పెదవి దాటనివి

“ఏం, నాకోసారి చెప్తే అర్థం కాదనుకుంటున్నావా? చెప్పిందే చెప్తావేమిటి? నేనేం చేయాలో నాకు తెలుసు.”

“అదికాదు, నేనెందుకు చెప్పానో….”

“నేనేం ఖాళీగా కూర్చున్నానా? ఆఫీసుపనితో పాటు ఇంటికి సంబంధించిన బయటిపని అంతా చేస్తూనే ఉన్నా కదా! అయినా తృప్తి లేకుంటే ఎలా?”

“తృప్తి విషయంకాదు. మాటిచ్చాం కదా ఇవాళ్ళోపు ఇచ్చేస్తాం అని.”

“అదే! మీరొక్కరే మాట నిలబెట్టుకునేవారు. మాకేం చేతకాదు. అంతే కదా!”

“ఎందుకలా ప్రతిదానికీ పెడర్థాలు తీస్తావు?”

“అంతే! నేను తీస్తే పెడార్థం. మీరంతా మాత్రం సరైన వాళ్ళు.”

“అది కాదు వికాస్….”

“ఏది కాదు? అసలు నీకు నామీదేమన్నా ప్రేమా, గౌరవం ఉండేడిస్తే కద! నీకసలు ఆనందంగా ఉన్నానని చెప్పడం కూడా చేతకాదు. అవతలివాళ్ళ కష్టం అర్థం కాదు. ఒక్కరోజన్నా నన్ను మెచ్చుకున్నావా? ఒక్కరోజన్నా ఐ లవ్యూ అన్నావా? అసలు…”

“నేను మళ్ళీ మాట్లాడతాను వికాస్…” ఫోన్ కట్ చేసింది మేఘన. ఆఫీసులో చాలా బిజీగా ఉన్న టైంలో ఈ ఫోను. మోనిటర్ మళ్ళీ ఆన్ చేసింది నిట్టూరుస్తూ.

“ఉన్నావా? లంచ్?” – స్నేహితురాలి మెసేజ్. పనుంది, నువ్వెళ్ళమని జవాబిచ్చి పనిచేయడం మొదలుపెట్టింది మేఘన. ఇంతలో మళ్ళీ ఫోన్ బీప్. మెసేజొచ్చింది. “ఐయామ్ సారీ. లవ్యూ -వికాస్” అని ఉంది. అది చూడగానే మనసంతా గజిబిజిగా తయారైంది మేఘనకు.

‘నీకు నామీదేమన్నా ప్రేమా గౌరవం ఉంటేకద!’ అన్న మాటే మళ్ళీమళ్ళీ చెవుల్లో మ్రోగుతోంది. ఎంత వద్దనుకున్నా, కడుపులోకి తోసేద్దామని చూస్తున్న బాధంతా పైపైకి వస్తూ కళ్ళలో చేరుతోంది. ఎక్కడ బయటపడిపోతానో అన్న భయంకొద్దీ మొహం కడుక్కుని వచ్చి కూర్చుంది. వద్దనుకున్నా మనసులో అవే ఆలోచనలు.

“ఇన్నాళ్ళ తరువాత, ఇంత జరిగాక, ఇప్పుడు ప్రేమలేదని అనుమానించడమా? విన్నావా? తనని నువ్వెప్పుడు మెచ్చుకోలేదట. తనంటే నీకు గౌరవం లేదట” – మేఘన మాట్లాడకపోడంతో రెచ్చగొట్టాలని మనసు ఉక్రోషం వెళ్ళగక్కింది. ‘తనులేనిదే లోకం అసంపూర్తిగా అనిపించడాన్ని ఏమంటారు? తనకోసమే, తన చుట్టూనే నా ప్రపంచాన్నంతా మలుచుకుని, ఊహలన్నీ అల్లేస్కోడాన్ని ఏమంటారు?’ – మేఘన కళ్ళలోని తడి మాట్లాడితే ఇదే అడిగేదేమో.

‘తనకోసమని ఇష్టంలేనివి అలవాటు చేసుకోవడం, ఇష్టమైనవి వదిలేసుకోడం, ఇవేవీ గుర్తులేవా? వాటిలో ప్రేమలూ, గౌరవాలూ, అభిమానాలూ – ఎప్పుడూ కనబడలేదా?’ మేఘన మనసుని ప్రశ్నించుకుంటోంది.

“ఆవేళోరోజు ఇంటికొచ్చేసరికి నీకిష్టమని కష్టపడి మిల్క్ షేక్ చేసాడు చూడు.”

“అవును, ఆవేళ ఎంత హాయిగా అనిపించిందో. నాకోసం తనలా చేయడం ఎంత ముచ్చటేసిందో. బాగుందని తనతో చెప్పాకూడా.”

“చెబితే సరిపోతుందా?”

“మరి? ఆ తరువాత వికాస్ మిల్క్ షేక్ చేసిచ్చాడని ఎంతమందికి చెప్పుకున్నాను. అమ్మకి చెప్పాను, నాన్నకి చెప్పాను, చెల్లికి చెప్పాను, వికాస్ పేరెంట్స్ కి చెప్పాను, ఫ్రెండ్స్ కి చెప్పాను – జనానికి విసుగొచ్చి, సర్లే! నీకే ఉన్నాడు మహా ప్రేమించే మొగుడు – అని విసుక్కునే దాకా చెప్పలేదూ?”

“ఎప్పుడన్నా ఐలవ్యూ అన్నావా అసలు?”

“ఎప్పుడు చెప్పలేదు? చెప్పని రోజు దాకా ఎందుకు? క్షణం ఒకటి చూపించు చాలు” – మేఘన మనసుని ఎదురు ప్రశ్నించింది.

మనసేం మాట్లాడలేదు.

“నా కళ్ళలో తెలీలేదా? ప్రేమ పాటలన్నీ పనిగట్టుకుని హై వాల్యూమ్ లో పెట్టినప్పుడు వికాస్ మాత్రం కంప్యూటర్లోకి దూరి ఉంటే ఎలా తెలుస్తుంది? నేను తనకేదో చెప్పాలని ఆరాటంగా వస్తే, తను చాట్ విండోలో జోక్ కి నవ్వుకుంటూ నా మాట వినిపించుకోనప్పుడు ఎలా తెలుస్తుంది? నే పంపిన ప్రేమలేఖలకే జవాబివ్వలేదు అప్పట్లో, ఎన్నోరోజులు జవాబుకోసం ఎదురుచూస్తూ గడిపిన నాకు తెలుస్తుంది కానీ, అసలు చదివాడో లేదో -అతనికెలా తెలుస్తుంది? అతని ఫోనుకోసం పిచ్చిగా ఎదురుచూస్తూ గడిపిన క్షణాలు నాకు తెలుసుకానీ, అతనికెలా తెలుస్తాయి?”

“నువ్వెక్కడ చెప్పావమ్మాయ్ ఇదంతానూ?” మనసు వెటకారం.

“ప్రతి మాటా పెదవి దాటే బయటపడాలా? ప్రతిమాటకీ శబ్దం తెలియాలా? పెదవి దాటని మాటలే లేవా? పెదవి దాటకపోతే మాటలు కావా?”

“బాగుందమ్మాయ్ వరస! ఎటొచ్చీ నాకే ఏమీ అర్థం కావట్లేదు”

“నీకా అర్థం కానిది? నా నువ్వే తెలిసుంటే, ఈపాటికి వికాస్ కి అర్థమైపోయి ఉండేది.”

“ఏమిటది?”

“నా కళ్ళలో, చేతల్లో ప్రతి నిముషం పలికిన మాటలు, రోజులు తరబడి విసుగూ విరామం లేక, వినాల్సినవారు వినకున్నా చెప్పుకొస్తున్న కబుర్లు.” మేఘన జవాబు.

“ఆర్యూ దేర్?” -స్నేహితురాలి సందేశం తెరపై చప్పుడు చేయడంతో ఓసారి ఉలిక్కిపడి అటూ ఇటూ చూసింది. ఏదో మీటింగట. వెళ్ళడానికి లేచింది. మీటింగ్ గదిలో ఏదో ప్రెజెంటేషన్. ఆ అబ్బాయెవరో మంచి తెలివైన కుర్రాడిలా ఉన్నాడు. చురుగ్గా చకచకా అన్నీ చేసుకుపోతున్నాడు. మేఘనకి తను మొదటిసారి వికాస్ ను ఇలాగే కలిసిందన్న విషయం గుర్తొచ్చింది. ఎన్నికలలు కన్నారు భవిష్యత్తు గురించి? వికాస్ తో తన జీవితం గురించి ఎంత అందమైన కలలు కన్నది? ఒక్కసారిగా స్వప్నానికీ, సత్యానికీ ఉన్న వ్యత్యాసం ఎదురుగ్గా ఉన్న తెరపై కనబడి మాయమైంది.

“ఏమిటీ తగాదాలు… సంబంధం లేకుండా… ఇప్పుడేమిటీ ప్రశ్నలూ, అనుమానాలూ…” విసుక్కుంది మేఘన మనసులో.

“నీకు నా మీద ప్రేమా గౌరవం ఉండేడిస్తే కదా!” – ఇంతసేపూ గాల్లో షికారెళ్ళిన డైలాగు మళ్ళీ వచ్చి జోరీగలా పోరడం మొదలైంది. తలనొప్పిగా ఉందని మీటింగ్ నుండి బయటకొచ్చేసింది మేఘన.

ఇలాగైతే పనవదని కంప్యూటర్ ముందు కూర్చుని, పనిచేయడం మొదలుపెట్టింది. హెడ్ఫోన్లు పెట్టుకుని, పాటలు ఆన్ చేసింది. “ఈవేళలో నీవు, ఏం చేస్తూ ఉంటావో…”. ఛ! అనుకుంటూ వెంటనే హెడ్ఫోన్లు పక్కన పడేసింది. పొద్దున్న రాగానే అదే పాట వింటూ తనలో తను నవ్వుకోడం గుర్తొచ్చింది. అంతలోనే, ‘నీకు నా మీద ప్రేమా గౌరవం ఉండేడిస్తే కదా!’ అన్న మాట! మాటన్నది ఎంత జాగ్రత్తగా వాడాలో తెలిసొచ్చినట్లైంది మేఘనకు, ఆ ఒక్కమాట తనను అలా వెంటాడటం చూశాక.

“ఏమిటోయ్? ఎందుకలా మూడీగా ఉన్నావ్? ఏం జరిగింది?” స్నేహితురాలు మోనిక అడిగింది తన క్యూబ్ వైపు వచ్చినపుడు.

“తనేదో అన్నాడు లే. బాధేసింది.”

“నువ్వు మరీనూ! చిన్న గొడవకే ఇలా ఐపోతే ఎలా? ఎంత డల్ గా కనిపిస్తోందో తెలుసా నీ మొహం అసలు?”

“ఏమో, నిజానికి గొడవ చిన్నదే. కానీ, నాకు చాలా బాధేసింది.”

“ఇంత సెన్సిటివ్ ఐతే కష్టం అమ్మాయ్! అయినా, నువ్వు ఇంత ఆలోచించడం అనవసరం అనిపిస్తోంది నాకు. టేకిటీజీ. చీరప్” అంటూ పనుందని వెళ్ళిపోయింది మోనిక.

నిజమే, ఏ విషయమైనా అది మనల్ని సూటిగా తాకనంతవరకూ చిన్నదిగానే ఉంటుంది. కానీ, ఒక్కోసారి ఒక మాటే పది బాణాల బలంతో గుచ్చుకుంటుంది. అది అనుభవిస్తున్న వారిని వదిలితే మిగితా అందరికీ అనవసరపు చింతలానే అనిపిస్తుంది – అనుకుంది మేఘన మనసులో.

ఎలాగోలా మనసు దారిమళ్ళించి పనిచేసుకుని సాయంత్రం ఆఫీసు బస్సెక్కింది. రెండుగంటల ప్రయాణం ఇంటికి. మళ్ళీ మొదలు. ‘అసలలా ఎలా అనగలిగాడూ?’ మేఘన కళ్ళు వర్షించే మేఘాల్లాగానే ఉన్నాయి. మాటలకంత పదునెందుకో? చేతలకంత సౌకుమార్యం మాత్రం దేనికీ? ఒకటి తేలిగ్గా దెబ్బతీసేస్తుంది. రెండోది ఎంత ప్రేమగా చేసినా అవతలి మనిషి మాటపై మాత్రమే ఉంటే ఇదంతా బూడిదలో పోసిన పన్నీరే! – తన ఫిలాసఫీకి తనకే నవ్వొచ్చింది మేఘనకు తడికళ్ళ చెమ్మలో తడిసిపోతూ కూడా.

బస్టాపు నుండి నడుస్తోంది కానీ, ఆ కంటి చెమ్మని తుడిచేసి మామూలుగా ఉండడానికి విశ్వప్రయత్నం చేస్తోంది. తననిలా చూసి వికాస్ బాధపడతాడన్న భావన దానికి కారణమేమో. మనసు నుండి ఆ ఆలోచనల్ని తుడిపేయాలని అనుకుంటుండగానే, వెనుక నుండి ఓ ఈల వినబడ్డది. ఉలిక్కిపడి తల ఎత్తినప్పుడు గమనించింది. ఆ చీకటిరోడ్డులో తన ముందువైపైతే నిర్మానుష్యంగా ఉందని. కాస్త భయంగానే వెనక్కి తిరిగింది – నవ్వుతూ బైక్ పై వికాస్!

మేఘన చెయ్యి పట్టుకుని వెనక్కు ఎక్కమన్నట్లు సైగ చేస్తూ – “భయపడ్డావా?” అన్నాడు. మాట్లాడితే ఎక్కడ వణుకు తెలుస్తుందోనని మళ్ళీ మామూలవడానికి కష్టపడుతూ నవ్వు తలూపింది. అతను ఆమె పరిస్థితి గమనించాడో లేదో మరి. ఇంటికి చేరేలోపు ఆ పదినిముషాలు కూడా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాడు, హుషారుగా.

“ఒక్క ‘సారీ’ తో దుకాణం కట్టేసినట్లు ఉన్నాడు. నువ్వూ ఉన్నావ్ ఎందుకూ? తలుచుకుని తలుచుకుని ఏడుస్తున్నావ్!” మనసు వెక్కిరించింది. ఇల్లొచ్చేసింది. ఆసరికి ఇద్దరూ నవ్వుకుంటూ మెట్లెక్కుతున్నారు.

“పెదవి దాటనివి – ఇంకా పెదవి దాటనేలేదు. ఇప్పటికి దాటవు కూడా. బహుశా ఎప్పటికీ దాటవేమో!” – మనసు ఎవర్నీ ఉద్దేశించకుండా అన్నది.

మేఘన నుండి జవాబు రాలేదు.