సీ.
తలచె నిమ్మెయి రమాతరుణి కిచట
నలక దీరిచి వక్షమం దుంచుకొనియుండ
కాకాశ రాజేంద్రు నాత్మసుతను
దా బెండ్లియాడుట దలచె గదా హరి
దయలేని వాడయ్యె ధాత గూడ
నిపుడైన నురమునం దిందిర నిడుకొని
యేలంగ మేలు మరేల పెండ్లి
తే.
కాని వీరికి వనముల బూని పోవు
నపుడు చీకటి చేయింతు ననగ బశ్చి
మాబ్ధి కేగుదు నని చంద్రు డరుగుచుండె
ప్రకృతి వర్ణనలు కథతో అనుసంధానం చేసి చెప్పడం ఆ వర్ణనలకు ఒక ఔచిత్యాన్ని సార్థకతని అందిస్తుంది. ప్రాచీన ప్రబంధాలలో విస్తారంగా సాగే వర్ణనల్లో అలాంటి సార్థకమైన పద్యాలు అతి కొద్దిగా ఉంటాయి. చేసిన వర్ణనలు కొద్దిగానే అయినా వాటిని కథతో సమన్వయించి చేయడం శ్రీవేంకటాచల మాహాత్మ్యం అనే ప్రబంధంలో కనిపించే ఒక విశేషం. 18వ శతాబ్దానికి చెందిన భక్తురాలు, యోగిని, కవయిత్రి అయిన తరిగొండ వెంగమాంబ రచించిన పద్యకావ్యం శ్రీవేంకటాచల మాహాత్మ్యం. అందులో చంద్రుని వర్ణించే పద్యమిది. అతడు శుక్లపక్షము నాటి చంద్రుడు. శుక్లపక్షంలో చంద్రుడు తొందరగా ఉదయించి తొందరగా అస్తమిస్తాడు. అలా తొందరగా అస్తమించడానికి గల కారణాన్ని కవయిత్రి ఉత్ప్రేక్షించి, అనగా ఊహించి చెప్పిన పద్యం యిది. ఈ పద్యం వెనుకనున్న కథ తెలిస్తేనే యిందులోని సారస్యం అర్థమవుతుంది!
శ్రీవేంకటాచల మాహాత్మ్యంలో అసలు కథ తెలుగువాళ్ళకు బాగా పరిచితమే. అది వేంకటేశ్వరుని అవతార, కళ్యాణ గాథ. కథ తెలుసున్నదే అయినా, కథనంలో, పాత్ర చిత్రణలో, సంభాషణల్లో ప్రత్యేకత తొణికిసలాడే విశిష్ట ప్రబంధం యిది. పరమ భక్తురాలైన వెంగమాంబ తన పాండిత్యం గురించీ, కవిత్వ పటిమ గురించీ చాలా తక్కువ చేసుకొని యిలా చెప్పుకుంది.
నంజుకొనిన విధంబున నా ప్రబంధ
మాలకింతు రటంచు బేరాస చేత
నేను రచియింతు దీని మన్నించి గనుడు
అలాంటి పోలిక చెప్పడంలోనే నిజానికి ఆవిడ కవిత్వ శక్తి వెల్లడవుతోంది! మొదటి మూడు ఆశ్వాసాలూ ప్రధానంగా వెంగమాంబ యోగ విద్యాజ్ఞానాన్ని ప్రకటిస్తే, తర్వాతి మూడు ఆశ్వాసాలూ ఆవిడకున్న ప్రబంధ రచనాచాతుర్యాన్ని ప్రదర్శిస్తాయి. ముఖ్యంగా, శ్రీదేవి-శ్రీహరుల మధ్య సాగే సున్నిత కలహాన్ని అంతే నాజూకుగా నిర్వహించిన తీరు ఈ ప్రబంధంలో నన్ను బాగా ఆకట్టుకొన్న అంశం. వేంకటేశ్వర కల్యాణం మాట అటుంచి, లక్ష్మీ నారాయణుల మధ్యనున్న అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ కథని తరచి చూస్తే, అది చాలా చిత్రంగా తోస్తుంది. శ్రీ నివాసస్థానమైన హృదయాన్ని భృగు మహర్షి కాలితో తంతే ఆయన పాదాలు పట్టుకొంటాడు శ్రీహరి. దానితో లక్ష్మీదేవి మనసు కష్టపడి అతన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చేస్తుంది. అయ్యవారు కూడా ఆమెను వెతుక్కొంటూ భూలోకానికి దిగి వస్తాడు. ఆ వచ్చినాయన తన పేరు శ్రీనివాసుడు అని చెప్పుకొంటాడు. కనీసం పేరులోనైనా సిరిని తనలో నిలుపుకోవాలని కాబోలు! దిక్కు తోచక తిరుగుతున్న అతనికి వకుళమాత ఆశ్రయం ఇస్తుంది.
ఇంతవరకూ బాగానే సాగిన కథ, ఆ తర్వాత ఒక కీలకమైన మలుపు తిరుగుతుంది. వచ్చినవాడు వచ్చినట్టు ఉండకుండా ఆ దేశపు రాజైన ఆకాశరాజు కూతురు పద్మావతిని చూస్తాడు శ్రీనివాసుడు. చూసి ప్రేమిస్తాడు. ఆమె కూడా ఇతనిపై మరులుగొంటుంది. ఇక ఆ తర్వాత సోదెమ్మ వేషం వేసుకొని అతడు అంతఃపురానికి వెళ్ళి రాణిగారితో ప్రేమ విషయం ప్రస్తావించడం, వకుళను పంపించి పెళ్ళి కుదుర్చుకొని రప్పించడం, పెళ్ళికి దేవపరివారమంతా తరలి రావడం చకచకా జరిగిపోతాయి. లక్ష్మీదేవి ఊసు పూర్తిగా మరుగున పడిపోతుంది. స్వామివారు మంగళస్నానానికి కూర్చున్నప్పుడు, అప్పుడు గుర్తొస్తుంది అమ్మవారు! ‘ఇదేమిటి, లక్ష్మి లేకుండా నేను పెళ్ళి చేసుకోవడమేమిటి, నేను పరాకుపడితే పడ్డాను, మీలో ఏవొక్కరూ ఇది సమంజసం కాదని చెప్పలేదేమిటి?’ అంటూ దేవతలపై కోపం ప్రదర్శిస్తాడా జగన్నాథుడు. బ్రహ్మ కంగారుపడి నీళ్ళు నములుతూ, ‘మేము చెపుదామనే అనుకున్నాం కానీ… మీరు ఏమనుకుంటారో అని తటపటాయించాం. హమ్మయ్య, మీరే అన్నారు కాబట్టి వెంటనే అమ్మని పిలవాలి,’ అంటాడు. అప్పుడు శ్రీదేవిని పిలుచుకు రమ్మని సూర్యుడికి ఆనతిస్తాడు శ్రీహరి. ఏమని చెప్పమంటారంటే, అయ్యవారు నీకు దూరమై చాలా నీరసించి నిన్ను కనులారా జూడాలని వేంకటాచలంపై తపించిపోతున్నాడని చెప్పమంటాడు! సూర్యుడు వెళ్ళి అలాగే చెపితే లక్ష్మి పాపం కంగారుగా హుటాహుటిని వస్తుంది. వచ్చిన ఆ దేవదేవికి దేవతలందరూ మంగళతూర్యాలతో స్వాగతం పలుకుతారు. లక్ష్మీదేవికి పరిస్థితి అంతా అర్థమవుతుంది. అప్పుడామెను పక్కకు తీసుకువెళ్ళి విషయం విన్నవిస్తాడు శ్రీహరి. అతనెంతటి కపట నటకుడో లోకానికి స్పష్టంగా తెలిసేట్టు ఉంటాయా మాటలు! అలా అతన్ని లోకానికి బట్టబయలు చేయడమే కవయిత్రి ఉద్దేశమేమో!
విష్ణువు అంటాడు కదా, ‘నువ్వు నన్ను వదిలిపోయినప్పటి నుంచి, ఇదిగో ఈ పుట్టలో నిన్నే తలుచుకుంటూ కూర్చున్నాను. పశులకాపరి నా తల పగలగొట్టినప్పుడు ఆ బాధకు ఓర్చి నేనిలా ఉన్నానంటే అది నీ మహిమే. నీ పాతివ్రత్య నిష్ఠ చేతనే నేనింకా బతికున్నాను. అదలా ఉంటే, ఈ ఆకాశరాజ కన్య నన్ను మోహించి నా వెంటపడింది. అందుకామెను పెళ్ళిచేసుకోవలసి వచ్చింది. అది కూడా నువ్వు ఒప్పుకొంటేనే సుమా! నువ్వు కాదంటే నాకీ పెళ్ళి వద్దు.’ ఇవీ ఆయనగారి మాటలు! అయినా అమ్మవారి దగ్గరా ఆయన మాయలు? ‘ఆమె నీ మోహంలో పడిందో, నువ్వే ఆమెని వరించి ఈ ప్రయత్నమంతా చేస్తున్నావో నాకు తెలుసు. మంగళకరంగా శుభలేఖ పంపించి నన్ను పిలిచి ఉంటే బాగుండేది. మాయమాటలతో రప్పించావు. నేను ముందే వస్తే పెళ్ళికి ఒప్పుకోనని భయపడి, ఇంతా అయ్యాక ఇప్పుడు పిలిపించావు. సరే మంచిది. నీ వివాహం కారణంగానైనా నేనిక్కడికి వచ్చి నీ ముఖాన్ని చూసే అదృష్టం దక్కింది. అంతే చాలు. నేను ఉండి కూడా నీకు లేని దాన్నయిపోయాను. అందుకే నీ బుద్ధి మరో పెళ్ళి మీదకి మళ్ళింది. సరే, అలాగే కానీ. నువ్వు పెళ్ళిచేసుకొని సుఖంగా ఉండు,’ అని సూటిగా ఘాటుగా జవాబిస్తుంది లక్ష్మీదేవి. దానితో శ్రీహరి కళ్ళల్లో నీళ్ళు నింపుకొని నీకన్నా నాకు ఆప్తులెవరూ లేరని వేడుకొంటాడు. ఇక అక్కడినుండీ అయ్యవారు అమ్మవారిని ప్రసన్నం చేసుకోడానికి చేసే ప్రయత్నాలు కావ్యం చివరకూ సాగుతాయి. అదంతా స్వయంగా చదివి ఆస్వాదించ వలసిందే!
ఇదీ ఈ పద్యానికి ఉన్న నేపథ్యం. తెల్లవారితే శ్రీనివాస కల్యాణం. పెళ్ళికి వచ్చిన శివ, బ్రహ్మ, ఇంద్రాది బంధుగణమంతా ఎవరి విడిదిలో వారు తమ తమ భార్యలతో నిద్రకు ఉపక్రమించి ఉంటారు. విష్ణువు మాత్రం వివాహవ్రత దీక్షలో పుట్టలో ఉంటాడు. లక్ష్మీదేవి వకుళమాత దగ్గర పడుకొని ఉంటుంది. అది చూసిన చంద్రునికి దుఃఖం కోపం ముంచుకొస్తాయి. ఎంతయినా తోడబుట్టినది కదా! హరి వక్షస్థలంపై హాయిగా మహావైభవంతో శయనించాల్సిన సిరి కొండరాతి మీద అలా పడుకోవలసి వచ్చిందని బాధపడతాడు. ‘కొల్లాపురంలో ఉన్న లక్ష్మిని మాయమాటలతో మోసంతో పిలిపించాడు. పోనీ ఇప్పుడైనా ప్రేమతో తన ఉరముపై నిలుపుకుంటాడేమో చూద్దామని పరుగున వస్తే, యిది చూడాల్సి వచ్చింది,’ అని కోపంతో పద్మాక్షుడైన విష్ణువు కన్నులు మూతలు పడేట్టు చేసాడట చంద్రుడు. ఆ తర్వాత యింకా యిలా ఆలోచిస్తున్నాడు ఆ శుక్లపక్ష సోముడు:
ఇక్కడకి వచ్చిన రమను అలకదీర్చి గుండెల్లో పొదువుకోకుండా, ఆకాశరాజు కూతురును పెళ్ళాడేందుకు సిద్ధపడ్డాడు హరి. కొడుకైన బ్రహ్మ కూడా దయలేనివాడయ్యాడు. ఇప్పుడైనా, నీకింకా వేరే పెళ్ళెందుకయ్యా, ఇందిరను తిరిగి వక్షస్థలంపై కూర్చోబెట్టుకొని ఏలుకోరాదా అని మునులైనా చెప్పకుండా వినోదం చూస్తున్నారు (అలరువారు). అలాగే కానీ! వీళ్ళందరూ అడవులుపట్టి పోతున్నప్పుడు వీళ్ళకు దారి కనపడకుండా చీకటి చేసేస్తాను.
అలా ఆలోచించి పడమటి సముద్రం వైపుకు తొందరగా వెళ్ళిపోయాడట చంద్రుడు!
కథలో యిమిడిపోవడంతో పాటుగా, ఇలాంటి వర్ణనలు కవుల అంతరంగాన్ని చక్కగా ఆవిష్కరిస్తాయి. ఈ పద్యం చదివినప్పుడు నాకు ఠక్కున మనుచరిత్రలో పెద్దన కూర్చిన ‘తరుణి ననన్యకాంత…’ అనే పద్యం గుర్తుకు వచ్చింది. అక్కడ ఆయన చేసినది సూర్యోదయ వర్ణన. సూర్యుడు ఎఱ్ఱని కాంతులతో రాజిల్లుతున్నాడు, బహుశా రోజూ కన్నా ఎఱ్ఱగా కనిపించాడు కవికి. అదేమిటంటే విపరీతమైన కోపమట. ఎందుకంటే – వయసులో ఉన్నది, వేరే ఎవరినీ వరించనిది, మన్మథ తాపంతో తపిస్తున్న శరీరం కలిగినది అయిన వరూధిని, కోరి చేరితే పరిగ్రహించక, క్రూరుడై, మన్మథుని బారికి ఆమెను వదిలేసిపోయాడని సూర్యునికి ప్రవరునిపై కోపం వచ్చిందట. అంతటి నిష్ఠాగరిష్ఠుడైన ప్రవరుణ్ణి పట్టుకొని, బ్రాహ్మణాధముడు! అని తిడతాడు సూర్యుడు. ఈ కోపం సూర్యునిదనుకోవాలా కవిదా? దానికి సమాధానం ఊహ తెలియంగల పాఠకులే నిర్ణయించుకోవచ్చు.
అలాగే, చంద్రుని వంకతో కవయిత్రి తన కోపాన్ని ఇక్కడ ప్రకటించిందని నాకు అనిపించింది. అయితే, ఇక్కడ చంద్రునికి కోపం రావడం వెనుక బంధుత్వమనే బలమైన కారణం కూడా ఉంది. పెద్దనగారి విషయంలో సూర్యుడికి ప్రవరునిపై అంత కోపం రావడానికి అలాంటి కారణం ఏదీ కనిపించదు.
కావ్యం చివరి వరకూ సిరికీ శ్రీహరికీ మధ్య పొత్తు కుదరదు! పెళ్ళయిన తర్వాత మళ్ళీ తన దారిన తాను కొల్లాపురం వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి. వరాహ భవిష్యోత్తర పురాణాలలో ఉన్న వేంకటాద్రి మాహాత్మ్య కథ ఇంచుమించు శ్రీనివాస కల్యాణంతో ముగుస్తుంది. కానీ అలా ముగించేయడం వెంగమాంబకు సంతృప్తినివ్వలేదు. అది ఆమె స్వయంగా కావ్యంలో చెప్పుకొంది. అందువల్ల పద్మపురాణంలో కనిపించిన ఒక కథని తీసుకొని, దానికి తన కల్పనలు కొన్ని జోడించి, ఒక పూర్తి ఆశ్వాసాన్ని రచించిందావిడ. దానికి ప్రత్యేకంగా వీరలక్ష్మీవిలాసం అని పేరుకూడా పెట్టింది. అదీ వెంగమాంబకు లక్ష్మి మీదున్న అభిమానం!
పద్మావతితో పెళ్ళయిన కొన్నేళ్ళకు విష్ణుమూర్తికి తిరిగి లక్ష్మీదేవిపై మనసు మళ్ళుతుంది. ఆమె కోసం పరిగెత్తుకుని కొల్లాపురం వెళతాడు. అప్పటికి లక్ష్మీదేవి అక్కడ నుంచి పాతాళానికి వెళ్ళిపోతుంది. దానితో లక్ష్మీదేవి కోసం తపస్సు ప్రారంభిస్తాడు విష్ణువు. ఒక సరస్సు ఒడ్డున కూర్చొని, సరస్సులో ఒక పద్మాన్ని సృష్టించి, ఆ పద్మాన్నే తదేకంగా చూస్తూ, అమ్మవారి కోసం ఇరవై రెండేళ్ళు తపస్సు చేస్తాడు. అప్పటికి ఆమె మనసు కాస్త కరుగుతుంది. బయలుదేరి వస్తుంది. సరసున ఉన్న పద్మంలో ప్రత్యక్షమవుతుంది. వారిరువురి మధ్యనా జరిగే ఆ సన్నివేశాన్ని చాలా హృద్యంగా చిత్రించింది వెంగమాంబ.
నరమర జేయుచున్న పతి నంబుధికన్యక చూచి సిగ్గునన్
మఱల శిరంబు వంచి యనుమానమునన్ దను జూడకుండగా
హరి కమలాలయాననము నప్పుడు మోహము మీర జూడగన్
సిరి తనని చూసినప్పుడు శ్రీహరి సిగ్గుతో తలవంచుకున్నాడు. భర్త అలా తల వంచుకోడం చూసి, తాను కూడా సిగ్గుతో తలదించుకొన్నది సిరి. ఆమె తలవంచుకోడం చూసి ఆమెని మోహంతో చూసాడు హరి! ఇక్కడ కమలాలయ అన్నది సార్థక ప్రయోగం. లక్ష్మీదేవి అనే రూఢి అయిన అర్థమే కాకుండా, అప్పుడామె ఉన్న స్థితిని కూడా (పద్మంలోనే ఉంది కదా అప్పుడు) సూచించే పదమది. ఒక వైపు బింకం మరొక వైపు పొంకంతో ఇద్దరికిద్దరూ అలాగే చూసుకుంటూ ఉండిపోతారే తప్ప ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడారే! గోవిందుడు అళికియు ఆళుకక (అంటే జంకీ జంకక), శ్రీరమాదేవి తొలుత తను జూచి మాటాడినను దాను మాటాడవలెనంచు శిరము వాంచి యుండె. హరి పిలిచినప్పుడు మాటాడె దంచును లక్ష్మి కమలంబుపై నిల్చి కదలకుండె. అదీ వరస! ఆఖరికి బ్రహ్మరుద్రాదులు దిగి రావలసి వచ్చింది వారిద్దరినీ కలపడానికి. వాళ్ళందరూ వచ్చి వీరిద్దరినీ స్తోత్రం చేసి ప్రార్థిస్తే కాని అమ్మవారు ముందుకు కదలలేదు, అయ్యవారు అమ్మవారిని దగ్గరకు తీసుకోలేదు! ఆఖరికి భృగు మహర్షి లక్ష్మీదేవి పాదాలపై పడి, తను చేసిన తప్పును తల్లిలా క్షమించమని వేడుకొంటాడు. అప్పుడామె యిది నీ తప్పూ కాదు, నా తప్పూ కాదు, ఇదంతా కపటనాటక సూత్రధారి అయిన చక్రి పని అంటుంది. మొత్తమ్మీద చివరికి సిరి హరి మెడను వరమాలతో అలంకరిస్తే, హరి సిరిని తన ఉరముపై తిరిగి నిలుపుకొంటాడు. అంత తతంగం జరుగుతుంది వారిద్దరూ తిరిగి కలవడానికి.
ఇక్కడితోనైనా నిజానికి కావ్యం అయిపోయి ఉండాలి. కానీ అప్పటికీ వెంగమాంబకు తృప్తి కలగలేదు. ఇద్దరూ ఒకటైన కొన్నాళ్ళకు విష్ణుమూర్తి లక్ష్మీదేవి దగ్గర తాను కుబేరుని దగ్గర చేసిన అప్పును ప్రస్తావించి, అది తీర్చడానికి లక్ష్మి సహాయం కోరుతాడు. తన అప్పు తీర్చడం కోసమే హరి లక్ష్మిని తిరిగి పొందాడన్న భావం కవయిత్రి మనసులో ఉన్నదేమో అనిపించింది, అది చదివితే! అప్పుడు లక్ష్మీదేవి శ్రీహరిని మరొక ఉతుకు ఉతుకుతుంది!
ప్పిన దప్పే మటు చెప్పినన్ ధనము నే బ్రేమారగా నియ్యనే!
నను నీ వప్పుడు తేరజేసి ధనదు న్నా పెండ్లి కీ వర్థ మి
మ్మని యాచించి ఋణంబు సేయు పని కేమందున్ జగన్నాయకా!
మాటల్లో ఉండే కాకువు అంతా పోతపోసి నిర్మించిన మరొక మంచి పద్యమిది. ఆ కాకువులోని ఎత్తిపొడుపంతా మొదట చివర వేసిన- అనఘా, జగన్నాయకా అనే సంబోధనల్లో ఉంది! పెళ్ళికి ఎలాగో నన్ను రప్పించావు. నేను వచ్చినపుడు, ధనం లేదని నాతో చెప్పడానికి నీకు నామోషీ అయ్యిందా? అలా చెపితే నేను ప్రేమతో నీకా ధనం ఇవ్వకపోతానా? నన్ను నువ్వప్పుడు వేరే దానిగా భావించి, చులకనగా చూసి (తేరజేసి), వెళ్ళి ఆ కుబేరుడిని యాచించి, అతడి దగ్గర అప్పు చేసావు. ఇలాంటి పనిని ఏమనాలి చెప్పు!
అక్కడికి కవయిత్రి మనసు తృప్తి పడింది! అలా ఘాటుగా అడిగిన అమ్మవారికి అయ్యవారు ఏమని సమాధానం చెప్పగలరు? అసలే నన్ను వీడిన చింతలో ఉన్న నిన్ను నేనేం మొహం పెట్టుకొని నా పెళ్ళి కోసమని ధనం అడగగలను అంటూ సంజాయిషీ ఇచ్చుకుంటాడు! అప్పుడు అప్పు తీర్చడానికి ఒప్పుకుంటుంది రమ. అక్కడితో వారి కథ సుఖాంతం అవుతుంది! ఇలా పాత్రల నిర్వహణలో సున్నితమైన సమతౌల్యాన్ని ప్రదర్శిస్తూనే తన అంతరంగాన్ని నిష్కర్షగా ఆవిష్కరించడంలో గొప్ప నేర్పు చూపిన కవయిత్రి తరిగొండ వెంగమాంబ.
ఈ ప్రబంధంలో కనిపించే మరొక విశేషం ఇందులోని పత్రికల, పత్రాల ప్రస్తావన. ఆకాశరాజు శ్రీనివాసునికి వ్రాయించి పంపే పెళ్ళిపత్రిక, శ్రీనివాసుడు బ్రహ్మాది దేవతలను ఆహ్వానిస్తూ పంపే శుభలేఖ, సీస పద్యాల రూపంలో వివరంగా ఉంటాయి. లక్ష్మీదేవి తనకు శ్రీనివాసుడు పసుపుజాబు పంపించలేదని ఆక్షేపిస్తుంది. ఈ పెళ్ళి శుభలేఖల ప్రస్తావనలు ఆ కాలంలో వాటికున్న ప్రాధాన్యాన్ని సూచిస్తాయి. అంతే కాదు, శ్రీనివాసుడు కుబేరునికి స్వయంగా వ్రాసి యిచ్చిన అప్పుపత్రాన్ని కూడా మనమీ ప్రబంధంలో చదవ వచ్చు! ఇది కూడా సీస పద్యమే.
ప్రతి ఆశ్వాసాంత పద్యాలలో అంత్యప్రాసను పాటించడం, గద్యలో అప్పటివరకూ జరిగిన కథ మొత్తాన్ని సింహావలోకనం చేయడం వంటివి యీ ప్రబంధంలో కనిపించే మరికొన్ని విశేషాలు. పాత ప్రబంధ సంప్రదాయాన్ని పాటిస్తూనే ఎన్నో విశేషాలతో, ఒక కొత్తదనం, ప్రత్యేకత సంతరించుకున్న రచన శ్రీవేంకటాచల మాహాత్మ్యం. దీన్ని కేవలం ఒక స్థల మాహాత్మ్య కావ్యంగా కాక, అనేక కోణాలలో చదివి విశ్లేషించవలసిన అవసరం ఉంది.