మూత్రపు ఒత్తిడికి అతడి కల కరిగిపోయింది. స్పష్టమైన, అన్ని సూక్ష్మ వివరాలతో కూడిన కల. ఏదో ఉద్వేగపూరిత సంచలనం. కానీ అది దేనిగురించో గుర్తురాలేదు. దాని తాలూకు భావన మాత్రం కొంచెం లోలోన ఇంకినట్టుగా ఉంది. గుర్తుచేసుకోవడానికి ప్రయత్నిస్తూ అలాగే పడుకున్నాడు. ఉదయపు నిశ్శబ్దం పరుచుకొనివుంది. చిమ్మెటలు ఇంకా లాలి పాడుతున్నాయి. ఎంత కప్పుకుంటే అంత చలేసే చలికాలం. పిల్లాడు పక్కన వెచ్చగా తగిలాడు. కొడుకు పెరిగినకొద్దీ బెడ్ చాలడం లేదు. అయినా యూనిట్ టెస్ట్ గనక ఉంటే, ‘ఆల్ ద బెస్ట్ చెప్పు నానా’ అనేంత చిన్నోడు! ఆ మాటకు అంత శక్తి ఉందని వాడి ద్వారానే గ్రహించడం! రాత్రి దేనికో అలిగి, కింద పడుకున్నాడు. ఎప్పుడొచ్చి పక్కలో దూరాడో! యువకుడినని భావించే చిన్నపిల్లాడి దశ– కౌమారం. ఎన్నిసార్లు సరిచేయనీ, నిద్రలో చద్దరును తన్నేస్తూనే ఉంటాడు. మరోసారి సరిచేసి, కిటికీ రెక్కను ఇంకాస్త మూశాడు. మధ్యలో ఉన్న పిల్లాడిని దాటేస్తూ, మంచం చివరికి వచ్చాడు. నిద్ర నుంచి ఎప్పుడు మేల్కొన్నా, అతడు వెంటనే పైకి లేవడు. ఓ రెండు నిమిషాలు కోడు మీద అలా ధ్యానంగా కూర్చుంటాడు. మంచానికి ఇటువైపున్న భార్య అతడి సామీప్యతను గుర్తించినట్టుగా చిన్న మూలుగుతో దగ్గరికి జరిగింది. ఆ వెచ్చదనాన్ని అనుభవిస్తున్నట్టుగా ఒక క్షణం అలా ఉండి, ఆమెను సున్నితంగా పక్కకు జరిపి, మౌనంగా కూర్చున్నాడు. కానీ మౌనంలో మాటలు ఎక్కువవుతాయి. అసలు వచ్చింది ఒకే కలేనా? ఒక కలలోంచి ఇంకో కలలోకి దూకానా? ఒకే కలకు అవి రెండు భాగాలా? కలలో జరిగిందేదీ తెల్లారికి ఎందుకు గుర్తుండదు? అది ఎలాంటిదైనా అనుభవించిన క్షణమే సత్యం. ఒకరి జీవితంలో జరిగిందేదీ అతడి జీవితం అనంతరం లోకానికి గుర్తుండదు. అనుభవించిన మనిషికే అది ప్రాధాన్యం. కలలో జరిగిందేదీ తెల్లారికి గుర్తుండదుగానీ ప్రయత్నిస్తే కొన్ని ఆనవాళ్ళు దొరకొచ్చు. అట్లాగే జీవితం అనంతరం మనిషిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే ఏవో కొన్ని జ్ఞాపకాలు దొరకొచ్చు. అంతకుమించి ఏమీ లేదు.
నెమ్మదిగా లేచి, బాత్రూమ్ వైపు నడిచాడు. తలలో సన్న పోటు ఏదో తెలిసింది. శరీరాన్ని గమనించుకోవడం మొదలుపెట్టినప్పటినుంచీ చిన్న సంవేదనలు కూడా బ్లోఅప్‌లో కనబడుతున్నాయి. మూత్రం పోస్తున్నప్పుడు శరీరం విడుదల చేసిన పలుచటి వాసనను అతడి ముక్కు గ్రహించింది. అది దేన్నో పోలివుంది. కానీ అదేమిటో స్ఫురించలేదు. ముందు నెమ్మదిగా మొదలై పెద్దగా ధార విప్పుకుంది. పొద్దుటి పూటకే ఉండే సహజమైన నిడుపుతో అది నిలబడి ఉంది. చివరి చుక్క జారడానికి ముందు ఒళ్ళు చిన్నగా జలదరించడాన్ని అనుభవించాడు. అసలు ఇది వదలడానికి ఎన్ని కండరాలు సహకరించుకుని ఉంటాయి? కొన్ని ముడుచుకుని, కొన్ని సాగి, సరిగ్గా ఆ ఒత్తిడి కదలిక వచ్చేట్టుగా సమన్వయం చేసుకుని. మొన్నెక్కడో చదివాడు, అసలు చర్మం పై పొర ఒక నెలలో మొత్తం పొట్టు పొట్టుగా రాలిపోయి మళ్ళీ కొత్తది పుట్టుకొస్తుందట. ఇన్నాళ్ళూ తెలియనేలేదే అని ఆశ్చర్యం కలిగింది. కణాలు పుడుతుంటాయి, గిడుతుంటాయి అనుకోవడమేగానీ అది మరీ ఇంతలా ఉంటుందని అనుకోలేదు. నిజంగా తనకేం తెలుసు? అసలు ఇంత వయసొచ్చేదాకా వెంట్రుకలు ఇక్కడ కూడా తెల్లబడతాయని తెలియనేలేదు. ఇట్లా ఎన్ని తెలియకుండానే చచ్చిపోతాం? ఉన్నట్టుండి ఇందాక కలలో కనబడింది నాన్న అని గుర్తొచ్చింది. అవును, నాన్న. నాన్నేనా?
ఒకరోజు నాన్న ఎత్తుపీట మీంచి ముందుకు తూలి పడ్డాడు. ముఖం కొట్టుకుపోయింది. ఒక పన్ను విరిగిపోయింది. ఏ రాత్రో ఇలాగే మూత్రం పోయడానికి లేచాడు. టైమ్ ఎంతవుతుందో కూడా తెలీదు. లేవడమే గుర్తుంది. ఆయన ముందింట్లో పెద్ద పీట మీద పడుకుంటాడు. అమ్మ దానికి ఎదురుగా ఉండే గదిలో మంచం వేసుకుంటుంది. మూత్రానికి మధ్యమధ్యలో లేస్తూనే ఉంటాడు. ఎప్పుడు లేచినా, మోకాలి నొప్పుల కాళ్ళను సిద్ధం చేయడానికి కాసేపు అలా కూర్చునిగానీ పైకి లేవడు. కానీ ఆ రోజు ఏం జరిగిందో! “నేను లేచి కూర్చున్నదే గుర్తుంది, పడ్డదే గుర్తుందిరా. ఎట్లా పడ్డనో, ఆ మధ్యలో ఏం జరిగిందో అర్థమే కాలేదు.”
అతడికి మళ్ళీ పడుకోబుద్ధి కాలేదు. నిద్ర కూడా పట్టేట్టు లేదు. నిద్రపోతున్న వాళ్ల మీద లైటు పడకుండా హాల్లోది కాకుండా కిచెన్‌లో లైటు వేశాడు. హాల్లోకి వచ్చి, ముందటి తలుపు తీసి, బాల్కనీలోకి వచ్చాడు. ఇంకా మబ్బుగానే ఉంది. చల్లటి గాలి ముఖానికి కొట్టింది. వాళ్ళ రెండంతస్తుల ఇంటిముందున్న పెద్ద వేపచెట్టు ఆకులు వీధి దీపాలకు గుడ్డిగా వెలుగుతున్నాయి. అప్పుడే తెల్లారినట్టుగా చిన్న పిట్టొకటి కిచకిచమంటోంది. ఆ చెట్టును చూస్తే అతడికి ఊరు గుర్తొస్తుంది. ఇట్లాంటి చెట్లు కొన్నయినా ఈ కాలనీలో ఉండబట్టిగానీ లేకుంటే అతడికి ఊపిరి ఆడకపోయేది. ఇంటి కిరాయిలో ఒక వెయ్యి రూపాయలు ఈ చెట్టు కోసమే పెడుతున్నాననుకుంటాడు. ‘అమ్మా, వేపమాత.’ ఆ చలిలోనే, చీకట్లోనే కూరగాయల బళ్ళు అవీ అప్పటికే మార్కెట్ వైపు పోతున్నాయి. ఈ నగరం అసలు నిద్రే పోదు. వెళ్ళి, కిలోల్లో కొనుక్కుని, మళ్ళీ వెనక్కి తెచ్చి, ఎక్కడెక్కడో తిరిగి అమ్మి, తిరిగి ఎప్పటికో ఇండ్లకు చేరుకుని! ఒక్కొక్కరి జీవన పోరాటం చూస్తుంటే తను ఎంత మెరుగ్గా ఉన్నాడో అనిపిస్తుంది. కానీ ఈ వయసులో ఊరిలో ఉన్న అమ్మానాన్నలకు తోడుగా ఉండట్లేదని గిలి ఉంటుంది. మరి ఈ ఉద్యోగం, పిల్లాడి చదువు… నెలకో రెండు నెలలకో వెళ్తూనే ఉంటాడు. కానీ దీన్ని పెంచాలి. నెలలో ఓ మొదటి ఆదివారం అలా ఒక డిసిప్లిన్ పెట్టుకోవాలి.
కింద పడ్డాక నాన్న అలా ఎంత సేపున్నాడో! అమ్మ లేచి చూసేదాకా ఆయనకు సోయే లేదు. ఆ ముందటి పన్ను సరిగ్గా నేలకు గుద్దుకున్నప్పుడు అది పెదవికి గుచ్చుకుంది. బనీను మీదంతా నెత్తురు. అమ్మ లేపి, అంతా శుభ్రం చేసింది. పక్కింట్లో ఉండే ‘తమ్ముడు’ వచ్చి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఇంత జరిగినా తనకు ఫోన్ కూడా చేయలేదు. కంగారు పడతాడని నాన్నే వద్దన్నాడట. ఇంత జరిగింది చెప్పకపోతే తిడతాడని తర్వాతెప్పుడో అమ్మ చేయించింది. నిజంగానే వెంటనే చెప్పనందుకు కోపమొచ్చింది కూడా. మొండిగా సెలవు పెట్టి నాల్రోజులు ఊరిలో ఉండొచ్చాడు. కానీ ఇదంతా గుర్తుకొచ్చినప్పుడల్లా నాన్న ఆరోగ్యం గురించి భయమవుతుంటుంది. నాన్న దాన్ని ఎంత మామూలుగా చెప్పినా, ఆ పన్ను నేలను గుద్దుకోవడం అనే ఊహ వచ్చినప్పుడల్లా అతడు నిలువునా నీరవుతాడు.
అతడి కడుపులో చిన్నగా ముల్లు కదిలినట్టయింది. అదొక సంకేతం. బాల్కనీలోంచి మళ్ళీ ఇంట్లోకి వచ్చాడు. ముందటి తలుపు మూసి, మళ్ళీ బాత్రూములోకి వెళ్లాడు. కడుపును తేలిక పరుచుకున్నాక, కళ్ళ మీద నీళ్ళ చల్లదనాన్ని అనుభవిస్తూ ముఖం కడుక్కున్నాడు. బట్టగా మార్చుకున్న మెత్తటి పాత పొడి బనీనుతో ముఖం తుడుచుకున్నాడు. చేసుకోగలిగితే జీవితాన్ని కొంత సుఖపెట్టుకోవచ్చు! బయటికి వెళ్ళబోయే జాగ్రత్తతో కంట్లో పుసులు ఏమైనా ఉన్నాయేమో అని అద్దంలో చూసుకున్నాడు. మామూలుగానైతే కనబడేది కాదు; అసలే ఇవ్వాళ స్లోమోషన్‌లో ఉన్నాడేమో విస్కర్స్ మీదికి చూపు మళ్ళింది. నిన్న హెయిర్ కట్ చేయించినప్పుడు, గడ్డం ఇంట్లో ట్రిమ్ చేసుకోవడానికి వీలుగా విస్కర్స్ మీద చిన్న కాటు పెట్టి వదిలేయమన్నాడు. తాను ఎటూ క్లీవ్ షేవ్ చేసుకుంటాననుకున్నాడో ఏమో (జస్ట్ ట్రిమ్ అని ఊహించలేక) మంగలి అక్కడ కాటు పెట్టకుండా అరంగుళం మేర గీకి వదిలేశాడు. వచ్చాక తను అనుకున్నట్టుగానే ట్రిమ్ చేసుకున్నాడు. కానీ ఒక్కరోజులో ఈ ట్రిమ్ చేసిన గడ్డానికీ, ఆ షేవ్ మేరా గడ్డానికీ పెరుగుదలలో తేడా ఉంది. తేడా మిల్లీమీటరు కూడా కాకపోవచ్చు, ఎవరూ గ్రహించలేకపోవచ్చు, కానీ తేడా తేడానే! అది ఎంత విస్మరించదగినది అయినా సరే అదొకటి అంటూ ఉండకుండా పోదు. మళ్ళీ రెండింటినీ మ్యాచ్ చేయాలంటే మరో గడ్డం దాకా ఆగాల్సిందే. ఒక చర్యకు దానికి తగిన ఫలితం ఇది. చిన్నప్పుడు ఆడుకుంటూ, ఒక్కోసారి కొప్పురగా నీటిని నింపిన గ్లాసులోకి ఒక చుక్కను వేలితో వదిలేవాడు. అప్పుడూ గ్లాసు అంతే నిండుగా కనబడేది. కానీ ఇప్పుడు ఒక చుక్క నీరు అదనంగా ఉందనేది కాదనలేని నిజం. ఈ ప్రపంచం అంతా ఎన్ని సూక్ష్మ చర్యల ఫలితం! నాన్నకు కూడా ఆ తొస్సిపోయిన నోరు చూడటానికి బాగాలేదని పెట్టుడు పన్ను పెట్టించారు. అంతా బానేవుంటుందిగానీ ఆ పన్ను ఒక మిల్లీమీటరులో ఒక వంతు పొడువు ఎక్కువుంటుంది. దాన్ని ఎవరూ గుర్తించలేరు. కానీ ఆయనకు తెలుసు. అద్దంలో ముఖం చూసుకున్నప్పుడల్లా ఆయన చేయి ఆ పన్ను మీదికి పోతుంది.
భార్య, కొడుకు ఇంకా నిద్రలోనే ఉన్నారు. లేస్తార్లే, ఇవ్వాళ ఎటూ ఆదివారం. భార్య నైటీని సరిచేసి, చెద్దరు సరిగ్గా కప్పాడు. ఇదీ చిన్నపిల్లకు తక్కువేం కాదు. నడకకు బయల్దేరదామని అతడు టీషర్ట్ వేసుకున్నాడు. నైట్ ప్యాంట్ లోపల లంగోటి కట్టుకున్నాడు. కొంచెం పాత పద్ధతే. కానీ ఇదే తనకు బాగుంటుంది. భార్య లోపలి వైపు తలుపు గడియ పెట్టుకుంటుందన్న ఉద్దేశంతో, చెవి దగ్గర మెల్లగా ‘అమ్మి’ అన్నాడు. వినబడినట్టుగా చిన్నగా కదిలింది. తలుపు దగ్గరగా వేసి, వెళ్ళబోయేవాడే, భార్య వస్తున్నట్టుగా అడుగుల చప్పుడు తెలియకపోవడంతో క్షణం అలా నిలబడ్డాడు. ఉదయపు వెలుతురు పెరిగింది. వేపచెట్టు మీద పిట్టలు ఒకటే అరుస్తున్నాయి. కొమ్మల్లో చిక్కుకున్న పతంగొకటి పైకీ కిందికీ ఆడుతోంది. యథాలాపంగా చూపు చెట్టు ఒక మండపై పడింది. నమ్మలేనట్టుగా మళ్ళీ చూశాడు. ఒక కాకి తన కాళ్ళ సందులో చిన్న పిట్టను పట్టుకుని పొడుచుకుని తింటోంది. ఏం చేయాలిప్పుడు? పిచ్చి ఆరాటం తప్పితే ఏం చేయగలం? అప్పటికే బలహీనంగా కదులుతున్న పిట్ట కాలిలో కదలిక నిలిచిపోయింది. కళ్ళు మూసుకోవడం ద్వారా నచ్చని ప్రపంచాన్ని రద్దు చేసుకోవడానికి ప్రయత్నించాడు. మంచి ఉదయంలో అసహజ దృశ్యం. ఏమో, ఇదే సహజమేమో అనుకుంటూ, అసలు తాను అక్కడ ఎందుకు ఆగింది మరిచిపోయి కిందికి దిగాడు. పొద్దుటి తలపోటుకు వికారం తోడయ్యింది. కింది పోర్షన్‌వాళ్ళు ఎటో ప్రయాణమవుతున్నట్టున్నారు, ఓలా క్యాబ్ ఆగివుంది. వాళ్ళ వైపు పలకరింపుగా నవ్వి పార్కు వైపు నడిచాడు. చిన్న కాలనీ అది. పాల కుర్రాడు సైకిల్ మీద వెళ్తున్నాడు. రాత్రి గాలికి రాలిన పసుప్పచ్చ పూలు తివాచీలా పరుచుకుని ఉన్నాయి. పొద్దుపొద్దున్నే ‘గులాప్పూల్’ అంటూ ఎప్పటినుంచో మాట మాత్రమే వినబడుతున్న మనిషి ముఖాన్ని మొదటిసారి చూశాడు. దీపాల వెలుగులో దుమ్ము రేగుతుండగా ఇద్దరు ఆడవాళ్ళు వీధిని ఊడుస్తున్నారు. రోడ్డు పక్కన చెట్టుకింద రాలిన పారిజాతాలు ఎవరో ఏరుతున్నారు. ఎప్పుడైనా అతడూ తెస్తుంటాడు. పారిజాతాలంటే అతడికి ఇష్టం. అతడికి ఇష్టమని వాళ్ళ నాన్న ప్రత్యేకంగా పారిజాతం చెట్టును పెంచాడు. ఆ పొడి వెలుతురులో తేలుతున్న దుమ్ముకు ఆ పారిజాతాల ఊహా సువాసన జతవుతూ, ఉన్నట్టుండి అతడిలో ఏదో విడివడిన ఆనందం చిమ్మింది. పొద్దుటి మూత్రపు వాసన గుర్తొచ్చింది. అది తాను ఎప్పుడో మరిచిపోయిన సాయంత్రపు వరి పొలాల మీదుగా వీచే ఉడుకు మట్టినీళ్ళ వాసన! ఆ వెంటనే చిన్నప్పుడు చేనుగట్టు మీద ఒక సాయంత్రం నాన్న పక్కన కూర్చున్నప్పుడు, తాత చివరి రోజుల్లో వచ్చిన కల గురించి చెప్పింది గుర్తొచ్చింది. ఓ, అయితే కలలో కనబడింది తాత అన్నమాట! తాత తనకు ఏదో చెబుతున్నాడు. కానీ తాతను అతడు ఎప్పుడూ చూడలేదు. తండ్రి తనకు చెప్పింది తాత తనతో చెప్పినట్టుగా కలలో కనబడింది కావొచ్చు. ఒక కల గురించి పంచుకునే కల అది. అసలు తాతతో ఉన్నది తనేనో, నాన్నేనో? ఏమో, తన కొడుకో? ఆ ఇద్దరు ఎవరైనా కావొచ్చు. రక్తసంబంధీకుల మధ్య జరిగిన సంభాషణ అది. ఏదో ఒక అవిచ్ఛిన్న పరంపర. ఒకరోజు తాత కలలో యముని బంటు వచ్చి పక్కలో పడుకున్నాడట. అవి ఉగాది రోజులు. ‘ఎవడ్రా నువ్వు, నా పక్కలో పడుకున్నవు?’ అని తాత అతడిని కాలితో గట్టిగా తన్నాడట. అంతే! ఆ కాలు అటే కదలకుండా అయిపోయింది. తెల్లవారి నిద్రలేచినా కాలు కదల్లేదు (పక్షవాతం). పలకరించడానికి వచ్చినవాళ్ళతో ‘నేను దేవుడి దగ్గరికి పోతున్నా, నేను మా నాయిన దగ్గరికి పోతున్నా’ అని పలవరించడం మొదలుపెట్టాడట. రెండో రోజుకి ఆ ఉన్న మాట కూడా పడిపోయింది. మూడో నాటికి విషయం అర్థమైపోయి జంగమయ్యకు కబురుపెట్టారు. ఆయన తెచ్చిన శంఖుతీర్థం తాత నోట్లో పోస్తుండగానే– తీర్థం అటు, ప్రాణం ఇటు! ఏ అనారోగ్యం లేకుండా, ఎవరితోనూ చేయించుకోకుండా ఒక ఊరికి పోయినంత మామూలుగా చనిపోయాడని వాడకట్టువాళ్ళు చెప్పుకున్నారట. సరిగ్గా తాత చనిపోయిన ఏడాదికి నువ్వు పుట్టావని నాన్న సంబరంగా చెబుతుంటాడు. ‘ఆయన నలలో పోతే, నువ్వు పింగళలో పుట్టినవు. అందుకే తాత పేరే నీకు పెట్టినం.’ ఆ చేనుగట్టు మీద చెప్పిన కలని అవే ప్రాథమిక వివరాలతో, భిన్న ఉద్వేగాలతో ఆ తర్వాత కూడా నాన్న భిన్న సందర్భాల్లో పంచుకున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా మారనిది మాత్రం ఒకటే: ‘నాయినలాంటి చావు అందరికీ రాదు.’ ఇదంతా వింటున్నప్పుడు చిన్నతనంలో అతడి ఫోకస్ అంతా తాత మీద ఉండేది కాబట్టి, తెలియని తాతను పరిచయం చేసుకోవడంలా ఉండి సంతోషం వేసేది. వయసు పెరిగినకొద్దీ ఆ ఫోకస్ అంతా తాతలా అనాయాసంగా చనిపోవాలన్నట్టుగా ధ్వనించే నాన్న కోరిక దగ్గర ఆగేది. అమ్మ కూడా ‘మాకు అగ్గి పెట్టే కొడుకవురా నువ్వు’ అని మురిపెం చూపినప్పుడు ఆ చిన్నతనంలో తెలియలేదుగానీ, వాళ్ళ మరణ సంసిద్ధత తాలూకు తీవ్రత ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. నాకు ఇప్పుడు ఏమైందని నాన్న అన్నాడే అనుకో; కానీ ఆ పెద్దపీట మీదినుంచి పడుతూనే అంతకంటే పెద్దది జరిగివుంటే! సన్నటి భయం అతడి ఒళ్ళంతా పాకింది. అంతా యథావిధిగానే జరుగుతుంది, అయినా ఏదో మారిపోతుంది. ఎప్పుడైనా దేనికైనా వెళ్ళగలిగే ఒక మనిషి ఉండడు. ఆయన ఇచ్చే ఒక్క సలహా కూడా పాటించకపోవచ్చు, కానీ తన ఆలోచనల నిర్మాణానికి ఒక ఊతం ఉండదు. అంతకుముందటి ధైర్యం ఏదో ఇగిరిపోతుంది. అలాంటిది ఒకటి ఉందని అంతకుముందు పట్టించుకోనిది. వాళ్ళతో రోజూ మాట్లాడకపోయినా, తరచూ వెళ్ళకపోయినా ఊరిలో ఇల్లు అనేది ఆత్మను ముడేసుకునే ప్రదేశం. లేదంటే ఈ ఆత్మ శూన్యంలో గిరికీలు కొట్టాల్సి వస్తుంది. ప్రకృతి అనివార్యత అనేది అసంబద్ధచర్యలా తోచింది.
కాలనీలోని పార్కు బాగుంటుంది. కానీ గట్టిగా నాలుగు అడుగులు వేస్తే మొదటికొచ్చేంత చిన్నది. చతురస్రాన్ని పోలిన పెద్ద వృత్తం, మధ్యలో ఒక అడ్డతోవ. చుట్టూ కొన్ని రాతిబల్లలు. కాకపోతే ఇంత పొద్దున్నే మనుషులు పెద్దగా లేరు. మెల్లిగా పెరుగుతుంటారు. ఈమధ్య అసలే ఆరోగ్యస్పృహ పెరిగింది. అతడూ రోజూ వద్దామనుకుంటూనే ఉంటాడు. కానీ కాడలు పోతూనే ఉంటాయి. అతడు రెండు రకాలుగా నడవగలడు. వేగంగా కాళ్ళు ముందుకు ముడుస్తూ ఒకటి, నెమ్మదిగా కాళ్ళను వెనక్కి నిర్రదొక్కుకుంటూ ఇంకొకటి. నడక ముందు నెమ్మదిగా మొదలుపెట్టి, తర్వాత వేగం పెంచాడు. నడక కొద్దిగా ఊపందుకుంటూనే చలి వెనక్కిపోయింది. దాంతో ఆ వేగపు నడకకే మరింత వేగం పెంచాడు. ఎవరూ లేనప్పుడే పార్కునంతటినీ ఆబగా అందుకోవాలన్నట్టుగా దబదబా నడుస్తూ సరిగ్గా అమరని ఉబ్బు టైల్ వల్ల ఓసారి తొట్రుపడ్డా రౌండ్ల మీద రౌండ్లు తిరిగాడు. నెమ్మదిగా నడుస్తున్నవాళ్ళను ఇట్టే దాటేశాడు. వేగంగా నడుస్తున్నవాళ్ళను అంతకంటే వేగంగా నడిచి అధిగమించాడు. మాట్లాడుకుంటూ నడుస్తున్నవాళ్ళను అరవృత్తం తిరగడం ద్వారా తప్పించాడు. చర్మం మీద కొద్దిగా తేమను గ్రహించేదాకా అలాగే చేశాడు. అప్పటికి ఎంతసేపయ్యిందో! రెండో అంకమైన వ్యాయామానికి సమాయత్తం అయ్యాడు. అప్పటికి మనుషులు పెరిగారు. ఉత్తికాళ్ళతో నడిచేవాళ్ళు, ఫోన్లలో పాటలు వింటూ నడిచేవాళ్ళు, నడక చాలించి యోగాసనాలు వేయడానికి సిద్ధమవుతున్నవాళ్ళు… పొద్దు పొడుపు మొదలవుతోంది. లేత ఎండ చెట్ల కొమ్మల మధ్య నుంచి పడి విడిపోతోంది. ఇదే మనిషి అనుభవించగలిగే సౌభాగ్యం. సూర్యుడికి అభిముఖంగా నిలుచుని తేలికపాటి వ్యాయామం మొదలుపెట్టాడు. వంచుతూ మెలికలు తిప్పుతూ జోరుగా ఒంటిని కదిలిస్తున్నాడు. చమట స్పష్టంగా తెలుస్తోంది. పెరిగిన ఎండ చర్మంలోకి హాయిగా ఇంకిపోతూ ఉంది. పై చర్మాన్ని దాటి లోపలికి చొచ్చుకుపోతోంది. అలసట మొదలైంది. ఆ అలసటలో శ్వాసవేగం పెరిగింది. ఆ చలిలో, ఆ ఎండ పొడలో, జోరైన శరీర కదలికలు పుట్టించిన ఆనందంలో, శరీరం గాల్లో తేలిపోతుండగా ఒక రకమైన తియ్యటి మూలుగు అతడి నోట్లోంచి అసంకల్పితంగా బయటకు వచ్చింది. రెప్పపాటులో అంతా మారిపోయింది. తలలో విపరీతమైన పోటు. నలుగురు మనుషులు దిమ్మ దిమ్మ గుద్దినట్టు. నిలబడలేనితనం ఏదో ఆవహిస్తుండగా ఒక్కసారిగా ముందుకొరగబోయి తమాయించుకున్నాడు. చూస్తున్నవాళ్ళకు అతడు పడబోయినట్టనిపిస్తుంది. తలను పైకి సౌకర్యంగా ఎత్తరావడం లేదు. ఎత్తితే నొప్పి. నిస్సత్తువ. ఇక నిలబడటం వల్ల కాక రాతిబల్ల వైపు నడిచాడు. దానిమీద కూర్చోవడానికి ప్రయత్నించాడు. కానీ శరీరం సహకరించడంలేదు. ఆ నొప్పిని ఓర్చుకోవడం తన తరం కావడంలేదు. మొత్తం తిప్పినట్టవుతోంది. వాంతికి వచ్చినట్టవుతుంది, కానీ రాదు. కళ్ళు మూసుకునే ఉండబుద్ధవుతోంది. ఇంక ఆ నొప్పిని జయించడం తన వల్ల కాదని అర్థమై అక్కడే ముందు ఒక పక్కన, తర్వాత చేతులు చాపి వెల్లకిలా, అదీ సౌకర్యంగా లేక బోర్లా తిరిగి పడుకున్నాడు. ‘అమ్మా భూమాత! నేను నీ బిడ్డను తల్లీ.’ అతడినే గమనిస్తున్న ఎవరో దగ్గరికి వచ్చారు. “సార్!” పడుకున్నాడు గానీ ఎంతమాత్రమూ కుదురు లేదు. ప్రాణం నిశ్చలంగా ఉండే వీలివ్వడం లేదు. ఒళ్ళంతా అసహనం. తల బద్దలవ్వడం అంటే ఏమిటో మొదటిసారి తెలుస్తోంది. “సార్, బానే ఉన్నారా?” నాకేం కాలేదని చెప్పాలనుకున్నాడుగానీ నోరు రావడం లేదు. ఎవరో వచ్చి చేయి చూడబోయారు. ఎట్లాగో చేయెత్తి తాను బానే ఉన్నట్టుగా సైగ చేయగలిగాడు.
అతడు ఇంట్లోంచి బయటికి వెళ్ళింది అతడి భార్య గమనించకపోలేదు. కానీ పొద్దుటి బద్దకం వల్ల వెంటనే లేవలేదు. ఎంత ఆదివారమైనా చేయాల్సిన పనులు ఉంటూనే ఉంటాయి. తాపీగానే అయినా లేచి, ఇంటి పనుల్లో పడింది. అతడు తిరిగి ఎన్నింటికి వస్తాడని అంచనా ఉందో అంతవరకూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ టైమ్ దాటిపోయాక అతడికి ఫోన్ చేసింది. కానీ అది ఇంట్లోనే మోగింది. ఒకట్రెండుసార్లు తలుపు దాకా వెళ్ళి చూసింది. కాసేపటికి అతడు వస్తున్నాడుగానీ అతడి వెంట ఇంకెవరో రావడం గమనించి ఆమెకు అనుమానం వచ్చింది. ఆ వచ్చినాయన ఊరికే పక్కన నడుస్తున్నా పట్టుకొస్తున్నట్టు అనిపించింది. పరిచయం లేదుగానీ కాలనీ మనిషే. పార్కులో ఎప్పుడైనా కనబడుతూనే ఉంటాడు. పైకోసారి చూసి, షేక్ హాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. నైటీలో లేకపోయుంటే వెంటనే కిందికి పరుగెత్తేదే. ఆమె ఆత్రం గమనించే అతడు అక్కడే ఉండమన్నట్టుగా సైగ చేశాడు. అయినా మెట్ల వైపు నడవకుండా ఆగలేకపోయింది. ఏదో కళ్ళు తిరిగినట్టయిందని చెప్పాడుగానీ ఆమెకు నమ్మకం కలగలేదు. ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. రెట్టిస్తే కొంత బయటపడ్డాడు. అంతకుమించి పొడిగించక, అతడు కోరుకున్నట్టుగా కాసేపు పడుకోనిచ్చింది.
చిన్న కునుకు తర్వాత అతడు ఫ్రెష్షుగా నిద్ర లేచాడు. ఒళ్ళు చాలా తేలిగ్గా ఉందిప్పుడు. అంతటి తల బరువంతా ఏమైపోయిందో! భార్య కిచెన్‌లో ఉంది. “చూడు,” అని ఒక చిన్న మూత వైపు వేలు చూపించింది. నానేసిన బాదాముల పొట్టును పిల్లాడు పువ్వుల్లాగా ఎలా ఒలిచాడో ముచ్చటగా చూపేందుకు వాటిని అక్కడ ఉంచినట్టుంది. నవ్వి, “వాడేడీ?” అన్నాడు. “అప్పుడే వాడి ఫ్రెండ్సొచ్చినుండే. ఝామ్‌సింగ్ గ్రౌండ్‌లో ఏదో మ్యాచ్ ఉందట గదా.”
“మరిచేపోయిన, ఇవ్వాళ ఆదివారం గదా” పొద్దున గుర్తున్న విషయమే అతడికి మళ్ళీ కొత్తగా గుర్తొచ్చింది.
“వాడికి తొందరగ కోపమొస్తుంది ఈ మధ్య?” భార్య ఫిర్యాదు చేసింది.
“వయసు.”
“వాని మొఖం. ఏం వయసు?”
“నిజమేనే. ఎమోషన్ ఎక్కువ, లాజిక్ తక్కువుండే వయసు.”
“సరేగనీ వేడినీళ్ళు పెట్టాల్న? స్నానం చేస్తవా?” అతడేమీ జవాబివ్వలేదు. “చూడు, ముఖం ఎట్ల పీక్కపోయిందో… పోనీ కొంచెం టీ పెట్టివ్వన్నా?” టిఫిన్ చేయకుండా అతడు టీ తాగడని తెలుసు.
కానీ ఆ సందర్భంలో ఆమెకు అతడి కోసం ఏదైనా చేసిపెట్టాలని ఉంది. ఏమీ మాట్లాడకుండా వెనక్కి వెళ్ళి మెడవంపులో ముఖం ఆన్చాడు. ఆమెకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. “ఫోన్ ఎందుకు తీసుకపోలేదు? ఇప్పట్నుంచి ఎటుపోయినా నీ వెంబడుండాలి.” ఆమె కళ్ళల్లోని ఉద్వేగం గొంతులోకి కూడా బదిలీ అయింది.
“సర్లేవే, ఇప్పుడు నాకు ఏమైందని?” అంటూ దగ్గరికి లాక్కున్నాడు.
“ఇగో మొండికేయద్దు చెప్తున్న. ఓసారి చెకప్‌కు పోదాం.”
“సరేగనీ, వాడికి ఇదంతా చెప్పొద్దు” అంటూ వెనక్కి నడిచాడు.
ఆయన్నే అడుగులతో అనుసరిస్తూ, “చెప్పొద్దంటే ఎట్ల్ల? నాన్నకు ఇంత జరిగితే చెప్పలేదని మల్ల నన్నంటడు.”
“ఇప్పుడెందుకూ?” అని చిరు కోప్పడి, వెతకడం మొదలుపెట్టాడు: “నా ఫోన్ ఎక్కడుంది?”
“ఆ, ఇప్పుడడుగు. అయినా ఇప్పుడెందుకు?”
“ఊరికే… నాన్నతోటి ఒకసారి మాట్లాడుదామని.”