్ఞవైన నీకును సంబంధమెట్లుండును? ఆ సంబంధమె పొసగనప్పుడు అతికాయుఁడును అసదృశుడునై యున్న ఈ సుతుడు నావాడెట్లగును?” — అను దుష్యంతుని మందలింపు అర్థాంతరసంక్రమితవాచ్యధ్వనియై భాసించుచున్నది. ఒకప్పుడు మందలింపు వాచ్యమై యుండుటకంటె వ్యంగ్యమర్యాదచే నుండుటచే కడు రమణీయమై ఔచిత్యశోభియగును.
దీనికి శకుంతల ఇచ్చిన సమాధానము మిక్కిలి కటువుగా నుండుటచే నన్నయ వదలివేసెను. ఆ యంశమిది:
రాజన్! సర్షపమాత్రాణి పరచ్ఛిద్రాణి పశ్యసి ।
ఆత్మనో బిల్వమాత్రాణి పశ్యన్నపి న పశ్యసి ॥ 1.74.82 ॥మేనకా త్రిదశేష్వేవ త్రిదశాశ్చాను మేనకామ్ ।
మమైవోద్రిచ్యతే జన్మ దుష్యన్త! తవ జన్మతః ॥ 1.74.83 ॥క్షితావటసి రాజేన్ద్ర! అన్తరిక్షే చరామ్యహమ్ ।
అవయోరన్తరం పశ్య మేరుసర్షపయోరివ ॥ 1.74.84 ॥
… … … … … …
స్వయముత్పాద్య వై పుత్రం సదృశం యో న మన్యతే ।
తస్య దేవాః శ్రియం ఘ్నన్తి న చ లోకానుపాశ్నుతే ॥ 1.74.97 ॥
… … … … … …
త్వామృఽతేపి హి దుష్యన్త! శైలరాజావతంసకామ్ ।
చతురన్తామిమాముర్వీం పుత్రో మే పాలయిష్యతి ॥ 1.74.108 ॥
[రాజా! ఆవగింజలంత ఉన్న ఇతరుల దోషాలను చూస్తున్నావు. మారేడుపండ్లంత ఉన్న నీ తప్పులను చూస్తున్నా చూడడం లేదు. మేనక దేవతాస్త్రీ. దేవతలంతా ఆమెను అనుసరిస్తారు. దుష్యంతా! నీ జన్మకన్నా నా జన్మ గొప్పది. నీవు భూమిపై తిరుగుతావు. నేను ఆకాశంలో సంచరిస్తాను. మేరుపర్వతానికి, ఆవగింజకూ ఉన్నంత తేడా నాకూ నీకూ మధ్య ఉన్నదని గమనించు… ఈవిధంగా, కన్న కొడుకును పుట్టించిన పుత్రుడిని కాదన్నవాడి ఐశ్వర్యాన్ని దేవతలు నశింపజేస్తారు. వాడు ఉత్తమలోకాలకు వెళ్ళడు. దుష్యంతా! నీ సహాయం లేకపోయినా సరే, హిమాలయాన్ని తలపై దాల్చి నాలుగు దిక్కులా వ్యాపించి ఉన్న ఈ భూమిని నా కుమారుడు పాలించనున్నాడు.]
కావ్యమనగా నిట్లు మూలకథలో కొన్ని మార్పులు చేర్పులు సంభావ్యమే యగును.
ఆ మార్పులు చేర్పులు రసానుగుణములై యుండవలెను. ఏలన? కావ్యమున ప్రధానమై యుండునది రసమే యగును.
ఆయమేవ హి మహాకవేర్ముఖ్యో వ్యాపారో యద్రసాదీనేవ ముఖ్యతయా కావ్యార్థీకృత్య తద్వ్యక్త్యనుగుణత్వేన శబ్దానామర్థానాం చోపనిబన్ధనమ్ ।
(ధ్వన్యా-3/14కా వృత్తి)
[ఇదే మహాకవుల ముఖ్యవ్యాపారము — ముఖ్యంగా, రసము మొదలైనవాటిని కావ్యప్రయోజనంగా చేసుకొని వాటి వ్యక్తీకరణకు అనుకూలంగా శబ్దాలను అర్థాలను కూర్చడము.]
పఠిత కావ్యోన్ముఖుడగుటకు కారణము రసానుభూతి నాశించియే కదా? ఒకడు ధనము సంపాదించును. ఆ ధనసంపాదన యెందుకనగా తాను తన యాలుబిడ్డలను పోషించుటకనును. ఆలుబిడ్డలను పోషించుటకు ప్రయోజనము తన యానందము (సుఖము) కొఱకట. “ఆయానందము ననుభవించుటకు ప్రయోజనమేమి?” అని ప్రశ్నించినచో ప్రశ్నయే మిగులును కాని దానికి సమాధానము రాదు. కావున ఆనందానుభూతియే పార్యంతికము — సాంసారిక సుఖాదులు దుఃఖబహుళములు అనిత్యములు, కాని కావ్యానంద మట్లుకాదు — అది బ్రహ్మానందసహోదరమైనది. శాశ్వతమైన బ్రహ్మానందమును సాధించుటయే ఈ జీవితపరమార్థము కావున ఈ జీవితపరమార్థమును సాధించుటలో కావ్యరసానందానుభూతి సోపానమువంటిది — కావ్యము రసనిర్భరమై యున్ననే కాని సహృదయపాఠకులకు విగలితవేద్యాంతరమగు నానందానుభూతి కలుగదు. ఆ రసము విభావాదులచే కావ్యమున నభివ్యక్తమగును. కాని స్వశబ్దవాచ్యము కాదు.
“కోఽప్యజాయత రసోనిరన్తరః” ఆ సుందరిని చూడగా నెదొయొక ‘రసము’ పుట్టెనని చెప్పిన మాత్రమున అనగా రసనామనిర్దేశ మాత్రమున నేమియు సిద్ధింపదు సరికదా అట్లుచేయుట దోసమై నిలుచును. కావున పఠితను కావ్యప్రవృత్త్యున్ముఖుని చేయునది రసానందమే యగుటచే ఆనందము కావ్యమునకు ముఖ్యప్రయోజనమై నిలిచినది. విభావాదులచే నభివ్యక్తమగు రసమే రసధ్వనియని వ్యవహరింపఁబడును కావున నట్టి రసధ్వనిచే నొప్పుకావ్యమే ధ్వనికావ్యమై ఉత్తమ కావ్యముగా వన్నెకెక్కినది — వస్త్వలంకారధ్వనులును విభావాది రూపమున రసాంగములై రసానందానుభూతికి దోహదకారులే యగుటచే వస్త్వలంకారరసధ్వనులలో నేదియున్నను ధ్వనికావ్యమే యయి యుండుటచే నది ఉత్తమ శ్రేణికి జెందిన కావ్యమగును.
నన్నయ భట్టారకుడు భారతమును రసనిర్భరమై ధ్వనివిలసితముగా తీర్చిదిద్దెను.
ఆ ధ్వనిచమత్కృతి నరయుదము. ధ్వని, ప్రధానముగా వస్త్వలంకారరసరూపమున మువ్విధమై యున్నది.
రసధ్వని
కురువృద్ధుల్ గురువృద్ధబాంధవు లనేకుల్ సూచుచుండన్ మదో–
ద్ధురుఁడై ద్రౌపది నిట్లుసేసిన ఖలున్ దుశ్శాసనున్ లోకభీ–
కరలీలన్ వధియించి తద్విపులవక్షశ్శైలరక్తౌఘని-
ర్ఝర ముర్వీపతి సూచుచుండ నని నాస్వాదింతు నుగ్రాకృతిన్.
(సభా 2/233)
కపటద్యూతవిజితులైన పాండవుల ధర్మపత్ని పాంచాలిని — ఏకవస్త్రను — సభకీడ్చి తెచ్చి దుర్యోధనుని పంపున, కట్టిన పుట్టంబులొలువఁ బూనియు అనవచ్ఛిన్నంబుగా వెలువడు వస్త్రచయము నిక నొలువంగ నోపక యలసి లజ్జతో నుక్కు దక్కియున్న దుశ్శాసనుని గూర్చి భీమసేనుడు కోపారుణలోచనుడై పండ్లు పట పట గొరుకుచు చేసిన ప్రతిజ్ఞ యిది.
ఇట దుశ్శాసనుఁడాలంబన విభావము — అతడు చేసిన ద్రౌపదీ వస్త్రాపహరణాదులు ఉద్దీపనవిభావము — కన్నులెఱ్ఱబారుట, పండ్లు పటపటఁగొరుకుట, పరుషోక్తులాడుట, అనునవి యనుభావములు. ఉగ్రతాగర్వాదులు వ్యభిచారిభావములు. వీనిచే పరిపోషింపబడి భీమసేనగతమైన క్రోధము రౌద్రరసముగా పరిణతమై సహృదయోల్లాసమును కలుగజేయుచున్నది.
తపతీసంవరణోపాఖ్యానమున సంవరణుడు తపతిని వర్ణించిన తీరిట్లున్నది:
నెఱిఁగురులున్ విలోలసితనేత్రయుగంబును నొప్పులొల్కు వా–
తెఱయును దీని యాననముతెల్వి కరంబు మనోహరంబు నా
యెఱిఁగిన యంతనుండి సతి నిట్టి లతాలలితాంగిఁజూచి యే
నెఱుఁగ; సురేంద్రకన్యకలు నిట్టిరె రూపవిలాస సంపదన్.
(ఆది. 7/74)
ఈ పద్యమున తపతీలావణ్య మసామాన్యమైన దను వ్యంగ్యము సంవరణగత తపతీ విషయాభిలాషాఖ్యరతి నుద్దీపింపజేయుచు శృంగారరసముగా సహృదయచర్వణాగోచరమగుచున్నది.
భావశబలతాధ్వని
తన్ను చూచియు పూర్వమట్లు ఆదరానురాగములు ప్రదర్శించని దుష్యంతుని గనిన శకుంతల మనోవీథిలో భావపరంపర ఎట్లు పెల్లుబికెనో చూడుడు–
ఎఱుఁగడొకొ నన్ను; నెఱిఁగియు
నెఱుఁగని యట్లుండునొక్కొ; యెడ దవ్వగుటన్.
మఱచెనొకొ! ముగ్ధు లధిపులు
మఱవరె? బహుకార్యభారమగ్నులు కారే.
(ఆది. 4/69)
ఎఱుఁగడొకొ నన్ను అను శంకయును, ఎఱిఁగియు ఎఱుఁగని యట్లుండునొక్కొ అను వితర్కమును, ఎడ దవ్వగుటన్ మఱచెనొకొ అను చింతయు, ముగ్ధు లధిపులు మఱవరె అను ధృతియు పూర్వపూర్వోపమర్దకములై వ్యక్తములగుటచే నిది భావశబలతాధ్వని. బహుకార్యవ్యగ్రతచే తన్ను మరచి యుండవచ్చునని శకుంతలాహృదయము సమాశ్వస్తమాయెనని భావము. ఈ భావశబలతాధ్వని విప్రలంభశృంగారరసపరిపుష్టికి దోహదము చేయుటచే నిది రసపర్యవసాయియే యగును.
భావాదులన్నియు రస్యమానములగుటచే రసపదవాచ్యములగుట వలన రసధ్వనికోటిలోనే ఈ భావాది ధ్వనులన్నియు పరిగణింపబడినవి.
అలంకార ధ్వని
పాశుపతాస్త్రమును బడయుటకై అరిగిన యర్జునుని రాకకై నిరీక్షించుచున్న ధర్మరాజాదులకు రోమశ మహాముని యర్జునుని క్షేమ మెఱింగించి తత్పరాక్రమమును వర్ణించు సందర్భము నందలిదీ పద్యము:
బలవంతులైన భీష్మా–
దుల నర్జునుఁడోర్చు నూర్జితుండై మఱి పో–
రుల గర్ణుండు పదాఱవ
కళకు సమానుండుగాడు కవ్వడితోడన్.
(అరణ్య — 2/294)
కర్ణుఁడర్జునుని పదాఱవ కళకును సమానుడు కాడు. ఇట్లు చెప్పుట లోకరీతి కావున నిది లోకోక్త్యలంకారము — దీనిచే నర్జునునకు షోడశకళాపూర్ణుఁడగు చంద్రునితో నభేదము సిద్దించుటచే నిది రూపకాలంకారధ్వని — ఇట ఉపమాలంకారము వ్యంగ్యమగునని భావింపరాదు — కవ్వడికి షోడశకళాపూర్ణునితో నభేదము వివక్షితమైనది — కావుననే ఆ పదాఱవకళ కవ్వడిదైనది — సాదృశ్యమే వివక్షితమైన అదెట్లు సిద్ధించును? కాన నిది రూపకాలంకారధ్వనియే — దీనిచే నర్జునుడు కర్ణాభిభావకమగు పరాక్రమాతిశయముచే కలిగిన కీర్తిజ్యోత్స్నతో జగమును వెలిగించగలడనియు, దానిచే – ‘పోరు గలిగే నేని, విజయము మీకే తథ్య‘ మనియు ఇట్లు బహుముఖ వస్తువు ధ్వనించుచున్నది.
వస్తుధ్వని
‘గొనకొని వీఁడు నీకును శకుంతలకుం బ్రియనందనుండు; సే–
కొని భరియింపు మీతని; శకుంతల సత్యము వల్కె, సాధ్వి, స
ద్వినుత, మహాపతివ్రత వివేకముతో’ నని దివ్యవాణి దా
వినిచె ధరాధినాథునకు విస్మయమందఁగఁ దత్సభాసదుల్.
(ఆది 4/105)
నిండుసభలో శకుంతలను దుష్యంతుడు — “ఏ నెఱుఁగ నిన్ను; నెక్కడిదానవు? మిన్నకయ యనుచితంబులు పలుకంగా నేల? యరుగు మంబురుహానన! ఎందుండి వచ్చి తందులకు వడిన్” అని నిరాకరించు సందర్భమున ఆకాశవాణి పలికిన పలుకులివి.
ఇట — శకుంతల సత్యమువల్కె ననుటచే — నీవసత్యము పల్కుచున్నావనియు, సాధ్వియనుటచే — శకుంతల నిన్ను స్మరించుచునే ఇన్నాళ్ళు తన జీవితము గడిపిన సచ్చరిత యనియు. సద్వినుత అనుటచే ఆయమ నడవడి శంకింప పని లేదు. కాని నీ నడవడి మాత్రము ఈ విషయమున సద్విగర్హిత మగుచున్నదనియు, కావున నీకును, అనగా ఆనాడు వేటకని వెళ్లి ఆ తపోవనమున గాంధర్వవిధిగా శకుంతలను పెండ్లియాడిన నీకు, ఈ సుతజన్మము తెలియకపోవచ్చును. కాని ఆ విషయము తలపోసిన ఈ సుతుడు శకుంతలకే కాదు, నీకును ప్రియనందనుడే యనియు, చేకొని భరియింపుము అనుటచే ఇది నీకర్తవ్య మనియు, లేదేని ధర్మమును తప్పిన వాడవగుదువనియు, ఈ విధముగా ఆకాశవాణి దుష్యంతుని మందలించిన తీరు ధ్వనించుచున్నది.
“సాధ్వి, సద్వినుత, మహాపతివ్రత” అను నీ మూడును శకుంతల విశేషణములేయని యన్వయించుట సముచితము — విశేషణ మధ్యపతితమగు సద్వినుత పదము మాత్రము సంబుధ్యంతమై రాజునకన్వయించునట్లు వ్యాఖ్యానించినచో మహాపతివ్రతయని పునర్వాక్యప్రారంభము సమాప్తపునరాత్తత్వదోషమగునేమో ఆలోచించవలయును. సభలో రాజదోషోద్ఘాటనము శ్రేయస్కరము కాదు కావున మృదువుగా వ్యంగ్యమర్యాదతో నీ మందలింపు ఎంతో ఔచిత్యమును సంతరించుకొనుచున్నది.
నర్మగర్భహాస్యముల యందును పరిహాసమునందును పెద్దల మందలింపుల యందును గోప్యసంభాషణములయందును మిత్రుల యనుచిత ప్రవర్తనాదులను తెలియ జేయుట యందును, ఇవిగాక మరెన్నియో సందర్భముల యందు వ్యంగ్యమర్యాద ఎంతో శోభించునదియేకాదు సముచితమును నగుచున్నది.
మచ్చున కొక యుదాహరణము — పరిహాసమునకు:
వీరెవ్వరయ్య? ద్రుపదమ–
హారాజులె! యిట్లు కృపణులయి పట్టువడన్
వీరికి వలెసెనె? యహహ! మ–
హారాజ్యమదాంధకార మది వాసెనొకో.
(ఆది — 6–90)
ద్రోణుడు అగ్నివేశమహాముని యొద్ద ధనుర్వేద మభ్యసించునప్పుడు ద్రుపదుడు సహాధ్యాయియే కాక యిష్టసఖుఁడును — తాను పాంచాలవిషయమునకు రాజయిన నాడు తనయొద్దకు వచ్చి నారాజ్యభోగముల ననుభవింప నర్హుడవని ద్రోణుని ప్రార్థించి చనిన వాడును, ఆనాడు ద్రుపదుఁడు. ద్రోణుఁడు కుటుంబ పోషణకై మాత్రమేకాదు, తన కుమారుడగు అశ్వత్థామకు క్షీరపానము చేయించుటకైనను వలసిన ధనములేక, అటమటించుచు బాల్యమైత్రిని పురస్కరించుకొని ద్రుపదుని దర్శించి, పరిచయహీనునిగా నవమానింపబడి, హస్తినపురిచేరి కురుకుమారులకు అస్త్రగురువై గురుదక్షిణగా ద్రుపదుని పట్టి తెమ్మనెను. దానికి పార్థుడు ద్రుపదుని బంధించి తేగా అతనిని చూచి ద్రోణుడు నగుచు పలికిన పలుకులివి —
ఇందు ద్రుపదుని నవహేళన చేసిన తీరు వ్యక్తమగుచున్నది.
వీరెవరయ్య? అనుటచే — నీవానాడు పూర్వపరిచయము రక్షింపవైతివి — నేనీనాడు నీ పూర్వపరిచయమేల స్మరింపవలయుననియు, ద్రుపద మహారాజులె! అనుటచే పేదపాఱుడవగు నీతో మహారాజునగు నాకేటి సఖ్యమనియు, నన్నవమానించిన ఆ ద్రుపదమహారాజువేనా నీవు? ఆ రాజఠీవి ఏమైనదనియు, కృపణులయి పట్టువడన్ వీరికి వలెసెనె? అనుటచే ఈ పేదవిప్రునితో నేమగునని మిడిసిపడితివే! నీ గతి ఏమైనదో చూచితివా? యనియు, రాజ్యమదాంధకార మది వాసెనొకో! అని యనుటచే ఇప్పటి దుఃస్థితిని తలచుకొనిన ఆ రాజ్యమదాంధకారము పాయక ఏమి చేయుననియు ద్రుపదుని గూర్చి ద్రోణుడు చేసిన అవహేళన వ్యక్తమగుచున్నది. అంతేగాక, చివరి వాక్యముచే “ఎంతటి వారికైననను అంతటి మిడిసిపాటు తగ“దను నీతియు ధ్వనించుచున్నది.
ఇక్కడ ఎవరయ్య, ద్రుపదమహారాజులె, వీరికి వలసెనె, వాసెనొకో అను పదముల చివరి ఆ–ఎ–ఎ–ఒకో అను కాకుస్వరములు అవహేళనము వ్యక్తము చేయుచు ప్రశ్నార్థకములుగానే మిగిలిపోయినవి. కావున నిది కాకుస్వర ధ్వనియేకాని కాక్వాక్షిప్తమగు గుణీభూతవ్యంగ్యము కాదు. ఎచ్చట కాక్వాక్షిప్తమగు నర్థమే లేకున్న వాచ్యార్థము పొసగదో, యది కాక్వాక్షిప్తమగు గుణీభూతవ్యంగ్యము. అట్టి యర్థాపేక్ష వాచ్యార్థమునకు లేకుండునది కాకుస్వరధ్వని యని గమనింపవలసియున్నది.
వస్త్వలంకార రసరూపమున ప్రధానమున ధ్వనిభేదములు మూడేయైనను ఆ ధ్వనులు వ్యంజించు ప్రకారము లనేకములై యుండుటచే ధ్వనిభేదములు బహుప్రకారములై యున్నవి.
శబ్దశక్తిచే ననగా ఒక పదమునకుగల రెండవ యర్థమును ఏ విధమైన సూచన లేకయే గ్రహించినప్పుడు కలిగిన ధ్వని — అర్థశక్తిచే ననగా వక్త, ప్రకరణము, దేశము, కాలము, స్వరము మున్నగువానిని పర్యాలోచించిన నేర్పడు ధ్వని — ఈ వ్యంజకమగు నర్థమును త్రివిధము — స్వతస్సిద్ధము, కవి కల్పితము, కవినిబద్ధవక్తృప్రౌఢోక్తిసిద్ధము అని. ఈ యర్థము తాను వస్త్వలంకార రూపమై యుండి వస్తువునో ఆలంకారమునో తోపింపఁజేయును. ఆ యర్థము ఒక పదముదో లేక వాక్యముదో లేక ప్రబంధముదో కావచ్చును. లక్ష్యార్థవ్యంగ్యార్థముల వలనను ధ్వనులేర్పడును. రసధ్వనివర్ణాదుల వలనను కలుగుచున్నది ఇట్లు వ్యంజకభేదమున ధ్వనులనంతములైనవి.
ఈ ధ్వనిభేదములెన్నో నన్నయ భారతమున గలవు — దిఙ్మాత్రముగా నిందు కొన్నింటిని మాత్రమే సూచించితిని.
(ఉస్మానియా విశ్వవిద్యాలయము తెలుగు శాఖవారి ‘వివేచన’ (డిశంబర్ 1983) నన్నయ జయంతి సంచిక యందు ప్రచురితము)
[కొరిడె రాజన్నశాస్త్రి గారి మంజూష వ్యాససంకలనం నుంచి పునఃప్రచురితము. — సం.]