నిర్వికల్ప సంగీతం (1987): సహృదయుని సాహితీ ప్రస్థాన ప్రారంభం

మిత్రులందరూ భద్రుడూ అంటూ పిలుచుకునే వాడ్రేవు చినవీరభద్రుడి పేరు తెలియని వారు ఇప్పుడు తెలుగు సాహితీ లోకంలో లేరు.

నిర్వికల్పం అంటే సమాధిస్థితి లాంటిది. కార్యకారణ ప్రమాతాప్రమేయాల సంబంధాల కావలగా లోకాతీతమైన జ్ఞానం అది. నిర్వికల్పసంగీతం భద్రుడు ముప్ఫైయేళ్ళ కిందటే తెలుగు కవితా కవితాప్రియులకిచ్చిన తొలికాన్క. పూర్వం అరణ్యాల్లోని ఋష్యాశ్రమాల్లో గురు శిష్యుల తాత్విక సంభాషణలూ సదసత్సంశయాలూ ఉపనిషత్తులకు మూలాధారాలైనట్లే ఎక్కడో అడవి పక్కగా ఉన్న కుగ్రామంలో పుట్టి పెరిగి లాంతరు సన్నని వెలుతుర్లో చదువుకుని ఎందరో మేరునగధీరులైన సాహితీదిగ్గజాల వద్ద శిష్యరిషకం చేసిన భద్రుడి కవిత్వానికి రాజమండ్రి సాహితీ వాతావరణమే మూలాధారం.

1980వ దశకపు ఉత్తరార్ధంలో మొదలైన కవిత్వం సిద్ధాంత చట్రాలను తెంచుకొని రాజకీయ రంగుల్లేని అనుభూతులకే మళ్ళీ పట్టం కట్టి కవిత్వంలో కవిత్వాంశానికే పెద్దపీట వేసింది. ఆ నేపథ్యంలోనే తన గొంతును వినిపించిన కవి భద్రుడు. ఒక దివ్యానుభవం క్షణికమై శాశ్వతమైనట్టు భద్రుడి కవిత్వం వైయక్తికమై ప్రాంతీయమై సార్వజనీనమైనది. తొలినుంచీ కవులూ తత్త్వవేత్తలూ సత్యాన్వేషణే జీవికి ధ్యేయంగా చెపుతూ వచ్చారు. భద్రుడూ దీనికేమీ భిన్నంగా చెప్పలేదు. ‘తనదైన అనుభూతి తనది కాన’ కవి తన కాలానికి సంబంధించిన ప్రశ్నలతో తన అనుభవాలతో వేగుతున్నా సత్యతృష్ణనీ సత్యాన్వేషణనీ తొలినుంచే పుణికిపుచ్చుకున్న వాడవడంవల్ల మనకితను నియోక్లాసికల్ కవిగా ఆవిష్కృతమౌతాడు. నిజానికి ఇటువంటి కాలనిరూపణ భద్రుడికి ఇష్టమైనది కాదు. హోమర్ దాంతే వ్యాస వాల్మీకాదులకూ ఈతరం మహాకవులకూ అభేదం చెపుతూ కవిత్వం నిరంతర జీవధార అనీ కవులకు కాలదోషం పట్టదని నమ్మేవాడే భద్రుడు.

మనిషి సంఘజీవి. అయితే భద్రుడి తొలి కవితా సంపుటిలో కవి కుటుంబ సభ్యులూ వాళ్ళతో తనకున్న బంధమూ పరిచయ వాక్యాల్లో తొలిదర్శనమిస్తూ పరిచయమైనవిగా అనిపిస్తాయి. ఏ కవి తన ఇంటి గురించీ బాల్యాన్ని గురించీ చెప్పినా నాకు పక్షులే గుర్తుకొస్తాయి. అన్ని గూటి చిలకలూ ఒకే పలుకు పలుకుతాయని నమ్ముతాను నేను. అందర్లాగే పుట్టి పెరిగిన భద్రుడు తన నవయౌవనదశలో సహజంగా కలిగే ఉద్రేకం గురించి ‘బొమ్మలు గీశాను, పరీక్షలు రాశాను, అమ్మాయిల్ని ముద్దు పెట్టుకున్నాను, వాళ్ళ గుండ్రటి రొమ్ముల్ని చూసి వెర్రి పడ్డాను. కానీ ఇదేమీ సంతృప్తి పర్చదు నా దాహాన్ని తీర్చదు…‘ అంటున్నాడు.

ఇంతవరకూ అభ్యంతరం గానీ ఆశ్చర్యం గానీ లేవు. ఆధునిక మానవునికి సంతృప్తి కలిగించే క్షణమేదో భద్రుడే ‘ఎప్పుడో ఎక్కడో నా అస్పష్ట స్వర్గంతో తాదాత్మ్యం కలుగుతుందే ఒక అపురూప క్షణం… అప్పుడూ మాత్రమే నా ఆత్మ విముక్తమౌతుంది.‘ అంటూ అదే పేరాను ముగించాడు. దివ్యానుభవం ఏదైనా అది క్షణికమైనదే.

తెలుగు కవులు చాలామంది తమ తమ కవిత్వం గురించి తామే చెప్పుకున్నట్టే భద్రుడు కూడా చెప్పుకున్నాడు. చూడండి యథాతథంగా:

నా కవిత్వం

ప్రజల కోసం కాదు
సాహిత్య విమర్శకుల ఆమోద ముద్ర కోసం కాదు
నా కీర్తి కోసం కాదు

నా తృష్ణ నా ప్రశ్న నా అభిలాష ఒకటేమిటి? నా చైతన్యమంతా
ఎల్లల్లేని నా హోమ్‌సిక్‌నెస్ నుంచి పొంగిందే

ఎప్పుడో ఏ కాలంలోనో ఎక్కడో కోల్పోయిన ఏదో అమూల్యమైనదాని
ఛాయ తోనూ, జ్ఞాపకం తోనూ, వెచ్చని కన్నీటిచారల చెంపలకు చేతులాన్చుకొని
అపుడూ అపుడూ పలికిన ఉన్మత్త ప్రేలాపన నా కవిత్వం

సూర్యోదయాస్తమయాల్లో వానాకాలపు అరణ్యాల జీబురుగుహల్లో వేసవి
మధ్యాహ్నపు నిర్వేదంలో వెన్నెల్లో ఏదో అస్పష్ట స్వర్గం కోసం చేజారిన సామ్రాజ్యం
కోసం బ్రతుకంతా ఒక ప్రతీక్షగా, ప్రజ్వలిత హృదయంతో ఆ నాదేశానికి పోయేందుకై
నిరీక్షిస్తున్నప్పుడూ అపుడూ అపుడూ నా నుంచి రేగిన పొగ నా కవిత్వం

యూరప్ చరిత్ర, భారతీయ వేదాంతం, స్త్రీ వక్షం, సాధుకవుల వేదన, జన్మభూమి ధూళి, విప్లవ పరిమళం, కాలాతీత నిర్వికల్ప సంగీతం
అపుడూ అపుడూ నా ఆత్మని కావిలించుకున్నపుడూ పుట్టిన వెచ్చదనపు మత్తు- అది నా కవిత్వం.

ఇతనికి కవిత్వమంటే కొన్నికవితలనో కాస్త కవిత్వమనో తేలికపాటి అభిప్రాయాలు లేవు. కవిత్వం అంటే మామూలు అనుభవాల్లోనే అసామాన్యమైన అంశాలకు బీజాల్ని చూపించగల ద్రష్టలకు సాధ్యపడే కవనసృష్టి. బాధాసర్పదష్టులు అమ్మా అని ఆక్రోశించడం.

ఈ పట్టణవీథుల్లో ఒక ముసలి బిచ్చగత్తెని మీలో చాలామంది చూసేవుంటారు. దిగంబరంగా తిరిగే ఆమెని మించిన స్వేచ్ఛా గాయని ఎవరు?
కానీ ఈమధ్య ఆ ముసిల్ది ఒక చిరుగు పీలికని మొలకి అడ్డంగా చుట్టుకుంటోంది. దీన్ని మించిన విషాదాన్ని సోఫోక్లీజ్ మాత్రం ఊహించగలడా

అని అడగగలిగే దివ్యచక్షువులుండడం.

తొలినాటి కవితలు మనకు ఆట్టే ఇందులో కనబడవు. కేవలం ఒక కవితలో గడ్డిపూవు దేవదేవునికి ఆత్మసమర్పణ చేసుకున్న ఒద్దికా అణకువా గల నిర్భయత్వం కనిపిస్తుంది.

యూరప్ చరిత్ర, భారతీయ వేదాంతం, స్త్రీ వక్షం, సాధుకవుల వేదన, జన్మభూమి ధూళి, విప్లవ పరిమళం, కాలాతీత నిర్వికల్ప సంగీతం
అపుడూ అపుడూ నా ఆత్మని కావిలించుకున్నపుడూ పుట్టిన వెచ్చదనపు మత్తు… అది నా కవిత్వం

అని చెప్పుకున్న కవి అనుభవాలూ అనుభూతులూ సత్యాన్వేషణకి ఎలా తోడ్పడ్డాయో కాస్త చూద్దామా? బయటి వర్షంలో తడిసివచ్చిన వ్యక్తిని చూస్తే ఎలా వర్షం జ్ఞప్తికొస్తుందో అలాగే భద్రుడి కవిత్వాన్ని మళ్ళీమళ్ళీ చదివి రాసిన ఈ నాలుగు మాటలూ చూస్తే తన కవిత్వంలో తడిసినట్టే వుండాలి. సామాజిక రాజకీయ పరిస్థితుల్లో స్టేటస్ కోతో ఇబ్బందుల్ని అధిగమించడానికి ‘నూతన యుగావిష్కరణ కోసం కవి తనని తాను-

డైనమైట్లతో పేల్చుకోవాలి అప్పుడుగానీ హృదయ పాషాణాభ్యంతరాలు తొలగవు

ఒక్క నవ్వు నవ్వటానికి ఈరోజు నాతోనేను మహాసంగ్రామమే కానివ్వాలి
ఒక్క పువ్వు పుయ్యటానికి ముందు నే నెత్తురొలికించి కన్నీరు చిందించాలి

ఇలా మొదలయింది సత్యాన్వేషణా ప్రయత్నం. ఇది కావల్సిందే అయితే సరిపోదు. కవి ఇంకా ఏం చెపుతున్నాడో వినండి.

ఆత్మసాక్షాత్కారం కావాలంటే మనం మన తొడుగుల్ని విప్పెయ్యాలి. వాటిని ప్రళయంలో పారేసి పంచభూతాల పంచామృతాన్ని నైవేద్యంగా నీరాజనమివ్వాలి. ఒక అమృతస్మృతి జీవితాన్ని మృత్యుంజయం కానివ్వాలి. ఖడ్గాల కంకులకి ఆత్మవంచనలకూలి కోసం కాపలా కాస్తున్నందుకు క్షమించమని ముసాఫిర్లని వేడుకోవాలి. పోదాం పద అంటూ వెళిపోవాలి. ఏ ఆచ్ఛాదనల ఆత్మవొంచనలూ లేని ఏ అసమర్థ శబ్దాల అపరిపక్వ భాషలూ లేని ఏ కృత్రిమ లజ్జా లేని అనాచ్ఛాదితని కోరుకోవాలి ఒక అమృతసరస్సులో జలకాలాడడానికి. మజిలీ కోసం యాత్రలు చెయ్యాలి. ఆగామి ప్రళయం నుంచి నూతన సృష్టికై జన్యుకణాల్ని భద్రంగా ఓ నావలో ఇమిడ్చిపోవాలి. ఒక మనువవాలి. మజిలీ కోసం యాత్రలు చేస్తున్న మనకు ఆటంకాన్వేషణే మన అసలైన లక్ష్యమన్న రహస్యం అవగతమవాలి. ఏవో ఉపత్యకల వద్ద ఈశోపనిషద్ గానం చేస్తూ దగా చేస్తున్న మహపెద్దవాళ్ళందర్నీ సబర్మతి సాక్షిగా క్షమించమన్న ఒక సత్యపూర్ణని కలిసి మళ్ళీ కలయిక ఎప్పుడెప్పుడా అని ప్రాధేయపడాలి.

ఇన్నీ చేసినా ఆ ‘అస్పష్ట స్వర్గం’ క్షణమాత్రమైనా లభిస్తుందని గానీ ఆ ‘చేలాంచలముల విసరుల కొసగాలులు’ ఆహ్లాదపరుస్తాయనే హామీ లేదు. అయినా కవి తన నిర్వికల్ప సంగీతాన్ని ఇలా వినిపిస్తూనే ఉన్నాడు.

నిర్వికల్ప సంగీతం

ఈ లేతవీణ మీద ఎప్పుడు శ్రుతి చెయ్యాలో నీకు తెలుసు. నీ
అగాధమైన అంతరంగంలోని ఏ సంకల్పమో గొప్ప గీతంగా యీ లోకమంతటా
మోగుతుంది. తన తీక్ష్ణమైన సునిశితత్వానికి తానే కదిలి ఒణికిపోయి నీ సంగీతం బేలగా
నిన్ను చూస్తుంది. అప్రత్యాశితంగా దయ ఒలికే నీ కళ్ళు ఎటో చూస్తుంటాయి. నీ
సంగీత జీవనార్తి నీ నిశ్శబ్దాన్ని తాకి నీ చుట్టూ విఫలంగా పర్చుకొంటుంది.

ఒళ్ళెరగని ఆవేశం నుంచి హఠాత్తుగా ఉలికిపడినపుడు కన్నీటి జాలు తప్ప
మరేమీ మిగలదు. ఏ దూర మలయాదేశాల రబ్బరు తరుకాండాలో పాలు ఒలికిస్తాయి.
వెనకా ముందూ తెలియని కారణాల నిష్ప్రయోజనం మధ్య కన్నీరు నీ నైవేద్యంగా
పేరుకొంటుంది.

నేను హఠాత్తుగా నీ నుంచి వేరయి నిన్ను ప్రశ్నిస్తాను. అర్ధరాత్రి వాన తుంపరలో
నదీతీరాన జీవితపు నిరర్థకత బోధపడినప్పుడు నా కన్నీటి సంపద విలువ
నన్ను ధైర్యంగా నిల్పుతుంది. ఒకణ్నీ నాగది తలుపులు తెర్చుకొన్నపుడు నిశ్చల చిత్రం
లాంటి ఆ గది మానససరోవరంలా చేరదీస్తుంది. హాయైన హిమాలయ పవనంలా
నాపైన నేనే ఆనందంగా సుగంధం వర్షించుకొంటాను.

నీ దివ్యహస్తాల్లో ఈ లేతవీణ వొద్దిగ్గా అలానే శబ్దం నిశ్శబ్దమై, నీ సంగీతం
నీలోకే ప్రవహిస్తుంది. అలసిన నా కన్రెప్పలపైన ఒక సుకుమార వేదనానుభూతి
నందివర్ధనం పువ్వులా నిలుస్తుంది.

అయితే కవి చెప్పినట్లే వేదనానుభూతి కన్రెప్పలపై నందివర్ధనం పువ్వులా నిలవాలంటే కన్నీటి సంపద విలువ తెలియాలి. ఈ కవికి అది తెలుసు, తెలుసనే ధైర్యమూ ఉంది.

భద్రుడి ఈ తొలి కవితా సంపుటికి ఏవో పురస్కారాలు లభించిన మాట విన్నాను గానీ కవి తనే స్వయంగా చెప్పుకున్న అజంతా ప్రశంస చూడండి. అజంతా తన కవిత్వాన్ని ప్రశంసించిన సందర్భాన్ని వివరిస్తూ భద్రుడు:

ఒక నిర్ధూమ సజీవాగ్ని శైలహస్తాల్లో
నా కవిత్వాన్నుంచి బెరుగ్గా ఎదుట నిల్చున్నాను
చిన్ని గడ్డిపోచ
వసంత స్పర్శ తననెట్లా తలమున్కలు చేసిందీ
వచ్చీరాని భాషలో చెప్తే ఎవరికర్థమవుతుంది
ఒక్క దండకారణ్య సాలవృక్ష సమూహాలకు తప్ప

అంటూ ఒక్క పోలికలో కాలాన్నీ కవిత్వానీ ఒడిసిపట్టుకున్నాడు. అజంతా భద్రుడ్ని ఆరోజుల్లోనే ప్రశంసిస్తూ ‘సాహిత్యంలో భవిష్యత్తంతా ఇతడిదే’ అనడం నాకు తెలుసు. ఎంత సరైన ప్రశంసని అది!

మహాత్మా గాంధీ రచనని అనువదిస్తూ కవి ‘గాంధీ నాకు తెలిసిన గొప్పకవుల్లోకెల్లా గొప్పకవి’ అంటాడు. తెలుగు సాహితీ చరిత్రలో గాంధీని గొప్పకవిగా గుర్తించిన మొదటికవి బహుశా భద్రుడే. అంటే భద్రుడికి కవిత్వం అంటే ఏవో కొన్ని కవితలో ఏదో కాస్త కవిత్వమో కాదన్నమాట, నా జీవితమే నా సందేశం అనగలిగే సరళ జీవినే కవిగా గుర్తిస్తాడన్నమాట. భద్రుడు సంఘజీవుల్నే గుర్తిస్తాడు. కష్టజీవికి ఇరువైపులా నిలబడే వారినే గుర్తిస్తాడు.

భద్రుడు అశేష ప్రతిభావంతంగా రాసిన తదుపరి కావ్యాలైన ‘ఒంటరి చేల మధ్య ఒక్కత్తే మన అమ్మ’, ‘పునర్యానం’ వంటి మహాకావ్యాలకు బీజం నిర్వికల్పసంగీతం లోనే ఉంది.

ఎంత యూరోపియన్ ప్రతీకలూ పాశ్చాత్య కవులూ తత్త్వవేత్తల ప్రభావం తన కవిత్వంలో కనిపించినా భద్రుడు ప్రధానంగా భారతీయ కవి. ఎందుకంటే ఉపనిషత్సుధాధారల్లోంచే భద్రుడి కవిత్వం జనించింది, తను పుట్టిపెరిగిన శరభవరమే కేంద్రంగా నిలిచింది, అక్కడి జనుల మాటల్నే గంగానమ్మ జాతర్ల పాటల్నే ప్రతిధ్వనించింది. మహానగరాల్లో తను ఏకాకేమో గానీ ఆ శరభవరం పక్కనున్న అడవిలో ఆ జాతర్ల గుంపులో భద్రుడు ఎప్పుడూ ఏకాకి కాడు. అక్కడెక్కడ తనని మనం వదలిపెట్టినా చక్కగా గోధూళివేళకి ఇల్లు చేరుకోగలడు.