నాకు నచ్చిన పద్యం: సత్యభామ వర్ణన

మ.    అరి జూచున్ హరి జూచు జూచుకములం దందంద మందార కే
        సరమాలామకరందబిందుసలిలస్యందంబు లందంబులై
        తొరుగం బయ్యెద కొం గొకింత దొలగం దొడ్తో శరాసారమున్
        దరహాసామృతపూరముం గురియుచుం దన్వంగి కేలీగతిన్

పై పద్యం ఉత్తర హరివంశ కావ్యం లోనిది. నాచన సోమనాథుడు రచించినది. చాలా ప్రసిద్ధమైన పద్యం.

హరివంశాన్ని మహాభారతానికి పరభాగంగా భావిస్తారు. ఇందులో శ్రీకృష్ణుని బాల్యమూ, ఆయన వివిధ దశల్లో జరిపిన యుద్ధాలు మొదలైనవి వర్ణింపబడ్డాయి. సంపూర్ణ హరివంశంలో ఎక్కువ భాగాన్ని ఎఱ్ఱాప్రగడ తెనిగింపగా ఉత్తరభాగం లోని కొన్ని అంశాలను నాచన సోమన తెనిగించాడు. రెండు కావ్యాలకూ మంచి ప్రాచుర్యమే వచ్చింది. వంశాభివృద్ధిని కోరుతూ (అంటే మగపిల్లవాడే పుట్టాలని లెండి) గర్భిణీ స్త్రీలతో హరివంశాన్ని పారాయణం చేయించడం, వారికి హరివంశాన్ని పురాణంగా చెప్పించి వినిపించడం, పూర్వం చాలా ఇళ్ళలో జరిగేది. కృష్ణుని జననమూ, బాల్య క్రీడలూ ఎఱ్ఱన హరివంశం లోనే ఉన్నాయి కాబట్టీ ఎఱ్ఱన హరివంశానికే ఆ అవకాశం ఉండేది. నాచన సోమన ఎఱ్ఱనకు సమకాలికుడో, తరువాతి వాడో కాని పూర్వుడు కాదని సాహిత్య చరిత్రకారుల నిర్ధారణ.

నాచన సోమన గొప్ప ప్రౌఢకవి. తను అనువదించిన హరివంశం ఆంధ్రమహాభారతపు కొనసాగింపుగా భావింపబడాలని అనుకొన్నట్లున్నాడు. తిక్కన పదిహేను పర్వాలు వ్రాసి దానిని హరిహరనాథునికి అంకితం ఇచ్చినందున, ఆ హరిహరనాథునికే తన ఉత్తర హరివంశాన్ని అంకితం ఇచ్చాడు. అంతే కాక, తన ఆశ్వాసాంత గద్యలో “శ్రీమదుభయ కవిమిత్ర కొమ్మనామాత్యపుత్ర, బుధారాధనావిరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబైన శ్రీమహాభారత కథానంతరంబున” – అని తిక్కన నామస్మరణ చేశాడు. తాను మహాకవి తిక్కనకు సాటి రాగల కవిని అని ఆయనకు ఆత్మవిశ్వాసం ఉంది. అది అతిశయం ఏమాత్రం కాదు. ఆయన కవిత్వం అంతా బాగానూ ఉంటుంది. సాహిత్య ప్రియులు నాచన సోమనను గొప్ప ప్రత్యయంతో సంభావిస్తారు. ఈ “బహుళాంధ్రోక్తిమయ ప్రపంచమును సోముడు భాస్కరుండు వెలయింపన్,” అని గొప్ప ప్రాముఖ్యాన్ని సోమునికి ఇచ్చాడు రామరాజ భూషణుడు. ఒకడు నాచన సోమన్న అనే పరామర్శ గ్రంథాన్ని వ్రాశాడు విశ్వనాథ.


సత్యభామ – బాపూ బొమ్మ

పై పద్యానికి సందర్భం ఇదీ: శ్రీకృష్ణుడు నరకాసురునిపై యుద్ధానికి పోతూ తోడుగా సత్యభామను గూడా తీసుకువెళతాడు. నరకాసురుని రాజధానిని చేరీ చేరగానే పట్టణానికి రక్షగా ఉన్న రాక్షసులందరినీ చంపి, ఆ తరువాత ఇతర రాక్షస వీరులు రాగా వారితోనూ యుద్ధం చేస్తూ, మూర్ఛ పోయి, సేదదీరి లేచి సత్యభామతో, నువ్వూ సంగ్రామాన్నే కోరావు గదా, ఇప్పుడు అవసరం వచ్చింది. ఇదిగో శార్ఙ్గము అంటూ తన ధనుస్సును ఆమె చేతికి ఇస్తాడు. ఇది ఆమె నరకాసురునితో యుద్ధం చేసేటప్పుడు ఆమె సంరంభాన్ని వర్ణిస్తూ చెప్పిన పద్యం.

స్వతహాగా సత్య వీరనారి. నరకుని లాంటి వీరునితో యుద్ధం చేసే అవకాశం వచ్చింది. ఆ ఉత్సాహం కొంత. తన పరాక్రమం భర్త ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు భర్త ముందు ప్రదర్శించే అవకాశం వచ్చింది. ఆ ఆనందం కొంత. ఇటు శత్రువును చూస్తూ, అటు ప్రియుని చూస్తూ ఏకకాలంలో వీరాన్నీ, శృంగారాన్నీ ప్రదర్శిస్తున్నది. ఆమె అటు అరిని (శత్రువుని) చూస్తున్నది. అతని మీద బాణ పరంపర కురిపిస్తున్నది. ఇటు హరిని చూస్తున్నది. అతనిపై చిరునవ్వులను చిందిస్తున్నది. ఈ రెండు పనులూ ఒక హేలావిలాసంగా నిర్వహిస్తున్నది. ఆ సందర్భంలో ఆమె పయ్యెద కొంగు కొంచెం తొలిగింది. మెడలోని మందారమాల లోని పువ్వుల నుంచి తేనె సొనలు కురిసి ఆమె వక్షస్థలాన్ని చిత్తడి గావిస్తున్నాయి. ఇదీ దృశ్యం. ఆమె సౌందర్యమూ, శృంగారమూ, వీరమూ, చిరునవ్వుల జల్లూ, మెడలోని మందారదామం లోని మకరందాల ధార, కొంచెంగా తొలగిన పైటకొంగు — ఒక ఆహ్లాదకరమైన దృశ్యాన్ని ఈ పద్యంలో రూపు కట్టించాడు సోమన కవి.

ఒక భయంకర యుద్ధం మధ్యలో ఇంత ప్రసన్న సుందర దృశ్యాన్ని వర్ణించడం ద్వారా సత్యభామ యుద్ధాన్ని ఎంత అలవోకగా నిర్వర్తిస్తున్నదో కూడా సూచించాడు నాచన సోమన. అంతకు ముందు కృష్ణుడు భార్య చేతికి ధనస్సు నిచ్చిన తరువాత మురమర్దనుపై – నరకాసురేంద్రుపై, ఇంపును – తెంపును, మానమును – మచ్చరమును, అచ్చపుచాయలనూ – విషచ్ఛటావలినీ, మేలపు చూపులనూ – తాడి తూపులనూ పరపైనది అని ప్రారంభించి సత్యభామ సంగ్రామాన్ని ఐదారు పద్యాల్లో వర్ణించిన పిమ్మట, ఆ వరసలో ఒక కేతనం లాగా వెలిగిపోయే ఈ పద్యాన్ని చెప్పాడు. సందర్భానికి తగిన వర్ణనల తోనూ, ధార తోనూ, పదాలు, సమాసాలు ఎంతో అందంగానూ అమరిపోయి, మంచి శబ్దాలంకార సౌష్ఠవంతో చక్కని శ్రవణ సుభగతను సాధించి – సుఖంగా వజోవిధేయమయ్యే పద్యం ఇది.

చూచుకములం దందంద, మందార కేసర మాలా మకరంద బిందు సలిలస్యందంబు లందంబులై తొరుగన్ – అనే వాక్య బంధం బిందుపూర్వక దకార పౌనఃపున్యంతో వీనుల విందు చెయ్యడం అలా వుంచితే, అది పద్యానికి చాలా అందం తీసుకువచ్చిన కల్పన. (మెడలో) ధరించిన మందారమాల లోని పూలనుంచి స్రవిస్తున్న తేనె చినుకులు పయ్యెద కొంత తొలగిన ఆమె వక్షస్థలాన్ని తడుపుతున్నాయి అని అర్థం. కొంతమంది వ్యాఖ్యాతలు కొప్పులో ముడుచుకున్న పూల లోని మకరందం ఉరస్థలి మీదకి జారింది అని భాష్యం చెప్పారు కానీ మెడలోని పూమాల అనడమే న్యాయం. ఎందుకంటే యుద్ధానికి పోయేముందు వీరతిలకం దిద్ది పూమాలను మెడలో కీలించడం ఆచారం. సత్యభామా కృష్ణులకు చెలులు, బంధువులు అలా పుష్పమాలా అలంకృతులను గావించి, విజయాన్ని ఆకాంక్షించి వీడ్కోలు పలికి వుంటారు. యుద్ధం రంగు ఎరుపు. అందుకని ఆ మాల మందారమాల కావడం సముచితం. మాలలోని పూల లోంచి ఎదను తడిపేంత మకరందం స్రవించిందని చెప్పడం కేవలం అలంకారం. స్యందము అంటే ఊట. ఆ మకరంద బిందు సలిలస్యందము చూచుకములను తడిపింది. చూచుకము అంటే స్తనాగ్రము. ఆ సమయంలో పయ్యెద ఒకింత తొలిగింది అని చెప్పడం సత్యభామ సౌందర్య వీరాల సుందర వర్ణన. చూచుకములు అనడం బట్టి కూడా కొప్పులో ముడిచిన పూలు అనేదానికన్నా మెడలో వ్రేలాడే పుష్పదామం అని చెప్పుకోవడమే సమంజసం.

ఈ చూచుకములు అనే పదానికి కొన్ని గ్రంథాల్లో కొందరు వ్యాఖ్యాతలు రెండు పాఠాంతరాలని చూపించారు. సూచకములు అనీ, చూపుగములు అనీ. సూచకములు అంటే సూచించేవి. ఎర్రని మందారాలు ఆమె కన్నుల్లో ప్రతిఫలించి ఆమె వీరాన్నీ, కోపాన్నీ సూచిస్తున్నాయి అనీ — చూపుగములు అంటే చూపుల మొత్తాలు మందార పూల రంగుతో కలిసి ఎర్రనైనాయి అనీను. కానీ మకరంద బిందు సలిల స్యందాలను పై పాఠాంతరాలు తృప్తికరంగా విశదీకరించడం లేదు. అందుకని ఈ రెండు పదాలకన్నా చూచుకములు అన్న పదమే సందర్భోచితంగా వున్నది. ఈ పదమే రూఢి అయింది కూడాను.

ఈ చక్కని పద్యం పోతనకవికి కూడా బాగా నచ్చింది. కొంచెం వ్యంగ్యంగా సోమన చెప్పిన భావాన్ని పోతన వాచ్యంగా చెప్పి విశాలం చేశాడు. భాగవతం లోనూ నరకాసుర వధ ఘట్టం ఉంది కదా. అక్కడ పోతన వ్రాసిన ఆ పద్యాన్నీ చిత్తగించండి.

పరు జూచున్ వరు జూచు నొంప నలరింపన్ రోష రాగోదయా
విరత భ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్
జరుగన్ కన్నులు కెంపు సొంపు బరగన్ జండాస్త్ర సందోహముల్
సరసాలోక సమూహమున్ నెరపుచున్ చంద్రాస్య హేలాగతిన్

సోమన పద్యాన్ని పోతన అనుకరించిన ఛాయలు ప్రస్ఫుటంగా వున్నాయి గదా ఈ పద్యంలో. ఇదే భావాన్ని ఇంకా కొనసాగిస్తూ, “రాకేందు బింబమై, రవిబింబమై యొప్పు నీరజాతేక్షణ నెమ్మొగంబు,” అంటూ చాలా విపులం చేశాడు పోతన. బహుశా పద్య భావం సంస్కృతం నుండే దిగుమతి అయుండవచ్చు. కానీ సోమన వ్యంజనతో సూచించిన దానిని పోతన వాచ్యం చేశాడు. అదలా ఉంటే, సోమన పద్యాన్ని పద్య నిర్మితిలో, ఛందంలో ప్రారంభము, ముగింపుల్లోనూ బాగా అనుకరించాడు పోతన. పోతన లాంటి మహాకవి చేతనే అనుకరింపబడిన ఈ పద్యం ఎవరికి నచ్చదు? అనుకరించాడు అనగానే పోతనకు లాఘవం ఆపాదించ నక్కర లేదు. అందమైన భావం కనిపించగానే ముగ్ధుడై అది ఎక్కడ ఉన్నా స్వీకరించే విశాల హృదయము, పూర్వ కవి ఎడల గౌరవం ప్రకటించే సహృదయతగా దానిని భావించాలి. పరమ సాధువు, భక్త కవిశేఖరుడు అయిన పోతన విషయంలో అది మరీ నిజం.