కారు కోసం …

కారువున్ననాడు కష్టంబు తెలియదు
పూని దిరుగ వచ్చు పురము లెల్ల
కారు పోయెనేని గడప దాటగలేము
కారె కాళ్ళుగాని, కాళ్ళు కావు !!

కుర్ర చోదకుండు కులుకులాడితొగూడి
కన్ను మిన్ను గనక కారు నడిపి
కొంప ముంచినాడు గోడెవరితో దెల్పు
పచ్చడాయెకారు పట్ట పగలే

జరిగినంత సేపు జలసాల కారెక్కి
మురిసిపోతిగాదె ముదము మీర
నేడు తీరిపోయె నేనాటి బంధమో
కారు జూడ తిరిగె కంట నీరు

ఆయువున్న నాడు ఆటాడు జీవుండు
తనదు గడువుదీర తరలిపోవు
మరలిరారు తిరిగి మనిషైన కారైన
కర్మ బంధమిలను కాటివరకే

ఎమర్జెన్సీ పేరు, ఎవరు పలుకగబోరు
ఎన్ని గంటలైన ఎదురుచూపే,
దిక్కులేని నాడు, దిక్కు నీవేనయ్య
పిలుపునాలకించు, భిషగ్దేవా

చేతనయిననాడు చేసిన పుణ్యంబు
కాచెనేమొ నేడు కష్టమందు
మంచి చేయుటొకటె మనిషి కర్తవ్యంబు
చేటుకాలమెపుడు చెప్పి రాదు

ఇంక ఇన్సూరెన్సు ఇక్కట్లు మొదలాయె
ఆరు పొద్దు లిచ్చి రద్దెకారు,
అయిదు రోజులరగె, ఆఫీసు పనులలో
ఆరు మిగిలెనయ్య కారుకొనగ !

వేన్లు, పెద్దకార్లు, వేగన్లు, టూడోర్లు
కొంత పాత కార్లు, కొత్త కార్లు,
వెదకి వెదకి తుదకు వేడెక్కె తలకాయ
వీళ్ళ దుంప తెగను, ఇన్ని కార్లా !!

హంసనెక్కి నీవు, హాయిగుంటివమ్మ
వీణ మీటుకొనుచు, వీటిలోన
సుతుని బాధ జూచి, సుంతైన దయ తలచి,
కావుమమ్మ మంచి కారు నిచ్చి !!

శ్రీనివాస ఫణి కుమార్‌ డొక్కా

రచయిత శ్రీనివాస ఫణి కుమార్‌ డొక్కా గురించి: శ్రీనివాస ఫణికుమార్‌ డొక్కా జననం అమలాపురంలో. నివాసం అట్లాంటా జార్జియాలో. కంప్యూటర్‌ సైన్స్‌ ఫీల్డ్‌లో పనిచేస్తున్నారు. కథలు, కవితలు రాసారు. ...