ఓడిస్సీ – 2: మహాప్రస్థానం

2.1 అథీనా ఆగ్రహం

విజయగర్వంతో ఇంటి ముఖం పట్టిన గ్రీకు పడవలు జోరు అందుకున్నాయి. అగ్నిదేవుడికి ఆహుతి అవుతూన్న ట్రోయ్ నగరపు జ్వాలలనుండి చుట్టలుచుట్టలుగా ఎగసిపడుతూన్న నల్లటి పొగ ఆకాశాన్ని అలుముకుంటూ ఉండగా ఆ పొగతో కలసిపోయి ఆకాశంలో నల్లటి వర్షమేఘాలు పేరుకోవడం మొదలెట్టాయి. ఇంతలో ఆకాశం తటిల్లతలతో ధగధగ మెరిసింది! కోపంతో కాబోలు దడదడా ఉరిమింది.

ప్రచండమైన పెనుగాలులు వీచసాగాయి. సముద్రంలో కెరటాలు ఉవ్వెత్తున లేచి పడవల ముఖభాగాలని ముంచెత్తడం మొదలెట్టాయి! పడవల గుంపు చెల్లాచెదరయిపోయింది.

[ఒడిస్సియస్ బృందంలో ఉన్న 12 ‘మెరుగుమాసిన’ పడవలు, 600 నావికులు మిగిలిన గ్రీకు బృందం నుండి విడిపోయారు. దోనె ఆకారంలో ఉన్న ఈ పడవల అడుగు భాగాలను నిత్యం నల్లటి తారుతో పులుముతూ ఉండకపోతే పడవలోకి నీరు వచ్చేస్తూ ఉంటుంది. అందుకని వీటిని మెరుగుమాసినవి అంటారు. వీటికి అమర్చిన నలుచదరపు తెరచాపలతో ఎదురుగాలిలో పడవను నడపడం సాధ్యం కాదు; ఈ పడవలతో ఏ దిశలో కావలిస్తే అటు వెళ్ళడం కష్టం! కనుక నావికులు సముద్రపుటొడ్డును ఆనుకుని వెళుతూ, దారిలోని దీవులలో నీటికి, తిండికి ఆగుతూ ప్రయాణం చేయడం సాధ్యమవుతుంది తప్ప సముద్రం మధ్యలోనికి వెళ్ళడం కష్టం!]

“ఒలింపస్ పర్వతం మీద ఉన్న దేవతలు కినుక వహించినట్లున్నారు! మనమంతా ఈ సముద్రంలో ములిగిపోయి చావడం తథ్యం” అంటూ ఓడంగులు నిస్పృహ వెల్లడిస్తున్నారు.

అమాంతం పరిస్థితి ఇలా తిరగబడడం చూసి ఒడిస్సియస్ దిగ్భ్రమ చెందాడు! అంబరానికి అధిపతి, దేవదేవుడు అయిన జూస్ తన ఆయుధాలైన మెరుపులను, పిడుగులను తమ మీద ఎందుకు ప్రయోగిస్తున్నాడు? సముద్రాలకి అధినేత అయిన పొసైడన్ (Poseidon; poh-SY-don) ఎందుకని కోపంతో సముద్రాన్ని ఇలా రెచ్చగొడుతున్నాడు?

ఒడిస్సియస్ తన సిబ్బందిని ఉద్దేశించి గద్దించి అడిగేడు: “మన దేవుళ్ళకు అపచారం చేసినది ఎవ్వరు? చెప్పండి!”

“మనం ట్రోయ్ నగరం వదలిపెట్టి పడవలు ఎక్కి వచ్చే ముందు కొందరు నావికులు అథీనా దేవి ఆలయం మీదకు – భయం, భక్తి చూపకుండా – దండెత్తి వెళ్ళేరు. అక్కడ చేయకూడని పనులు చేసేరు.” ఒక నావికుడు వణుకుతూ ముందుకి వచ్చి విన్నవించుకున్నాడు.

“ట్రోయ్ నగరపు దుర్భేద్యమైన ప్రాకారాన్ని నిర్మించినది సముద్రదేవుడు, పొసైడన్! ఆయనకి కోపం వచ్చి ఉండొచ్చు!” మరొక నావికుడు అభిప్రాయపడ్డాడు.

ఒడిస్సియస్‌ నిశ్చేష్టుడయ్యాడు. తమ విజయానికి మూలకారణమైన అథీనా దేవికి అపచారం జరిగిందని తెలిసి ఖిన్నుడయ్యాడు. పొసైడన్‌కి కోపం వచ్చిందంటే అందరూ ములిగిపోవడం తథ్యం అని ఒడిస్సియస్‌కి తెలుసు!

గాలి ఉద్ధృతి పెరిగింది. యుద్ధనావలు కాగితపు పడవలలా ఊగిసలాడుతున్నాయి! “తెరచాపలు దించండి! పోతవాహకులారా! తెడ్లు పైకి తీయండి! జోరుగా తెడ్లు వేసి పడవలను ఒడ్డుకి చేర్చండి!” ఒడిస్సియస్ ఎలుగెత్తి అరిచేడు.

గ్రీకు నావికులు ఆ గాలి తోటీ, ఆ కెరటాల తోటీ ఎడతెరిపి లేకుండా, అలుపుకు అలుసవకుండా, ప్రాణాలు గుప్పిట పెట్టుకుని నిర్భయంగా పోరాడేరు. ఆ పోరాటం ఎంతసేపు జరిగిందో తెలియదుకాని ఎట్టకేలకు చాటుమాటున ఉన్న ఒక సముద్రపు గొంది వారికి అశ్రయం ఇచ్చింది.

గాలి, వాన రెండు రోజులపాటు తగ్గలేదు. మూడవనాడు గాలి నిమ్మళించింది. మేఘాలు తెరిపినిచ్చాయి! ఆకాశంలో సూర్యుడు కనిపించేడు. సముద్రం ప్రశాంతంగా ఉంది!

“అథీనా దేవత కరుణించినట్లు ఉంది! మన ప్రార్థనలు ఫలించినట్లున్నాయి! ఇథకా వైపు మన ప్రయాణం కొనసాగిద్దామా?” అంటూ ఒడిస్సియస్ నావికా దళాన్ని సముద్రపు గొంది నుండి బయటకు బయలుదేరదీశాడు.

2.2 పువ్వులు తినే ప్రాణులు

అథీనా దేవత శాంతించిందేమోకాని, వారు అనుకున్నట్టు పొసైడన్‌ కరుణించినట్లు లేదు! బయటకు వచ్చి, తెరచాపలు ఎత్తే వేళకు, ఎక్కడనుండి వచ్చిందో మరొక ప్రభంజనం పోటెత్తింది! ప్రకృతి శక్తులతో మానవమాత్రుల మల్లయుద్ధం మళ్ళా మొదలైంది! పరాజయాన్ని నిరసిస్తూ, ఇనుమడించిన సంకల్ప శుద్ధితో, సముద్రంతో, సుడిగాలిలో పది రోజులు నిరాఘాటంగా పోరాడారు. అకస్మాత్తుగా వాతావరణం అనుకూలంగా మారింది!

అదృష్టవశాత్తు వారి ఎదురుగా పచ్చని చెట్లతో నిండిన ఒక ద్వీపం కనిపించింది! నరనరానా అలసి సొలసి ఉన్న సిబ్బందికి తినడానికి తిండి, తాగడానికి నీరు, సేద తీర్చుకోడానికి నీడ దొరికే అవకాశం కనిపించింది!

లంగర్లు దింపేరు. గ్రీకు నావికులు కుత్తుకబంటి నీటిలోకి దూకి, అలిసిపోయిన కాళ్ళని నీళ్ళల్లో ఈడ్చుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. అక్కడ దొరికిన చల్లటి మంచినీటిని కడుపు నిండా తాగి, ఆ ఇసక దిబ్బల మీద సొమ్మసిల్లి నిద్రపోయేరు!

తెల్లవారింది! బాల భానుని అరుణ కిరణాల స్పర్శతో నావికులు లేచేరు. తెప్పరిల్లిన ఒడిస్సియస్ భోజనసామాగ్రి దొరుకుతుందేమో చూసి రమ్మని ముగ్గురు నావికులను అన్వేషణకు పంపేడు.

పొద్దు తిరిగే వేళయింది కానీ అన్వేషక బృందం తిరిగి రాలేదు! ఎందుకు ఆలస్యం అయిందో ఒడిస్సియస్‌కి అర్థం కాలేదు.

వెళ్ళినవారి జాడ కనుక్కుందామని తానే బయలుదేరేడు! తుప్పలు, పొదలు దాటుకుంటూ, వాళ్ళ పేర్లు ఎలుగెత్తి పిలుస్తూ ముందుకి కదులుతున్నాడు.

ఇలా ఎంతో దూరం వెళ్ళనే లేదు! ఇంతలో సాధువర్తనులలా కనబడుతూన్న ఆ ద్వీపవాసుల గుంపొకటి ఎదురైంది. వాళ్ళు నవ్వుతూ, ఆపేక్షగా పలకరించేరు. తరువాత వాళ్ళ చేతుల్లో ఉన్న పువ్వులు తినమని ఇచ్చేరు!

ఒడిస్సియస్ ఆకలితో నకనకలాడుతున్నాడేమో ఆ పువ్వులను తినబోతూ ఉండగా తాను వెతుకుతూన్న ముగ్గురు నావికులూ కనిపించేరు! ఆ ముగ్గురూ నేల మీద దొర్లుతూ, వికారంగా, వెకిలిగా నవ్వుతూ కనిపించేరు!

ఒడిస్సియస్ వాళ్ళను వారి వారి పేర్లు పెట్టి పిలచేడు. వారు ఈ పిలుపుకు ఏ మాత్రం స్పందించలేదు. వారు కనీసం కన్నెత్తయినా చూడలేదు.

“మీరు నా వాళ్ళను ఏం చేసేరు?” ద్వీపవాసులను అడిగేడు ఒడిస్సియస్.

“మా పువ్వుల్ని తినడానికి ఇచ్చేము. ఇది మా ఆచారం. ఇలా అతిథుల్ని ఆదరించకపోతే మా దేవుళ్ళకి కోపం వస్తుంది.”

“ఆ పువ్వులు ఏ రకం పువ్వులు? ఏ మొక్క పూసింది వాటిని?”

“అవి కమలాలు! వాటికి అద్భుత శక్తులు ఉన్నాయి. అవి తిన్నవారు మంత్రించినట్లు గతం పూర్తిగా మరచిపోతారు!”

“ఇల్లు, తల్లి, పెళ్ళాం, పిల్లలు, స్నేహితులు, శత్రువులు, ఊరు, వాడ, సమస్తం మరచిపోతారా?”

ఈ ప్రశ్నకి సమాధానంగా కమలపుష్పాలు తినే ఆ ద్వీపవాసులు ఒక వెకిలి నవ్వు నవ్వేరు! అలా నవ్వుతూ, ఆపేక్షగా వాళ్ళ చేతుల్లో ఉన్న తెల్లని, తియ్యని, అందమైన పువ్వులు తినమని మళ్ళా ఇచ్చేరు!

ఒడిస్సియస్‌ నిర్లక్ష్యంగా వారిని పక్కకు తోసేసి, తన సహచరులు ముగ్గురినీ జబ్బలు పట్టుకుని లేవనెత్తి వాళ్ళను పడవలు ఎక్కమని ఆదేశించాడు

“మమ్మల్ని ఈ దీవిలో వదిలెయ్యండి. కమలాలు తింటూ ఇక్కడే హాయిగా ఉంటాం” అంటూ ఆ ముగ్గురు సైనికులు ఒడిస్సియస్‌ని బ్రతిమిలాడేరు.

కోపంతో ఒడిస్సియస్ కళ్ళు ఎర్రబడ్డాయి! తన సిబ్బంది ముగ్గురినీ మెడ పట్టి పడవ వైపు ఈడ్చుకు వెళుతూ, సహాయం కొరకు బిగ్గరగా అరిచేడు.

“ఈ ముగ్గురి కాళ్ళూ, చేతులూ కట్టేసి పడవలో పడేయండి. మరెవ్వరూ ఈ కమలాలు తినకుండా జాగ్రత్త పడండి!”

పువ్వులు తిని, మతి భ్రమించిన ముగ్గురినీ కదలకుండా పడవలో రాటలకి కట్టేసేరు.

వెనువెంటనే పన్నెండు పడవలనూ నీళ్ళల్లోకి తోసి, లోతుకెళ్ళేవరకూ తెడ్లు వేసి, గాలివాటం చూసుకుని తెరచాపలు ఎత్తి, ఇథకా వైపు ప్రయాణం కొనసాగించారు! ఈ అనుభవంతో ఒడిస్సియస్ మనోధైర్యం కాసింత కుంటుపడింది. ఇంటికి చేరే లోగా ఇంకెన్ని ఇక్కట్లు ఎదుర్కోవాలో?

2.3 అగోచరమైన సముద్రతీరం!

రెండు రోజులు తిరిగేలోగా గ్రీకు నావికా బృందానికి కొండలు, మిట్టలు, వాటి మీద పచ్చని చెట్లు, గడ్డి దుబ్బులతో మరొక దీవి కనబడింది! అక్కడ జన సంచారం కనపడలేదు కానీ, మేక అరుపులు, గొర్రె అరుపులవంటి శబ్దాలు లీలగా వినబడుతున్నాయి!

ఎదురుగా పొగమంచుతో కప్పబడ్డ సముద్రశాఖ కనబడుతూంది. అక్కడ సురక్షితంగా విడిది చేయవచ్చని నిశ్చయించి, లంగరు దింపమని ఒడిస్సియస్ ఉత్తర్వులు జారీ చేసేడు. తెరచాపలు దింపి, పడవలన్నిటిని సన్నద్ధం చేసి, కళాసులు లంగర్లు దింపేసరికి చీకటి పడిపోయింది. ఆకాశంలో మేఘాలతో దోబూచులాడుతున్న అర్ధచంద్రుడు కూడా అస్తమించడానికి ఉబలాటపడుతున్నాడు. నావికులు గట్టుకు చేరి, ఇసక తిన్నెల మీద విశ్రమించడమే తడవుగా నిద్రలోకి జారుకున్నారు!

ఉదయభానుడి వెచ్చని కిరణాల తాకిడికి కళాసులంతా కళ్ళు తెరచి చూసేసరికి ఎదురుగా కొండల మీద వనదేవతలు మేకల మందలను తోలుతూ కనబడ్డారు. ఈ వనదేవతలు మరెవ్వరో కాదు. సాక్షాత్తూ దేవదేవుడు జూస్ కుమార్తెలు! ఆకలితో అలమటిస్తూన్న గ్రీకు సైనికులు విల్లంబులు చేతబూని వంద మేకల వరకు సంహరించేరు!

మేక మాంసం వండుకుని తిని, ద్రాక్ష సారా తాగి దినమంతా ఆనందించేరు. సాయంత్రం అవుతోంది! వీరున్న సముద్రశాఖకు ఆవలి తీరంలో ఏదో ఆసక్తికరమైన దృశ్యం వీరిని ఆకర్షించింది! పొగ చిమ్ముతూ చిన్న చిన్న మంటలు కనబడుతున్నాయి. ఆ సందె చీకట్లో మేకల మందల “మేమే” అరుపులు అస్పష్టంగా వినబడుతున్నాయి.

“అక్కడ ఎవరున్నారో? ఆ మంటల్ని పెడుతూన్నది ఎవరో? మిత్రులో? శత్రువులో?” ఒడిస్సియస్ తనలోతాను మథనపడుతున్నాడు!

చీకటి చిక్కబడుతోంది! గ్రీకు వీరులు మరొక రాత్రి కంటినిండా నిద్రపోయేరు. బాలభానుడి లేత అరుణ కిరణాలు ఒడిస్సియస్‌ని కూడా నిద్రలేపేయి. ఒడిస్సియస్ దృష్టి మళ్ళా మర్మగర్భితమైన ఆవలి తీరంపై పడింది. అక్కడ ఏమిటి జరుగుతోందో తెలుసుకోవాలనే తీవ్రమైన కుతూహలం అతని మస్తిష్కాన్ని దొలిచేస్తూంది! ఇథకా పోవడమా? కుతూహలానికి తల ఒగ్గడమా?

ఒడిస్సియస్ ఇంకా నిద్రపోతూన్న అనుచరులను లేపేడు. “ఆ ఎదురుగా ఉన్న తీరంలో ఏముందో తెలుసుకోవాలనే కోరిక నన్ను తినేస్తూంది! ఒకే ఒక పడవను తీసుకుని అన్వేషణ యాత్ర చేసి అక్కడ ఉన్న జీవులు మనలా నాగరికులో, లేక మోటైన అడవి జాతులవాళ్ళో చూద్దాం. తరువాత వెంటనే మన ఇథకా ప్రయాణం యథావిధిగా కొనసాగిద్దాం.”

తన బృందంలో ఉన్న అతి బలవంతులను, అతి ధైర్యవంతులను తనకు తోడుగా ఎంపిక చేసేడు. అందరూ ఒక పడవలోకి ఎక్కి, దానిని నీళ్ళల్లోకి తోసి, తెడ్లు వేసి పడవను ఆవలి తీరం వైపు నడిపేరు. తీరం చేరుకున్న తరువాత ఒక మారుమూల గొందిలో లంగరు దింపేరు.

“మనకి అతిథి సత్కారం చేసి ఎవ్వరైతే గౌరవిస్తారో వారికి బహుమానంగా ఈ సారాయిని ఇద్దాం!” అంటూ ఒక తోలు తిత్తి నిండా ద్రాక్ష సారాయి నింపేడు ఒడిస్సియస్ .

పడవలో కొంతమంది కళాసులను కాపలా ఉండమని, ప్రత్యేకంగా ఎంపిక చేసిన పన్నెండు మందిని మాత్రం తనకు తోడుగా రమ్మని ఒక కరకట్ట వెంబడి నడుచుకుంటూ పైకి వెళ్ళేడు. పైకి వెళ్ళేసరికి అక్కడ ఒక విశాలమైన మైదానం, ఆ మైదానం చివర ఒక గుహ, ఆ గుహ ద్వారాన్ని కప్పుతూ తీగలు, లతలు కనబడ్డాయి! గ్రీకు యోధులు ఆ తుప్పలన్నిటిని తప్పించుకుని, గుహ లోపలికి వెళ్ళేరు.

ఆ గుహ నిండా మే మే అంటూ మేక పిల్లలు, బా బా అంటూ గొర్రె పిల్లలు కనబడ్డాయి! ఎక్కడ చూసినా పాత్రల నిండా మేక పాలు, గొర్రె పాలు! కానీ ఎక్కడా పశుపాలకుడి జాడ లేదు.

“త్వరగా కదలండి! ఆ పాల గిన్నెలు, పెరుగు, వగైరాలన్నీ పట్టుకుపోదాం. ఇది మంచి పోషకాహారం.”

“నిజమే! పాల గిన్నెలతోపాటు కాపరి వచ్చేలోగా గొర్రెలని, మేకల్ని కూడా తోలుకుపోదాం!”

“ఆబ్బే! అలా కాదు. ఈ గొర్రెలు, మేకలు ఎవరివో తెలుసుకోకుండా వెళ్ళడం నాకు ఇష్టం లేదు” అని ఒడిస్సియస్ తన నిర్ణయం చెప్పేడు.

అప్పుడు ఆ గ్రీకు యోధులు ఒక మంట వెలిగించి, అగ్నిదేవుడికి ముందుగా నైవేద్యం పెట్టి, అప్పుడు అక్కడ ఉన్న పాలు, పెరుగు, వగైరా పాడి పదార్థాలన్నిటిని పీకలమొయ్యా తిని ఆనందిస్తున్నారు.

వారి ఆనందానికి అంతరాయం కలిగిస్తూ గొర్రెల కాపరి కాబోలు ఈల పాట పాడుకుంటూ వస్తూన్న శబ్దం వినిపించింది. ఆ శబ్దంతో పాటు మేకల అరుపులు కూడా వినిపించేయి!

“ఆహా! గొర్రెల కాపరి వస్తున్నాడు. ఆ వ్యక్తిని మనం కలుసుకుని పరిచయం చేసుకుందాం, లేవండి!” అన్నాడు ఒడిస్సియస్!

అందరూ లేచి గుహ ద్వారం వైపు చూసేరు! భయకంపితులై, అచ్చెరువంది, నిర్విణ్ణులై, నోట మాట రాక అలా స్థాణువుల్లా ఉండిపోయేరు. ఆ వచ్చినవాడు భయంకర స్వరూపుడైన ఒక రాక్షసుడు!!

2.4 ఒంటికన్ను మహాకాయుడు!

ఒక అఘోరమైన రాక్షసాకారుడు ఎదుట సాక్షాత్కరించేడు! వాడి భుజం మీద బండెడు కర్ర మోపులు ఉన్నాయి! భూమిలోంచి పైకి పొడుచుకొచ్చిన పర్వతశిఖరంలా వాడి తలకాయ వాడి భుజాల మీద కనబడుతోంది. వాడి ముఖం మీద, నుదుటి మధ్య కోడిగుడ్డంత కన్ను – ఒకే ఒకటి – భయంకరంగా ముందుకు చూస్తోంది.

ఆ భయంకరాకారుడు పాలీఫీమస్ (Polyphemus; pah-lih-FEE-mus). వాడు సైక్లోప్స్ (Cyclopes; SY-klops) అనే ఒక జాతి ఒంటికన్ను రాక్షసులందరిలోకీ ప్రసిద్ధుడు. నీతి, నియమం లేని దుర్మార్గుడు. సైక్లోప్స్ జాతి వారందరూ పరమనీచులు. వారుండే ద్వీపం వైపు ఏ నావికులు దారితప్పి వచ్చినా, వారిని పరమనీచంగా బాధించి, చంపి తినేస్తూ ఉంటారు.

పాలీఫీమస్ వస్తూనే భుజాలమీద ఉన్న కట్టెలమోపును కిందికి విసిరేసేడు. అది దభీమని శబ్దం చేసుకుంటూ కింద పడేసరికి ఒడిస్సియస్ , అతని అనుచరులూ భయకంపితులై ఆ గుహలో చీకటిగా ఉన్న ఒక మూలకు నక్కి చూస్తున్నారు.

ఆగంతకులు గుహలో చొరబడి ఉన్నారన్న స్పృహ లేకుండా, పాలీఫీమస్ గొర్రెలను, మేకలను లోపలికి తోలుకు వచ్చేడు. వచ్చి, గుహ ముఖద్వారానికి అడ్డుగా – తలుపు మూసినట్లు – ఒక పెద్ద గండశిలను దొర్లించి లోపలికి వచ్చేడు! ఇహ బయటనుండి వెలుగు లోపలకు రాలేదు, లోపలనుండి పశువులు బైటికి పోలేవు!

“ఆ గండశిలాకవాటం ఇంతా అంతా ఉందా! పది ఏనుగులు కలిసినా దానిని కదల్చలేవు! ఇహ మనం బయట పడే మార్గం ఎలా?” అనుకుంటూ ఒడిస్సియస్ మౌనంగా విలపించేడు.

ఆ రాక్షసాకారుడు లోపలికి వచ్చి, పశువుల పొదుగులు కడిగి, పాత్రల నిండుగా పాలు పితికేడు. చితుకులను పోగుచేసి చిన్న మంట వేసేడు. మంట క్రమేపీ పెద్దదయి, గుహ లోపల నాలుగు మూలలకు వెలుగును విరజిమ్మింది. ఆ వెలుగులో ఒక మూలన నక్కి ఉన్న ఒడిస్సియస్ బృందం పాలీఫీమస్ కంట బడింది!

“ఇదేమిటి? ఎవరు మీరు? ఎక్కడనుండి ఊడిపడ్డారు?” రాక్షసుడు ఒంటి కన్నుతో తీక్షణంగా చూస్తూ అడిగేడు. “మీరు సముద్రపు దొంగలా?”

ఒడిస్సియస్ అనుచరులు భయకంపితులై నోట మాట రాక స్తంభించిపోయారు. ఒడిస్సియస్ ప్రాణాలు ఉగ్గబట్టుకుని, ధైర్యంతో ఒక అడుగు ముందుకు వేసేడు.

“మేము సముద్రపు దొంగలం కాదు. మేము గ్రీకు నావికులం. తుపానులో చిక్కుకుని, దారి తప్పి, ఈ ద్వీపం దగ్గరకి చేరుకున్నాం. దారి తప్పి వచ్చిన మాకు అతిథి సత్కారాలు చేసి గౌరవిస్తే దేవతల రాజు జూస్ సంతోషించి మీకు మేలు చేస్తాడు.”

“పోరా, పక్షీ! జూస్‌ని సంతోషపెట్టమని సలహా ఇవ్వడానికి నువ్వెవడివిరా! డింభకా! నేనెవరినో తెలుసా? జూస్ కొడుకైన సముద్రపు రాజు పొసైడన్ కొడుకుని! అనగా, సాక్షాత్తు జూస్ మనవడిని!”

ఒడిస్సియస్ అనుచరులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని, బిక్కచచ్చి, చూస్తున్నారు.

పాలీఫీమస్ నడుచుకుంటూ ఒడిస్సియస్ దగ్గరకు వచ్చేడు. భుజం మీద చెయ్యి వెయ్యలేదు కానీ, అనునయంగా అడిగేడు. “అబ్బీ! నీ పడవ ఎక్కడ ఉంది? ఒడ్డుకు దగ్గరగా ఉందా? సముద్రంలో ఉందా?”

పాలీఫీమస్ ఏదో కుతంత్రం పన్నుతున్నాడని ఒడిస్సియస్ పసిగట్టేడు! “మా పడవ సముద్రంలో కొండకు గుద్దుకుని ఛిన్నాభిన్నం అయిపోయింది. మేము మాత్రం ప్రాణాలతో బయటపడి, ఈదుకుని, ఒడ్డు చేరుకున్నాము. మరొక్కసారి విన్నవించుకుంటున్నాను. మాకు ఆతిథ్యం ఇచ్చి పంపుతారు కదూ?”

సైక్లాప్స్ ఒక్క క్షణం పాటు ఒడిస్సియస్ వైపు వింతగా చూసేడు. ఒడిస్సియస్ ఆశగా చూస్తున్నాడు. రాక్షసుడు అకస్మాత్తుగా ఇద్దరు గ్రీకు నావికులని ఒంటి చేత్తో పట్టుకుని, పైకి లేవనెత్తి, వారిని అక్కడ ఉన్న రాతిబండ మీద వేసి – చాకిరేవులో చాకలి బాదినట్లు – ఒక్క బాదు బాదేడు. ఇద్దరూ హరీమని పోయేరు. గోగు కాడ ఈనెలు పీకినట్లు వాళ్ళ కాళ్ళు, చేతులు పీకి. వాటిని మునగకాడని నమిలినట్లు నమిలిపారేసేడు. అంతా లిప్తలో జరిగిపోయింది!

ప్రాణాలతో బయటపడ్డ మిగిలిన గ్రీకు యోధులు ఒలింపస్ పర్వతం మీద ఉన్న దేవరాజు జూస్‌ని ప్రార్థించడం మొదలు పెట్టేరు.

తినడం అయిన తరువాత రాక్షసుడు ఒక బిందెడు మేక పాలు తాగి బ్రేవ్మని త్రేన్చి, పెదిమలని చప్పరిస్తూ, “ఇదే నా స్వాగతం!” అన్నాడు.

అని, భుక్తాయాసం తీర్చుకుందుకని నేలమీదకు ఒరిగి ఒక్క క్షణంలో నిద్రలోకి జారుకున్నాడు.

ఒడిస్సియస్ కోపోద్రిక్తుడయ్యాడు. కత్తిని దూసేడు. కానీ అతడి వివేకం ఆగమని సలహా ఇచ్చింది!

“ఈ గుహాద్వారానికి అడ్డంగా ఉన్న గండశిలాకవాటాన్ని మనం కదపనైనా కదపలేము. వీడిని మనం ఇప్పుడు ఇక్కడ చంపితే మనమంతా ఈ గుహలో బందీలమై, చివరికి చచ్చిపోతాం.” అంటూ కత్తిని ఒరలో పెట్టి, “ఈ దుష్టుడు తెల్లారి లేచి బయటకు వెళ్ళేవరకూ మనం కూడా ఇక్కడే ఉండాలి. తప్పదు.”

2.5 పరారీకి ఒడిస్సియస్ పన్నాగం

ఆ కాళరాత్రి ఒకంతట గడవలేదు! నిమిషాలు గంటలులా గడిచేయి. ఎట్టకేలకు గుహ ముఖద్వారం దగ్గర వెలుగు రేఖలు కనబడ్డాయి.

సైక్లాప్స్ కళ్ళు తెరచి, ఒళ్ళు విరుచుకొని, లేవడం ఒడిస్సియస్ చూసేడు. ఆ మహాకాయుడు చిన్న మంటను వెలిగించేడు. పాలు పితకడం పూర్తి చేసేడు. కాలకృత్యాలన్నీ పూర్తి చేసుకున్న తరువాత మరో ఇద్దరు గ్రీకు సైనికుల్ని చేతబట్టేడు. ఈ తడవ ఏమి చేస్తాడో ఏమిటో?

గ్రీకు నావికులకు తక్షణ కర్తవ్యం తెలియలేదు. వాళ్ళు చెయ్యగలిగినదల్లా మరొక సారి ప్రార్థన చెయ్యడం. మునుపటిలాగే జూస్ వీళ్ళ మొర ఆలకించినట్లు లేదు!

ఒడిస్సియస్ ఆతురతతో చూస్తున్నాడు. రాక్షసుడు చేతబట్టిన ఇద్దరు గ్రీకు నావికులను పైకి లేవనెత్తి, అక్కడ ఉన్న రాతిబండ మీద వేసి ఒక్క బాదు బాదేడు. వాళ్ళ కాళ్ళు, చేతులు పీకి వాటిని నమిలి పారేసేడు. మరొక ఇద్దరు హరీమనిపోయేరు! రాక్షసుడి చద్ది భోజనం పూర్తయ్యింది!

గ్రీకు నావికులు, వారి నాయకుడితోపాటు, భయకంపితులయ్యారు. ఉక్రోషం పెల్లుబికి వస్తోంది. ఆవేశాన్ని అదుపులో పెట్టుకోవడం తప్ప తప్పించుకోడానికి వేరే మార్గం కనబడలేదు.

ఉదయపు భోజనకార్యక్రమం ముగిసిన తరువాత పాలీఫీమస్ లేచేడు. లేచి, గుహ ముఖద్వారం దగ్గరకు వెళ్ళేడు. ఎడంచేత్తో ముఖద్వారాన్ని మూసివున్న బండశిలను అనాయాసంగా పక్కకు తోసేడు. ఈల వేసేడు. దాని అర్థం ఆ నోరులేని జంతువులకు తెలిసింది. లోపల ఉన్న గొర్రెలు, మేకలు బిలబిలమంటూ బయటకు నడిచేయి. వాటితో పాలీఫీమస్ బయటకు వెళ్ళి, తిరిగి బండశిలతో ముఖద్వారాన్ని మూసివేసి, ఈల వేసుకుంటూ వెళ్ళిపోయేడు!

గుహలో జరిగిన ఆఘాయిత్యాలకు గ్రీకు నావికులు ఆర్తనాదాలు చేసేరు. “ఏడ్చి ఏమి లాభం? ఇక్కడనుండి బయటపడడానికి ఏదైనా మార్గం వెతకాలి.” అంటూ ఒడిస్సియస్ ఓదార్చేడు.

కలవరపాటుతో అన్యమనస్కులైన నావికులు ఆలోచించే సామర్థ్యాన్ని కోల్పోయేరు. పాలీఫీమస్‌ని ఎలా మట్టుబెట్టాలా అన్న ఆలోచనతో ఒడిస్సియస్ ఆ గుహలో ముందుకూ వెనక్కీ పచార్లు చెయ్యడం మొదలుపెట్టేడు.

ఒడిస్సియస్ కళ్ళకు ఒక పొడుగాటి దుడ్డు కర్ర కనిపించింది. అతడు దానిని అందుకున్నాడు. దానినుండి ఆరడుగులు పొడుగున్న గుంజను విరగ్గొట్టేడు. దాని చివర వాడిగా, నారసంలా ఉండేలా తయారు చేసేడు. అప్పుడు ఆ కొస ఇంకా వాడిగా, సూదిగా ఉండేలా రాతి మీద పెట్టి సాన పట్టేడు. ఒక శూలం తయారయింది! ఆ శూలాన్ని ఒక చీకటి మూలలో దాచేడు.

ఒడిస్సియస్ చీట్లు వేసి నలుగురు నమ్మకమైన నావికులను తనకు సహాయం చెయ్యడానికి ఎన్నుకున్నాడు. వాళ్ళకు తన మనస్సులో వేసుకున్న పథకం చెప్పేడు. “ఇప్పుడు మనం చెయ్యవలసినదల్లా మంచి అవకాశం కోసం వేచి ఉండడమే!”

అందరూ భయభ్రాంతులై పసిపిల్లల మాదిరి వణుకుతున్నారు. ఒడిస్సియస్ మాత్రం నిశ్చలచిత్తుడై, గుండెని రాయి చేసుకుని, ఒక రాయి మీద కూర్చుని, తరుణం కోసం ఎదురు చూస్తున్నాడు.

గోధూళివేళ అయింది. దూరం నుండి బాబాలు, మేమేలు వినిపిస్తున్నాయి. వాటి వెనకే మన ఏకాక్షి రాక్షసుడు వేసే ఊళ కూడా వినిపించింది. గుహ ముఖద్వారం దగ్గర ఉన్న గండశిల కదిలింది! సంధ్యాసమయపు సూర్యకాంతితో గుహ నిండిపోయింది! గొర్రెలు, మేకలు బిలబిలమంటూ లోపలికి వచ్చేయి. వాటి వెనక లోకకంటకుడైన ఏకాక్షి ప్రవేశించేడు.

పశువులన్నీ లోపలికి వచ్చేయని నిర్ధారించుకుని గుహ ముఖద్వారాన్ని బండశిలతో మూసేసి, లోపలికి వచ్చి, మంటను రాజేసి, మారు మాట్లాడకుండా పాలు పితికే కార్యక్రమంలో నిమగ్నమయిపోయేడు, ఏకాక్షి!

సైక్లాప్స్ ఇలా పనులన్నీ పూర్తి చేసుకుని, ఒక్కపెట్టున ఇటు తిరిగి, ఇద్దరు గ్రీకు నావికులను చేతబట్టి, అక్కడ ఉన్న రాతి మీద చాకిరేవులో బట్టలను బాదినట్లు బాది, రక్తసిక్తమైన ఆ శరీరాల్ని ఆ రాత్రికి భోజనంగా తినేసాడు! తినేసి, మిగిలిన గ్రీకు సైనికుల్ని చూసి పళ్ళికిలిస్తూ సకిలించేడు!

అగ్గి మీద గుగ్గిలం జల్లినట్లు ఒడిస్సియస్ లోలోపలే మండిపోయేడు! పెదిమలు బిగబట్టి, ఆప్యాయతను ప్రదర్శిస్తూ, తమతో తీసుకువచ్చిన ద్రాక్షసారాతో నింపిన తోలుతిత్తి మూత తెరచి, అందునుండి ద్రాక్షసారాని ఒక దారు కలశంలో పోసి,

“అయ్యా! భోజనం అయింది కనుక ఈ తియ్యని ద్రాక్ష పానీయం మా బహుమతిగా స్వీకరించండి. మీరు సంతుష్టులైన తరువాత మా మీద దయ ఉంచి, మా దారిన మమ్మల్ని పోనివ్వండి” అంటూ ఒడిస్సియస్ కలశాన్ని అందించేడు.

ఒడిస్సియస్ చేతిలోని కలశాన్ని అందుకుని ద్రాక్ష సారాని గటగటా తాగేసి, “ఏదీ! మరి కొంచెం ఇలా నడిపించవయ్యా!” అంటూ కలశాన్ని ఒడిస్సియస్ చేతికి అందించేడు.

ఒడిస్సియస్ మరి కొంచెం కలశంలో పోసి పాలీఫీమస్ చేతికి ఇచ్చేడు. అది తాగేసి,

“మరి కొంచెం పొయ్యవయ్యా! నీ పేరేమిటన్నావ్?”

ఒడిస్సియస్ మూడోసారి మరి కొంచెం కలశంలో పోసి మళ్ళా సైక్లాప్స్ చేతికి ఇచ్చేడు.

మస్తుగా తాగేసిన ఏకాక్షి తూలుతూ గుహలో తిరుగుతున్నాడు. ద్రాక్ష సారా తన పని తాను చేసుకుంటూ పోతోంది. ఇప్పుడు తాను చెయ్యవలసిన పని చెయ్యాలి!

“మహాశయా! ఇందాకా నా పేరు అడిగేరు. చెబుతాను. చెప్పినందుకు మీరు నాకొక బహుమానం ఇవ్వాలి. సరేనా? నా పేరు “ఎవరో”! అందరూ నన్ను ఈ పేరుతోనే పిలుస్తారు.”

“ఆహాహా! ఎవరో!! పేరు బాగుంది. ఇప్పుడు నేను నీకొక బహుమానం ఇస్తాను. నీ సహచరులందరినీ తినేసిన తరువాత నిన్ను ఆఖరున తింటాను. అదీ నేను నీకు ఇచ్చే బహుమానం! ఆహాహా!”

ఆ మహాకాయుడు అలా నవ్వుతూ నాలుగడుగులు వేసేడో లేదో, దబ్బున, మొదలు నరికిన మానులా పడిపోయాడు! మత్తులోకి జారుకున్నాడు. గుర్రు పెట్టడం మొదలుపెట్టేడు. ఆ శబ్దం గుహ అంతా ప్రతిధ్వనించి కంపరమెత్తిస్తూంది.

ఇదే మంచి తరుణం! ఆలసిస్తే ఆశాభంగం అవుతుంది! మూలన దాచిన దారుశూలాన్ని చేతబుచ్చుకున్నాడు, ఒడిస్సియస్. అక్కడ నెగడులో కణకణలాడుతూన్న నిప్పు కణికల మధ్య శూలాన్ని గుచ్చి, తను ప్రత్యేకంగా ఎంపిక చేసిన సహాయకులను చెంతన ఉండమని, శూలాన్ని బయటకి లాగి, ఆ మండుతూన్న కొనని నిద్రపోతూన్న ఆ రాక్షసుడి కంటిలో గుచ్చి, బలంగా పొడిచేడు.

ఆ సైక్లాప్స్ దిక్కులు పిక్కటిల్లేలా, కర్ణపుటాలు వ్రయ్యలు అయేలా, ఒక పెనుబొబ్బ పెట్టేడు!

కంటినుండి బొటబొట కారుతూన్న రక్తం ఆ దారుశలాక వేడికి సలసలా మరిగిపోయింది.

ఈ దృశ్యం చూడలేక గ్రీకు సైనికులు దూరంగా పారిపోయేరు.

కంటిలో గుచ్చుకున్న దారుశూలాన్ని పాలీఫీమస్ ఊడబెరికి దూరంగా పారేసాడు. భరించడానికి అతీతమైన నొప్పితో బాధ పడుతూ, నేల మీద పడి దొర్లుతూ రంకెలు వేస్తున్నాడు.

ఆ ద్వీపంలో నివసిస్తూన్న ఇతర సైక్లాప్సులు ఈ రంకెలు విని, మూసి ఉన్న గుహ ద్వారం బయటకి వచ్చి చూసేరు. “పాలీఫీమస్! ఏమైంది? అలా అరుస్తున్నావ్? నీకు ఎవరు అపకారం చేసేరు?” అని ఎలుగెత్తి అడిగేరు.

అపకారం చేసింది “ఎవరో!” అని పాలీఫీమస్ సమాధానం చెప్పేడు, నేలమీద పడి మెలికలు తిరిగిపోతూ.

“ఎవరో తెలియనప్పుడు మేము చేయగలిగేది కూడా ఏమీ లేదు. అదే సర్దుకుంటుంది” అంటూ సైక్లాప్సుల గుంపు వెళ్ళిపోయింది.

ఒడిస్సియస్ పాచిక పారినట్లే ఉంది!

నొప్పితో ఘుర్ఘురిస్తూ, పొడుగైన చేతులతో తడుముకుంటూ గుహ ముఖద్వారం దగ్గర ఉన్న గండశిలాకవాటం దగ్గరకు చేరేడు పాలీఫీమస్. ఆ గండశిల చేతికి తగలగానే దానిని పక్కకి నెట్టేడు.

తలుపు తెరుచుకోగానే ఒడిస్సియస్ మనస్సు ఎగిరి గంతేసింది! ఇక చేయవలసిందల్లా ఆ తెరుచుకున్న ముఖద్వారం గుండా …..

ఈ ఆలోచన పూర్తి అవకుండానే పాలీఫీమస్ ముఖద్వారం దగ్గర ఒక రాతి మీద చతికిలబడి తన పొడుగైన చేతులను ద్వారానికి అడ్డుగా పెట్టి ఎవ్వరూ బయటకు పారిపోకుండా తడుముతున్నాడు!!

2.6 సైక్లాప్స్ శాపం

పాలీఫీమస్ గుహ ముఖద్వారం దగ్గర అదే పనిగా కాపలా కాస్తున్నాడు. ఈ రాక్షసుడి బారి నుండి తప్పించుకోవడం ఎలాగా అని ఒడిస్సియస్ అదే పనిగా ఆలోచిస్తున్నాడు.

పొద్దెక్కుతోంది. ఒడిస్సియస్ దృష్టి అక్కడ పోతరించి ఉన్న గొర్రెలమంద మీద పడింది. వాటి శరీరం మీద దట్టమైన ఉన్ని వేలాడుతూంది. ఈ గొర్రెలు కొద్దిసేపట్లో మేతకి బయటకి వెళతాయి. ఇవి తనకి ఎలా ఉపయోగపడతాయా అని ఆలోచన అతని మస్తిష్కంలో మొలకెత్తింది. ఒక ఉపాయం తళుక్కుమంది!

ఒడిస్సియస్ గభీమని లేచేడు. పోతరించి, బలంగా ఉన్న పద్దెనిమిది గొర్రెలను కూడదీసాడు. అక్కడ చెట్లనుండి వెళ్ళాడుతూన్న ఊడలలాంటి రెమ్మలను కోసి, మూడేసి గొర్రెలను దగ్గరగా, గుంపుగా చేర్చి, వాటిని ఆ రెమ్మలతో ఒక జట్టులా కట్టేడు. అప్పుడు ఆ జట్టులో మధ్యనున్న గొర్రె కడుపుకు ఒక్కొక్క సైనికుడిని గట్టిగా కట్టేడు.

ఇలా ఆరుగురు సైనికులను ఆరు గొర్రెల జట్టులకు కట్టేసిన తరువాత బాగా పోతరించి, బాగా బలిష్ఠంగా ఉన్న పెద్ద గొర్రె కడుపున ఉన్న ఉన్నిని గట్టిగా పట్టుకుని ఒడిస్సియస్ వేళ్ళాడేడు.

గుహ లోపలికి వెలుగు రాగానే అలవాటు ప్రకారం గొర్రెలు బిలబిలా గుహ బయట మైదానంలో మేతకు వెళ్ళడం మొదలుపెట్టాయి.

గొర్రెలు గుహ ద్వారం దాటే చోట కన్ను కాలిన సైక్లోప్స్ కాపలా కాసి ఉన్నాడు కదా! ప్రతి గొర్రెనూ పలకరించి, దాని వెన్ను మీద ఉన్న ఉన్నిని దువ్వుతూ అక్కడ కానీ ఆగంతకులు ఉన్నారేమోనని వెతుకుతున్నాడు! ఆ గుడ్డి రాక్షసుడు ఇటూ, అటూ ఉన్న గొర్రెలని తడిమి చూస్తున్నాడు కానీ మధ్యనున్న గొర్రె కడుపు అతని చేతులకి అందలేదు.

ఈ పద్ధతిలో ఒకరూ, ఒకరూ చొప్పున ఆరుగురు సైనికులూ తప్పించుకుని బయటపడ్డారు. కానీ అన్నిటికంటే పెద్ద గొర్రె బయటకి వెళుతూ ఉంటే దానిని సైక్లోప్స్ ఆపేడు! ఆపి దాని వీపు మీద ఉన్నిని ప్రేమతో నిమిరేడు.

ఒడిస్సియస్ ఊపిరి బిగపట్టి గొర్రె కడుపు కింద ఉన్నిని పట్టుకుని వేల్లాడుతున్నాడు!

“ఓ మిత్రమా!” పాలీఫీమస్ అన్నాడు, “ఎందుకు ఈ వేళ కాళ్ళీడుచుకుంటూ నెమ్మదిగా నడుస్తున్నావు? ప్రతి దినమూ నువ్వు అందరికంటే ముందు గెంతుకుంటూ పరిగెట్టేదానివి కదా? నీ యజమాని దృష్టి పోయి గుడ్డివాడయిపోయాడని బాధ పడుతున్నావా? నువ్వు మాట్లాడగలిగి ఉంటే ఎవరో ఎక్కడ దాక్కున్నాడో చెప్పేదానివి. అప్పుడు వాడి బుర్ర వెయ్యి చెక్కలు చేసి ఉండేవాడిని!”

ఆ గొర్రెకి ఈ సోది అర్థం అయినట్లు లేదు. బా బా అని అరిచింది. దాని వీపు మరొక సారి నిమిరి బయటకు పోనిచ్చేడు.

ఒడిస్సియస్‌కి విముక్తి లభించింది! గొర్రె సురక్షితమైన దూరానికి వెళ్ళాక తరువాత ఒడిస్సియస్ దాని పొట్టకు ఉన్న ఉన్ని పట్టుని సడలించి, నేల మీద నిలబడి, తన సహచరుల కట్లు గబగబా విప్పి, “చడి, చప్పుడు లేకుండా కదలండి. మన పడవను చేరండి” అని తొందరపెట్టేడు. అప్పుడు వాళ్ళు ఆ గొర్రెల మందను కూడా తోలుకుని పడవని చేరుకున్నారు.

వెళ్ళినవారిలో ఆరుగురు తిరిగి రాలేదన్న విచారం ఒక పక్క ఇబ్బంది పెట్టినా, తిరిగి ప్రాణాలతో వచ్చిన వారిని అభినందించకుండా ఉండలేకపోయారు, అక్కడ నిరీక్షిస్తూన్న నావికులు.

“ఇది విచారించడానికి, పరామర్శలకు అనువైన సమయం కాదు. సైక్లాప్స్ మన ఉనికిని గుర్తించే లోగా మనం ఇక్కడనుండి కదలాలి.”

గొర్రెలను, మేకలను పడవ ఎక్కించేసి, తెడ్లు వేసి పడవలను ఒడ్డునుండి దూరంగా తీసుకుపోయారు.

పోతూన్నవాడు ఊరుకోకుండా గుడ్డి సైక్లాప్స్‌ని కవ్వించడానికి, “పాలీఫీమస్! పాలీఫీమస్!” అని ఎలుగెత్తి పిలిచాడు, ఒడిస్సియస్!

ఒక క్షణంలో పాలీఫీమస్ తడుముకుంటూ నీటి గట్టుకు వచ్చేడు. తన బందీలు విడిపించుకుని పారిపోయారని గ్రహించి, కోపంతో ఒక రంకె వేసేడు!

“నా సహకారులు ఆరుగురిని అమాంతం కబళించేసిన దుర్మార్గుడా! చూసేవా, దేవరాజు జూస్‌ నిన్ను ఎలా శిక్షించేడో?” ఒడిస్సియస్ ఎత్తిపొడిచేడు!

ఈ ఎత్తిపొడుపుకు ఉగ్రుడైన ఆ రాక్షసుడు అక్కడ కొండచరియలో ఉన్న ఒక బండరాయిని పెకళించి, ఒడిస్సియస్ గొంతుక వినిపిస్తూన్న దిశలో బలంగా విసిరేడు! ఆ రాయి సరిగ్గా పడవ ముందు నీటిలో పడడం వల్ల అక్కడ నీటి కెరటం ఉవ్వెత్తున లేచింది. ఆ కెరటం విరిగి పడినప్పుడు ఒడిస్సియస్ ఉన్న పడవ కాగితం పడవలా తిరిగి సైక్లాప్స్ ఉన్న ఒడ్డుకు కొట్టుకొచ్చింది!

ఒడిస్సియస్ ఆదరా బాదరా తెడ్డుకు పని చెప్పి మళ్ళా పడవను సురక్షితమైన దూరానికి తోలుకు వెళ్ళేడు.సముద్రంలో సురక్షితమైన దూరం వెళ్ళేక, ఉండబట్టలేక, “పాలీఫీమస్!” అని మళ్ళా వెటకారంగా పిలిచేడు.

“ఆ రాక్షసుడిని రెచ్చగొట్టవద్దు!” అంటూ నావికులు ఏకకంఠంతో మొరపెట్టుకున్నారు. కానీ ఒడిస్సియస్ వినలేదు! అతని ఆత్మగౌరవం ఎంతలా దెబ్బ తిన్నదంటే తన అసలు పేరు పాలీఫీమస్‌కి చెప్పకుండా ఉండలేకపోయేడు!

“పాలీఫీమస్! నీ కంటిని ఎవరు పొడిచేరు అని ఎవ్వరైనా అడిగితే ఇటుపైన ‘ఎవరో’ అని చెప్పకు. నా కంటిని పొడిచి నన్ను గుడ్డివాడిని చేసినవాడు ఇథకా రాజు, అరివీరభయంకరుడు అయిన ఒడిస్సియస్ అని చెప్పు!”

“అలా చెప్పు! భవిష్యవాణి చెప్పిన సోది నిజమేనన్నమాట!” అన్నాడు ఆ రాక్షసుడు. “చాలా కాలం క్రితం ఒక సోది చెప్పేవాడు చెప్పేడు, ఒడిస్సియస్ అనే వ్యక్తి నన్ను గుడ్డివాడుగా చేసేస్తాడని! ఎవ్వరో దైవాంశ సంభూతుడు ఈ పని చేస్తాడనుకున్నాను కానీ నీలాంటి అనామకుడు చేస్తాడనుకోలేదు.” అంటూ ఆ రాక్షసుడు రెండు చేతులూ పైకి ఎత్తి సముద్రాలకు అధిపతి, తన తండ్రి అయిన పొసైడన్‌ని స్మరించేడు. “తండ్రీ! ఇథకా రాజైన ఈ ఒడిస్సియస్‌ని శపించు. ఇతను ప్రాణాలతో ఇంటికి చేరకూడదని శపించు. ఇతను సముద్రంలో దారి తప్పిపోవాలి. ఇతని పడవలు సముద్రంలో ములిగిపోవాలి. ఇతను దారి పొడుక్కీ అష్టకష్టాలు పడాలి.”

అలా శాపనార్థాలు పెడుతూ సైక్లాప్స్ ఇందాకటికంటే పెద్ద రాయిని ఆ కొండచరియల నుండి ఊడబెరికి దానిని పడవమీదకు ఇందాకటి కంటే బలంగా విసిరేడు. ఇప్పుడు ఈ రాయి పడవకు అవతల పక్క పడింది. తత్ఫలితంగా పెద్ద కెరటం లేచింది. . ఈ కెరటం తాకిడికి పడవ రెండు రోజుల క్రితం గ్రీకులు తమ ఓడల గుంపుకి లంగరు వేసి నిలిపిన దీవి ఒడ్డు దగ్గరకు వచ్చిపడింది!

వీరి రాకకై అక్కడ ఎదురుచూస్తూన్న వారు వీరు సురక్షితంగా తిరిగి వచ్చేరని ఒక పక్క సంతోషం, హతమారిన ఆరుగురిని తలుచుకుని విచారంతో తికమక పడ్డారు.

ఆ రాత్రి, మేక మాంసంతో విందు చేసుకుని, ద్రాక్ష సారా సుష్టుగా తాగి అందరూ విశ్రమించేరు. తెల్లారగానే సిబ్బంది ఎవరి స్థానాలలో వారు చేరి, పడవలని ప్రయాణానికి సిద్ధం చేసేరు. లంగర్లు ఎత్తేరు, తెడ్లు వేసి పడవలని “మేకల ద్వీపం” ఒడ్డు నుండి బయటకు లాగి, సముద్రంలోనికి రాగానే తెరచాపలు లేవనెత్తి ప్రయాణం కొనసాగించారు! అనుకూలమైన పవనాలు వీస్తూ ఉంటే పడవలు జోరుగా పరుగులు తీస్తున్నాయి!

ఒడిస్సియస్ మాత్రం అన్యమనస్కుడై ఉన్నాడు. పాలీఫీమస్ పెట్టిన శాపం ఎంతవరకు నిజం అవుతుంది? పాలీఫీమస్ సముద్రదేవుడైన పొసైడన్ కొడుకు! పాలీఫీమస్ కన్ను పొడిచినందుకు పొసైడన్ కోపించి కక్ష తీర్చుకుంటాడా? ఎప్పుడు? ఎలా?

2.7 వాయుదేవుడి రాచమహలు

అనతి కాలంలోనే ఎదురుగా ఒక పచ్చటి ద్వీపం కనిపించింది! అక్కడ చిన్న గుట్ట మీద, పచ్చని చెట్ల మధ్య, పెద్ద కంచు కోట తళతళ మెరుస్తూ కనబడింది. ఆ కోట అంతర్భాగం నుండి ఆనందభరితమైన సంగీతం, కిలకిలారావాలు వినిపిస్తున్నాయి!

“సంగీతసౌరభాలతో నిండిన ఈ ద్వీపం గురించి నా పరిచయస్తులు చెప్పగా విన్నాను. ఇది వాయుదేవుడు ఈయోలస్ (Aeolus; EE-oh-lus) ద్వీపం. ఈ దేవుడు తన ఆరుగురు కొడుకులు, ఆరుగురు కూతుళ్ళతో ఇక్కడ నివసిస్తూ ఉంటాడు. రాత్రింబవళ్ళు వాళ్ళు కాల్చిన మాంసాన్ని తింటూ, ద్రాక్ష సారా తాగుతూ, సంగీతాన్ని వింటూ, హాయిగా కాలం గడిపేస్తూ ఉంటారు.” అన్నాడు ఒడిస్సియస్ .

“అది బాగానే ఉంది కానీ, మనం అక్కడకి పిలవని పేరంటంగా వెళితే మనని ఆదరిస్తారా?” నావికులు సైక్లాప్స్ పీడకల ఇంకా మరచిపోలేదు.

“వాయుదేవుడు దేవరాజు జూస్ స్నేహితుడు! జూస్ ఏమని చెప్పేడు? ‘అతిథి దేవో భవ’ అన్నాడు కదా. కనుక వాయుదేవుడు మనని తప్పకుండా ఆదరిస్తాడు.”

ఈ తడవ ఆశావహమైన ఒడిస్సియస్ మాటలు నిజం అయేయి!

ఒడిస్సియస్ అనుయాయులు సముద్రపుటొడ్డు చేరుకొని కంచు కోట దగ్గరకి వెళ్ళేసరికి వాయుదేవుడు ఈయోలస్ వీరందరినీ సాదరంగా ఆహ్వానించేడు. రాచమహలులో విడిది చేసి, తన కుటుంబ సభ్యులను కలుసుకొని వారితో విందు ఆరగించమని కూడా కోరేడు.

ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా ఇంటికి చేరుకోవాలని ఒడిస్సియస్ మనస్సులో తీవ్రమైన కోరిక ఉన్నా – తన సిబ్బంది పడరాని కష్టాలు పడి అలసి సొలసి ఉన్నారు, వారికి కాసింత విశ్రాంతి అవసరం. అందుకని ఒడిస్సియస్ వాయుదేవుడి ఆతిథ్యం స్వీకరించి ఒక నెల్లాళ్ళపాటు ఆ ద్వీపంలో ఉండడానికే మొగ్గు చూపేడు. అంతే కాదు. ఈ వాయుదేవుడు తన బృందం క్షేమంగా ఇంటికి చేరడానికి ఎంతయినా సహాయం చెయ్యగలడు.

అక్కడ ఉన్న నాలుగు వారాలూ నావిక సిబ్బంది ఆ రాచమహల్‌లో అందుబాటులోఉన్న అవకాశాలన్నిటిని అనుభవిస్తూ ఉంటే ఒడిస్సియస్ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని, వాయుదేవుడికి తన అనుభవాలు ఒకటీ ఒకటీ చెప్పడం మొదలు పెట్టేడు. గ్రీకులకి, ట్రోయ్ రాజ్యానికి మధ్య యుద్ధం రావడానికి కారణాలు, పదేళ్ళు ఘోరంగా జరిగిన యుద్ధం, చిట్టచివరికి గ్రీకులు కర్రగుర్రం ఉపయోగించి యుద్ధంలో విజయం సాధించిన పద్ధతి చెప్పుకొచ్చేడు.

వాయుదేవుడు ఈ కథను ఆద్యంతం ఎంతో కుతూహలంతో విన్నాడు. ఈ కథ చెప్పినందుకు ఒడిస్సియస్‌కి ఒక వరం ఇస్తానన్నాడు.

“వాయుదేవా! నా మీద దయ చూపినందుకు ధన్యుడను! నాకు మీరు చెయ్యవలసిన ఉపకారం ఒక్కటే. మేము ఇల్లు చేరుకునేవరకు తుపానులు, సుడిగాలులు లేకుండా మాకు అనుకూలమైన ఋతుపవనాలు ఉండేలా వరం ఇవ్వండి. నా భార్యను, పిల్లాడిని చూసి పదేళ్ళు దాటుతోంది.”

వాయుదేవుడు “సరే!” అన్నాడు. అని, వెంటనే తూరుపు గాలిని, పడమర గాలిని, ఉత్తరపు గాలిని, దక్షిణపు గాలిని పిలిచేడు. తుపాను గాలులను పిలిచేడు. ఒడిస్సియస్ ఇంటికి చేరేవరకు ఎవ్వరూ విజృంభించకుండా అదుపులో ఉండాలని ఉత్తర్వు జారీ చేసేడు.

అప్పుడు వాయుదేవుడు ఈయోలస్ ప్రపంచంలో ఉన్న గాలులన్నిటిని కూడగట్టి గొడ్డుచర్మంతో చేసిన సంచీలో భద్రపరచి, ఆ సంచీ మూతి బిగించి, గట్టిగా ఒక రజతపు రజ్జువుతో కట్టి పడేసేడు – ఇథకా వైపు వీచే ఒక్క పడమటి గాలిని మినహాయించి! ఆ సంచీని ఒడిస్సియస్ చేతికి ఇచ్చి, “ఇథకా చేరుకునే వరకు దీనిని మూతి తెరవకుండా భద్రంగా దాచు” అని ఆదేశించాడు. ఒడిస్సియస్ ఆ సంచిని జాగ్రత్తగా, రెండవకంటివాడికి తెలియకుండా, పడవలో ఒక మూలని ఉన్న పెట్టెలో పెట్టి దాచేడు.

ఒడిస్సియస్ బృందం అందరితో “వెళ్ళి వస్తాము” అంటూ మర్యాదపూర్వకమైన ఉపచారవాక్యము చెప్పి, సెలవు తీసుకుని, పడవలు ఎక్కేరు. పడమటి గాలి మెల్లగా పడవలను తోస్తూ ఉంటే వారి ప్రయాణం మళ్ళా మొదలయింది!

పడవలు జోరందుకుని పది రోజులపాటు నిరాటంకంగా పయనమయ్యాయి. పదవరోజు ఉదయం సుపరిచితమైన, చెట్లు, చేమలతో నిండిన ఇథకా కొండలు దూరంగా కనబడుతున్నాయి. ఒడిస్సియస్ హృదయం ఒక్కసారి ఉప్పొంగి పోయింది! ఇంకేముంది! ఒడుపు చూసుకుని, ఆటుపోట్ల వాటం చూసుకుని పడవలని ఒడ్డుకి చేర్చడమే! ఇహ ఇంటికి వచ్చేసినట్లే! సైక్లాప్స్ శాపం ఫలించలేదు!

పడవలు తీరం చేరుకుంటూ ఉంటే దూరంగా ఇళ్ళు కనబడుతున్నై. వంటగదుల గొట్టాలనుండి చిమ్ముతూన్న పొగలు కూడా కనబడుతున్నాయి. ఇప్పుడు పెనలొపీ కొడుకు కోసం వంట చేసి పెడుతూ ఉండాలి. కుర్రాడికి ఇప్పుడు పదేళ్ళు వచ్చి ఉంటాయి. తనని గుర్తుపట్టగలడా? ఎలా గుర్తుపట్టగలడు? పెనలొపీ చెప్పాలి. వయస్సు మీరుతూన్న తన తల్లిదండ్రులు ఇంకా బ్రతికే ఉన్నారా? దేవుడి దయ ఉంటే వాళ్ళని కూడా చూడగలడు! …..

ఇలా ఆలోచనలు పరుగులు తీస్తూ ఉంటే వెచ్చటి పడమర గాలులు పడవలని నెమ్మదిగా దరికి చేరుస్తున్నాయి. ఒడిస్సియస్‌కి మగతగా నిద్ర కమ్ముకొచ్చింది!

అతను నిద్రపోతూ ఉండగా కొంతమంది నావికులు గుసగుసలాడుకోవడం మొదలు పెట్టేరు.

“వాయుదేవుడు ఒడిస్సియస్‌కి ఇచ్చిన సంచిలో ఏముందో? ఎంతో రహస్యంగా తీసుకెళ్ళి దాచేడు ఒడిస్సియస్!”

“మూడొంతులు వాయుదేవుడు ఒడిస్సియస్‌కి ఇచ్చిన బహుమానాలు అయి ఉంటాయి! బంగారం, వజ్రాలు, వగైరా! అక్కడ భవనంలో చూసాము కదా!”

“వాయుదేవుడు ఒడిస్సియస్ ఒక్కడికే ఎందుకు ఇచ్చాడు? మనం అంతా ఒళ్ళు విరిచి పని చేస్తున్నాము కదా!”

“ఒడ్డుకు చేరిన తరువాత మనకీ వాటా ఇస్తాడు. ఒడిస్సియస్ మంచివాడే కదా!”

“ఏమో! ఏం చేస్తాడో! ఇస్తాడో! కాజేస్తాడో! ‘ఓడ దాటేవరకు ఓడ మల్లయ్య, ఓడ దాటిన తరువాత బోడి మల్లయ్య’ అన్నారు కదా!”

“ఒడిస్సియస్ కునుకు తీస్తున్నాడు. అతడు లేచేలోగా ఆ సంచీలో ఏం ఉందో చూద్దాం. అప్పుడు కర్తవ్యం ఆలోచిద్దాం!”

ఇలా అలోచించి, ఆ నావికులు పడవ అంతా గాలించేరు, ఆ సంచీ కోసం! అది ఒక మారుమూల కనిపించింది. వెండి రజ్జువుతో గట్టిగా మూట గట్టి ఉన్న ఆ మూటను గబగబా తెరిచేరు!

ఏముంది! ఆ సంచీనుండి బుస్సుమంటూ తుపాను గాలులు, పెనుగాలులు సుళ్ళు తిరుగుతూ బయటకు వచ్చేయి! ఆ దెబ్బకు పడవలు అన్నీ ఒక్క ఉదుటున గాలిలోకి ఎగిరిపోయి, ఆ సుడిగాలిలో యోజనాల దూరం కొట్టుకుపోయి, సముద్రం మధ్యలో పడ్డాయి. కనబడ్డట్టే కనబడ్డ ఇథకా కనుచూపు మేరలో కనబడకుండా పోయింది.

అప్పుడే కునుకుపట్టి నిద్రలోకి జారుకున్న ఒడిస్సియస్ గభాల్న లేచేడు. పడవల ప్రయాణాన్ని సరిదిద్దడానికి ప్రయత్నించేడు. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. శివమెత్తిన ఆ తుపాను గాలులతో పోరాటం చేయలేకపోయాడు! ఆ పెనుగాలి వీచి వీచి ఆ పడవలను ఎక్కడ బయలుదేరేయో అక్కడకి – అనగా వాయుదేవుడి ద్వీపానికి – చేరవేసింది!

ఒడ్డుకు చేరుకోగానే ఒడిస్సియస్ కంచు కోట లోపలికి పరిగెట్టుకుని వెళ్ళేడు. వాయుదేవుడు ఈయోలస్ తన పన్నెండుమంది పిల్లలతోటీ విందు భోజనం ఆరగిస్తున్నాడు.

ఎదుటపడడానికి సిగ్గుపడుతూ ఒడిస్సియస్ ఒక మూల నక్కి నిలబడ్డాడు, వాయుదేవుడు అటుపక్క చూస్తాడేమోనని!

వాయుదేవుడి కొడుకులలో ఒకడు ఒడిస్సియస్‌ని గమనించి, “ఏం జరిగింది, ఒడిస్సియస్? తిరిగి వచ్చేవు?”

ఒడిస్సియస్ అణకువతో ఒక అడుగు ముందుకి వేసి, జరిగిన సంగతి అంతా పూసగుచ్చినట్లు చెప్పేడు. “తుపాను గాలులను మళ్ళా మూటకట్టి సంచీలో పెట్టడానికి వీలవుతుందా?” అని భయపడుతూనే అడిగేడు.

“వీలు కాదు, ఒడిస్సియస్!” కొంచెం కోపంగానే అన్నాడు వాయుదేవుడు ఈయోలస్. “నువ్వు శాపగ్రస్తుడివి! నీ మీద సైక్లాప్స్ శాపం ఉంది. ఇహ మేము సహాయం అందించలేము!

“ఇంక త్వరగా వెళ్ళు! నీకు మేము సహాయం చేసేమని తెలిస్తే మేము శాపగ్రస్తులం అవుతాము. మా ద్వీపాన్ని తక్షణం వదలిపెట్టి నీ దారి నువ్వు చూసుకో!”

వాయుదేవుడు అంటున్నది నిజమే అని ఒడిస్సియస్‌కి తెలుసు. తన కొడుకుపై చేసిన అత్యాచారానికి సముద్రదేవుడు పొసైడన్ కోపించేడు. సందేహం లేదు.

దీనవదనంతో ఒడిస్సియస్ తిరిగి పడవల దగ్గరకి వచ్చేడు. తెరచాపలు ఎత్తి ప్రయాణం కొనసాగించమని ఉత్తర్వులు ఇచ్చేడు. సిబ్బంది తాము కుతూహలంతోటీ, అసూయతోటీ చేసిన అపరాధానికి లెంపలు వేసుకున్నారు. పడవలు ముందుకు కదిలాయి.

భార్యనూ, కొడుకునూ తలచుకుంటూ, విచారవదనుడై, మంచి రోజుల కొరకు ఎదురు చూడడం తప్ప ఒడిస్సియస్‌కి ప్రత్యామ్నాయం కనబడలేదు!

2.8 ఉపసంహారము

ఒక వైపు ఒడిస్సియస్ ఇంటి గురించి బెంగ పెట్టుకుంటూ ఉంటే, వేరొక వైపు, అతని భార్య పెనలొపీ అతని రాక కోసం పరితపిస్తోంది!

ఏళ్ళు గడుస్తూన్న కొలదీ, అడపా తడపా, ట్రోయ్ యుద్ధపు వార్తలు ఇథకా దాకా వస్తున్నాయి. యుద్ధంలో వీరస్వర్గం పొందినవారి గురించి కానీ, తిరిగి వస్తూ దారిలో తుపానులకు, ప్రమాదాలకు గురయి మరణించినవారి గురించి కానీ వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఒడిస్సియస్ గురించి ఎటువంటి వార్తా వినబడడం లేదు.

ఇథకా పౌరులు చాలామంది ఒడిస్సియస్ యుద్ధంలో చచ్చిపోయాడో, లేక తిరుగు ప్రయాణంలో మరణించాడో అనే అనుకున్నారు! ఒడిస్సియస్ తల్లి కొడుకు రాక కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసి, చివరికి ఆశ వదులుకొని, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది! కొడుకు, భార్య ఎదురుగా లేకపోయేసరికి ఒడిస్సియస్ తండ్రికి జీవితం మీద విరక్తి పుట్టి ఏకాంతంగా బ్రతకడానికి రాజభవనం వదలి వెళ్ళిపోయేడు!

ఇన్ని కష్టాలు ఎదురవుతూన్నా పెనలొపీ మాత్రం భర్త తిరిగి వస్తాడనే ఆశ వదులుకోలేదు. వాకిట్లో కాకి గెంతినప్పుడల్లా ఒడిస్సియస్ వచ్చేసేడేమోనని ఆశగా ఎదురుచూసేది! ఎదుగుతూన్న తన కొడుకు టెలెమాకస్ ముఖం చూసినప్పుడల్లా ఆమెకు ఒడిస్సియస్ జ్ఞాపకం వస్తూ ఉంటాడు. ఆ బాలుడు ముమ్మూర్తులా తండ్రి పోలికే!

ఆ మధ్య పెద్ద తుపాను వచ్చిన రాత్రి ఒడిస్సియస్ బృందం ఇథకా ఒడ్డుకి దరిదాపు వచ్చేసారన్న సంగతి పెనలొపీకి కానీ, టెలెమాకస్‌కి కానీ తెలియనే తెలియదు! ఆ తల్లికి, ఆ బిడ్డకు ఒడిస్సియస్ కనబడేసరికి ఇంకా ఎన్నాళ్ళు, ఎన్నేళ్ళు పడుతుందో కూడా వారికి తెలియదు!

(సశేషం)


వేమూరి వేంకటేశ్వర రావు

రచయిత వేమూరి వేంకటేశ్వర రావు గురించి:

వేమూరి వేంకటేశ్వరరావుగారు వృత్తిరీత్యా, యూనివర్సిటీ అఫ్ కేలిఫోర్నియాలో, కంప్యూటర్ సైన్సు విభాగంలో, ఆచార్య పదవిలో పనిచేసి పదవీవిరమణ చేసారు. తెలుగు విజ్ఞానశాస్త్ర రచయితగా, నిఘంటు నిర్మాతగా పేరొందారు. ఆధునిక విజ్ఞానశాస్త్రాన్ని జనరంజక శైలిలో రాయటంలో సిద్ధహస్తులు. వేమూరి తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు, వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు, పర్యాయపదకోశం వీరు నిర్మించిన నిఘంటువులు.

 ...