నాకు నచ్చిన పద్యం: విశ్వనాథ అపురూప కల్పన

సీ.   కడచిన యామిని పిడుగువడ్డ సగంబు
            మాఁడిన తలయైన మద్దిచెట్టుఁ
      బోలినదానిని, ముంచెత్తు వానలు
            సగములో వచ్చినం జల్లనారి
      పోయిన కాష్ఠంబుఁ బోలిన దానిని,
            గహనంబులోఁ గుంటగట్టులోన
      మట్టలెండి జలాన మాఁగిన చిట్టీతఁ
            బోలినదానిని, సోలుదాని

తే.   నెడపెడగ వాయువులు వీవనిట్లు వచ్చు
      వాయువున వంగుచును నట్లువచ్చు వాయు
      పూరణమున నాఁగుచు నాఁగి మొరయుచున్న
      వేణువల్మీక గుల్మంబుఁ బోనిదాని

ఈ పద్యం కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించిన శ్రీమద్రామాయణ కల్పవృక్షంలో ఆరణ్యకాండ పంచవటీ ఖండం లోనిది.

ఈ పద్యంలో కవి ఎవరినో వర్ణిస్తున్నాడని అర్థం అవుతూనే వున్నది. ఇందులో నాలుగు ఉపమానాలు ఉన్నాయి. మొదటిది – గడిచిన రాత్రి మద్ది చెట్టు మీద పిడుగు పడింది. ఆ చెట్టు పూర్తిగా ధ్వంసం కాలేదు. తల సగం మాడిపోయింది. మద్ది చెట్టంటే పొడుగ్గా గంభీరంగా ఉంటుంది. అది సగానికి సగం అశనిపాతంతో కాలిపోయింది. సగం తగలబడ్డ చెట్టు ఎంత వికారంగా ఉండాలో అంత వికారంగానూ ఉంది అది.

రెండో పోలిక – శ్మశానమే పరిహార్యమైన ప్రదేశం. అశౌచానికి ఆటపట్టు. అటువంటి కాటిలో కాలుతున్న కాష్ఠం గుండెల్లో భయంతో పాటు అసహ్యమూ కలిగించేది. ఒక శవం చితిమీద కాలుతూ వుండగా పెద్దవాన వచ్చినందున పూర్తిగా కాలకముందే ఆ చితి ఆరిపోయింది. ఎంత జుగుప్స కలిగించాలో అంత జుగుప్సాకరంగానూ ఉంది ఆ సగం కాలిన కాష్ఠం.

మూడో పోలిక – అడవిలో అక్కడక్కడా నీళ్ళు నిలిచిన కుంటలుంటాయి. అలాంటి ఒక కుంట గట్టున ఒక చిన్న ఈత చెట్టు – చిట్టీత చెట్టుంది (చిట్టీతలు ఏపుగా కాండంతో పెరగవు. పొదగానే ఉంటాయి). దాని మట్టలు వంగి కుంటలోని నీళ్ళలో కొన్ని తడుస్తున్నాయి. మరికొన్ని మట్టలు నీళ్ళలో మాగి, క్రమంగా నీరు తగ్గి పొయ్యేసరికి, బైటపడి, ఎండి రంగు మారిపోయాయి. మొత్తానికి ఆ చిట్టీత చెట్టు – ఎత్తు తక్కువా, కుంట గట్టు మీద మాగిన మట్టలతో – ఎంత ఏహ్యంగా వుండాలో అంత ఏహ్యంగానూ వుంది.

ఇక నాలుగో పోలిక – అడవిలోని ఒక వెదురు పొద. మరీ పొడుగుది కాదు. పొద మొదట్లో పుట్టలు పెరిగాయి. అడ్డగోలగా గాలులు వీస్తున్నాయి. అటునుంచి వచ్చే గాలికి వెదుర్లు ఇటు వంగుతున్నాయి. ఇటునుంచి వచ్చే గాలితో అటు వంగుతున్నాయి. అలా వంగుతూ, ఆగుతూ పరస్పరం రాపిడితో ఎండుటాకుల గలగలలతో, వింత వింత శబ్దాలతో ఊళలు వేస్తున్నాయి. అటువంటి వేణు వల్మీక గుల్మం ఏమీ కనులకు ఇంపు కలిగించే దృశ్యం కాదు.

పిడుగు పడి సగం కాలిన మద్ది చెట్టూ, సగం కాలిన కాష్ఠమూ, మట్టెలెండిన చిట్టీతా, పుట్టలోంచి వెళ్ళకొచ్చి గాలి కూగుతూ చెవికింపు గాని శబ్దాలు చేసే వెదురు పొదా – ఒళ్ళు జలదరించే ఈ ఉపమానాలతో విశ్వనాధ వర్ణించింది – ముక్కూ చెవులు తెగిన తర్వాత స్వీయ రాక్షస రూపంలో భోరున విలపించే శూర్పణఖను.

బహూశా విశ్వనాథ సత్యనారాయణ రావణాసురుడంతటి వాడు. ఈమాట నేను చులకన భావంతో అనడం లేదు. ఆయన సర్వజ్ఞత, సమర్థతల మీద అపారమైన గౌరవంతో అంటున్నాను. ఆయన ఊహాదృష్టి ప్రసరించని ప్రదేశం ఈ చతుర్దశ భువనాల్లో ఉండి వుండదు. ఆయన ఊహలూ, కల్పనల అపురూపత మరే కవిలోనూ కానరాదు. ఆయన ఊహల లోతూ, చుట్టుకొలతా, వైశాల్యమూ కొంచెం అవగాహనలోకి రావాలంటే ఋతుసంహార కావ్యంలో ఆయన ఋతువులను వర్ణించిన తీరు పరికిస్తే చాలు. ఇక రామాయణ కల్పవృక్షమైతే ఆయనే స్వయంగా చెప్పుకున్నట్లు ‘సకలోహ వైభవ సనాథ’మే. ఆ! ఆయన రాసిందంతా ఇంతకు ముందెవ్వరో రాసిన రామాయణమూ, అలాంటి పాత కథలే గదా అని కొట్టిపారేసేవారు సైతం ఆయన బహుముఖీనమైన వైదుష్య విస్తృతికి విస్తుబోతారు. “వేదములలోని విమలార్థ చయము వాదించు నా కైత – దాని శత్రువై వరలు నీ జగము” అని ఆయన తన ప్రాథమ్యాన్ని స్పష్టం చేసి ‘తాంబూలాలిచ్చేశాం’ అని చెప్పిన తర్వాత, ఇక ఇతరులు ‘తన్నుకు చావడం’ తప్ప చేసేదేమీ వుండదు.

రామాయణ కల్పవృక్షం మరో రామాయణమే. వాల్మీకిని అనుసరించి రాసిన రామకథే. కానీ చాలా చోట్ల తన సొంత ఆలోచనలతో మార్పులు చేసుకున్నాడు విశ్వనాథ. ఉదాహరణకు, వాల్మీకి కైక ఒక సామాన్య మాత. కొడుక్కి రాజ్యం సంపాదించి పెడదాం అనుకునే తల్లి. దానికోసం ఎంతకైనా వెనుదీయని మానవి. కాని, విశ్వనాథ కైక ఒక మహా మనీషి. ధర్మరక్షణా, రాక్షస సంహారమూ అనే మహార్థాల కోసం తాను తెలిసి తెలిసీ అపకీర్తిని తలమోయ నిచ్చగించిన కారణ జన్మురాలు. ఈ రహస్యం ఆమెకూ, రామునికీ మాత్రమే తెలుసు. వాల్మీకీ విశ్వనాథల దృష్టిలో ఈ తేడాకు కారణం ఒక్కటే. వాల్మీకి రాముడు ఒక గొప్ప మానవుడు. విశ్వనాథ రాముడు సాక్షాత్తూ భగవంతుడు.

అలాగే విశ్వనాథ వాల్మీకిని మార్చి రాసిన మరో ఘట్టం పరశురామ గర్వభంగం. వాల్మీకి సీతారామ కళ్యాణానంతరం పరశురాముని ప్రవేశం చేయిస్తే, విశ్వనాథ కళ్యాణాత్పూర్వమే పరశురాముని శృంగభంగం కావిస్తాడు. తనకు పూర్వపు అవతారాన్ని సంపూర్తిగా పరిసమాప్తి కావించి, అతనిలోని వైష్ణవాంశను రాముడు తనలోకి పూర్తిగా ఆవాహన చేసుకున్న పిమ్మటనే రామునికి సీతావివాహ యోగ్యతను కల్పించదలచాడు విశ్వనాథ. మొత్తానికి ఇలాంటి మార్పులు అవాల్మీకాలైనా ఔచితీవంతాలే కాబట్టీ ఇబ్బందేమీ లేదు.

ఇక పద్యనిర్మాణం సంగతికి వస్తే, బాహ్య నిర్మాణం విషయంలో విశ్వనాథ అంత పట్టింపు ఉన్నవాడు కాదు. ఒక మంచి పదాన్ని తెచ్చి పొదుగుదామని అనుకోడు. ఆయనే స్వయంగా చెప్పుకున్నాడు “నిత్యవేగి నా చేతము – శబ్దమేరుటకు నిల్వదు” అని. ఆయన హృదయంలోంచి భావాలు బయటకు దూకుతాయి. ఛందస్సు ఆయనకు బానిస కాబట్టి ‘జీ హుకుం’ అంటూ వచ్చి ఆ భావాలను గణాలూ యతిప్రాసల మధ్య అమర్చిపోతుంది. పద్యానికి ధార అవసరం అని ఆయన అనుకోడు. ‘రసము వేయిరెట్లు గొప్పది’ అనేది ఆయన మతం.

విశ్వనాథ పద్యాలను పైపై అందాల కోసం చదవకూడదు. మహాద్భుతమైన కల్పనల కోసం చదవాలి. అపురూపమైన ఊహల కోసం చదవాలి. కథానిర్వహణ శిల్పంలోని నేర్పు కోసం చదవాలి. తెలుగు పల్లెల్లో, పొలాల్లో, తాపుల్లో చిన్నతనంలో తాను చూసిన సొగసులనూ, అందాలనూ కవిత్వంలో కుప్ప వోసిన తీరు చూడ్డం కోసం చదవాలి. తెలుగిండ్లలోని ఆచారాలనూ, వాడుకలనూ, పలుకుబడులనూ, కథల్లో, పద్యాల్లో పొదిగిన సౌందర్యం కోసం చదవాలి. సంభాషణల్లో వ్యావహార ధోరణికి ఛందస్సుతో సాహచర్యం చేయించిన చాతుర్యాన్ని ఆనందించడం కోసం చదవాలి. పై పద్యం అలాంటిదే. చూశారుగా, ఎంత విచిత్రమైన ఉపమానాలను సృష్టించాడో. అవి పూర్తిగా విశ్వనాథవే, వాల్మీకివి కావు. వాల్మీకి ఈ సందర్భంలో శూర్పణఖను గురించి అనేక విశేషణాలు వాడాడు, అదీ ఆమె ముక్కు చెవులు కోయకముందు – దారుణా, వృద్ధా, భైరవస్వరా, దుర్వృత్తా, అప్రియదర్శినీ, కామమోహితా, ఇవాం విరూపాం, అసతీం, అతిమత్తాం, మహోదరీం, రాక్షసీం – ఇలా. కర్ణ నాసికా ఖండనం తర్వాత శూర్పణఖకు తీసిన ఛాయాచిత్రం – విశ్వనాథ రాసిన పై పద్యం.

కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షం అనే సుధాపాయసాన్న భాండంలో పైన చెప్పిన పద్యం ఒక్క మెతుకు మాత్రమే. పట్టి చూడండి.

[ఊసు: సెప్టెంబరు 10, 1895 శ్రీ విశ్వనాథ జన్మదినం – సం]