అమాయకులైన మనుషుల్ని ఎగతాళిగా ‘గొర్రెలు’ అంటుంటారు కొందరు. నిజానికి మనుష్యులను జంతువులతో పోల్చేందుకు ఏ మనిషికీ స్థాయి లేదు. గట్టిగా నిలేసి చూస్తే జంతువులకున్న ఇంగితం, ఆలోచనాశక్తి, సహానుభూతి, చురుకుదనం మనుషులకు లేదనే అనుకోవాలి. జంతువులు ఆకలితో తప్ప ఆశతో ఏ పనులూ చేయవు. ఇతరుల మీద కుట్రలు పన్నవు. ఇతరుల సొమ్ముకు ఆశపడవు. ఆత్మహత్య ఊసు ఎత్తవు. ఇన్ని సుగుణాలు మనుషుల్లో ఎక్కడివి? మనుషులకు ఎప్పుడూ ఏదో ఉబలాటం. ఏదో కావాలన్న ఆరాటం. పక్కవారిని దోచాలన్న పేరాశ. ఇదే గుణాలు జంతువులకు వస్తే మనిషి మనుగడ సాధ్యమేనా? ఆ జీవాల మనసుల్లో ఏముందో ఏనాడైనా గ్రహించామా? ఆర్.సి. కృష్ణస్వామి రాజు మనుషులు, జంతువులు పాత్రలుగా రచించిన ‘మేకలబండ’ నవల ఆ విషయాన్ని మన కళ్ల ముందు పెడుతుంది. మనం సాకే జీవాల మనసుల్లో మర్మాన్ని ఎదుట నిలుపుతుంది.
అయితే, జంతువు నుంచి మనిషిని వేరుచేసే సామర్థ్యాల్లో అత్యంత ముఖ్యమైనది కథలు చెప్పుకునే సామర్థ్యమే కదా.
మెదడులో ఎడమ భాగం ఒక కథకుడిలా పనిచేస్తుందట. జీవితంలో గందరగోళం ఉన్నప్పుడు, అది ప్రతిదాన్ని కథలా మార్చి, అర్థం చేసుకునేలా చేస్తుంది. ఏ క్రమం లేకపోయినా, ప్రపంచంలో ఒక క్రమం ఉందని ఊహించడానికి ప్రయత్నిస్తుందని న్యూరోసైన్స్ శాస్త్రానికి పితామహునిగా పేరు పొందిన మైఖేల్ ఎస్ గజానిగా అన్నాడు. ‘మేకలబండ’లో జంతువులు మాట్లాడి, మనుషుల సమాజంలోని తప్పులను కథలా చెప్తాయి. అలాగే, మన మెదడు కూడా జీవితంలోని అయోమయాన్ని కథలా మార్చి అర్థం చేసుకుంటుంది. తెలుగు కథలు, సామెతలు (మేకలబండలో ఉన్నట్టు) జీవితాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి.
కథనం మానవోద్వేగాలకు, వాటి స్థాయీభేదాలకు సంబంధించిన వ్యవహారం. కథనరీతి ద్వారానే మనం కథలోని వాస్తవికతను, అర్థాన్ని మనలో అమర్చుకుంటామని జెరోమ్ బ్రూనర్ అంటాడు. కాబట్టి, ఇది మానవ అనుభవాన్ని సంస్థీకరించడానికి మరియు ప్రపంచాన్ని అర్ధం చేసుకోవడానికి ఒక ప్రాథమిక మార్గం. మానవుడి గ్రహణసామర్థ్యాల్లోనూ, ప్రజ్ఞానసామర్థ్యంలోనూ కథలు చెప్పే విద్య అన్నిటికన్నా ప్రత్యేకమైన సామర్థ్యమని విజ్ఞానశాస్త్రం చాలాకాలం కిందటే గుర్తించిందని ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఏతావాతా చెప్పుకోవల్సింది ఏమంటే, జంతువుతో పోల్చడానికి మనిషికి అర్హత లేదన్నది ఎంత నిజమో. ఏ జంతువుకీ లేని విశిష్ట కాల్పానిక శక్తి మనిషి సొంతం అన్నది అంతకంటే పరమ సత్యం.
ఇక కథలోకి వద్దాం. ఈ కథ చిత్తూరు జిల్లా పుత్తూరు ఈశ్వరాపురంలో జరిగింది. ఆ ఊరికి పడమట దిక్కున ఉన్న ‘గోవిందపాదం’ గుట్ట ఈ కథకు మూలం. సాక్షాత్తూ ఆ వెంకటేశ్వరస్వామి పాదం పెట్టిన చోటు కాబట్టి దానికి ఆ పేరు వచ్చిందని ఆ ఊరివాళ్ల నమ్మిక. ఊరంటే అదేమీ పెద్ద ఊరు కాదు. ఓ మామూలు పల్లె. ఊరిలో పెక్కు జనాలకు వ్యవసాయమే ఆధారం. మిగిలినవాళ్లకు చిన్నచిన్న వ్యాపారాలు, కూలీపనులు, జీవాల పెంపకం. అతి కొద్దిమందికి మాత్రం ఉద్యోగాలు. ఆ ఊరిలో నలుగురు జతగాళ్లు, సుందరం, పెంచల్‌రాజు, తిరుపాలు, వడివేలు. నలుగురి సావాసం గట్టిపట్టింది జీవాలు మేపే దగ్గర. వారికున్న జీవాలను తోలుకెళ్లి, తిరిగి ఇంటికి తీసుకురావడం వాళ్ల పని. ఆ ప్రయాణంలోనే వాళ్ల ఆశలు, ఆకాంక్షలు, కథలు, వెతలు మాట్లాడుకుంటూ పొద్దు గడుపుతూ ఉంటారు.
ఉన్నట్టుండి ఓ పొద్దు సుందరం మేకపోతు, పెంచల్రాజ నల్లగొర్రె, తిరుపాలు తెల్లపొట్టెలు, వడివేలు కుంటిమేక మంద నుంచి మాయమయ్యాయి. ‘ఇదేమి అఘాయిత్యంరా నాయినా’ అనుకున్నారు ఆ నలుగురు. లేకపోతే ఇట్లా నాలుగు జీవాలు ఒకేసారి మాయమవ్వడం ఏమిటి? వాళ్లకు అర్థం కాలేదు. అటూఇటూ వెతికారు. కానీ ఎక్కడా దొరకలేదు. ముఖాలు వేలాడేసుకొని ఇంటిదారి పట్టారు. ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కో రకమైన రచ్చ. ఒక్కో రకమైన తంపు. పెళ్లి బాధ ఒకరిది, కుటుంబం బాధ్యత మరొకరిది. ఒక్కొక్కరిది ఒక్కో రీతి. పోయిన జీవాలను తిరిగి తీసుకురాకపోతే తమ సంసారాలు గడిచేటట్లు లేవు. కానీ అవి ఏమయ్యాయో, ఎక్కడున్నాయో ఎవరికి తెలుసు?
ఇటు పక్క మంద నుంచి తప్పించుకున్న ఈ నాలుగు జీవులు ఒకదానితో ఒకటి మాట్లాడుకొని ముందుకు కదిలాయి. దారిలో వారికో యోగి కనిపించాడు. ఆయన చలవ వల్ల వాటికి మాటలు వచ్చాయి. అయితే అది శాశ్వతమైన వరం కాదు. అది మూణ్నాళ్ల వరమే అనీ, వారికి ఆ మాటల మహిమ నచ్చితే శాశ్వతంగా ఉంచుతానని చెప్పాడు. సరేనని సంతోషంగా కదిలాయి ఆ నాలుగు జీవాలు. ఇటు వాటిని వెతుకుతూ కదిలారు ఈ నలుగురు నేస్తులు. అటు ఆ జీవుల ప్రయాణం, ఇటు ఈ నలుగురి స్నేహితుల ప్రయాణంగా సాగేదే ఈ నవల.
జంతువులు, వృక్షాలు, చేతనాలు, అచేతనాలు, ప్రాకృతికశక్తులు, పురాణపాత్రలు — వీటికొక మానవరూపమిచ్చి మాట్లాడించడం ప్రాచీనకాలం నుంచీ ఉన్న కథన పద్ధతే. ఇంతకీ ‘మేకలబండ’ ఏ రకమైన కథల రూపంలో ఉందనవచ్చు అన్నది చర్చిద్దాం.
ప్రపంచ సాహిత్యంలో నీతికథలు పలురూపాలుగా కనిపిస్తాయి. ప్రతీకాత్మకంగా చెప్పే కథలను ఆంగ్లంలో అల్లగరీ (allegory) అంటారు. వీటిని పలురకాలుగా విభజిస్తారు: ఫేబుల్ (Fable) అన్నది స్థూలంగా వివరించే నీతి కథ. అపొలాగ్లో (Apologue) నీతి ఎక్కువగా నీతి చెప్పడానికి జంతువులను, వస్తువులను ప్రతీకలుగా చూపించి కథను నడిపిస్తారు. ఉదాహరణకు మన ‘పంచతంత్రం కథలు’. పారబుల్ (Parable) అన్నది సూచనాత్మకంగా కథ సాగినా, మనుష్యుల పాత్రలే కనిపిస్తాయి.
మేకలబండ నవలని పాక్షికంగా అపొలాగ్ అని, పాక్షికంగా పారబుల్ అని పరిగణించవచ్చు. ఇందులో జంతువులు మనుషుల్లా మాట్లాడతాయి, నీతిని నేర్పిస్తాయి. ఈ నవలలో నాలుగు జంతువులు (మేక, నల్ల గొర్రె, తెల్ల గొర్రె, కుంటి మేక) యోగి ద్వారా మాట్లాడే శక్తి పొంది, మనుషుల దురాశ, మోసం గురించి చర్చిస్తాయి. ఇది పంచతంత్రం లాంటి నీతి కథలా ఉంటుంది. ఈ రచనలో జంతువులు మనుషుల సమాజంలోని తప్పులను (దురాశ, మోసం) సూచనాత్మకంగా చెప్తాయి. ‘మేకలబండ’ని సెటైర్‌గా (Satire) కూడా చూడవచ్చు. అంటే సమాజంలోని తప్పులను ఎగతాళిగా, విమర్శనాత్మకంగా చూపే వ్యంగ్య కథనం అన్నమాట. సమాజంలో దురాశ, మోసం, ఊర్లలో మార్పులను విమర్శిస్తుంది నవల. జంతువులు మనుషుల తప్పులను గురించి మాట్లాడటం వ్యంగ్యంలా ఉంటుంది. కానీ ఇది ఎక్కువ హాస్యంగా కాకుండా తీవ్రంగా ఉంటుంది. జంతువుల ప్రయాణం, సమాజంలోని మార్పులను సూచిస్తుంది కూడా. అయితే, పూర్తిగా జంతువుల కథే కాకుండా, ఇందులో మనుష్య పాత్రలు కూడా ఉన్నాయి. మనుషుల మధ్య సంక్లిష్టమైన మానవ సంబంధాల చిత్రణ కూడా ఈ నవలలో ఉంది. అందుకే ఇది సాహిత్యంలో చేసే సాధారణ వర్గీకరణకు లొంగని నవల.
‘మేకలబండ’ నవలలో యోగి ద్వారా మాట్లాడే శక్తి పొందిన జంతువులు (మేక, గొర్రెలు) మనుషుల తప్పులను కథలా చెప్పి, సమాజంలో తప్పు నిర్ణయాలను ఎత్తి చూపుతాయి, సోక్రటీస్ లాటరీ విమర్శలాగా. అరిస్టాటిల్ చెప్పిన స్టెసికోరస్ గుర్రం కథలో నాయకుడికి అతిగా అధికారం ఇవ్వడం వల్ల వచ్చే ప్రమాదాన్ని చూపిస్తుంది. ఈ కథల్లాగే, ‘మేకలబండ’ కూడా జంతువుల ద్వారా సమాజంలోని దురాశ, ఆధునికీకరణ సమస్యలను విమర్శిస్తుంది. అయితే, సోక్రటీస్, అరిస్టాటిల్ కథలు వాస్తవికమైనది కాగా, ‘మేకలబండ’ మాట్లాడే జంతువులతో నడిపించే నీతికథ కాల్పానికంగా ఉంటుంది.
జంతువులకి మానుషాన్ని ఆపాదించి, తద్వారా నీతిని బోధించే కథలు అనగానే మొదట గుర్తిచ్చేది: పంచతంత్రం! ప్రపంచ సాహిత్యానికి భారతదేశం అందించిన గొప్ప రచనలలో ఎన్నదగినది. క్రీ. శ. 5వ శతాబ్దంలో విష్ణుశర్మ అనే గురువర్యుడు సంస్కృతభాషలో రచించిన పంచతంత్రం. తన వద్ద విద్య నేర్చుకోదలచిన విద్యార్థులకు పాఠ్యగ్రంథంగా రచించబడ్డ పంచతంత్రం ఎన్నో ప్రపంచ భాషలలోకి అనువదింపబడి ఎంతో ప్రాచుర్యం పొందింది. జీవితంలోని జ్ఞానవంతమైన ప్రవర్తనని వివరిస్తూ రాయబడిన సరళమైన 84 కథలు. ఈ గొలుసు కథలలో ప్రతి ఒక్క కథ మానవ స్వభావాన్ని అర్థం చేసుకోవడం ద్వారా జీవితంలో విజయం సాధించడం ఎలాగో పాఠకుడికి మార్గనిర్దేశం చేసే లక్ష్యంతో సాగే నైతిక, తాత్విక ఇతివృత్తం కనిపిస్తుంది. బౌద్ధ జాతక కథల్లో కూడా జంతువులు మాట్లాడతాయి, నీతి చెప్తాయి. థామస్ విలియం రైస్ డేవిస్ అనే ఓ బౌద్ధ పండితుడి ప్రకారం జాతక కథలు బుద్ధుడి ముందు జన్మల కథల గురించి చెప్పాడు. ఇవి బుద్దుడికి ముందు నుంచి ప్రజల్లో ఉన్న జానపద కథల నుంచి వచ్చాయంటాడు. ఆ జానపద కథలను తర్వాత బౌద్ధమతంలో చేర్చి, బుద్ధుడి కథలుగా మార్చారని రైస్ డేవిస్ వాదన. ఉదాహరణకి జాతక కథలులోని ‘కోతి-మొసలి’ కథలో కోతి తెలివిగా మొసలిని మోసం చేస్తుంది. ఇలాంటి జంతు కథలు బుద్ధుడికి ముందు గ్రామాల్లో చెప్పుకునే కథల్లాంటివి, పంచతంత్రంలోని కథల్లాగే.
అయితే, పంచతంత్రంలో, జాతకకథల్లో అనుసరించిన భారతీయ కథాసంవిధానాన్ని మేకలబండ నవలలో అనుసరించలేదు రచయిత కృష్ణస్వామి రాజు. ఆధునిక రచనా ప్రక్రియ అయిన నవలారచనకి ఆధునిక సాహిత్యపోకడలనే అవలంబించారాయన. అయితే, ‘మేకలబండ’లో మాట్లాడే జంతువులు (మేక, గొర్రెలు) సమాజంలోని తప్పులను చెప్పడం పంచతంత్ర, జాతక కథలను మనకు పదేపదే గుర్తుకు తెస్తాయి. ఆధునిక ప్రంపంచసాహిత్యంలో వచ్చిన రచనలతో పోల్చుకొంటే, ఇతివృత్తపరంగా అటువంటి సామ్యాలున్నాయనిపించే ఒక రచన జార్జ్ ఆర్వెల్ రాసిన ఎనిమల్ ఫార్మ్ (Animal Farm 1945). ‘మేకలబండ’ లాగే, ఎనిమల్ ఫార్మ్ కూడా జంతువులను మనుషుల్లా మాట్లాడించి, సమాజం, రాజకీయాలలోని తప్పులను చూపిస్తుంది. సోవియట్ రష్యాలో కమ్యూనిస్టు పాలన మీద వ్యంగ్య విమర్శగా వచ్చిన ఎనిమల్ ఫార్మ్‌లో జంతువులు తమ యజమానులపై తిరుగుబాటు చేసి, తర్వాత పందులు పాలకస్థానంలో సాటి జంతువుల పాలిట నియంతలవుతాయి. దీనికి ‘మేకలబండ’లో మనుషుల దురాశ, మోసాలను జంతువులు విమర్శించడంతో సాపత్యం తీసుకురావచ్చు. రెండు కథలూ జంతువుల దృక్కోణంతో మనుషుల తప్పులను (మోసం, నీతి కొరవడటం) చూపిస్తాయి. మేకలబండ భారత గ్రామీణ సమాజం, లోతైన ఆలోచనలపై దృష్టి పెడితే, ఎనిమల్ ఫార్మ్ సోవియెట్ రష్యా పరిణామాల గురించి: కానీ రెండూ మనిషి విలువలను ప్రశ్నిస్తాయి. ఎనిమల్ ఫార్మ్ సరళమైన fable లా చెప్పబడుతుంది, మేకలబండలో సామెతలు, పాటలు కథను సాంస్కృతికంగా బలపరిచినట్టు. అయితే, తేడా ఏమంటే, ఎనిమల్ ఫార్మ్ లో సంభాషణలు సరళంగా, కథకు తగ్గట్టు ఉంటాయి; కానీ మేకలబండలో కొన్ని సంభాషణలు అసహజంగా ఉన్నాయని చెప్పకతప్పదు.
తప్పిపోయిన జీవుల కోసం వెతికే నలుగురు యువకుల కథలా ఈ నవలగా పైకి కనిపించే ఈ నవల లోపల లోతైన తాత్విక చింతన ఉంది. సమాజంలో జరుగుతున్న అనేక అంశాలపైన చర్చ ఉంది. దేనికోసమే వెతుకుతూ మరి దేన్నో కోల్పోతున్న నాగరికపు ప్రపంచానికి హెచ్చరిక ఉంది. జీవాలు సైతం మనుషుల్లా మారి అనేక అంశాలు చర్చించడం ఈ నవలలో కనిపిస్తుంది. మేకపోతు నల్లగొర్రె, తెల్లపొట్టేలు, కుంటిమేక మధ్య జరిగే చర్చల వల్ల కథ రక్తికడుతుంది. అవన్నీ ఉబుసుపోని ఊసులు కాదు. లోకంలోని అనేక విషయాల మీద జరిగే వాడీవేడీ చర్చలు. ఒక జీవం మరో జీవాన్ని ముందుకు నడిపే బతుకు పలుగులు.
అలాగే, ఆర్.కె. నారాయణ్ రచన ‘ఎ టైగర్ ఫర్ మాల్గుడి’తో (A Tiger for Malgudi 1983) కూడా మేకలబండికి కొన్ని సమాంతరాలున్నాయి. ఈ నవలలో ఒక పులి తన జీవిత కథను చెప్తుంది — అడవి నుంచి బందీగా మారి, చివరికి ఒక యోగి ప్రభావంతో ఆధ్యాత్మికంగా మేల్కొంటుంది. ఈ రెండు కథలూ జంతువుల దృక్కోణంతో మనుషుల సమాజాన్ని చూపిస్తాయి. స్వేచ్చ, మనుషుల దోపిడీ, ఆధ్యాత్మిక జ్ఞానం గురించి చెప్తాయి. పులి మనుషులతో సంబంధాలలో వారి దురాశ, సానుభూతి లేమిని విమర్శిస్తుంది, మేకలబండలో జంతువులు మనుషుల తప్పుల గురించి మాట్లాడినట్టే. రెండు కథల్లోనూ యోగి పాత్ర జంతువులకు మనుషుల గురించి అవగాహన ఇస్తుంది. నారాయణ్ భారతీయ ఆధ్యాత్మికత, జానపద కథలను కథలో జోడిస్తే, కృష్ణస్వామి రాజు రచనలో గ్రామీణ నేపథ్యం తొణికిసలాడింది.
భారతీయ తత్త్వవేత్తలనుండి, సోక్రటీస్ నుండి తత్త్వవేత్తలంతా నిన్ను నీవు తెలుసుకో (know thyself) అని చెప్పారు. కానీ ఈసోపు మాత్రం ‘నాకేమీ తెలియదు (I know nothing)’ అని అంటాడు. అతడు తనకు తెలియదని చెప్పడం ద్వారా తన కథల వాహికగా ఒక సత్యాన్ని వెల్లడిస్తాడు. ఆ కథలను వినగానే మనకు ఏదో ఒక విషయం చటుక్కున అర్థమవుతుంది. ఈ ‘అర్థమవడం’లోనే సాహిత్యం, జీవిత లక్ష్యం దాగి ఉన్నాయి. అందుకే సోక్రటీసు, హోమర్, హెరోడోటస్, హెసియడ్లను జీవితమంతా తలచుకుంటూ తత్త్వవిచారణ చేసినా, చివరి రోజుల్లో చెరసాలలో ఈసోపు కథలను పద్యాలుగా మార్చాడని ఫీడోలో ప్లేటో రాశాడు. అంతేకాదు, మరణశిక్ష అమలయ్యే ఆఖరి రోజున కూడా సోక్రటీసు తన శిష్యులతో ఈసోపు కథల గురించే మాట్లాడాడని ప్లేటో చెప్తాడు. ‘మేకలబండ’ నవలలో రచయిత ఈసోపు కథలతో ప్రభావితమయినట్టు మనకు కనిపిస్తుంది. ఈసోపు కథలు నీతిని సరళంగా చెప్పినట్టు ఈ కథలు సామెతలు, పాటలతో తెలుగు సంస్కృతిని చూపిస్తాయి.
‘మనుషులు ఇలా ఎందుకుంటారు?’ అనే చర్చ కాస్తా మనుషులు ఎలాగైనా ఉంటారనే స్థితి దాకా చేరుతుంది. వాళ్ల అన్యాయాలు, అక్రమాలు, వాళ్లలో మంచి, చెడు అన్నీ ఈ నాలుగు జీవాలు మాట్లాడుకుంటాయి. లోకంలో మోసం, ద్రోహం పెరిగిపోతున్నాయని బాధపడతాయి. ఈసోపు కథల్లో “By viewing your enemy, you learn who you are” అన్నట్టు, ఈ జీవాలు మనుషుల తప్పులను చూసి సమాజ స్వభావాన్ని అర్థం చేసుకుంటాయి. వాటికితోడు ఒక జీవి అభిప్రాయాల మీద మరొక జీవి చర్చ లేవదీస్తుంది. మరో పెద్ద జీవి తన అనుభవాన్ని వివరిస్తుంది. జార్జ్ ఆర్వెల్ ‘ఎనిమల్ ఫార్మ్’లో జంతువులు మాట్లాడుతూ, “All animals are equal, but some animals are more equal than others” అని వ్యంగ్యంగా చెప్పినట్టు, ‘మేకలబండ’లో జీవాలు మనుషుల అసమానతలను విమర్శిస్తాయి. జీవాలు ఇలాంటి విషయాలు మాట్లాడుకోవడమా అనే సందేహం రాకుండా, తమ యజమానుల ద్వారా అవి ఆ విషయాలు విన్నాయనేటట్లుగా కథ నడపడం బాగుంది. ‘ఏ టైగర్ ఫర్ మాల్గుడి’లో పులి యోగి ద్వారా జ్ణానం పొందినట్టు, మేకలబండ జీవాలు కూడా యోగి ఆశీర్వాదంతో సత్యాన్ని తెలుసుకుంటాయి.
ఇటు నలుగురు స్నేహితులకు కూడా రకరకాల అనుభవాలు ఎదురవుతాయి. పల్లెల్లోకి చొచ్చుకొచ్చిన పట్టణీకరణ, చదువు, డబ్బు ఉన్నవాళ్లు నిరుపేదల్ని చూసే స్థితి, గొర్రెల పెంపకంలో ఆధునిక పద్ధతులు, పల్లెల్లో మారుతున్న మనుషుల తీరు — అన్నీ వాళ్లకు ఆ ప్రయాణంలో అర్థమవుతాయి. సత్యజిత్ రాయ్ ‘ప్రతిద్వంది’ సినిమాలో ఒక యువకుడు పట్టణీకరణ వల్ల మారిన సమాజాన్ని చూసి “నీవు ఎక్కడున్నావు, నీ గుండె ఎక్కడుంది?” అని ఆలోచనలో పడతాడు. ‘మేకలబండ’లో స్నేహితులు కూడా పల్లెల్లో వచ్చే మార్పులను చూసి అర్థం చేసుకుంటారు. ‘బేబ్’ సినిమాలో ఒక పంది తన స్థానం కోసం పోరాడి, “మనసు ఉంటే అన్నీ సాధ్యం” అని చూపిస్తుంది. ఇలాగే ‘మేకలబండ’లో జీవాలు, స్నేహితులు తమ ప్రయాణంలో సత్యాన్ని కనుగొంటారు. పలు అనుభవాల అనంతరం బుద్ధి తెచ్చుకున్న నాలుగు జీవాలు తమ ఇంటిబాట పడతాయి. వాటికి యోగి ఆశీర్వాదం లభిస్తుంది.
రచయిత ‘మేకలబండ’లో ఏం చెప్పాలనుకున్నారు? మారుతున్న కాలంలో మనుషుల విలువలు ఎలా మారుతున్నాయి? ఆ విలువల్ని ప్రశ్నించే జీవాల గొప్పతనం ఏమిటి? జీవాలు కూడా చెడ్డ దారిలో నడిస్తే నాశనం తప్పదన్న జ్ఞానం గురించా? ఆ జ్ఞానాన్ని ఇవ్వడానికి ఒక గురువు కావాలన్న ఆలోచనా? ఈసోపు కథల్లో “సత్యం చిన్నదైనా గొప్ప పాఠం నేర్పుతుంది” అన్నట్టు, ‘మేకలబండ’ చిన్న గ్రామం గురించి చెప్పిన కథలో సార్వజనీన సత్యాలను చూపిస్తుంది. కథ ఈశ్వరపురంలో జరిగినా, అందులోని అంశాలు అందరికీ సంబంధించినవి. జార్జ్ ఆర్వెల్ ‘ఎనిమల్ ఫార్మ్’లో ‘మనం దేన్ని పదేపదే విమర్శిస్తామో అదే మనం అయిపోతాం (We become what we criticize)’ అన్నట్టు, ఈ నవల మనుషుల తప్పులను జంతువుల ద్వారా చూపి, మనం ఎవరిని విమర్శిస్తామో, వాళ్ళలాగే మనం కూడా అవుతామని నిరూపిస్తుంది. ఈ విషయాలన్నీ బేరీజు వేస్తే, ఒక్కోసారి ఒక్కో తీరున అర్థమవుతాయి. అందుకే ఈ నవల సామాజిక అంశాలపై వ్యంగ్యంగా రాసిన విలువైన రచనగా నిలుస్తుంది. సత్యజిత్ రాయ్ ‘ప్రతిద్వంది’ సినిమాలో పట్టణీకరణను చూసిన యువకుడు, “మార్పు మనల్ని మార్చివేస్తుంది. కానీ ఎవరం మనం?” అన్నట్టుగా స్నేహితులు కూడా గ్రామంలో వచ్చిన మార్పులను చూసి ఇలాంటి తాత్విక ఆలోచనల్లో పడతారు.
జంతువులు తప్పిపోవడం అన్న చిన్న అంశాన్ని రచయిత నవలగా మార్చిన తీరు అద్భుతం. ఆర్.కె. నారాయణ్ ‘ఎ టైగర్ ఫర్ మాల్గుడి’లో పులి చెప్పినట్టు “సత్యం తెలుసుకోవడం ఒక ప్రయాణం” -— ఈ నవలలో జీవాలు, స్నేహితులు కూడా ఈ ప్రయాణంలో సత్యాన్ని కనుగొంటారు. అయితే, ‘మేకలబండ’ నవలలో అక్కడక్కడా సంభాషణలు కృతకంగా అనిపిస్తాయి. పల్లెల్లోని మనుషులు ఒకచోట మాండలికంలో, మరోచోట గంభీరమైన భాషలో మాట్లాడటం సహజంగా అనిపించదు. ‘మేకలబండ’లో జీవాల సంభాషణలు సహజంగా ఉంటే బాగుండేది. నవల మరింత విస్తరించి, సంభాషణలు సహజంగా రాసి ఉంటే, ఈ నవల మరింత గొప్పగా నిలిచేదనడంలో సందేహం లేదు.
