దేహి

ఆమె పేరును నేను కచ్చితంగా పుస్తకం అట్ట తర్వాతి పేజీలో చూస్తాను. ఆ పేజీని ఇంప్రింట్ అని ఏదో అంటారు! డిజైన్ అనిగానీ, లే అవుట్ అనిగానీ, కూర్పు అనిగానీ, టైప్ సెట్టింగ్ అనిగానీ ఇలా ఏదో ఒకటి రాసి ఆమె పేరు వేస్తారు; లేదా, ఆమే వేసుకుంటుంది! ఆమె చేసే పుస్తకాల డిజైన్లన్నీ బావుంటాయి; లేదా, పుస్తకాల డిజైన్లు బావుండటం వల్లే ఆమె పేరు నేను గుర్తు పెట్టుకోగలిగానేమో! ఆమె ఎంచుకునే ఫాంట్సూ, పేజీ నంబర్లు వేసే తీరూ, ఎడమ పేజీలో ప్రారంభించి కుడి పేజీకి ముగించే విధానమూ అన్నీ ఫ్రెష్షుగా ఉంటాయి.

ఈ పుస్తకాలను చదవడం ఒక ఆసక్తి అయితే, ఈ పేరు ద్వారా ఆమెను నేను ఊహించుకోవడం మరొక ఆసక్తి. అత్యంత సంప్రదాయమైన పేరుగల ఈవిడ నాకెందుకో ఒక పద్ధతిలో సెక్సీగా ఉన్నట్టు తోస్తుంది. అయితే ఆమెను నేను ఎప్పుడూ చూడలేదు. ఒకరిని కేవలం కుతూహలం కొద్దీ వెళ్ళి చూసి వచ్చే స్వభావం కాదు నాది. అలాగని ఆమె ఎదురైతే మాత్రం కచ్చితంగా సంతోషిస్తాను. కానీ ఈ పదేళ్ళుగా ఆమె పేరు చూస్తున్నా కూడా ఆమె ఎప్పుడూ ఏ సాహిత్య సమావేశాల్లోనూ అలా తటస్థ పడలేదు.

సమస్య ఏమిటంటే, ఒక పేరంటూ తెలిసిన తర్వాత దాన్ని ఎక్కువ రోజులు రూపరహితంగా మన మెదడులో ఉంచలేం. అందుకే, నాకు తెలియకుండానే ఆ ఖాళీ పూరించబడింది. ఆ పూడ్పును బట్టి, ఈవిడ ఎంత ఎత్తు ఉంటుందంటే, సరిగ్గా నా డిగ్రీ బ్యాచ్‌మేట్ శ్రీ అంత! శ్రీ కొంచెం పొట్టి అనే చెప్పొచ్చు; ఆ ఎత్తుకు తగిన చిన్నటి గుండ్రటి లేత ముఖం! అయితే, రొమ్ము బిగువు నేను గమనించలేదు. లేదా, నా కంట పడేంత బిగి లేకపోవచ్చేమో! అప్పటి నా మానసిక స్థితి ఏమిటంటే, నేను కొంచెం నిజంగా ఇష్టపడే అమ్మాయిల ఛాతీ వైపు చూడటానికి ఇష్టపడేవాడిని కాదు. అలా ఎందుకో నేను చెప్పలేను. ప్రేమలో దేహానిది మలి ప్రాధాన్యత అని నమ్మిన కాలం అది. పైగా ఒక పవిత్ర భావనను ఆ చూపు మలినం చేస్తుందనిపించేది. అసలు కళ్ళను దాటి ఇంకో తావులో దృష్టి నిలిపేంత అవకాశం ఉంటుందా; ఆ కొంచెం ప్రేమలోనైనా! కాబట్టి, ఈమెకు నేను శ్రీ ముఖాన్ని తగిలించి, ఈమె ప్రౌఢ అని నాకో గట్టి నమ్మకం ఉంది కాబట్టి, ఆ బిగి దగ్గర నేను వేములవాడ రాజన్న స్నానాలగుండంలో దొంగ కళ్ళతో ఎత్తుకొచ్చిన పూబంతుల్ని తగిలిస్తాను. దీనివల్ల, ఆమె రూపానికి ఒక నిండుదనం సమకూరుతుంది. మరి ఆమె పుస్తకాన్ని ఎంత పద్ధతిగా తీర్చిదిద్దుతుందో, నేను ఆమె అనాటమీని కూడా అందులో కొంతైనా శ్రద్ధతో తీర్చిదిద్దాలి కదా!