కొందరు స్నేహితులు… నాన్న… వొక అర్ధరాత్రి

దిగులు లేదు
ఎంత చీకటి పడనీ
ఈ అడివి దారి
ఈ చీకటి వంతెన
అలవాటు కాకపోతేనేం?
దీన్ని దాటడానికే
ఈ శరీరాన్ని కూడదీసుకున్నా.

గుర్తేనా నీకు?
ఏ మునిమాపు పొలం లోనో
చెట్ల గుబురు లొ చిక్కడిపోయి
వొక వెర్రి పాట పాడుకుంటూ
చీకటిని దాటేయ్యడం?

వొక్కో సారి
దిక్కులు మారిన ప్రయాణంలో
వెనక్కి తిరగాల్సిన ముఖంమీద
అనేక భయాల ముడతలు
సంశయాల నీడలు
మరణమే
ఈ క్షణానికి నయమనిపించే దిగాలుతనం
గుర్తేనా నీకు?

మధ్యలోనే బతుక్కి
ఎర్ర జండా వూపి
వొక మిత్రుడు
మరీ భయానకమయిన ఆ పొద్దుట
రైలు పట్టాల మీద ముక్కలయి
కనిపించినప్పుడు
ఏ పదాలు రాసుకున్నానని?
వొక్క మాటా పెగల్లేదు కట్టెదుట.

మధ్యలోనే ప్రయాణాలు
ఆగిపోవడం
ఈ బతుక్కి కొత్త కాదు కదా?!

మరీ బలహీనమయిన రాత్రి
అతను – ఎవరైతేనేం ?
నిశ్సబ్దంగా పై దూలానికి
నిండయిన తన శరీరాన్ని
వేలాడ దీసి వొక చివరి నవ్వు
మా మొహాల మీద రువ్వి వెళ్ళిపోయినప్పుడు
అప్పుడయినా ఏం చేశామనీ?
వాక్యాలన్నీ చేతలుడిగిపోవడం తప్ప.

చిరునవ్వు
సగంలో తెగిపోవడం
అప్పటికింకా కొత్తే !
అయినా సరే..
చెయ్యడానికేమీ లేదుగా!

చిన్న చీకట్లు
పెద్ద మరణాలు ఎలా అవుతాయో
ఎప్పటికీ అర్ధం కాదు
కొన్ని మరణాలు
పెద్ద చీకటిలా ముసురుకోవడం
రోజూ తెలుస్తూనే వుంది.

నాన్నా,
చివరి సారిగా నీళ్ళతో కడగమని
అందరూ నన్ను నీ నిర్జీవ శరీరం ముందుకి
నెట్టిన ఆ మరణ క్షణం నిన్న రాత్రి కలలో.
నిద్రలోంచి తెగిపడ్డాను
గాఢమయిన చీకట్లోకి.

ఏడుస్తూ వుండిపోయాను
తెల్లారే దాకా.
చీకటీ వంతెనా
దిగులు పొలాలూ
ఖాళీ ఆకాశాలూ
అన్నీ నువ్వే.

అనగలనా..దిగులు లేదు…అని
అలవాటు కాని చీకటిలో
నిలబడి.