జీవగంజి

క్యాంటీన్‌లో పెద్దగా జనం లేరు. టేబుల్స్‌ దాదాపు ఖాళీగా ఉన్నాయి. అక్కడక్కడా ఒకరిద్దరు కూర్చున్నారు. ఒక టేబుల్‌ చుట్టూ నలుగురు మాట్లాడుతూ భోంచేస్తున్నారు. పరిచయం లేదు గానీ కొందరు ముఖాలుగా తెలిసినవారే. నేను రోజూ కూర్చునే మూల టేబుల్‌ మీద ఎవరో కూర్చున్నారు. మధ్యలో ఒక టేబుల్‌ను ఖాళీగా వదిలేసి ఇంకోదాన్లో నా ‘లంచ్‌ బ్యాగు’ పెట్టాను. ఏసీ పాడైనట్టుంది, రిపేరు ఏదో జరుగుతోంది. ‘సరిగ్గా తినే టైముకు పెట్టుకుంటారేంటి? ముందు చూసుకోలేరా?’ అని ఎవరో అంటున్నారు. వాష్‌బేసిన్లు అటువైపుంటాయి. ఇంకాసేపైతే పెద్ద హాలులా ఉన్న ఈ క్యాంటీన్‌ మొత్తం నిండిపోతుంది.

రాత్రి భోజనం ఈమధ్య కొంచెం త్వరగానే చేస్తున్నాను. చాలా ఏళ్ళ తర్వాత నా తిండికి సంబంధించి ఒక క్రమం లాంటిది ఏర్పడింది. పొద్దున అల్పాహారం (దాని నిజ అర్థంలో) చేస్తాను. మధ్యాహ్నం ఫర్లేదు, కొంచెం కడుపునిండానే తింటాను. మళ్ళీ రాత్రి మితభోజనమే. ఇంతకుమించి అరిగించుకునే శక్తి కూడా శరీరానికి ఉండటంలేదు. తిండి తగ్గించుకున్నప్పటినుంచీ శరీరం కూడా తేలికగా ఉంటోంది. ఇలా తగ్గించుకున్నా నాకు సరిపోతుందని తెలుసుకోవడానికి చాలా ఏళ్ళు పట్టింది. ఈమధ్య ధ్యానం మొదలుపెట్టడం కూడా దానికి కారణం కావొచ్చు. అంటే ఇంతకుమునుపు తేలిగ్గా కొట్టేసిన వాటికి వయసు పెరుగుతున్నకొద్దీ కొంచెం ఓపెన్‌గా ఉంటున్నాను.

చేతులు కడుక్కునొచ్చి కూర్చున్నాను. ఇక్కడ కూడా బాగానే ఉంది. నలుగురు కూర్చున్న టేబుల్‌ మీద మాటలు ఈ నెల పెరగాల్సిన ఇంక్రిమెంట్ల గురించి అని అర్థమవుతోంది. అవే ఆశలు, అవే అసంతృప్తులు. నేను ఈ కంపెనీలో పదిహేనేళ్ళ నుంచి చేస్తున్నాను. వేర్వేరు కంపెనీల్లో చేరిన నా క్లాస్‌మేట్లు కొందరు అప్పుడే కార్లు కొన్నారు. కొందరు ఫ్లాట్లు తీసుకుని ఇ.ఎమ్.ఐ.లు కడుతున్నారు. ఇంకా వేరే కంపెనీల్లో చేరినవారు నాకన్నా చిన్న అద్దె ఇళ్ళల్లో ఉంటున్నారు. నా జీతం డబ్బులు పిల్లల చదువులు, ఇంటి ఖర్చులకే సరిపోతున్నాయి. అలాగని డబ్బులకు పెద్ద ఇబ్బందిపడిందీ లేదు. నాకు సొంతింటి గురించిన రంధి లేదు కానీ వీలైతే మా ఊళ్ళోనే ఓ రెండెకరాల పొలం కొనుక్కోవాలని ఉంది. రెండు కాకపోతే ఒకటి!

బ్యాగులోంచి అన్నండబ్బాను బయటికి తీయగానే, నాకు మామూలుగా నా భార్య ముఖం గుర్తొస్తుంది. దానిలో ఉన్న పదార్థాలను బట్టి కొంచెం చిరాకో, ప్రేమో కలుగుతుంటుంది. కానీ ఇవ్వాళ నేను ఏ కళన ఉన్నానో – డబ్బా మూత తీయగానే, కొంచెం ముద్దగా అయినట్టుగా ఉన్న అన్నం కళ్ళబడగానే, నాకు ఉన్నట్టుండి మా ఊళ్ళో చిన్నతనంలో చూసిన ఒక గొల్లాయన గుర్తొచ్చాడు. ఆయన ఒక పగటిపూట తన అన్నంమూటను విప్పుకుని తినడం గుర్తొచ్చింది. నా భార్య రేషను బియ్యం వండినట్టుంది. అన్నం అంత తేటగా లేదు. కొద్దిగా ముతక తెలుపు అది. మధ్యాహ్నం నేను సరిగా తినలేదనుకున్నదో ఏమో, రోజు కంటే కొంచెం ఎక్కువే పెట్టింది.

బడికి సెలవులు ఉన్నప్పుడల్లా నన్ను ఎడ్లను కాయడానికి తోలేవాడు నాన్న. ఆ రోజు కూడా అలాగే పోయాను. చెలకలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఎండ నడినెత్తిన ఉంది. బాగా దూపవుతోంది. దూరంగా ఒక కరెంటు మోటారు ధార కనబడితే, నీళ్ళు తాగడానికి అటువెళ్ళాను. అక్కడ గొర్ల మంద ఒకటి గడ్డి మేస్తోంది. వాటిని కాస్తున్న గొల్లాయన అప్పుడే పగటి భోజనం చేయడానికి ఉపక్రమించాడు. పొరుగూరు నుంచి మా ఊరి పొలిమేరలోకి వచ్చాడాయన. సన్న తువ్వాలలో అన్నం మూటగా కట్టి ఉంది. కాళ్ళూ చేతులూ కడుక్కుని, ముఖాన్ని అదే తువ్వాలకు ఇంకోవైపున తుడ్చుకున్నాడు. నీటి ధారకు చేయిని తడి చేసుకుంటూ ఆ తడితో మూట అన్నివైపులా చిన్నగా తడిపాడు. అంచుల్లో ఎండిపోయిన మెతుకులను కొంత మెత్తబరిచాడని తర్వాత అర్థమైంది. తర్వాత బొజారు పక్కనే ఉన్న రాయి మీద కూర్చుని మూట విప్పాడు. తెల్లటి అన్నం మధ్యలో రెండు ఎర్రటి మామిడికాయ తొక్కు బద్దలు. ఆయన్నే చూస్తూవున్న నన్ను, “సదువుకుంటున్నవా?” అని అడిగాడు. నా జవాబునే సలహాగా మార్చుతూ “ఆఁ, సదువుకోవాలె” అన్నాడు. తర్వాత పెద్ద పెద్ద బుక్కలు పెట్టుకుంటూ, గొర్లవైపు ఓ చూపు సారిస్తూ, మధ్యమధ్యలో కళ్ళు మూసి నములుతూ ఆ అన్నాన్ని ఆయన తినడం మొదలుపెట్టాడు.

క్యాంటీన్‌లోకి ఇంకా ఒకరిద్దరు వచ్చి కూర్చుని తినడం మొదలుపెట్టారు. నేను కూడా వాళ్ళలో కలిసిపోయి భోంచేస్తున్నాను. నేను తింటున్నాను గానీ తింటున్నది నా అన్నాన్నా, ఆ గొల్లాయన మూటనా? తన అన్ని పరిమితులతో ఈ ప్రపంచం నాకు అందించిన అన్నంమూట ఇది. నా కోరికలు అలాగే ఉన్నాయి. నా పరిధులు నాకు తెలుస్తున్నాయి. అంతకుముందు కూడా ఎల్లలు ఉన్నా, అవి ఇంత స్ఫటికంలా స్పష్టంగా ఎప్పుడూ కనబడలేదు. ఈ ప్రపంచంలో నా స్థానం ఏమిటో నాకు ఈ అన్నంముద్ద చూపుతోంది. నా కంట్లో ఏదో చెమ్మ కదలాడిన భావన కలిగింది. ఇది నా వాస్తవం. యావత్ప్రపంచంలో ఎన్నయినా ఉండనీ, ఈ గిన్నెలోని మెతుకు నా వాస్తవం. దీని వివరాలను మార్చగలనేమో గానీ సారాన్ని మార్చలేను. ఇది ఈ క్షణపు సత్యం. ప్రతి మనిషికీ తనదైన ఒక సత్యం ఉంటుంది. నా ముందర కూర్చుని భోంచేస్తున్న వీళ్ళందరితో సహా, ఇంకా వచ్చి చేరేవాళ్ళందరూ తమ తమ సత్యాలకు బందీలు. ఈ మెతుకు నా సత్యం. ఇది నా జీవితం. నా శరీరం ఆ నీటి అంచునున్న ఆ రాయి మీద కూర్చుని వుంది. ఆ మిట్టమధ్యాహ్నపు ఎండలో గాలికి తేలివస్తున్న నీటితుంపర్లు శరీరాన్ని తడుపుతున్నాయి. ఆత్రంగా ఆకలిగా నా అన్నంమూటను ఆరగిస్తున్నాను. కంటి చూపు మేరా గడ్డిమైదానం కనబడుతోంది. పదులకొద్దీ జీవాలు తమ ఆహారాన్ని వెతుక్కుంటున్నాయి. నా లోపలి ఆరాటాలన్నీ ఒక కొలిక్కి వచ్చాయి. అన్నిరోజులుగా ఉందనుకున్న పెనుగులాట ఏదో దానికదే ముగిసిపోయింది. చేతులెత్తేయడం ద్వారా తేలికైపోయాను. దేనిమీదా నాకు ఫిర్యాదులు లేవు. వాస్తవాలు నాకు చేదును పుట్టించడంలేదు. అన్నీ ఎరిగే జీవితానికి వినయంగా లొంగిపోయాను.

క్యాంటీన్‌లోంచి బయటికొచ్చి బయట నిల్చున్నాను. బయటికీ లోపలికీ తేడా ఏమీ లేనట్టుగా గాలి నిలిచిపోయి వుంది. పరిసరాలకు శరీరాన్ని అలవాటు చేసుకునేలా క్షణం నిశ్చలంగా నిల్చున్నాను. ముందు వాతావరణ స్థితిని యథాతథంగా శరీరం అంగీకరించాలి. అప్పటికే చీకటిపడింది. చుట్టూ ఇన్ని లైట్లు వెలుగుతున్నా చీకటిపడిందన్న వాస్తవాన్ని దాయడంలేదు. ఒకరిద్దరు గోడ పక్కన నిల్చుని సిగరెట్ తాగుతున్నారు. ఉన్న కొద్దిపాటి గాలి ఉనికిని శరీరం గుర్తిస్తోంది. నెమ్మదిగా వీవెన ఊపుతున్నట్టుగా గాలి ఒంటికి తగులుతోంది. కంపెనీకి ఎదురుగా అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. ఒక బాల్కనీలో నిల్చుని ఎవరో ఒకావిడ ఓ చిన్నమ్మాయితో మాట్లాడుతోంది. కూతురు కావొచ్చు. ఇద్దరూ మధ్యమధ్యలో తెగ నవ్వుతున్నారు. ఆ బాల్కనీకి ఆనుకుని ఒక పెద్ద వేపచెట్టు. ఆ కొమ్మల మధ్యలోంచి వాళ్ళొక కదిలే చిత్రంలా కనబడుతున్నారు. చాలా రోజుల తర్వాత నాకు ఎందుకో సిగరెట్‌ కాల్చాలని బుద్ధి పుట్టింది. మానేశానని చెప్పలేని స్థితిలో ఉంటాన్నేను. ఆఁ తాగుతానని చెప్పే స్థితిలో కూడా జేబులో ప్యాకెట్‌ ఎప్పుడూ మెయింటెయిన్‌ చేయలేదు. కంపెనీ గేటు దాటి, పక్కసందులోకి వెళ్తే దొరుకుతాయి. బయటికి వెళ్తే సెక్యూరిటీ దగ్గర ఐడీ నంబరు రాయాలి. పైగా ఒక్కడినే వెళ్ళడం! అలా ఎందుకు చూశానో గానీ ఆ స్మోక్‌ చేస్తున్నవారి వైపు చూశాను. ఇందాక క్యాంటీన్లో తింటున్న ఒకాయన అప్పుడే అటుగా వస్తూ నాతో కళ్ళు కలిపి జేబులు తడుముకుంటూ చిన్నగా నవ్వాడు. పరిచయం లేదు గానీ తెలిసిన ముఖమే. నేను అడిగానని అనుకుని జవాబిచ్చాడా, తన దగ్గర లేవని నన్ను ఇమ్మంటున్నాడా? బదులుగా నేనూ జేబులు తడుముకున్నాను. ఇద్దరమూ నవ్వుకున్నాం. నన్ను వెంటనే దాటిపోలేనట్టుగా అక్కడే ఆగి, సంభాషణకు ఉపక్రమిస్తున్నట్టుగా “అబ్బా, ఏం ఎండలు సార్‌. ఇంత టైమయినా ఉడకపోత తగ్గలేదు” అన్నాడు. ఆయన అన్నది అర్థమైనా, నేను ఏం రియాక్ట్‌ కాకపోతే నాకు వినపడలేదేమో అనుకుని, ‘ఉడకపోత’ అన్నాడు చేతుల్ని దాని సంజ్ఞలా ఊపుతూ.

నాకు అంత ఉక్కగా ఏమీ అనిపించడం లేదు. “అది మనం ఫీలవడం బట్టి ఉంటుంది సార్‌” అన్నాను నవ్వుతూ.

కొంత అపనమ్మకంగానే, “మీరు భూమ్మీద ఉండాల్సినవాళ్ళు సార్‌” అన్నాడు.

“అందరమూ ఉండాల్సినవాళ్ళమే సార్‌” అని బదులిచ్చాను.

ఈసారి తలతిప్పి ఒకింత మెచ్చుకోలుగా చూశాడు.

ఆ మాటలను అలా కొనసాగిస్తూనే, ఇద్దరమూ అదేదో ముందే అనుకున్నట్టుగా కలిసి బయటికి నడిచాం.