సీ. ఆ కన్నుమూతలో నంతర్విలీల పం
చానలస్తంభనాత్మార్చి వెలుగు
ఆ బొమ్మమోడ్పులో నసమాక్షు సెగకన్ను
మంట రేగిన సుళ్ళు మాటు మణుగు
ఆ కన్నువిప్పులో నఖిల రాజన్య శి
క్షా దక్షమైన వర్ఛస్సు మెరయు
ఆ చిరునవ్వులో నాంధ్రసామ్రాజ్య సు
శ్రీనవ్యజీవన శీల మిముడు
తే. ఈ శిలావిగ్రహమునందె యింత గొప్ప
కుదురుకొనియుండ ఊహలు గుములు కొనిన
ఎంత వాడవొ నిను స్తుతియింప గలమె
విజయనగరాంధ్రదేవుడవే నిజంబు
శిల్పికి బండరాతిలో కూడా సాంగోపాంగమైన ఒక రూపం సాకారమై కనిపిస్తుంది. ఒక శిల్పం చెక్కబడుతుంది. కవికి రాతి శిల్పంలో కూడా సజీవమైన తేజోమూర్తి దర్శనమిస్తుంది. ఒక పద్యం సృష్టింపబడుతుంది. అలాంటి ఒక సజీవ శిల్పాన్ని మనకి సాక్షాత్కరింపజేసే పద్యం ఇది. గొప్ప శిల్పాన్నయినా పద్యాన్నయినా నిర్మించాలంటే ఆ సృష్టితో మమేకం కావడం అవసరం. ఆ తర్వాత దానికి ఆకృతినిచ్చే నైపుణ్యం అవసరం. ఆ రెండూ మనకీ పద్యంలో కనిపిస్తాయి. ఈ పద్యంలోనే కాదు, కావ్యమంతటా కనిపిస్తుంది. ఇది శ్రీ కొడాలి వెంకట సుబ్బారావు రచించిన హంపీ క్షేత్రము అనే కావ్యంలోనిది. ఇందులో మనకి దర్శనమిచ్చే తేజోమూర్తి విద్యారణ్యస్వామి.
విద్యారణ్యస్వామి (విద్యారణ్యమఠ్)
విజయనగర సామ్రాజ్య నిర్మాణానికి పునాది వేసిన మనిషిగా చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి విద్యారణ్యస్వామి. విజయనగర స్థాపన గురించి, వేటకుక్కలను కుందేళ్ళు తరిమిన ఐతిహ్యం ప్రసిద్ధమే. విజయనగర సామ్రాజ్యం 1336లో హక్కరాయ(హరిహర), బుక్కరాయ సోదరుల చేత స్థాపించబడింది. వీరి గురించి రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. వీళ్ళు కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుని ఆస్థానంలోని తెలుగువారని, కాకతీయ సామ్రాజ్య పతనం తర్వాత కంపిలిలో ఆనెగొంది సంస్థానంలో చేరి, తుగ్లక్ చేత బంధింపబడి ఢిల్లీకి వెళుతున్నప్పుడు తప్పించుకొని విద్యారణ్యుల ఆశ్రయాన్ని పొందారని ఒక కథ. హోయసల రాజుల కొలువులోని కన్నడిగులని మరొక కథ. ఈ కథల మాట ఎలా ఉన్నా, ఈ అన్నదమ్ములిద్దరూ విద్యారణ్యుల ఆశ్రయాన్ని పొంది, అతని ప్రోద్బలంతో విద్యానగరాన్ని (హంపి) నిర్మించి, సామ్రాజ్యాన్ని స్థాపించడం అనేది స్పష్టంగా తెలుస్తున్న చరిత్ర. వీరిది విజయనగరాన్ని పరిపాలించిన రాజవంశాలలో మొదటిదైన సంగమ వంశం. హరిహరరాయలు, తర్వాత బుక్కరాయలు, ఆ తర్వాత రెండవ హరిహరరాయల వరకు విద్యారణ్యులే మంత్రి. విద్యారణ్యులు రాజ్యతంత్రంలో ఆరితేరిన మంత్రాంగవేత్తే కాక భారతీయ తత్త్వశాస్త్ర పారమ్యాన్ని ముట్టిన ఆచార్యులు కూడా. 1377-1386 మధ్య కాలంలో శృంగేరి పీఠాధిపతిగా ఉన్నారు. వీరి గురువులు భారతీతీర్థ స్వాములు. విద్యారణ్యుల పూర్వనామం మాధవ అని అంటారు. ఈయన భారతీతీర్థ స్వామికి స్వయానా అన్న అని, ఈయన శిష్యులు శాయనాచార్యులనీ ఒక కథ. ఈయన పూర్వనామం మాయన్న అని, ఈయనా శాయనాచార్యులు (శాయన్న) అన్నదమ్ములనీ మరొక కథ. విద్యారణ్యస్వామి రచించిన సర్వదర్శనసారసంగ్రహం భారతీయ తత్త్వ శాస్త్రంలో తలమానికమైన గ్రంథం. భారతదేశంలో వ్యాప్తిలోకి వచ్చిన పదహారు దర్శనాలను సవిమర్శకంగా విశ్లేషించిన గ్రంథమిది. ప్రాచీన కాలంలో మన దేశంలో అభివృద్ధి చెందిన తత్త్వసిద్ధాంతాల గురించి తెలుసుకొనేందుకు ఒక గొప్ప ప్రామాణిక గ్రంథం. అన్ని దర్శనాలనూ విమర్శించి చివరకు వీరు అద్వైత దర్శనాన్ని స్థాపించారు. అద్వైత వేదాంతాన్ని వివరించే పంచదశి, ఆది శంకరుల జీవితచరిత్ర అయిన శంకర విజయం, వీరి ఇతర గ్రంథాలు. లౌకిక ఆధ్యాత్మిక రంగాలలో తను చేయవలసినదంతా పూర్తిచేసి, చివరకు 1386వ సంవత్సరంలో విద్యారణ్యస్వామి ముక్తిపొందారు.
హంపీలో విరూపాక్షస్వామి ఆలయం వెనుకనున్న విద్యారణ్యస్వామి విగ్రహాన్ని చూసినప్పుడు కవిలో కలిగిన భావపరంపరలు ఒక పద్యఖండికగా ఉబికివచ్చాయి. అందులో పద్యమే ఇది. ఒక శిల్పాన్ని నిర్మించడమంటే, మనిషి ముక్కు చెవులు తెలిసేట్టు ఏదో చెక్కుకుంటూ పోవడం కాదు. మనసు పెట్టి చూసేవారికి అందులోని ప్రతి వంపులోనూ విశిష్టత కనిపించాలి. ఆ కూర్పులో గొప్ప సౌష్ఠవం తొణికిసలాడాలి. పద్యమైనా అంతే! ఊరికే గణ యతి ప్రాసలు కూర్చి పేర్చే పద్యాల వల్ల ఏమిటి ప్రయోజనం? నవనవోన్మేషమైన భావాలుండాలి. భావానికి తగ్గ పదాలు కూర్చాలి. పటిష్ఠమైన ఆ కూర్పులో ధార ఉండాలి. ఈ శిల్పంలో విద్యారణ్యుల వారి కన్నుల తీర్పులో, పెదాల కూర్పులో ఆ స్వామి తేజం కవికి దర్శనమిచ్చింది. దానిని చక్కని సీసంగా చెక్కి మన ముందుంచారు.
ఒక కన్ను అరమోడ్చి ఉంది. ఆ కన్నుమూతలో, తన లోపలి పంచాగ్నులను (పంచానల) స్తంభింపజేసే ఆత్మాగ్ని (ఆత్మార్చి) వెలుగు కనిపించింది. ఉదరాగ్ని, మందాగ్ని, కామాగ్ని, శోకాగ్ని, బడబాగ్ని- ఇవి పంచాగ్నులు. వీటి విజృంభణని అరికట్టి ఆత్మ చైతన్యాన్ని ప్రకాశింపజేయడం యోగ మార్గం. ఇది విద్యారణ్యుల తపస్సాధనని సూచిస్తోంది. అతని కనుబొమ్మలు ఒంపు తిరిగున్నాయి, భ్రుకుటి ముడిపడి ఉంది. అది ఎంత గంభీరంగా ఉన్నదంటే, అందులో శివుని సెగకంటి మంటలో రేగిన సుడులు కూడా అణగిపోతాయి. మరొక కన్ను విప్పారి ఉంది. ఆ కనువిప్పులో సకల రాజలోకానికి శిక్షణని ఇవ్వగల గొప్ప దక్షత ప్రకాశిస్తోంది. ఇంతటి గంభీరమూర్తిలోనూ ప్రసన్నత లేకపోలేదు. అది అతని నవ్వే పెదాలలో ఉంది. ఆ చిరునవ్వులో ఆంధ్ర సామ్రాజ్యానికి గొప్ప సౌభాగ్యవంతమైన కొత్త జీవాన్ని ప్రసాదించే లక్షణం స్ఫురిస్తోంది. మొదటి రెండు పాదాలు విద్యారణ్యుల తపశ్శక్తిని సూచిస్తే, తర్వాతి రెండు పాదాలు అతని రాజకీయ దక్షతను సూచిస్తున్నాయి. అలా విద్యారణ్యస్వామి సంపూర్ణ వ్యక్తిత్వం ఒక్కసారిగా కవికి సాక్షాత్కరించింది. అది ఆ శిల్పాన్ని దాటి విస్తరించుకుంది. అందుకే చివరికి ఎత్తుగీతిలో ‘ఈ శిలావిగ్రహమునందె యింత గొప్ప కుదురుకొనియుండ’, ఊహిస్తే, అసలు నువ్వు ఇంకెంతవాడవో కదా అని మహాశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. ఆతను నిజంగా ‘విజయనగరాంధ్ర దేవుడే’ నట! ‘విజయనగరాంధ్ర దేవుడు’ అనడంలో ఒక చమత్కారం ఉంది. శ్రీకాకుళంలో (కృష్ణాజిల్లా) ఉన్న ఆంధ్ర మహా విష్ణువును ‘శ్రీకాకుళాంధ్ర దేవుడు’ అని పిలుస్తారు. శాతవాహనుల కాలానికి ముందే విష్ణుడనే యోధుడు ఆంధ్ర రాజ్యాన్ని నిర్మించాడు. అనంతరం అతన్ని ప్రజలు మహా విష్ణువు అంశగా పూజించారు. దాన్ని స్ఫురింపజేసే సంబోధన ‘విజయనగరాంధ్ర దేవ’. ఇది కవికున్న ఆంధ్రాభిమానాన్ని వ్యక్తం చేస్తోంది.
ఇప్పటి కాలానికి ఇలాంటి అభిమానాలు అసంగతంగా అనిపించవచ్చు గాక. అప్పటి కాలంలో, అంటే సుమారు పందొమ్మిది వందల ముప్ఫయిల నుండి అరవైల వరకు, చాలామంది తెలుగు గుండెలని కదిలించిన భావావేశం అది. అయితే శ్రీ కొడాలిని కదిలించిన ఆవేశం కేవలం ఊహాత్మకం కాదు. హంపీ క్షేత్రాన్ని కళ్ళారా దర్శించినప్పుడు తనలో ఉప్పొంగిన అనుభూతులను ఖండకావ్యంగా మలిచారతను. హంపీ క్షేత్రంలో ప్రత్యణువూ గతించిన వైభవానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తుంది. ఆ గాలి ఎన్నెన్నో పురాస్మృతులను గుర్తుకు తెస్తుంది. అక్కడి శిథిల శిల్పాలు ఎన్నో గాథలను వినిపిస్తాయి. వాటిని చూసి కవి హృదయం ఎలా ద్రవించిందో చూడండి:
శిలలు ద్రవించి యేడ్చినవి జీర్ణములైనవి తుంగభద్రలో
పల గుడిగోపురంబులు సభాస్థలులైనవి కొండముచ్చు గుం
పులకు చరిత్రలో మునిగిపోయిన దాంధ్రవసుంధరాధిపో
జ్జ్వల విజయప్రతాప రభసం బొక స్వప్నకథావిశేషమై
ఆంధ్ర రాజుల ఉజ్జ్వలమైన విజయ ప్రతాప వైభవమంతా కలలుగా కథలుగా మిగిలిపోయిందని శిలలు కూడా కరగి కన్నీరు పెడుతున్నాయట! ఇదే కావ్యంలో మరొక చోట హంపీలో పక్షుల కువకువలను వర్ణిస్తూ ఇలా అంటాడీ కవి:
ఆంధ్ర సామ్రాజ్య నాటకాభ్యంతరమున
చివర తెర జారిపోయిన చిన్నె లరసి
మంగళంబును పాడిన మాడ్కి నేమొ
తీరి గొంతెత్తుచున్నదీ ద్విజకులంబు
పోయిన గతకాలపు వైభవాన్ని తలచుకొని విచారించడమే కాదు, ఆ కాలపు గాథలను కూడా హృద్యంగా చిత్రించిన కావ్యం హంపీ క్షేత్రం. హంపీ స్థాపన కథ, శ్రీనాథునికి ప్రౌఢరాయల ఆస్థానంలో జరిగిన కనకాభిషేక ఘట్టం, రాజు కోసం తండ్రినే ఎదిరించిన వీరమనేని పరాక్రమానికి మెచ్చి కృష్ణరాయలు అతనికి మధుర రాజ్యప్రదానం చేసిన కథ, విజయనగర సామ్రాజ్య పతన హేతువైన తల్లికోట యుద్ధం, చెప్పుడు మాటలు విని తిమ్మరుసు కళ్ళు పీకించిన కృష్ణరాయలు చివరకు నిజం తెలుసుకొని పొందిన పశ్చాత్తాపము, కళింగరాజు కూతురుతో కృష్ణరాయల పాణిగ్రహణం తదనంతర పరిణామాలు, కృష్ణదేవరాయల కవిత్వ మహత్వం- ఇలా ఆ క్షేత్రానికి సంబంధించిన ఎన్నో కథలను రమ్యంగా చిత్రించిన కావ్యం హంపీ క్షేత్రము.
ఇలా ఎప్పుడో గతించిన వైభవాన్ని ఊరికే తలుచుకోవడం వల్ల కలిగే లాభం ఏమిటని అనిపిస్తుంది. నిజమే, కానీ లాభనష్టాలను బేరీజు వేసుకొని ఏదో ప్రయోజనాన్ని ఆశించి రచించడు కదా కవి తన కవిత్వాన్ని! సరే, వాళ్ళు రాస్తే రాశారు గాక, మనం ఎందుకు చదవాలి అని మరొక చొప్పదంటు ప్రశ్న. హంపీ క్షేత్రాన్ని ఎందుకు సందర్శిస్తామో, ఈ హంపీ క్షేత్ర కావ్యాన్ని కూడా అందుకే చదవాలి అన్నది సమాధానం. హంపీలో శిథిలమైన శిలలాంటిదే తెలుగు పద్యం కూడాను. అలాంటి శిల్ప సౌందర్యంతో పరిపుష్ఠమైన పద్యకవిత్వం ఇప్పుడు జీర్ణమయిపోయింది కదా. మరొక్క తరమో ఇంకొకటో గడిస్తే ఉన్న కావ్యాలన్నీ చరిత్రలో పూర్తిగా మునిగిపోతాయి. అంచేత నాబోటి వాళ్ళు ఇప్పుడు వ్రాసే ఇలాంటి వ్యాసాలు, కొడాలి వారికి హంపీ క్షేత్రములో వినిపించిన పక్షుల మంగళగీతాల వంటివే అనుకోవచ్చు. అయితే, కవిత్వం పైన ఆసక్తి ఉన్న కవులకి ఇలాంటి పద్యాలను, కావ్యాలను చదివితే కొంత ప్రయోజనం ఉండే అవకాశం ఉంది. వీటిని ఆత్మీయంగా పరిశీలిస్తే, కవిత్వ నిర్మాణానికి కావలసిన నేర్పు, చూపించాల్సిన శ్రద్ధ అర్థమవుతాయి. అవి లేకుండా ఎన్ని పద్యాలు వ్రాసినా, ప్రచురించినా, అవి కొండముచ్చు గుంపుల సభాస్థలులగానే మిగిలిపోతాయి!