1. వానకు తడిసిన పువ్వొకటి
వానకు తడిసిన పువ్వొకటి
రాలిపడుతుంది బావిలో
సుళ్ళుసుళ్ళుగా తిరుగుతూనూ
సున్నాలు చుడుతూనూ…
నవ్వుతూనే వుందది
తుళ్ళుతూనే వుందది
నీళ్ళమీద తేలుతూ వుంది..
పాతకొమ్మని
కొత్తనీళ్ళని
చూస్తూవుందది
మార్చి మార్చి
2. ఓ సాయంకాలం
ఒక్కో పువ్వు నీళ్ళల్లో రాలుతూ
ఒక్కో వలయాన్ని సృష్టిష్టోంది
జారిపడుతున్న పూలని
జరిగిపోతున్న వలయాలని
చూస్తూ చూస్తూ చూస్తూ
కాళ్ళు ఊపడం మర్చిపోయి కూర్చుండిపోతాను
టీ చల్లారి తరక కట్టిన సంగతే గమనించను