లాక్‍డౌన్‍లో ప్రద్యుమ్నుడు

కరోనా పుణ్యమా అని దేశంలో లాక్‌డౌన్ ప్రకటించారు. ప్రకటించిన మూడవ రోజున ప్రభావతి ప్రకాశంగా ఒక ప్రకటన చేసింది.

“పనిమనిషి రేపటి నుంచి రాదట. ఈ వేళనే తనకి ఈ నెలకు రావలసిన జీతం పూర్తిగా తీసుకెళ్ళింది. మళ్ళీ నెల కూడా నెల మొదట్లో వచ్చి జీతం తీసుకువెళ్తానంది. ప్రభుత్వం చెప్పిందిట కదా, లాక్‌డౌన్‌లో పనికి రాకపోయినా జీతం ఇవ్వాలి అని. అదీ సంగతి. మీకు తెలియజేయడమైనది. గ్రహించగలరు.”

“ఇందులో గ్రహించడానికి ఏముంది?” యథావిధిగా, తెలివితక్కువగా ప్రద్యుమ్నుడు తన అభిప్రాయం వెలిబుచ్చాడు.

“మీకు తెలియదని కాదు, పతివ్రతా శిరోమణిగా ప్రశ్నకు జవాబు చెప్పడం నా ధర్మం. పనిమనిషి రాకపోతే మన అంట్లగిన్నెలు మనమే తోముకోవాలి, మన బట్టలు మనమే ఉతుక్కోవాలి, మన ఇంట్లో చీపురు మనమే వేసుకోవాలి, ఆ పైన తడిగుడ్డతో మనమే తుడుచుకోవాలి, కాఫీ గిన్నెలు, కప్పులు కడగడం అదనం. వారానికి ఒక మాటు బూజులు దులపడం ఇంకో అదనం. కాదంటారా, లాక్‌డౌన్ ఎత్తేసేదాకా ఇంట్లో తల ఎత్తి చూడడం మీరు మానేయాలి. బూజులు గట్రా మీకే కనిపిస్తాయి. నాకు కొద్దిగా కనిపించినా, పనిమనిషికి అసలు కనిపించవని అవగతమే కదా?” అని ప్రభావతి విశదీకరించింది. ఎప్పటిలాగానే ప్రద్యుమ్నుడు మౌనాన్ని ఆశ్రయించాడు. కానీ ప్రభావతి కొనసాగించింది.

“సుఖదుఃఖే సమే కృత్వా… డాష్ డాష్ అని భగవద్గీతలో చెప్పారు. సుఖదుఃఖాలను సమానంగా చూడాలి అని అర్థంట. అంటే ఇంటి పనులను సమానంగా పంచుకోవాలని ఇక్కడ తాత్పర్యం చెప్పుకోవాలి.”

“భగవద్గీతలో ఆ శ్లోకం ఇంకో సందర్భంలో చెప్పాడేమో కృష్ణుడు.” సందేహం వెలిబుచ్చాడు ప్రద్యుమ్నుడు.

“కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన… డాష్ డాష్, భగవద్గీతలోదే. అంటే కర్తవ్యమును చేయడానికే నీకు అధికారము కలదు. కానీ దాని ఫలితమునందు లేదు. సూక్ష్మంగా చెప్పాలంటే కర్తవ్య బుద్ధితో పనులు చేయుము అని చెప్పాడు కృష్ణ భగవానుడు.” ప్రభావతి మళ్ళీ వివరించింది.

వేద పండితుడు ప్లస్ సంస్కృత మాష్టారి కూతురిని పెళ్ళిచేసుకొని తప్పు చేశానని వెయ్యిన్నొక్కోమారు విచారించాడు ప్రద్యుమ్నుడు. ఈ విషయంపై చర్చను పొడిగిస్తే ఆమె వేదాలు, పురాణాలు చెబుతుందేమోనని భయపడ్డాడు కూడా. మొన్నీమధ్యనే ఒకడు దైవదూషణ చేసి బ్రహ్మరాక్షసుడైన కథను చెప్పింది. పైగా వర్క్ ఈజ్ గాడ్ అనీ, పనియే ప్రత్యక్షదైవం అనీ తేల్చిచెప్పింది. ఇంకోమారు బ్రహ్మరాక్షసుడవడానికి మనస్కరించలేదు. ప్రభావతి పట్టిన కుందేలుకి ఎప్పుడూ మూడు కాళ్ళే ఎందుకు ఉంటాయో ఎప్పటికీ అర్థంకాదని సమాధానపడ్డాడు.

అయినా బెట్టు వీడకుండా, “ఈ పనిని సమానంగా పంచుకోవాలని అభ్యర్థిస్తున్నాను.” అన్నాడు ప్రద్యుమ్నుడు.

“తప్పకుండా, ఆడుతూ పాడుతూ కలసి పని చేసుకుందాం. మీరు ఆడుతూ పని చేయండి, నేను పాడుతూ మిమ్ము ఉత్సాహపరుస్తాను. నాకు వంటపని కూడా ఉంది గదా!” అంది ప్రభావతి నిర్మొహమాటంగా.

నిరుత్తరుడయ్యాడు ప్రద్యుమ్నుడు వంటపనిలో పాలుపంచుకునే ధైర్యం లేక.

మర్నాడు పనిమనిషి బాధ్యతలు స్వీకరించాడు ప్రద్యుమ్నుడు. ఉదయమే లేచిన తరువాత ఒక పెద్ద గ్లాసుడు చిక్కటి కాఫీ తాగి, రెండు సిగరెట్లు ఊది పాడేసి, వంటింట్లోని సింక్‌లో ఉన్న గిన్నెలన్నీ తోమేశాడు కసికసిగా. తోముతూ ప్రకాశంగానే ఆశ్చర్యపడ్డాడు, ‘ఒక కూర, ఐదారు చపాతీలు చేయడానికి కూడా ఇన్ని గిన్నెలు వాడాలా!’ అని.

ప్రభావతి వెంటనే, తడుముకోకుండా జవాబు ఇచ్చింది. “నిన్న ఉదయమే మీకు బాధ్యతలు అప్పగించడమైనది. అప్పటికి సగం మధ్యాహ్నపు వంట మాత్రమే అయింది. అప్పటి గిన్నెలు, కంచాలు కొన్ని ఉన్నాయి. అయినా కూరలో కూడా పోపు పెట్టనిదే మీకు ముద్ద దిగదాయే. దానికి మూకుడు కావాలి గదా. తరిగిన కూరముక్కల్ని కడగడానికి గిన్నె కావాలి కదా. గోధుమ పిండి కలపడానికి పళ్ళెం కావాలి. ఇలా ఏవో ఉంటూనే ఉంటాయి మరి. అందుకనే పనిమనిషి రెండు వేలు తీసుకుంటుంది.”

ప్రద్యుమ్నుడు యథావిధిగా మౌనాన్ని ఆశ్రయించాడు. ఇంకో నాలుగైదు రోజులు గడిచాయి. తోమిన గిన్నెలు తళతళా మెరిసిపోకున్నా, ‘ఫరవాలేదు, అంట్లు తోమడంలో ప్రావీణ్యం సంపాదించేస్తున్నాను’ అని ప్రద్యుమ్నుడు సంబరపడిపోయే శుభసందర్భంలో, ప్రభావతి అడ్డుపుడక వేసింది.

“ఏమండీ గమనించారా మీరు? గిన్నెలు తోమిన తరువాత, తడి ఆరిన గిన్నెల మీద అక్కడక్కడ పల్చగా తెల్ల చారికలు కనిపిస్తున్నాయి.” అని అంది. అంటూనే కంచం లోపలి భాగంలో తెల్లని పొరలాంటిదాన్ని చూపించింది ప్రభావతి. ప్రద్యుమ్నుడు లోలోన కంగారుపడ్డాడు. పైకి గంభీరంగా చెప్పాడు.

“ప్రియతమా, సాధారణముగా డిష్ వాషింగ్ డిటర్జెంట్స్‌లో ఫిల్లర్స్ ఉంటాయి, క్లే లాంటివి. అలాంటివి వాటర్ సాల్యుబుల్ కావు. అప్పుడప్పుడు వాటి అవశేషాలు అల్లాగ కనిపిస్తుండవచ్చు.” కెమిస్ట్రీ చెప్పాడు ప్రద్యుమ్నుడు.

“అలాంటప్పుడు ఏం చెయ్యాలి?” సౌమ్యంగానే అడిగింది అనుకున్నాడు ప్రద్యుమ్నుడు. చిరునవ్వు నవ్వి చెప్పాడు.

“ఇంకోమాటు నీళ్ళతో ఝాడించి తొలిస్తే తెల్ల చారికలు మాయమవుతాయి.” అమాయకంగానే చెప్పాడు.

“అంటే ఏం చెయ్యాలో మీకు తెలుసు కానీ చెయ్యరు. ఎందుకంటే మీ వెనక్కాల జీతభత్యాలు లేని పాలేరు నేను ఉన్నానని మీ నమ్మకం. చెయ్యక ఏం చేస్తుంది అనే ధీమా!” కటువుగానే అంది ప్రభావతి.

అంతటితో ఆపకుండా, “మిమ్మల్నని ఏం లాభం? కీ.శే. మ.ల.స. పద్మావతమ్మగారిని అనాలి. ‘మా చిన్నాడికి ఇంటి పనులేమీ రావమ్మా. గారాబంగా పెరిగాడు’ అంటూ సంగీతం పాడేది, నేను కాపురానికి వచ్చిన కొత్తలో. కోడలు కూడా గారాబంగానే పెరిగిందేమోనన్న అనుమానం కూడా లేదు ఆమెకు. ఇంట్లో ఉన్న పదిహేను మందికి ఇడ్లీలకి రుబ్బురోలు ముందు గొంతుకుకూర్చుని గంటన్నర పైగా నేను పప్పు రుబ్బితే, ఎక్కడో ఒక చిన్న పప్పుముక్క నలగలేదని అరగంట అష్టోత్తరం, సహస్ర నామాలు చెప్పింది నాకు. పక్కనే నుంచుని చిరునవ్వు చిందించారు మీరు. కానీ నోరు విప్పి ఒక్క మాట అనలేదు.” ఆయాసంతో ఆగింది ప్రభావతి.

“ఇప్పుడు అవన్నీ ఎందుకు రాణీ? మా అమ్మ పోయి నలభై ఏళ్ళు దాటింది గదా. ఇప్పుడు నేర్చుకుంటున్నాను కదా పనులన్నీ!” రాజీపడే ఉద్దేశం వినిపించింది ప్రద్యుమ్నుడి మాటల్లో. అయినా ఆగలేదు ప్రభావతి.

“ఏం నేర్చుకుంటున్నారు? ఆ తలుపు మీద ధూళి, తలుపు మూలల బూజూ మీకు కనిపించవు. అవే పొరపాటున నేను చూడకపోతే మీరు మీ అమ్మ దగ్గర నేర్చుకున్న అష్టోత్తరం, సహస్ర నామాలు మళ్ళీ మళ్ళీ వల్లె వేస్తారు.” ఇంకా ఏదో అంటూనే ఉంది.

ప్రద్యుమ్నుడేమీ గౌతమబుద్ధుడు కాదు కదా. రాగద్వేషాల కతీతం కాని సామాన్య మానవుడు. ప్రద్యుమ్నుడికి కోపం వచ్చింది. వాట్ ఈజ్ దిస్ అని ఇంగ్లీష్‌లో ప్రశ్నించుకున్నాడు. ఇంత అలక్ష్యమా అని తెలుగులో బాధపడ్డాడు. యే ఠీక్ నహీ హై అని హిందీలో తీర్మానించుకున్నాడు. అసహనం, అసహాయత, చిరాకు, కోపం గూడుకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి ప్రద్యుమ్నుడి మనసులో. కానీ ప్రద్యుమ్నుడు జ్ఞాని. ‘భార్య ఎదుట కోపం ప్రకటించరాదు. ఆమెతో మాట్లాడుతున్నప్పుడు కాదు, లేదు, తప్పు అనే పద ప్రయోగాలు చేయరాదు’ అనే బ్రహ్మసూత్రం తెలిసినవాడు.

ప్రద్యుమ్నుడి మనసులో తెల్ల మనిషి, నల్ల మనిషి ముష్టియుద్ధం చేయడం మొదలుపెట్టారు. ప్రద్యుమ్నుడు బ్రహ్మజ్ఞాని కాబట్టి తెల్ల మనిషే గెలిచాడు. యుద్ధం చేయకుండా, ఎప్పటిలాగే ఓటమినంగీకరించి, తలుపు తీసుకొని ఇంటి గేటు ముందు నిలుచుని, ‘పద్మావతీ పుత్రా ప్రద్యుమ్నా, నీవింత పిరికివాడవయ్యామేమిరా!’ అని మనసులోనే అనుకొని విచారించాడు, తల్లి అంటే ఎనలేని భక్తి గల ప్రద్యుమ్నుడు.

టీవీలో మహాభారతం, రామాయణం సీరియల్స్ పునఃప్రసారం మొదలు అయ్యింది. ఈ సీరియల్స్ ఇదివరకు ప్రద్యుమ్నుడు, ప్రభావతి చూసారు. అయినా కాలక్షేపం కోసం, అప్పుడు చూడని భాగాలు ఏమైనా ఉంటే చూడవచ్చునని కూడా మళ్ళీ చూడడానికి ఉద్యుక్తులయ్యారు.

అవ్విధంబుగా సీతా స్వయంవరం రోజున సీరియల్ చూస్తూ చూస్తూ ఒక్క మాటుగా ప్రభావతి “చూడండి చూడండి!” అని ఘట్టిగా అంది. ప్రద్యుమ్నుడికి అర్థంకాలేదు.

“ఏమిటి దేవీ ఆ కంగారు?” అని ప్రశ్నించాడు.

“సీతాదేవి నడుముకు ఉన్న వడ్డాణం చూడలేదా?” అని ప్రశ్నించింది ప్రభావతి. ప్రద్యుమ్నుడు శిరస్సు అడ్డంగా ఊపాడు, ‘చూడలేదు’ అనే అర్థం వచ్చేటట్టు. ఎందుకైనా మంచిదని అమాయకంగానే, ఒక బరువైన డైలాగు వదిలాడు. “అసలు సీతాదేవిని అమ్మ అనే అంటారు. సీతమ్మ తల్లి అని నొక్కి వక్కాణిస్తారు. భక్తి భావం ఉట్టిపడి నమస్కారం చేస్తారు ఎవరైనా. ఆవిడ పడిన కష్టాలతో పోలిస్తే మనకు అసలు కష్టాలు లేవని వినమ్రంగా శిరస్సు వంచి మొక్కుతారు. అటువంటిది నీకు ఆమె నడుముకు ఉన్న వడ్డాణం కనిపించిందంటే నీకు భక్తి లేదు అని అర్థం అవుతోంది నాకు.”

“కబుర్లు చెప్పకండి. మీరు సీతాదేవిని చూస్తారో, ఆ నటిని చూస్తారో నాకు తెలియదా? అటువంటి వడ్డాణాలు ఇప్పుడు మళ్ళీ ఫాషన్ అవుతున్నాయి. అటువంటి వడ్డాణం గొలుసుగా కూడా మార్చి వేసుకోవచ్చుట. మొన్న ఖజానా వాళ్ళ వెబ్‌సైట్‌లో చూపించింది అమ్మాయి,” అని వివరించింది ప్రభావతి. డైలాగు కొనసాగిస్తూ, “ఎప్పటికైనా వడ్డాణం పెట్టుకునే భాగ్యం కలుగుతుందో లేదో నాకు. మీకు అప్పుడే 76 ఏళ్ళు వచ్చేశాయి కూడాను.” అంటూ ను-ని కడు దీర్ఘంగా పలికించింది ప్రభావతి.

“నాకున్న ఆస్తిని 2తో గుణించినా, దానికి నీ ఆస్తి కూడినా నీకు వడ్డాణం చేయించడం కష్టం.” విన్నవించుకున్నాడు ప్రద్యుమ్నుడు దీనంగా.

“నా ఆస్తి అంటూ ఏముంది? నా పెళ్ళిలో మావాళ్ళు పెట్టిన బంగారం తప్ప.” (మా వాళ్ళు పెట్టిన అనే పదాలు అండర్ లైను, బోల్డ్‌లుగా పలికింది). “పెళ్ళైన ఈ ఏభై ఏళ్ళలో మీరు ఏం చేయించారు నాకు? లెఖ్ఖ తేల్చండి.”

ఇంకా ప్రభావతి ఏదో అనబోయే లోపులే, ఉరుము ఉరిమి మంగలం పైన పడే సూచనలు కనిపించి, ఇక మీదట ప్రభావతితో కలిసి పురాణ సీరియల్స్ కానీ సినిమాలు కానీ చూడకూడదని శపథం చేసుకున్నాడు. ఎందుకైనా మంచిదని మహారాణులు రాజకుమారిలు ఉన్న జానపద సినిమాలు కూడా ఆ లిస్టులో జేర్చి ప్రద్యుమ్నుడు తలుపు తీసుకొని పక్కింటాయనతో చర్చలకి వెళ్ళాడు, ఇళ్ళమధ్య గోడ దగ్గరికి. ఇలియానా నటించిన అటువంటి సినిమాలైనా కూడా నిషిద్ధమే అని విచారంగా నిర్ణయించుకున్నాడు పాపం ప్రద్యుమ్నుడు.

లాక్‌డౌన్‌లో ఎటూ వెళ్ళే అవకాశం లేక ఇంట్లోనే కూర్చోవలసి వచ్చింది పాపం ప్రద్యుమ్నుడికి. ఇరవై నాలుగు గంటలు ఇంట్లోనే ఉండడం వల్ల చిన్నా చితకా సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి ఇంట్లో. చినుకు చినుకు గాలివాన అయ్యే సూచనలు కనిపించగానే తెల్ల జెండా ఎగరవేసేసే వాడు ప్రద్యుమ్నుడు. ప్రభావతి విజయగర్వంతో నవ్వుతూనే ఉంది. అనుకోని కోణంలో ఇంకో సమస్య వచ్చింది. ఈ సమస్యకు ప్రభావతి కారణం కాదు.

ప్రద్యుమ్నుడికి ధూమపానం అలవాటు. రోజుకి నాలుగు పేకట్లు పైనే కాలుస్తాడు. లాక్‌డౌన్‌ కారణంగా, ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా మందు షాపులతోబాటు కిళ్ళీకొట్లు కూడా మూసివేశారు. ఒక వారం రోజులు తన బ్రాండ్ సిగరెట్లు సమస్య లేకుండా అక్కడా ఇక్కడా కిరాణా షాపుల్లో దొరికాయి, ఒక పది రూపాయలు ఎక్కువ ధరతో. రోజులు గడిచేకొద్దీ బ్లాక్ మార్కెట్ ధరలు పెరిగాయి. కందిపప్పు ధర ముప్పై శాతం పెరిగినప్పుడు, సిగరెట్ల ధర డెబ్భై శాతం పెరిగితే ఆశ్చర్యపడకూడదని దుకాణదారు హితవు పలికాడు. వంద శాతం పెంచి అంతా మిథ్య కాదు అని నల్ల బజారు వేదాంతం బోధించాడు. పైగా తన బ్రాండ్ సిగరెట్లు లేనప్పుడు ఉన్న బ్రాండే అంటకట్టి ‘ధీరులు ధరలు పెరిగినా, బ్రాండ్ మారినా ధూమపానం విడువరాదు, ఏ బ్రాండ్ కాల్చినా మిగిలేది బూడిదే’ అని సుభాషితాలు నేర్పేడు. పాపం ప్రద్యుమ్నుడు అలవాటు మానుకోలేక దొరికిన బ్రాండ్ సిగరెట్లు కాల్చడం మొదలుపెట్టాడు. ధూమపాన ప్రియులు చాలామందికి బ్రాండ్ మారిస్తే రెండు, మూడు రోజులు దగ్గు అయాచిత వరం లాగా వస్తుంది. రెండు రోజులు ప్రద్యుమ్నుడి గొంతు కూడా ఆ ఆచారం పాటించింది శ్రద్ధగా, కొంచెం తీవ్రంగానే.

ఉన్నట్టుండి ప్రద్యుమ్నుడి ఇంటిముందు పోలీసు కారు వచ్చి ఆగింది. కార్లోంచి అంతరిక్ష యాత్రికుల్లా డ్రస్ వేసుకున్న నలుగురు దిగారు. ప్రద్యుమ్నుడు, ప్రభావతి కూడా కంగారుపడ్డారు. వచ్చిన వారు పరిచయం చేసుకున్నారు.

“నేను ఈ ప్రాంత ఎస్.ఐ.ని, వీరు ప్రభుత్వ వైద్యులు కరోనా పరీక్షా నిపుణులు, ఆమె ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సు, ఆయన సహాయకుడు.”

“సహాయకుడు ఎందుకండి?” అమాయకంగానే, తెలివితక్కువగా కూడా అడిగాడు ప్రద్యుమ్నుడు.

“మీరేమైనా అభ్యంతరం చెబితే ఆ ఆంబులెన్స్‌లో ఎక్కించడానికి కావాలి కదండీ!” జవాబు ఇచ్చాడు పోలీసు ఎస్.ఐ.

“ఇంతకీ, మా ఇంటికి మీ రాక ఎందుకో అర్థంకావటం లేదు?” ప్రభావతి కలగజేసుకొని అడిగింది.

“మీ ఇంట్లో శ్రీ ప్రద్యుమ్నుడుగారు, గత రెండు రోజులుగా నిరంతరాయంగా దగ్గుతున్నారుట. సమాజ శ్రేయస్సు కోరుకునే మీ వీధిలోని పౌరుడు ఒకరు ఈ వేళ ఉదయమే మా హెల్ప్‌లైన్‌కి ఫిర్యాదు చేశారు. వెంటనే మేము రావాల్సి వచ్చింది. శ్రీ ప్రద్యుమ్నుడిగారిని, వారితో బాటు మిమ్ము కూడా ఆసుపత్రికి తీసుకెళ్ళి కరోనా పరీక్షలు చేయించాలి. దగ్గు, గొంతు నొప్పి, జ్వరం ఇత్యాదులు కరోనా ప్రాథమిక లక్షణాలు అని తెలిసి కూడా మీరు ఇలా అశ్రద్ధ చేయకూడదు. మీతో బాటు ఈ వీధిలోనూ, ఈ కాలనీలోనూ ఈ వ్యాధి వ్యాపించే అవకాశాలు ఉన్నాయి కదా. మీవారు సైంటిస్ట్‌గా రిటైర్ అయ్యారట గదా. నాలుగూ తెలిసిన వారు, వయసు పైబడ్డవారు, చదువుకున్నవారు, వారు కూడా ఇలా నిర్లక్ష్యంగా ఉండడం నేరంగానే పరిగణించాలి.” ఇద్దరినీ కలిపి మందలించాడు వైద్యుడు.

ప్రద్యుమ్నుడు బుర్ర గోక్కున్నాడు. నాలిక కొరుక్కున్నాడు. గొంతు సవరించుకున్నాడు. సిగరెట్ల ఉదంతం అంతా వివరంగా వివరించాడు. వారు శ్రద్ధగా విన్నారు. టెంపరేచర్ చూశారు. గొంతులోను, ముక్కులోను బేటరీ వేసి పరిశీలించారు. గుండె చప్పుడు కూడా శ్రద్ధగా ఆలకించారు, సిగరెట్ల పేకెట్స్ పరిశీలించారు. వారు ఉన్న అరగంట, ముప్పావు గంటలో ప్రద్యుమ్నుడు దగ్గలేదని నిర్ధారించుకున్నారు. సహాయకుడు కూడా ధూమపాన ప్రియుడే. వారు కూడా ప్రద్యుమ్నుడి సిగరెట్ల ఉదంతాన్ని బలపరిచారు.

“ప్రస్తుతానికి ఏమీ ఇబ్బంది ఉన్నట్టు లేదు. జ్వరం వచ్చినా, గొంతు నొప్పి వచ్చినా, మరే ఇతర ఇబ్బంది వచ్చినా మాకు వెంటనే తెలియపరచండి. జాగ్రత్తగా ఉండండి. మాస్కులు ధరించండి, దూరం పాటించండి. ఎవరినీ ఇంట్లోకి రానీయకండి. ఎక్కడికీ వెళ్ళకండి. ఇంట్లోనే ఉండండి.” అని సుద్దులు చెప్పి, పక్క ఇంటివారిని కూడా విచారించి వెళ్ళిపోయారు.

ప్రద్యుమ్నుడు, ప్రభావతి ఊపిరి పీల్చుకున్నారు. కరోనా ఉపగండం దాటింది అని స్థిమితపడ్డారు. కానీ ప్రద్యుమ్నుడు వాళ్ళ వీధిలో ప్రజాశ్రేయస్సు కోరుకున్న ఆ పౌరుడు ఎవరా అని ఆరా తీయడం మొదలుపెట్టాడు.

ఇంతలోనే లాక్‌డౌన్ కొనసాగుతుందని మళ్ళీ ప్రకటించారు ప్రభుత్వంవారు. హతాశుడయ్యాడు ప్రద్యుమ్నుడు. ఇంకెన్ని కష్టాలు దాపురించబోవుతున్నాయోయని దుఃఖించాడు. కష్టాలు కూడా అనంత రూపాల్లో వస్తాయని గ్రహించాడు, అది ఎట్లనిన:

రెండు మూడు రోజులక్రితం ఒక మిత్రుడు టెలిఫోన్ చేశాడు. ఆ చేసిన శంకర నారాయణ ప్రద్యుమ్నుడి బాల్యమిత్రుడు. ప్రీ యూనివర్సిటీ నుంచి ఎమ్.ఎస్‌సి. దాకా ఆ తరువాత కూడా ఆ స్నేహం కొనసాగింది. రిటైర్ అయిన తరువాత ఇద్దరూ హైదరాబాదులోనే ఉంటున్నారు. ఫామిలీతో కూడా చనువు ఎక్కువే. భీమవరం వాడు. సాధారణంగా బాల్య మిత్రులు ఫోన్ చేస్తే ప్రద్యుమ్నుడికి ఇచ్చేస్తుంది ప్రభావతి. కాని ఆ వేళ ఆ సమయంలో, ప్రద్యుమ్నుడు పనిమనిషి అవతారంలో ఉన్నందున ఆవిడే మాట్లాడింది. పాపం ప్రద్యుమ్నుడికి ప్రభావతి మాట్లాడిన మాటలే వినిపించాయి.

“…”

“నమస్కారమండి, బాగున్నారా మీరంతా?”

“…”

“నాలుగు రోజుల క్రితం మా కాలనీకి కూరగాయల బండి వచ్చింది. వెళ్ళి తీసుకువచ్చారు ఈయన. నాలుగు కొట్లు తిరిగారుట సిగరెట్లు కొనడానికి.”

“…”

“లాక్‌డౌన్ నాకు అలవాటేలెండి. ఎనిమిది నెలల క్రితం మీ కుకట్‌పల్లి లోనే ఏదో ఫంక్షన్‌కి వెళ్ళాం. మళ్ళీ మొన్న జనవరిలో అమ్మాయి, అల్లుడు పిల్లలతో కలసి వాళ్ళ కారులో షిర్డీ, తుల్జాపూర్, సింగానాపూర్ అనుకుంటాను శనిదేవుడి ఆలయంట, తిరిగివచ్చాం ఒక నాలుగు రోజులు. అప్పటినుంచి మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఇల్లు కదలాలేదు. బయటకు కాలు పెట్టాలేదు.”

“…”

“మీ మిత్రుడికి ఊరంతా తిరగడం అలవాటే కదా. నేనంటే ఆయనకు మహా ప్రేమ కదా. ఆయనతో కలిసి తిరిగితే నేను అలసిపోతానుట. నా మోకాళ్ళు అరిగిపోతాయట. అందుకని నన్ను తీసుకెళ్ళరు. నేను అలసిపోతే ఆయనకు వండిపెట్టేవారు ఉండరు అని వారి బెంగ కాబోలు.”

“…”

ఇంకో క్షణం ఆగలేదు ప్రద్యుమ్నుడు. ఇంటి బయటకు వెళ్ళి మూడు నాలుగు సిగరెట్లు కాల్చుకొని ప్రభావతి ఫోన్ పెట్టేసిన పది నిముషాల తరువాత నెమ్మదిగా ఇంట్లోకి అడుగుపెట్టాడు.

మర్నాడు ఉదయమే 5 గంటలకు లేచి స్నానం చేసి శుచిగా 5:30 గంటలకల్లా తపస్సు మొదలుపెట్టాడు ప్రద్యుమ్నుడు, త్వరలో కరోనా వైరస్ అంతమవ్వాలని, అతిత్వరలో లాక్‌డౌన్ ఎత్తేసే సద్బుద్ధి ప్రభుత్వానికి కలగాలని కోరుకుంటూ. ప్రతిరోజూ 5:30 నుంచి కనీసం అంట్లు తోమే టైము దాకానైనా క్రమం తప్పకుండా రోజూ తపస్సు చేయాలని త్రికరణ శుద్ధిగా నిర్ణయించుకున్నాడు ప్రద్యుమ్నుడు.

అయితే, ఈ తపస్సు కూడా లాక్‌డౌన్ కష్టమేనని ప్రద్యుమ్నుడికి జ్ఞానోదయం మాత్రం కాలేదు.

రచయిత బులుసు సుబ్రహ్మణ్యం గురించి: హాస్యరచయితగా బ్లాగ్లోకంలో ప్రసిద్ధులు. ఇటీవలే వారి రచనల సంకలనం "బులుసు సుబ్రహ్మణ్యం కథలు" ప్రచురించారు.  ...