భళ్ళున బద్దలయిందది. పొరపాటున జారిపడిందా కావాలని విసిరికొట్టిందా తెలియదు. మిటకరించిన కళ్ళలో భయం లేదు. ఏం చేస్తావో చేయి అన్నట్టు నిల్చుంది మూడడుగుల ఎత్తుగా. పెదాల చివర్లలో నవ్వొలుకుతుందా? దాన్ని తాకొద్దని ఆమె వారిస్తూనే ఉంటుంది. చాలా ప్రియమైనది అది. చెదిరిన ముక్కలన్నీ ఏరుతూంటే ఏడుపు ముంచుకొచ్చింది.
సముద్రపు ఒడ్డున పరుగులూ, నురగలతో పోటీగా నవ్వులూ, తడిగాలీ, తెగిన చెప్పూ, చిరుచీకట్లలో గుడ్డిదీపపు వెలుగులో దీనికోసం బేరసారాలూ, గదిలో మర్చిపోతే దాన్ని అతను భద్రంగా తీసుకుచ్చి మళ్ళీ ఇవ్వడమూ. అవీ పోయి, ఇప్పుడు ఈ జ్ఞాపక చిహ్నమూ పోయి. ఒక గాజు పలుకూ, ఇంకేదో జ్ఞాపకపు ముక్కా గుచ్చుకుని నొప్పి.
పాప చేయి నొప్పెట్టేంత గట్టిగా పట్టుకుని గుడ్లు ఉరుముతూ అరుస్తూ చెప్పింది “ఇంకెప్పుడు నేర్చుకుంటావు? ఎన్నిసార్లు చెప్పాలి? చెప్పిన మాట విను.”
సున్నితమైనవి ఉంటాయి, విలువైనవి కాపాడుకోవాలి, పోగొట్టుకోకూడదు. ఇంకా చాలా చాలా నేర్పాలి నీకు. పాపకు అందనంత ఎత్తులో ఉన్నవి తీసి అందేలా పెట్టింది.
“ఇవి విలువైనవి. వీటిని పట్టుకున్నా, పగలగొట్టినా దెబ్బలు తింటావు. అర్థమయిందా?”
అయినా మళ్ళీ అదే జరిగింది. ఇంకోటి కింద పడి పగిలింది. అదే వెరపు లేని చూపు.
లోపల భగ్గున మండి చెంప చెళ్ళుమనిపించింది. ముక్కలయిన ఆ చలి కాలపు రాత్రినీ, లాక్కుని సగం కప్పుకున్న తన కొంగునూ, ఆ పున్నాగ చెట్ల వాసన కిందుగా వెచ్చటి నడకనూ, ఎవరి కంటా పడని ముద్దులనీ, ఇంకా మిగిలిన ఆ రాత్రినీ అన్నీ ఊడ్చి పడేసింది.
మళ్ళీ అదే పాఠం పాపకి. మరింత కరుకు గొంతుతో.
అయినా మళ్ళీ అదే జరిగింది. కింద ముక్కలయిన గాజు ఊయల. అదే బెదురు లేని చూపు.
డాక్టర్ నోటి వెంట తీపి కబురూ, వెచ్చటి ఒడిలా దోసిలి పట్టినట్టున్న లోకమూ, దారి వెంట ట్రాఫిక్ ఊరేగింపూ, హారన్ల మేళతాళాలూ, అప్పటికప్పుడు అల్లుకున్న కలల గూళ్ళూ కింద చెల్లాచెదురుగా.
మోకాళ్ళ మీద కూలబడి పాపను హత్తుకుంది. “నువు నాకు నేర్పుతున్నావని తెలియలేదు.” ముద్దు పెట్టుకుంది. నేర్చుకున్న పాఠాలు లెక్క పెట్టుకుంటూ.
పాప నవ్వింది.