సాహిత్యానువాదం – ఒక వివేచన

సాహిత్యానువాదాల నాణ్యతని తూచడానికి సరైన పడికట్టు రాళ్ళు లేవు. దీనికి కారణం సాహిత్యానువాదాన్ని గురించిన సిద్ధాంతం లేకపోవడమే. ఈ ప్రక్రియలో సాహిత్యకారుడు తన కోసమే ఒక చట్రాన్ని (FORM) తను రూపొందించు కుంటాడు. దానిని ఆధారంగా చేసుకుని తన పనికి ఉద్యమించుతాడు. దీనికి ముందు అతడు మూలాన్ని ఆస్వాదించి అంతరంగంలో ఉంచుకుంటాడు. ఆస్వాదించడమంటే కృతి లోని రమ్య మైన, రసవత్తరమైన అనేక విషయాలని అర్ధం చేసుకుని తద్వారా ఆనందాన్ని పొందడం. భావనలో, మూల సాహిత్యకారుని పరిశీలనాశక్తి లో శైలి, శయ్య, రీతి, పాకము, రసము, అలంకారము, ఇత్యాది, అనేక లక్షణాలని, అనేకమార్గాలలో తాను ఎంపిక చేసుకుని వాడిన, అనుసరించిన మార్గాలనన్నిటినీ బాగా అవగాహన చేసుకోవడం సాహిత్యానువాదానికి మొదటి మెట్టు గా భావించాలి. భావుకత ఎంతముఖ్యమో ఈ హంగులన్నిటిని సందర్భోచితం గా ఉపయోగించడము అంత ముఖ్యమే. ఇందులో కొన్ని వైయక్తిక ఎంపికలైతే, కొన్ని పాండిత్యం వల్ల సమకూరేవి. వస్తువు (Content) పునాది, ఆధారము, లేదా కేంద్రము అనుకోవచ్చు. ఉక్తి సంబంధం కలిగిన ప్రక్రియ, మాధ్యమము, వ్యూహము, (Strategy) ఇవన్నీ (Frame) చట్రం లేదా రూపానికి (Form) కి సంబంధించినవి.

విమర్శకైనా సమీక్షకైనా కావలసింది సహృదయతే. దానినిమించి, సాహిత్యానువాదాన్ని సమీక్షించాలన్నా, విమర్శించాలన్నా సాహిత్యంలో ఈ ప్రక్రియ ఒక విశిష్టమైనదని గుర్తించాలి. నిజానికి సాహిత్యానువాద కృతుల విమర్శకీ, సమీక్ష కీ చాలా వ్యత్యాసం ఉంది. విమర్శకుడు గుణ దోష విచారణ చేస్తే, సమీక్షకుడు ఆ సాహిత్యానువాదాన్ని పాఠకుడికి పరిచయం చేస్తూ కృతిలో ఘోర ప్రమాదాలేమైనా ఉంటే వాటిని పాఠకుని దృష్టి కి తెస్తాడు. ఈ ప్రక్రియలో విమర్శకుడికి, సమీక్షకుడికి మరొక గురుతర బాధ్యత ఉంది. అతని వాక్యాలని విమర్శని మూలభాష తెలియని చదువరి ఆ నిర్ణయాలు సమంజసమైనవా కాదా అని నిర్ణయం చేసుకోలేడు. కాబట్టి అవే నమ్మే అవకాశం ఉంది. స్వతంత్రరచన విషయంలో ఈ ప్రమాదం లేదు. సాహిత్యానువాదం చదువుతున్న పాఠకుడు మూలభాష లో ఆ రచనకీ తను చదువుతున్న దానికీ తేడాలున్నాయా అన్న పరీక్ష చెయ్యలేడు. అవి విమర్శకుడో, సమీక్షకుడో చెయ్యాల్సినదే. చదువరికి మూలకృతి ఎడల ఉన్న అభిమానాన్నే, రచన ఎడల ఉన్న ఆసక్తిని బట్టి, మరోకృతి ని చదువుతున్నా మధ్య వచ్చిన సాహిత్యకారుని పెద్దగా పట్టించుకోడు. తేడా ఉన్నా తెలుసుకోలేడు. అందుకే అతడిని తప్పుదోవ పట్టించకుండా కృతిని అందించడం ఈ ప్రక్రియలోని కళాకారుని బాధ్యత.

ఆంతరంగీకరణ ప్రాశస్థ్యాన్ని బట్టి సాహిత్యానువాదం హృదయంగమమౌతుంది.

వేదవ్యాసుని భారత భాగవతాదుల సంస్కృతం తెలియని తెలుగు వారందరూ పోతన, నన్నయాదుల అనుసృజనల ద్వారానే కవి హృదయాన్ని తెలుసుకుని కృతి మాధుర్యాన్నీ, అందాన్నీ ఆస్వాదించ గలిగారు. ఆయా కవిపుంగవుల ఆంతరంగీకరణ వైభవం అలాంటిది. ఈవిషయం ఇక్కడ ప్రస్తావించడానికి కారణం సాహిత్యానువాద విమర్శ కు శాస్త్రపరిజ్ఞానం కాక కళాదృష్టి కావాలని చెప్పాలనే.

ఒకే సాహిత్యకృతికి అనేక సాహిత్యానువాదాలు వస్తూ ఉంటాయి. వీటిలో వైవిధ్యం ఉండడం లో ఆంతర్యం వేరువేరు సాహిత్యకారులు వేరువేరుగా మూలాన్ని ఆంతరంగీకరణ చేసుకోవడమే. ఆంతరంగీకరణ ఒక పారిభాషిక పదం గా వాడినవాడు ప్రఖ్యాత మళయాళ కవి అయ్యప్ప పనికర్ . దీనిని అతడు ‘Interiorization’ అన్నాడు. దీన్ని ‘Internalization’ అన్నా సంతోషమే. కవి హృదయం లోనికి పోని సాహిత్యానువాదాలు నిలవవు. ఎంత మంచి సాహిత్యానువాదమైనా, మరింక మంచిదొకటి వచ్చే వరకే ఉంటుందని చాలామంది చెప్పరు.. ఆంతరంగీకరణ అనే భావము (Concept) ను అంగీకరించిన తరువాత అనుసృజననీ ఒక ప్రక్రియగా అంగీకరించవలసినదే.