మిథ్యావస్థ

అమ్మమ్మ నా జీవితం లోనుంచి వెళ్ళిపోయినప్పటినుంచి నాలోంచి అమ్మమ్మని వెళ్ళనివ్వకుండా ఉండనివ్వకుండా నన్ను నేను చాలా హింసించుకుంటూనే ఉండేదాన్ని. లచ్చిమి నన్ను కలవక పోయి ఉంటే అమ్మమ్మని ఇప్పటికీ ఓ పెద్ద భారంగా మోస్తూనే ఉండేదాన్నేమో.


అమ్మమ్మకి కృష్ణానది ఒడ్డు అంటే ఇష్టమని తెలుసు నాకు. ఆమెకి ఈ ఊళ్ళో ఏం దొరికిందో, ఏ కారణంతో ఈ పల్లెటూరికి వచ్చిందో తెలీదు. పదేళ్ళక్రితం అందరిని వదిలి ఒంటరిగా ఇక్కడికి వచ్చి ఇల్లు తీసుకొంది. ఎవ్వరినీ రానివ్వలేదు. చివరికి నన్ను కూడా. అది నన్ను ఎంత బాధపెట్టిందో, ఆమెపై అది ఎంత కోపంగా మారిందో ఆమె ఊహించి ఉండకపోవచ్చు. పోయినప్పుడు మాత్రం కబురు పెట్టాలని చెప్పిందేమో, అతడు కబురు పెట్టాడు. నాకు ఊహ తెలిసిన దగ్గరనుంచి నేను అమ్మమ్మ దగ్గిరే పెరిగాను. కానీ అమ్మమ్మ చనిపోయిందని తెలిసినా ఏడుపు రాలేదు. నేనేమి కోల్పోయానో మరి. ఉన్న కొద్ది మంది చుట్టాలలో ఎవరూ చివరిచూపుకి రాలేదు. అంత్యక్రియలకి సంబంధించిన అన్ని పనులు దగ్గరుండి అతడే ఏలోటు లేకుండా చేయించాడు.

అతడి పేరు నంది. చిత్రంగా అనిపించింది.


రెండు గదుల పెంకుటిల్లు. బయట వరండాలో రెండు అరుగులు. నవారు కుర్చీ. ఓ నులక మంచం. వంటింటి సామాన్లు, ఆమె చీరలు కాకుండా, అన్నిటికంటే ఆకర్షించింది అక్కడ ఉన్న చిన్న చిన్న వెదురు బుట్టలు. రకరకాల రంగుల్లో ఉన్నాయి. వాటిలో చిన్న చిన్న రంగుల గవ్వలు. గవ్వలతో చేసిన బొమ్మలు. పక్కన ఓ ట్రంక్ పెట్టె. దానిని తెరవాలనిపించలేదు. వాటినన్నిటిని చూస్తుంటే ఆమె ఆ ఇంటిని ఎంత ఇష్టంగా చూసుకుందో కనిపిస్తుంది. అమ్మమ్మ అలా అందరిని వదిలేసి ఇన్నేళ్ళు ఒంటరిగా ఇక్కడ ఎలా ఉందో, ఎందుకు ఉందో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. భారంగా ఎవరినో మోస్తూ తిరుగుతున్నట్లు, రహస్యమేదో నన్ను తప్పించుకొని తిరుగుతున్నట్లు అనిపించింది.

పదకొండు రోజులు ఉండగలనా ఇక్కడ.

కానీ ఆ రాత్రి వచ్చి పలకరించిన కల, మళ్ళీ మళ్ళీ నన్ను వెంబడించిన వరుస కలలతో అంతా మారిపోయింది.


మొదటి రోజు కల గజిబిజిగా అస్పష్టంగా మొదలైంది.

పచ్చని కొండల్లో మేకలు గుంపులు గుంపులుగా ఉన్నాయి. పిల్లలు ఆడుకుంటున్నారు. అందులో ఒక పాప అచ్చం నాలానే ఉంది. మెరిసే కళ్ళతో ఆ అమ్మాయి కొన్నిసార్లు నావైపు చూసి నవ్వుతోంది. కాసేపు పిల్లలు చెట్లెక్కి ఆడుకున్నారు. తరువాత అన్నం మూటలు విప్పుకుంటున్నారు. ఆ పాప ఎక్కడా కనపడలేదు. లచ్చిమీ అని ఎవరో పిలుస్తున్నారు. దూరంగా ఆ పాప కొండ ఎక్కుతూ వెనక్కి చూసింది. ఆ పాప పేరే లచ్చిమి అని అర్థమైంది. నేను కూడా లచ్చిమీ అని పెద్దగా పిలిచా. నావైపు తిరిగి చిత్రంగా నవ్వి కొండల్లో మాయమైంది. నేను లచ్చిమీ అని పెద్దగా కేకవేస్తూనే మెలుకువలోకి వచ్చాననుకుంటా.

నాకెప్పుడూ పెద్దగా కలలు రావు. వచ్చినా గుర్తు ఉండవు. నిద్రలేచేటప్పటికి నాలో దుఃఖమో సంతోషమో అర్థంకాని అలజడో మెదులుతున్నప్పుడు ఏదైనా కల వచ్చిందేమో అనుకునేదాన్ని. ఈ కల మాత్రం కొద్దిగా అస్పష్టంగా మొదలైన దగ్గరనుంచి స్పష్టంగా గుర్తుంది. విచిత్రంగా అనిపించింది.


నంది పెద్దగా ఏమీ మాట్లాడడు. ‘వేణమ్మా, ఇది కావాలా? అది తీసుకురానా?’ లాంటివి తప్ప. అతడికి ముప్పై, ముప్పై ఐదు ఏళ్ళు ఉంటాయేమో. మనిషి పొడుగ్గా ఉన్నాడు. సన్నగా ఉన్నా బలంగా కనిపిస్తున్నాడు. నలుపు, దానిలో కూడా ఏదో ఆకుపచ్చ కలిపినట్లుండే వింతైన నలుపు. పొడవాటి చేతివేళ్ళు, కాలివేళ్ళు. పొడుగైన జుట్టుని కొప్పు కట్టుకుని ప్రతేకంగా ఉంటాడు. అతను కదులుతునప్పుడల్లా అతని చుట్టూ సన్నటి వెలుగు పొర ఏదో కదులుతున్నట్లు అనిపించేది.

నది ఒడ్డునుంచి ఒక్కడే వచ్చేవాడు. అతనికి ఓ పుట్టి ఉందని, ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకి మనుషులను దాటిస్తానని చెప్పాడు. అవసరమైన ప్రతి పనిని పక్కనే ఉండి చూసుకునేంత ఇదిగా ఉండేవాడు. నాకు కావలసిన వస్తువులను కూడా అడగగానే తెచ్చి పెట్టాడు.

ఇతడు ఎవరు? అమ్మమ్మకి కూడా గత పదేళ్ళుగా ఇలానే సహాయం చేసేవాడా?


అలసిపోయి ఉన్నానేమో రెండో రోజు వెంటనే నిద్రపట్టింది. ఏ సమయంలో కల మొదలైందో తెలియదు. లచ్చిమి మళ్ళీ కనిపించింది. చెట్లెక్కుతుంది. పైనుంచి దూకుతుంది. ఎక్కడో జలపాతం దగ్గరకి వెళుతుంది. అక్కడ తడుస్తూ బిగ్గరగా నవ్వుతుంది. మేకలు అరుపులు వినపడుతున్నాయి. ఆమె నీళ్ళలోంచి వచ్చి మేకల్ని తోలుకుంటూ అక్కడ పిల్లల్లో కలిసింది. వాళ్ళందరూ కొండ దిగుతున్నారు. దిగువున ఇళ్ళు కనిపిస్తున్నాయి. మేకలు వెనుక నెమ్మదిగా నడుస్తూ లచ్చిమి నా వైపు చూసింది. ‘ఇంటికి రా’ అని పిలుస్తుంది.

మెలుకువ వచ్చాక అనిపించింది మొదటి రోజు కలకి రెండవరోజు కలతో సంబంధం ఉన్నట్లు. ఒకటే కల వస్తూ ఉందని మూడో రోజుతో రూఢైంది. లచ్చిమి ఆటలు, పిల్లలు, మేకలు, అడవి, జలపాతం, ఆకాశంలో ఎగిరే పక్షులు. నాలుగో రోజు కలలో లచ్చిమి నాచేతిని పట్టుకొని తాను వెళ్ళిన చోటుకల్లా తీసుకెళుతుంది. నేను కూడా లచ్చిమితో పాటు చెట్లు ఎక్కాను. కిందకి ఎగిరి దూకాను. కొండ కిందుగా పరిగెత్తి జలపాతంలో దూకి ఆటలాడటం ఎంతో నచ్చింది.

ఈ కలలు నన్ను వాటితో పాటు మోసుకు వెళుతున్నట్లు, ఆ కాలంలోనే నేను జీవిస్తున్నట్లు అనిపించేది. అవి సంవత్సరాల పాటు కొనసాగుతున్నట్లుగా అనిపించేది.

కలలు ఇంత సంతోషాన్నిస్తాయా?


లచ్చిమిని ఎక్కడో చూసినట్లు అనిపించేది. కాళ్ళకి వెండి కడియాలు. చేతిలో చిన్న గజ్జల కర్ర. మెరిసే కళ్ళతో ఎక్కడా ఆగకుండా పరుగులు పెట్టేది లచ్చిమి, పగటి పూట నా ఆలోచనల్లో కూడా.

నాకిప్పుడు ఈ పెంకుటిల్లు నచ్చుతోంది. ఆ పరిసరాలు, వాతావరణం కొత్తగా అనిపించలేదు. అదంతా నాకు తెలిసిన ప్రదేశంలా అనిపించింది.

నంది రోజూ వచ్చి వెళుతున్నాడు. నాకు కావలసిన ప్రతిది జాగ్రత్తగా చూసుకుంటాడు. నా ముఖంలో సంతోషాన్ని అతను గమనించినట్లే ఉంది. ఇప్పుడు నేను రాత్రి నిద్రకోసం, రాబోయే కల కోసం ఎదురుచూస్తున్నట్లుగా నాకు తెలుస్తోంది.


నిద్రపోదామని ఎదురుచూశా. ఎంత సేపటికి నిద్రపట్టలేదు. చాలాసేపు అటు ఇటు పొర్లుతూనే ఉన్నా. ఆ చీకటిలో అలానే లేచి కూర్చున్నా. కాసేపయ్యాక లేచి కిటికీ తలుపు తీశా. ఎప్పటి నుండి ఉందో, ఒక తెల్లటి గుడ్లగూబ. కిటికీ తెరవడంతో ఒక్కసారిగా ఎగురుతూ వెళ్ళిపోయింది. భయం వేసి, పెద్దగా అరిచా.

కాసేపటికి ఎవరో తలుపు కొడుతున్న చప్పుడు. టైమ్ చూస్తే పొద్దున నాలుగైంది. ఇంత పొద్దున్నే ఎవరో అర్థం కాలేదు. తలుపు తెరిచా. ఎదురుగా నంది. లోపల ఉన్న భయాన్ని పక్కన పెట్టి, “ఏంటి నందీ, ఈ టైములో వచ్చావ్” అన్నా.

“ఈ రోజు పౌర్ణమి కదమ్మా, నది ఒడ్డున చాలా బావుంటుంది. ప్రతి పౌర్ణమికి మీ అమ్మమ్మ ఈ సమయంలోనే వస్తూ ఉండేది. నువ్వు కూడా వస్తావేమో అని వచ్చా” అన్నాడు.

ఒక్కదాన్ని ఉండటం కంటే నందితో వెళ్ళడం మంచిదనిపించింది. చలిగా ఉంది. జాకెట్ వేసుకొని నందితో బయలుదేరా.

కృష్ణ ఒడ్డు అద్భుతంగా ఉంది. వెన్నెల్లో ప్రేమను నింపుకొని గుంభనంగా మెరిసిపోతున్న ప్రేమికుడిలా ఉంది. కొందరు హరినామ స్మరణ చేస్తూ గుంపుగా వెళుతున్నారు. కొందరు అంత చలిలో కూడా నదిలో స్నానం చేసి దీపాలు వెలిగించి వదులుతున్నారు.

కాసేపు నది ఒడ్డున కూర్చున్నాక “పుట్టిలో వస్తావా వేణమ్మా” అన్నాడు.

నాకూ వెళ్ళాలనిపించి సరే అన్నా. నన్ను పుట్టిలో ఎక్కించుకొని నది మధ్యకి తీసుకువెళ్ళాడు. భయము, బాధ లేని సన్నటి వెలుగేదో పరుచుకున్నట్లు ఇష్టమైన అనుభూతి లోపల. కొన్ని క్షణాలు జీవితం అలా ఆగిపోయినట్లనిపించింది.

ఎంత నిశ్శబ్దం తరువాతో తెలియదు కాని, నెమ్మదిగా అడిగా. “అమ్మమ్మ వస్తూ ఉంటదా ఇలా.”

“వస్తుంది వేణమ్మ. లచ్చువమ్మకి పౌర్ణమి రోజు ఇలా రావడం ఎంతో ఇష్టం.”

“ఓ! అవునా” అని, “నువ్వు గుడ్లగూబలు ఎప్పుడైనా చూశావా?” అన్నా.

అతని ముఖంలో చిన్న నవ్వేదో ఉంది. “అవేమి చేస్తాయమ్మా, ఏమి చేయవు. మహా అయితే ఇష్టమైన వాళ్ళని కాపలా కాస్తూ తిరుగుతుంటాయి అంతే. వాటికి భయపడక్కర్లేదు.”

“నేను ఏమీ భయపడట్లేదు. ఊరికే అడిగా. నువ్వెప్పుడైనా తెల్లని గుడ్లగూబని చూశావా?” అన్నా.

“అహా” అన్నాడు. అంతకు మించి అతను ఏమీ మాట్లాడలేదు. అతనికేదో తెలుసు అనిపించింది. నాకు వస్తున్న కలల గురించి చెప్పాలనుకున్నా. చెప్పలేదు. వేకువ వెలుగు నది పైన పరుచుకుంటోంది.


లచ్చిమి ఏడుస్తుంది ఎక్కిళ్ళు పెట్టి. వాళ్ళ నాన్నని తీసుకెళ్తున్నారు. లచ్చిమి చుట్టూ చీకటి. ఏడవకు అని చెప్పాలనుకున్నా కానీ లచ్చిమి నన్ను పట్టించుకోవట్లేదు. మేకలు చిత్రంగా అరుస్తున్నాయి. లచ్చిమి మునగ తీసుకొని పడుకొని ఉంది. వాటిని కొండల్లోకి తీసుకెళ్ళేవాళ్ళు లేరు. నేను వెళ్ళి, లే లచ్చిమి అడవికి వెళ్దాం అని లేపుతున్నా. ఎంత కదిలించినా లచ్చిమి లేవలేదు. నావైపు తిరిగి నన్ను చూడలేదు. లే లచ్చిమి, లే వెళ్దాం.

బహుశా ఆ అరుపులతోనే నిద్రలేచానేమో. ఎందుకో ఒళ్ళంతా చెమట పట్టినట్లనిపించింది.

“వేణమ్మా, వేణమ్మా” అంటూ నంది పిలవడం వినిపించింది. పాలు తీసుకొని వచ్చినట్లున్నాడు. లేచి కూర్చున్నా.


చుట్టుపక్కల వాళ్ళు ఎదురుగా కనబడినప్పుడు పలకరింపుగా నవ్వుతారు అంతే కానీ, ఎప్పుడూ దగ్గరగా వచ్చి మాట్లాడింది లేదు.

ఆ రోజు ఎందుకో ఒంటరిగా ఇంట్లో ఉండాలనిపించలేదు. నందితో, “నేనూ నీతో కృష్ణ ఒడ్డుకి వస్తా” అన్నా.

రెల్లుగడ్డితో చిన్న గుడిసె వేశాడు ఒడ్డున. అక్కడ కూర్చుంటే ఉడికించిన వేరుశెనగలు, కాల్చిన మొక్క జొన్నకండెలు ఇలా ఏదో ఒకటి తెచ్చి ఇచ్చేవాడు తినడానికి. పనిలేనప్పుడు నా ఎదురుగా కూర్చొని వెదురు బద్దలతో బుట్టలు అల్లడం చేస్తుండేవాడు. అతను ఎప్పుడూ గట్టిగా మాట్లాడినట్లు గాని, కనీసం నవ్వినట్లు కానీ కనిపించలేదు.

అమ్మమ్మకి ఉన్న ఆ ఇల్లు, ఒక ఎకరా పొలాన్ని ఎప్పుడో నాకు చెందేలా రాసి రిజిస్ట్రేషన్ కూడా చేయించింది అమ్మమ్మ. నేను వస్తానని అమ్మమ్మకి ఖచ్చితంగా తెలుసేమో. వాటిని నేను వచ్చిన రోజే ఆ ఊరి పెద్దమనిషి ఒకాయన తెచ్చిచ్చాడు. పొలం కౌలుకి చేస్తున్నవారితో మాట్లాడా. ఆ ఇంటిని ఎవరికి ఇవ్వాలి అని కాసేపు ఆలోచించా. నిజానికి అక్కడ నాకు అంతకంటే పెద్ద పనులేమి లేవు.


ఆ రోజు రాత్రి తప్పకుండా కల ఒస్తుందని తెలుసు. నాకేదో చెప్తోంది ఆ కల అనిపించింది. కళ్ళు మూసుకున్నా ఎంతకీ నిద్ర రాలేదు. నిద్రపట్టక లేచి కూర్చున్నా. బయట కొన్ని కుక్కలు సామూహికంగా ఏడుస్తున్నట్లు అరుస్తున్నాయి. కిటికీ చిన్నగా తెరిచి చూశా. గుడ్లగూబ కనిపించలేదు. ఆ రోజు నిద్ర కరవైంది. కల రాలేదు కాని, నిద్రలేకపోవడమో మరి దేనివల్లనో జ్వరం వచ్చింది. నీరసంగా పడుకుండిపోయా.

నంది కషాయం కాచి ఇచ్చాడు. ఆ పూట అతడే వంట చేశాడు. కొద్దిగా నూకతో చేసిన సంకటి, చింతకాయ పచ్చడి. జ్వరం వచ్చినప్పుడు అమ్మమ్మ ఇలానే చేసేది.

“మా అమ్మమ్మ నీకు ఎప్పటినుండి తెలుసు?” అని అడిగా.

“మీ అమ్మమ్మనా, ఆమె చిన్నప్పటి నుండి” అన్నాడు ఎటో చూస్తూ. “నువ్వు పడుకో వేణమ్మ. నీకు విశ్రాంతి అవసరం. ఒడ్డుదాకా వెళ్ళొస్తా, మనుషులొస్తా ఉంటారు” అంటూ వెళ్ళిపోయాడు. నాకు తికమకగా అనిపించింది. అతడికి అమ్మమ్మ చిన్నప్పటి నుండి తెలీడం ఏంటి!

ఎప్పుడు నిద్రపోయానో తెలీదు. లచ్చిమి వెండి కడియాలతో నా చుట్టూ తిరుగుతుంది. అదే పెంకుటింట్లో. కొండలు లేవు, జలపాతం లేదు. నాపక్కన కూర్చొని నన్ను ఒళ్ళోకి తీసుకుంది. ఆమె చల్లని మృదువైన చేయి వెచ్చటి నా నుదిటిపైన ఆనించి నా జుట్టుని మెల్లగా సవరిస్తుంది. ఇది కలేనా? నేను పలవరిస్తున్నానా? అర్థంకాలేదు.

సాయంత్రానికి మెలుకువ వచ్చింది.

మరుసటి రెండు రోజులు నాకు కల ఏమి రాలేదు.

అసంపూర్తిగా దుఃఖంగా అనిపించింది.


ఆ రోజు కలలో లచ్చిమి నాకోసం ఎదురు చూస్తుంది. నేను వెళ్ళగానే నన్ను తడిమి చూసింది. నా చేయి పట్టుకొని జలపాతం వెనుక ఒక చిన్న గుహ లాంటి ప్రదేశానికి తీసుకెళ్ళింది. అక్కడ ఉన్న పెద్ద బండరాయిని చాలా సులభంగా పక్కకు నెట్టేసింది. లోపల పెద్ద ఆసనం లాంటి బండపైన ఓ జడలు కట్టిన మనిషి కళ్ళు మూసుకుని కూర్చొని ఉన్నాడు. అతనికి భక్తిగా నమస్కరించి, పక్కన చిన్న ధారగా పారుతున్న నీటిని పక్కన ఉన్న కుండల్లో నింపి, ఆ నీళ్ళు అతనిపైన పోసింది. శుభ్రంగా తుడిచి బట్టలు చుట్టింది. అతడి ముందు పండ్లు పూలు పెట్టి ఎదురుగా కూర్చుంది. ఇన్ని చేస్తున్నా అతడు కొద్దిగా కూడా కదిలినట్లు అనిపించలేదు. ఎక్కడి నుంచి వస్తున్నాయో సూర్యకిరణాలు అతడి నల్లని చర్మాన్ని తాకి ఆకుపచ్చగా మారుతున్నాయి. అతని ఒళ్ళంతా కాంతిమయం. కాసేపటికి అతడు కళ్ళు తెరిచి, లచ్చిమిని చూసి నవ్వాడు. లచ్చిమి అతడి ముందు పాటలు పాడింది, నృత్యం చేసింది. అతడు నన్ను ఏమీ పట్టించుకోలేదు. నేను అతని వైపు పరిశీలనగా చూశా. ఎక్కడో చూసినట్లనిపించింది. నంది, అవును అతడు నంది, నందే!

అతని పేరును పలవరిస్తునే మెలుకువలోకి వచ్చా. కల ఇప్పుడే జరిగినంత పచ్చిగా ఉంది. నందినేకదా, నిజంగా నందే కదా అతడు.


ఆ రోజు ఇల్లు సర్దడానికి కూర్చున్నా. ట్రంకు పెట్టెని తీసి చూడాలనిపించింది. దాన్ని తెరిచా. ఏవో చిన్నప్పటి ఆటవస్తువులు చిన్న చెంబు. రెండు వెండి కడియాలు. అవి కలలో లచ్చిమి కాళ్ళకి ఉన్నవి. చిన్న గజ్జెల కర్ర. మేకలు కాసే లచ్చిమి చేతిలో ఆడే కర్ర అది. అమ్మమ్మ, లచ్చిమి ఒకటేనా?

ఆ రోజు నంది ఇంటికే రాలేదు. నేనే వెతుక్కుంటూ నది ఒడ్డుకి వెళ్ళా. నంది కనబడలేదు. అవతలి ఒడ్డుకి వెళ్ళాడేమో అనుకుంటూ, అక్కడే ఎదురు చూస్తూ కూర్చున్నా.

మిట్ట మధ్యాన్నం వచ్చాడు. నన్ను చూసి నొచ్చుకున్నాడు. “ఏంటి వేణమ్మా, నేనే వచ్చేవాడిని కదా సాయంత్రానికి. ఇలా ఇక్కడ ఎండలో కూర్చున్నావు” అన్నాడు.

రేపు పదకొండవ రోజని గుర్తుచేశా. అతనిలో ఏదో ఉంది. అది నన్ను అతనితో ఉండటానికి ప్రేరేపిస్తుంది.

“నందీ, నాతోనే ఉండొచ్చు కదా ఇంట్లో” అన్నా.

“సాయంత్రం దాకా ఉంటాను కదా వేణమ్మా. పొద్దునే కృష్ణ ఒడ్డుకు పోవాలి. బేరాలు వస్తూ ఉంటాయి” అన్నాడు.

అతడిని ముట్టుకోవాలనిపించింది. ఎవరితోనైనా మాట్లాడాలనిపించడం పర్వాలేదు. ముట్టుకోవాలనిపించడం వెనుక ఏముంటుంది. నాకేమి పెద్దగా తోచలేదు. అతన్ని ఒక్కసారైనా తాకాలని బలంగా అనిపించింది. అతనిని అడిగి తాకాలా లేకా మాములుగా సాధారణమైన విషయం అన్నట్లు తాకాలా.

ఇంతకుముందు ఎవరినైనా తాకడానికి ఇలాంటి ప్రశ్న నాకు రాలేదు.

నంది నన్ను ఇంటిదగ్గర వదిలిపెట్టి వెళ్ళాడు.


కలలోకి నేనే వెళ్ళానేమో! నాకెవరూ కనిపించలేదు. అడవుల్లో తిరుగుతున్న లచ్చిమి లేదు. లచ్చిమి తిరిగిన ప్రదేశాలన్ని తిరిగా. లచ్చిమీ అని కేకలు పెట్టా. ఎక్కడా లేదు లచ్చిమి. జలపాతం దగ్గరికి వెళ్ళా. అక్కడ బండరాయిని జరిపాను. అతడు అక్కడే ఉన్నాడు. లచ్చిమిలాగానే నేను పూలు పండ్లు కోసి అతని ముందు పెట్టా. అతడి శరీరంమంతా కాంతితో వెలిగిపోతుంది. పండు తీసి ఇచ్చా.

“నేను ఏమీ తినను” అన్నాడు.

అతడిని ముట్టుకోవాలంటే భయం వేసింది.

“నువ్వు నందివా?” అన్నా.

చిన్నగా నవ్వాడు.

“నీకెంత వయసు?”

“నాకు వయసు లేదు.”

“లచ్చిమి ఏది? లచ్చిమి కావాలి” అని ఏడిచాను గట్టిగా. “నీకోసమే లచ్చిమి వచ్చింది కదా, లచ్చిమిని ఏమి చేశావ్” అన్నా కోపంగా.

“లేదు, లచ్చిమి కోసమే నేను వచ్చాను” అన్నాడు.

కోపంతో ఊగిపోయా. నాకు కోపం ఎక్కువైంది. కేకలు పెట్టా.

జలపాతంలో నీళ్ళు వెనక్కి వెళుతున్నాయి. కొండల్లో గట్టిగా ప్రతిధ్వనించేలా కేకలు పెట్టా. కొండలు గాల్లో తేలుతున్నాయి. అతడు తన చేతిని ముందుకు చాపి నా తలను తాకబోయాడు. అంతే రివ్వున ఎగురుతూ నా తలపైకి తెల్లటి గుడ్లగూబ వచ్చి, తన్నుకుంటా వెళ్ళింది.

ఒక్క కేకపెట్టి నిద్రలేచా.


పదకొండో రోజు జరపవలసిన కార్యక్రమాలన్నీ పూర్తి చేశాను. నంది నాదగ్గరే ఉండి జరిపించాడు. అమ్మమ్మ అస్థికలు కృష్ణలో కలిపాము. నేను బయలుదేరాను. వెళ్ళేముందు నందితో ఏమి మాట్లాడాలో తోచలేదు.

“నువ్వు ఇక్కడే ఉంటావా?” అన్నా.

“వచ్చిన పని అయిపోయింది. వెళ్ళాలి” అన్నాడు.

దుఃఖంగా అనిపించింది. అతడు నా చేయిపట్టుకుని ఊరడిస్తాడు అనుకున్నా. అవేమి జరగలేదు. నీ వయసెంత అని అడగాలనుకున్నా. ఏమీ అడగకుండానే బయలుదేరా.

ఇంటి పైనుంచి తెల్లటి గుడ్లగూబ కొండల్లోకి ఎగిరిపోతోంది.

శ్రీసుధ మోదుగు

రచయిత శ్రీసుధ మోదుగు గురించి: అమోహం, విహారి అనే కవితా సంకలనాలు, రెక్కలపిల్ల అనే కథా సంకలనం వచ్చాయి. ...