అద్దంలో కనిపించే నా పద్యాన్ని
వేరే అద్దంలోంచి చూసి రాస్తావు
ఇప్పుడు ఇది కొత్త పద్యమయ్యింది.
నా మాటలకి అర్థాలు వేరు
ఇప్పుడు నీ మాటలే
నా మాటలయిపోయాయి.
పద్యానిదేముంది,
మరోసారి చూస్తే
తడుముకోకుండా చెప్పచ్చు.
అర్థమే, ఇప్పుడు
ఎక్కడుందో వెతుక్కోవాలి.
పదానికి ముందర
అకారమో నకారమో చేరిస్తే
వ్యతిరేక అర్థం
వస్తుందనుకుంటే వస్తుందా?
నూతిలో పడ్డ సూది
ఊ అంటే వస్తుందా?
ఓ స్త్రీ రేపురా
అంటే రేపు స్త్రీ వస్తుందా?
అలా పైకెళ్ళమంటే
అలా పైకెళ్ళడం
కుదురుతుందా!
వాక్యం నీది కాదు
పీల్చిన గాలి కూడా
వదిలేసింది ఒక్కటే నీది.
నవరంధ్రాల శరీరం
ప్రాణమే కాదు
వాయువు కూడా
ఎక్కడినుంచైనా పోవచ్చు.
ఎన్ని అప్పులు?
తిక్కన ఇచ్చిందే కాదు
కాఫ్కా, కామూ
నారాయణ బాబు
త్రిపురాసురుడో
శ్రీనివాసరావో
ఎవరైతే నేమి?
అన్నీ పాము గుడ్లే
తినేయగా మిగిలిన
కళ్ళు తెరిచిన నాలుకలు.
రహస్యాల తీరంలో
సీసా ఒలికి పోయింది.
మోహన్ మత్తులో
ప్రకాష్ పెన్ను విదిలిస్తాడు.
మోషే కుంచెలో
ఉన్మత్త భావ చిత్రం.
అందరూ, అన్నీ
తెలుసునని వేసే
కుప్పిగంతులు కోకొల్లలు
కథకి తండ్రి లేడు
తల్లి అసలే లేదు.
గొగొలో, తొడపాశమో
శ్రీపాదమో
ఎందుకొచ్చిన గొడవ
ఎవరో ఒక నామిని
ఒక పతంజలి
ఒక కారా ఒక చాసో
వాక్యాన్ని బద్దలు చేసి
అద్దాన్ని అతికిద్దాం
చిన్నప్పటి పాటలన్నీ
ఇప్పుడు బట్టలు విప్పేసేయి.
చొక్కా జేబుకు
సిరా అంటుకోదు.
నీ బదులు
నువ్వు రాయి
నా బదులు
కొత్త తెలివితో
చక్రం తిప్పు.
అంతా తెరమీద మోక్షమే!