
“All History is Revisionist History”
చరిత్ర అంతా పునర్-లిఖిత కథనాలేనని ఎవరో మహానుభావుడు వాక్రుచ్చాడు. నిజమే కదా? గతం అంటే ఒకప్పుడు జరిగిపోయిన సంఘటన. అది జరిగిపోయిన క్షణమే అంతర్థానమవుతుంది. కానీ ‘చరిత్ర’ అనేది ఆ గతానికి సంబంధించిన ఆధారాలను ఉపయోగించి మనుషులు సృష్టించే ఒక కథనం, విశ్లేషణ. గతం మారదు, కానీ చరిత్రకారుడు తన ఆలోచనా దృక్పథం, సంస్కృతి, కాలమాన పరిస్థితులను బట్టి, ఆ చరిత్రకారునికి వారి కాలానికి తెలిసిన శాస్త్రాధారాలను బట్టి, ఆ గతానికి ఇచ్చే వివరణ మారుతూ ఉంటుంది. అంతేకాక, మనం గతాన్ని ఏ ప్రశ్నలు అడుగుతున్నామనేది మన ప్రస్తుత అవసరాలపై ఆధారపడి ఉంటుంది. అందుకే చరిత్ర అనేది గతం వర్తమానాల మధ్య ముగింపులేని సంభాషణ అని కూడా చెబుతారు. అంటే, చరిత్ర అనేది నిరంతరం వికసించే జ్ఞానం. ప్రతి తరం తమ కాలానికి తగినట్లుగా, తమకు అందుబాటులో ఉన్న సాక్ష్యాలతో, శాస్త్రాలతో గతాన్ని తిరిగి ప్రశ్నిస్తుంది. ఇలా ప్రశ్నించడం వల్లనే మనం సత్యానికి మరింత దగ్గరగా వెళ్లగలుగుతాము. అందుకే, చరిత్ర ఎప్పుడూ పునర్లేఖనానికి (revisionism) లోనవుతూనే ఉంటుంది.
భారతదేశంలో ప్రస్తుతం చారిత్రక పునర్లేఖన, పునర్విమర్శా ప్రక్రియ అత్యంత వేగంగా, విస్తృతస్థాయిలో జరుగుతోంది. భారతదేశం వంటి సుదీర్ఘ చరిత్ర కలిగిన దేశంలో చారిత్రక పునర్విమర్శ అనేది సహజం. అనివార్యం కూడానూ. బ్రిటిషు చరిత్రకారులు సృష్టించిన చరిత్రను, ఆ తరువాత మార్క్సిస్ట్ దృక్పథంతో భారతీయ చరిత్రను విశ్లేషించి రాసిన కథనాలను మళ్ళీ ఇప్పుడు అందుబాటులో ఉన్న విస్తృత శాస్త్రవిజ్ఞానంతో అనుసంధానం చేసి, మరింత నిష్పాక్షిక చారిత్రక విజ్ఞానం ప్రజలకు అందజేయడం అవసరమైన మేధోమథనమే. అయితే, చరిత్రను తిరగరాయడం అంటే గతంలో జరిగిన సత్యాలను మార్చడం కాదు, కొత్త సాక్ష్యాల వెలుగులో పాత అపోహలను తొలగించడం. ఆధారాలను విశ్లేషించడంలో శాస్త్రీయ పద్ధతులను అనుసరించినప్పుడే, చరిత్ర రాజకీయ ప్రచారంగా మారకుండా కాపాడబడుతుంది. నిజమైన చరిత్రకారుడు ఒక శాస్త్రవేత్తలా ప్రవర్తించాలి: అంటే కొత్త ఆధారాలు, సాక్ష్యాలు లభించినప్పుడు తన పాత సిద్ధాంతాలను సవరించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడే మనం మన మూలాలను గురించి ఒక నిష్పాక్షికమైన వాస్తవమైన అవగాహనకు రాగలము. కానీ, ఈ మధ్యకాలంలో ఉవ్వెత్తున ఎగసిన జాతీయవాద భావజాల ప్రభావంతో చరిత్రను చూసే కోణంలో సమూలమైన మార్పులు వస్తున్నాయి. అయితే, ఈ రకమైన పునర్లేఖనాలు కేవలం ఒక రాజకీయ భావజాలాన్ని సంతృప్తి పరచడానికి కాకుండా, కచ్చితమైన ఆధారాలు, నిష్పాక్షిక విశ్లేషణ మీద ఆధారపడి ఉన్నప్పుడే అది నిజమైన చారిత్రక విజ్ఞానం అవుతుంది. చరిత్ర అంతా పునర్లిఖిత చరిత్రే అయినప్పటికీ, ఈ పునర్లేఖనాలు కేవలం ఊహలపై, రాజకీయ ప్రయోజనాలపై కాకుండా శాస్త్రీయ పునాదులపై ఆధారపడి ఉండాలి. కార్బన్ డేటింగ్, జెనెటిక్స్, క్లైమాటాలజీ వంటి శాస్త్రీయ విభాగాలు అందించే కచ్చితమైన ఆధారాలు చరిత్రను కేవలం ఊహాత్మక కథనం కాకుండా ఒక శాస్త్ర-ఆధారిత విజ్ఞానంగా మారుస్తాయి. భౌతిక ఆధారాలు లేని చరిత్ర కేవలం పుక్కిటి పురాణమే అవుతుంది. మన చరిత్రను కూలంకషంగా మనం అర్థం చేసుకోలేకపోతే, ఆ చరిత్రనుండి నేర్చుకోవాల్సిన పాఠాలు మనం నేర్చుకోకుండ ఉండిపోతే మనం భావి తరాల మేధో వికాసానికి నష్టం కలిగించినవారమౌతాం. కాబట్టి, శాస్త్రీయతకు విరుద్ధంగా ఉండే ఏ చారిత్రక వాదాన్నైనా భారతీయులు తిప్పికొట్టాలి. తెలుగు సాహిత్యకారులు కూడా కేవలం భావోద్వేగాలకు లోనుకాకుండా, చారిత్రక సత్యాలను శాస్త్రీయ కోణంలో బేరీజు వేసుకున్న తర్వాతే వాటిని తమ సాహిత్యంలో పొందుపరచాలి.
ఈమాట పాఠకులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు! ఈమాట సంపాదకవర్గంలో శ్రీనివాస్ బందా, శ్రీనివాస్ వురుపుటూరి, శ్రీనివాస్ న్యాయపతి — ఈ ముగ్గురు కొత్తగా సంపాదకులుగా చేరారు. ఈ శ్రీనివాస-త్రయానికి మీ ఆహ్వానాభినందనలు తెలియజేయండి!