అబ్బలనాన్న

తాత తమ్ముడు మనవడికి ఏమౌతాడు? నాకు పదకొండేళ్ళ వయసొచ్చేసరికే మా తాతకి అరవై నిండినా తాత తమ్ముడికి ముప్ఫై అయిదేళ్ళే. ఇంకా విచిత్రం ఏమిటంటే మా తాత పెద్ద కొడుకు – అంటే మా మావయ్య – తాత తమ్ముడికంటే ఓ ఏడు పెద్దవాడు. ఏం? నమ్మకంగా లేదా? మా తాతకి పదహారేళ్ళకే పెళ్ళయ్యాక మా ముత్తాత మరో పెళ్ళి చేసుకున్నార్ట. అలా మా మావయ్య పుట్టాక అంటే మా తాతకి కొడుకు పుట్టాక, తమ్ముడు కూడా పుట్టాడు. పాతకాలంలో ఉన్నట్టే అంతా ఉమ్మడి కుటుంబం కనక ఇప్పుడీ తమ్ముణ్ణి, కొడుకునీ ఒకలాగే పెంచారు ఒకే ఇంట్లో. తాత తన తమ్ముణ్ణి ఒరే అబ్బులూ అని పిల్చేవాడు. అయితే మావయ్య వీడికంటే ఓ ఏడాది పెద్ద కనక పెద్దౌతూంటే కొన్నాళ్ళు వాడు చిన్నాన్న అనీ కొన్నాళ్ళు అబ్బులూ అని పిల్చినా ఇద్దరికీ కొంత జ్ఞానం వచ్చేసరికి ఈ పేర్లు అబ్బులు, చిన్నాన్నతో కలిపి మొత్తానికి తాత తమ్ముడికి అబ్బలనాన్నగా పేరు స్థిరపడిపోయింది. అసలీ పేరు సంగతి అలా ఉంచితే అబ్బలనాన్న గురించి నాకు మరేమీ తెలియదు.

ఏడాదిలో ఎప్పుడు తాత ఇంటికి వెళ్ళినా కనపడని ఈ అబ్బలనాన్న వేసవి శెలవుల్లో మాత్రం తప్పకుండా కనిపించేవాడు. కనపడగానే ‘ఏవిరోయ్, ఇదేనా రావడం?’ అంటూ ఎత్తుకుని తిప్పడం, బయటకి వెళ్తే నన్ను తీసుకెళ్ళి ఏదో తాయిలం కొనిపెట్టడం సాధారణంగా జరిగేది; అయితే ఈ అబ్బలనాన్న ఏం చేస్తాడు అనేది నా ఊహకి అందేది కాదు ఆ వయసులో. ప్రతీసారి వాళ్ళావిడ అంటే అమ్మమ్మకి తోటికోడలు కనిపించేది కూడా. పిల్లలు ఉన్నారో లేదో మాత్రం నాకు తెలియదు అప్పట్లో. ఆడవాళ్ళిద్దరూ ఓ జట్టుగా కబుర్లు చెప్పుకుంటూంటే అబ్బలనాన్న తాతతో కలిసి ఏదో మాట్లాడేవాడు. రోజుల తరబడి ‘భూమి, శిస్తు, అమ్మకం, కొనడం, పంటా, లాభం, నష్టం..” అంటూ అసలు ఏమి మాట్లాడుకుంటారో రోజుల తరబడి అనిపించేది. అప్పుడప్పుడూ మావయ్య కూడా కూర్చునేవాడు ఈ కబుర్లలో. నేను కానీ అటు వెళ్తే, ‘ఒరే బాబ్జీ నువ్వు వెళ్ళి అమ్మమ్మని కాఫీ కలిపి ఏదో పంటి కిందకి నమల్డానికి జంతికలు పంపమను,’ అంటూ నన్ను బయటకి తోలేసేవారు. అందువల్ల వీళ్ళు మాట్లాడుకునేది నాకెప్పుడూ తెలిసేది కాదు.

వీళ్ళు మాట్లాడుకుంటూంటే ఒక్కొక్కపుడు ఊర్లో ఉండే ఐయ్యేపియెస్ మూర్తి అని తాత లాయర్ స్నేహితుడు ఒకాయన దిగేవాడు. ఆయనది అదో వాటం. నోటికెంత వస్తే అంతా అనేయడం, తాను చెప్పినదే వేదం అనుకునే పెద్దమనిషి. ఆయనొచ్చి వాగినంత వాగాక తాతా మావయ్యా అబ్బలనాన్నా ఆయన చెప్పినదాన్ని మరోసారి జ్ఞానపకం తెచ్చుకుని నవ్వుకోవడమో మరోటో సర్వసాధారణంగా జరిగేది. మరో విచిత్రం ఏమిటంటే ఆయన్ని ఎవరైనా – నాతో సహా – మూర్తిగారు అని పిలిస్తే ఆయనకి కోపం. పూర్తిపేరు ఐయ్యేపియెస్ మూర్తి అని పిలవాలిట. తర్వాత తెల్సిన విషయం ప్రకారం ఈ ఐయ్యేపియెస్ మూర్తి లాయర్ కనక తాతకీ అమ్మమ్మకీ ఆయనని ఏమనడానికీ మొహమాటం. అందువల్ల ఆయన వాగుడు అప్రతిహతంగా సాగేది.

మరో రెండేళ్ళకి ఓ వేసవిలో తాత దగ్గిరకి వెళ్ళాం శెలవులకి. అబ్బలనాన్న కనిపించాడు కానీ వాళ్ళావిడ లేదు. ఆవిడతో నాకు నాకు అంత చనువు లేదు కనక నేను పట్టించుకోలేదు కానీ ఓ రోజు మధ్యాహ్నం పడుకుని ఉన్నప్పుడు పక్క గదిలోంచి వినపడిన మాటలు బట్టి అబ్బలనాన్న వాళ్ళావిడ ఎవరితోనో లేచిపోయిందిట. ఇంక మళ్ళీ రాదు. అమ్మమ్మ మాట వినపడుతూనే ఉంది, “అసలు ఆవిడ గురించి సరిగ్గా పట్టించుకున్నాడా ఈ అబ్బులు ఎప్పుడైనా? తిండి, గుడ్డా అమర్చగానే సరా? ఏదో మారుమూల ఊర్లో ఉంచడం, ఆవిడ ఉందా ఊడిందా అనేది పట్టించుకోకపోతే తప్పు ఆవిడదా?”

ఈయనెప్పుడొచ్చాడో కానీ ఐయ్యేపియెస్ మూర్తి అంటున్నాడు, “నీకు సరైన శాస్తి జరిగిందిలే అబ్బలనాన్నా. ఇక్కడే మన రాష్ట్రంలో ఉంటే మంచి ఉద్యోగం వచ్చుండేది. కానీ అక్కడకెళ్ళి ఉద్ధరిద్ధామనుకున్నావు. చూడు ఇప్పుడేమైందో? పెళ్ళాన్ని ఆ మాత్రం అదుపులో పెట్టుకోలేనివాడివి పెళ్ళెందుకు చేసుకోవడం? అసలు నీకు మగతనం ఉందో లేదో? లేకపోతే ఈ పాటికి ఓ పిల్లాణ్ణి ఎత్తుకుని ఉండేవాడివి కదా? ఆవిడ అందుకే లేచిపోయింది కాబోలు. లేపోతే ఆ అడవుల్లో నీకో ఉంపుడుగత్తె ఉందా? చేసుకున్నవాళ్ళకి చేసుకున్నంత, అనుభవించు.”

ఐయ్యేపియెస్ మూర్తి అన్నది విన్నాడో లేదో గానీ అబ్బలనాన్న అన్నాడు అమ్మమ్మతో, “అదేం మాట వదినా, మొదటి నుంచీ చెప్తూనే ఉన్నాను దానికి, అయినవాళ్ళకీ, కానివాళ్ళకీ దూరంగా ఉండాలి, మీకు ఇష్టం అయితేనే నేను పెళ్ళి చేసుకుంటాను అని; ఆవిడ ఒప్పుకున్నాకే కదా పెళ్ళి చేసుకున్నది.”

తర్వాత వాళ్ళేం మాట్లాడుకున్నారో కానీ, నాకు మాత్రం పీకలదాకా కోపం వచ్చింది. వెంఠనే వెళ్ళి ఈ ఐయ్యేపియెస్ మూర్తి పీక నులిమేయాలనిపించింది. అసలే అబ్బలనాన్న దుఃఖంలో ఉంటే ఈయన ఆ వాగుడేమిటో?

మర్నాడు సరిగ్గా గమనిస్తే అబ్బలనాన్న మొహంలో విషాదఛాయలు కనిపించాయి. సాయంత్రం పూట ఊర్లోకి వెళ్తూంటే సాధారణంగా నన్ను పిలిచే అబ్బలనాన్న ఈ సారి వంటరిగా బయల్దేరాడు. అమ్మ, అమ్మమ్మా వద్దంటున్నాసరే నేను వెళ్ళి అడిగేశాను, “నేను కూడా వస్తా, నన్ను పిలవలేదే?”

ఏమనుకున్నాడో కానీ అబ్బలనాన్న అన్నాడు, “ఏవో ఆలోచనల్లో పడి నీ గురించి మర్చిపోయాన్రా బాబ్జీ, తప్పకుండా రా. నడుస్తూ ఏటి వొడ్డుకి పోదాం.”

ఇద్దరం నడుచుకుంటూ దూరంగా పోతూంటే దారిలో చటుక్కున అన్నాడు అబ్బలనాన్న “జీవితం అంటే ఇదేనేమోరా బాబ్జీ!”

నాకేమీ అర్ధంకాక అడిగాను, “ఏమిటంటున్నావు అబ్బలనాన్నా?”

నోరు జారినట్టు తెల్సింది కాబోలు, సర్దుకుంటూ అన్నాడు, “ఏం లేదురా, తాతతో మాట్లాడుతుంటే భూమి అమ్మను అని తెగేసి చెప్తున్నాడు, అది గుర్తొచ్చి ఏదో వచ్చింది నోట్లోంచి.”

తాను చెప్తున్నది అబద్ధం అని నాకూ అబ్బలనాన్నకీ కూడా ప్రస్ఫుటంగా తెలుస్తూనే ఉంది. ఇంతవరకూ వచ్చింది కనక నేనే మొదలుపెట్టాను వివరాలు లాగడానికి, “ఇప్పటివరకూ నాకు తెలియదు కానీ నువ్వేం చేస్తూంటావు అబ్బలనానా?”

నవ్వేడు అబ్బలనాన్న, “కర్ణాటక రాష్ట్రంలో మంగుళూరు దగ్గిర మారుమూల అడవుల్లో ఓ గూడెం పంచాయితీ అని ఉందిలే. అక్కడ ఒక రామకృష్ణా మిషన్ వారి దగ్గిర నా ఉద్యోగం. అది ఇటు రాష్ట్రం వారిదీ కాదు, కేంద్రం వారిదీ కాదు, పూరి గుడిసెలు తప్ప ఏమీ ఉండవక్కడ. కరెంటూ నీళ్ళు అంతంత మాత్రమే. దాదాపు నిర్మానుష్యం. ఎప్పుడో రోజుకోసారి బస్సు వచ్చి ఆగుతుంది, అదీ ఎవరైనా దిగేవారుంటేనే. లేకపోతే మరో పదీ పదిహేను కిలోమీటర్లు నడవాలి. సైకిలో, మోపెడో ఉంటే కాస్త సుఖం. చుట్టూ అడవులు. నేను చేసే పని అక్కడ పిల్లలకి పాఠాలు చెప్పడం. శుభ్రత అదీ ఎలా పాటించాలో, ఎలా ఉంటే ఆరోగ్యంగా ఉండొచ్చో అదీ చెప్పడం.”

“జీతం బాగుంటుందా, బాగా డబ్బులిస్తారా?”

ఈసారి మరింత నవ్వు, “అది మిషనరీ ఉద్యోగంరా బాబ్జీ. రోజూ తిండి వాళ్ళతోబాటే; వాళ్ళు ఏది తింటే అది. నెలాఖరుకి ఏదైనా వాళ్ళ దగ్గిర మిగిలితే అవి ఇస్తారు. లేదా మనకి వద్దనుకుంటే ఆ మిగిలిన డబ్బులు మళ్ళీ అక్కడున్న పేదవాళ్ళకే ఇస్తారు. అలా చూస్తే జీతం అంటూ ఏదీ లేదు. అయినా నేను అక్కడ జేరింది సేవ చేయడానిక్కానీ డబ్బుల కోసం కాదు.”

“కరెంట్ అదీ లేకపోతే మరి ఎలా?”

“సాధారణంగా పంచాయితీ ఆఫీసు దగ్గిర కరెంట్ ఉంటుంది. పిల్లలు అక్కడే చదువుకుంటారు. అదే స్కూలూ ఆఫీసు అన్నీను. అక్కడ కూడా కరెంట్ పోతూ ఉంటుంది. అప్పుడు ఏ లాంతరో వాడుకోవడమే. ఇటువంటి ఉద్యోగాలలో మన జీవితం అంతా అవతలవాళ్ళకి ధారపోయడానికి సిద్ధంగా ఉండాలి లేకపోతే, అందులో ఏ సేవా చేయలేం. మన సుఖం చూసుకుంటే ఎలా? అక్కడ కట్టుకోవడానికి గోచీ కూడా లేనివారు పెద్దలూ పిల్లలూ చాలామంది ఉన్నారు. వాళ్ళతో పోలిస్తే నా జీవితం మహారాజు జీవితమే.”

“అన్నం వండుకోవడం అదీ కుదురుతుందా?”

“కట్టెల పొయ్యి మీదే కాఫీ దగ్గిర్నుంచి భోజనం దాకా. చెప్పాను కదా, ఈ ఉద్యోగం సుఖం కోసం ఎంచుకున్నది కాదు. సుఖం కావాలంటే అక్కడ దొరకదు.”

ఈసారి కొంచెం ధైర్యం వచ్చింది మాట్లాడ్డానికి నాకు, తెగించి అడిగేశాను, “అందుకేనా మీ ఆవిడ లేచిపోయింది అనుకుంటున్నారు ఇంట్లో అందరూ?”

అబ్బలనాన్న చటుక్కున నా మొహంలోకి చూశాడు. కాస్త ఆశ్చర్యం, ఒకింత అసహనం మరోటీ అన్నీ కలగలపిన అబ్బలనాన్న మొహం రంగులుమారడం తెలుస్తూనే ఉంది. కాసేపు అలా చూశాక బుర్ర తిప్పి ఎటో చూస్తూ చెప్పాడు, “చదువూ సంస్కారం ఉన్న మనం అటువంటి పదాలు ఎప్పుడూ వాడకూడదురా బాబ్జీ. లేచిపోవడం ఏమిటి? ఛీ, ఛీ, నేను ఉంటున్న ప్రదేశం, నా జీవితం ఆవిడకి నచ్చలేదు. కొన్నాళ్ళు నేను నచ్చచెప్పడానికి ప్రయత్నం చేశాను. అదీగాక నేను మొదట్లో పెళ్ళి చేసుకుంటున్నప్పుడే చెప్పాను ఆవిడతో నాతో పెళ్ళైతే జీవితం ఎలా ఉంటుందో. అన్నీ ఒప్పుకున్నాకే పెళ్ళైంది. అయినా రెండేళ్ళకి ఆవిడ అలా వెళ్ళిపోతుందని నేను అనుకోలేదు. ఇంకెప్పుడూ ఇటువంటి మాట వాడకు సరేనా? ఆవిడకి ఇష్టంలేదని చెప్తే పెళ్ళే చేసుకుని ఉండేవాణ్ణి కాదు కానీ నాకిప్పుడు బాధ ఏమిటంటే, ఆవిడ తనకి ఇష్టమే అని చెప్పి నన్ను పెళ్ళి చేసుకున్నాక ఇప్పుడు అసలు నాతో ఏ మాటా చెప్పకుండా వెళ్ళిపోయింది. అంతకన్నా ఏమీ లేదు. ఎవరి జీవితం వారిది. ఎవరిష్టం వచ్చినట్టూ వారు బతకొచ్చు. అసలు మానవ జీవితాల్లో ఉన్న ఒకే ఒక రూల్ ఏమిటో తెలుసా?”

“ఏమిటది?” బుర్ర అడ్డంగా ఆడించాను.

“జీవితంలో ఎవరికీ ‘ఇలాగే బతకాలి’ అనే రూల్ అనేది లేదు. ఎవరిష్టం వచ్చినట్టూ వారు బతకొచ్చు, అవతలవాళ్ళకి ఆటంకం కానంతవరకూ అది మంచిదే,” ఇంక వెళ్దాం అన్నట్టూ లేచాడు అబ్బలనాన్న.

“ఒకమాట అడగనా అబ్బలనాన్నా, ఈ ఐయ్యేపియెస్ మూర్తిని చాచిపెట్టి కొట్టక, ఎన్ని వాగుతున్నా నువ్వేమీ అనవేం?”

“అవతలివాళ్ళు కిందకి దిగజారుతుంటే వాళ్ళతో బాటు మనం కూడా దిగజారుతామా? ఆయన లాయరు. తాతా, అమ్మమ్మల స్నేహితుడు. మనం చేసేపని మంచిదైనపుడు ఎవరేం అన్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆడవాళ్ళ విషయంలో నీచంగా మాట్లాడ్డం మాట్లాడేవాళ్ళ దిగజారుడుతనాన్ని చెప్తుంది. ఎవరి మనస్తత్వం వారిది. ఆయన అనేది నిజమా కాదా అని చూసుకుని నిజమైతే దాన్ని సరిదిద్దికోవడం, తప్పైతే గడ్డిపరకలా తీసిపారేయడం, ఇదే మనం చేయాల్సినది.”

ఆ వేసవిలో అబ్బలనాన్న, మావయ్య, తాత మాట్లాడుకుంటున్నప్పుడు చాలా విషయాలు విన్నాను. మొత్తానికి నా శెలవులు అయిపోయి వెనక్కి వచ్చేస్తూంటే నేను అడిగాను అమ్మని, వాళ్ళావిడ వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు అబ్బలనాన్న ఏం చేస్తాడో.

“తనకున్న భూమి అంతా అమ్మేసి తన డబ్బులు తనకి ఇచ్చేయమని అడిగాడు. మావయ్య, తాతా భూమి అమ్మొద్దని చెప్తే వినడు. ఆవిడ లేచిపోయాక ఒక్కడికీ డబ్బులెందుకో మరి. అదే అడిగితే తన ఇష్టం అనీ కారణాలు అవీ చెప్పలేదు. భూమి తాతలకాలం నుంచీ ఉన్నది. అమ్ముకోవడం ఎందుకూ ఇప్పుడు?”

నేను పదో తరగతీ, ఆ పైన పియుసి చదువులో పడి వేసవి తర్వాత మూడేళ్ళు తాతని చూడ్డానికి వెళ్ళలేదు. తర్వాత ఇంజినీరింగ్‌లో చేరడానికి అనంతపూర్ వెళ్ళాల్సి వచ్చింది. కొంచెం హిందీ, కన్నడం వంటబడుతున్నాయి. మొదటి సంవత్సరం అయ్యాక తీరిక చిక్కింది మరోసారి తాతని చూడ్డానికి. అప్పటికి చాలా విషయాలు చాపకింద నీరులా జరిగిపోయాయి. అబ్బలనాన్న భూమి అమ్మలేదు కానీ దాన్ని మావయ్య తీసుకుని దాని ఖరీదు అబ్బలనాన్నకి ఇచ్చేశాట్ట. ఆ డబ్బులు – దాదాపు ఇరవై లక్షలు, పట్టుకుని వెళ్ళిన అబ్బలనాన్న తర్వాత ఏడు రాలేదు, కానీ మరుసటి ఏడు వచ్చాడు. అలా ప్రతీ ఏడూ తప్పనిసరిగా వచ్చే అబ్బలనాన్న తాతని చూడ్డానికి రావడం తగ్గించాడు. అడిగితే, “వచ్చి ఏం చేయాలిరా ఇక్కడ? అందరికీ తలనెప్పి కదా, అదీగాక వచ్చాక మీ ఆవిడ ఏమైంది, మళ్ళీ పెళ్ళి చేసుకుందా, నువ్వు కూడా చేసుకుంటావా వగైరా వగైరా ప్రశ్నలే కదా? అదీగాక ఐయ్యేపియెస్ మూర్తిగారు చెప్పాడుగా నాకు జరగాల్సిన శాస్తి జరిగిందని?” అలా కొంచెం కొంచెంగా దూరం జరుగుతూ అబ్బలనాన్న పూర్తిగా ఇటువైపు రావడం మానేశాట్ట ఈ నాలుగేళ్ళలో. ఎప్పుడైనా వస్తే ఈ ఐయ్యేపియెస్ మూర్తి పనికట్టుకుని వచ్చి మరీ దెప్పుతూనే ఉన్నాడు. ఆయన శునకానందం ఆయనది.

నేను వెళ్ళేసరికి తాతకీ అమ్మమ్మకీ సంతోషం, మనవడు ఇంజినీర్ అయిపోతున్నాడని కాబోలు. పెద్దవాడినౌతున్నాను కనక ఇప్పుడు నాతో అన్ని విషయాలు చెపుతున్నారు. నేనే అడిగాను అబ్బలనాన్న సంగతి. వేసవిలో రాలేదుట కానీ గణపతి నవరాత్రుల సమయంలో వచ్చాట్ట. అవును ఇంకా ఒక్కడే. ఆయన భార్య ఎక్కడుందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఆవిడ పుట్టింటి వారిక్కూడా తెలియదు ఆవిడ ఎక్కడికి వెళ్ళిందో, కొంతమందైతే ఆవిడ చచ్చిపోయి ఉండొచ్చని అనుకుంటున్నారు. ఐయ్యేపియెస్ మూర్తిగారి సంగతి సరేసరి. మర్నాడు ఏటి వొడ్డుకి బయల్దేరాను ఒక్కణ్ణే. పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. తనని భార్య వదిలేసి వెళ్ళిపోయినా, చదుకున్న మనం ఎప్పుడూ అసభ్యమైన పదాలు వాడకూడదు అనే అబ్బలనాన్న ఎంత ఉన్నతుడో ఈ ఐయ్యేపియెస్ మూర్తి లాంటి వాళ్ళకంటే అనిపించింది. కాసేపు అక్కడే తిరిగి ఇంటికొచ్చాను దీపాలు పెట్టేవేళకి.

ఇంట్లో అందరికీ ఏదో కంగారుగా ఉన్నట్టుంది నేను వెళ్ళేసరికి. అమ్మమ్మని అడిగాను ఏమైందో. అక్కడే బల్లమీద ఉన్న టెలిగ్రామ్ చూపించింది. కొంచెం గుండెలు అదురుతుండగా తీసి చదివాను, “యువర్ బ్రదర్ పాస్డ్ ఎవే…” ఇంక టెలిగ్రామ్‌లో మిగతా విషయాలు చదవాలనిపించలేదు. ఇది ఎవరి గురించా అనుకుంటూ అమ్మమ్మకేసి చూస్తే చెప్పింది, “అబ్బలనాన్న.”

ఓ గంటపోయాక తాత అడిగాడు నన్ను, అందరం వింటూండగానే, “ఒరే నువ్వు అనంతపూర్‌లో చదువుతున్నావు కనక కొంచెం కన్నడ, హిందీ, ఇంగ్లీషు వచ్చే ఉంటాయి, నేనూ మావయ్యా ఈ ఊరి నూతిలో కప్పలం కనక మేము వెళ్ళలేము. నువ్వు అబ్బలనాన్న ఊరికెళ్ళి ఏమైందో కనుక్కొస్తావా?”

నేను వెళ్ళి ఏం చేయాలో, అసలు అబ్బలనాన్న ఉండే ఊరికి ఎందుకు వెళ్ళడమో నాకు అర్థంకాలేదు కానీ వీళ్ళు బలవంతం చేయడంతో వెళ్ళక తప్పలేదు. ట్రైన్ ఎక్కి విజయవాడ అక్కణ్ణించి మంగుళూర్. తర్వాత బస్సు. అబ్బలనాన్న చెప్పినట్టే ఉంది ఊరు. ఆ రోజు బస్సు మాత్రం పది మైళ్ళ అవతల ఆపాడు డ్రైవర్. వర్షాల వల్ల అంతా బురద ఇంక బస్సు ముందుకి వెళ్ళదు.

నేను మాత్రం ఎలాగో వెళ్తాలి కదా? బస్సు డ్రైవరు చెప్పాడు సమాధానం. చెరువులు నిండి ఉన్నాయి, బస్సు బురదలో దిగితే బయటకి రావడం కష్టం బరువు వల్ల. కానీ మనుషులైతే గట్లమీద నడుచుకుంటూ తంటాలుపడి వెళ్ళిపోవచ్చు.

అలా పొద్దున పదింటికి నడవడం మొదలుపెట్టాను వచ్చీ రాని కన్నడంలో ఎవరేనా కనిపిస్తే వాళ్ళని పలకరించి – దారి ఇదేనా, ముందుకెళ్ళడం కుదురుతుందా అనేది కనుక్కుంటూ. సగం దూరం వచ్చేసరికి మొత్తం బూట్లూ, పేంటూ అన్నీ బురదమయం, మోకాళ్ళ దాకా. దాదాపు సాయత్రం ఆరు అవుతుంటే ఊళ్ళోకి జేరాను. కనుక్కోవడం పెద్ద కష్టం కాలేదు. ఉన్నది ఒకటే పంచాయితీ ఇల్లు. పక్కనే తెలుగులాగే ఉండే కన్నడంలో రాసి ఉన్న బోర్డు – రామకృష్ణా మఠం సేవాలయం. పొద్దున్న నుంచి బురదలో నడిచిన నడకతో మట్టికొట్టుకుపోయిన నన్ను పిల్లలందరూ మూగి చూస్తూంటే ఎవరో పలకరించారు పక్కనుంచి.

నేను ఫలానా అని తెలిశాక లోపలకి తీసుకెళ్ళి ఉండే చోటు చూపించారు. వాళ్ళు పెట్టిన అన్నం తినగానే పదిమైళ్ళ నడకతో హూనం అయిపోయిన శరీరానికి నిద్ర ముంచుకొచ్చింది. పంచాయితీ అనబడే దానిలో పనిచేసే పెద్దాయనా మఠంవారి తాలూకు మనుషులూ చూపించిన మరోచోట పడుకున్నాను. ఎవరో తలుపు తడుతుంటే మెలుకువొచ్చి కళ్ళు తెరిచేసరికి భళ్ళున తెల్లారి ఉంది. వచ్చినాయన మొహం ఎక్కడ కడుక్కోవాలి, స్నానం ఎలా అనే విషయాలు చూపించాడు. ఓ గంట పోయాక రామకృష్ణా మిషన్‌లో పనిచేసే బ్రహ్మచారిగారి ముందు తేలాను అబ్బలనాన్న గురించి మాట్లాడ్డానికి. ఆయనే వచ్చి చూపించారు – అబ్బలనాన్న గది, అక్కడున్న సరంజామా వగైరా.

మహా అయితే ఇరవై అడుగుల పొడవూ వెడల్పూ ఉన్న గది. చాపా దిండూ, ఓ మూల ఒకే ఒక పుస్తకం పెన్ను, ఇలా అతి సింపుల్‌గా ఉంది లోపల. కూర్చోడానికి కానీ రాసుకోవడానిక్కానీ కనీసం ఓ కుర్చీ, టేబుల్ కూడా లేవు. ఒక పాత నీళ్ళ సీసా మాత్రం ఉంది. అంతా చూస్తూంటే ఆ బ్రహ్మచారిగారే చెప్పారు. రాత్రి పడుకునేటపుడు కులాసాగానే ఉన్నారు, మర్నాడు ఏమి చేయాలి అనేవి మాట్లాడుకున్నాం. పొద్దున్న ఎంతకీ లేవకపోతే వెళ్ళి చూశాను. అప్పటికే ప్రాణం పోయి చాలాసేపు అయింది. ఝాము రాత్రి నిద్రలో ప్రాణం పోయి ఉండొచ్చు…

“అంతకు ముందు జబ్బేమీ ఉన్నట్టు లేదేమోనండి?”

“అవును జబ్బేమీ లేదు. హార్ట్ ఎటాక్ కానీ స్ట్రోక్ కానీ వచ్చి ఉండొచ్చు.”

“దహనం ఎక్కడ చే…“ అడగబోతూంటే ఆయనే చెప్పారు.

“దహనం అంటూ ఏమీ లేదు. తన శరీరం మెడికల్ కాలేజీకి, అవయవాలు ఎవరికైనా కావలిస్తే తీసుకోమని కాయితం మీద రాసిపెట్టారు కొంతకాలం క్రితం. దాని ప్రకారం మంగుళూర్ కస్తూర్బా మెడికల్ కాలేజ్ వాళ్ళకి అప్పగించాం. మీ తాతగారి ఎడ్రస్ ఉంది మా దగ్గిర – ఎప్పుడైనా వెళ్ళేవారు కదా ఇక్కడనుంచి, అప్పుడు చెప్పేవారు తన బంధువుల గురించి. దాన్నిపట్టి మీకో టెలిగ్రామ్ ఇచ్చాం. ఆయన కనక ఇక్కడే పోతే మీకు ఓ మాట చెపితే సరిపోతుందని అన్నారు ఓ సారి ఎప్పుడో.”

తర్వాత ఏమి అడగాలో తెలియలేదు. అసలు నేనెందుకు ఇక్కడకి వచ్చానో కూడా అర్ధంకాలేదు. తటపటాయిస్తుంటే బ్రహ్మచారిగారే చెప్పారు, “కుటుంబం ఉన్నప్పుడు వాళ్ళావిడ వంట చేసేవారు. ఆవిడ వెళ్ళాక ఆయన మాతోబాటే తినడం అదీ, అందువల్ల ఆయన గదిలో పెద్దగా సామాను అదీ ఉండదు. ఆయనకి ఉన్న కొన్ని బట్టలు, ఇంకా మీకు ఏదైనా కావాలిస్తే తీసుకెళ్ళండి. ఆస్తులంటూ ఏమీలేవు.”

“ఏమీ వద్దండి, ఏదో తీసుకెళ్ళడానికని నేను రాలేదు, నేను ఇక్కడ ఉంటే అసలు మీ పనికి అడ్డమేమో, అందువల్ల మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ వెళ్ళిపోతాను.”

“సరే మీ ఇష్టం, వెళ్ళే ముందు అలా ధ్యానమందిరానికి రండి,” బ్రహ్మచారి కదిలారు.

ఓ గంట అబ్బలనాన్న గదిలో కూర్చుని చుట్టూ చూశాను ఏమైనా తెలుస్తుందేమోనని. ఉన్న పుస్తకంలో వెళ్ళిపోయిన వాళ్ళావిడ గురించి ఏదైనా రాశాడేమో అని, తన డబ్బుల విషయం ఏమైనా ఉందేమో అనీను. ఎంత వెతికినా ఏమీ కనిపించలేదు. తయారై బయటకొచ్చి వెళ్ళేముందు బ్రహ్మచారిగారు రమ్మన్నట్టూ మందిరంలోకి వెళ్ళాను.

మందిరం అంటే ఏమిటో అనుకున్నా కానీ అదో ఇల్లు అంతే. రామకృష్ణ, శారదామాత, వివేకానందుల ఫోటోలు ఉన్నాయి పూజా మందిరం అనేచోట. అగరొత్తుల వాసన తెలుస్తోంది. ఇంట్లో ఓ పెద్ద హాలు – కొన్ని పుస్తకాలు వగైరా. అటు పక్కన ఓ వంటిల్లు. ఈ మధ్యే కట్టారుట ఇది పిల్లలు చదువుకోవడానికీ వీలుంటే పడుకోవడానికీ. ఓ చోట కొన్ని మందులు. ఇల్లు మొత్తం అద్దంలా మెరుస్తోంది దుమ్ము అదీ లేకుండా. ఇంటి పక్కన ఓ చిన్న వాన్ ఉంది. అన్నీ చూపించిన బ్రహ్మచారిగారు కాసేపు మౌనంగా కూర్చున్నాక చెప్పారు: “ఈ ఇల్లు, మందిరం, వాన్ అన్నీ మీ అబ్బలనాన్నగారి చలవే. తన భూమి అమ్మేసిన ఇరవై లక్షలు రామకృష్ణా మఠానికి ఇచ్చారు. చుట్టుపక్కల ఉండే దాదాపు పదీ ఇరవై గూడేలలో ఉండే పిల్లలకి ఈ ఇల్లే రోజువారీ బడి, చదువుకీ, ధ్యానానికీ అన్నింటికీను. ఎవరికైనా వంట్లో బాగోలేక రాత్రికి రాత్రి పట్నం తీసుకెళ్ళాల్సి వస్తే వాడుకోవడానికి ఈ వేన్. అదే ఆంబులెన్స్‌గా కూడా వాడుతున్నాం. ఆయనిచ్చిన డబ్బులతో ఈ ఇల్లు, వాన్ అవీ కొన్నాక మిగతావి పిల్లలు ఎవరైనా పై చదువులకి వేరే ఊర్లకి వెళ్తే వాళ్ళకివ్వమని చెప్పారు. ఈయన ఇచ్చినది చూసి మిగతా మరికొంతమంది ఇచ్చారు. ఆ డబ్బులతో ఒక బేంక్ ఎకౌంట్ తెరిచి అక్కడ దాచాం డబ్బులు. ఎన్నోసార్లు రాజకీయనాయకులని కలిసి ఇక్కడకి మంచి రోడ్డు వేయిద్దామని ఎంతో కష్టపడ్డారు కానీ అది మాత్రం సాధ్యం కాలేదు. ఠాకూర్‌గారి దయతో అది ముందు ముందు సాధ్యమైతే బావుణ్ణు.”

ఆయన చెప్పే ఒక్కో విషయంతో సన్నగా అర్భకుడిగా ఉండే నాకు తెల్సిన అబ్బలనాన్న వామనుడు త్రివిక్రముడిగా విజృంభించినట్లయింది. మాతో – కనీసం తాతకి గానీ అమ్మమ్మకి కానీ – ఒక్క విషయం చెప్పలేదు. అయినా ఎందుకు చెప్పడం? చెపితే ఎవరు మాత్రం ఒప్పుకుని ఉండేవారు అలా డబ్బులు ఎవరికో ఉత్తినే ఇస్తానంటే? అందులోనూ గూడెం పిల్లలకా అని అరిచి గోలపెట్టరూ? అదేమాట చెప్పాను బ్రహ్మచారిగారితో. ఆయన నవ్వుతూ అన్నారు, “ఇక్కడే ఓ గూడెం కుర్రాడికి డ్రైవింగ్ నేర్పించి లైసెన్స్ ఇప్పించారు ఈ బండి నడపడానికి. అత్యవసరమైతే తప్ప ఎప్పుడూ మీ అబ్బలనాన్నగారు తన స్వంత డబ్బుతో కొనిచ్చిన ఈ వేన్‌ని కూడా వాడేవారు కాదు, పెట్రోలు వృథా అని. ట్రాజెడీ ఏమిటంటే ఆయన పోయాక శరీరం పాడయ్యేలోపుల మేమే ఆయన్ని ఈ వేన్‌లో తీసుకెళ్ళి మెడికల్ కాలేజీలో అప్పగించాం. ఆ రోజున డ్రైవర్ కుర్రాడు ఎన్నిసార్లు ఏడిచాడో లెక్కేలేదు. ఆయన ఇంత చేసినా ఆయన పేరు కానీ ఫోటో కానీ ఎక్కడా పెట్టవద్దని చెప్పారు. అందుకే ఆయన ఆనవాలు కూడా లేదు ఇక్కడ.”

బ్రహ్మచారిగారికి చెప్పి బయల్దేరాను. డ్రైవర్ కుర్రాడు వేన్‌లో పట్నం దాకా తీసుకెళ్తానన్నాడు బురదలో నడవడం కన్నా మంచిదని. అబ్బలనాన్న ఉండి ఉంటే వేన్ వాడి ఉండేవాడా? కాళ్ళు చేతులూ పనిచేస్తున్నాయి, ఆరోగ్యంగా ఉన్నాను. ఇదే దారిలో క్రితం రోజు నడిచివచ్చిన నేను మళ్ళీ నడవలేనా? వద్దు అని ఖచ్చితంగా చెప్పి నడుచుకుంటూ బయల్దేరాను. గూడెం దగ్గిర్లో ఉన్న ఇల్లు కనుమరుగౌతూంటే పాలపిట్ట కనిపించింది. శుభశకునమే. చులాగ్గా నడిచి బస్సు పట్టుకున్నాక అక్కణ్ణుంచి మంగుళూర్, విజయవాడ, అలా ఇల్లు చేరాను.

వాకిట్లోనే అమ్మమ్మా తాతా కనిపించారు. అబ్బలనాబ్బ గురిచి పూర్తిగా చెప్పడమా క్లుప్తంగా చెప్పడమా అనే ఆలోచనల్లో ఉండగానే ఈ ఐయ్యేపియెస్ మూర్తి దిగాడు. వస్తూనే వాగడం మొదలైంది, “ఏవిరా వెళ్ళావా, అబ్బలనాన్న ఉంచుకున్న రెండో ఆవిడ కనిపించిందా? డబ్బులన్నీ ఆవిడకే ఇచ్చాడా? ఆవిడకేనా పిల్లలు ఉన్నారా లేకపోతే మనవాడి మగతనం అంతేనా? చెప్పు చెప్పు, వెళ్ళి వచ్చినవాడివి అన్నీ తెలిసుంటాయ్ ఈ పాటికి.”

అబ్బలనాన్న గురించి ఇంకా వాగుతున్న ఐయ్యేపియెస్ మూర్తితో చెప్పాను, ఏకవచనంలో నిరభ్యరంతరంగా ఈసారి, “ఆపు ఇంక, నోటికొచ్చినట్టూ వాగకు అబ్బలనాన్న గురించి. నీలాటి వాళ్ళకంటే అబ్బలనాన్న ఎంతో ఉన్నతుడు. ఆయన స్థాయికి రావాలంటే నీకు మరో పది జన్మలు పడుతుంది. అసలు ఇంత వాగుతున్నావు కానీ నీకేం తెలుసు అబ్బలనాన్న గురించి?” ఆ తర్వాత ఆగకుండా అబ్బలనాన్న ఆ ఊర్లో చేసిన పనుల గురించి చెప్పాను అరగంట సేపు.

మాడిపోయిన ముఖం వేలాడేసుకుని ఏమనుకున్నాడో కానీ నోరు మెదపలేదు అయ్యేపిఎస్ మూర్తి. మౌనంగా లేచాడు వెళ్ళడానికి. ఆయన బయటకెళ్తూంటే తాతా అమ్మమ్మా వాళ్ళకి చాలకాలం తెల్సిన లాయర్ స్నేహితుణ్ణి నేను అలా కసిరినందుకు నన్ను తిట్టడమో, మరో మాట ఏదో అంటారనుకున్నాను కానీ ఇద్దరూ నాకేసి చూసి ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు. ఇన్నాళ్ళ బట్టీ తాము చేయలేని పని మనవడు చేశాడని ఆనందమేమో?