నేటితరం భారతీయ సినీదర్శకుల లిస్టులో మొదటి కొన్ని స్థానాలలో చేర్చదగిన పేరు ‘రాంగోపాల్ వర్మ’. ‘శివ'(1989) అనే ఒక తెలుగు సినిమాతో తన సినీజీవితాన్ని ప్రారంభించి, క్రమేణా తన పరిధినీ, పరిణతినీ పెంచుకుని ఒక సంస్థగా ఎదిగిన సినీదిగ్గజంగా ఇతడిని చెప్పుకోవచ్చు. చాలా కొద్దిమందికి మాత్రమే అందుబాటులో ఉండే ఆర్టు సినిమా వంటి కళాఖండాలో, లేక ప్రపంచం అబ్బురపడే గొప్ప సాంకేతిక విలువలున్న చిత్రాలో ఇతను తియ్యకపోయినా, తనదైన శైలిలో అటు సమాజానికి అద్దం పట్టి, ఇటు భారతీయ సినిమాల సాంకేతిక విలువలకీ కొన్ని నవీన పార్శ్వాలను ఖచ్చితంగా పరిచయం చేసాడు. అందుకే నేటితరం మేటి భారతీయ దర్శకుల్లో ఇతని పేరు చేరింది. ఈ దర్శకుడు తన ఎదుగుదల పథంలోని, వివిధ మజిలీలలో తీసిన మూడు చిత్రాలను ఎంచుకుని, వాటిల్లోని కథానాయకుల పాత్రలద్వారా మారుతున్న సమాజపు విలువలను వర్మ ఎలా పరిచయం చేశాడని విశ్లేషించడానికి చేసే ఒక చిన్న ప్రయత్నమే ఈ వ్యాసం.
గొప్ప భారతీయ సినీదర్శకుడిగా గౌరవింపబడే సత్యజిత్ రాయ్ గురించి చెప్పిన ప్రతిసారీ అప్పు త్రయం (Appu Trilogy) ప్రస్తావన చాలా అలవోకగా జరిగే విషయం. అలాగే శ్యామ్ బెనెగల్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా అంకుర్ (1973), నిషాంత్ (1975) మరియూ మంథన్ (1976) చిత్రాలను గ్రామీణ త్రయం (Rural Trilogy) గా విశ్లేషకులు గుర్తిస్తారు. అలాగే మమ్మో (1995), సర్దారీ బేగం (1996) మరియూ జుబేదా (2001) చిత్రాలు ముస్లిం చిత్రత్రయం (Muslim trilogy) గా భావించవచ్చు. భారతీయ సమాంతర సినిమాలో ఎగసిన మరో కెరటం గోవింద్ నిహలాని గారి ఆక్రోష్ (1980), అర్ధ సత్య (1983), ద్రోహ్ కాల్ (1994) చిత్రాలను ఆ దర్శకుడి చిత్రత్రయంగా చెప్పుకుంటారు. అదే పద్ధతిలో రాంగోపాల్ వర్మ సినిమాలలోని విషయాలని తీసుకొని, మూడింటిని ఎంపికచేస్తే అవి శివ (1989), గాయం (1993), మరియూ సత్య (హిందీ 1998) అవుతాయి. ఎందుకంటే, ‘శివ’ తొలి సినిమా కాగా, ‘గాయం’ సినిమాతో వర్మ తనదైన ఒక కథన శైలి, విషయం మీద పట్టూ ఈ సినిమాతో అలవర్చుకున్నా డనిపిస్తుంది. ఇక ‘సత్య’ వర్మ శైలిని శిఖరాగ్రానికి చేర్చిన చిత్రం. ఆ తరువాత వర్మ ఎన్ని సినిమాలు తీసినా, ఇంకా తీస్తున్నా ‘సత్య’ సినిమాకు సరితూగేవి కనిపించవు. అందుకే ఈ వర్మ చిత్రత్రయాన్ని ఎంచుకుని, తన కథానాయకుల ద్వారా వర్మ సూచించిన సమాజ విలువల్ని గురించి చర్చిద్దాం!
కాలేజీ దౌర్జన్యాన్ని ఎదుర్కోవడంతో మొదలై, దానికి కొనసాగింపుగా, పెచ్చరిల్లుతున్న ‘భవాని’ అనే సిటీ గూండా యొక్క మాఫియా ఆధిపత్యాన్ని సమూలంగా నాశనం చెయ్యడానికి తయారయ్యే ఒక మధ్యతరగతి యువకుడి కథ శివ. ఒక మాఫియా రాజకీయ కుటుంబం నేపధ్యం ఉన్నా, కేవలం సాధారణ జీవితాన్ని అనుభవించాలనుకునే ‘దుర్గ’ తప్పని సరి పరిస్థితుల్లో, మాఫియా నాయకుడిగా మారవలసి వచ్చే కథ గాయం. ఎక్కడి నుంచీ ముంబైకి వచ్చాడో తెలీని ‘సత్య’ అనే సాధారణ యువకుడు మాఫియా సభ్యుడిగా మారే కథ సత్య. ఈ విధంగా చూస్తే సమాజంలోని ఒక చీకటికోణాన్ని వర్మ ఈ మూడు చిత్రాల్లోనూ తెరపైకి తీసుకు వచ్చాడు. ఈ ప్రస్థానంలో వర్మ తన సినిమాలలోని కథానాయకుడి ద్వారా ఈ చీకటి ప్రపంచాన్ని (underworld) అర్థం చేసుకొన్నతీరు, తద్వారా సమాజంలో మారుతున్న విలువలని ఎత్తిచూపిన విధానం గమనిస్తే, అది సమాజంపై దర్శకుడి వాంగ్మూలం అనిపిస్తుంది. ఈ పరిణామం అర్థం చేసుకోవడానికి ఒక విశ్లేషణ అవసరం.
శివ లోని కథానాయకుడు ‘శివ కుమార్’ (నాగార్జున) మొదట్లో “నన్ను కొట్టడానికి వచ్చినప్పుడు చెంప చూపించడానికి నేను గాంధీ అంత గొప్పవాడ్ని కాను” అని, తను చేసింది ఒక వ్యక్తిగా తన ఆత్మరక్షణకు మాత్రమే అన్నట్టుంటాడు. తరువాత “అయినా ఊర్లో గొడవలు మనకెందుకు?”అని కథానాయిక ‘ఆశ’ (అమల) అంటే, “ప్రతి ఒక్కళ్ళూ, మనకెందుకూ! అనుకోబట్టే పరిస్థితి ఇలా ఉంది. ఎవరో ఒకరు first step తీసుకోవాలిగా?” అని, సమాజం తరఫున రౌడీయిజానికి వ్యతిరేకంగా ఆ మొదటి అడుగు వేసేస్థాయి వరకూ ఎదుగుతాడు. ‘మల్లి’ (శుభలేఖ సుధాకర్) చని పోయినప్పుడు “దీనికి solution గా భవానీని చంపడంకాదు. అలాంటి గూండాలను పుట్టిస్తున్న ఈ వ్యవస్థని నాశనం చెయ్యడం” అంటాడు. తన అన్నయ్య (మురళీ మోహన్) “నలుగురికీ పనికొచ్చే ఉద్యోగం చెయ్యొచ్చుకదా?” అనే మాటకు, “నలుగురికి ఉపయోగపడే పనికన్నా, భవానీ లాంటివాణ్ణి ఒక్కణ్ణి నాశనం చేస్తే వందమందికి ఉపయోగపడినట్టు” అని తన ఉద్దేశాన్ని స్పష్టంగా తెలియజెబుతాడు. ఇందులో వ్యక్తిగతమైన ఆత్మరక్షణ నుండీ సమాజాన్ని కూడా తనవంతు ప్రయత్నంగా రక్షించాలనే ఒక యువకుడి ఆదర్శం కనబడుతుంది. ఈ ప్రయత్నంలో తను ఎంచుకునే మార్గం మళ్ళీ రౌడీయిజమే అయినా, అందులోకూడా ప్రతీకారవాంఛ కాక, ఒక ఆలోచన కనబడుతుంది.
కాలేజి రాజకీయాలూ, సిటీలోని గూండాయిజం మరియూ అక్కడి స్థానిక రాజకీయాలూ ఒక్కటిగా మారి ఒక వ్యవస్థీకృత మాఫియాగా ఎలా మారిపోయాయో ఇనస్పెక్టర్ గా ఉన్న ‘ఆశ’ అన్నయ్య (సాయి చందర్) ద్వారా వివరంగా తెలుసుకున్న శివ, స్టూడెంట్స్ యూనియన్ మొదలు, వర్కర్స్ యూనియన్, వ్యాపారస్థుల సంఘాలు ఇంకా బార్ ఓనర్స్ సంఘాలు, అందరూ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ మాఫియాకి మద్దతునిస్తున్న కారణాలని తెలుసుకుని ఈ వ్యవస్థ మూలాల్ని కదిలిస్తాడు. ఆ వ్యవస్థల్ని చాలా పకడ్బందీగా నాశనం చేసి అందరి పునాదుల్నీ కదిలించి ఒక భూకంపాన్నే సృష్టిస్తాడు.
ఇదంతా ఒక ఎత్తైతే, (క్లైమాక్స్) చివరిలో తన కథానాయకుడితో రాంగోపాల్ వర్మ ఇప్పించిన ముగింపు, పాత్ర అభివృద్ధి పరంగా చూస్తే అభినందనీయం కాకపోయినా, ప్రేక్షకుల్ని ఆలోచింపచేసేదిగా నిలిపిన ఘనత కూడా వర్మదే. శివపై ప్రతీకారానికి భవాని చేయించే దాడిలో, శివ అన్నయ్య కూతురు హత్య చెయ్యబడుతుంది. ఈ ఆవేశంలో శివ, భవానీని ఎదుర్కొని చివరికి చంపేస్తాడు. కాకపొతే ఒక్కసారి సినిమా మళ్ళీ చూస్తే శివ నిజంగా భవానీని క్రింద పడేలా తన్నాడా? అన్నది నిర్ధారణగా చెప్పలేం. శివ క్లోజప్ నించి కట్ చేసి చూపే భవాని పడిపోయే షాట్ లో భవాని అ..దు..పు..తప్పి పడిపోయాడా! అన్న భావన కూడా ఎడిటింగ్ ద్వారా ప్రేక్షకులకి కల్పించాడు. పైగా చివరి దృశ్యంలో, ఆశ మెట్లు దిగివచ్చిన శివకి ప్రేమగా దగ్గరైతే, ముఖంలో దాదాపు ఏభావమూ లేని ఇనస్పెక్టర్ ఎదురుగా నిలబడి ఉంటాడు. అంటే, శివ అరెస్టు చెయ్యబడతాడా? తన భవిష్యత్తు ఏమిటీ? అనేవి తెలియకుండా సినిమా ముగుస్తుంది.
తను ఎంచుకున్న దారి తప్పైనా ఒక ఆదర్శం కోసం ఎంచుకున్నట్టుగా హీరో యొక్క సామాజిక విలువల్ని చూపి హీరోయిజాన్ని నిలబెట్టాడన్నమాట. అంతేకాక ముగింపుని అలా ప్రేక్షకుల ఆలోచనకే వదిలేసి, హీరో స్థాయిని నిలబెట్టాడు. శివ సినిమా అప్పటివరకూ వచ్చిన తెలుగు సినిమాలన్నింటకీ విభిన్నమైనది గనక, వర్మఅప్పటికే ఉన్న ఒక ట్రెండ్ ను ఫాలో అయ్యాడు, అని అనుకోలేం. కాబట్టి, వర్మ తను అర్థం చేసుకున్న సామాజిక విలువల్ని తన కథానాయకుడి ద్వారా సినిమాలో తెలియజెప్పాడు అని అనుకోవడానికి చాలా అవకాశం ఉంది.