ఎరుపు దిగని సంజెలు

టైపు సెంటరు ముందునుంచి పోతూ మావయ్య కళ్ళబడకుండా పోవడమంటూ జరగదు. కొత్తగా

కట్టిన ఏ. సీ. సినిమాహాలుకెళ్ళాలంటే ఆ దారి తప్ప లేదాయె. పది గంటలకు తలుపులు తీసి గౌతం

టైపు సెంటర్లోనే రాత్రి తొమ్మిది దాకా కూర్చుని నాలుగు బ్యాచిలకు షార్టుహ్యాండు పాఠాలు చెప్పి,

అటుగా వచ్చే పోయే వాళ్ళను పలకరిస్తూ ఉండటం ఆయన దినచర్య. పదోతరగతి

పరీక్షలయినప్పటినుండీ వెంట తగిలేవాడు, వచ్చి కాస్తో కూస్తో టైపు నేర్చుకొమ్మని. ఇంట్లో

అమ్మకూడా సెలవల్లో సినిమాలెక్కువవుతున్నాయని మావయ్య పిలుస్తున్నాడు కదా వెళ్ళి ఒక గంట

అంతో ఇంతో నేర్చుకుంటే తప్పేముంది అనేది.

సరే ఇహ తప్పదు అని ఒక గంట అట్లా వెళ్ళి ఏదో టైపు మాత్రం అయిందనిపించి, పేజీకి వంద

తప్పులతో ఎర్రటి పెనిసిలుతో దిద్దించుకుని వచ్చేవాడిని. ఆయన సెంటర్లో ఉండే ఫ్రెండ్లీ వాతావరణం

మూలంగా ఇంటరు మొదటేడు మొదలైనా ఆ టైపు పేరుతో అక్కడికి వెళ్ళి కూర్చోవడం ఆపలేదు.

పైగా పక్కనే “ఇంకో” పుస్తకాలు అద్దెకు దొరికే షాపు ఉండటం ఇంకొక కారణం కూడా.

మావయ్య పదేళ్ళుగా నడుపుతున్న టైపు సెంటరు కొద్దికాలం బాగానే నడిచింది. మొదట

టౌనుకంతా ఆయనొక్కడిదే ఉండేది. తర్వాత్తర్వాత కాంపిటీషను పెరిగి ఇప్పుడు ఇంకో నాలుగైనా

అయ్యాయి. సంఖ్య పెరిగినా, తగ్గినా ఈయన ఒక్కసారి కూడా తన సెంటరును పెద్దదిగా

చేద్దామనో, వేరేవి కొత్త మెషినులు కొందామనో అనుకున్న పాపాన పోలేదు. ఇంట్లో మనం

ఉతుకులెక్కువైపోయి వెలిసిపోయినా ఆఖరికి ఎక్కడో ఒక వైపు చిరిగినా గొంగడినీ, దుప్పట్లనూ

ఎట్లా సహిస్తామో అట్లాగే, పాడైపోయిన వాటినే మళ్ళీ రిపేరు చేసి నడిపించేవాడు.

” ఆ వచ్చే దాంట్లో కొత్తవి కొనాలంటే ఎక్కడినించి తెస్తాడు వాడు మాత్రం ” మా అమ్మ ఆయన్నే

వెనకేసుకొచ్చేది నేనెప్పుడైనా ఆయన పాత సామానుల లాంటి మెషినులగురించి చెప్తే.

కొద్దినెల్లల్లో ఆ టైపు మురిపెం తీరిపోవడం, ఇంటరు చదువులో, ట్యూషనుల్ల్లో పడిపోవడంతో అది

ఆగిపోయింది అనేది వేరే సంగతి. అమ్మ పనిచేసేదీ మా కాలేజీలోనే కాబట్టి ఇక నా చదువులో శ్రద్ద

ఎక్కువ తీసుకునేవాళ్ళకు లోటు లేకపోయింది.

“ఆర్నెల్లలో లోయర్‌ ప్యాసయ్యేలా నేర్చేసుకున్నావు “, పరీక్ష తీసుకుని సర్టిఫికేటొకటి తెచ్చుకుంటే

ముందు ముందు పనికొస్తుందేమో అనేవాడు మావయ్య. ఆయన వుద్దేశ్యం ప్రకారం, మా అమ్మ

వుద్దేశ్యం ప్రకారం, ఆఖరికి మా నాన్న అభిప్రాయం ప్రకారం కూడా నేనేదో ఒక ప్రయోజకుణ్ణి,

అంటే, ఎక్కడో ఒక చోట బ్రతక గలిగే విధంగా సకల విద్యల్లో ప్రావీణ్యతలేకున్నా, ప్రవేశం

ఉన్నవాణ్ణి అయితే మంచిదని వీలయినప్పుడల్లా చెప్పేవాళ్ళు.

ఇవేవీ రుచించకున్నా సరే ఆ టైపు సెంటరుకెళిటే తోటివాళ్ళను చూడ్డంతోపాటుగా రకరకాల

అభిప్రాయాలు వినే అవకాశం దొరికేది. అందుకే రోజూ కాకపోయినా వారానికోసారైనా వెళ్ళే వాడిని

ఏదో ఒక పని పెట్టుకుని.

పక్కన డబ్బాకొట్టు క్రిష్ణ దగ్గరికొచ్చి డిటెక్టివు పుస్తకాలు, రమణి రోజా లాంటి సెక్సు మాగజైనులు

అద్దెకు తీసుకెళ్ళే పోలీసులే, ఒక నాడు వాళ్ళ మీది ఆఫీసరెవరో చెప్పారని వాణ్ణి తీసుకెళ్ళి

లోపలేసారు, ఇహ ఆ దొరికే పుస్తకాలు కూడా దొరక్కుండా పోయినయి.

మా వెంకటేశేమో నా కంటే ముందునుంచీ, నాతోపాటుగా, నా తర్వాతకూడా ఇంకా ఇంటరు

మొదటి సంవత్సరమే చదువుతున్నవాడల్లా టైపులో హయ్యరు ప్యాసయిపోయి, షార్టుహ్యాండుకూడా

నేర్చేసుకున్నాడు నా ఇంటరయ్యేలోపలే. వాడిహ సొంత మెషినొకటి సెకండు హ్యాండుది

కొనుక్కుని కలెక్టరాఫీసుబయట తయారైపొయ్యాడు, ఎవరికైనా అవసరమైనవి టైపు చేసిపెట్టడానికి.

అక్కడ అందరికన్నా ఎంతో కొంత చదువుకోవాలని వున్నవాడూ, తెలివైనవాడుగా పేరున్నవాడు

శ్రీనే. అదీ కాక మావయ్యకు చేతికిందే ఏదైనా పని చెప్తే చేస్తూ ఆయన నెలకెంత ఇస్తే అంత

తీసుకునేవాడు. శ్రీనుకు పెద్దగా ఎవరూ లేరు. ఒక్కడే పేదవాళ్ళ హాస్టల్లో ఉండి చదువుకునేవాడు.

అక్కడో ఇక్కడో ఇట్లా ఎవరిచేతికిందో ఉండి వాళ్ళకు అవసరమైన పనులు, బ్యాంకుల్లో చలానాలు

కట్టడం, ఆఖరికి ఇంట్లో కూరగాయలు లాంటివి చేరవేయడం చేసి ఇచ్చింది తీసుకుని బ్రతికేసేవాడు.

పుస్తకాల పురుగే అని చెప్పవచ్చు, టైము దొరికిటే మాలా డిటెక్టివు సాహిత్యంలో పీ హెచ్‌ డీలు

చేసెయ్యకుండా మెడికల్‌ ఎంట్రెన్సు కోసం ప్రిపేర్‌ అయ్యేవాడు.

ఎన్నడైనా మాటల్లోకి దించితే మాత్రం, బయటికి మామూలుగా కనిపిస్తున్నా, ఏదో ఉద్వేగంతో

మాట్లాడేవాడు. పేదప్రజలు గురయ్యే రకరకాల దోపిడీ గురించి, చెడిపోయిన వ్యవస్థ గురించీ

ఆగకుండా చెప్పేవాడు. నా తోటివాడే అయినా సినిమా ఇంట్రస్టులూ, మిగతా పుస్తకాల విషయాలు

ఎప్పుడూ పట్టేవి కాదు అతనికి.

వారానికోసారే కాలేజీ అయ్యాక వస్తాను కనుక (అయినా ఈమధ్య టైపుకొచ్చే వాళ్ళు తగ్గినట్టుంది

కూడా కాబట్టి) వచ్చినప్పుడల్లా శ్రీనుతో కొద్దిసేపు మాట్లాడ్డం కుదిరేది. విద్యార్ధి సంఘంలో

పనిచేస్తూ పోరాటాల్లో పాలు పంచుకో వాలని ఉంది కానీ డాక్టరైతే పేదవాళ్ళకు ఇంకెక్కువగా

వుపయోగపడొచ్చుకదా అని ఇప్పటికి మాత్రం చదువే ముఖ్యం తనకు అనేవాడు. ఎవరైనా ఎండల్లో

నలుగురిని కూర్చోబెట్టుకుని రిక్షాతొక్కుతుంటే చూడలేక మొహం తిప్పుకునేవాడు. ఉన్నట్టుండి

ఒకనాడు కొత్త కుండ తీసుకొచ్చి మామయ్య సెంటర్లోనే నీళ్ళు పోసి చలివేంద్రం పెట్టేసాడుకూడా.

మామయ్యకు వాడంటే కొంత ఇష్టం అందువల్ల కూడా.

ఇంకో ఆర్నెల్లలో ఇంటరు అయిపోతుందనగా, ఒకనాడు కనిపించకుండా పోయాడు. రాడికల్సులో

చేరాడని చెప్పారందరూ. తర్వాత్తర్వాత తెలిసింది, అతను చీకట్లో మావో గురించి రాతలు

రాసేవాళ్ళలో ఒకడని, పోలీసులు ఒక రాత్రి శ్రీనుతోపాటు ఇంకో ఇద్దరిని పట్టుకుంటే వాళ్ళమీద

సానుభూతి వున్న కానిస్తేబులు సహాయంతో బయటపడి అండర్‌ గ్రౌండుకు వెళ్ళాడని. అతని

గురించిన మాటలు అడపా దడపా వినిపిస్తూనే ఉంటయి ఎవరి ద్వారానో అక్కడ టైపు సెంటర్లో.

చాలా బాధేసింది, ఇంకో ఆర్నెల్లాగితే ఆ మెడికల్‌ ఎంట్రెన్సు రాసేవాడుగా అని.

ఎవరెలా వున్నా, మా మావయ్య కథ మాత్రం మారలేదు. ఆయన సెంటరు మళ్ళీ పుంజుకునేలా

కనపడలేదు.

ఇంటరు అయిపోయాక ఇంజనీరింగు సీటు వచ్చిందని తెలిసినప్పుడు మాతో పాటు, మావయ్య కూడా

సంతోషపడ్డాడు, ఆ రోజే చెప్పేడు, ఇక నీకు టైపెందుకు కానీ మంచి ఇంజనీరుగా అవ్వు అని.

కొంత నిరాశ ధ్వనించినట్టుంది ఆయన గొంతులో, ఇహ నేను ఆయన టైపు సెంటరుకు రాననో ,

ఆయన వారసత్వం పుచ్చుకోననో. ఆయనకు కొడుకుల్లేరు, ఉన్నది ఒక్కతే కూతురు, వసంత.

ఇంజనీరింగు రెండు జిల్లాల అవతల, పట్నంలో చదువుతున్నమాటే కానీ వీలుదొరికితే చాలు

ఇంటికెళ్ళడం అలవాటైంది. మొదటి సంవత్సరం మధ్యలో ఊరెళ్ళినప్పుడు మావయ్య సెంటరుకెళితే

తెలిసింది, ఇదివరకన్నా బాగా స్లో అయిందని. నాలుగు గంటలు షార్టు హ్యాండు చెప్పేవాడల్లా

రెండుగంటలే అయింది. ఏమైందని అడిగితే, సినిమా హాలుకు దగ్గర్లో ఏదో కొత్త కంప్యూటరు

సెంటరు పెట్టారట. అదే సెంటర్లో ఇంకో పక్క టైపింగు కూడా నేర్చుకోవచ్చుట. మావయ్యను

అక్కడికే వచ్చి షార్టుహ్యాండు క్లాసులు తీసుకొమ్మన్నారటకూడా, మా ఊళ్ళో అంత

అనుభవమున్నవాళ్ళు దొరకరు . ఈయనేమో నాకోసమే వచ్చే వాళ్ళైతే నా సెంటరుకే వస్తారని

చెప్పి వాళ్ళతో మాట్లాడలేదుట.

మావయ్యా, పరిస్థితులు మారుతున్నయి మనం కూడా మారాలి అన్నాను. ఆయనే ఏం

మాట్లాడలేదు.

ఇంకెంత కాలం, వసంత పెళ్ళి చేసేస్తే మావయ్య బాధ్యత తీరుతుంది అంది అమ్మకూడా. అప్పుడే

తనకు పెళ్ళేంటి అని అడిగితే, అది ఇక ఏం చదువుతుంది ఇంటరు ఫెయిలయాక? ఒకవేళ మళ్ళీ

పాసవుతే డిగ్రీ ఓపెన్‌ ఊనివర్సిటీలో చేస్తుంది. పెళ్ళి పెట్టుకోక ఏం చెయ్యమంటావురా అంది.

రెండో ఏడు పరీక్షలయ్యాక ఎండాకాలంలో వచ్చినప్పుడు తెలిసింది, శ్రీను గాడు ఈ మధ్యే మళ్ళీ

వచ్చి టైపుషాపులో పనిచేస్తున్నాడుట. మావయ్యను పోలీసులొచ్చి సతాయిస్తారని ఎవరు చెప్పినా

వినకుండా వాణ్ణి మళ్ళీ పెట్టుకున్నాడని అమ్మ అంది.

శ్రీను కలిసాడొకనాడు, ఏరా ఎన్నాళ్ళయింది మళ్ళీ షాపులో చేరి, అని మాకంతకు ముందున్న

సాన్నిహిత్యంతో అడిగితే చెప్పేడు, ఆర్నెల్లయిందని. పెద్దగా ఏమీ అడగలేదు ఆరోజు.

ఆ ఏడు ఎండాకాలం మూణ్ణెల్లూ ఆ టైపు సెంటర్లోనే గడిపాను, శ్రీను చెప్పే విషయాలు వినడానికైనా

వెళ్ళేవాడిని. అజ్ఞాతంలో తనకు బాగానే అనిపించేదిట, తెల్లారితే సరైన భోజనం ఉంటుందో లేదో

తెలియకపోయినా. మొదట్లో వాళ్ళతోపాటు తిప్పుకున్నా తర్వాత్తరువాత క్రింది జిల్లాలలో కొరియర్‌

గా ట్రైనింగ్‌ ఇచ్చారట. కొన్నాళ్ళు రాష్ట్ర సరిహద్దులు దాటి ఆదివాసుల గూడేల్లో పనిచేసాడట.

చెట్లకింద బళ్ళు నడిపారట కూడా. పోలీసులు వచ్చేదీ లేనిదీ ముందే తెలిసిపోయేదిట. వాళ్ళలో

ఎవరూ ఏ తప్పూ చెయ్యకపోయినా పోలీసులకు మాత్రం కనిపించేవాళ్ళు కాదు, రాడికల్సు అన్నా

నక్సలైట్లు అన్నా తీసుకెళ్ళి రిజిస్టర్లో రాసేసి వాళ్ళ కోటాలు తీర్చుకుంటారనే అనుమానంతో.

శ్రీనుకు తీవ్రవాద సాహిత్యపు విషయాలు, పెట్టుబడిదార్ల శ్రమదోపిడి గురించి చాలా ఇంటరెస్టు.

నాకర్ధమయ్యేలా చెప్పడానికి, మావయ్య టైపు సెంటరునే ఉదాహరణగా తీసుకుని చెప్పేవాడు.

ఇదిగో ఇప్పుడు కాపిటల్‌ వల్ల కంప్యూటర్లొచ్చి మన టైపు మెషినులకు పనిలేకుండా చెయ్యలేదూ,

అందుకే జనం అంతటికీ చేతినిండా పని ఉంటే కంప్యూటర్లతో పని కానీ దానిమీద పెట్టే పెట్టుబడికి వచ్చే

మిత్తీ కడితే వందమంది దొరుకుతున్నప్పుడు వాటి అవసరమేమిటి. ఇంకా చెప్పాలంటే ఒక్కో

కంప్యూటరు నలుగురు టైపిస్టులను పని లేనివాళ్ళుగా చేస్తుంది. అందుకే ఇక ఎవరూ టైపు

నేర్చుకోవడానికి రాట్లేదు చూశావా, అన్నాడొకనాడు. ఇట్లాంటివన్నీ అతి చిన్నవిషయాలుగా

అనిపించినా ఈ నాడు బహుళ జాతి కంపెనీలు ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లోనించి వచ్చి మన

శ్రమ దోచుకునే ఎత్తులు ఎన్నో వేస్తున్నయి. అట్లా అయితేనే అవి మనగలుగుతయి, ఆయా

కంపెనీలకు “బాటం లైను ” కున్నంత విలువ మనుషులపైన ఉండదు అనేవాడు.

ఆ వడ్డీని తక్కువ చేసే విధంగా మనమే కొత్తవైపు వెళ్ళి ఈ పాతను విసర్జిస్తే మంచిదే కదా అంటే,

పక్కనుంచి మా మావయ్య అందుకునేవాడు, మన దేశంలో పాతవాటికి ఇంకా విలువుంది అని.

అందరూ ఎక్కువ ప్రొడక్టివు అయితే ఈ వడ్డీ సమిష్టిగా అందరికీ తక్కువవుతుందేమో అంటే, అదేం

కాదు, మనకు ఇవ్వాళ తక్కువ వడ్డీకి అప్పులిచ్చి వాళ్ళమీద ఆధారపడ్డం అనేది జరిగాక మనకు ఇక

వేరే గతి ఉండదు అవే అప్పులు తీర్చడం కోసం కొన్ని తీసుకోవడం తప్పదు అనేవాళ్ళిద్దరూ.

ప్రపంచీకరణకు ఈ పెట్టుబడే మూలం, అదే ఈ రోజు జరిగే దోపిడీకి కారణమవుతున్నది.

కొద్దికొద్దిగా అర్ధమయింది, మావయ్య అప్పు తీసుకునైనా ఆ టైపు సెంటరును ఎందుకు పెద్దగా

చెయ్యలేదో. ఆయనకు వేరే వాడి చేతిలో తన జుట్టు పెట్టి, అంటే పరుగెత్తి పాలు తాగేదానికన్నా,

ఉన్నదాంట్లో బతికెయ్యడమే మంచిదనే వాదన నచ్చింది . ఆయన వాదన ఎంత సులభంగా ఈ శ్రీను

గాడి రాడికల్‌ వాదనలో కలిసిపోతుందో ఇంకొంచెం అర్ధమయ్యీ అర్ధం కాకుండా ఉంది ఎందుకంటే,

రెండిటికీ కావలసింది, ఒక్క పెట్టుబడి అనే సామ్రాజ్యవాద మెలికను ఏదో ఒక పేరుతో

వదిలించుకోవడమేనేమో అనిపించింది.

కానీ మార్పునెట్లా ఆపగలం, గుర్రపు బగ్గీలు పోయి రిక్షాలు రాలేదా, అవి పోయి ఆటోలు రావట్లేదా

ఇంకా గుర్రాలకు పని దొరకట్లేదని, సరైన వేతనం అందట్లేదని బాధపడితే ఎవరిది తప్పు. ఖచ్చితంగా

ప్రభుత్వానిదే అనేవాడు శ్రీను ఏమాత్రం తడుముకోకుండా. అట్టడుగు వర్గాలకే అతి ఎక్కువ ప్రొటెక్షను

కావాలని అందరికీ తెలుసు అయినా సరే వాళ్ళకే అతి ఎక్కువ దూరంలో ఉండే ఈ ప్రభుత్వాన్ని

తిరస్కరించాల్సిన అవసరముంది అంటాడు సందేహానికి తావివ్వకుండా.

నా ఇంజనీరింగు తెలివి వీళ్ళకక్కరలేదు కూడా అనిపించి, అదే మాట పైకి అంటే, ఇంజనీరింగు

చదువులు ధనిక దేశాల్లోకెళ్ళడానికే తప్ప మనలాంటి వాళ్ళకు పనికొచ్చేవేం కాదు అనేశాడు శ్రీను.

ఈ పేదరికం పోయి, దేశం బాగుపడేదెట్లా అనడిగితే, వాళ్ళల్లో కలిసి ఒకడిగా బతికి పనిచెయ్యాలని,

పోరాడితే పోయేదేంలేదు, బానిస శృంఖలాలు తప్ప అనేవాడు.

“శ్రీనూ నువ్వు కష్టపడి చదువుకున్నావు, పైకెళ్ళాలని అందరిలా కాకుండా, మళ్ళీ కష్టాలవైపే

ఎందుకు వెళదామనుకుంటున్నావు ” అడుగుదామని చాలా సార్లు నోటిదాకా వచ్చింది కానీ తను

వెళ్ళేది ఖచ్చితంగా మంచి మార్గమే అని నమ్ముతున్న అతని సంకల్పాన్ని చూస్తూ అడగబుద్ధి

కాలేదు.

ఇంట్లో అమ్మ వండిపెట్టిన భోజనం చేస్తూ, శ్రీను గురించి చెప్తే తిట్లు కూడా పడ్డాయి, మామయ్యకంటే

ఇంక కూతురి పెళ్ళి చేసేస్తే పనైపోతుంది, కానీ నువ్వు ఈ తీవ్రవాదపు ఆలోచనలు ఎక్కువగా

పట్టించుకోకు అంటూ బుద్ధిగా చదువు కంప్లీటు చెయ్యమని చెప్పింది.

మూడో ఏట పరీక్షలు రాస్తుంటే అమ్మ లెటరు వచ్చింది, వసంత పెళ్ళి పెట్టుకున్నారట. తను ఇప్పుడే

డిగ్రీ ఓపెన్‌ యూనివర్సిటీలో చేరింది. ఊళ్ళో వాళ్ళే, డిగ్రీ కంప్లీటు చేసిన అబ్బాయికి

ఇస్తున్నారట, వీలయితే పెళ్ళికి రమ్మంది.

ఎందుకనో ఇక ఇంటికి వెళ్ళాలంటే ముందున్న వుత్సాహం లేకుండాపోతున్నది. వసంతకిప్పుడు

పెళ్ళి చెయ్యకుంటే ఏం. ఇంకో నాలుగేళ్ళు ఆగలేరా అనిపించింది.

వసంతకు కూడా నేనంటే ఇష్టమే ఉండేది పాపం ఎవరికీ ఎదురు చెప్పలేకపోయుంటుంది నాలాగే.

అయినా తప్పదు, ఇప్పుడు మనకే ఠికానా లేదంటే అందులో ఇలాంటివి పట్టించుకునే ధైర్యం లేదు

మనకు అని పుస్తకాల మీద పడ్డానిక.

నాలుగో సంవత్సరమొస్తూనే జీ ఆర్‌ ఈ అని, టోఫెల్‌ అని మిగతా ఫ్రెండ్స్‌ అందరితోపాటుగా

అమెరికా వెళ్ళడమే మనకున్న జీవిత ధ్యేయమని ఇహ తయారయ్యేను, ఆ సందట్లో ఇంటి వైపు

ఆలోచించడమే కుదర్లేదు.

పరీక్షలయ్యాక ఇంటికెళ్ళినప్పుడు మళ్ళీ టైపు సెంటరుకెళ్ళాను. మావయ్య ఒక్కడే వున్నాడు.

సాయంకాలం కూడా. ఈ మధ్య ఎవరూ షార్టుహ్యాండు నేర్చుకోవట్లేదు లాగుంది. టైపుమెషినులు

కూడా ఖాళీగానే పడున్నయి.

“నువ్వు మంచి పని చేస్తున్నావురా ఈ ఇండియా వదిలిపెట్టి “, అన్నాడాయన.

ఏం మావయ్యా ఇక్కడ మీకేమైంది, హాయిగా వున్న ఊళ్ళో అందరి మధ్యా బతికెయ్యవచ్చు

ఇట్లాంటిదే ఒక షాపు పెట్టుకుంటే అన్నాను.

నా ప్రశ్నకు జవాబు చెప్పకుండా దాటేస్తూ, శ్రీను తెలుసు కదా, వాడు ఇక్కడ సగం చస్తూ

బతుకుతున్న జనం కోసం మన సమాజంలో ఇమడలేక మళ్ళీ వెళ్ళిపోయాడు, చెప్పాడాయన. నాకు

తెలుసు మావయ్యకు వాడంటే అభిమానమెక్కువని.

మళ్ళీ ఎందుకెళ్ళాడు అడిగాను.

వాడు ఇక్కడ ఏ గొడవా పెట్టుకోకుండా ఉండలేడు, ప్రతిదానికీ మంచిదేదో చెడ్డదేదో అని అడుగుతూ

గొడవ పడేవాడు. ఏం చెయ్యమన్నావు, ఇక్కడ నేనిచ్చే అయిదొందలు వాడికెలాగూ సరిపోవు, నా

దగ్గర అంత పనికూడాలేదు , అన్నాడు.

ఆతర్వాత మూణ్ణెల్లలో వీసా రావడం, అందరు క్లాసుమేట్లతో పాటుగా ప్లేనెక్కెయ్యడం

జరిగిపోయింది. అమెరికా వచ్చేసాక మొదటిసంవత్సరం ఇంటినించి వచ్చే వార్తలు తక్కువే.

ఆర్నెల్లకు తెలిసింది, వసంతకు కొడుకు పుట్టాడని. మావయ్య పని మామూలేనట. ఒక ఉత్తరం

మాత్రం మావయ్య దగ్గరినించి వచ్చింది. అందులో మావయ్య రాసింది తక్కువే కానీ శ్రీను రాసిన

ఒకరెండు పేజీలు ఉన్నయి అందులో.

రాడికల్సులో ఉండేవాడల్లా ఏదో దళంలోకెళ్ళాడట కొద్దిరోజులు.

ఇండియా నుంచొచ్చేసిన అందరిలాగే ఆ దేశమ్మీద మమకారం పెరిగుంటుంది నాలో కూడా.

చదువు ఒక కొలిక్కి వస్తుందని అనుకోగానే ఫ్రెండ్స్‌ అంతా ఎక్కడోచోట వుద్యోగం వెతుక్కుంటూ

గ్రీన్‌ కార్డులని, ఎక్కువ జీతాలని పడే అవస్థలు, ఆరాటాలు చూసి నేను మాత్రం ఇండియా వెళ్ళి

వాళ్ళంతా ఎక్కడైతే తప్పు చేస్తున్నారో ఎత్తిచూపేలా, ప్రతి జిల్లాకొక ఇన్ఫర్మేషన్‌ సెంటరు తెరిచి

అభివృద్ధికి తోడ్పడదామని అనుకుంటున్నానని అమ్మతో చెప్పాను ఒకసారి ఫోనులో. అవన్నీ

పెళ్ళయ్యాక, నీ వరకు కొంతయినా సంపాదన లేకుండా ఉంటే ఇక్కడెవరూ నిన్ను కానరు అంది

తను. మావయ్యను లెటరు రాయమను అని చెప్పాను.

ఆయన దగ్గరనుండి ఏదీ సూటి సమాధానం రాదని తెలిసీ, ఒక ఉత్తరమైతే రాసాను, తోచిన

ఆలోచనలన్నీ పేపరు మీద పెడుతూ. అమెరికా క్యాపిటలిజపు వ్యవస్థలోలాగే ఇవన్నీ ఇండియాలో

మనుషులుకూడా పాటించొచ్చేమో అనిపిస్తుంది. ఇవే పద్ధతులను అక్కడికి ఎగుమతి చేద్దామా

అనిపించని రోజుండేది కాదు. అప్పు అనేది ఒక జీవన విధానమైనప్పుడు, రిస్కు అనేది ఒక బ్రతుకు

అవసరమైనప్పుడు, అన్నీ కుదురుతయి అనిపిస్తుంది. రేపు రేపు పిల్లలకు తిండి ఉండదేమో అనిపిస్తే,

టైపు సెంటరును కంప్యూటరు సెంటరు ఎట్లా చేయాలా అనే ఆలోచనే తప్ప, పాత తుక్కును పట్టుకుని

వేలాడే నిస్సత్తువ, నిస్తేజం ఉండకపోవచ్చేమో అనిపించేది. లేకపోతే ప్రతి మనిషీ వాళ్ళెదగగలిగిన

ఎత్తుకు వెళ్ళగలిగితే అన్ని రంగాల్లో అట్లాంటి అవకాశాలు కల్పించగలిగితే అక్కడ కూడా జనమంతా

పని దొరకుతుందేమో అని ఎదురుచూసే నిస్సత్తువ వదిలిపెట్టి తమకు తమే పనికల్పించుకుని,

కొందరికి ఆసరా ఇవ్వగలరు కదా అని ఒక ఆలోచన.

రూపాయికి కిలో టమాటలు, పది రూపాయలైతే, వచ్చే సంవత్సరం తగ్గుతుందిలే ధర అని ఇప్పటి

మటుకు దోసకాయలు కొనుక్కుని వెళ్ళే వాళ్ళు, మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా టమాటలు తక్కువ

పండించి, దోసకాయలు ఎక్కువగా కాయించే రైతులకు క్యాపిటలిజపు వాసన దానితో వచ్చే

ఆలోచనా విధానం చూపిస్తే బాగుంటుందేమో. ఇవే విషయాలు మామయ్యకు రాసాను కూడా.

అసలు పోయినేడు టమాటల ధర ఎంతో పెరిగిందని చేసిన గొడవలు, లేక ఎండలు ఎక్కువై చచ్చిన

మనుషులు మీకు గుర్తున్నాయా మావయ్యా అని రాసాను, అడిగిన దానికి సమాధానం ఇంకేదో

రూపంలోనో ఉంటుందని తెలిసీ.

ఎప్పటిలాగే ఆయన దగ్గరినుండి సమాధానం ఇంకోరకంగా శ్రీను వద్దనించి వచ్చిన ఉత్తరం రూపంలో

వచ్చింది. మామయ్యే ఇచ్చి ఉండాలి నా అడ్రసు.

శ్రీను తను చేస్తున్న పనులను విశదీకరిస్తూ రాసాడు. తన తోటివాళ్ళంతా అట్టడుగున నలుగుతున్న

జనం కోసమే ఇల్లు, పిల్లలు లాంటివి వదిలిపెట్టి వుద్యమంలో చేరి పని చేస్తున్నారట. అన్నీబాగానే

వున్నాయి కానీ తము పనిచేస్తున్న గిరిజనుల పరిస్థితి రోజు రోజుకూ దిగజారి పోతున్నది. ఒక వైపు

పెద్దవాడు పెరిగిపోతూ ఉంటే, పేదవాడు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి లాగే ఉంటున్నాడు.

గిరిజనుల బ్రతుకుల్లో మార్పులు రాకపోతే, వాళ్ళ శ్రమకు సరైన విలువ కట్టకపోతే వాళ్ళంతా

ఆయుధాలు పట్టి పోరాడాల్సిందే. అంతవరకూ వస్తే చాలు ఇక తమ వుద్యమం నెరవేరిందని

అనుకోవచ్చు. తము నేర్పుతున్న పెట్టుబడిదారి దోపిడీ గురించి, పోరాట పధాల గురించి, వివిధ

సాహిత్య మార్గాల గురించి గిరిజనులకి అర్ధమయ్యేట్లుగా చెప్పడం ఒక చాలెంజీ అని, అవన్నీ అర్ధమై

వాళ్ళ బతుకుల్లో వెలుగు వస్తే చాలు అనీ రాసాడు.

శ్రీను ఇంకా చాలా రాసాడు.

ఇట్లాంటి చిన్న విషయాలను అధిగమించి ఇంకొంతకాలం ఇక్కడే గడిపితే గిరిజనులకు సిద్ధాంతాలమీద

నమ్మకం కుదిరాక, పోరాటాన్ని మరింత ఉధృతం చెయ్యొచ్చు. మా సిద్ధాంతాలు అన్నీ ఒకే

మూసలో పోసి తీసినట్టు రష్యాలోలా చైనాలోలా వందేళ్ళక్రితపు వర్గశత్రువుల గురించిన పాఠాలు

ఇక్కడ గిరిజనుల తండాల్లో వినిపిస్తే ఎంతవరకూ పనికొస్తాయో తెలియదు. కానీ ఈమధ్యే కొంతైనా

అవగాహన పెరిగి పెట్టుబడిదారీ దోపిడీ విధానాలను అర్ధం చేసుకుంటున్నారు. మా

పోకడలనుకూడా కొంతవరకూ మార్చుకున్నాం, ఈ మధ్య వాళ్ళ జాతరలలో

పాలుపంచుకుంటున్నాం. గూడెపు పెద్ద లు చెప్పిన తీర్పులకు మేం అడ్డు చెప్పడం లేదు, ఒకరకంగా

వాళ్ళ బతుకులు వాళ్ళకు తోచిన రీతిలో బతకనిస్తూనే బయటివాళ్ళ దోపిడీకి గురికాకుండా వాళ్ళ

సంస్కృతిని కూడా కాపాడుతున్నాం.

ఇప్పటిమటుకు మా వాళ్ళు ఆ గిరిజనుల విధానాలను బట్టి అవసరమైన విధంగా వెంట ఉండి, ఎక్స్‌

ప్లాయిట్‌ కాకుండా చూస్తే చాలు కదా. అయినా ముందు అనుకున్నట్టు గిరిజనులను సాంఘిక ంగా

అభివృద్ధి చేసి, ఎటువైపు నడపాలో తెలుసుకుని ఉద్యమ స్ఫూర్తితో మెలుగుతే చాలు. వీళ్ళెంతకాలం

పెట్టుబడిదారీ విధానాలకు దూరంగా ఉంటే అంతమంది బాగుపడే అవకాశం ఉంది. ముందు ముందు

మేం పనిచేస్తున్న ఈ కొన్నితండాలే అతిపెద్ద విప్లవానికి మూలమయ్యే అవకాశమున్నది. ఆ ఆశతోటే

ఇప్పుడు మా జీవితాలను పణంగా పెడుతున్నాం. అందుకే మా సిద్ధాంతాలు మాకెంత ముఖ్యమో

గిరిజనుల నమ్మకాలు, జీవన విధానం వాళ్ళకంత ముఖ్యమని తెలుసుకుని మసులుకుంటున్నాం.

అందుకే ఇక్కడే ఉండి సాయుధ పోరాటాలనధ్యయనం చెయ్యమని వాళ్ళకు కావలసిన వనరులను

కలిపిస్తున్నాం. అందరినీ సమీకరించి సంఘటితపరిచి అక్కరకొచ్చే విద్యలను నేర్పుతున్నాం.

ఇక్కడికొచ్చి చూస్తే మీలా చదువుకున్నవాళ్ళు ఆశ్చర్యపోతారు కూడా. ఇప్పుడిక్కడ పదిహేను

ఏండ్ల పిల్లలు మాతో పాటుగా పనిచేస్తూ నిన్నటిదాకా రాయడం చదవడం రానివాళ్ళు కూడా అవి

నేర్చుకున్నారు. దానితో పాటు అవసరమైతే తుపాకీ పట్టడం తెలుసు, వాళ్ళ జీవన గతిని

కాపాడుకోవడం తెలుసు. ఈ ఊరు, ఈ తండా ఇప్పట్లో నాగరికమని చెప్పుకునే ఫ్రిజ్జులు కార్లకు

వెంపర్లాడరు. వాళ్ళకు సమసమాజమే ధ్యేయమవుతుంది, ఇక ముందు. ముందు చెప్పినట్టు వాళ్ళ

కులాచారాలు, వద్దన్నా అప్పుడప్పుడూ తప్పని పట్నపు వాసనలు కొన్ని మాకడ్డుగా నిలబడకపోతే

ఇప్పటికే ఎంతో మార్పు వచ్చి ఉండేది.

ఎట్లాంటి రిస్కులూ పెద్దగా అక్కరలేని హిందూ ధర్మాల నీడలో మగ్గిపోతూ నలుగుతున్న

వీళ్ళిప్పుడు మా సిద్ధాంతాల నీడన సేదతీర ు్చకుందామని ఎదురుచూస్తున్నారు కూడా.

చివరగా అతని అలవాటేమో లాల్‌ సలాం అని రాసి సంతకం పెట్టాడు.

ఆ వుత్తరం ఏదో డిగ్రీ చేస్తూ మధ్యలో వదిలిపెట్టిన వాడు రాసిందిలా లేదు. బాగానే చదువుకుని,

అన్నీ అధ్యయనం చేసిన వాడు రాసిందిలాగా ఉంది. ఇంత అర్ధం చేసుకోగలిగిన మనుషులు

గిరిజనుల జీవన విధానానికి వీళ్ళ పోరాటం పనికొస్తుందో రాదో, వాళ్ళ ప్రవృత్తికి మంచి చేస్తుందో

లేదో ఎందుకు తెలుసుకోలేరో అర్ధం కాలేదు.

కొద్దిగా ఆశ్చర్యమేసింది, ఎక్కడా ఒక్క చోట కూడా నేనున్న ఈ మరో ప్రపంచం గురించి అడగక

పోవటం, అదీ కాక తము చేస్తున్నదాన్ని పూర్తిగా నమ్మెయ్యడం అందులో ఎక్కడా పొరపాట్లే

లేనట్లుగా చెప్పడం చూస్తే, శ్రీను నిబద్ధతకు నిదర్శనమనుకోవాలో ఒక రకమైన వెర్రికి లోనయాడని

అనుకోవాలో అర్ధం కాలేదు. ఒక వేళ వీళ్ళు లాంగ్‌ మార్చ్‌ అని చెప్పి ఏదో కల్చరల్‌ రివల్యూషన్‌

కోసమైతే ఎదురు చూడ్డం లేదుకదా అనిపించింది. అది సాధ్యమయ్యేది కాదు అని చెప్తే వినే

స్థాయినుంచి దాటిపొయ్యినట్టున్నాడు శ్రీను.

శ్రీను అడ్రసెలాగూ తెలియదు, అందుకే మామయ్యకు అంతకు మునుపు రాసిన మాటలనే అమ్మకు

రాసాను. చదువు కాగానే ఇండియాకు వచ్చి నాకు తోచిన రీతిలో అక్కడి పరిస్థితులు మారుస్తానని,

ఇక్కడే సెటిల్‌ అయ్యే ఉద్దేశ్యం లేదనీ.

పదిహేను రోజుల్లో వచ్చింది వుత్తరం అమ్మదగ్గరినించి. నేను మామయ్యకు మొదట రాసిన దానికి

సమాధానంలాగా తోచింది, అమ్మ రాసిన జవాబు. తను రాసింది పూర్తిగా నాగురించే.

వచ్చేస్తాను వచ్చేస్తాను అంటున్నావు, ఇక్కడికొచ్చి ఏం చేస్తావు. అక్కడే నీ తోటి వాళ్ళంతా ఏదో

ఒక మంచి ఉద్యోగంలో పనిచేస్తుంటే, నువ్వు ఇక్కడికొచ్చి ఏదో బాగు చేస్తానని ఆరాటపడకు.

ఇక్కడ మాకందరికీ ఎట్లా జరగాలనుంటే అట్లాగే జరుగుతుంది. నువ్వొక్కడివి ఇక్కడికొచ్చి ఏదో

బాగు చేస్తానని అనుకోవడం ఇక్కడి పరిస్థితులర్ధం చేసుకోవడం అనుకున్నంత సులభం కాదు.

ఇక్కడ ఒక్కసారి బ్యాంకుకెళ్ళి వచ్చేసరికి, నీ రోజైపోతుంది, ఆ బ్యాంకుల్లో ఎన్ని కంప్యూటర్లున్నా

సరే. అవి మాకే నడుస్తయి. నువ్విక్కడున్నప్పుడు నీకు కాలేజీతోటే ఎక్కువ గడిచిపోయింది,

నువ్వనుకున్నంత సులభం కాదు ఒక్కసారే సమాజాన్ని మార్చేయడం. మావయ్యను అనేవాడివి

పాత మెషినులను పట్టుకుని వేలాడకు అని, కానీ ఆయనకప్పుడున్న మొదటి బాధ్యత వసంతకు పెళ్ళి

చెయ్యడం, ఒక రకంగా నీకు ఇష్టమని తెలిసినా అది చదివిన ఇంటరు చదువుకు వాళ్ళ స్థోమతకు తగ్గ

వాళ్ళను తెచ్చుకోవాలని ఆరాటపడ్డాడే తప్ప అందుతుందో లేదో తెలియని వాడి సంబంధంకోసమో

లేక కంప్యూటరు సెంటర్లలాగా తన టైపు సెంటరును చెయ్యాలనో, మరేదో చెయ్యాలనో ఆయనకు

లేదు, ఉండదు. అట్లా ఎక్కువ తక్కువ రిస్కులు తీసుకుంటే అమెరికా లాంటి ధనిక దేశాల్లో వున్నట్టు

మనకుటుంబాలకు సెక్యూరిటీ ఉండదు. ఒక సేఫ్టీ నెట్‌ అనేది లేకుండా కింద పడితే మళ్ళీ లేవాలంటే

అంత తొందరగా సాధ్యపడదు. పైగా కుటుంబమంతా అడుక్కుతినాల్సొస్తుంది. ఒక్క మనం

పడిటే, కుటుమ్బమంతా రెండు తరాల వెనక్కు వెళుతుంది. మామయ్య ఎక్కువగా చదువుకోక

వున్నంతలో బతికాడు కాబట్టే నేను చదువుకోగలిగాను, ఒక మంచి కుటుంబంలో చేరగలిగాను.

ఇవ్వాళ వసంతకూడా అంతే, శుభ్రంగా సంసారం చేసుకుంటోంది.

నీకిక్కడి పరిస్థితులర్ధం కావు. ఇక్కడున్నవాళ్ళకే సరిగ్గా అర్ధమవక, ఏదో చేద్దామని బయల్దేరిన

వాళ్ళు, ఆ శ్రీను లాగా ఎన్‌కౌంటరు అయిపోవలసిందే. వాళ్ళు పోలీసులు చుట్టుముట్టి

కాల్చకమునుపే తమ అభిప్రాయాలు మార్చుకోలేక, ఒక ప్రక్క వాళ్ళు నమ్మిన సిద్ధాంతాలను

ప్రశ్నించలేక ఎప్పుడో సైద్ధాంతికంగా ఎన్‌ కౌంటరు అయిపోయిన వాళ్ళే. నీకంతగా అక్కడ

నచ్చకపోతే ఇంకో పదేళ్ళ తర్వాత ఆలోచించు అంతేకాని ఇక్కడ నువ్వేదో ప్రజాసేవ చేస్తా అని

బయల్దేరకు.

అంతగా కావాలంటే, ఒక సారి వచ్చి పెళ్ళి చేసుకుని వెళ్ళు అని ముగించింది.

మొత్తానికి నేను ఇంటరులో ఉన్నప్పుడు మొదటి సారిగా అమ్మకు శ్రీను గురించి చెప్తే అన్న

మాటలన్నీ తూ చ తప్పకుండా మళ్ళీ రాసింది అనుకుంటూ ఉంటే, ఒక ప్రక్క శ్రీను గురించిన

ఆలోచనలు చుట్టుముట్టినయి. అతని లాంటి వారికి వేరే ముగింపు ఉంటుందా అనిపించింది.

తప్పకుండా వేరే ముగింపు ఉండి తీరాలి, నాకు ఇప్పుడు వెంటనే తోచట్లేదంతే.

కథకు పేరు ఉదయ భాస్కర్‌ దగ్గర కాపీ కొట్టాను.