ఇంతింతైన ఇల్లేరమ్మ

అనుకోకుండా, ఆశించకుండా రచయిత్రి అయిపోయి అశేష అభిమానులను సంపాదించుకున్న అపురూపవ్యక్తి సోమరాజు సుశీల. మధ్యవయస్సులో రచించడం మొదలుపెట్టి కూడా అభిమాన పరంపరను సాధించిన సుశీలగారు అరుదైన రచయిత్రి. ఆమె రచనలు చేసేనాటికి తెలుగు సాహిత్యంలో ఉద్యమాల ఉధృతి నడుస్తూంది. కానీ సుశీలగారి పంథాయే వేరు. తనకు తెలిసిందీ, తను అనుభవించిందీ, అన్నిటినీ మించి తన జీవితంలో నిజంగా జరిగిందీ మాత్రమే ఆమె కలం చిత్రించింది. మామూలుగా కల్పనాసాహిత్య రచన అంటేనే వాస్తవకల్పనల సమాహారం. కానీ కల్పన జోలికి వెళ్ళకుండా వాస్తవాలనే చెప్పినా ఇంత అందంగా చెప్పవచ్చా అని మనం అబ్బురపడేలా రచించిన రచయిత్రి ఆమె. నిజం చెబితే నిష్టూరమే అని తెలిసినా, నిజం మాత్రమే తన రచనల్లో చెప్పిన వ్యక్తి ఆమె.

సోమరాజు సుశీల రచనలు చెయ్యాలనుకోవడం ప్రమాదవశాత్తే జరిగింది. పరిశ్రమ పెడదామంటే పెట్టనివ్వని పరిస్థితుల మీద, వ్యక్తుల మీద అక్కసుకొద్దీ సరదాగా రాసుకున్న కథ అబ్బూరి ఛాయాదేవిగారి కంట పడ్డం తెలుగు పాఠకుల అదృష్టం. మంచి అన్నది ఎక్కడ వున్నా, దాన్ని పదిమంది దృష్టికీ తీసుకురావాలన్న తాపత్రయం ఉన్న ఛాయాదేవిగారికి ఈ కథ చదవగానే ఇది తెలుగువారికి అందాల్సిన రచనగా తోచింది. రచయిత్రి కావాలని ఏనాడూ అనుకోని సుశీలగారు అలా మంచి రచయిత్రుల జాబితాలోకి చేరిపోయారు.

సుశీలగారి రచనల్లో జీవితం ఉంది అనడం సహజోక్తే అవుతుంది. ఆ జీవితం పరిధి చిన్నదే కావచ్చు. కానీ దాని నుండి మనకు అందే జీవిత సత్యాలు విస్తారమైనవి. ‘చిన్న పరిశ్రమలు-పెద్ద కథలు’ సరదాగా చదివించినా, అది స్త్రీల సామాజిక, ఆర్థిక ఆకాంక్షలపైన గొప్ప వ్యాఖ్య. స్త్రీలు అనే కాదు. మల్టీ నేషనల్ కంపెనీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న దేశంలో చిన్న పరిశ్రమలు పెట్టాలనుకునేవారు ఎవరైనా ఎన్ని రకాల సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందో, అలా ఎదుర్కోవాలంటే పట్టుదలతో పాటు ఎంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ అవసరమో ఈ కథలు సున్నితంగా చెప్తాయి. అందుకే ఇవి ప్రచురింపబడగానే సంచలనం సృష్టించాయి. భాగ్యనగర్ లేబొరటరీస్ నడుపుతున్న అనుభవాన్ని తనకే పరిమితం చెయ్యక, మొత్తం తెలుగు సమాజానికి అందులోని కష్టనష్టాలను చెప్పడం ద్వారా ఆమె కొత్తరకమైన వస్తువుతో కథల్ని సృష్టించారు. ఇలాంటి వస్తువుతో స్త్రీలే కాదు; పురుష రచయితలు కూడా చెప్పుకోదగ్గ కథలు రాయలేదు.

సుశీలగారు తను గొప్ప కథకురాలు కావాలని గానీ, తెలుగు సాహిత్యంపై గొప్ప ముద్ర వెయ్యాలని గానీ అనుకోలేదు. కేవలం తన అనుభవాలు మరి కొంతమందితో పంచుకోవడం కోసమే రచనలు చేశారు. పాఠకులకు తమ బాల్యాన్ని పునర్దర్శించుకునే ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, అనుభూతిని ‘ఇల్లేరమ్మ కతలు’లో అందించారు. ఆ క్రమంలో అందులోని పాత్రలు ఉడుక్కున్నా, ‘అది నిజమే కదా. ఉడుక్కోవడం దేనికీ, నిన్ను కథలోకి ఎక్కించి అమరత్వం కల్పిస్తేనూ’ అని దబాయించారు. ముందే చెప్పినట్టు, ఆమెకు నిజం చెప్పడం ఓ సరదా.

అలా నిజం చెప్పే క్రమంలో తనలో చిన్నప్పటినుంచే పూమాల కట్టడం దగ్గర్నుంచే ఉన్న వ్యాపారదక్షతను కూడా చాటుకున్నారు. తన ఆత్మకథలోని ‘బాలకాండ’ను ఈ కథల్లోనూ, ‘యుద్ధకాండ’ను చిన్నపరిశ్రమలు కథలోనూ, ఉత్తరకాండను ‘ముగ్గురు కొలంబస్‌లు’లోనూ ఆమె చెప్పేసుకుని, సుశీలారామాయణం మనకందించారు.

సుశీలగారు ప్రపంచాన్ని చూసిన దృష్టి వేరు. అందుకే అమెరికాకు మరో కొలంబస్ అయ్యారు. అమెరికా తల్లిదండ్రులకు పిల్లల్ని పెంచడం రాదనీ, వాళ్ళకు కుటుంబ వ్యవస్థ పట్ల గౌరవం లేదనీ ఊకదంపుడుగా ఉపన్యాసాలిచ్చేవారికి సమాధానం చెప్పడానికా అన్నట్టు, ‘ముగ్గురు కొలంబస్‌లు’ రచించారు. ఆ దేశంలోని ప్రతి సౌకర్యమూ, సంపదా కావాలి గానీ, ఆ మనుషుల్ని అర్థంచేసుకోడానికి మాత్రం ప్రయత్నించనక్కర్లేదని అనుకునేవారు ఈ కథలు చదవడం అవసరం.

శ్రీరమణగారు ఇల్లేరమ్మ కథలకు రాసిన ముందుమాటలో అన్నట్టు ‘ఇన్నాళ్ళూ చేతులు కట్టుక్కూర్చుని, ఒక్కసారి ఈ రచయిత్రి తిరుగుబాటు చేయడం, ఓవర్ టేక్ చేసి పెద్ద పీట ఆక్రమించేయడం, సీనియారిటీని ఓవర్ లుక్ చేయడం’ అనివార్యంగా జరిగింది. దానికి కారణం ఈమెకంటే బాగా ఎవరూ రాయకపోవడం కాదు. ఈమె‘లా’ ఎవరూ రాయకపోవడం. మూసరచనల తాకిడికి కొట్టుకుపోతున్న తెలుగు పాఠకులకు సుశీలగారు కొత్తరుచులు అందించారు. అందులోనూ రచయిత్రుల కలం నుంచి అరుదుగా వచ్చే హాస్యం, వ్యంగ్యం పాఠకులకు ఒకరకమైన రిలీఫ్‌ని ఇచ్చాయి. ఎంత గంభీరమైన విషయాన్ని చెప్పినా, గంభీరంగా చెప్పనక్కర్లేదని ఆమె నిరూపించారు.

పూర్తిగా తన అనుభవాలను పై మూడు పుస్తకాల్లో రచించిన సుశీలగారు, ‘పెండ్లిపందిరి’ ‘దీపశిఖ’ కథల్లో, తను అనుభవించిన జీవితం కంటే తను చూసిన జీవితాలను గ్రంథస్థం చేశారు. ఆమె దృష్టికోణం లోని ప్రత్యేకత వల్ల ప్రతి కథలోనూ ఒక కొత్తదనం, ఆలోచించవలసిన విషయం కనిపిస్తాయి. దరిద్ర బ్రాహ్మణుడు ఇద్దరు కూతుళ్ళకు పెళ్ళి చెయ్యలేక, ఇద్దరినీ ఒకడికే కట్టబెట్టే కథలో (శ్రీరమణగారికి కావలసిన) సామాజిక స్పృహ పుష్కలంగా ఉంది. అలాంటి కథలు కూడా రాసి మెప్పించారు సుశీలగారు. ఇక, తనలోని శాస్త్రవిజ్ఞాన ప్రతిభకు తనే ఇచ్చుకున్న నివాళి ‘నాయుడమ్మ’ జీవితాన్ని అక్షరబద్ధం చేయడం.

కథలు రాయడం సుశీలగారి జీవితంలో ఒక కోణం మాత్రమే. ఆమెకు కార్యకర్త జీవితం కూడ ఉంది. ఎందరికో సలహాలు, సూచనలు చేసి వారి వ్యక్తిగత, వృత్తిగత జీవితాలను మెరుగుపరచిన మార్గదర్శి ఆమె. సుశీలగారి రచనలు చదివినా, ఆమె ప్రసంగాలు విన్నా, ఆమెతో మాట్లాడినా ఆధునికతకూ, సంప్రదాయానికీ వారధి కట్టడానికి ప్రయత్నించారని అర్థమవుతుంది.

కుటుంబ వ్యవస్థను మనసారా నమ్మే సుశీలగారు అందులోని లోపాలను ఎవరైనా ఎత్తి చూపించినపుడు అతిగా స్పందిస్తున్నారని భావించారు. పర్ఫెక్ట్ రిలేషన్‌షిప్స్ అనేవి ఉండవు. మనతో మనకే ఉండదు అలాంటి అనుబంధం. ఇక ఇతరులతో ఎలా ఉంటుంది? అంటూ ఏ అనుబంధంలోనూ అతిగా ఆశించకూడదన్న జీవిత సత్యాన్ని ఆమె పదే పదే చెప్పారు. ధర్మసూత్రాలను సులభశైలిలో రాయడం వెనక కూడ ఆమెలో సంప్రదాయం పట్ల ఉన్న మక్కువే ఉంది. రచయిత్రిగా తనని తాను అంత సీరియస్‌గా తీసుకోని సుశీలగారు తన జీవిత దృక్పథాన్ని ఇల్లేరమ్మ కథల అంకితంలో చెప్పకనే చెప్పారు: ‘జీవితంలో కష్టాలూ, సుఖాలూ అంటూ వేరే ఏవీ ఉండవు. అన్నీ మనం అనుకోవడంలోనే ఉందని చెప్పి హాయిగా బతికేసి వెళ్ళిపోయిన అమ్మా, నాన్నలకి’.

అలాగే ‘అనుకోవడం’లో మనం జాగ్రత్తపడితే, మనందరి జీవితాలూ ఆనందంగా ఉంటాయని తన జీవితం ద్వారా, రచనల ద్వారా ఓ చిన్న సలహాలా కనిపించే జీవితపాఠాన్ని అందించిన సోమరాజు సుశీలగారు మరికొంతకాలం ఉండివుంటే? ఇల్లేరమ్మ వానప్రస్థం కూడ మనకు పరిచయమైవుంటే?

సి. మృణాళిని

రచయిత సి. మృణాళిని గురించి: రచయితగా, విద్యావేత్తగా, వక్తగా, కాలమిస్ట్‌గా, పలు టీవీ రేడియో ఛానళ్లలో ప్రయోక్తగా, వివిధరూపాల్లో తెలుగు పాఠకులకు, ప్రేక్షకులకు పరిచితురాలయిన మృణాళిని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో తులనాత్మక అధ్యయన శాఖలో ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశారు. ఇతిహాసాల్లోని స్త్రీ పాత్రలను విశ్లేషిస్తూ వీరు వ్రాసిన వ్యాసాలు, తాంబూలం శీర్షికలో వ్రాసిన వ్యాసాలు బహుళ ప్రజాదరణ పొందాయి. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ...