రాజకీయాందోళనము

[1828వ సంవత్సరమునకును 1835వ సంవత్సరమునకును మధ్యకాలమున ఇంగ్లాండు దేశపు రాజకీయార్థిక పరిస్థితులలో కొన్ని మార్పులు కలిగినవి. అది ఇంగ్లాండు దేశముననే కొంత ఉదార రాజనీతి వర్ధిల్లిన కాలమని చెప్పవచ్చును.

ఆ కాలమున ఇంగ్లాండులోనే గాక ప్రపంచమునందంతటను సద్భావములు వర్ధిల్లెను. బానిసత్వము అమానుషమను భావము కలిగి దానిని తొలగించుటకు కృషి జరిగెను. అదివరకు ఇంగ్లాండుదేశపు పార్లమెంటులో కామన్సు సభ పేరునకు ప్రజాప్రతినిధుల సభగనుండెనుగాని నిజమునకది భాగ్యవంతుల చేతులలోనుండెను. అందు సామాన్యులకు ఎన్నికలలో జయము కలుగుట దుర్లభముగానుండెను. ప్రభువులే తమ పక్షము వారినాసభకు ఎన్నికలలో నిలువబెట్టుచుండిరి. ఈ పద్ధతిని సంస్కరించుటకు 1832లో నొక శాసనము చేయబడెను. దీనిని బట్టి ఎన్నికలు జరిగెను. ఆ ప్రకారమెన్నుకొనబడిన ప్రజాప్రతినిధులుగల క్రొత్తపార్లమెంటు సమావేశముకాగా ఉదార రాజ్యనీతిజ్ఞులు ఇంగ్లాండులో మంత్రులైరి. అంతట నింగ్లాండులో కొన్ని రాజ్యాంగ సంస్కరణలు జరిగెను. బ్రిటీషు సామ్రాజ్యములోని వివిధ భాగములలో బానిసత్వమును నిషేధించవలెనని పార్లమెంటువారు తీర్మానించిరి. ఇంగ్లాండు దేశపరిపాలనలో ఒక వలసరాజ్యముగా నుండిన కెనడాదేశమునకు స్వపరిపాలనము నొసగుటకును ఈ క్రొత్త పార్లమెంటువారు తీర్మానించిరి.

హిందూదేశ పరిపాలనమును జరుపుటకు తూర్పు ఇండియా వర్తక సంఘమువారికి క్రొత్త పట్టానిచ్చు సందర్భము 1833లో తటస్థించినది. 1831-32 మధ్య దీనినిగూర్చి పార్లమెంటుసభలో విచారణ జరిగినది. అప్పుడీ దేశములో నుద్యోగము చేసినవారిని చాలమందిని విచారించిరి. అప్పుడే రాజారామమోహనరాయలవారి సాక్ష్యమును కామన్సు సభవారికి లిఖితమూలముగా సమర్పింపబడెను. క్రొత్తపట్టాను కంపెనీవారికిచ్చుటలో కొన్ని నిబంధనలను చేయుచు పార్లమెంటువారొక శాసనమును చేసిరి. కంపెనీ కొలువులోనుద్యోగముల నొసగుటలో జాతిమత వివక్షతను చూపకూడదను నొక ధర్మసూత్రమునా చట్టమున చేర్చిరి. హిందూదేశములో శాసన నిర్మాణ వ్యవహారములను నిర్వహించు గవర్నరుజనరలు కార్యాలోచన సభలోనొక “లామెంబరు” అను న్యాయశాఖ సభ్యుని నియమించిరి. ఇంకను కొన్ని చిల్లర సంస్కరణములను చేసిరి.]

1838లో పార్లమెంటువారు చేసిన రాజ్యాంగ చట్టము భారతదేశమునకు కొంత ఉపకారమును కొంత అపకారమును కలుగుటకు కారణమైనది. ఆకాలమున మనకు గవర్నరుజనరలుగా వచ్చిన విలియం బెంటింకు ప్రభువును లా మెంబరుగా వచ్చిన మెకాలే అను ప్రతిభాశాలియు చాలా తెలివితేటలు గల రాజ్యనీతి చతురులు. ఈ హిందూదేశమున ఇంగ్లీషు సామ్రాజ్యము యొక్క పునాదులను బలపరచుటకును ఈ దేశ ప్రజలకు ఇంగ్లీషు ప్రభుభక్తిని కలిగించుటకును ఆంగ్లేయ నాగరకత యీదేశమున వ్యాపింపచేయుట యవసరమని వీరు గ్రహించిరి. ఈ దేశములో మొగలాయి సామ్రాజ్యము పట్ల ప్రజలకు భక్తివిశ్వాసములు కలుగుటకు గల ముఖ్యకారణములలో పారశీభాషను రాజభాష చేయుటయొకటి యని వీరికి స్ఫురించెను. చరిత్రను పరిశీలించుటవలన నీ పారశీభాష మూలముననే హిందూముసల్మాను ప్రజలందరును మొగలాయి సభ్యతను స్వీకరించి ఆ ప్రభువులపట్ల భక్తికలిగియున్నట్లు వారికి రూఢియైనది. అట్లే ఇంగ్లీషుభాషను రాజభాష చేసినచో భారతీయులు నిజవేషభాషలపైన అభిమానమును వదలి ఆంగ్లేయ వేషభాషలపైన అభిమానము కలిగియుందురనియు, వారు ఇంగ్లీషు ప్రభుభక్తిని కలిగియుందురనియు వారు నిశ్చయించిరి. ఇంతేగాక ఇంగ్లీషు భాష ద్వారమున పాశ్చాత్యశాస్త్ర విజ్ఞానమును బోధించినచో నీదేశీయులకు తమ మతధర్మములపైన కూడా విశ్వాసము తగ్గిపోయి క్రైస్తవమత ధర్మముపైన నమ్మకము కలిగింపవచ్చుననియు వారాలోచించిరి.

ఆ సమయమున అనగా 1830లో ఆంగ్ల విద్యాబోధనము ద్వారా క్రైస్తవమత ప్రచారము చేయుటకు అలెగ్జాండర్ డఫ్ అను క్రైస్తవ మతబోధకుడు కలకత్తాకు వచ్చెను. విలియం బెంటింకును దర్శించి ఆయనతో ఆలోచన చేసెను. అప్పటికే దేశీయ ప్రముఖులు కూడా ఇంగ్లీషు విద్యను స్థాపింపుడని ప్రభుత్వమువారిని కోరుచుండిరి. అంతట వీరందరునాలోచించి ఇంగ్లీషు భాష ద్వారా పాశ్చాత్య శాస్త్రవిజ్ఞానమును బోధించు ఆంగ్లవిద్యాపద్ధతి నీదేశమున ప్రవేశపెట్టుటకు 1835లో నిశ్చయించిరి. పారశీభాషకు బదులుగా నింగ్లీషుభాష రాజభాషగా చేయబడెను. (Life of Alexander Duff, George Smith, 1868.)

ఆకాలమున స్థాపించిన మిషనరీ పాఠశాలలందు బైబిలు పాఠములను బోధించుచు క్రైస్తవమతప్రచారము చేయబడుచుండెను. ఆయుర్వేదమునకు బదులుగా నింగ్లీషు వైద్యశాస్త్రమును బోధించుటకు కూడా నిశ్చయించిరి. ఇట్లు ఒక్కసారిగా కొత్త పద్ధతులు, నవీన భావములు దేశములో వ్యాప్తిచెందగా ప్రజలలో ముఖ్యముగా యువకులలోనొక భావవిప్లవమే కలిగెను. పారశీభాషలో ప్రాచీన శాస్త్రములు నేర్చుకున్నవారి విలువతగ్గిపోయి ఇంగ్లీషు నేర్చినవారికి విలువ హెచ్చెను. ఇంగ్లీషు పాఠశాలలందు పరీక్షలందు నెగ్గినవారికి ఉద్యోగములివ్వబడునని హార్డింగుగారు 1844లో శాసించుటతో నీమార్పు పూర్తియైనది.

ఈ దేశీయుల మతాచారములతో నెట్టి జోక్యమును కలిగించుకొనమనియు దేశములో ప్రచారమునందున్న అన్నిమతములను సమానముగా చూతుమనియు నింగ్లీషు కంపెనీ ప్రభుత్వమువారు వాగ్దానముగావించియుండిరి. ఉద్యోగములనిచ్చుటలో జాతిమత విచక్షణ చూపబడదని 1833వ సంవత్సరపు రాజ్యాంగచట్టము నిర్ణయించినది. ప్రజలను క్రైస్తవమతమున కలుపుకొనుటకు ప్రయత్నింపమని కంపెనీవారు స్పష్టముగా ప్రకటించిరి. కాని ఇంగ్లీషు పరిపాలన బలపడినకొలదియు నీ వాగ్దానములన్నియు వృధలయిపోయినవి. క్రైస్తవమత ప్రచారము చేయుటకు మిషనరీల నీదేశమునకు రానిచ్చుటయె గాక ప్రభుత్వమువారు వారికి సర్వవిధమైన సహాయమును చేయసాగిరి. క్రైస్తవ మతమున గలియవలసినదని వారు బలవంతపెట్టుచున్నారని ప్రజలు మొఱపెట్టుకొన్నను ప్రభుత్వమువారు వినిపించుకొనలేదు. పైగా క్రైస్తవ మతబోధకుల పట్ల పక్షపాతబుద్ధి వహించిరి. క్రైస్తవులైన వారికుద్యోగములిచ్చి ప్రోత్సహింపసాగిరి.

ఇంగ్లీషు విద్యావిధానమును స్థాపించునప్పుడు మతముతో సంబంధములేని లౌకిక విద్యను మాత్రమే బోధించు పాఠశాలలను స్థాపించెదమని ప్రభుత్వమువారు వాగ్దానము చేసియుండిరి. గాని పాఠశాలలను స్థాపించినది మొదలు అందులోనేదోవిధముగా క్రైస్తవమతబోధను ప్రవేశపెట్టవలెనని సకలవిధములైన ప్రయత్నములు చేయసాగిరి.

చెన్నపట్టణమున ప్రభుత్వపాఠశాలలందు చదువుకొను పిల్లలను పరీక్షించుటకు మిషనరీలనే పరీక్షకులుగా నియమించిరి. వారు పిల్లల ప్రపంచజ్ఞానమును పరీక్షించునెపముతో క్రైస్తవమత సిద్ధాంతములను గూర్చియు బైబిలును గూర్చియు ప్రశ్నించి సరియైన ప్రత్యుత్తరములు చెప్పలేని పిల్లలను పరీక్షలందు తప్పించుచుండిరి. పరీక్షలందుత్తీర్ణులుకాని పిల్లలకుద్యోగములివ్వరు. ఇది అన్యాయమని ప్రజలు మొఱపెట్టగా క్లాసులో బైబిలు చదువుకొన్నచో నీ బాధయుండదుకదాయని అధికారులు చెప్పసాగిరి!

1842-48 సంవత్సరముల మధ్య మద్రాసు గవర్నరుగా నుండిన ట్వీడ్‌డేల్ ప్రభువు తీవ్రమైన క్రైస్తవమత పక్షపాతిగనుండెను. రెవెన్యూ సెక్రటరీగాను ఛీఫ్ సెక్రెటరీగాను పనిచేసిన తామస్‌గారును, సుప్రీముకోర్టు జడ్జిగానుండిన బర్టన్‌గారును ఇంకను మద్రాసు ప్రభుత్వములోని ఇతర పెద్దయుద్యోగులును క్రైస్తవమతాభిమానులుగనె యుండిరి. పెక్కుమతాధికార్లు జడ్జీలును కలెక్టరులును కూడా క్రైస్తవమత బోధకులు చెప్పినట్లెల్ల చేయుచు వారికై సహాయము చేయుచుండిరి.

1848 మొదలు 1853 వరకును చెన్నపట్టణమున గవర్నరుగానుండిన సర్ హెన్రీపాటింజెర్‌గారు కూడా క్రైస్తవమత పక్షపాతిగనేయుండెను.

హిందూ ధర్మశాస్త్రము ప్రకారము ఇతర మతములందు కలిసినవారికి సమష్టి కుటుంబము యొక్క ఆస్తియందు హక్కులు నశించును. హిందూమతమును వదలి క్రైస్తవమతమున గలియుటకిది ఆటంకముగానున్నదని మిషనరీలు గ్రహించి ఈ ధర్మశాస్త్ర నిబంధనను తొలగించవలసినదని వారు ప్రోత్సహింపగా వంగ రాష్ట్రమున గవర్నరుగానుండిన విలియంబెంటింకుగారు అట్టిచట్టమును 1832లో చేసి హిందూధర్మశాస్త్రమునే సవరించిరి. ఇటువంటి శాసనమునే చెన్నరాష్ట్రమునందు కూడ చేయించవలెనని మిషనరీలు 1845లో  గట్టి ప్రయత్నముచేసిరి. చెన్నపట్టణ రాజధాని గవర్నరైన ట్వీడ్‌డేల్ ప్రభువు మిషనరీల ప్రోత్సాహంతో 1846 సంవత్సరము ఆగష్టు 24వ తేదీన బైబిలు గ్రంథమును ప్రభుత్వ పాఠశాలలోనొక పాఠ్యగ్రంథముగా నుండునట్లు ఉత్తరువు చేసెను. కంపెనీ సర్కారువారిట్లు మిషనరీలకు బహిరంగముగానే సహాయము చేయసాగిరి. (Representative men of Southern India S. Parameswaran Pillai Life of Gajula Lakshiminarsu Chetty.)

ఆంగ్లేయ విద్యావిధానమువలనను, క్రైస్తవమత బోధకుల ప్రచారమువలనను, దేశములోని యువకులలో వింతయైన మార్పులు కలిగెను. ఇంగ్లీషు చదువుకొనినవారిలో క్రైస్తవ మతబోధకుల విమర్శనములవలనను ప్రకృతిశాస్త్ర పాఠములలో చెప్పబడు ప్రత్యక్షప్రమాణములవలనను మన పురాణములందును శాస్త్రములనందును చెప్పబడిన అనేక శాస్త్రవిషయములు సరియైనవికావను భావముకలిగెను. ఉదాహరణకు రాహుకేతువులను సర్పములు సూర్యచంద్రులను మ్రింగుటవలన గ్రహణములు కలుగుచున్నవను పౌరాణిక సిద్ధాంతము కేవలము అబద్ధమనియు సూర్యునికి చంద్రునికిని మధ్య భూమియడ్దువచ్చుట చేతనే చంద్రగ్రహణము కలుగుచున్నదనియు సూర్యునికి భూమికిను మధ్య చంద్రుడడ్డువచ్చుటవలన సూర్యగ్రహణము కలుగుచున్నదనియు ప్రత్యక్షప్రమాణమునుచూపించి ఒక హిందూ శాస్త్రీయ సిద్ధాంతములబద్ధమయినట్లే తక్కిన సిద్ధాంతములును ధర్మములును విశ్వసింపవీలులేని పుక్కిటపురాణములగుట తథ్యమనియు మిషనరీలు వాదించుచు లేతమనస్సుగల యువకులను మోసపుచ్చుచుండిరి. పాశ్చాత్యులు చాలాకాలమునకు కనుగొన్న ఈ భూగోళ ఖగోళ జ్యోతిచ్చాత్ర సిద్ధాంతములు భారతీయులు వేలకొలది సంవత్సరముల క్రిందటనే కనుగొనిరనియు సూర్యసిద్ధాంతములో నీసంగతి వివరింపబడెననియు సాంకేతికమైన పరిభాషతో చెప్పు పురాణగాథలకును శాస్త్రవిషయములకును సంబంధములేదనియు క్రైస్తవమిషనరీలకు జవాబుచెప్పువారుగాని బాలురకు బోధించువారుగాని లేకుండిరి. మిషనరీల బోధనలు విషమువలె వ్యాపించి యువకుల మనస్సులను విరచివేయుచుండెను. మన మతాచారములను పాశ్చాత్య మతాచారములతో పోల్చిచూపుచు మన సంఘములోని ఆచారవ్యవహారములు హేయములనియు అవినీతికరములనియు మిషనరీలు నిందించి మనలను హేళన చేయసాగిరి.  మన ఆచారవ్యవహారముల అంతరార్థములను బాలురకు బోధించి అందలి మంచిని తెలియచెప్పగలుగువారును లేకపోయిరి. అట్టి అవకాశమును ప్రభుత్వమువారు కలిగింపరైరి. అంతట మన యువజనులందు మన దేశ వేషభాషలపైనను నీతిమతధర్మములపైనను గౌరవముతగ్గిపోయి వానిని తిరస్కరించుటయు తృణీకరించుటయు ప్రారంభమయ్యెను. శుష్కవేదాంతులు ప్రబలెను. ఇంగ్లీషు భోగవస్తువుల నుపయోగించుటయు మద్యమాంసము నుపయోగించుటయు పాశ్చాత్య వేషభాషలను నాగరకతను అనుకరించుటయు ప్రారంభమయ్యెను. ఈ విపరీత విద్యాబుద్ధులవలనను మిషనరీల మతప్రచారమువలనను హిందూమతము, సంఘము, నిర్మూలమగు దినములు వచ్చినవని దేశములోని పెద్దలలో చాలమందికి తోచెను.

కంపెనీవారు ప్రజలను పీడించి సొమ్ము వసూలు చేయుటయెగాని ప్రజలలో విద్యాభివృద్ధిగావించుటకు పాఠశాలలను స్థాపించిగాని రాకపోకలకు రవాణాలకును తగిన బాటలు వేసికాని వ్యవసాయమునభివృద్ధిచేయుటకు కాలువలు చెరువులు మరమ్మత్తులు చేసిగాని జలాశయములు నిర్మించిగాని ప్రజోపయుక్తమైన కార్యములు చేయరైరి. ఈ కంపెనీవారియుద్యోగులు లంచగొండులై నిరంకుశులై దుష్పరిపాలనము చేయుచు మిషనరీలతో ఏకమై హిందూమతధర్మమును నిర్మూలముచేయబూనినట్లు ప్రజలకు తోచెను.

ఇంతవరకు భారతీయులు తమ కష్టములను గూర్చి పరిపాలకులకు చెప్పుకొని తమ బాధలను మానుపుకొనుటకు ప్రయత్నించి యెరుగరు. భారతదేశమున జరుగుచున్న నిరంకుశ పరిపాలనమును గూర్చియు అన్యాయమునుగూర్చియు ఇంగ్లండులోని రాజకీయనయకులెవరైన ధర్మబుద్ధితో ఇంగ్లాండు పార్లమెంటువారికి చెప్పినకద్దు లేనిచో లేదు. ఈ దేశప్రజలు నోరులేనివారైయుండిరి.

ఇరువది సంవత్సరములకొకమారు ఇంగ్లాండు పార్లమెంటువారు తూరుపు ఇండియా వర్తకసంఘమువారీ దేశమున చేయుచున్న పరిపాలన వ్యవహారములను గూర్చి విచారించి వారికి మరల రాజ్యాధికార పట్టానిచ్చు విషయమై పార్లమెంటులో చర్చించుచుందురు. ఆ సందర్భమున మాత్రము ఒకతూరి భారతదేశస్థితిగతులను గూర్చి పార్లమెంటువారు కొంత విచారణ చేయగలిగినారు. ఆ సమయమున సద్ధర్ములైనవారెవరైన భారతదేశపరిపాలనములోని లోపములనుగూర్చి వారికి చెప్పినచో అందుపైన పార్లమెంటువారు రాజ్యాంగవిషయములందు కొన్ని సంస్కరణములు చేసి రాజ్యాధికారపట్టానిచ్చు శాసనములో కొన్ని క్రొత్త నిబంధనలు చేర్చుట పరిపాటియయ్యెను.

ఇప్పుడీ క్రైస్తవ మతబోధకుల పలుకుబడివలన వారును కంపెనీవారి యుద్యోగులును కలిసిచేయు అక్రమముల విషయములో భారతీయులకు న్యాయము జరుగునను ఆశలేదు. రాజ్యాంగపద్ధతులు మారినగాని న్యాయము జరుగుటకవకాశములునులేవు. స్వధర్మరక్షణ కొరకును రాజ్యాంగ సంస్కరణ కొరకును గట్టిప్రయత్నములు చేసినగాని ప్రజల బాధలుతీరుట దుర్లభము. అయితే ఇదిచేయుటెట్లు? ప్రజలా విద్యాగంధములేక అజ్ఞానమునబడియుండిరి. దేశములోని ప్రజలలో జాతిమతకుల విభేదములవలన నైకమత్యము లేదు. ఈ కంపెనీయధికారులా బలవంతులు. మిషనరీలన్ననో హిందువులను ద్వేషించుచు బలవంతులై పలుకుబడి కలిగినవారు. ఈ దేశీయులు తమ కష్టములనుగూర్చి ఎవరికి చెప్పుకొనవలెనో ఎట్లు చెప్పుకొనవలెనో కూడా తెలియనివారు.

ఆ సమయమున స్వయంకృషివలన ఇంగ్లీషు విద్య నేర్చి కొంత రాజకీయ పరిజ్ఞానమును సంపాదించిన దేశీయ ప్రముఖులు వంగరాష్ట్రంలోను బొంబాయిలోను చెన్నపట్టణములోను కూడా ఉండిరి. ఈ అన్యాయములను చూడగా వారి మనస్సులందు బాధకలిగి దీనినెట్లైనను అరికట్టవలెనను సంకల్పము వారికి కలిగెను. అందుకొరకు కృషిచేయుటకు వారు నడుముగట్టిరి. అయితే తామెంత కష్టపడినను తోడి దేశీయులు కూడా తమకు అండయై నిలిచినగాని ఏ సంస్కరణమును జరుగుటకు అవకాశముండదు. ప్రజలలో కూడా ఈ విషయమై శ్రద్ధ కలిగింపవలెనన్నను ముందుగా వారికి కొంత రాజకీయ పరిజ్ఞానము కలిగింపవలెనను సంగతిని మన దేశీయ ప్రముఖులు గ్రహించిరి. కంపెనీ పరిపాలనకాలమున మనదేశములోని తక్కినప్రాంతములందుకన్న వంగ రాష్ట్రములోని ప్రజలలో పాశ్చాత్య నాగరికతయు విజ్ఞానమును ఎక్కువత్వరగా వ్యాపించియుండెను. అందువలన నీవిషయమునందు కూడా అక్కడి ప్రజలలోనే ముందుగా సంచలనముకలిగెను.

తూర్పు ఇండియా వర్తక సంఘ పరిపాలనకాలమున ఆంగ్లేయ రాజ్యమునకు ప్రధాన రాజధాని కలకత్తా నగరము. అక్కడి హిందువులలో ప్రతివిషయములోను సంఘసంస్కార పక్షమువారికిని సనాతనధర్మపక్షమువారికిని అభిప్రాయభేదములు కలుగుచు వారిలోవారు తగవులాడుకొనుచుండిరి. అందువలన ఏ పనిచేయవలెనన్నను ఇదియొక ఆటంకముగనుండెను. కలకత్తా హిందూప్రజలలో రెండుపక్షములకును చెందిన ప్రజాసభలగు బ్రహ్మసభవారును ధర్మసభవారును ఇట్లు కలహించుచుండినందున వారుభయులు కలిసి మిషనరీలను ప్రతిఘటించుటకవకాశములేకుండెను. అందువలన మిషనరీలు హిందువుల నీతిమతధర్మములను గూర్చి అబద్ధములను ప్రచారముచేయుచు విద్యాబోధనము చేయునెపమున హిందూయువకుల మనస్సులను విఱచివేయసాగిరి. క్రమక్రమముగా కొంతమందిని క్రైస్తవమతమున కలుపుకొనగలిగిరి. ఉత్తమకులజులైన యువకులలోని కొంతమందినిట్లు వారు తమ మతమున కలుపుకొనునప్పటికి కలకత్తానగరము దద్దరిల్లినది. వంగరాష్ట్రములోని యువకులందరును క్రైస్తవమతమున గలిసిపోవుదురనునంత భీతి ప్రజలలో వ్యాపించినది.
ఈ పరిస్థితులను చూచి బ్రహ్మసమాజనాయకులలో అగ్రగణ్యులును చాలా గౌరవింపబడువారునగు దేవేంద్రనాథ ఠాకూరుగారు కర్తవ్యమాలోచించి సంస్కర్తల పక్షనాయకులైన రామగోపాలఘోష్‌గారితోను సనాతనధర్మ పక్షమువారి నాయకుడైన రాజారాధాకాంతదేవుగారితోను సంప్రదించి దేశీయ యువకులు మతభ్రష్టులై చెడిపోనెకుండా ఉభయపక్షములవారును కలిసిపనిచేసినగాని హిందూమతము రూపుమాసిపోవగలదని నొక్కిచెప్పి ఉభయపక్షములవారికిని 1845లో నొక సమాధానమును కుదిర్చి స్వధర్మ రక్షణకు గొప్పకృషిని ప్రారంభించిరి.

అంతట క్రైస్తవమిషనరీలు చేయు అక్రమములనుగూర్చి ప్రజలు తమ అసమ్మతిని తెలుపుచు సభలలో తీర్మానములుగావించి పైయధికారులకు పంపుట ప్రారంభించి పత్రికలలో నీ విషయమై తీవ్రముగ విమర్శింపసాగిరి. దేశీయ బాలబాలికలు క్రైస్తవపాఠశాలలందు చదువుచున్నందువలననే ఇంతటి కీడు మూడినదని ప్రజలు గ్రహించిరి. అందువలన నికముందు వారి పాఠశాలలందు పిల్లలను చదివించుట మానిపించి కేవలము హిందువుల యాజమాన్యముననె నిర్వహింపబడు పాఠశాలలను స్థాపించి వానినందు చదివించుటకు నిశ్చయించిరి. అందుకు కావలసిన నిధులను ప్రోగుచేసి “హిందూ హితైర్థి పాఠశాల” యనునొక దేశీయ పాఠశాలను హిందూనాయకులు స్థాపించిరి. అంతట క్రైస్తవమతబోధకుల యాగడములు కొంత అరికట్టబడినవి. అయినను మిషనరీలకు కంపెనీవారి దొరతనమునందు గొప్ప పలుకుబడి యున్నందువలనను కంపెనీయధికారులు నిరంకుశులై అన్యాయములు జరిగించుచుండినందువలనను భారతీయుల మొఱలు వినిపించుకొనుటలేదనియు, అందువలన కంపెనీ పరిపాలనావిధానమునె మార్చు రాజకీయసంస్కరణలు కొన్ని జరిగినగాని దేశీయ ప్రజల బాధలు అంతముకావనియు త్వరలోనే కలకత్తాలోని దేశీయ నాయకులు గ్రహింపగలిగిరి.

కంపెనీవారికి రాజ్యాధికారపట్టానిచ్చు తరుణము 1853లో వచ్చుచుండెను. వారికి మరల పట్టా ఇవ్వబడినయెడల భారతీయుల బాధలికముందుకూడా ఎప్పటివలెనే యుండగలవను సంగతిని దేశీయ ప్రముఖులు గ్రహించి కంపెనీవారికనుమతి పట్టానివ్వకుండ ప్రతిఘటించుటకు పార్లమెంటువారికి అర్జీలనిచ్చుకొని ఆందోళనము చేయుట మంచిదని నిశ్చయించిరి. ఇట్టి కృషి చేసినచో తమ దేశ ప్రజల బాధలలో కొన్నియైన నివారణముకాగలవనియు కొన్నివిషయములందైనను కొంత మేలుకలుగగలదనియు వారికి తోచెను.

ఈ దేశములోనున్న ఇంగ్లీషువారు అప్పటికే ఒక సంఘముగా నేర్పడి తమకు కావలసిన సౌకర్యములనుగూర్చి సభలందు చర్చించి కంపెనీ అధికారులకును ఇంగ్లాండులోని పార్లమెంటువారికిని తెలుపుచు కొన్ని లాభములను పొందియుండుటను భారతదేశ నాయకులు గమనించిరి. తాముకూడా ఇంగ్లీషు జనసంఘమువారివలెనే ఒక ప్రజాసంఘముగానేర్పడి కృషిచేసినచో కొంతలాభము కలుగవచ్చునని వారికి తోచెను.

పూర్వము 1828లో ఈనాములను కంపెనీ ప్రభుత్వమువారు రద్దుచేసినప్పుడు కొందరు దొరల సహాయముతో దాని విషయమై తీర్మానముగావించి కొంత ఆందోళనము చేసియుండెను. దాని ఫలితముగా ఈనాముల రద్దుచేయుటను గూర్చిన శాసనవిధులందును అవి అమలుజరుపు విధానములందును కొన్ని మార్పులు జరిగియుండెను. 1837లో జమీందారీ అసోసియేషను అనుపేరుతో నొక ప్రజాసంఘమేర్పడి వంగరాష్ట్రములోని భూస్వాముల క్షేమలాభముల కొరకు పనిచేసియుండెను. దీనిలో కూడా కొందరు దొరలు సభ్యులై దేశీయులతో కలిసి పనిచేసియుండిరి. తరువాత 1843లో బ్రిటిష్ ఇండియా సొసైటీ అనుపేరుతో మరియొక ప్రజాసంఘము స్థాపింపబడెను. అందులో కూడా ఇంగ్లీషు దొరలు సభ్యులై యుండి సభలు సమావేశపరచుచు తీర్మానము చేయించు పై అధికారులకు విన్నపములు మహజరులు పంపుచు పనిచేయుచుండినందువలన కొంత ప్రయోజనకారిగానుండెను. అందువలననిప్పుడు కేవలము దేశీయ ప్రజల క్షేమలాభముల నిమిత్తము రాజ్యాంగ సంస్కరణలను పొందుట కొరకొక దేశీయ ప్రజాసంఘమును స్థాపించినచో లాభము చేకూరగలదని కలకత్తాలోని దేశీయ నాయకులలో అగ్రగణ్యులైన రామగోపాలఘోష్, రాజేంద్రలాల్ మిత్ర, దేవేంద్రనాథ ఠాకూరు మొదలైనవారికి తోచెను. అంతటవారు 1851లో బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్ అను పేరుతోనొక ప్రజాసంఘమును స్థాపించి సభలు చేయుచు అందులో తీర్మానములను చేసి విన్నపములను మహజరులను పార్లమెంటుకు పంపుట ప్రారంభించిరి.

1851లో కలకత్తాలోని దేశీయ నాయకులు హిందూ పేట్రియట్ అనునొక ఇంగ్లీషు వార్తాపత్రికను స్థాపించి దేశీయులకు గల బాధలను గూర్చి అందులో వివరించుచు అవి మాన్పవలెనని ఆందోళనముచేయుట ప్రారంభించిరి. ఈ పత్రికకు హరిశ్చంద్ర ముఖర్జీ సంపాదకుడై అతి సమర్థతతో నిర్వహింపసాగెను. భారతదేశ స్థితిగతులనుగూర్చియు ప్రజల కష్టసుఖములనుగూర్చియు నిర్భయముగా చర్చించి విమర్శించుచు మిషనరీలు చేయు అన్యాయములను గూర్చియు నీలిమందు తోటల యజమానులైన దొరలు చేయు అక్రమములనుగూర్చియు తీవ్రముగా విమర్శింపసాగెను. ఇది భారతదేశమున భారతీయ సంపాదకుడు ఇంగ్లీషులో నిర్వహించిన మొదటి జాతీయవాద పత్రిక. చాలాకాలమువరకును ఇది భారతదేశములోని రాజకీయాభిప్రాయములను వివరించుటకాధారముగనుండెను.  హరిశ్చంద్ర ముఖర్జీ చేసిన దేశసేవ ఫలితముగా నీతనిపైన దొరలకాగ్రహము కలిగి ఆయనననేకవిధములుగా బాధించిరి.

కేవలము ఒక రాష్ట్రములోని కొందరి ద్వారా మాత్రమే అసంతృప్తి వలన రాజకీయాందోళనము గావించుచున్నారనియు దేశములోని తక్కిన ప్రాంతములందు ప్రజలకు కదలిక లేదనియు ఇక్కడి కంపెనీ యుద్యోగులు ఇంగ్లాండులోని పైయధికారులకు చెప్పినచో తమ కోర్కెలను త్రోసిపుచ్చుదురని కలకత్తా ప్రజానాయకులకు తోచెను. అంతట వారు దేశములో నలుప్రక్కలను గల ప్రజలలో కూడా రాజకీయ పరిజ్ఞానమును కలిగించి ప్రజాసభలేర్పరచి అందరును కలిసి ఏకగ్రీవముగా రాజకీయసంస్కరణల కొరకు ఆందోళనము జరిపినచో ఎక్కువ ప్రయోజనము కలుగునని కూడా వారికి తోచెను. అంతట వారు చెన్నపట్టణములోను బొంబాయిలోను ప్రజాసేవ చేయుచున్న దేశీయ నాయకులతో ఉత్తరప్రత్యుత్తరములను జరిపి అక్కడ బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్ శాఖలను స్థాపించుటకు కృషిచేసిరి.

1852లో కలకత్తాలోని బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్‌వారు ఇంగ్లాండుదేశపు పార్లమెంటువారికి పంపిన మహజరు భారతీయుల రాజకీయ హక్కులనుగూర్చిన మొదటి లిఖితపత్రమని చెప్పవచ్చును. “బ్రిటీషువారితోడి సంబంధము వలన నీదేశమునకు కలుగుననుకొని ఆశపడిన లాభములలో నేదియు కలగలేదని చెప్పుటకు చింతించుచున్నాము” అని అప్పుడు ప్రజలలో వ్యాపించియున్న భావములను స్పష్టీకరించిరి.

“పార్లమెంటువారు క్రిందటిసారి కంపెనీవారికి భారతదేశమునేలుటకు రాజ్యాధికారపట్టానిచ్చినప్పుడు ఈ దేశ పరిపాలనావిధానమునందు కొన్ని మార్పులను చేసినమాట నిజమేగాని భారతదేశ స్థితిగతులననుసరించి ముఖ్యముగా జరుగవలసిన సంస్కరణములెవ్వియు చేయలేదు.” అనిచెప్పి చాలకాలము తరువాత కాంగ్రెసు మహాసభ స్థాపించబడి అందులో వారుచేసిన తీర్మానములలో భారతదేశ ప్రజలకు జరుగుచున్న అన్యాయములుగా పేర్కొనబడినవానిలో ముఖ్యమైన విషయములనీ మహజరులో వివరించిరి. దుర్భరముగానున్న భూమిశిస్తును తగ్గించవలెననిరి. న్యాయపరిపాలనావిధానమును సంస్కరింపవలెననిరి. వ్యక్తులకు ప్రాణభయము, ఆస్తి పోవునను భయమును లేకుండా తగు బందోబస్తులను చేయవలెననిరి. కంపెనీవారి సర్వమక్తాయిజారీ వ్యాపారములవలన నీదేశీయులకు కలుగుచున్న నష్టములను తొలగింపవలెనని దేశీయ పరిశ్రమలను ప్రోత్సహింపవలెననిరి. ప్రజలలో విద్యాభివృద్ధి చేయవలెనని దేశీయులకు పెద్దయుద్యోగములనీయవలెనని కోరిరి.

ఆ మహజరులలో భారతదేశ పరిపాలనావిధానమునంతయును సింహావలోకనము గావించి దానిలోని లోపములను చూపించి దానిని సవరించు మార్గములను పేర్కొనిరి. శాసనసభలనుండవలసిన యధికారములను నిర్ణయించి ఈ దేశ పరిపాలనముపైన పార్లమెంటువారు చెలాయించతగిన అదుపు ఆజ్ఞలను వివరించిరి. ఈ దేశములోని వివిధ మతధర్మములను సంస్థలను కాపాడుదుమని వాగ్దానముచేయవలెనని కోరిరి. ప్రభుత్వములోని వివిధశాఖలలో వివిధ ఉద్యోగముల నిర్వహణమందును పొదుపుచేయదగిన అవకాశములను సూచించిరి. ఈ దేశములో అమలుజరుగుచున్న సివిలు క్రిమినలు న్యాయవిధులలోను చర్యలలోను న్యాయపరిపాలనా విధానములోను, పోలీసు మేజిస్ట్రేసుటుల అధికారనిర్వహణములోను గల లోపములను నిరూపించి విమర్శించిరి. కంపెనీవారికి సర్వమక్తాయిజారీ అధికారములుండుటవలనను ముఖ్యముగా ఉప్పువర్తకము వారి ప్రత్యేక హక్కుగా నున్నందువలనను ప్రజలకు కలుగుచున్న కష్టములును ఇబ్బందులును వివరించి ఈ ప్రత్యేకాధికారములెల్ల రద్దుచేయవలెననికోరిరి.

కంపెనీవారు భూమి పన్నులద్వారమునను ఇతర విధములుగను పూర్వకాలపు మహమ్మదీయ పరిపాలనములోకన్న ఎక్కువ సొమ్మునే ఈ దేశీయులనుండి వసూలుచేయుచున్నప్పటికిని, అందులో చాల స్వల్పపు మొత్తమునే భూమార్గ జలమార్గముల అభివృద్ధికిని రవాణాల అభివృద్ధికిని వినియోగించుచుండుట అన్యాయమని, ప్రజల విద్యాభివృద్ధి చేయకపోవుటయు దేశములో అధికసంఖ్యాకులగు హిందూమహమ్మదీయ ప్రజలవలన వసూలుచేసిన సొమ్ములోనుండి క్రైస్తవ మతాధికారులకు జీతములిచ్చుట అన్యాయమనియు మొఱపెట్టిరి.

1851వ సంవత్సరము డిశంబరు 11వ తేదీన బ్రిటిష్ ఇండియన్ అసోసియేషను కార్యదర్శియైన దేవేంద్రనాథ ఠాకూరుగారు చెన్నపట్టణములో నొకశాఖను ఏర్పాటుచేయు విషయమై అక్కడి ప్రముఖులకొక లేఖ వ్రాసిరి.

*తూర్పు ఇండియా వర్తక కంపెనీవారి కివ్వబడిన రాజ్యాధికార పట్టాయొక్క గడువుకాలము త్వరలోనే ముగియనున్నదిగనుక  ఆ విషయమై ఇంగ్లాండులోని పార్లమెంటువారికి చేయవలసిన విన్నపములను దేశములో అన్నిప్రాంతములలోను గల దేశీయులు వెంటనే చేయుటకన్న వివిధప్రాంతములందలి దేశీయులందరి పక్షమునను ప్రతినిధిగానొక ప్రజాసంఘమే అట్లుచేయుట ఎక్కువ ప్రయోజనకరముగానుండునను సంగతిని మీరు గ్రహించియెయుందురు. కలకత్తా, ఆగ్రా, బొంబాయి, చెన్నపట్టణములలో నుండి వేరువేరుగా ప్రత్యేక ప్రజాసంఘములీ విషయముననేకీభావము వహించి వేరువేరు విన్నపములను చేయుటవలననెంత లాభముండునో వేరువేరు రాష్ట్రములయొక్క క్షేమలాభములనాలోచించి వారి కోరికలననుసరించి ఒక కేంద్ర ప్రతినిధి సంఘమువారు చేయు విన్నపమునకు కూడా అంత ప్రయోజనమే ఉండగలదు. అయితే తక్కిన మూడు రాజధానులలోను గల దేశీ ప్రముఖులు బ్రిటిష్ ఇండియన్ అసోసియేషనుతో ఏకమై పనిచేయుటవలన కొన్ని ముఖ్యమైన లాభములున్నవను సంగతి మరువకూడదు. ఇందువలన నీకార్యసాధనకొరకు చేయవలసివచ్చు వ్యయము చాలా తక్కువకాగలదు (వేరువేరు ప్రతినిధులనంపుటకు బదులుగానొకప్రతినిధినే పంపవచ్చును). మరియు పరిపాలనావిధానమును చక్కబరుపుడని గోరు విషయములో వేరు వేరు సంఘములు వేరువేరు విధములైన సూచనలను చేయుడానికన్న అందరును కలిసి ఒకేవిధమైన సూచనలను చేసినచో ఎక్కువ విలువయుండును. మీ రాజధానిలోని సోదర దేశీయులు ఈ బ్రిటిష్ ఇండియన్ అసోసియేషనులో చేరి పనిచేయుటమూలముగాగాని ఈ ఆశయములతోనే మీరొక ప్రత్యేక ప్రజాసంఘముగా నేర్పడిగాని బ్రిటిష్ ఇండియన్ అసోసియేషనువారి యుద్యమమునకు మీరు తోడ్పడుదురని తెలిసికొనుటకు మా సంఘమువారు కుతూహలపడుచున్నారు.(* Rise and growth of the Congress CF. Andrew and Girija Mukerjee) pp 104-106.)

వంగరాష్ట్రమునందువలెనే చెన్నపట్టణములో కూడా స్వధర్మరక్షణ కొరకును, రాజ్యాంగసంస్కరణములకొరకును తీవ్రమైన కృషిచేయవలసిన అవసరము 1840 నాటికే కలిగియుండెను. అంతట దేశభక్తుడగు గాజుల లక్ష్మీనర్సుసెట్టిగారు అందుకొరకు తన సర్వస్వమును ధారపోయుటకు నిశ్చయించుకొని 1844లో మద్రాస్ నేటివు అసోసియేషను అను చెన్నపట్టణ స్వదేశ ప్రజాసంఘమును ‘క్రెసెంట్’ అను జాతీయపత్రికను స్థాపించి సభలుచేసి తీర్మానములు గావించి మహజరులను తయారుచేసి గవర్నరుకును, ఇంగ్లాండులోని కంపెనీ డైరెక్టర్లకును కూడా పంపసాగెను. భారతదేశమునందు జరుగుచుండిన అక్రమములనుగూర్చి గొప్ప ఆందోళనము లేవదీసెను. అన్ని మతములను సమానముగా చూచెదమనియు, క్రైస్తవమతమునకు ప్రత్యేక ప్రోత్సాహము నొసగమనియు పూర్వము కంపెనీ ప్రభుత్వమువారు చేసిన వాగ్దానములకు విరుద్ధముగా చెన్నపట్టణము గవర్నరు ప్రవర్తించుచుండుట, క్రైస్తవ మతబోధకులు ప్రభుత్వోద్యోగులైన దొరల సహాయముతో ప్రజలను తమ మతములో కలుపుకొనుటకు నిర్బంధించుచుండుట, దానికి కంపెనీ యధికారులు హర్షించుచుండుట క్రైస్తవమతములో చేరుడని బాలురకు కూడా బోధించుచుండుట బైబిలు సంగతులు చెప్పలేని బాలురను పరీక్షలలో తేరకుండ తప్పించుచుండుట అట్టివారికుద్యోగములు రాకుండా మతబోధకులును ఉద్యోగులును కలసి కుట్రచేయుచుండుట, చెన్న రాజధానిలోని వివిధ జిల్లాలలో పాఠశాలలు స్థాపించి జనసామాన్యమునకు విద్య అందుబాటుచేయకుండుట, న్యాయస్థానములందు తరచు అన్యాయములే జరుగుచుండుట మొదలైన అక్రమములవలన ప్రజలు బాధపడుచుండుటను గూర్చి సభలలో తీర్మానములుచేసి సీమకు మహజరులంపి, ఇంగ్లాండు పార్లమెంటు సభలో సభ్యుడైన జాన్‌బ్రైట్‌గారిచేత ప్రశ్నింపజేసి 1844-1846 మధ్య గాజుల లక్ష్మీనర్సు సెట్టిగారతితీవ్రమైన ఆందోళనమును చేసిరి. దీని ఫలితముగా పాఠశాలలో బైబిలు ప్రవేశపెట్టు ప్రయత్నము లప్పటికాగిపోయినవి. క్రైస్తవమతములో చేరువారికి సమష్టి కుటుంబములోని ఆస్తిహక్కులు పోకుండా చేయదలచిన శాసనము కూడా అప్పటికి నిలిచిపోయినది. ప్రభుత్వ పద్ధతి మారనిది ప్రజలకు లాభము కలుగదని స్పష్టపడినందువల్ల తరువాత కొంతకాలమునకు కలకత్తాలో బ్రిటిషు ఇండియన్ అసోసియేషను చేసినట్లే ఈ చెన్నపట్టణ స్వదేశసంఘము కూడా రాజ్యాంగ సంస్కరణములు కోరసాగెను.

కంపెనీ పరిపాలనమున ప్రజలు దరిద్రులై అజ్ఞానాంధకారమున మునిగి అనారోగ్యమున పడియుండుట రాకపోకలకు రోడ్లుగాని పల్లపుసాగుకు నీటివనరులు గాని ఇతర సౌకర్యములుగాని లేకుండుట పన్నులత్యధికముగానుండి రైతులు భరింపలేకుండుట పన్నునివ్వలేని రైతులను అధికారులు చిత్రహింసలు పెట్టుచుండుట కలెక్టరుల నిరంకుశత్వము, అధికారుల లంచగొండితనము, కోర్టుల యప్రయోజకత్వము క్రైస్తవమత బోధకుల దురాగటములు కంపెనీవారి దుష్పరిపాలనమును వర్ణించుచు 1852లో పార్లమెంటుకు మహజరులంపిరి. దానితో దేశపరిపాలనము నందెట్టి మార్పులు చేయబడినను ప్రజా ప్రతినిధులకు మాత్రము కొంత పలుకుబడి కలిగించి తీరవలెనని స్పష్టముగా కోరిరి.

ఇట్లు వంగరాష్ట్రములోను మనరాష్ట్రములోను కూడా ముందుగా విద్యాభివృద్ధి కొరకు ప్రారంభమయిన ప్రచారము ఆందోళనము తరువాత స్వధర్మ రక్షణముకొరకును అటుతరువాత పరిపాలనములో గల అన్యాయములను బాపుటకొరకును అటుపిమ్మట రాజ్యాంగ సంస్కరణముల కొరకును చేయబడిన రాజకీయోద్యమముగా పరిణమించెను.

కంపెనీవారికి 1853లో మరల రాజ్యాధికార పట్టానిచ్చుచు పార్లమెంటువారు భారతదేశ ప్రభుత్వ నిర్వహణ విషయమున కొన్ని స్వల్పమార్పులను చేసిరి. ముఖ్యముగా శిఫారసులనుబట్టి ఐ.సి.ఎస్. ఉద్యోగములిచ్చు పద్ధతిని తీసివేసి బహిరంగమైన పోటీపరీక్షలలో నుత్తీర్ణులైనవారికే ఉద్యోగములివ్వవలెనను నియమమునేర్పరచిరి. పార్లమెంటువారు చేసిన స్వల్పపు సంస్కరణమువలన కంపెనీ పరిపాలనా విధానము మారలేదు. భారతీయుల బాధలు తగ్గలేదు.

భారతీయులు తమకుగల కష్టములను గూర్చి ఎప్పటివలెనే ఆందోళన చేయసాగిరి. దేశీయ ప్రజల పక్షమున చెన్నపట్టణమున జార్జినార్టన్ జాన్‌బ్రూస్ నార్టన్‌వంటివారును ఇంగ్లాండులో జాన్‌బ్రైట్‌వంటివారును కొంత కృషిచేయసాగిరి. పాఠశాలలో బైబిలును పాఠ్యపుస్తకముగా ప్రవేశపెట్టుటకు చెన్నపట్టణములోని మిషనరీలు మరలనొకమారు ప్రయత్నించిరి. అంతట మద్రాసు యూనివర్సిటీ అనబడు ఉన్నతపాఠశాల నిర్వాహక సంఘములోని హిందూ సభ్యులలో ఒక్కరు తప్ప మిగిలినవారందరును అసమ్మతిని దెల్పుచు రాజీనామా నిచ్చిరి. అధ్యక్షుడైన నార్టనుగారు కూడా రాజీనామానిచ్చిరి.

చెన్నరాజధానిలో పన్నులు వసూలుచేయుటలో కంపెనీయుద్యోగులు రైతులను పెట్టు చిత్రహింసలను గూర్చి గాజుల లక్ష్మీనర్సుసెట్టిగారు పార్లమెంటువారికనేక మహజరులంపి చాలా ఆందోళనచేసిరి. పార్లమెంటు సభ్యుడైన డేంబీసేమర్‌గారీ దేశమునకు వచ్చి ఇక్కడ జరుగుచుండిన అక్రమమును స్వయముగాచూచి పార్లమెంటువారికి విశదపరచిరి. అంతట న్యాయవిచారణలోను పన్నుల వసూళ్ళలోను జరుగుచుండిన చిత్రహింసలను గూర్చి విచారణచేయుట కొక ఉపసంఘము నియమింపబడెను. ఈ విచారణ సంఘమువారు 1855లో తమ నివేదికను ప్రకటింపగా ఇకముందట్టి అక్రమములు జరుపరాదని ఆంగ్లప్రభుత్వమువారు శాసించిరి.

మద్రాసు రాష్ట్రములోని ప్రజల స్థితిగతులను గూర్చియు, ఈ రాష్ట్ర ప్రజల ఆవశ్యకతలను గూర్చియు జాన్‌బ్రూస్ నార్టన్‌గారు 330 అచ్చుపుటల నివేదికను తయారుచేసి దానిని కంపెనీ పరిపాలనను తనిఖీచేయుట కేర్పడిన అధికార సభయైన సీమలోని బోర్డు ఆఫ్ కంట్రోల్ సభవారి సమ్యుక్తకార్యదర్శికి ఉత్తరముతో 1854 సం. ఫిబ్రవరిలో పంపించిరి- అందులో భారతదేశ పరిపాలనమునందు జరుగుచుండిన అన్యాయములును అందువలన ప్రజలు పడుచుండిన బాధలును స్పష్టంగా వివరింపబడెను. ఈ దీర్ఘమైన నివేదికను గాజుల లక్ష్మీనర్సు సెట్టిగారు తమ స్వంత వ్యయముపై నచ్చొత్తించిరి. ఈ దేశపరిపాలనమును కంపెనీవారి చేతులలోనుండి తీసివేయవలసినదని కోరుచు లక్ష్మీనర్సుగారు. గొప్ప ఆందోళనమునుజేసి 14 వేలమంది చేత ఒక మహజరు సంతకములు చేయించి 1855లో పార్లమెంటువారికంపించిరి. అయినను పార్లమెంటువారు వినిపించుకొనలేదు. ఈ కంపెనీవారి దుష్పరిపాలనమునుగూర్చి భారతదేశములో నన్నిప్రాంతములనుండియు ప్రజలు మొరపెట్టుకొన్నను పార్లమెంటువారు వినలేదు. కంపెనీ ప్రభుత్వములోని అన్యాయములను భరింపలేక ప్రజలలో అతి తీవ్రమైన అసంతృప్తి కలిగెను. దీని ఫలితముగా 1857లో ప్రజలు తిరుగుబాటుచేసిరి. దేశీయ సిపాయిలు  ప్రజలు నాయకులు ఆయుధములతో నింగ్లీషువారిని పారదోలుటకు ప్రయత్నించిరి. అంతట చాలా గొప్ప రక్తపాతమయ్యెను. దీనికి ఆంగ్ల చరిత్రకారులు సిపాయిల పితూరీయని పేరుపెట్టిరి. దీనినణచుటకు ఆంగ్లేయులెన్నో క్రూరకృత్యములను జేసిరి. దేశమునందింత రక్తపాతము జరిగినపిమ్మట పార్లమెంటువారు కన్నులు తెరచి భారతదేశ పరిపాలనమునందు లోపములున్నవను సంగతిని గ్రహించి ఈ దేశమునందలి కంపెనీ ప్రభుత్వమును రద్దుచేసి ఈ దేశమును ఇంగ్లాండు రాణి మంత్రులలో నొకరైన ఇండియా రాజ్యాంగ కార్యదర్శి అధికారమునకు లోబరచి పరిపాలింపసాగిరి. ఈ విధానమే కొన్నికొన్ని మార్పులతో 1947 వరకు అమలుజరుగుచున్నది. ప్రభుత్వ స్వరూపము మారినను స్వభావమునందెట్టి మార్పును జరుగలేదు. ఈ దేశము నింగ్లాండు లాభము కొరకు వినియోగించుకొను పద్ధతి మారలేదు. భారతీయులెప్పటివలెనే రాజకీయముగను ఆర్థికముగను అస్వతంత్రులై దారిద్ర్యమున మునిగియుండిరి.

[ఇది శివరావుగారు 1940లలో వ్రాసుకున్న చేతివ్రాత వ్యాసానికి ముద్రణ రూపం – సం.]